అన్నింట అంతరాత్మ-50: ‘ఓ నవ్వు నవ్వండీ’.. ‘కెమెరా’ను నేను!

6
10

[dropcap]జీ[/dropcap]వులలో నిర్జీవులలోని అంతరాత్మను దర్శించి ప్రదర్శించే జె. శ్యామల గారి ‘అన్నింట అంతరాత్మ’ శీర్షికలో ఈ వారం ‘కెమెరా’ అంతరంగం తెలుసుకుందాం.

***

గోద్రెజ్ బీరువా తలుపు తెరిచిన చప్పుడు. ఇది కూడా నాలాగా పాతబడింది. చప్పుడులో తేడా తెలుస్తోంది. దీన్ని తెరిచినప్పుడల్లా నన్నెవరైనా బయటకు తీస్తారేమో అని ఓ పేరాశ. కానీ అది జరగదు. ఇప్పుడూ అంతే.. ఈ బీరువా పై అరలోకి నేను (ఆగ్ఫా క్లిక్ త్రీని) చేరి నలభై ఏళ్ల పైమాటే అయింది. నా పక్కనే ఏనాటివో చిన్న పొడవాటి ఖాళీ రీల్ ప్లాస్టిక్ డబ్బాలు.. ఆ పక్కనే నా తర్వాత కొన్నేళ్లకు చేరిన నికాన్ కెమెరా. కొన్నిరకాల లెన్స్‌లు దాచిన ప్లాస్టిక్ డబ్బా, ఏనాడో మా పాతతరం కెమెరాలతో తీసిన నలుపు, తెలుపు ఫొటోల కవర్లు, కొన్ని ఆల్బమ్‌లు తోడుగా ఉన్నాయి.

ఒకప్పుడు ఆనందరావుకు నేనో అపురూపమైన ఆస్తిని. వారాంతాలు వస్తే చాలు, నాతోనే కాలక్షేపం. పిల్లలను, పెద్దలను.. ఓ తెగ ఫొటోలు తీసేవాడు. ఇంటికి ఎవరన్నా వస్తే ఫొటో తీయంది వదిలేవాడు కాదు. తను తీసిన ఫొటోల్లోని క్లారిటీ, బ్యాక్‌గ్రౌండ్, నీడ పడకుండా చూపిన నేర్పు.. ఇలా ఎన్నెన్నో అంశాలను విశ్లేషించి, అందరికీ వివరించేవాడు. ఇలా నా వైభవం కొన్నేళ్లు బాగా నడిచింది. అంతలో ఆనందరావుకు ఎవరో నికాన్ కెమెరా అమ్ముతామన్నారట, సెకండ్ హ్యాండ్ కాబట్టి తక్కువకి వస్తుందని, దాంతో ఫొటోలు బ్రహ్మాండంగా తీయవచ్చని ఆనందరావు, భార్య సుచిత్రకు చెపుతుంటే విన్నాను. ఆ రోజు ఆనందరావు నికాన్ కెమెరా తేవడం నాకింకా గుర్తుంది. అందరి చూపులూ దాని వైపే. ఆనందరావు కొడుకు విశ్వం, ‘మరి పాత కెమెరాను ఏం చేస్తావు?’ అడిగాడు. నా మనసులో నేరుగా ముల్లు దిగింది. నికాన్ రాగానే నేను ‘పాత’ అయిపోయానా.. ఆనందరావు ఏం చెప్తాడో అని చూశా.. ‘ఏమవుతుంది.. ఉంటుంది’ అన్నాడు పొడిగా. నేను దిగులు ముఖంతో ఉంటే, నికాన్ నా వైపు ఓ గర్వపు చూపు విసిరింది. నన్ను బీరువాలో మూలకి నెట్టారు. కాలం నాది కానప్పుడు ఏం చేస్తాను?

కొన్నేళ్లు నికాన్ హవా నిరాఘాటంగా సాగింది. ఆ తర్వాత డిజిటల్ కెమెరాలు రావడంతో నికాన్ కూడా తలొంచుకుని నా పక్కనే చేరింది. ఆ చిన్ని డిజిటల్ కెమెరా అందరికీ భలే నచ్చేసింది. అంతలో విదేశం నుంచి వచ్చిన ఓ వీడియోక్యామ్ హల్‌చల్ చేయసాగింది. ఆ తర్వాత మొబైల్ ఫోన్ల ఆగమనం. స్మార్ట్ ఫోన్ తోనే ఫొటోలు, వీడియోలు.. దాంతో డిజిటల్ కెమెరా, వీడియోక్యామ్ కూడా మా చెంతకు చేరాయి.. ఇలా ఆలోచిస్తున్న నేను ఉలిక్కిపడ్డాను.

ఎప్పుడొచ్చాడో ఆనందరావు, మాకేసే చూస్తున్నాడు. నాలో చిన్నఆశ.. దాన్ని నిజం చేస్తూ నన్ను అపురూపంగా చేతుల్లోకి తీసుకున్నాడు. బయటకు తీసి హాల్లోకి తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టాడు. ‘అబ్బ! ఎన్నాళ్లయిందో ఈ వెలుగు చూసి’ అనుకున్నాను. ఆనందరావు మళ్లీ వెళ్లి బీరువాలోని నా నేస్తాలను, ఫొటోలను, ఆల్బమ్‍లను కూడా తెచ్చి నా పక్కనే పేర్చసాగాడు. వాటి ముఖాల్లో కూడా ఆనందం చిందులేస్తోంది.

అంతలో రూబీ అంటే ఆనందరావు మనవరాలు పరుగులు తీస్తూ వచ్చి ‘తాతయ్యా! రేపు క్లాస్ ఫొటో తీస్తారుట. నీట్‌గా తయారై రమ్మన్నారు’ అంది. ‘అలాగా. ఇదుగో! మీ నాన్న స్కూలుకెళ్లిన మొదటిరోజు ఫొటో’ అంటూ ఓ ఆల్బమ్ తీసి చూపించాడు. ‘భలే ఉన్నాడు నాన్న.. అమ్మా చూడు’ అంటూ ఆల్బమ్ పట్టుకుని అమ్మ దగ్గరికి పరుగెత్తింది. కెమెరాలను, ఆల్బమ్‍లను చూస్తూ గతాన్ని నెమరేసుకోసాగాడు ఆనందరావు.

నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ, ‘ఏం చేస్తున్నారు?’ అంటూ వచ్చిన సుమిత్ర అతడి ముందున్న వస్తువులు చూసి, ‘ఇప్పుడివన్నీ ఎందుకు తీశారు?’ అంది. ‘ఏమో.. ఒకసారి చూడాలనిపించింది. మళ్లీ సర్దిపెడతాలే’ అన్నాడు ఆనందరావు. ‘ఆ కాలమే వేరు. ఎక్కడికెళ్లినా కెమెరా విడిగా తీసుకెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు మొబైల్ ఫోన్ వచ్చాక అందరి అరచేతుల్లో కెమెరా ఉన్నట్లే ఉంది. ఇదీ, అదీ అని లేదు, ప్రతిది ఫొటో తీయడమే.. ఇక సెల్ఫీలకైతే అంతే లేదు. అందరూ ఎవరికి వారే ఫొటోగ్రాఫర్లయి పోయారు’ సుచిత్ర అంటుండగానే ట్యూషన్ నుంచి కాబోలు బబ్లూ వచ్చాడు. ‘రారా బబ్లూ, మీ నాన్న, అత్త చిన్నప్పుడు ఎలా ఉన్నారో చూడు’ అంటూ ఆల్బమ్ చూపించింది సుచిత్ర.

ఆల్బమ్‌లు తమ ఉనికి ఇన్నాళ్లకు వెలుగు చూసినందుకు సంతోషిస్తున్నాయి. కానీ వీళ్లకేం తెలుస్తుంది? బబ్లూ ఆ ఫొటోలన్నీ తిరగేసి ‘భలే గమ్మత్తుగా ఉన్నారు’ నవ్వుతూ అన్నాడు. అదే సమయంలో రూబీ, వెనకే కాఫీ కప్పులతో శ్రీదేవి వచ్చారు. ఆనందరావు, సుచిత్రలకు కాఫీ అందించి తనూ అక్కడే కూర్చుంది శ్రీదేవి. ‘తాతయ్యా! అసలు మొదట కెమెరాను కనుక్కుంది ఎవరు?’ అడిగాడు బబ్లూ. ‘మంచి ప్రశ్న అడిగావురా. మొట్టమొదటగా పోర్టబుల్ అంటే ఎక్కడికైనా పట్టుకెళ్లగలిగే కెమెరాను పదహారువందల ఎనభై అయిదులో జోహాన్ జాన్ సృష్టించాడు. ఆ తర్వాత వందేళ్లకు పైగా పెద్ద పురోగతి లేదు. పద్ధెనిమిదివందల పధ్నాలుగులో జోసెఫ్ నిసెఫోర్నియెప్స్ మొదటి ఫొటోగ్రాఫ్ రూపొందించి చరిత్రకెక్కాడు. కానీ ఆ ఫొటో శాశ్వతంగా నిలవలేదు. సొంతంగా తయారు చేసిన కెమెరాతో, సిల్వర్ క్లోరైడ్ పూత పూసిన పేపర్‍పై ఫొటో తీశాడు. అయితే వెలుతురు పడని చోట్ల అది నల్లగా మారిపోయింది. ఆ తర్వాత పద్ధెనిమిదివందల ఇరవై తొమ్మిదిలో లూయిస్ డాగెరె అన్నివిధాల సరైన ఫొటోగ్రాఫ్ రూపొందించాడు. ఆ తర్వాత క్రమేణా అనేక రకాల పురోగతి చోటు చేసుకుంది’ చెప్పాడు.

‘అబ్బో! మా జాతి చరిత్ర చాలానే ఉందన్నమాట’ నేను అనుకుంటుంటే, ‘అలాగా, గతంలో ఫొటో రీళ్లు వాడేవారు కదూ’ అన్నాడు బబ్లూ. ‘అవును. మెమరీ కార్డులు వచ్చి రీళ్లను సాగనంపాయి. డిజిటల్ ఫొటోగ్రఫీ వచ్చాక ఒకరకంగా చెప్పాలంటే ఫొటోలు తీయడంలో ఉన్న కిక్కు పోయింది. సరైన చిత్రాన్ని తీయడానికి ఏకాగ్రతతో ఎదురు చూడడం, తదేక దీక్షతో క్లిక్ మనిపించడం పాత మాట. ఇప్పుడయితే వరసబెట్టి ఫొటోలు నొక్కేయడం, అందులో ఏది నచ్చితే దాన్ని తీసుకొని, మిగతావి తొలగించడం మామూలే’ అన్నాడు తాతయ్య. ‘మన కన్నుకూడా కెమెరా లాంటిదే అని ఒకసారి టీచర్ చెప్పింది’ అంది రూబీ. ‘అవునమ్మా. మనిషి కన్ను ఐదు వందల డెబ్భైఆరు మెగాపిక్సెల్ సామర్థ్యం గల డిజిటల్ కెమెరా లాంటిది. ఇది కోటి రకాల వేర్వేరు రంగుల ఛాయల్ని గుర్తించగలదు’ అన్నాడు తాతయ్య. నాకు ఆ విషయం ఎంతో ఆసక్తిగా అనిపించింది.

‘ఫొటోగ్రఫీ అంటే ఇష్టంలేని వారు ఉండరేమో. కానీ రవి హొంగల్‌కు ఉన్నంత పిచ్చి ఇష్టం ఎవరికీ ఉండదేమో’ అంది శ్రీదేవి. ‘ఆయనెవరు?’ నా ప్రశ్ననే అంతా ఒక్కసారిగా అడిగారు. శ్రీదేవి నవ్వుతూ ‘రవి హొంగల్ కర్నాటకకు చెందిన ఫొటోగ్రాఫర్. ఆయన తన సృజనాత్మకతను తనదైన శైలిలో చూపించాడు. బెల్గాంలోని శాస్త్రినగర్‍లో కెమెరా ఆకారంలో ఇంటిని నిర్మించుకున్నాడు. నిర్మాణానికి రెండున్నర ఏళ్ల కాలం పట్టిందట. ఆ ఇంటికి ‘క్లిక్’ అని పేరు పెట్టాడు. దాని నిర్మాణానికి డెబ్భైఒక్క లక్షల రూపాయలు ఖర్చయిందట. ఆ కెమెరా హౌస్ అందర్నీ కట్టుకుంటోంది. బయటి గోడ డిజైన్‍లో ఫొటో రీల్, మెమరీకార్డ్, వ్యూ ఫైండర్‍ను కూడా పొందుపరిచాడు. మొదటి అంతస్తు ఎప్సన్ ప్రింటర్ ఆకారంలో ఉండగా, రెండవ అంతస్తు నికాన్ లెన్స్ మాదిరి కిటికీ కలిగి ఉంటుంది. ఇక మూడో అంతస్తు లోని బెడ్రూమ్ కిటికీ క్యానన్ ఫ్లాష్ లాగా ఉంటుంది. అంతేకాదు, టెర్రస్ గోడకు క్లిక్ చేసే బటన్ కలిగి ఉంటుంది. తన పిల్లలకు కూడా ఎప్సన్, క్యానన్, నికాన్ అని కెమెరా కంపెనీ బ్రాండ్ల పేర్లే పెట్టాడు’ చెప్పింది. వెంటనే ‘భలే ఉందే’ అన్నారంతా. మా జాతి పట్ల రవి అభిమానానికి నాకు కలిగిన ఆనందం అంతా, ఇంతా కాదు.

అంతలో తలుపు చప్పుడు. అందరి చూపులూ అటు. ‘నాన్నా!’ పిల్లలు ఆనందంగా అరిచారు. ఆ వెనుకే వస్తున్న ఆమెను చూసి ‘అత్తయ్యా!’ ఆనందోత్సాహాలతో అరిచారు. ఆమెను చూడగానే ఆనందరావు, సుచిత్ర ‘రామ్మా రా.. ఇద్దరూ ఎలా కలిశారు?’ ప్రశ్నించారు. ‘ఇంటి ముందే నేను బైక్, జ్యోతి ఆటో ఒకేసారి దిగాం’ బదులిచ్చాడు ఆనందరావు కొడుకు విశ్వం. ‘ఏంటి అంతా ఏదో ముచ్చట్లాడుతున్నారు’ నవ్వుతూ అడిగింది జ్యోతి. ‘కెమెరాలు, ఫొటోల గురించి మాట్లాడుకుంటున్నాం’ చెప్పింది శ్రీదేవి. ‘ఆయన క్యాంప్ కెళ్లారు. ఓ పూట మీ అందరితో గడుపుదామని వచ్చేశా’ చెప్పింది జ్యోతి. ‘మంచిపని చేశావ్. ఫోన్‌లో ఎంతసేపు మాట్లాడినా ఇలా కలుసుకోవటం వేరు’ అంది సుచిత్ర.

విశ్వం దుస్తులు మార్చుకుని వచ్చే లోపల శ్రీదేవి మళ్లీ అందరికీ కాఫీలు, మిక్చర్ పట్టుకొచ్చింది. అంతా కాఫీ తాగుతుండగా, ‘ఇప్పుడు ప్రతి చోట, ఇళ్లలో కూడా సీసీ కెమెరాలు ఉంటున్నాయి కదా. సీసీ అంటే ఏమిటి?’ అడిగాడు బబ్లూ. ‘భద్రత కోసం ఏర్పాటు చేసే కెమెరాలు ఇవి. సీసీ అంటే ‘క్లోజ్డ్ సర్క్యూట్’ అని అర్థం. బ్యాంకులు, దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సిటీరోడ్లు, హైవేలు, గృహాలు లేదా గృహ సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, పరిశ్రమ ప్రాంతాలు ఇలా ఎన్నో చోట్ల ఇప్పుడు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులకు సమానం. దీనివల్ల దొంగతనాలు, సాంఘిక నేరాలు, అవినీతి పనులు కొంత వరకు అదుపు చేయవచ్చు. అయితే సీసీ కెమెరాలు అమర్చినంత మాత్రాన సరిపోదు. వాటి నిర్వహణ పట్ల అశ్రద్ధ చేస్తే ఫలితం ఉండదు కాబట్టి, అవి సక్రమంగా పనిచేస్తున్నదీ, లేనిదీ తరచు పరిశీలించుకోవాలి’ అంది జ్యోతి. ‘మా జాతిలో ఎన్నో రకాలున్నాయన్నమాట’ అనుకుంటుంటే ‘నిజమే. చాలా చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న సంగతి నేరాలు జరిగినప్పుడు బయటపడుతోంది. పైగా సీసీ కెమెరానే ధ్వంసం చేసి నేరానికి పాల్పడితే చేయగలిగేదేముంది?’ అంది సుచిత్ర. ‘సీసీ కెమెరాలంటే ఓ సంగతి గుర్తుకొస్తోంది. కన్యాకుమారి లోని ఓ ప్లైవుడ్ షాపుకు యజమాని సీసీ కెమెరాలు అమరిస్తే అవి కొన్నిరోజుల పాటు చోరీకి గురయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదమూడు కెమెరాలు. చివరకు కెమెరా దొంగ ఎవరో తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు, నవ్వుకున్నారు కూడా’ అంది శ్రీదేవి. ‘ఇంతకూ ఎవరేమిటి ఆ కెమెరాల దొంగ’ అడిగింది సుచిత్ర. ‘కోతి’ నవ్వుతూ బదులిచ్చి, ‘వాటన్నిటినీ, ఓ చోట గుట్టగా పడేసింది’ వివరించింది శ్రీదేవి. ‘కోతి చేష్టలంటే ఇలాంటివే’ ఆనందరావు అనగానే అంతా నవ్వారు.

‘కోతికి కూడా మా జాతి అంతగా నచ్చిందన్నమాట’ అనుకుని నేను గర్విస్తుండగా, ‘ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన అతి చిన్న కెమెరాను ఓమ్ని విజన్ టెక్నాలజీస్ సంస్థ తయారు చేసి గిన్నిస్ కెక్కింది. దాని పరిమాణం మిల్లీమీటర్ కన్నా తక్కువ. వైద్యరంగంలో, ముఖ్యంగా శస్త్రచికిత్సలు చేసే సమయంలో ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. ఈ కెమెరా తక్కువ వెలుతురు ఉన్నా స్పష్టమైన ఫొటోలు తీస్తుందిట’ విశ్వం చెప్పాడు. ‘అంత చిన్నదా!’ అంతా ఆశ్చర్యపోతూ ఉంటే నేను, నా నేస్తాలు కూడా ‘ఔరా’ అనుకున్నాం.

‘అమెరికా పరిశోధకులు ‘మెటా సర్‌ఫేస్’ అనే టెక్నాలజీతో ఇసుక రేణువంత సైజులో కెమెరా తయారుచేశారని, ఆ కెమెరా తనకన్నా ఐదు లక్షల రెట్లు పెద్దవైన వస్తువులను కూడా సులభంగా ఫొటోలు తీస్తోందని ఓ మేగజైన్‍లో చదివాను’ అంది జ్యోతి. ‘రోజురోజుకీ సాంకేతికత ఎంతగా పెరిగిపోతోందో’ అన్నాడు ఆనందరావు. ‘మీకు స్పైడర్ కెమెరా గురించి తెలుసా?’ అడిగాడు బబ్లూ. ‘అదేంటి?’ ఆశ్చర్యంగా అంది సుచిత్ర. మిగతా వారు కూడా తెలీదన్నట్లు ముఖంపెట్టారు. వెంటనే బబ్లూ ‘క్రికెట్ మ్యాచ్‌లో మూడువందల అరవై డిగ్రీల వ్యూ కోసం కెమెరాను గ్రౌండ్లో పైనుంచి వేలాడదీస్తారు. ఆ మధ్య మెల్బోర్న్‌లో జరిగిన ఓ మ్యాచ్ స్పైడర్ కెమెరా దక్షిణాఫ్రికా క్రికెటర్ తలకి కొట్టుకోవడంతో అతడు పడిపోయాడు’ చెప్పాడు. ‘అయ్యో! ఆట సరిగ్గా కనపడటమేమో గానీ ఇలా ప్రమాదాలు జరిగితే కష్టమే’ అంది జ్యోతి. నాకూ నిజమే అనిపించింది.

‘ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు అంటే ముఖాన్ని గుర్తుపట్టే కెమెరాలు కూడా ఉన్నాయి. అంటే సీసీ కెమెరాల్లోనే ఈ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‍ను అమరుస్తారు. నేరస్థులు, ఉగ్రవాదుల ముఖాలను గుర్తించి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడానికి ఈరకం కెమెరా ఉపయోగపడుతుంది. దాదాపు పదిహేనేళ్లుగా ఎర్రకోటలో జరిగే కార్యక్రమాలకు వీటిని అమరుస్తున్నారు. ఇటీవల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రవేశద్వారం వద్ద, బయటకు వెళ్లే మార్గం వద్ద కూడా ఏర్పాటు చేశారు’ అంది శ్రీదేవి.

‘కొన్ని హోటళ్లలో, జిమ్‍లలో రహస్య కెమెరాలు పెడతారని, కానీ దానివల్ల అనేక మోసాలు జరుగుతాయని అంటారు. అలాంటి వాటిని గుర్తించడం ఎలా?’ అంది సుచిత్ర. ‘నిజమే. రెండు మిల్లీమీటర్ల చిన్న లెన్స్‌తో ఉండే ఈ కెమెరాలను గుర్తించటం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదు. గదిలోని లైట్లన్నీ తీసేసి, కర్టెన్లతో కిటికీలను మూసి, మొబైల్ ఫోన్‍లోని ఫ్లాష్ లైట్, కెమెరా రెండింటినీ ఒకేసారి ఆన్ చేసి, అనుమానించిన చోట ఫోకస్ చేయాలి. ఒకవేళ రహస్య కెమెరా ఉంటే ఫోన్ స్క్రీన్ మీద వెలుగు, మెరుపులు కనిపిస్తాయి’ చెప్పాడు విశ్వం.

‘నాన్నా! పులులు, సింహాలు మొదలైన వాటిని ఫొటో తీయడం కష్టం కదూ’ అంది రూబీ. ‘అవునమ్మా. వన్యప్రాణుల్ని ఫొటో తీయడం కష్టమే. అందుకే దూరంగా ఉన్న వాటిని ఫొటో తీయడానికి టెలిఫొటోలెన్స్ వాడుతారు. సరైన క్షణాన్ని పట్టుకోవడానికి ఎంతో ఓపిక ఉండాలి. ఆ మధ్య కెన్యాకు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పాల్ గోల్డ స్టెయిన్ తీసిన చిరుతల ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కెన్యాలోని మసాయి మారా నేషనల్ పార్క్‌లో మూడు చిరుతపులులు మూడు వైపులకు చూస్తుండగా తన కెమెరాలో బంధించాడు. ఆ ప్రత్యేక క్షణం కోసం అతడు ఏకంగా ఏడు గంటలపాటు వర్షంలో తడుస్తూ ఎదురు చూశాడట’ చెప్పాడు విశ్వం. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ‘నిజంగా గొప్ప’ అంది సుచిత్ర.. అంతా అవునన్నట్లు తలూపారు.

శ్రీదేవి మాట్లాడుతూ, ‘వీడియోగ్రఫీ’ ఉపాధిగా ఎంతోమంది జీవిస్తున్నారు. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు, సభలు, సమావేశాలకు వీడియోగ్రాఫర్ తప్పనిసరి. మహిళలకు కూడా వీడియో తీయడం నేర్పి, వారికి ఆర్థిక స్వయంశక్తిని సమకూర్చిన సేవాసంస్థలెన్నో ఉన్నాయి. ఫొటో స్టూడియోలు నడుపుతూ పేరొందిన మహిళలు కూడా ఉన్నారు. ముఖ్యంగా చెన్నైలో సీనియర్ ఫొటోగ్రాఫర్‌గా పేరు గడించిన నవనీతం అక్కడ పంధొమ్మిదివందల తొంభైఒకటి నుంచి రెయిన్‌బో ఫొటోస్టూడియో నడుపుతోంది. కాలక్రమంలో ఫొటోగ్రఫీలో వచ్చిన మార్పులను సైతం కొడుకు వద్ద నేర్చుకుంది. అతడు వివాహలను షూట్ చేసి వస్తే, ఆమె స్టూడియోలో పని చూసేది. దురదృష్టవశాత్తు కొడుకు ప్రమాదంలో మరణించినా ఆమె మాత్రం ఫొటోగ్రఫీ పట్ల అంకిత భావంతో స్టూడియో నడుపుతూనే ఉంది. ఒకప్పుడు రోల్ కెమెరాలో ఫొటోలు తీసి, ఫిల్మ్‌ను కడిగి, తర్వాత ప్రింట్ తీయడం జరిగితే, ఇప్పుడు డిజిటల్ కెమెరా వచ్చాక, ఫొటో తీశాక ప్రింట్ చేసే ముందు ఎడిట్ చేస్తున్నాం అంటుందామె. ఇలా ఫొటోగ్రఫీ వృత్తిలో రాణిస్తున్న మహిళలు చాలామందే ఉన్నారు’ చెప్పింది.

మా జాతి ఇంత మందికి ఉపాధికి ఆధారం కావడం వింటూ గర్విస్తుండగా, ‘నిజమే. విభిన్న రంగాలకు చెందిన వివిధ అంశాలపై వీడియోల ద్వారా యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది’ జ్యోతి చెపుతుండగా ‘ఆ మాటకొస్తే మూవీ కెమెరా మూలంగానే కదా సినిమా పరిశ్రమ ఇంతింతై వటుడింతై అన్నట్లు అభివృద్ధి చెంది ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమందికి ఆదాయ వనరుగా మారింది’ అన్నాడు తాతయ్య. ‘అవును నాన్నా, ఆ మధ్య నేను ఇంకో విషయం విన్నాను. వారణాసిలో ‘డెత్ ఫొటోగ్రాఫర్స్’ పేరుతో ఓ గ్రూపు ఉందిట. అంత్యక్రియలకు ముందు చనిపోయిన వ్యక్తికి చివరి సారిగా ఫొటో తీయడమే వారి పని’ చెప్పింది జ్యోతి. ‘అవునా!’ అన్నారంతా.

అంతలో తాతయ్య అందుకుని ‘అమెరికా లోని రోచెస్టర్‌లో పురాతన ఫొటోగ్రఫీ మ్యూజియం ఒకటి ఉంది. దాని పేరు ‘జార్జ్ ఈస్ట్‌మన్ మ్యూజియం’. అందులో ఫొటోగ్రఫీకి సంబంధించి కొన్ని మిలియన్ల వస్తువులను సేకరించి, భద్రపరిచారు. అన్నట్లు మనదేశంలో కూడా గుర్గావ్‌లో ఆగ్నేయ ఆసియాలోనే పెద్ద ఫొటోగ్రఫీ కేంద్రాలలో ఒకటైన ‘మ్యూజియో కెమెరా’ ఉంది. ఇది చాలా పెద్దది. ఫొటోగ్రఫీకి సంబంధించి ఆర్ట్, సైన్స్, హిస్టరీ విభాగాలు ఇక్కడ ఉన్నాయి. విస్తృత ఫొటోగ్రఫీ సాధనాలతో పాటు నాలుగు వేల కెమెరాలు ప్రదర్శనలో ఉన్నాయి. పద్ధెనిమిది వందల యాభై నాటివి, అప్పటి ఫొటోగ్రఫీ ప్రముఖుల కృషి వివరాలు కూడా ఇక్కడ చూడవచ్చు’ చెప్పాడు. మా జాతివారు నాలుగు వేలమంది అక్కడ కొలువవటం నాకెంతో తీయగా వినిపించింది. ‘వినడానికే ఎంతో ఆసక్తిగా ఉంది, ఇంక చూస్తే ఎంత బాగుంటుందో’ అంది జ్యోతి.

‘నిజమే. ఇక ఆధునిక కాలంలో వచ్చిన మార్పులను గమనిస్తే, ఇప్పుడు చాలా కార్యాలయాలలో ఐరిస్ కెమెరాల వాడకం ఎక్కువైంది. ఇది ఒక వ్యక్తికి చెందిన ఐరిస్ (కనుపాపలను) గుర్తించే బయో మెట్రిక్ కెమెరా’ విశ్వం చెపుతుండగానే ‘బయో మెట్రిక్’ అంటే అడిగింది రూబీ. ‘ఒక వ్యక్తి లేదా జీవికి సంబంధించిన కొన్ని ప్రత్యేక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వారిని, వాటిని గుర్తించడమే బయో మెట్రిక్ విధానం’ చెప్పాడు విశ్వం.

‘నాన్నా! డ్రోన్ కెమెరాలు కూడా వచ్చాయిగా.. పైనే తిరుగుతుంటాయి కదా. వీటివల్ల ప్రత్యేక ఉపయోగాలున్నాయా’ అడిగాడు బబ్లూ. ‘డ్రోన్ కెమెరా అంటే గాల్లో తిరిగే చిన్న వాహనంపై ఉండే కెమెరా. ఇది ఏరియల్ ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సర్వేయింగ్, అన్వేషణ, సహాయక చర్యలకు తోడ్పడుతుంది. డ్రోన్ కెమెరాను రిమోట్‌తో కంట్రోల్ చేస్తారు. అవసరానికి తగ్గట్లుగా అందులో అనువైన కెమెరాను అమరుస్తారు. ఇక మనం శాటిలైట్ కెమెరాల గురించి కూడా చెప్పుకోవాలి. అవి విస్తారమైన సేవలందిస్తున్నాయి. భూమి ఎక్కడ, ఏ తీరుగా ఉందో స్పష్టంగా చూపించి, పంట వైఫల్యాలను, కరువు పరిస్థితులను ముందే తెలియజెప్పి, జాగ్రత్త పడేందుకు తోడ్పడుతున్నాయి. జనసాంద్రత, నగరాల విస్తరణ, మురికివాడలు మొదలైన అంశాలన్నీ కూడా శాటిలైట్ కెమెరాలు అందించే ఫొటోల వల్ల తెలుసుకోవచ్చు. ఏవైనా దేశాలు ప్రకటించకుండా ఏర్పాటు చేసిన అణువిద్యుత్ ప్లాంట్లను గుర్తించడానికి, తగలబడే అటవీ ప్రాంతాలను గుర్తించడానికి, సైనిక కదలికలను ట్రాక్ చేయడానికి శాటిలైట్ కెమెరాలు తోడ్పడుతున్నాయి’ వివరించాడు విశ్వం.

అంతా వింటుంటే మా జాతి ఎంత బృహత్తరమైందో అనిపించింది. మా నేస్తాలు కూడా అదే భావం వ్యక్తపరుస్తుండగా, ‘ఈ ఆధునిక కాలంలో కెమెరాలు చేసే సేవలు కోకొల్లలు అనిపిస్తుంది. అయితే కెమెరాను దుర్వినియోగం చేసి, అశ్లీలపు ఫొటోలు, వీడియోలు తీసి నేరాలకు పాల్పడటం, ఇతరుల జీవితాలను నాశనం చేయడం, ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలతో ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయో నిత్యం చూస్తూనే ఉన్నాం. ఆ విషయం అటుంచితే కెమెరా ఎన్ని రకాల సేవలందిస్తున్నా ప్రధానమైంది మాత్రం బాల్యాన్ని, విద్యార్థి జీవితాన్ని, ఆ తర్వాత జీవితంలోని మధుర ఘట్టాలను ఫొటోలుగా, వీడియోలుగా మనకందించి, మధురానుభూతుల్ని సాదించడం. ఒకసారి ఆల్బమ్‌లు తెరిచి పట్టుకుంటే, జీవితం మొత్తం సినిమా రీలులా తిరిగి మనసు గతంలో ఊరేగుతుంది’ అంది సుచిత్ర. అంతా ‘అవునవును’ అన్నారు.

‘దేవీ! త్వరగా వంట కానిచ్చేయ్. రాత్రికి జ్యోతి పెళ్లి వీడియో చూద్దాం. బావగారి కాశీ యాత్ర ప్రహసనం చూసి కాసేపు నవ్వుకోవచ్చు’ అన్నాడు విశ్వం. ‘అలాగా.. మరి నీ పెళ్లి వీడియో చూడొద్దా. మూడు ముళ్లు వేయమంటే అరే.. రెండు వేశానో, మూడు వేశానో గుర్తులేదు, ఎందుకయినా మంచిది ఇంకో ముడి వేస్తాననడం, వదిన వచ్చే నవ్వునాపుకోవటం, బ్రహ్మగారు కోప్పడడం.. మళ్లీ చూడొద్దా’ అంది జ్యోతి. అది విని అంతా నవ్వారు. విశ్వం కూడా నవ్వేశాడు. ‘అయితే తప్పక చూడాల్సిందే’ బబ్లూ అంటుంటే, తప్పించుకోవడానికన్నట్లు మొబైల్ పట్టుకు అక్కడినుంచి లేచాడు విశ్వం.

టిఫిన్ ఏర్పాట్లకు శ్రీదేవి, జ్యోతి వంటింట్లోకి నడిచారు. ఆనందరావు వీధిలోకి నడిస్తే, ఆరిన బట్టలు తేవడానికి సుచిత్ర పైకి వెళ్లింది. పిల్లలు కూడా ఆమె వెంట నడిచారు. నేను మాత్రం ఇంకా మా జాతి గురించి ఆలోచిస్తూనే ఉన్నా. కాలంతో పాటు అన్నిటిలాగే మా జాతిలోనూ అనేక మార్పులొస్తున్నాయి. సుచిత్ర చెప్పినట్లు తిరిగి రాని బాల్యాన్ని, జీవితంలో ముఖ్యఘట్టాలను, మధుర ఘట్టాలను మనిషికందించడం మాకూ ఎంతో ఆనందాన్నిస్తుంది. అలాగే ఆధునిక కాలంలో మా విస్తృత సేవలు మాకు గర్వకారణం. కానీ మా సేవల్ని దుర్వినియోగం చేసుకొని, అవినీతికి, అన్యాయాలకు పాల్పడడం ఎంతైనా బాధాకరం. నకిలీ ఫొటోలు, వీడియోలతో జీవితాలతో చెలగాటమాడటం ఎంత హేయం! మా జాతిని దుశ్చర్యలకు వాడవద్దని ఓ మాట చెప్పాలనుంది.. అనుకుంటుంటే ఆనందరావు తిరిగి వచ్చాడు.

‘బీరువాలో నుంచి తీసిన కెమెరాలు, ఆల్బమ్‍లు మళ్లీ లోపల సర్దేయండి’ సుచిత్ర లోపల్నుంచే గట్టిగా చెప్పింది. ‘సరేలే’ ఆనందరావు అంటుండగా, ‘తాతయ్యా! వీటికి ఫొటో తీస్తానుండు’ అంటూ బబ్లూ, తన మొబైల్‌తో ఫొటో తీస్తున్నాడు. ‘ఫొటో సాధనాలమైన మాకు ఫొటో..’ ఆశ్చర్యంలో ఉండగానే మొబైల్ కెమెరా నాకేసి కన్నుగీటింది.

‘చిత్ర’మైన అనుభూతిలో నేను..

***

నా మాట

‘అన్నింట అంతరాత్మ’ శీర్షికన ఇప్పటి వరకు యాభై విభిన్న అంతరంగ అక్షరచిత్రాలను మీ ముందుంచాను. ఈ శీర్షికలో కేవలం ఆ వస్తువుల సేవలను, కొత్త పోకడలను మాత్రమే గాక, వాటిని సాధనంగా చేసుకొని, మనిషి కుత్సితాలకు పాల్పడకూడదని.. ఆయా వస్తువులే మనవి చేసుకుంటున్నట్లు సందేశం కూడా అందించాను. ఎందుకంటే సాహిత్యంలో ‘హితం’ ఉంటే దానికి మరింత సార్థకత. నిర్జీవ వస్తువుల్లోకి పరకాయ ప్రవేశం చేసి, వాటి అంతరాత్మను అక్షరీకరించడంలో కృతకృత్యురాలి నయ్యాననే నా భావన.

కొత్త సంవత్సరం.. శోభకృత్‌లో సరికొత్త రచనలకు శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ఈ కాలమ్‌ను ఇక్కడితో ముగిస్తున్నాను. నా కాలమ్‌ను ఆదరించిన ‘సంచిక’ పాఠకులందరికీ నా వినమ్ర నమస్సులు. రచయిత, మనసుకు నచ్చింది రాసేందుకు అవకాశం.. స్వేచ్ఛ ఇచ్చే సలక్షణ సాహిత్య పత్రిక ‘సంచిక’ వారికి బహు ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here