అన్నింట అంతరాత్మ-48: సర్వదా మీ సేవలో.. ‘సంచి’ని నేను!

4
11

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం ‘సంచి’ అంతరంగం తెలుసుకుందాం.

***

‘జామకాయల వాసనరా.. అబ్బ! ఎంత బాగుందో’ బస్సులో ఇద్దరు పిల్లలు, జామకాయల సంచినైన నా వైపు చూస్తూ అన్నారు. గొప్పదనం జామకాయలదైనా, అవి నా దగ్గర ఉన్నందున నాకు సంతోషంగా అనిపించింది. కాస్తంత కదిలా. వెంటనే తాతయ్య నన్ను సరిగా నిలబెడుతూ రెండు జామకాయలు తీసి, ఆ ఇద్దరు పిల్లలకు అందించాడు. మొదట వద్దంటూ మొహమాటపడ్డా, ‘ఫర్వాలేదు తీసుకోండి’ అని తాతయ్య అనడంతో థ్యాంక్స్ చెపుతూ తీసుకున్నారు. ఈ బస్సులో దాదాపు అందరి చేతుల్లోనూ మా వాళ్లు ఉన్నారు. అయితే భిన్న రూపాల్లో. ఆడవాళ్లందరి దగ్గర చేతి సంచులు.. అవే హ్యాండ్ బ్యాగ్‍లు ఉన్నాయి. హ్యాండ్ బ్యాగుల్లో ఎన్ని రంగులో, ఎన్ని డిజైన్లో. ఫ్యాషన్‌లో అవీ ఒక భాగమేట. మళ్లీ పరిశీలనగా చూశాను. చాలామంది వీపులకు ‘బ్యాక్ ప్యాక్’లు. బడులకు, కాలేజీలకు, ఉద్యోగాలకు, ప్రయాణాలకు వెళ్లేవారంతా ఇప్పుడివే వాడుతున్నారు. కొంతమంది దగ్గర ల్యాప్‌టాప్ సంచులున్నాయి. కొంతమంది దగ్గర జ్యూట్ బ్యాగ్‌లున్నాయి. కండక్టర్ భుజానికి వేలాడుతూ క్యాష్ బ్యాగ్ ఉంది. అందులో ఒక అరలో చిల్లర నాణేలు, ఒక అరలో నోట్లు కనిపిస్తున్నాయి. అట్లా తెరిచి ఉంటే, ఇంత జనంలో డబ్బు పోకుండా ఉండటం చిత్రమే అనిపించింది.

అంతలో ఏదో స్టాప్ వచ్చింది. ఒకతను ఒక పెద్ద బస్తాతో ఎక్కబోయాడు. ‘బస్తాలేసేదానికి కుదర్దు’ అంటూ కండక్టర్ అడ్డుకున్నాడు. ఎక్కే అతను సైగలతోనే బతిమాలుకున్నాడు. ఆ కోడ్ భాష అర్థమైనట్లుంది. కండక్టర్ మౌనం వహించాడు. బస్తాను డ్రైవరు పక్కన ఉన్న కాసింత ఖాళీ జాగాలో సర్దాడు. ఎంతైనా మా జాతిలో పెద్ద కదా. మా వాళ్లందరం ఆ బస్తా వైపు వినయంగా చూశాం. అది మా అందరి వంక తేరిపార చూస్తుండగానే కండక్టర్, డ్రైవర్ ‘హాచ్.. హాచ్’ అంటూ తుమ్మారు. ఆపైన వరుసగా అంతా అదే పని. తుమ్మే వారిని చూసి, మా జాతి అంతా ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే, ‘మిరపకాయల బస్తా అని ముందే ఎందుకు చెప్పలేదూ?’ కండక్టరు కళ్లు, ముక్కు తుడుచుకుంటూనే కోపంగా అడిగాడు. ‘అడిగితే కద చెప్పేది’ బస్తా తాలూకు మనిషి పరమ శాంతంగా బదులిచ్చాడు. అహం దెబ్బతిన్న కండక్టరు ‘పెతోడు లా పాయింట్లు లాగేటోడే.. వచ్చే స్టాపులో దిగిపో’ కోపంగా అరిచాడు. ‘అట్లెట్ల దిగి పొమ్మంటావ్, టికెట్ తీసుకున్నా కద. అయినా, నువ్వు మిరపకాయలు లేకుండనే తిండి తింటవా?’ ఎదురు ప్రశ్నించాడు. అతడి మాటలకు, మా జాతికి, ఇతర ప్రయాణికులకు కూడా నవ్వు వచ్చింది. ‘ఏం ఎక్కువ చేస్తున్నవ్. జనార్దనన్నా! జరబస్సాపు. ఈణ్ణి దించేయాల’ కండక్టర్, డ్రైవర్‌కు చెప్పాడు. ‘పోనీరాదు, టికెట్ తీసుకున్నడు. మధ్యలో దిగమంటే ఎట్ల. ఇట్ల కొట్లాటలతోని ఆపుకుంటాపోతే లేటయిందని మన మీదికే కంప్లైంట్లు వస్తయ్’ అన్నాడు డ్రైవర్. ప్రయాణికులు కూడా ‘పోనీ పోనీ’ అంటూ అరవసాగారు.

దాంతో కండక్టర్ కామ్ అయిపోయాడు. బస్సు పోతూనే ఉంది. స్టాపు వచ్చినప్పుడల్లా మనుషులు దిగడం, ఎక్కడం జరుగుతుంటే మేం మావాళ్లకు వీడ్కోళ్లు, స్వాగతాలు పలుకుతున్నాం. మరి మాకూ మంచి, మర్యాద ఉంది కదా. ఇంతలో తాతగారి ఊరు వచ్చినట్లుంది. తాతగారు నన్ను, మరో చేత్తో బట్టల సంచి పట్టుకుని బస్సు దిగారు. ఆపైన ఆటో ఎక్కి ఇల్లు చేరారు. ఆటో ఆగిందో, లేదో ‘తాతయొచ్చాడు, తాతయొచ్చాడు’ అంటూ పిల్లల కేకలు. అది విని కూతురు, అల్లుడు పరుగున వచ్చారు. ‘రా నాన్నా’ అని కూతురంటే, ‘కులాసానా మామయ్యా’ అని అల్లుడు పలకరిస్తూ, సంచులు అందుకున్నారు.

‘జామకాయలు, జామకాయలు’ పిల్లలు సంతోషంగా అరిచారు. ‘మీ కోసమే’ అన్నాడు తాతయ్య నవ్వుతూ. ‘తాతయ్యను లోపలికి రానిస్తారా లేదా’ పిల్లల్ని కూతురు కోప్పడింది. అంతా లోపలికి నడిచారు. తాతయ్య అలవాటుగా కాళ్లు కడుక్కు వచ్చి హాల్లో ఉన్న ఈజీ చెయిర్లో కూర్చున్నాడు. ఈలోపు పిల్లలు జామకాయలు తింటూ భలే మజా అనుకుంటున్నారు.

అంతలో కూతురు స్వాతి, ఫిల్టర్ కాఫీ తెచ్చిచ్చింది. ఆయన కాఫీ తాగుతుంటే స్వాతి మా సంచుల వైపు చూస్తూ ‘సంచులు కొత్తవా నాన్నా! చాలా బాగున్నాయి’ అంది. ‘అవునమ్మా. మొన్ననే మీ అమ్మ కొన్నది. మీక్కూడా ఓ రెండు పంపింది. నా బట్టల సంచిలో ఉన్నాయి, చూడు’ అన్నాడాయన. స్వాతి ఆ సంచుల్ని తీసి చూసి మురిసిపోయింది. దట్టమైన పెద్ద జ్యూట్ బ్యాగులు. ఒక దానిమీద చిలుకలు వాలిన చెట్టు బొమ్మ, మరొక దానిమీద రంగు రంగుల సీతాకోక చిలుకలు. ‘చాలా బాగున్నాయి’ అంది స్వాతి. ‘టిఫిన్ తింటారా నాన్నా’ అడిగింది స్వాతి. ‘లేదమ్మా. ఏకంగా ఏడింటికి భోజనమే. నీకు తెలుసుగా నా అలవాట్లు’ అన్నాడు తాతయ్య. ‘సరే అయితే. ఇంకేమిటి మన ఊరి విశేషాలు’ అడిగింది.

‘అదే. రాజేశ్వరరావుగారమ్మాయి శ్రీకళ, మరో ఆరుగురితో కలిసి ఈ జ్యూట్ బ్యాగుల తయారీ యూనిట్ ప్రారంభించింది’ చెప్పాడు తాతయ్య. ‘అలాగా. చాలా మంచి పని. ఈ ప్లాస్టిక్ సంచులు, పాలిథిన్ కవర్ల వల్ల పర్యావరణానికి హాని అని చెపుతున్నారు కదా. జ్యూట్ బ్యాగులు విరివిగా ఉత్పత్తి చేయాల్సిన అవససరం ఎంతైనా ఉంది’ అంది. నేను వాళ్ల మాటలు వింటూనే ఇంట్లో నలుమూలలా మా వాళ్లను వెతుకుతున్నాను. పిల్లల గదిలో పిల్లల బడి సంచులు బొమ్మలతో కనిపించాయి. నన్ను చూసి హాయ్ చెప్పాయి. హాల్లో ఓ మూల టేబుల్‌పై స్వాతి భర్త దినకర్ బ్యాగ్ కాబోలు దర్జాగా తిష్టవేసింది. మరోవైపు హ్యాండ్ బ్యాగ్ ఒకటి నిండుగా కనిపించింది. చెప్పుల స్టాండు దగ్గర బాటా వారిచ్చిన పేపర్ సంచులున్నాయి.

ఇంతలో పిల్లలు తాతయ్య దగ్గర చేరారు. ‘తాతయ్యా! మా బ్యాగ్ ఎంత బరువో తెలుసా?’ అన్నాడు వరుణ్, ఆ బరువంతా వాడి చూపుల్లోనే కనిపిస్తోంది. ‘అవునురా. ఈ విషయం ఏటా బడి తెరిచే రోజుల్లో పత్రికలు, టీవీలు ఘోషిస్తుంటాయి. మళ్లీ మామూలే. చూస్తున్నాను కదా, పిల్లలు పదినుంచి పదిహేను కిలోల బరువు సంచి మోసుకెళ్తున్నారు. మరి వాళ్ల నడుములు త్వరగా వంగిపోక ఏమవుతాయి. ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాలలో మాత్రం ప్రభుత్వాలు బడి సంచుల బరువు ఏ తరగతికి ఎంత ఉండాలో నిబంధనలు ఏర్పరచాయి’ చెప్పాడు తాతయ్య. ‘ఎంత ఉండాలి తాతయ్యా?’ వర్ష అడిగింది.

‘విను మరి. ఒకటి, రెండు తరగతుల వారి సంచి ఒకటిన్నర కిలోలకు మించకూడదు. మూడు, నాలుగు, ఐదు తరగతుల వారి సంచులు రెండు నుంచి మూడు కిలోల బరువు ఉండొచ్చు. ఆరేడు తరగతులయితే నాలుగు కిలోల బరువు, ఎనిమిది, తొమ్మిది తరగతులయితే నాలుగున్నర కిలోలు, పదో తరగతి అయితే ఐదు కిలోలు ఉండవచ్చు’ చెప్పాడు. ‘ఔనా’ అంది వర్ష కళ్లు తిప్పుతూ. ‘అది సరే, అసలు పిల్లలు ఎంత బరువు వరకు మోయవచ్చు’ అడిగింది స్వాతి.

‘పిల్లవాడు లేదా పిల్ల బరువులో బడి సంచి బరువు పదిశాతం, వీలయితే అంతకంటే తక్కువ ఉండాలి’ అన్నది వైద్యులు చెప్పే మాట. అంతే కాదు, బ్యాగు బరువు నేరుగా నడుము మీద పడకుండా, సంచి, నడుముకు రెండు అంగుళాల కిందకు ఉండేలా చూసుకోవాలి. అంతేకాదు సంచిలో ఎక్కువ అరల ఏర్పాటు ఉండాలి, వాటిలో పుస్తకాలు సమానంగా సర్దుకోవాలి. అప్పుడే పిల్లలకు మోయడం సులువుగా ఉంటుంది. ఎక్కువ బరువు మోయడం వల్లే ఇప్పటి పిల్లలలో ప్రతి ఐదుగురిలో ఒకరు వెన్ను నొప్పితో బాధపడుతున్నారని సర్వేలు చెపుతున్నాయి. తల, భుజాల నొప్పులు, మెడ నరాలు గుంజడం.. వీటన్నిటి వల్ల పిల్లలు ఒక వైపు వంగి నడవడం జరుగుతోందని తెలుస్తోంది’ తాతయ్య వివరించాడు.

అదంతా విని నేను ‘అయ్యో’ అని విచారిస్తుంటే, స్వాతి అందుకుని ‘వీళ్లకయితే, ఏటా కొత్త సంచీ కొనాల్సిందే. పుస్తకాలు ఇన్నెందుకన్నా వినరు. అన్నీ కావాలనే అంటారు. దానికి తోడు లంచ్ బ్యాగ్లు, మంచి నీళ్లు’ అంది. అంతలో ఆమె భర్త దినకర్ వచ్చి కూర్చుంటూ ‘సంచుల గురించా.. అసలు బట్టతో తయారు చేసిన సంచులు కొంటానంటే ఒప్పుకోలేదు’ ఫిర్యాదుగా అన్నాడు. ‘అవునా’ పిల్లల్ని అడిగాడు తాతయ్య. ‘మరి మా స్నేహితులంతా వేరేవి తెచ్చుకుంటారు’ నసిగాడు వరుణ్. ‘మనం ఏది వాడితే అదే ఫ్యాషన్ అవుతుంది. మీ మంచి కోసమేగా చెప్పేది. పర్యావరణానికి ప్లాస్టిక్‌లు, పాలిథిన్లు ఎంత చేటు చేస్తాయో మీరూ పుస్తకాల్లో చదువుతున్నారుగా’ అన్నాడు తాతయ్య. ‘అవును’ అంది వర్ష తప్పు చేసినట్లుగా తలవంచుకుని.

‘కిందటేడు విశాఖలో అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ వారు ‘క్లాత్ బ్యాగ్ ఛాలెంజ్’ అని ఒక కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులందరూ విశేషంగా స్పందించి, తమ పాత ప్యాంట్లు, నిక్కర్లను అందంగా కత్తిరించి సంచులుగా తయారుచేశారు. అందుకు సూది, దారం, కొన్ని రంగులు మాత్రమే వారు కొనాల్సివచ్చింది. ఆ సంచుల మీద పిల్లలు చక్కని సందేశాత్మక చిత్రాలు వేసి, వ్యాఖ్యలు కూడా రాశారుట’ చెప్పాడు తాతయ్య. ‘అయితే ఈసారి వేసవి సెలవుల్లో మేం కూడా సంచులు తయారు చేస్తాం’ ఉత్సాహంగా అన్నారు పిల్లలు. ‘అదీ.. అలా ఉండాలి’ మెచ్చుకున్నాడు తాతయ్య.

‘అసలు సంచి లేకుండా మన నిత్య జీవితమే గడవదు. కూరగాయలకు, సరుకులకు, పళ్లకు, పూలకు, తినుబండారాలకు.. ఇలా ఏది తెచ్చుకోవాలన్నా సంచి తప్పనిసరి. పాలిథిన్ కవర్లు వాడటం పర్యావరణానికి చేటు కాబట్టి మనం ఎప్పుడూ జనపనార, వస్త్రం, పేపర్లతో తయారైన సంచులు వాడటం మంచిది. అన్నట్లు ఏటా జులై పన్నెండవ తేదీన ‘పేపర్ బ్యాగ్ డే’ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు’ అన్నాడు దినకర్.

అది విని చెప్పుల స్టాండు దగ్గర ఉన్న కాగితపు సంచి మావైపు గర్వంగా చూసింది. మేం దానివంక ప్రశంసగా చూశాం. అంతలో వరుణ్ ‘నాన్నా! పేపర్ బ్యాగ్‌ను ఎవరు కనుగొన్నారు?’ అడిగాడు. ‘తొలిసారిగా కాగితపు సంచులు తయారుచేసే యత్రాన్ని పద్ధెనిమిది వందల యాభైరెండులో అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ వోల్లే కనుగొన్నాడు. ఆ తర్వాత వీటిని బాగా మందంగా, వెడల్పుగా తయారు చేసే యంత్రాన్ని మార్గరెట్ ఈనైట్ అనే ఆయన కనుగొంటే, సంచి అడుగు భాగం చతురస్రాకారంలో వెడల్పుగా ఉండి,సులభంగా మడత పెట్టుకునేలా రూపొందించాడు చార్లెస్ స్టిల్వెల్. ఇలా క్రమంగా మరింత సౌలభ్యవంతంగా తయారయ్యాయి కాగితపు సంచులు. వీటిని ఇంట్లోనే కంపోస్టు చేయవచ్చు. వీటిలో ముడి పదార్థం చెక్క కాబట్టి, వీటిని రీసైకిల్ చేసి, కొత్త కాగితంగా మార్చి వార్తాపత్రికలకు లేదా పుస్తకాలకు వాడుకోవచ్చు’ వివరించాడు దినకర్.

‘అలాగా’ అన్నాడు వరుణ్. మా జాతి, మనిషికి మేలు చేసేలా పలురకాలుగా రూపొందడం నాకెంతో సంతోషం కలిగించింది. ‘తాతయ్యా! పక్కింటి బామ్మగారు జపమాలను ఓ సంచిలో ఉంచుకుని, తిప్పుతుంటారు’ వర్ష తానేదో వింత చూసినట్లు చెప్పగానే అందరూ చిరునవ్వులు చిందిస్తుండగా, తాతయ్య ‘అవునమ్మా. జపమాలను ఇతరులు చూడకూడదని దాన్ని ఒక వస్త్రపు సంచిలో పెట్టుకుని జపం చేయడం మామూలే’ అన్నాడు. ఆ వెంటనే ‘దేవుళ్లు కూడా సంచి పట్టుకోవడం మీకు తెలుసా?’ అడిగింది స్వాతి. ‘తెలీదు. అదేమిటో నువ్వే చెప్పాలి’ అన్నాడు దినకర్. అంతా అవునన్నట్లు చూశారు.

నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా స్వాతి మొదలు పెడుతూ, ‘ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం పదవ శక్తి పీఠంగా ప్రసిద్ధికెక్కటం తెలిసిందే. అక్కడ సతీదేవి ఎడమచేయి పడి, పురుహూతికా అమ్మవారిగా వెలిసిందని పురాణ కథనం. ఆ అమ్మవారికి నాలుగు చేతులుండగా, ఒక చేతిలో పరశువు, ఒక చేతిలో కమలం, మరొక చేతిలో మధుపాత్ర, ఇంకొక చేతిలో బీజ అంటే విత్తనాల సంచి ఉంటుంది’ వివరించింది. ‘విశేషమే’ అన్నాడు తాతయ్య. ‘నాకు ఇంకో విషయం గుర్తుకొస్తోంది. భద్రాచల రామదాసు ఆలయ నిర్మాణానికి ప్రభువుకు చెల్లించాల్సిన ధనాన్నివాడాడని, అందుకు తానీషా ఆగ్రహించి అతణ్ని జైల్లో ఉంచాడని, అప్పుడు భక్తుడైన రామదాసును కాపాడడానికి రామలక్ష్మణులు, తానీషాకు కలలో కనిపించి, వరహాల సంచిని అందజేశారని చెపుతారు’ అన్నాడు దినకర్.

స్వాతి, తాతయ్య ‘అవునవును’ అన్నారు. ‘అవును. రాజులు, బహుమానంగా వరహాల సంచులు ఇవ్వడం నేను కూడా కథల్లో చదివా’ అన్నాడు వరుణ్. ‘నాన్నా!కంగారూకు కూడా సంచి ఉంటుంది కదా!’ అంది వర్ష. అది విని అంతా సరదాగా నవ్వారు. దినకర్ బదులిస్తూ ‘అవును వర్షా! ఆడ కంగారూలకు శరీరంలో సహజంగానే పొట్టకు, చర్మపు మడతతో ఒక సంచిలా ఉంటుంది. పుట్టిన శిశువు సంచిలో భద్రంగా ఉంటుంది. కంగారు పిల్ల పది నెలల కాలం తల్లి పొట్ట సంచిలోనే ఉంటుంది. నాలుగు నెలలకు బయటకు వెళ్లినా కొద్ది దూరాలు మాత్రమే, మళ్లీ తల్లి సంచినే చేరుతుంది’ చెప్పాడు. ‘భలే ఉంది’ అన్నారు వరుణ్, వర్ష. నాకు తమాషాగా అనిపించింది.

అంతలో దినకర్ స్నేహితుడు వినయ్ రావడంతో ‘రారా’ అంటూ ఆహ్వానించాడు దినకర్. ‘నమస్తే బాబాయిగారూ’ కూర్చున్నాడు వినయ్. వెంటనే ‘పేరు సార్థకం చేసుకున్నావురా’ అన్న దినకర్ మాటలకు నవ్వారు స్వాతి, తాతగారు. నాకు అంతగా అర్థం కాలేదు, పిల్లలు కూడా నాలాగే అనుకుంటా, మౌనంగా ఉండిపోయారు. ‘మామయ్య ఊరినుంచి తెచ్చారు’ అంటూ ఓ పెద్ద జామకాయ వినయ్‌కు అందించాడు దినకర్. ‘ఓ’ అంటూ ఆనందంగా దాన్ని కొరుకుతూ, ‘ఏంటి సంగతులు’ అన్నాడు. ‘ప్రస్తుతమయితే సంచుల గురించి మాట్లాడుకుంటున్నాం. రకరకాల సంచుల సంగతులు.. మా వర్ష కంగారూ సంచి గురించి అడిగింది’ అన్నాడు నవ్వుతూ. వినయ్ కూడా నవ్వేసి, ‘ఆ మధ్య ఓ వార్త చదివాను. కాకినాడ దగ్గర ఓ ఊళ్లో భిక్షాటన చేసుకునే సాధువు ఒకాయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడట. ఆయన ఉన్న గదిలో సంచులుండటం గమనించి, ఏమిటా అని చూశారట. ఆశ్చర్యం.. వాటినిండా డబ్బు. అదంతా తీసి లెక్కిస్తే దాదాపు లక్ష రూపాయల పైనే ఉందిట’ అన్నాడు. మా జాతిలో మరో రకం ‘డబ్బు సంచి’ అని అది చాలా విలువైందని అర్థం చేసుకున్నా. ‘ఎన్నాళ్లు కూడబెట్టాడో ఆ డబ్బు’ అంది స్వాతి ఆశ్చర్యంగా.

‘మా చిన్నప్పుడు అమ్మమ్మ మ్యాటీ బట్ట మీద రంగుల దారాలతో కొండల డిజైన్ కుట్టి సంచులు తయారుచేసేది. భలే ఉండేవి. పైగా స్నేహితులకు, బంధువులకు కూడా ఓపిగ్గా కుట్టిచ్చేది. అప్పుడు ఈ ప్లాస్టిక్ సంచులు, బుట్టలు వాడకం తక్కువగా ఉండేది’ అన్నాడు వినయ్. ‘అవును. మా ఇంట్లో కూడా అలాంటి సంచులున్నట్లు గుర్తు’ అన్నాడు దినకర్. ‘ఇంకో సంగతి. అయ్యప్ప స్వాములకు కూడా సంచి చాలా అవసరం. ఎలా అంటే అయ్యప్పదీక్షలో ఇరుముడి చాలా ముఖ్యమైంది. మండల దీక్ష ముగించిన స్వాములు రెండు అరలుగా ఉన్న ఒక సంచిని తీసుకుని ముందు అరలో స్వామికి సమర్పించవలసిన వస్తువులను, వెనుక అరలో ఆహార పదార్థాలను ఉంచి, తాడుతో మూట కడతారు’ చెప్పాడు తాతయ్య. నేను ‘ఓహో అనుకుంటుంటే ‘నిజమే. నేనూ చూశాను’ అన్నాడు వినయ్. ‘కాఫీ తెస్తాను’ అంటూ స్వాతి లేచి వెళ్లింది.

దినకర్ మాట్లాడుతూ ‘రైతులకు కూడా ధాన్యపు బస్తాల అవసరం చాలా ఉంటుంది. ఆ మధ్య గోనె సంచుల కొరతతో రైతులు ఇబ్బందులకు గురయిన వార్తలొచ్చాయి. అంతేకాదు, పౌర సరఫరాల శాఖలో అయితే గోనె సంచుల స్కామ్ జరిగిందని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు గొడవచేశాయి. గోనె సంచుల కొనుగోలు పేరుతో అవినీతికి పాల్పడి ఆరొందలఇరవై కోట్ల రూపాయలు మింగేశారని అన్నారు’ అన్నాడు. ‘మరో వార్త కూడా వచ్చిందిరా.. ఆ మధ్య కరీంనగర్‍లో గన్నీ సంచుల గోదాములో అగ్నిప్రమాదం జరిగి నలభై వేలకుపైగా గోనె సంచులు బూడిదయ్యాయట’ చెప్పాడు వినయ్. ‘అన్నట్లు విజయనగరం జిల్లాలో గోనె సంచుల్లో ఖైనీ, గుట్కాలు తరలిస్తూండగా ఆ నేరస్థుల్ని పట్టుకున్న వార్తలొచ్చాయి’ తాతయ్య చెప్పాడు. ‘నేను ఇంకో తమాషా చెపుతా’ అన్నాడు వరుణ్. ‘ఏంటో చెప్పు’ అన్నారంతా. ‘కరోనా సమయంలో ఒక పల్లెటూరు తాత మాస్క్‌కు బదులుగా ఏకంగా ఓ గోనె సంచినే కట్టుకున్నాట్ట’ నవ్వుతూ చెప్పాడు. అది విని, మా జాతి అలా కూడా ఉపయోగించిందన్నమాట అని నేను అనుకుంటుంటే, ‘భలే తాత’ అంటూ అంతా నవ్వారు.

స్వాతి కాఫీ తెచ్చి అందరికీ అందించింది. అంతలో వర్ష వెళ్లి వాళ్ల అమ్మ హ్యాండ్ బ్యాగ్ తెచ్చింది. ‘ఇప్పుడదెందుకు?’ కోప్పడింది స్వాతి. ‘చాక్లెట్స్ ఇవ్వవా’ బ్యాగ్ అందిస్తూ ముద్దుగా అడిగింది. స్వాతి బ్యాగ్ తెరిచి పిల్లలిద్దరికీ చాక్లెట్లు అందించింది. ‘అన్ని బ్యాగులు ఒక ఎత్తు, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఒక ఎత్తు. అది సమస్త వస్తు నిధి’ నవ్వుతూ అన్నాడు దినకర్. ‘నిజమే. దాని బరువుకు భుజం నొప్పి కూడా మొదలైంది. అయినా బయటికి కదిలితే భుజానికి అది ఉండాల్సిందే. లేకుంటే తోచదు. అంతగా అలవాటయింది’ అంది స్వాతి.

‘ఏ ఊరెళ్లినా, ఏ ఎగ్జిబిషన్‌కు వెళ్లినా బాగ్ కొనాల్సిందే. అదేమంటే ఒకటి డిజైన్ బాగుందని, మరొకటి రంగు బాగుందని, ఇంకొకటి దట్టంగా ఉందని, వేరొకటి తేలిగ్గా ఉందని, పెద్దదని, చిన్నదని, పార్టీ బ్యాగ్ అని, ట్రావెల్ బ్యాగ్ అని ఏవేవో చెపుతుందిలే. ఈ మధ్య జ్యూట్ బ్యాగ్‌లు ఎన్ని కొన్నదో. ఆఖరికి మొక్కల్ని పెంచే జ్యూట్ బ్యాగ్‌లు కూడా’ అన్నాడు దినకర్.

అంతా నవ్వుతుంటే, స్వాతి తనను తాను సమర్ధించుకుంటూ, ‘నిత్యం వాడుకునేవి, రకరకాల అవసరాలకు, సందర్భాలకు వాడుకునేవి మళ్లీ మళ్లీ కొనకుండా ఎట్లా? మా కొలీగ్ చెప్పింది. ‘ఈనా బ్యాగ్’ అని కొత్తరకం వచ్చాయిట. ఎంబ్రాయిడరీ, ముత్యాలపట్టీలు, స్ఫటికాలు, రత్నాలు పొదిగినవి రకరకాల డిజైన్లలో దొరుకుతున్నాయట. ధర మూడువేల నుంచి ఉందిట. ఒకసారి చూడాలి’ అంది స్వాతి. ‘అబ్బో’ అనుకున్నా నేను. మా వాళ్లలో ఖరీదైన వాళ్లు ఉండటం కూడా నాకు గర్వంగా అనిపించింది.

దినకర్ మాత్రం ‘హతోస్మి’ అన్నాడు. ‘దీనికేనా, అసలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గురించి తెలుసా మీకు?’ అంది స్వాతి. ‘చెప్పండి, వింటాం’ అన్నాడు వినయ్. ‘ఇటలీకి చెందిన ఓ కంపెనీ తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్ ఖరీదు యాభై మూడు కోట్ల రూపాయలు. మొసలి చర్మంతో, వజ్రాలు వినియోగించి తయారు చేశారుట. అంతే కాదు, నూటముప్పై క్యారట్ల వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు వాడారుట. తెల్ల బంగారంతో సీతాకోక చిలుకలు చేసి బ్యాగ్‌కు అమర్చారుట’ చెప్పింది స్వాతి. దాని ధర వినేసరికి నా ఆశ్చర్యానికి అంతే లేదు. ‘నీకే తెలుస్తాయి ఇలాంటి సంగతులన్నీ’ అన్నాడు దినకర్. ‘చదివితే మీకూ తెలుస్తాయి’ అంది స్వాతి.

‘అన్నట్లు నేనూ ఓ కొత్తరకం సంచి గురించి చదివా. అయితే ఇది కమలా పండ్ల తొక్కలతో తయారుచేసింది. జోర్డాన్‌కు చెందిన ఒమర్ సత్తావి మంచి ఫుడ్ ఆర్టిస్ట్, మాలిక్యులర్ గ్యాస్ట్రోనమిస్ట్ కూడా. లేజర్ సాయంతో తొక్కలను చక్కని షేపుల్లో కత్తిరించి తయారు చేస్తారట. ఈ పద్ధతిని ‘డిజిటల్ ఫ్యాబ్రికేషన్’ అంటారు’ చెప్పాడు తాతయ్య. మా జాతిలో కొత్తరూపు గురించి విని ‘వింతగా ఉంది’ అనుకుంటుంటే, స్వాతి ‘భలే ఉంది తొక్క బ్యాగ్’ అనడంతో అంతా నవ్వారు.

వినయ్ మాట్లాడుతూ, ‘ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో, సెమినార్లలో కూడా సంచుల్ని ఇస్తున్నారు. కొన్ని షాపులయితే సంచికి అదనపు చార్జి వసూలు చేస్తున్నారు. దానిపై మళ్లీ వారి కంపెనీ పేరు వగైరాలు యధాతథమే. అదనంగా డబ్బులిచ్చి, ఆ సంచి పట్టుకుని తిరిగి ఆ కంపెనీకి ఉచిత ప్రచారం చేయటమేమిటనిపిస్తుంది’ అన్నాడు వినయ్. ‘అదీ నిజమే’ అన్నాడు దినకర్. ‘సంచుల వల్ల ప్రచార లాభం కూడా ఉందన్న మాట’ నేను అనుకుంటుండగా ‘మొత్తానికి సంచి గురించి బస్తాడు కబుర్లు చెప్పుకున్నాం. ఇక నేను బయల్దేరుతా’ అన్నాడు వినయ్. ‘ఒక్క నిముషం ఉండండి’ అంటూ స్వాతి లేచి ఓ చిన్న బట్ట సంచిలో జామకాయలు వేసి, ‘పిల్లలకివ్వండి’ అంటూ అందించింది. ‘మంచి గిట్టుబాటే’ నవ్వుతూ ముందుకు కదిలాడు వినయ్. అంతా వీడ్కోలు చెప్పారు.

‘కాఫీ తాగాం కదా ఓ పావుగంటాగి భోజనాలు వడ్డించేస్తాను. ఈలోపు వంటింట్లో పని చూసుకుంటా’ అంటూ లోపలికెళ్లింది స్వాతి. తాతగారు శ్లోకాలేవో చదువుకుంటున్నారు. దినకర్ బెడ్రూమ్ కెళ్లి మొబైల్ అందుకున్నాడు. పిల్లలు తమ సంచుల్లోని పుస్తకాలను తీసి చూసుకుంటున్నారు. ఇంతసేపూ మా జాతి గురించి విన్నాను, ఇప్పుడు నాలో నేనే ఆలోచించుకుంటున్నా. మా జాతి రకరకాల అవసరాలకు అందరికీ ఉపయోగపడటం ఆనందమే. కానీ హత్యలు చేసి, శవాన్ని సంచుల్లో పెట్టి పడేయడం వంటి ఘటనల గురించి విన్నప్పుడు నా మనసు ఎంత క్షోభిస్తుందో. అలాగే నల్లధనాన్ని సంచుల్లో సరఫరా చేయడం, మాదకద్రవ్యాలు, దొంగసొమ్ములు సంచుల్లో తరలించడం వంటివి టీవీల్లో చూసినప్పుడు మా జాతి చేయని నేరంలో భాగమవుతోందని ఎంత వెత చెందుతానో. సంచిని మంచికే వాడమని నేనుచేసే మనవి, మనిషి ఆలకించేనా?’ అనుకుంటుంటే స్వాతి మాటలు వినిపించాయి.. ‘అమ్మా! నువ్వు పంపిన సంచులు ఎంతో బాగున్నాయి..’

అని ఇంకా ఏదో చెపుతోంది కానీ నా మనసు అప్పటికే

ఆనందాకాశంలో విహరిస్తుండటంతో

మరేవీ వినిపించలేదు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here