అంతరాల ఈ తరం మార్పు

0
6

[dropcap]సూ[/dropcap]ర్యోదయాన్నే వేడి వేడి కాఫీ తాగాలి, సొంత ఊరులో అయితే నాల్గు గంటలకి పాలు పితికి వస్తాయి. మొదట ఇంట్లో రెండు లీటర్స్ వేరే పెట్టి, కాచి మిగతావి పాల కేంద్రానికి పంపుతుంది వెంకట లక్ష్మి. ఎక్కడి వాళ్ళకి అక్కడే బాగుంటుంది, వ్యాపకాలు ఉంటాయి. తెలుసున్న మనుష్యులు ఉంటారు. కబుర్లు, క్షేమ సమాచారాలు, అందాలు ఆనందాలు ఉంటాయి. జీవితం సమాజ హితంగా ఉండాలి, మితంగా ఉండాలి. అందరి మెప్పు కావాలి అంటే ఎంతో ఓర్పు నేర్పు కావాలి. అవన్నీ చక్కగా వెంకట లక్ష్మికి ఉన్నాయి. భర్తకి పొలం ఇల్లు ఉన్నది. చిన్న రెల్లు గడ్డి పాక వేసుకుని ఉంటాడు. అందులో ఓ పడక్కుర్చీ, మంచినీళ్ళ కూజా చాప ఉంటాయి. ఏవో పేపర్స్ కొన్ని కొబ్బరి బొండాలు ఉంటాయి. మజ్జిగ సీసా ఉంటుంది. ఇది అతని జీవన శైలి.

వెంకట లక్ష్మి ఇంట్లో మంచి మర్యాద, వచ్చిన వాళ్ళకి ఏదో పండు కూర మజ్జిగ పచ్చడి ఇచ్చి పంపే అలవాటు ఉంది. ఇప్పుడు కూతురి ఇంట్లో కూర్చుని ఉండాలి అంటే కాలం గడవదు. అలాగని ఏ పని చేసినా “వద్దు నీ కెందుకు కూర్చో” అని కూతురు అంటుంది. అల్లుడు, మనుమరాలు కూడా అదే అంటారు. అందుకే బాల్కనీలో ఊగే ఉయ్యాల కుర్చీలో కూర్చొని రోడ్డుపై వెళ్లే వాళ్ళని పరిశీలిస్తూ ఉంటుంది.

వాళ్ళ తరంలో ఎవరిని చేస్తే వారిని చేసుకోవాలి. వేలు విడిచిన మేనమామ అంటూ ఎస్.ఎల్.సి. కూడా పూర్తి చెయ్యని వాడిని ఏదో పన్నెండు ఎకరాలు ఉన్నాయని పెళ్లి చేశారు. అప్పటికే తను సంగీతం డిప్లొమా, హిందీ ఎమ్.ఏ. చదివింది. పెద్దలు నిర్ణయించిన పెళ్లి. ఐదు రోజుల ఎంతో వైభోగంగా చేశారు. పది రోజులు ఉండి పెళ్లి వారు వెళ్లారు.

పెసరట్టు, ఉప్మా, పూరీ, చపాతీ, గారె ఉండాలి. ఘనంగా జరిగింది కానీ జీవితంలో సంతృప్తి లేదు. కేవలం అతని గొడవ అతనిది, చివరకి తను డైరీ ఫామ్ వ్యాపారం పెట్టింది.

కచ్చేరీలు వద్దు, వేదిక లెక్కి చెయ్యనవసరం లేదు అంటూ ఎన్నో ఆంక్షలు. అందుకే గోసేవ. నాలుగు గేదెలు పెట్టి, పెరుగు పాలు సమృద్దిగా ఇంటిలో ఉంచింది. ఇది తన జీవితము. కూతురిని ఆమె ఇష్టానికి పెంచింది, పెళ్లి అమె ఇష్టమే. అలాగే మనుమ రాలు పెళ్లి అమె ఇష్టము.

మగ పిల్లలది పెళ్లి అయ్యే వరకే ప్రేమ. ఆ తరువాత అత్త ఇంటిలో తల్లి అక్క చెల్లెళ్ళ ఇష్టము. అందుకే నేడు పెళ్ళిళ్ళు, ఆ తరువాత జీవితాల్లో ఎన్నో సజావుగా ఉండటం లేదు.

ముందు చూపిన ప్రేమ కంటే ఆనాటి ప్రేమ కంటే పెళ్లి తరువాత ప్రేమ ముఖ్యమని యువత పెద్దలు కూడా తెలుసుకోవాలి.. వెంకట లక్ష్మి అన్ని మార్పులు చూస్తూ మౌనంగా ఉన్నది.

కానీ ఇప్పుడు మనవరాలి పెళ్లి చూపులకి విజయవాడ వచ్చింది. కూతురు రూప బాగానే స్థిరపడింది. తను బ్యాంక్ ఉద్యోగి, అల్లుడు సుబ్రహ్మణ్య రావు రేడియో ఉద్యోగి. కూతురు శ్రావణిని డాక్టర్ చదివించారు. ఊళ్ళోనే కాన్వెంట్‌కి వెళ్లినట్లు కాలేజి వెళ్ళింది శ్రావణి. హాయిగా మెడిసిన్ అయింది. అయితే పిజి అంటూ మొదలు పెట్టింది

“ఇప్పుడు కాదు, పెళ్లి తరువాత నువ్వు ఏ దేశం వెళ్లి ఉంటావో తెలియదు. అక్కడ చదువుకు తగ్గట్లు కోర్సులు చెయ్యాలి. ఇప్పుడు పిజి చేసినా అక్కడ వేరే చెయ్యాలి. ఈ చదువుకి విలువ ఉండదు అక్కడి కోర్సులు చదవాలి” అంది కూతురు.

కానీ శ్రావణి “నేను విదేశీ సంబంధం చేసుకోను, ఇండియాలో ఉంటాను. విదేశాలు చూడాలని ఉంటే వెళ్లి చూసి వస్తాం” అంది

తన కూతురు మనసులో ఏముందో తెలిసి కోవాలనే ఉద్దేశ్యంతో రూప అలా అంది. “సరే అయితే ఇండియాలో చూడమంటావా?” అంది మళ్ళీ.

“ఆహా! ముందు విజయవాడలో చూస్తే సరి” అన్నది శ్రావణి.

“ఎవరినైనా ప్రేమించావా, చెప్పు వాళ్ళనే అడుగుతాము. మళ్లీ అన్ని ఇళ్లు చూడట మెందుకు? మాకు శ్రమ తప్పుతుంది, నీకు ఆనందం ఉంటుంది” అన్నది రూప.

“అబ్బే అదేమీ కాదు. ఎందుకంటే ఇక్కడే చాలా మంది డాక్టర్ చదివిన కుర్రాళ్ళు ఉన్నారు కదా, అందులో మీకు నచ్చింది చెపితే నేను చూస్తాను” అంది శ్రావణి.

“అబ్బా ఎంత తెలివి? మేము చూస్తే నువ్వు చెపుతావా!!” అంటూ, “అది కాదు. నువ్వు చూసుకుని చెప్పు. మేము వెళ్లి అడిగి వస్తాం” అంది.

అలా తల్లి రూప, తండ్రి సుబ్రహ్మణ్య రావు ఇద్దరూ కూతురికి పెళ్లి సంబంధం విషయం ఆమెకే వదిలి పెట్టారు.

కూతురు తెలివి వారికి తెలుసు. ఎవరి మనసు నొప్పించకుండా ఉంటుంది. జీవితంలో పెళ్లి ముఖ్యం. ఏ వయసుకు కళ్యాణ తార వస్తే అప్పుడు అవుతుంది. అందుకే ఇప్పటినుంచి చూస్తే ఆ వరుడి వేట ఎప్పటికీ పూర్తి అవుతుంది అన్నది చెప్పలేరు. అంతా వరకు చదువు కోసం డబ్బు ఖర్చు లేదా ఉద్యోగంలో సంపాదన. ఇది జీవితము అందుకే పెళ్ళిళ్ళు ఆలస్యం. కుదరక కొందరు; నచ్చక మరీ కొందరు.

అబ్బాయిలు పెళ్లికి ఉన్నారు అంటారు, కానీ ఒక్క సంబంధం సరిగా ఉండదు. ఏదో సరి పెట్టుకుని పెళ్లి చెయ్యాలి మరి, తప్పదు. జీవితంలో పెళ్లి పెద్దలు కుదిర్చనదో, ఒప్పించుకునో చెయ్యాలి. అందరికి వంకలు పెడితే ఎలా? అని పెద్దలు అభిప్రాయం. కానీ నేటికీ అత్తింటి ఆడపిల్ల ఎలా ఉంది అని తల్లి తండ్రి తలవని రోజు ఉండదు. అది వాళ్ళ అభిమానం, ప్రేమ. పుట్టింటి ప్రేమ జీవిత కాల శాశ్వతం.

అయితే తల్లి తండ్రి బాధ్యతగా పెంచి పెళ్లి చెయ్యాలి. ఇది మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాల విలువ.

ఆరోజు రాత్రి ఆఫీస్ నుంచి ఇద్దరు వచ్చాక వంట అంతా కూతురుకి అప్పచెప్పింది. ‘సరే అది వండి పెడుతుంది. మా ఫ్రెండ్ రమ్మన్నాడు, అక్కడే కూరల మార్కెట్ ఉన్నది. అన్ని చూసుకుని వద్దాం, వాళ్ళింటికి వెళ్లి వద్దాము’ అని బయలు దేరారు.

శ్రావణి వంట ప్రయత్నంలో బిజీగా ఉన్నది.

సరే ఇద్దరు కలిసి కార్లో వెడుతూ ‘పిల్ల ఎవరినో ప్రేమించింది, అలా చెప్పకుండా ఇలా వంకరగా డొంకతిరుగుడు మాటలు చెప్తోంది’ అనుకుంటూ కార్ నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ వెళ్లారు

కూరల పళ్ళ మార్కెట్‌కు రెండిటికీ వెళ్లి వారానికి సరిపడా అన్ని కొన్నారు. ఇంకా స్వీట్స్ కూడా కొన్నారు. ఏవో కొన్ని జాకెట్ ముక్కలు, గిఫ్ట్స్ కూడా కొని ఉంచారు. కారు తీసి బయటకు వెడితే ఎన్నో కొంటారు. ఈజీగా ఐదు వేలు ఖర్చు అవుతుంది. మనం సుఖంగా ఉండాలి, మంచి ఆహారం తినాలి. ఎప్పుడు ఫ్రిజ్‌లో అన్ని రకాలు పెడతారు. చివరకు అప్పడాల పిండి కూడా కొని ఉంచుతారు. ఫ్రూట్ జ్యూస్‍,లు జామ్‍లు అన్ని ఉంటాయి. పళ్ళు సంగతి సరే సరి, ఏ కాలానికి ఆ కాలం పళ్ళు కొని ఉంచి తినాలి.

ఓ రెండు గంటలు పట్టింది. అన్ని దూరమే. కేజీ వంకాయలు కొనాలన్నా ఏదో ఒక వాహనం బయటకు తీసి వెళ్ళాలి.

‘సరే ఇంక ఇంటికి వెడదాము’ అనుకుని దారిలో పచ్చి మిరప బజ్జీలు, జిలేబి రాజస్తాన్‌వి కొని బయలుదేరారు.

చెరుకుముక్కల పాయసం, కొబ్బరి నీరు పాయసం, ముంజీ కళ్ళు హల్వా, బుర్ర గుంజు హల్వా ఇవన్నీ కూడా చేసి వెంకట లక్ష్మి తెచ్చి కూతురుకి, మనుమరాలికి ఇచ్చింది. అల్లుడు నవ్వుకుంటాడు, పల్లెటూరు వంటలు అంటాడు.

ఇంటికి వచ్చి సరుకులు అన్ని ఒక ప్రక్కన పెట్టారు. కూరలు పళ్ళు కడిగి ఆరబెట్టి ఫ్రిజ్‌లో పెడతారు. ఎప్పుడూ అదే అలవాటు. బయటికి వెడితే వారు తప్పని సరిగా మిరప బజ్జీలు, వడలు తెస్తారు. అన్నంలో తినడం అలవాటు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో బయటి నుంచి తెచ్చి తినే అలవాటు ఉన్నది. “మా అమ్మ వస్తే పల్లె రకాలు, కొబ్బరి బొండాలు, అరటి గెల, తాటి కాయలు, తాటి పళ్ళు తెచ్చి వంటలు చేస్తుంది”అని మురిసి పోతుంది రూప. తల్లితండ్రులు అన్ని మార్కెట్ నుంచి తెస్తారు, ఓ షాపింగ్ మాల్ అంతా తెచ్చేస్తారు అంటుంది శ్రావణి.

“రండి రండి ఎన్నో తెచ్చారు. నేను వంట రెడీ చేశాను. భోజనం వడ్డిస్టాను అమ్మా” అంది శ్రావణి.

“ఏమి వండావు?” అన్నారు తల్లి తండ్రి.

“మంచి ఆహారమే కదా మంచి ఆరోగ్యము. సాంబారు చేసి మీల్‌మేకర్ టమోటా కూర వండా” చెప్పింది శ్రావణి.

‘సరే’ అంటూ “ఇదిగో బజ్జీలు జిలేబి తెచ్చాను. అవి కూడా డిష్‌లో పెట్టు” అంటూ పొట్లాలు అందించింధి రూప.

అంతా కలసి భోజనం చేశారు.

“ఇంకా మన డైనింగ్ టేబుల్ దగ్గర ఇంకో వ్యక్తి కావాలి, మన అమ్మాయి పక్కకి. ఆ అదృష్టవంతుడు ఎవరో?” అని కూతురు వంక చూసాడు సుబ్రహ్మణ్య రావు.

శ్రావణి నవ్వింది. “మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు కదా” అంది.

“నువ్వు చెప్పాలి. మేము రెడీ” అన్నారు.

ఎదిగిన ఆడపిల్లకి కోరిన భర్తను తెచ్చి ఇవ్వగలిగితేనే అదృష్టవంతులు అని చెప్పాలి.

“అవును, ఇది చెపితే వెంటనే పెళ్లి చెయ్యవచ్చును” అన్నది రూప.

‘అలాగే’ అంటూ శ్రావణి అమ్మానాన్నకి వడ్డన చేసి తను పెట్టుకున్నది. ఎదిగి వచ్చిన కూతురు, బాగా చదివి అన్ని తెలిసిన కూతురు ఉండటం వారు అదృష్టంగా భావిస్తారు.

ఆడపిల్లలు విద్యావంతులై, వారికి నచ్చిన వ్యక్తిని వివాహం ఆడటం కూడా ఒక్క మంచి విషయమే. ఎందుకంటే పెద్దలు చేసిన పెళ్ళిలో వీళ్ళు అలవాటు పడి ఉండే లోగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. అందుకే ఇదే బాగుంది.

“శ్రావణి నువ్వు చెప్పు” అన్నారు.

“నా ఫ్రెండ్ సుప్రజ అన్నయ్య కాశ్యప్ ఉన్నాడు. వాళ్ళకి నేను ఎంతో ఇష్టమని చెప్పారు. అదీ గాక సుప్రజ మంచి పిల్ల. ఇంట్లో ఆడపడుచుతో ఉండాలి కదా. ఇప్పుడిప్పుడే తను పెళ్లి చేసుకోదు, పిజి చేస్తుంది. ఆ తరువాత వాళ్ళ బావ సూరజ్‌ని పెళ్లి చేసుకుంటుది. ఇంకో సంబందం ఉంది. ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఆడపిల్లలు అంతా బాగా చదివి సెటిల్ అయ్యారు. కానీ వాళ్ళు చాలా చాదస్తంగా ఉంటారు. కట్నాలు కానుకలు అన్ని అడుగుతున్నారు వాళ్ళ ఆడపిల్లలు కూడా కొంచెం వెటకారం డాట్.కామ్ అనాలి. వినయ్ మంచి వాడే, కానీ అక్క చెల్లెళ్ళు చాలా గడసరి వారు. అది కాక వినయ్ విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది అని చెప్పాడు. అందుకు ఆలోచించాలి పెళ్లి అయ్యి అతను వెళ్లి, నన్ను రమ్మనమని చెపితే వెళ్ళాలి కదా. అక్కడ డబ్బు సంపాదనలో పడి జీవితం అంతా అక్కడే ఉండిపోవాలని అనిపించవచ్చు అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ రెండు ఉన్న ఊళ్ళోనే కదా, నాకు తల్లి తండ్రినీ చూడాలి అని కోరిక. మిమ్మల్ని వదిలి నేను విదేశాలకు వెళ్లి సంపాదించి వెనక్కు చూస్తే మిగిలేది ఏముంది? ఆప్యాయత అనురాగంతో పెరిగాను, వాటిని నేను తిరిగి మీకు అందించాలి అని నా కోరిక” అంది శ్రావణి.

కూతురు కోరికలో చాలా న్యాయం ఉంది, అందుకే మొదటి సంబంధం అందరికీ ఒకే అవడం వల్ల వీళ్ళు పెళ్లి చూపులకి రమ్మన్నారు.

“మాకు చూపులు ఎందుకు పిల్ల బాగా తెలుసు, ఏకంగా తాంబూలాలు పుచ్చుకోవడమే” అన్నారు వాళ్లు. ఆడపిల్లకి అది ఎంత అదృష్టము చెప్పండి?

అందుకే వెంకట లక్ష్మి మనుమరాలు నిశ్చితార్థానికి వచ్చింది. రాత్రి నిద్ర పట్టలేదు. కొత్త ప్రదేశం, అందుకే మూడు గంటలకే లేచి కూర్చుంది.

కూతుర్ని లేపడం ఎందుకని బాల్కనీ లోని కుర్చీలో కూర్చుంది. అప్పుడే పాల వాళ్ళు పేపర్ వాళ్ళు వచ్చేసి వెడుతున్న చప్పుళ్ళు వినిపిస్తున్నాయి

ఈలోగా శ్రావణి నిద్ర లేచి వచ్చి “అమ్మమ్మా, అప్పుడే లేచావా?” అంటూ భుజం చుట్టు చేతులు వేసి నిలబడింది.

“పెళ్లి వారు ఎలాంటి వారు? సంబంధం మీ అమ్మ వాళ్ళకి నచ్చిందా?” అన్నది.

“ఆహా. ఇంకెందుకు, ఉదయం తొమ్మిదికి వాళ్ళ వస్తారు. చూసి చెప్పవచ్చును” అన్నది శ్రావణి. అంతే కాని ఒక ఫోటో ఏమి చూపించలేదు.

వెంకట లక్ష్మి ఆలోచనలు సాగుతున్నాయి.

నాలుగు తరాల మనుషులు. మూడు రకాల జీవితం. తన తల్లి జమీందారు కుటుంబం. మేనాలో కానీ వెళ్ళేది కాదు. వెంకట లక్ష్మి తరంలో గుర్రం బండి తప్ప బయటకు కనిపించకూడదు. కూతురు తరంలో స్కూటర్ వచ్చింది మనుమరాలి తరంలో కారు వచ్చింది

అది కార్లో తప్ప వెళ్లదు. ఇప్పుడు కారు సమాజంలో అత్యంత అవసరం. సిటీలో అలా వెళ్ళడం తప్పదు.

తన ఆలోచన శ్రావణి జీవితం కోసం! కూతురు గాని మనుమరాలు గాని ఒక్క మాట చెప్పలేదు. పెద్దరికం లేదు. వాళ్ళకి నా డబ్బు ఆస్తి అవసరం లేదు. ఉన్నా వాళ్లకి దాని తినే అధికారం వస్తుంది. పెద్దల అస్తి తప్ప ఎటువంటి ఆలోచనలు అభిప్రాయాలు అవసరం లేదు. ఏదైనా అంటే మీ తరం వేరు నా తరం వేరు అంటారు. ఇంకా నయం ఇంట్లో ఉండి మాది మేము తింటూ ఉన్నాం కనుక వాళ్ళు తిండి తినమంటున్నారు. అదే వాళ్ళ దగ్గర ఉంటే ఉండనిస్తారా?

ఇలాంటి ఆలోచనలు కందిరీగల్ల ముసురు తున్నాయి.

ఈలోగా రూప లేచి కాఫీ కలిపి బాల్కనీలో ఉన్న తల్లికి తెచ్చింది.

“అమ్మా, అమ్మా. నిన్నే అని పిలుస్తున్నాం, వినవు. రెండు రోజులకే నీ ఇంటి మీద భ్రమా?” అంటూ కాపీ ఇచ్చింది రూప. ఎక్కడ ఉందో ఏమిటో అనుకుంది

“ఏమిటి కంగారు? నీకు ఇక్కడ ఏమి పని ఉండదు కదా, అప్పుడే లేచావు ఎందుకు?” అన్న కూతురుని “నువ్వు అప్పుడే ఎందుకు లేచావు? నాకు కొత్త కనుక లేచాను” అంది వెంకట లక్ష్మి.

“నీకు పని లేక పోయినా లేచావు. కాఫీ కోసం ఎదురు చూస్తారు అని నేను లేచి కాఫీ కలిపాను. ఉదయాన్నే తాగడం అలవాటు కదా. అయినా ఇవ్వాళ త్వరగా లేచి ఉండాలి, పర్వాలేదు అరు గంటలకు పనివాళ్ళు వస్తారు అప్పటికి స్నానాలు పూజలు అవ్వాలి కదా” అన్నది. “అందరూ రెడీ అవ్వండి” అన్నది.

***

పువ్వుల వారు వచ్చి హలు, దేముడి గది అంతా బాగా అలంకరించారు. కేటరింగ్ వారు ఆరున్నర గంటలకు కాఫీ పంపారు. ఏడున్నర గంటలకు ఇడ్లీ, పూరీ కూర రెండు పచ్చళ్ళు సాంబారు పంపారు.

ఇంట్లో పాల కోవా, పూతరేకులు పల్లె నుంచి ఇంట్లో బాగా వండించి పట్టుకు వచ్చినవి ఉన్నాయి. అవి వడ్డించాలని రూప చెప్పింది.

ఏమిటో అంతా ఇంద్రజాలంలా ఏర్పాట్లు జరిగాయి. ఎవరి పట్టు చీర నలగలేదు. అంతా ఈవెంట్ పని వాళ్ళు చూసుకున్నారు. రూప, సుబ్రహ్మణ్య రావు క్రెడిట్ కార్డ్స్ వల్ల జరిగింది.

పెళ్లి వారు వచ్చారు. ఆడపడుచు చాలా నెమ్మదిగా మంచిగా ఉన్నది. ఇంట్లో ఉండే మనిషి. అత్త మామ కూడా పర్వాలేదు. అందచందాలు కాక గుణం కూడా చూడాలి కదా. అనుకున్నది అనుకున్నట్లుగా అన్ని బాగా జరిగాయి. పెళ్లి ముహూర్తాలు పెట్టారు.

పెళ్ళికి పల్లె నుంచి తాతగారు అన్ని సరుకులు పట్టుకు వచ్చారు. అంతా సంప్రదాయ పద్ధతిలో జరిపారు. భోజనాల ఖర్చు, పెళ్లి ఖర్చులు అన్ని చెరిసగం పెట్టుకున్నారు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కృతి మంగళ వాయిద్యాలలో ఎంతో శ్రావ్యంగా పలుకుతూ వినిపించింది

అందరూ ఆనంద పడ్డారు.

మరునాడు పిల్లని అత్తింటికి పంపారు. ఆరోజు వాళ్ళ ఇంట్లో ఘనంగా శ్రీ వేంకటేశ్వర దీపారాధన శ్రీ సత్య నారాయణ వ్రతము చేశారు భోజనాలు పెట్టారు అటు ఇటు కూడా సంతోష పడ్డారు.

***

వెంకట లక్ష్మి సూర్యనారాయణ మూర్తి మళ్లీ కారులో పల్లెకు వెళ్లారు. కూతురి జీవితం బాగున్నందుకు సంతోష పడ్డారు ఏ తల్లి తండ్రి అయినా. ఆడపిల్ల జీవితం కోసమే కదా ఎదురు చూపులు. మంచి అల్లుడు దొరికితే అంతే చాలు అని సంతృప్తి కదా. మార్పు ఇప్పటికీ ఎప్పటికీ చాలా వచ్చింది. గతం తల్చుకుంది వెంకట లక్ష్మి.

సూర్యోదయాన్నే తల్లికి సహాయం చేసేది రూప. బీకామ్ పూర్తి కాగానే బ్యాంక్ పరీక్షలకి వెళ్ళింది. ఈ లోగా తల్లి పాల పద్దులు, రసీదులు అన్ని చూడమని చెప్పింది.

“ఏంటి అమ్మా, నీకు పాల పద్దులు కడుతు ఉంటే ఎలా? నీకు మల్లె నాకు కుదరదు. నేను ఏదైనా ఉద్యోగం చెయ్యాలి. నాకు మంచి జీవితం కావాలి” అంటూ ఉండేది రూప. పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. కానీ రూప అనుకున్నట్లుగా బ్యాంక్ ఉద్యోగం రావడంతో విజయవాడలో చేరింది.

ఎంతో తెలివైన పిల్ల. రేడియో ప్రసంగాలకు వెళ్ళేది. అక్కడే సుబ్రహ్మణ్య రావు పరిచయం. తనది పెద్ద కుటుంబం, అక్కలు నలుగురు. ఇంటి బాధ్యతలు అన్ని ఉన్నాయి.

పెళ్లిని వెనుకపెట్టి అక్కల పెళ్ళిళ్ళు చేశాడు. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచన వచ్చి రూపతో అన్నాడు. “నేను మా వాళ్ళకి చెప్పాలి” అన్నది రూప.

“అలా అయితే నేను వెళ్లి అడుగుతాను” అని అన్నాడు.

“మరి మీ అక్కలకు ఇష్టం ఉన్నదా లేదా? వారు పెళ్లి అయ్యాక అనేక కోరికలు కోరుతూ తరువాత నన్ను రక రకాలుగా ఇబ్బంది పెట్టరు కదా?” అంటూ అనుమానంగా అడిగింది.

“అదేమిటి? అలా అంటున్నావు?” అన్నాడు.

“అవునండీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకామె చాలా బాధ్యతలు ఉన్నాయి, పెళ్లి చేసుకుంటే కుదరదు అని ఊరుకుంది. కానీ వాళ్ళ దూరపు బంధువు ఒకతను సంబంధం తెచ్చాడు. అప్పచెల్లెళ్ళు పెళ్లికి ఉన్నారు, కానీ తండ్రి వంశం కోసం పిల్లాడికి పెళ్లి చెయ్యాలి అనుకున్నాడు. అయితే తల్లికి ఇష్టం లేదు. ‘ఇంట్లో పెళ్లి కానీ ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పెళ్లి కాకుండా కొడుకు పెళ్లి వద్దు’ అన్నది. కానీ భర్త ఆ సంగతి తరువాత. ముందు వాడి సంగతి చూడాలి

ఉద్యోగం చేస్తూ ఇంత కాలం పెళ్లి లేకుండా ఉంచాల్సి వచ్చింది, మంచి సంబంధం వాడే ఎంపిక చేసుకున్నాడు, మనం పెళ్లి చెయ్యడమే అన్నాడు. సరే అంటూ పెళ్లి ఖర్చులు అడిగి పుచ్చుకుని వద్దు ఏమి వద్దు అంటూనే అన్ని పుచ్చుకుని పెళ్లి చేశారు  పిల్ల వెళ్ళిన దగ్గర నుంచి ‘నువ్వు పెట్టిన చీర బాగాలేదు, నీ విధానం నచ్చలేదు, అబ్బే ఏదో మా వాడు కావాలి అన్నందుకు పెళ్లి చేశాను. నువ్వు వాడిని వల్లో వేసుకుని పెళ్లి చేసుకున్నావు. నా పిల్లలు ఇలా పెళ్లి లేకుండా ఉన్నారు, వాడి సుఖం చూసుకుని మమ్మల్ని వదిలేశాడు. వాడు వాడీ పెళ్ళాం వాడి జీవితం అంటూ కూర్చున్నాడు. ఈ పిల్లలు ఇద్దరు ఏమవుతారు? వాడి పెళ్ళాం ఇక్కడ ఉండడానికి వీల్లేదు

వాడి డబ్బు మాకే ఇవ్వాలి. వాడి పెళ్ళాన్ని విడిగా పెట్టుకుని ఉండమను’ అన్నది ఆ తల్లి.

రెండు కుటుంబాలు ఎలా మెయింటైన్ చెయ్యాలి? ఒక్క జీతం. ఇంట్లో వంట మనిషి, పని మనిషి. పాష్‍౬గా జీవితం. ఆవిడ సుఖం, అవిడ ఆటలు సాగవు అని కోడలిని మెత్తగా కవితలు కబుర్లు చెప్పి పుట్టింటికి పంపించారు కోడలిపై చాడీలు చెపుతూ కొడుకు మనసు విరవాలనీ కంకణం కట్టుకున్నారు. ఆ బాధ పడలేక వాళ్ళకే డబ్బు ఇచ్చి భార్యను పుట్టింట్లో ఉంచాడు. ఎప్పటికీ దాని కష్టం సమస్యలు తీరుతాయి? ఇలాంటి పెళ్లి అవసరమా ఇదంతా తల్లి తండ్రుల కుటుంబ సభ్యుల స్వార్థమని చెప్పాలి. మీరు మీ ఇంటి వాళ్ళను వప్పించి మెప్పించి పెళ్లి చేసుకుంటే కాదు, భార్యగా ప్రేమ పంచగలిగే స్తితి ఉందా అని మరీ. ఆలోచించి చేసుకుంటే మంచిది. పూర్వం ఎన్నో సంబంధాలు చూసి చేసేవారు. ఇప్పుడు అలా కాదు, పిల్లలు ఏది బాగుంది, కావాలి అంటారో వారినే చేస్తున్నారు. పిల్లల మాటకి విలువ ఇస్తున్నారా? లేక వారికి వెతికే తీరిక లేక పిల్లలకి నచ్చింది చేస్తే వారి తిప్పలు వారు పడతారులే అనే ఉద్దేశం ఉందా? ఏది ఏమైనా తల్లి తండ్రి జీవన విధానంలో పిల్లల పెంపకంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇంకా ఎన్నో వస్తాయి కూడా” అంది రూప.

సరేనని వాళ్ళ అక్కను తీసుకువెళ్ళి చూసి వచ్చాడు.

అంతేనా రేడియో పంట సీమల కార్యక్రమానికి ఇంటర్వ్యు కూడా చేశాడు. ఇంకేముంది రూప అమ్మ నాన్న మంచి అబ్బాయని సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ తరువాత రూప నెమ్మదిగా చెప్పి పెళ్ళికి ఒప్పించింది. అలా రూప పెళ్లి జరిగింది.

అంతరాల ఈ తరం మార్పు. ఇప్పుడు వాళ్ళే శ్రావణిని అడిగి తెలుసుకుని సంబంధం కుదిర్చారు. మార్పు సహజం కదా!

ఒక్కసారిగా గతం నుంచి బయటకు వచ్చిన వెంకట లక్ష్మి – ‘అయితేనేం, ఇప్పుడు సుఖపడుతుంది కదా. అంతరాలలో వచ్చే నేర్పు మార్పు వల్ల ఇద్దరి జీవితంలో శాంతి శుభం’ అనుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here