అంతకు మించిన వాడు

0
8

[dropcap]“ఇ[/dropcap]స్తానండి ఇస్తాను. మీ ఐదొందల కోసం విజయమాల్యాలా విదేశాలకి పారిపోతానా ఏవిటి” అడిగాడు గిరి.

దాంతో అవతలివారు విసుగ్గా ఫోన్‌ కట్‌ చేశారు. దాంతో, “హమ్మయ్య ఐదొందలు మిగిలింది” అనుకున్నాడు తనలో తనే మురిసిపోతూ.

అప్పుడే వచ్చిన లలిత ఈ తతంగం అంతా విని, “ఏవిటండీ ఈ దరిద్రం. అందరి దగ్గరా రెండొందలూ, మూడొందలూ, ఐదొందలూ అంటూ అడిగి తీసుకోవడం, ఆనక ఎగ్గొట్టడం. పాపం బీద, బిక్కి అని కూడా చూడకుండా అందరి దగ్గరా ఇదే తంతు, ఛీ.ఛీ. అయినా ఎవరైనా వచ్చి మిమ్మల్ని నాలుగు తంతే తెలుస్తుంది. అయినా మీకు ఎందుకండీ ఈ దరిద్రపుగొట్టు కక్కుర్తి బుద్ధి” రుస రుసలాడింది లలిత.

“అలా అనకు, దీనికి బోలెడు ఆలోచనలు అనుసరిస్తాన్నేను. నువ్వన్నట్టు ఇప్పటివరకూ అలా జరగలేదూ, ఇక జరగదు కూడా. ఎందుకంటే, బాగా తెలిసిన వారూ, కావాల్సిన వారిని అడగను. కేవలం కొత్తగా పరిచయం చేసుకున్న వాళ్ళ దగ్గర నుండి మాత్రమే అడిగి తీసుకుంటాను. మా అయితే వాళ్ళు తిట్టుకుంటారు, తర్వాత వదిలేస్తారు. ఆ మాత్రం డబ్బుకి ఎవరూ పోలీస్‌ కంప్లయింట్‌ ఇవ్వరు. ఇలా ఇదో ఆదాయ మార్గం నాకు. ఈ డబ్బుతోనే నా చిన్నా, చితకా జల్సాలూ గడుస్తున్నాయి మరి” చెప్పాడు తేలిగ్గా నవ్వుతూ.

“చాల్లే ఆపండి. రోడ్డున పోయే వారిని పరిచయం చేసుకోవడం, బాగా మాట్లాడడం, ఆ తర్వాత ఒకట్రెండు మార్లు చిన్న మొత్తంలో డబ్బు అడగడం. వారు డబ్బు ఇవ్వగానే తీసుకుని, మళ్ళీ వారు అడిగినప్పుడు మీరు మొహం చాటేయడం. తర్వాత ఒక కథ చెప్పేయడం. మొదట్లో వారు కసితో రగిలిపోయినా, ఆ తర్వాత విసిగిపోయి పోతే పోనీ అని వాళ్ల డబ్బు వదులుకోవడం. కొందరు తెలివైన వాళ్ళు మిమ్మల్ని పూర్తిగా వదిలేయడం. ఎందుకండీ మీ పబ్బం కోసం వాళ్ళని కప్పల్ని చేయడం” చిరాకు పడిoదామె.

“అలా అనకు. ఎదుటివారిని బోల్తా కొట్టించి డబ్బులు అడగడం నాకో సరదా. అయినా గొర్రెలు మోసపోతూనే ఉంటాయి. వాళ్ళకి ఉండాలి బుద్ధి, కొత్తగా పరిచయమైన వాడు అవీ ఇవీ చెప్పి, నాలుగు మాటలు బాగా మాట్లాడి డబ్బు అడిగితే ఇవ్వడం ఏమిటి హి హి హి” నవ్వాడు.

“సర్లేండి. ఇది మనకి రోజూ ఉండే తంతేగా. ముందు రైతు బజార్‌కి వెళ్ళి కూరగాయలు పట్టుకు రండి” అని చెప్పడంతో, బండి స్టార్ట్‌ చేసి బయల్దేరాడు. దారిలో ఒకతను “లిఫ్టు ప్లీజ్” అంటూ బొటనవేలు చూపాడు. అతన్ని చూస్తూనే గిరిలో ఏదో సంతోషం, తెలియని ఆనందం కలిగాయి. “గాలం వేయిబోయిన చేపే ఒడ్డుకొచ్చి పడ్డట్టు, వీడేంటి నన్నే లిప్టు అడుగుతున్నాడు. హమ్మయ్య, ఎవరో గొర్రె” అని మనసులో అనుకుని, అతనికి దగ్గరగా బండి ఆపి, “ఎక్కండి” అన్నాడు చిరునవ్వుతో.

అతను “థాంక్స్‌ సార్‌” అంటూ బండి ఎక్కాడు. ఇందాక అతని ఐడి కార్డు చూడ్డంతో, అతను మార్బుల్స్‌ కంపెనీలో పని చేస్తున్నట్టుగా తెలిసింది. మధు, ఎంప్లాయ్‌ ఐడి నూటపదిహేడు అని కూడా ఉంది. మాట కలపడానికన్నట్టు, “మీరా మార్బుల్స్‌ కంపెనీలో పని చేస్తారా” అడిగాడు గిరి.

“అవునండీ” చెప్పాడతను.

“మా బాబాయి ఇల్లు కట్టబోతున్నాడు. మార్బుల్స్‌ మీ దగ్గర తీసుకుంటే సరిపోతుందేమో. మీకు కూడా ఉపయోగం ఉండొచ్చు” చెప్పాడు గిరి.

ఆ మాటకి మధు, “అవును సార్‌ మీరు తీసుకుంటే నాకు కూడా కొంత కమిషన్‌ ఇస్తారు. తీసుకోండి సార్‌” చెప్పాడు ఆశగా.

“సరే అయితే నా ఫోన్‌ నెంబర్‌ తీసుకోండి” అని అతనికి తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు గిరి.

“కొంతసేపటికి ఇక్కడ ఆపండి, ఇదే మా ఇల్లు” చెప్పాడు మధు.

గిరి బండాపి,కొంచెం మొహమాటంగా, “పరిచయమవ్వగానే డబ్బడుగుతున్నాననుకోకపోతే, ఓ రెండు వందలు ఇవ్వగలుగుతారా? నేను వచ్చేటప్పుడు డబ్బు పర్సులోనే పెట్టాను. ఆ పర్సు ఫ్యాంటులోనే పెట్టాను. కానీ తొందరలో మరిచిపోయి వేరే ఫ్యాంటు వేసుకొచ్చేసాను.అందుకని” నసిగాడు.

“దానిదేముంది సార్‌” అంటూ రెండు వందలు ఇచ్చి వెళ్ళిపోయాడు మధు.

తర్వాత గిరి, అప్పుడప్పుడు మధుని డ్రాప్‌ చేయడం, ఇరవై, యాభై, అడిగి తీసుకోవడం. మధు, “మార్బుల్స్‌ ఎప్పుడు కొంటారు సార్‌” అని అమాయకంగా అడగడం పరిపాటి అయిపోయింది.

మరో రోజు కూడా గిరి మధుని కలిసి “రండి నేను డ్రాప్‌ చేస్తా” అన్నాడు.

“వద్దు సార్‌ నేను ఆటోలో వెళ్తాను” చెప్పాడు మధు నేల చూపులు చూస్తూ.

‘కొంపదీసి నా గురించి గానీ తెలిసిపోయిందా’ అని మనసులో అనుకొని, “ఏమిటి నా మీద కోపమా” అడిగాడు గిరి.

“అబ్బే అదేం లేదండి. నేను ఇంకో చోటికి వెళ్ళాలి, అంతే” చెప్పాడు మధు

“సరే ఆ ఆటో డబ్బులేవో నాకే ఇవ్వండి. నేనే దించేస్తాను” అని మధుని ఎక్కించుకున్నాడు. ఒక షాపు ముందు ఆపి, “ఉండండి ఇప్పుడే వస్తాను” అని మధు వెళ్ళి ఆ షాప్‌ ఓనర్‌తో మాట్లాడుతున్నాడు. చాలాసేపు అయింది. ఏదో వాగ్వాదంలా ఉంది. గిరి కూడా వెళ్ళి విషయం అడిగాడు.

“ఇతను నాకు పాతిక వేలు ఇవ్వాలి. అప్పుడు, ఇప్పుడు అంటూ ఎప్పటినుండో చెప్పుకొస్తున్నాడు. అప్పిచ్చేప్పుడే ఆలస్యం అవుతుందనే ముక్క చెప్పుంటే, నేనిప్పుడిలా గొంతు చించుకునేవాడ్ని కాదు. అప్పు తీసుకున్నప్పుడు మురిసిపోయి, ఇప్పుడు తిరకాసుగా మాట్లాడ్డం ఎంతవరకూ సబబు. అప్పివ్వడం నా తప్పా, అదే నా పాలిట ముప్పా? ఈ పప్పు ఇక నేనిక ఉడకనివ్వను. ఎప్పటినుండో ఈ ముక్కే తిప్పి తిప్పి చెప్పి, వడ్డీ మాత్రమే కడుతున్నాడు. అసలు ఎలాగైనా ఇప్పుడు కట్టాల్సిందే” చెప్పాడతను.

“ఇప్పటికి ఇప్పుడు అంటే ఎలా? ఇంటికెళ్ళి తేవాలి కదా” చెప్పాడు మధు, బేలగా మొహం పెట్టి.

“అవును ఇంటికి వెళ్ళి తేవాలి కదా” వంతపాడాడు గిరి.

“ఓహో! అలా అయితే అవి మీరే కట్టండి అతను మీకు మంచి దోస్తులా కనిపిస్తున్నాడు” అన్నాడతను .

గుండెల్లో రాయి పడిoది గిరికి. “అబ్బే ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులేదుగా” చెప్పాడు.

“అయితే ఇప్పుడే మీ దోస్తు మధుని ఇంటికెళ్ళి డబ్బు తీసుకురమ్మను. మీ దోస్త్‌ డబ్బు తెచ్చేవరకూ నువ్వు ఇక్కడే ఉండు” చెప్పాడు ఆ వ్యక్తి. గిరి గుండెల్లో మళ్లీ రాయి పడిoది. మధు కూడా గిరి వంక దీనంగా చూశాడు. దాంతో తప్పదన్నట్టు, “ఒక్క నిమిషం” అని పక్కకెళ్ళి నెట్‌లో బెస్ట్‌ మార్బుల్స్‌ నెంబర్‌ చూసి డయల్‌ చేశాడు. ఎత్తగానే, “మేడం మీ కంపెనీలో మధు అనే ఎంప్లాయి, ఐడి నెంబరు నూటపదిహేడుతో ఎవరైనా పని చేస్తున్నారా” అని అడిగాడు.

ఆమె ఒక నిమిషం వెతికి, “అవును సార్‌ పని చేస్తున్నారు గత ఐదేళ్లుగా” చెప్పిందామె.

హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని మధు దగ్గరికి వచ్చి, “నేను నిన్ను నమ్ముతాను మధు, నువ్వు నా బండి మీద మీ ఇంటికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చి అతని మొహం మీద” అని క్షణం ఆలోచించి “వద్దు రొటీన్‌, అతని వీపు మీద కొట్టు. వెరైటీగా ఉంటుంది. అలాగే నాకోసం కూడా ఓ రెండువందలు పట్టుకొచ్చి నా జేబులో పెట్టు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది” చెప్పాడు గిరి నేల చూపులు చూస్తూ.

“సరే” అని మధు కాస్త దిగులుగా వెళ్ళాడు. కానీ తిరిగి రాలేదు. గిరి, చాలా సేపు వేచి చూసి చూసి చూశాక ఫోన్‌ చేసాడు. రింగ్‌ వినిపించింది. అరె ఫోన్‌ ఇక్కడే మరిచిపోయాడు. ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి మాటలూ, తిట్లూ భరించలేక, ఆ డబ్బు తన కార్డుతో అతనికి చెల్లించి బయట పడ్డాడు. మరుసటి రోజు అతని ఇంటికి వెళితే అలాంటివాళ్ళు లేరని చెప్పారు. ఆ తరువాత, మార్బుల్‌ కంపెనీ కి వెళ్ళాడు. మధుని కలవాలి అనుకుంటున్నట్టుగా రిసెప్షెన్‌లో చెప్తే, వారు అతని క్యాబిన్‌ నెంబర్‌ చెప్పారు. దాంతో గిరి, హమ్మయ్య అని కాస్త కుదుట పడి ఆ క్యాబిన్‌ లోకి వెళ్ళి “మధు” అని పిలిచాడు.

“చెప్పండి” అన్నాడు ఓ వ్యక్తి.

గిరి నెత్తి మీద బండ పడినట్టయింది. అతని మెడలో కూడా మధు,నూటపదిహేడు ఐడి నెంబర్‌ అని ఉంది. మధుకి అతని మోసం అర్థమైంది. కానీ అప్పటికే తన బండీ,పాతిక వేలూ పోయింది. “తాడిని తన్నే వాడి తల తన్నే వాడు వీడేనన్నమాట” అని అనుకుంటుండగానే, తన తల తిరిగినంత పనైంది. బిక్క చచ్చి, ఆ తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here