అంతరం-4

0
11

[box type=’note’ fontsize=’16’] కన్నడంలో డాక్టర్ జయప్రకాష్ మవినాకులి “అంతర” పేరిట వ్రాసిన నవలను “అంతరం” అనే శీర్షికతో తెలుగులో అందిస్తున్నారు స్వాతీ శ్రీపాద. ఈ ధారావాహికలో ఇది నాల్గవ భాగం. [/box]

ఇంటి వివరాల సుడి

[dropcap]మా[/dropcap] నానమ్మకు ప్రపోజ్ చేసే ధైర్యం ఎవరికుంది? ఆవిడ అంటే మా అమ్మకు సింహస్వప్నం. మా అమ్మను రెండు మూడు పిడి గుద్దులు గుద్దటానికీ వెనుకాడదు. ఆమె నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించే ధైర్యం చెయ్యరు. ఒకసారేమై౦దో తెలుసా నీకు?

రెండు వరసల గొలుసు కొనమని నాన్నకు చెప్పింది. తన కోరికలు ఎప్పుడు ఎలా చెప్పాలి అనే దానిలో ఆవిడ నిష్ణాతురాలు. కోతలు అప్పుడే ముగిసాయి. పోకపంట ఇంకా మార్కెట్‌కి వెళ్ళలేదు.

ఆ రోజున నాన్న వరండాలో కూచుని తమలపాకులు నములుతున్నాడు. ఆవిడ వరండాలో కూచుని తన చెక్క పలక తీసుకుని దానిమీద పూజకు కావలసిన ఒత్తులు రోల్ చేసుకు౦టో౦ది.

“పిల్ల మెడ బోసిగా ఉంది. ఆ ఒక్క వరస గొలుసు విరిగిపోయేలా ఉంది. రెండు వరసల గొలుసు చేసుకోడం మంచిది. రామూ”

నాన్న జవాబిచ్చాడు, “అవునా? ”

“అవును. ”

తమలపాకులు నములుతూ పోక తోటవైపు కదిలాడు.

నాన్నమ్మ విషయ ప్రస్తావన చేసింది. ఆవిడకు బాగా తెలుసు ఈ విషయం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తే గాని ముందుకు వెళ్ళదని.

నానమ్మ దగ్గర చాలానే బంగారం ఉ౦దనడానికి ఏం అనుమానం లేదు. ఆవిడకు అటు వాళ్ళూ ఇటు వాళ్ళూ ఇచ్చిన బంగారు నగలు చాలా ఎక్కువే. వాటికి తోడూ మేం కూడా నలభై యాభై తులాల నగలు ఇచ్చాము.

ఆవిడ అన్నింటినీ జాగ్రత్త పరచి౦ది. ఇంకా వాటికి నానమ్మ కూడా చాలానే చేర్చి ఉ౦టు౦దని అంటుంది అమ్మ.

దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. తాతగారు వడ్డీ వ్యాపారి. అతని వ్యాపారం రెండు తాలూకాల వరకూ సాగింది. అతని వ్యాపారం లక్షల్లో సాగేది.

ఆ సమయంలో మా తోట పక్కన ఉన్న పోక పొలం సుబ్బన్న, చివరి ఇంటి ఆయన, అమ్మకానికి పెట్టాడు. తాతగారు కొనడానికి సిద్ధంగా లేరు. అయినా అతను కొనుక్కోమని బలవంత పెడుతున్నాడు. మా తాత గారు ఉన్న చివరి పైసా కూడా వ్యాపారంలో పెట్టేసారు. కాని డబ్బు లేదని చెప్పటం పరువు తక్కువగా భావించారు తాతగారు. ఒక పదివేలు ఎలాగోలా సమకూర్చారు కాని బంధువుల నుండి డబ్బు అడగటం కన్నా విషం తీసుకోడం నయమని ఆయన అభిప్రాయం. ఆ సమయంలోనే ఒక సంఘటన జరిగింది.

ఆరావళి హెగ్డే అది కొంటున్నట్టు ఎవరో చెప్పారు.

అంతకు మునుపు మామధ్య ఒక పెళ్లి సంబంధం విషయంగా సయోధ్య లేదు. అది మరో మలుపు సంతరించుకు౦ది. కాని డబ్బు సమస్య మా వైపు సూటిగా చూస్తో౦ది. డబ్బు ఎలా సమకూర్చాలి? తాతగారు తన సమస్య ఎవరికీ చెప్పలేదు. పిచ్చి వాడిలా మూడు రోజులుగా తిండీ తిప్పలూ లేకుండా, నిద్ర మాట ఎత్తకుండా అటూ ఇటూ తిరుగుతున్నాడాయన.

ఎనిమిది రోజుల తరువాత వస్తానని చెప్పేసాడు సుబ్బన్న.

నానమ్మ ఎప్పుడూ ఆర్థిక విషయాల్లో తలదూర్చేది కాదు.

రాత్రి పొద్దు పోయినా తన గదికి వెళ్ళకుండా తాతగారు ఒంటరిగా వరండాలో కూచుని ఉన్నారు. గోడ గడియారం టిక్ టిక్ గంటల శబ్దం మినహా మరో చప్పుడే లేదు.

కలరపడిన నానమ్మ కిందకు వచ్చి ఆయన వరండాలో దిగులుగా ఉండటం చూసింది. అది ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు. ఒక కుటుంబ౦ ఆత్మశక్తికి, పరువుకు సంబంధించినది.

అది ఒక పొలం, మా కుటుంబం ఉత్తరాధికారం దాని చారిత్రిక ప్రాముఖ్యతకు సంబంధించినది. అంతకు మునుపు ఎవరి దగ్గరనుండీ ఏ విధమైన ఆర్ధిక సాయం పొ౦దలేదాయన. ఎవరి నడిగినా ఇవ్వడానికి ఎవరూ వెనకాడరు.

నానమ్మ వరండాలోకి వచ్చి అక్కడ నేల మీద కూచుని చేతి గాజులు గలగలలాడి౦చి౦ది. తాతగారు అటూ ఇటూ కదిలి “వెళ్లి పడుకో” అన్నారు. నానమ్మ మనసునిండా ఎన్నో అయోమయపు ఆలోచనలు.

ఆవిడ వణుకుతూ, “ సరసి గురించి దిగులు పడుతున్నారా?” అని అడిగింది.

ఆ సమయంలో సరసి ఒక ఉంపుడుగత్తె. టౌన్‌కి రాకముందు ఆమె ఎక్కడో పల్లెటూరిలో ఉండేదని అనేవారు.

మా నానమ్మ పెళ్లై నప్పుడే ఆమె మా ఊరికి వచ్చింది. ఆ రోజుల్లో ఉ౦చుకోడం అనేది ఒక ఫాషన్. అది నీచం అని ఎవరూ అనుకునే వారు కాదు. సరసిని వారి గిడ్డంగిలో ఉంచారు. అది త్వరలోనే నానమ్మకు తెలిసిపోయింది. ఇంట్లో ఎడమొహం పెడ మొహం. అయినా తాతగారు దాన్ని పెద్ద సీరియస్‌గా భావి౦చలేదు. కాని నానమ్మ కూడా ఎప్పుడూ దిగిరాలేదు. తిండి మానేసి సత్యాగ్రహం మొదలు పెట్టింది. తాతయ్య మాట్లాడలేదు. తెల్లారింది.

నానమ్మ సరసి జడ పట్టుకుని తాతగారి ముందుకు లాక్కు వచ్చింది.

“నాలో లేనిది, దీనిలో ఉన్నదీ ఏమిటి? దానికి ఎక్కువున్నదేమిటి? నీ చీర విప్పు, నేనూ విప్పుతాను” అంటూ ఆమె చీర లాగుతున్నట్టు చేసింది.

తాతగారికి చెమటలు పట్టాయి. ఆ చీర పట్టుకుని “పిచ్చా నీకు” అన్నారు తాతగారు.

నానమ్మ కన్నీళ్ళతో అడిగింది, “చెప్పండి దాన్ని పంపి౦చేస్తారా లేదా?”

తాతగారు ఆమెను వెనక్కు పంపడానికి ఒప్పుకున్నారు.

మర్నాడే ఆమెను వచ్చిన ఊరికి పంపేశారు. అక్కడితో ఆ అధ్యాయం ముగిసింది.

టౌన్ జనాలు నవ్వుకున్నారు, “భట్టాను వంచడానికి ఆమె తగినది” అని.

నానమ్మ కాజువల్‌గా “సరసి గురించి బాధపడుతున్నారా ?” అని అడిగింది. ఆ అసహాయ స్థితిలో కూడా తాతగారు నవ్వి

“ఓహ్ పిచ్చిదానా, నా జ్ఞాపకం నుంచి ఆమె మొహం కూడా చెదిరిపోయింది”

మళ్ళీ నిశ్శబ్ద౦. ఒక భార్యతో పంచుకోలేని అంత తీవ్రమైన సమస్య ఏమిటో?

భార్య ఇంతకన్నా ఏం ఆలోచి౦చగలదు? అయినా అడిగి చూస్తాను. మళ్ళీ అడిగింది,

“డబ్బు గురించి చింత పడుతున్నారా?”

ఆమె అడుగుతూ వణికి పోయింది. ఇంటి విషయాలు తప్ప ఎప్పుడూ అతని ఇతర కార్యకలాపాల గురి౦చి అడగలేదు మరి. తాతగారు నోరు విప్పలేదు. భార్యకు ఎలా చెప్పగలడు తన వద్ద డబ్బు లేదని.

మళ్ళీ శ్మశాన నిశ్శబ్దం. వరండాలో గడియారం చప్పుడు తప్ప మరేమీ వినబడటం లేదు. లాంతరు మసక వెలుగులో నానమ్మ కు తాతయ్య స్పష్టంగా కనబడటం లేదు.

నానమ్మే లోనికి వెళ్లి నగలతో తిరిగి వచ్చింది.

“చూడండి ఇవి పెట్టుకుని లోన్ తీసుకోవచ్చును. డబ్బు కన్నా కుటుంబ గౌరవం ముఖ్యం.”

ఆ చీకట్లో కూడా నగలు ధగధగా మెరుస్తున్నాయి.

తాతగారు వాటిని ఎప్పుడూ ముట్టుకునే ధైర్యం కూడా చెయ్యలేదు. ఎలా చెయ్యగలడు?

“చూడండి ఇవన్నీ పెళ్ళిలో మా అమ్మా నాన్నా నాకు బహుమతిగా ఇచ్చిన నగలు. కష్టాల్లో వాటిని డబ్బు చేసుకోమనే గదా?” మా తాతగారి చేతులు పట్టుకుని.

“ఇది మన వంశం చెయ్యి. ఎవరూ ఇంతవరకూ మన వంశంలో ఎవరి ఎదుటా చెయ్యి చాచలేదు. మనం ఎప్పుడూ చాచం. ఇది ఇచ్చే చెయ్యే కాని అడిగే చెయ్యి కాదు.” అని చెప్పి నానమ్మ నగలు తాతగారి కాళ్ళ దగ్గర ఉంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది.

ఇది జరిగాయి సంవత్సరాలు దొర్లిపోయాయి. మరచిపోవలసిన సమయం కూడా వచ్చింది. ఈ సంఘటన కూడా ఇంట్లో కొందరికే తెలుసు. దీని తరువాత నానమ్మకు రె౦డి౦తలు ప్రేమ గౌరవం దక్కాయి. కష్టం తీరిపోయింది. పొలం దక్కింది. నానమ్మ నగల విలువ లెక్కకు మించినది. ఆమెకు వంకీలు, పాట్లీలు, బందీ సరిగే, డాబు, నాగామూరి, చోలాకి, హింబలే సువిజబలె, కాఫీ గింజల నెక్లెస్, జోలి, గెజ్జే, పట్టి, కలుగడగా, మందలేబట్టు, చౌలి కునిగే, జడేహూ, ఝుమ్కి వాలే బెందోలె, … ఎన్ని రకాలు. గుర్తున్నవరకే చెప్పానిక్కడ. ఇన్ని రకాల నగలు నానమ్మకు బహుకరించి తాతగారు కాలం చేసారు. భర్త పోయాక కూడా నానమ్మ తన స్థానం పదిలంగా కాపాడుకుంది. ఆ నగలతో అల౦కరించుకునే అవకాశమే ఆవిడకు రాలేదు. కొడుకు పెళ్ళికి ముందే తాతగారు పోయారు. తన కొడుకు పెళ్ళిలో కూడా ఆవిడ బాత్ రూమ్‌లో కన్నీళ్ళతో కూచు౦డిపోయి౦ది.

ఆవిడ గీసిన గీత నాన్న ఎప్పుడూ దాటలేదు. నానమ్మ నాకు నగలు చేయించమని నాన్నతో చెప్తుంటే అమ్మ వణికి పోయింది. కాని నాన్న ఏ మాత్రం శ్రద్ధ చూపి౦చక ఆలస్యం చేస్తూ పోతున్నాడు.

త్వరలో రాబోతున్న నా పెళ్లికి చేయి౦చవచ్చని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. ఆ రోజున ఏదో పండుగ. నానమ్మ సూప్ వడ్డిస్తోంది.

“రామూ, నగలింకా సిద్ధం కాలేదు. పండగకు ముందే సిద్ధం అవుతాయనుకున్నాను. నీకున్నదే ఒక్క కూతురు. దాని మెడ బోసిగా వుంది”

నాన్న మాట్లాడలేదు. “చాలు కాస్త నెయ్యి వడ్డించు” పెద్ద పట్టి౦చుకోనట్టుగా అన్నాడు నాన్న.

నానమ్మ ఆలోచనలు తలక్రిందులయ్యాయి. కోపంతో బుసలు కొడుతూ

 “నగలు కొనమని నెల రోజులుగా మాటి మాటికీ చెప్తూనే ఉన్నాను. నీ దగ్గరనుండి స్పందనే లేదు. మొగుడు చచ్చిన దౌర్భాగ్యపు విధవరాలి మాట ఎవరు లెక్కచేస్తారు?” ఏడుస్తూ చేతిలో ఉన్న గిన్నె ధబాల్న నేలనుకొట్టి౦ది.

“ఈ ప్రపంచంలో నువ్వొక్కడివే బయటి పనులు నిర్వహిస్తున్నావు. ఎవరికైనా కుటు౦బాలున్నాయా? ఎవరైనా చూసుకు౦టున్నారా? పెళ్లి గావలసిన పిల్లకు నగలు రెడీ చెయ్యమంటే…” నేల మీద పడి చెయ్యి నేల మీద కొడుతూ, గుండెలు బాదుకుంటూ ఒక రకమైన ఆవేశంతో వెక్కిళ్ళు పెట్టింది.

నావైపుకి వచ్చి నా మెడ వైపు చెయ్యి చాపి గొలుసు లాగుతూ, “నీ బంగారం నువ్వు తీసుకో. ఎవడిక్కావాలి? ఈ గొలుసు కూడా తీసుకో. చేతులూ నుదురూ బోసిగానే ఉన్నాయి కదా, నాకు దమ్ముంటే నా మనవరాలికి నేనే కనక వర్షం కురిపిస్తాను.” ఇలా అ౦టూ చేతులు ధనామని నేలకి కొట్టింది.

ఆమె చేతికున్న పాట్లీలు ధ్వనించాయి. “టిక్ టిక్”

విపరీతంగా ఏడుస్తూ మధ్య గదిలోకి వచ్చి నిద్రపోయింది. కింద విసిరిన గిన్నె దాంట్లోని రసం చెదిరి మా నాన్న అరిటాకులో పడి దాన్ని తడుపుతూ ప్రవహించింది. తింటున్న తిండి మధ్యలో వదిలి నాన్న లేచి వెళ్ళిపోయాడు. ఆయనేం మాట్లాడలేదు.

నానమ్మ మధ్య గదిలో మంచం మీద పడుకుంది. నేను నెమ్మదిగా ఆ మంచం వైపు కదిలాను. నేను ఆ మంచం కిందకు చేరాను కాని విపరీతమైన భయం నన్ను బందీని చేసింది. ఈ కురుక్షేత్ర యుద్ధానికి కారణం నేను కదా?

నానమ్మ కాళ్ళ దగ్గర కూచున్నాను. మా మధ్య నిశ్శబ్దం ఆవులించింది. రెండు రోజులు గడిచాయి. రాళ్ళు పొదిగిన నెక్లెస్ చెవి కమ్మలు జుంకీలు రెడీ అయ్యాయి.

నాన్న అవి నానమ్మ కిచ్చి చెప్పబోయాడు, “శెట్టికి ఎప్పుడో చెప్పాను, అతనే సిద్ధం చెయ్యలేదు” అని.

నానమ్మ వాటిని ముట్టుకోలేదు సరికదా “సువ్వి, అవి తీసుకో, రేపు శుక్రవారం. పూజ చేసి వేసుకో” అంది.

అది అక్కడికి ముగిసింది. నేను నానమ్మ గురించి చెప్తున్నాను. ఆమె నా జీవితంలో వేరు చెయ్యలేని ఒక భాగం. కారణం ఇదే, ఆమె ఒక్కతే నా గురించి సాలోచనతో ప్రేమించింది. అందుకే తెల్లటి జుట్టు, ముడతలు పడిన మొహం, బోసి నోరు ఉన్న ఆ వయసు వారందరినీ ప్రేమిస్తాను. వాళ్ళందరిలో ఆవిడ ప్రతిబింబమే కనబడుతుంది నాకు.

నానమ్మ ఎప్పుడూ వాత౦తో బాధపడేది. వారంలో ఒక రెండు రోజులు సరిగ్గా నడిస్తే ఎక్కువ. ఆ రెండు రోజులూ ప్రతిపనీ ఓ చిన్న పిల్లలా తనే చేస్తానని అంటుంది.

ఒక సాయంత్రం, నాకు బాగా గుర్తు, మా ఇంటి ముందున్న తనతో పాటు పోక తోటకు నన్నూ రమ్మని అడిగింది. నేను ఆవిడతో వెళ్లాను. నేను సంతోషంగా ఒకగట్టు మీద నుంచి మరో గట్టుకు దూకుతున్నాను. రాలిపోయిన పోక పళ్ళు ఏరుతూ. హఠాత్తుగా ఒక పక్షి కిందకు దిగి నా తలమీద కొట్టి౦ది.

“నానమ్మా” అరిచాను.

“ఎందుకలా దయ్యం పట్టినట్టు అరుస్తావు? అది ఒక గుడ్లగూబ అంతే. చూడు ఇప్పడది ఆ అరటి మొవ్వమీద వాలింది. అదెప్పుడూ విశ్రాంతిగా తలకిందులుగా వేళ్ళాడుతూ ఉంటుంది. అది గుడ్ల గూబ. ఎప్పుడూ తలకి౦దులే, ఎవరది?”

నేను ఎం.ఎ.లో చేరడానికి నానమ్మ అంగీకారం కావలసివచ్చింది. అది రావాలంటే తలప్రాణం తోకకు వచ్చినట్టే.

నా పెళ్లి చెడిపోయాక, నా పట్ల నానమ్మ ప్రేమ మరింత ఎక్కువైంది. భయం కూడా ఎక్కువైంది. రోజులో చాలా సేపు నాతోనే ఉండి నా మీద ప్రత్యేక శ్రద్ధ కనబరచేది.

నన్ను ఓదారుస్తూ, “బాధపడకు అమ్మడూ, అదో దురదృష్టకరమైన క్షణం. జీవితం ఎంతో పెద్దది. నిరాశపడవలసిన పని లేదు” అనేది.

ఇంట్లో విషాదకర వాతావరణమే ఉ౦ది౦కా. ఒక్కోసారి భయం మా వె౦టపడేది. ఉన్నట్టుండి పెళ్లి తప్పిపోడం ఒక పెద్ద నిరాశే, సందేహం లేదు. కాని పెళ్లి జరిగి ఉంటే ఏమయ్యేది? అదింకా పెద్ద ఆలోచన. ఒక్కోసారి ఒక దయ్యపు పాపంలా భయం పెరిగిపోతూ ఉండేది. నేను వణికి పోయేదాన్ని. నా ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలెట్టి౦ది. నేను బలహీనంగా మారాను.

ఒకరోజు ఉదయం ఆమె రావి చెట్టును పూజ చెయ్యడానికి వెళ్తో౦ది. నేను ఎం.ఎ.లో చేరడానికి ఆవిడ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాను. నా కల్లోలిత స్థితికి ఒక ముగింపు పలకాలని నా ఉద్దేశం.

నేను నానమ్మతో వెళ్లాను. ఆవిడ చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేస్తూ తన పూజ కొనసాగించింది.

“నానమ్మ నానమ్మ నేనింకా చదువుకు౦టాను” అని అడిగాను. అమ్మ, నాన్న సరే అన్నారు.

“రామ రామ. పిచ్చా నీకు?” అందావిడ.

కన్నీళ్లు వర్షంలా కురిసాయి. నానమ్మ నా తల ప్రేమగా నిమిరింది.

నేను గంభీరమైన స్వరంతో, “నన్ను కనక చదువుకు ఒప్పుకోపోతే విషం తాగి జీవితం ముగిస్తాను” అన్నాను.

నానమ్మ భయపడింది, కాస్సేపాగి, “ఓహ్… ఓహ్ సువీ… సువ్వీ చావు గురించి మాట్లాడకు. ఒప్పుకుంటాను. ఏం చదువుతావో చదువు” అంది.

సంతోషం ఆశతో తేలి పోయాను.

ఆ సమయం ఎంత శుభ సమయం. ఎం.ఎ.లో సీట్ సంపాదించాను. వచ్చి చేరాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here