అన్నింట అంతరాత్మ-45: అంబరమంత సంబరమిస్తా.. ‘గాలిపటా’న్ని నేను!

5
9

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’శీర్షికలో ఈ వారం ‘గాలిపటం’ అంతరంగం తెలుసుకుందాం.

***

‘చిలుకా పద పద
నెమలీ పద పద
మైనా పద పద.. మనసా పద
గాలిపటమా పద పద పద.. హంసలాగా పద పద
ఆకాశమే మరి మనకిక
హద్దు కాదు పద పద..’

షాపు యజమాని పాట వినిపిస్తూ మరీ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. నేను, మా మిత్రులం ఈ షాపులో వరుసల్లో పొందికగా కూర్చుని ఉన్నాం. షాపుకు ఎందరో పిల్లలు వస్తున్నారు, మరి కొంతమంది పెద్దలతో వచ్చి, నచ్చిన గాలిపటాలను కొనుక్కుంటున్నారు. ఓ బుడతడు, తాతతో వచ్చి ‘తాతా! నాకు అదుగో ఆ పసుపు పచ్చ, ఎరుపు రంగులతో ఉన్న పెద్ద గాలిపటం కావాలి’ గారంగా అడిగాడు. అది విని తాత నవ్వి, ‘దానంత లేవు గానీ దాన్ని ఎగరేయాలని ఉబలాట పడుతున్నావు. పెద్దయ్యాక పెద్ద గాలిపటం కొనుక్కోవచ్చు, ఇప్పటికి నా మాట విని చిన్న గాలిపటం తీసుకో, ఎగరేయడానికి సులభంగా ఉంటుంది’ నచ్చచెప్పాడు. సరిగ్గా అదే సమయంలో మరో కుర్రాడు చిన్న గాలిపటం కొనుక్కోవడం చూసి, బుడతడు పేచీ పెట్టకుండా, తను కూడా అదే రంగు చిన్న గాలిపటం తీసుకున్నాడు. ఇలా షాపుకు ఎవరెవరో రావడం, ఏవేవో సంభాషణలు చేయడం.. వింటుంటే నాకు ఎంతో సరదాగా ఉంది. మేం పై అరలో ఉన్నాం. కిందవి అమ్ముడయితే గానీ మా వంతు రాదనుకుంటా. మా వాళ్లు వీడ్కోలు చెప్పి వెళ్లిపోతుంటే లోపల ఓ చిన్న బాధ. అంతలోనే ‘నా వంతూ వస్తుందిగా’ అన్న ఆలోచన.

ఇంతలో ఇద్దరు పిల్లలు వచ్చారు.

‘మామా! మాకు కొత్త పతంగులు ఇవ్వవా?’ అడిగాడు.

‘ఏంది, మా ఆకాశ్, నీ చేత అడిగిస్తుండా? నిన్న కొంచబోయిన పతంగులు గప్పుడే పోయినయ్యా? అన్నాడు యజమాని.

‘నేనేం అడగమన్లే, అందరు తీరు తీరు పతంగులు ఎగరేస్తా ఉంటే సొంత దుకనం ఉండి కూడా నేను..’ ముంచుకొచ్చిన బాధ.. కోపం ఆకాశ్‌ను మాట పూర్తి చెయ్యనీయలేదు.

‘ఏందది.. సొంత దుకనమంటే ఇయన్ని పుక్యానికొచ్చినయనుకుంటున్నవా? పైసల్ పెడితేనే వచ్చినయ్.. గిరాకి మంచిగుండి, అన్ని అమ్ముడుపోతెనే జరంత లాభమొచ్చేది. నా సిన్నప్పుడయితే మా కెవ్వరు పతంగులు కొనియ్యలే. పేపరు, సీపురు పుల్లలు తీసుకుని, అమ్మనడిగి అన్నం ముద్ద తెచ్చుకొని నేనే పతంగి చేసుకునేడిది. సరే తియ్.. ఏడవొద్దు.. ఏం గావాల్నో కొంచబొండి..’ అన్నాడు యజమాని.

పేపర్‌తో గాలిపటం తయారీ గురించి విని ‘మా జాతి ఇలా పేదలకు కూడా ఆనందాన్ని ఇస్తుందన్నమాట’ అనుకుని గర్వించాను.

ఆకాశ్ వెంటనే ‘మా నాయన మంచోడు’ అంటూ రెండు పతంగులు తీసుకుని, ‘అరే జెల్ది రారా రాకేష్’ అన్నాడు.

వేగంగా వెళ్తున్న వాళ్లను చూస్తూ ‘పదిలం బిడ్డా’ వెనక నుంచి అరిచాడు యజమాని.

సాయంత్రానికి కింద సరుకు తగ్గడంతో పై అర నుంచి మమ్మల్ని కూడా దించాడు యజమాని.

ఇంతలో ఓ యువకుడితో పాటు ఇద్దరు పిల్లలు వచ్చారు.

‘బాబాయ్! నాకు ఆ గులాబీ రంగు గాలిపటం కావాలి’ అని ఒక కుర్రాడు నన్ను చూపిస్తే, ‘బాబాయ్! నాకు ఆ ఆకుపచ్చ గాలిపటం కావాలి’ అంటూ రెండో కుర్రాడు, మా నేస్తాన్ని చూపాడు.

‘సరే’ అంటూ బాబాయ్ ధర అడగడం, యజమాని బదులు చెపుతూ మమ్మల్ని అందించడం జరిగిపోయాయి.

ఇప్పుడు పిల్లల చేతుల్లో మేము. వాళ్లు బాబాయ్ చేతులు పట్టుకుని ముందుకు నడుస్తుంటే మా నేస్తాల వైపు చూస్తూ మేం వీడ్కోలు చెప్పాం.

‘బాబాయ్! అసలు గాలిపటాలు ఎలా, ఎక్కడ మొదలయ్యాయి?’ కుర్రాడు అడిగాడు.

‘బాబీ, బంటీ! గాలిపటాలు ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి. చైనాలో, క్రీస్తు పూర్వం రెండొందల ఆరులో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావడానికి గాలిపటమే తోడ్పడిందని చెపుతారు. అప్పుడు చైనాను పాలిస్తున్న రాజు దుర్మార్గుడు కావడంతో, హేన్ వంశం వీరుడు, రాజును ఓడించేందుకు కోటలోకి సొరంగం తవ్వాలనుకున్నాడు. కానీ ఎంత దూరం తవ్వాలి? అది తెలుసుకోవడానికి అతడు ఒక గాలిపటం తయారుచేసి ఎగురవేశాడు. అలా ఆ దారాన్ని కొలిచి, దాని ప్రకారం సొరంగం తవ్వి, సైనికులను పంపి కోటను వశం చేసుకున్నట్లు చరిత్ర చెపుతోంది. ఆ విధంగా ఇందులో సైన్స్ కూడా పనిచేసింది’ చెప్పాడు బాబాయ్.

ఒక కోటను వశం చేసుకుని, రాజుని పడగొట్టడానికి మా జాతి ఉపయోగపడడం విని నా మనసు గాల్లో తేలి ఆడింది.

‘భలే భలే’ అన్నారు పిల్లలిద్దరూ.

‘అసలు గాలి పటం ఎలా ఎగురుతుంది బాబాయ్?’ బంటి అడిగాడు.

‘గాలిపటం ఎగరడానికి దారం లోని బలమే ప్రధాన కారణం. గాలిపటం డిజైన్ వల్ల పైభాగంలో తక్కువ ఒత్తిడి, కింది భాగంలో ఎక్కువ ఒత్తిడి ఉండడంతో ఎగర గలుగుతుంది. ఈ కారణంగానే గాలి వీచే దిక్కుగా ముందుకు పోతుంది’ వివరించాడు బాబాయ్.

‘మరి గాలిపటం గాలి కంటే తేలిగ్గా ఉంటుందా, బరువుగా ఉంటుందా?’ బాబి అడిగాడు.

‘సాధారణంగా గాలిపటాలు గాలి కంటే బరువుగానే తయారుచేస్తారు. అయితే కొన్ని రకాలు గాలి కంటే తేలిగ్గా కూడా ఉంటాయి. ఈ రకాన్ని ‘హెలికైట్’ అంటారు. ఇవి గాలి వీయనప్పుడు కూడా ఎగురుతాయి. ఎలా అంటే వీటిలో హీలియం బెలూన్ ఉపయోగిస్తారు’ చెప్పాడు బాబాయ్.

‘ఓహో’ అనుకున్నాను నేను.

బాబాయ్ మళ్లీ మాట్లాడుతూ ‘ఈ కాలంలో గాలిపటాలను ఉలిపిరి పొర వంటి ఫాయిల్స్ తెరలను ఉపయోగించి ఏ ఆధారాలు లేకుండానే తయారుచేస్తున్నారు. కొన్నింటికి ఆకర్షణీయమైన ఫైబర్ గ్లాస్, కార్బన్, నార మొదలైన వాటిని తెరలుగా వాడుతున్నారు. అలాగే సాధారణంగా ఆధారంగా మామూలు దారం, ట్వైన్ దారం వాడుతుంటాం. ఇప్పుడు డెక్రాన్ లేదా డైనీమా వంటి కృత్రిమ పదార్థాలను ఆధారాలుగా వాడుతున్నారు’ అన్నాడు.

‘మాంజా వల్ల కోసుకుపోయే ప్రమాదం ఉందని, ముఖ్యంగా చైనా తయారుచేసే మాంజా ప్రమాదకారి అని, దాన్ని వాడకూడదని మా స్నేహితులు చెప్పారు’ అన్నాడు బాబి.

‘అవును.. అదీ నిజమే’ అని పవన్ అంటుండగానే

ఇల్లు రానే వచ్చింది. వాకిలి ముందు కారు చూసి ‘అత్తా వాళ్లు వచ్చినట్లున్నారు’ ఆనందంగా అన్నారు బాబి, బంటి. అదే క్షణంలో ఓ పాప, బాబు లోపల్నుంచి పరుగెత్తుకు వచ్చారు. ‘గాలిపటాలా! మేమూ తెచ్చుకున్నాం. మరి మనం ఎక్కడ ఎగరేయాలి మామయ్యా?’ అన్నాడు బాబు.

‘మనం రేపు పెద్ద మైదానానికి వెళ్దాంలే’ చెప్పాడు. అంతా లోపలికి వెళ్లారు.

‘వచ్చేశారా. ఒరే పవన్! ఈ పిల్లల సంగతి నువ్వే చూసుకోవాలి. గాలిపటాలు ఎగరేస్తామంటూ ఒకటే గోల’ అంది ఒకామె.

‘ఓ.. అలాగే అక్కా’ అన్నాడు పిల్లల బాబాయ్, మామయ్య అయిన పవన్. అంతా సోఫాల్లో కూర్చున్నారు.

‘మామయ్యా! మన దేశంలో ఎప్పటి నుండి గాలిపటాలు మొదలయ్యాయి?’ అడిగాడు బబ్లూ.

‘తొలిగా చైనాలో మొదలైన గాలిపటాలు క్రమంగా ఇతర దేశాలకు వ్యాపించాయి. సుమారు వెయ్యేళ్ల కిందట కొరియా నుంచి భారత్‌కు గాలిపటాలు విస్తరించాయి. చైనాకు చెందిన బౌద్ధ భిక్షువులు పట్టు వస్త్రాలు, వెదురు పుల్లలతో తయారు చేసిన గాలిపటాలు ఎగురవేసేవారు. దైవాన్ని ప్రార్థిస్తూ, వాటిలో సందేశాలు పెట్టేవారు. మొఘల్ సామ్రాజ్య కాలంలోనే గాలిపటాలు ఎగురవేసినట్లుగా అప్పటి పెయింటింగుల వల్ల తెలుస్తోంది’ అన్నాడు పవన్.

‘అహ్మదాబాద్‌లో ఏటా సంక్రాంతికి అంతర్జాతీయ పతంగుల పండుగ జరుగుతుంది. పోటీలు కూడా ఉంటాయి’ అంది పవన్ అక్క అంజలి.

‘అవునా! చాలా మంది వస్తారా’ ఆశ్చర్యంగా అంది పాప పింకీ.

‘అవును పింకీ! అక్కడ ఊరి మధ్యలో ‘పతంగ్ బజార్’ ఉంది. చాలా మంది ఇళ్లలోనే గాలిపటాలు తయారు చేసి, అమ్ముతుంటారు. పండుగకు వారం ముందు నుంచే పతంగ్ బజార్ కొనే వాళ్లు, అమ్మే వాళ్లతో కోలాహలంగా ఉంటుంది. ఈ పతంగుల ఉత్సవంలో పాల్గొనేందుకు జపాన్, ఇండోనేసియా, చైనా, బ్రెజిల్, మలేసియా, అమెరికా మొదలైన నలభై దేశాలనుంచి ఎందరెందరో వస్తారు. గాలిపటాలు కూడా గరుడ పక్షి, కప్ప, విమానం, చేప వంటి వివిధ ఆకృతుల్లో ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. పందొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇక్కడ అంతర్జాతీయ పతంగుల పండుగ జరుగుతోంది. అంతే కాదు.. దేశంలోనే తొలి గాలిపటాల మ్యూజియంను ‘శంకర కేంద్ర’ పేరుతో పందొమ్మిది వందల డెబ్భై ఐదు లోనే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న అతి పెద్ద గాలిపటం పొడవు ఇరవైరెండు అడుగులు, వెడల్పు పదహారు అడుగులు’ చెప్పాడు పవన్.

మా జాతి పండుగ అహ్మదాబాదులో అంత ఘనంగా జరుగుతుందని విని నాలో ఆనందంతో కూడిన గర్వం ఉప్పొంగింది.

‘అయితే మనం కూడా ఒక్కసారైనా అహ్మదాబాద్ పతంగుల పండుగకు పోవాలి’ బాబి, బంటి ఒకేసారి అన్నారు.

అంతా వారి వంక నవ్వుతూ చూశారు.

అంతలో అంజలి అందుకుని ‘అప్పుడెప్పుడో ఉల్లి పతంగులు కూడా ఎగరేసారని చదివాను’ అంది.

‘అవును, రెండేళ్ల కిందట అహ్మదాబాద్‌లో జరిగిన గాలిపటాల పోటీల్లో ఉల్లి పతంగి అందరినీ ఆకట్టుకుంది. ఉల్లి ధర అప్పుడు ఆకాశాన్ని అంటడంతో దానికి సంకేతంగా ఉల్లి ఆకారంలో గాలిపటాలు ఎగరేసారు’ చెప్పాడు పవన్.

‘భోజనానికి లేవండి, తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు’ అంది బాబి వాళ్ల నానమ్మ.

దాంతో అంతా భోజనాల బల్ల దగ్గర చేరారు.

‘మరి మన హైదరాబాద్‌లో గాలిపటాలు ఎప్పటి నుంచి ఎగరెస్తున్నారు? గాలిపటాల పండుగ ఇక్కడ కూడా జరుగుతోంది కదా’ అన్నాడు బంటి.

‘మన హైదరాబాద్‌లో గత నాలుగు వందల సంవత్సరాల నుంచి పతంగుల సంస్కృతి ఉంది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీల కాలంలో ఏటా హేమంత ఋతువులో గాలి పటాల పండుగ జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో గోల్కొండ కోటలో పతంగుల పండుగ అధికారికంగా జరిగేదిట. అప్పుడు కాగితాలతో చేసిన పతంగులను, మూలికలతో చేసిన మాంజాను వాడేవారు. అసఫ్ జాహీల కాలంలో మైదానాలలో పెద్ద ఎత్తున పతంగుల పండుగ నిర్వహించేవారు. ఇక ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ గాలిపటాల పోటీలు నిర్వహించి దీనికి మరింత గుర్తింపు తెచ్చారు’ వివరించాడు పవన్.

‘మరి గాలిపటాలను తెంపుతూ ఉంటారు. ఎందుకలా?’ బబ్లూ అడిగాడు.

‘గాలిపటం ఎగరేయడమే కాదు, మన గాలిపటంతో అవతలి వారి గాలిపటాలను తెంపేయడం కూడా ఆటలో భాగమే. అలా మనకు దగ్గరలోని గాలిపటాన్ని తెంపగానే ఆనందంతో కేకలు పెట్టడం మామూలు. గుజరాత్‌లో ఇలా వేరే వారి గాలిపటాలను తెంపగానే ‘కైపోచే’ (నేను తెంపేశానోచ్) అని అరుస్తుంటారు’ అన్నాడు పవన్.

‘గాలి పటాల వల్ల వేరే ఉపయోగాలున్నాయా?’ అడిగాడు బాబి.

ఈ సారి తాతగారు అందుకుని ‘ఎందుకు లేవూ, పగటి పూట గాలిపటాలు ఎగురవేసినప్పుడు మన శరీరానికి సూర్య కిరణాలు బాగా సోకి, డి విటమిన్ లభిస్తుంది. చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఇన్ఫెక్షన్లు పోతాయి. శరీరానికి వెచ్చగా, ఆహ్లాదంగా ఉంటుంది. రంగురంగుల గాలిపటాలు ఆకాశంలో ఎత్తుగా ఎగురుతుంటే కలిగే ఆనందం సరేసరి. గతంలో అయితే పతంగుల ద్వారా తపాలా సేవలు జరిగినట్లు తపాలా చరిత్ర చెపుతోంది’ చెప్పారు.

మా వల్ల మనిషికి మరిన్ని ఉపయోగాలు కలుగుతాయని విని నా సంతోషానికి అంతులేకపోయింది.

‘గాలిపటాలు ఎగురవేయడం ఆనందం, ఆరోగ్యం కలగలిసిన వినోదమన్న మాట’ అన్నాడు పవన్.

‘మన దేశంలో సంక్రాంతికే పతంగులు ఎందుకు ఎగురవేస్తారు?’ పింకీ అడిగింది.

‘మంచి ప్రశ్న వేశావు. సంక్రాంతికి దక్షిణాయనం ముగిసి ఉత్తరాయనం మొదలవుతుంది. అంటే ఖగోళ శాస్త్ర రీత్యా ఉత్తరాయనంలో సూర్యుడు, భూమికి దగ్గరగా జరుగుతాడు. ఆకు రాలిన చెట్లు తిరిగి చిగురిస్తాయి. భూమికి సూర్యరశ్మి బాగా అందుతుంది. ‘సూర్యుడు భూమికి దగ్గరగా వస్తున్నాడు, ఇక మన జీవితం రంగుల మయం అవుతుందని తెలియజేయడానికి గుర్తుగా రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తారు. మకర రాశిలోకి ప్రవేశించే సూర్య భగవానుడిని దర్శించే ప్రక్రియగా కూడా కొందరు భావిస్తారు. అసలు ‘పతంగం’ అనే పదం ముఖ్యంగా సూర్యుడిని, పక్షినీ సూచిస్తుంది. సంక్రాంతి, ఆకాశ గమనుడైన సూర్యుడి పర్వదినం కనుక ఆయనకు ప్రతీకగా పతంగులను ఎగురవేస్తారని కూడా చెప్పవచ్చు’ అన్నాడు తాతయ్య.

‘ఓహో’ పిల్లలు పైకి అంటే, నేను మనసులో అనుకున్నాను.

‘గాలిపటాల పండుగ అన్ని దేశాల్లో జరుగుతుందా?’ బబ్లూ అడిగాడు.

‘అన్ని దేశాల్లో అని చెప్పలేం కానీ ప్రపంచంలోని చాలా దేశాల్లో గాలిపటాల పండుగ చేసుకుంటారు. అయితే వేర్వేరు సమయాల్లో, భిన్న రీతుల్లో జరుపుకుంటారు. ముఖ్యంగా గాలిపటాలకు జన్మస్థానంగా భావించే చైనాలో ‘వీఫాంగ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’ పేరిట పతంగుల పండుగ జరుపుకుంటారు. ఇది ప్రపంచంలో కెల్లా అతి పెద్ద పతంగుల పండుగ. ఇక్కడి గాలిపటాలకు వారి ఆధ్యాత్మిక చిహ్నమైన డ్రాగన్ లేదా దాని ఆనవాళ్లు తప్పనిసరిగా ఉంటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద గాలిపటాల మ్యూజియంగా పేరొందింది వీఫాంగ్ గాలి పటాల మ్యూజియం. అంతేకాదు, చైనాలోని షాన్ డాంగ్ నగరాన్ని గాలిపటాల రాజధాని అంటారు. అక్కడి ప్రజల జీవనాధారం గాలిపటాల తయారీయే. విశ్రాంతి సమయాలలో కూడా గాలిపటాలు ఎగురవేయడం వారి హాబీ. ఇక జపాన్‌లో సంప్రదాయబద్ధంగా జరిగే ‘హనుమట్సు కైట్ ఫెస్టివల్’ పదహారో శతాబ్దం నుంచి ఉంది. ఇక్కడ కేవలం చతురస్రాకారంలో ఉండే అంటే స్క్వేర్‌గా ఉండే పతంగులనే ఎగురవేస్తారు. ఇక్కడ ఐదు నుంచి ఎనిమిది అడుగుల వరకు ఉండే పతంగులను ఎగురవేస్తారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వేసవి ప్రారంభ సూచికగా ఏటా సెప్టెంబర్‌లో అక్కడి ‘బొండి బీచ్’లో ‘ఫెస్టివల్ ఆఫ్ ద విండ్స్’ పేరిట గాలిపటాల పండుగ జరుపుతారు. ప్రపంచంలో జరిగే పెద్ద పతంగుల పండుగల్లో ఇదొకటి’ అన్నాడు తాతయ్య.

వెంటనే పవన్ అందుకుని ‘నేను మరి కొన్ని దేశాల్లో జరిగే పతంగుల పండుగ గురించి చెపుతాను. యుఎస్‌లో ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఆఖరులో ‘బ్లాసమ్ కైట్ ఫెస్టివల్’ జరుగుతుంది. లాంగ్ బీచ్ (వాషింగ్టన్) లో జరిగే ఈ పండుగకు ఏటా ఒక థీమ్‌ను ఎన్నుకుంటారు. ఫ్రాన్స్‌లో రెండేళ్లకు ఒకసారి ‘డిప్పే కైట్ ఫెస్టివల్’ జరుగుతుంది. ఆ సందర్భంగా చిత్ర విచిత్ర ఆకారాలలో గాలిపటాలు ఎగురవేస్తారు. ఇక గ్వాతెమాలలో ప్రతి నవంబర్లో ‘బారిలెట్ ఫెస్టివల్’ జరుగుతుంది. ఆ సందర్భంగా గుండ్రంగా ఉండే ప్రత్యేక పతంగులను ఎగురవేస్తారు. ఇంకో విశేషమేమిటంటే వాటిపై తమ సందేశాలను రాసి ఎగురవేస్తారు. చనిపోయిన తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు పతంగుల పైని సందేశాలను చదువుకుంటారని వారి నమ్మకం. మాయన్ నాగరికత కాలం నుంచి అక్కడ పతంగులను ఎగురవేసే సంప్రదాయం ఉన్నట్లు చరిత్ర చెపుతోంది. అలాగే ఇండోనేసియాలోని బాలి ద్వీపంలో కూడా ఏటా జులైలో ‘బాలి కైట్ ఫెస్టివల్’ నిర్వహిస్తారు. జీవితాన్ని ప్రసాదించిన దేవతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాలుగు నుంచి పది మీటర్ల వెడల్పు ఉండే పతంగులు ఎగురవేస్తారు. వీటికి వంద మీటర్ల తోక ఉంటుంది. అక్కడ హిందువులు అధికంగా ఉండడంతో వారి పతంగులపై హిందూ దేవతల చిత్రాలు కనిపిస్తాయి. కొన్నింటికి కంపించే ధనస్సును కూడా అతికిస్తారు. దాని ప్రకంపనల శబ్దం నేలకు వినిపిస్తుంది. దీన్ని వారి భాషలో ‘గువాంగ్’ అంటారు. ఇంకా చెప్పాలంటే బ్రిటన్‌లో పోర్ట్స్‌మౌత్ కైట్ ఫెస్టివల్, దక్షిణాఫ్రికాలో కేప్‌టౌన్ కైట్ ఫెస్టివల్, ఇటలీలో సెర్వియా కైట్ ఫెస్టివల్ ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయి. బ్రెజిల్, కొలంబియాలలో నూతన సంవత్సర సెలవులలో, చిలీలో స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా, గయానాలో ఈస్టర్ సమయంలో గాలిపటాలు ఎగురవేస్తారు. నార్వేలో ప్రతి సంవత్సరం గాలిపటాల దినం ప్రత్యేకంగా జరుపుకుంటారు. వియత్నాంలో తోకలు లేని గాలిపటాలు ఎగురవేస్తారు. మన కాశ్మీర్‌లో అయితే రాఖీ పౌర్ణమికి గాలిపటాలు ఎగురవేస్తారు’ విపులంగా చెప్పాడు.

‘చెన్నైలో మాత్రం గాలి పటం ఎగురవేస్తే జైలే.. తెలుసా?’ అడిగింది అంజలి.

‘గతంలో చెన్నైలో కూడా గాలిపటాలపై ఎలాంటి నిషేధం ఉండేది కాదు. కానీ రెండేళ్ల కిందట మాంజా వల్ల ఒక బాలుడు మరణించాడు. మాంజాకి గాజు పెంకుల పొడిని, రసాయనాలను పూసి తయారుచేయడం వల్ల అది పదునుగా ఉండి కొన్ని సార్లు ప్రమాదాలకు కారణం అవుతోంది. అందుకే తమిళనాడు ప్రభుత్వం మాంజాతో కూడిన గాలి పటాలను అమ్మడం, ఎగురవేయడం నేరమని చట్టం చేసింది. అలా చేస్తే వెయ్యి రూపాయల జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష అని ప్రకటించింది. ఇతర రాష్ట్రాలలో కూడా చైనా మాంజాను నిషేధించారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా రెండువేల పదిహేడు లోనే చైనీస్ మాంజాను నిషేధించింది. ఈ మాంజాను నైలాన్, సింథటిక్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. అందువల్ల ఇది భూమిలో కలిసిపోదు. అయినప్పటికీ మాంజా అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతున్నాయి. మాంజాతో ఇతరుల పతంగులను తెంచడం సులభమని దాన్ని కొంటుంటారు. గాలిపటాలకు మామూలు పత్తితో తయారయిన గట్టి దారం వాడడం అన్ని విధాలా మంచిది’ పవన్ అన్నాడు.

‘గాలిపటాలకు కట్టే మాంజా వల్ల ఏటా ఎన్నో పక్షులు కూడా మరణిస్తున్నాయి, గాయపడుతున్నాయి’ అంది అంజలి.

‘అయ్యో! పాపం’ అని నేను అనుకుంటుంటే పవన్ అందుకుని ‘అవును. అందుకే పండుగ వేళ అంతా కేరింతలతో గాలిపటాలు ఎగురవేస్తే, కొందరు పక్షి ప్రేమికులు పక్షులను కాపాడే పనిలో మునిగిపోతుంటారు. స్వచ్ఛంద సంస్థలు కూడా పక్షులను కాపాడే ప్రయత్నాలు చేస్తాయి. అహ్మదాబాద్‌లో పతంగుల పండుగ సందర్భంలో పక్షులను కాపాడే నిమిత్తం అటవీ శాఖ ‘కరుణ’ పేరిట ఓ కార్యక్రమం చేపట్టింది. అందులో ఎందరో పక్షి ప్రేమికులు పాల్గొన్నారు. అహ్మదాబాద్‌కే చెందిన రాహిలా అనే ఆమె కూడా అందులో పాల్గొని ఎన్నో పక్షుల్ని కాపాడింది. కానీ విషాదం ఏమిటంటే అదే మాంజా ఆమె గొంతుకు చుట్టుకుపోయి మరణించింది. అసలు ప్రమాదకరమైన మాంజా వాడకపోతే పక్షులకు, మనుషులకు కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా ప్రజలలో మార్పు వస్తేనే ప్రమాద నివారణ సాధ్యమయ్యేది’ అన్నాడు.

రాహిలా మృతి గురించి విని గాలి లేకుండానే వణికిపోయాను నేను.

ఈసారి తాతయ్య మాట్లాడుతూ ‘గాలిపటానికి, మనిషి జీవితానికి ఎంతో పోలిక ఉంది. జీవితం, దారం లాంటిదని గాలిపటం చెపుతోంది. ఆత్మనిగ్రహం లేకపోతే మనిషి, జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి..’ ఇంకా ఏదో చెప్పబోతుండగానే, ‘ఆత్మనిగ్రహం’ అంటే ఏంటి తాతయ్యా’ అడిగాడు బంటి.

పెద్దలంతా వాడి వంక నవ్వుతూ చూస్తుంటే, తాతయ్య ‘అత్మనిగ్రహం అంటే తమపై తాము అదుపు కలిగి ఉండడం. పతంగులను ఎగురవేసేటప్పుడు సన్నని దారాన్ని చేత్తో పట్టుకుని పతంగిని ఎలా అదుపు చేస్తామో అలాగే మనిషి తన మనసును అదుపులో పెట్టుకోవాలి. పతంగికి ఉన్న దారాన్ని ఇష్టం వచ్చినట్లు లాగితే తెగిపోతుంది. అట్లా అని దారాన్ని అసలే వదలకపోతే గాలిపటం ఎగరదు. నేర్పుగా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటం సవ్యంగా పైపైకి ఎగిరేది. దారం ఉంది కదా అని ఎంత దూరమైనా వదల్లేము. చుట్ట చుట్టి గుప్పిట్లోకి తీసుకోవాల్సిందే. జీవితం కూడా అంతే. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా దేవుని చేతిలో ఉన్న సంగతి మరువకూడదు. నేలమీద నిలబడి ఆలోచించాలి. అదే గాలిపటాల పండుగ ఇచ్చే సందేశం’ అన్నాడు.

‘బాగా చెప్పారు నాన్నా’ అన్నారు పవన్, అంజలి.

‘గాలి పటాల కబుర్లలో మునిగి టైమ్ కూడా మరిచిపోయాం. పిల్లలూ! ఇంక పడుకోండి. రేపు ఉదయం పతంగులు ఎగరేయాలి’ అన్నాడు తాతయ్య.

‘ఇంటి పైన ఎగరేద్దామా’ అడిగాడు బబ్లూ.

‘వద్దు. మేడల పైన ఎగరేస్తే ప్రమాదాలు జరుగుతాయి. చూసుకోకుండా వెనక్కి నడిచి కిందకు పడతారు. అందుకే మిమ్మల్ని పెద్ద మైదానానికి తీసుకు వెళతాను. గుర్తు పెట్టుకోండి, పతంగులతో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ స్తంభాలకు చిక్కుకున్న వాటికోసం వెంటపడకూడదు. షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, రోడ్లమీద అడ్డంగా పరుగెత్తడం చేయకూడదు’ చెప్పాడు పవన్.

‘అలాగే’ అన్నారు పిల్లలు.

ఆ తర్వాత అంతా ఎవరి దారిన వాళ్లు గదుల్లోకి వెళ్లిపోయారు.

మేము మాత్రం టేబుల్ పైనే ఉన్నాం. నా ఆలోచనలు ఇంకా మా జాతి చుట్టే తిరుగుతున్నాయి. మనుషులకు, ముఖ్యంగా పిల్లలకు ఆనందం ఇవ్వడం మాకు కూడా ఆనందమే. ఆకాశ విహారం మాకూ సంతోషమే. అయితే మా వల్ల కొందరు మనుషుల, పక్షుల ప్రాణాలు పోవడం నాకెంతో బాధ కలిగిస్తోంది. నిజానికి అందుకు బాధ్యులం మేం కాదు. ప్రమాదకరమైన మాంజా వాడుతున్న మనుషులదే బాధ్యత. కానీ అందులో మా ప్రమేయం లేకుండానే, మా భాగస్వామ్యం ఉండడం భరించరానిదిగా ఉంది. మేం బతికేది స్వల్ప కాలం. ఏ చెట్టుకో, తీగెకో, కంపకో తగులుకుని చిరిగిపోతాం. పైగా పోటీలో మాతోనే, మా వాళ్లను అదే.. ఇతర గాలిపటాలను తెంపేస్తూ వినోదించడం నాకు ఏమాత్రం నచ్చలేదు. సరే మేం ఎలాగూ అల్పాయుష్కులం అనుకున్నా, ఎక్కడో చిక్కుకున్న మా వాళ్లను దక్కించుకోవడానికి కట్టెలతో పరుగులు తీసి పిల్లలు ప్రమాదాల పాలవడం ఎంత బాధాకరం! ‘నన్ను ఆకాశంలో చక్కగా ఎగురవేసి ఆనందించండి. ఓర్పు, నేర్పు నేర్చుకోండి. జీవిత పాఠాలు నేర్చుకోండి.. కానీ ప్రాణాపాయాలు కొనితెచ్చుకోకండి’ అని చెప్పాలని ఉంది.. ఆలోచనల్లో ఎలా తెల్లారిందో కూడా తెలీలేదు. పవన్, పిల్లలు చకచకా తయారై మమ్మల్ని అందుకున్నారు.

అంతలో

పదపదవే వయ్యారి గాలిపటమా
పైన పక్షిలాగ ఎగిరిపోయి
పక్కచూపు చూసుకుంటు
తిరిగెదవే గాలిపటమా..

పాడుతూ తాతయ్య మావెంట రావడంతో పిల్లలు ఆశ్చర్యానందాలతో ఆయన వంక చూశారు.

నాకయితే హుషారే హుషారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here