అంతరాలు

0
14

[dropcap]స[/dropcap]మయం గంటల 12-13 నిమిషాలు.

ఆ రోజు ఆదివారం సెలవుదినం కావడంతో సొంత వూళ్ళో ఉంటున్న అమ్మా నాన్నలను చూసొద్దామని ఇంటి బయలుదేరాన్నేను.

మా వూరి బస్టాపులో బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళే సరికి మా ఇంటి ముందు ఒక టూవీలర్ నిలిపివుంది. నేనింక లోపలికి వెళ్ళకుండానే…. ఎవరైనా బంధువులోచ్చుంటారా … లేక తెలిసిన వారెవలైనా వచ్చారేమోననుకుంటూ ఇంటి గేట్ లోపలికి అడుగు పెట్టాను.

ఇంటి ముందున్న వరండాలో అమ్మానాన్న కూర్చోని ఉన్నారు. వాళ్ళకెదురుగా ఒక బాబు మరొక తెలిసీ తెలియని వ్యక్తి నిల్చోని అమ్మానాన్నలతో మాట్లాడుతున్నారు.

నన్ను చూసిన అమ్మ “బాబు వస్తున్నాడు” అంటూ కుర్చీ లోంచి లేచి వచ్చి నా చేతిలో సంచి అందుకొని “కాళ్ళు కడుకొని రా.. నాన్నా” అంటూ లోనికెళ్ళింది అమ్మ.

ఎదురుగా నిల్చోని నాన్నతో మాట్లాడుతున్న వాడల్లా… వెనక్కి తిరిగి “అన్నయ్య… నమస్తే బాగున్నారా..” అంటూ పలకరించాడు నన్ను.

‘ఎవరు?’ అన్నట్లుగా నాన్న కేసి చూసాన్నేను. అంతలోనే “అన్నయ్య నన్ను గుర్తుపట్టలేదనుకుంటా” అంటూ “నేను మీ క్లాస్మెట్ పూర్ణ వాళ్ళ తమ్ముడిని” అన్నాడతను.

“ఒకే ఒకే.. గుర్తొచ్చింది” అని నేనటుండగానే.. “మన ఇల్లుతికిన సాకలెంకటి వాళ్ల కొడుకు రాజు, వీడేమో వాళ్ళబ్బాయి” అని చెప్పాడు నాన్న.

“చాలా రోజులయ్యింది కదా నిన్ను చూసి…” అన్నాన్నేను.

“అవునన్నయ్య ఇప్పుడెక్కడుంటున్నారు… మీరు?” అంటూ అడిగాడు నన్ను.

“వరంగల్‌లో” అన్నా నేను.

“మీ జాబ్ రెగ్యులర్ అయ్యిందా.. అన్నయ్యా?” అన్నాడతను.

“లేదింకా… కాంట్రాక్ట్ లెక్చరర్ గానే చేస్తున్నాను” అని చెప్పాను. ఇంతలో అమ్మ మంచినీళ్ళ గ్లాసు తీసుకొచ్చి నా చేతి కందించింది.

“రాజు మంచినీళ్ళు తాగుతావా?” అంటూ అడిగాన్నేను. కొంచెం బిడియంతో వద్దన్నాడు రాజు. మంచినీళ్ళ గ్లాసు ఖాళీ చేసి అమ్మకందిస్తూ “ఈ బాబు?” అన్నానేను.

“మా పెద్దబ్బాయి అన్నయ్య” అన్నాడు రాజు.

ఆ బాబుకేసి చూస్తూ “యువర్ గుడ్ నేమ్ ప్లీజ్” అన్నా నేను…

“మై నేమ్ ఈజ్…. పి. వెంకట్ హర్ష అంకుల్” అంటూ చాలా పొలైట్‌గా చెప్పాడు…

“మీ నాన్న పేరే పెట్టావు రాజు” అన్నాన్నేను.

“అవునన్నయ్యా నాయన పేరు కలిసొచ్చేటట్లు వీడికేం వెంకట్ హర్ష అని, చిన్నవాడికేమో శ్రీరామ్ వెంకట్ అని పెట్టుకున్నా” అంటూ వాళ్ళ నాన్నను గుర్తుచేసుకున్నాడు రాజు.

“ఇన్ విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్?” మళ్ళీ అడిగాన్నేను.

“సెవెన్ కంప్లీటెడ్… ఎంటరింగ్ ఇన్ టు ఎయిత్ క్లాస్” అంటూ ముద్దు ముద్దుగా జవాబిస్తున్నాడు బాబు.

అప్పడిక వాళ్ళోచ్చి ఎంత సేపయ్యిందో…. నిలబడే మాట్లాడుతుంటే, “రాజు కూర్చో” అంటూ అక్కడే ఉన్న కుర్చీని ఇచ్చాను.

వెంటనే నాన్న నాకేసి చూడడం గమనించి… “పర్లేదు అన్నయ్యా…” అంటు నా విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించాడు రాజు.

“ఇంక.. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు రాజు?” అని అడిగాన్నేను.

“అన్నయ్యా, నేను గూడూరు పోస్టాఫీసులో క్లర్క్‌గా పని చేస్తున్నాను” అన్నాడు రాజు.

“మీ అమ్మనాన్న ఎలా ఉన్నారు?” అంటూ అడిగాన్నేను.

“నాయిన రెండు సంవత్సరాల క్రితమే కాలం చేసిండు, ప్రస్తుతం అమ్మ మాతోనే ఉంటుందిప్పుడు” అన్నాడు రాజు.

“అలాగా” అని, “మన పూరికెప్పుడొచ్చావు?” అంటూ అడిగాన్నేను.

“రెండ్రోజులయింది అన్నయ్య… నిన్న మా మేనమామ కూతురు పెళ్ళివుంటే ఎండకాలం అయిన బంధువులందరు కలుస్తారని పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను” అని చెప్పాడు రాజు.

“ఇంకో రెండురోజులుంటావా.. రాజు?” అంటూ అడిగాడు నాన్న.

“లేదండి రేపటి నుండి ఆఫీసుకు పోవాలి కదా… ఇవాళ్ళ సాయంత్రం వెళదామనుకుంటున్నాను” అన్నాడు రాజు.

“సరే.. మంచిది” అంటూ అన్నాడు నాన్న.

“టైం ఒంటిగంట కావస్తుంది, అన్నం తిందువురారా…” అంటూ పిలిచింది అమ్మ.

“సరే అన్నయ్య … భోజనం చెయ్యండి మీరు…” అని “అయ్యా వస్తా” అంటూ అమ్మా నాన్న దగ్గర సెలవు తీసుకొని ముందుకు కదిలారు రాజు మరియు వాళ్ళ అబ్బాయి హర్ష. జేబులో ఉన్న ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి మాట్లాడుకుంటూ గేట్ దాటి బయట ఉన్న బైక్ దగ్గరకు వెళ్ళారిద్దరు.

ఇంతలో “అరె బాబు గేట్ దగ్గరికి వెయ్యకుండా పోతున్నారు, వెళ్ళి గేట్ వేసిరా…” అంటూ చెప్పాడు నాన్న నాతో… సోఫాలో కూర్చుంటున్న వాడినల్లా లేచి వెళ్ళి గేట్ దగ్గరికేస్తుండగా …

గోడ అవతలి నుండి, “ఏంటి.. డాడీ.. మనల్ని అంత సేపు నిలబెట్టే మాట్లాడారు, అంకుల్ వచ్చిన తరువాత నిన్ను కూర్చోమంటే నువ్వేమో వద్దన్నావు. అంత సేపు నిలబడి, నిలబడి నా కాళ్ళు లాగుతున్నాయి తొందరగా బండి స్టార్ట్ చెయ్యి ఇంటికి వెల్దాం” అంటూ తొందర పెడుతున్నాడు బాబు హర్ష.

“అయ్యో… వాళ్ళు దొరలు, వాళ్ళ ముందు మనం కూర్చోవద్దు. మనమేమో వాళ్ళ ఇల్లుతికిన సాకలోల్లం. తప్పు నాన్న..” అంటూ తన నిస్సహాయతను తెలియజేస్తూ బండి స్టార్ట్ చేసాడు రాజు.

‘ఐతే ఏంటి.. వాళ్ళ ముందు మనం కూర్చోకూడదా.. కూర్చుంటే ఏమైతదం’టూ తండ్రిని ప్రశ్నించాడు బాబు హర్ష.

“నువ్వు చిన్న పిల్లాడివి, నీకేం తెలియదు. ఊళ్ళల్లో కొన్ని కట్టుబాట్లు, నియమాలుంటాయి ఇవన్నీ నీకు అర్థం కాదు” అంటూ గేరు మార్చి బండిని ముందుకు పోనిచ్చాడు రాజు.

గేటు దగ్గరకు పెట్టి చేతులు కడుక్కొనొచ్చి సోపాలో కూర్చున్నానేను. పళ్ళెంలో అన్నం పెట్టుకొచ్చి నా చేతికందించింది అమ్మ.

పళ్ళెంలో అన్నం కలుపుతుంటే అన్యమనష్కంగానే ముప్ఫై సంవత్సరాల క్రితం వైపుకు వెళ్ళాయి నా ఆలోచనలు….

***

బడి నుండి వచ్చిన తరువాత సాయంకాలం నేను, మా తమ్ముడు, ఇంకా కొందరు స్నేహితులం కలిసి మా ఇంటి ముందు ఆడుకుంటున్నాము.

చేతిలో తెల్లటి గుడ్డ చుట్టిన వస్తువొకటి పట్టుకొని, అతనితోపాటు వాళ్ళబ్బాయిని కూడా తీసుకొని ఇంట్లో కొస్తూ….

“రాములమ్మగారు… సాకలెంకటి నోచ్చిన..” అంటూ మా నానమ్మకు వినపడేటట్లు అరిచాడు.

“వచ్చినవారా ఎంకటి, ఇంటికి సుట్టాలొచ్చిండ్రూ, ఆ గంప కింద కొడి పుంజును కప్పెటిన. బయికాడికి తీస్కొపోయి కోసి పెట్టు” అంటూ పురమాయింది మా నాయనమ్మ.

మెల్లగా.. గంప లేబట్టి కొడిపుంజు రెండు కాళ్ళు దగ్గరపట్టుకొని బయికాడకి తీసుకుపోయి మా నాయనమ్మ చెప్పినట్లే చేస్తుండు ఎంకటి. వాళ్ళ నాన్నతోపాటే బావి దగ్గరకు వస్తుంటే “ఎడికొస్తున్నావురా.. పొయ్యాడ కూసో పో…” అంటూ గద్దించింది నాయనమ్మ.

ఇంటు ముందు ఆడుకుంటున్న మమ్ములను చూసి మా దగ్గరకొచ్చి మేమాడుకుంటుంటే పక్కకు నిలబడి చూస్తున్నాడు రాజు. కొంత సేపుయ్యక అందరికి దూపై తందని (దాహం) మంచినీళ్ళు తేవడానికి ఇంట్లో కెళ్ళాన్నేను. మా తమ్ముడు, ఇంకా స్నేహితులందరూ ఇంట్లో కొచ్చి సోఫాలో, పక్కనేవున్న మంచంపై కూర్చున్నారు.. వాళ్ళతోపాటే రాజుకూడా వచ్చి మంచం మీద కూచ్చున్నాడు.

లోపలికెళ్ళి నేను పెద్ద చెంబులో మంచినీళ్ళు, గ్లాసు పట్టుకొచ్చి, తలాకొన్ని మంచినీళ్ళు గ్లాసులో పోసిస్తున్నాను.

కోడిని కోయడం అయిపోయిందేమో.. కర్రపట్టుకొని లోపలికొస్తూ… మంచం మీద కూర్చుని రాజును చూసి… “అరె… ఎంకటిగా … సూసినావారా నీ కొడుకు మా వోళ్ళతో సమానంగా.. మంచం మీద కూసొని కాళ్ళుపుతుండూ…” అంటూ అరిచి గోల పెట్టింది మా నానమ్మ.

బాయికాడ చేతులు కడుకుంటున్న వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి “అమ్మా నీ బాంచెన్.. తప్పయింది.. పోరన్నేమనకుండి” అంటూ ప్రాధేయపడి మా దగ్గరికొచ్చి రాజు రెక్కపట్టుకుని అవతలికి ఈడ్చుకుంటూ పోయిండు వెంకటి.

‘పోరగాండ్లు… లెగుండ్రీ… మైల బట్టలుతికేటోని పక్కన కూసోని అందరు మైలబడ్డారు, ఇండ్లల్లకు పోయి స్నానాలు చేయిపొండ్రా” అంటూ గద్దించింది, నాన్నమ్మ.

తను చేసిన తప్పేంటో అర్థంగాక బిత్తర చూపులు చూసుకొంటూ ఇంటి ముందున్న పందిరి గుంజను పట్టుకొని నిలబడ్డాడు రాజు.

‘అరె ఎంకటిగా .. మైలపడ్డ ఆ మంచం బాయికాడికి తీస్కొని పోయి, కడిగారబెట్టం’టూ కండ్లెర్రచేసి చెప్పింది నాన్నమ్మ.

భయంతో “అట్నె .. అమ్మా…” అంటూ మంచం తీస్కోపోయి శుభ్రంగా కడిగి ఆరబెట్టి….

“అమ్మగారు, నేన్బొయ్యెస్తా…” అంటూ కొడుకుని తీస్కోని బయటికి నడిచాడు వెంకటి.

తన రెక్క పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తున్న వాళ్ళ నాన్నను, “మంచం మీద కూసుంటే తప్పెట్లాయితది అయ్యా?” అంటూ అమాయకంగా అడుగుతున్నాడు రాజు.

“వామ్మో… అల్లు దొరలురా.. అయ్యా….. మనం ఆల్ల దగ్గర గుడ్డలుతుకున్నేవాళ్ళం.. ఆల్ల ముందు మనం కూసోవద్దురా..” అంటూ వాళ్ళింటివైపు నడుచుకుంటూ వెళ్ళిపోయారు.

“పెట్టినన్నం తినకుండా ఏందో ఆలోచిస్తూన్నావు?” అంటూ అమ్మ కోపగించుకునేసరికి.. ఏదో తెలియని బాధ నామనస్సుని మెలిపెడుతుండగా.. నాల్గు ముద్దలు తిని చెయ్యి కడుక్కొంటున్న నాకు అనిపించింది…

తరాలు మారిన తరాల ‘అంతరాలు’ మారలేదని.

చిన్నప్పుడు రాజు వాళ్ళ నాయినడిగిన అదే ప్రశ్నను వాళ్ళబ్బాయి కూడా… రాజును అడగడం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here