అంతరం-5

0
10

[box type=’note’ fontsize=’16’] కన్నడంలో డాక్టర్ జయప్రకాష్ మవినాకులి “అంతర” పేరిట వ్రాసిన నవలను “అంతరం” అనే శీర్షికతో తెలుగులో అందిస్తున్నారు స్వాతీ శ్రీపాద. ఈ ధారావాహికలో ఇది ఐదవ భాగం. [/box]

[dropcap]నే[/dropcap]ను వచ్చేప్పుడు అమ్మ తన పెట్టె ఖాళీ చేసి ఇచ్చింది. అందులో ఆవిడ పెళ్ళికి వచ్చిన కానుకలు ఉండేవి. జ్ఞాపకాలు ఆమె బాధను మరింత ఉధృతం చేసాయి. నానమ్మ బస్ స్టాండ్ వరకూ నాకూడా వచ్చింది. మొదటిసారి నాకు వీడ్కోలు చెప్పేప్పుడు ఇద్దరూ అంతులేని ప్రేమ, ఆప్యాయతలు కురిపించారు.

బండి కదిలే ముందు నానమ్మ,

“డియర్ సువ్వీ ఈ బంగారు ఉంగరం నీతో ఉ౦చుకో. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది పెద్ద అండగా ఉంటుంది” అంటూ ఉంగరం నా చేతికిచ్చింది.

నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

వీడ్కోలు సలహాలు ఇస్తూ తనను తానూ బిజీగా ఉంచుకు౦దామె.

“నెలసరి సమయంలో కాలేజీకి వెళ్ళకు. రోజూ బాగా స్నానం చెయ్యి. వేన్నీళ్ళ స్నానానికి నీకు ఎవరు సాయం చేస్తారు?” లాటివి.

బస్ వచ్చింది. నేను ఎం.ఎ.లో చేరాను. నిన్ను కలుసుకున్నాను. అంతే.

ఇప్పుడు నాకు నా టౌన్ గుర్తుకు వస్తోంది. వెళ్లాలని ఎంత బలమైన కోరికగా ఉందో.

ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను. ఎక్కడికో తెలియని దూరాలకు పరుగెత్తుకు వెళ్లిపోవాలి. తీక్షణమైన గంగోత్రి ప్రమాదకరంగా ఉంది. ఈ శోచనీయమైన విపత్తు నుండి నేను తప్పి౦చుకోవాలి.

పరుగెత్తు… పరుగెత్తు…పరుగెత్తు

కిట్ బాగ్‌ ఒక చీర ఉంది. వెంటనే దొరికినవి అవీ ఇవీ బాగ్‌లో కుక్కుకుని నా టౌన్‌కి బయల్దేరాను.

దొరికిన రిక్షాలో ఎక్కి బస్ స్టాండ్‌కి వెళ్లాను. బస్ ఇంకా రాలేదు. క్రితం రాత్రి ఏమీ తినలేదేమో ఆకలిగా ఉంది. దొరికినదేదో తిన్నాను. “టౌన్‌కి వెళ్ళాక ఏం చెయ్యాలి?” అన్న ఆలోచన నన్ను వెన్నాడింది. నీ నిర్లక్ష్యం నన్ను చిరాకు పరచింది. నేను ఇంటికి వెళ్లి పోడం దానికి బదులు ఎలా అవుతుంది?

ఆవుకి జబ్బు చేస్తే ఎద్దుకి తీవ్రమైన చికిత్స ఇవ్వడం.

ఎంత హాస్యాస్పదం!

శనివారం సెమినార్ జరగాల్సి ఉంది. వచ్చే వారం పరీక్షలు. మేడం చెప్పారు. నేనిప్పుడిలా హఠాత్తుగా వెళ్ళిపోతే… నాన్నకు ఏం చెప్పను? అన్నిటికన్నా ముందు నాన్న పాతకాలం మనిషి ముందు నా అఫైర్ వల్ల కలవరపడతాడు. మా అఫైర్ విషయం తెలిసిందా నన్ను బతకనివ్వడు. మా నాన్న చాలా సున్నితమైనవాడు, తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటాడు కూడా. ఇప్పటికీ నన్నో బరువుగానే భావిస్తున్నాడు.

నాన్న ఎప్పుడూ అంటూ ఉంటాడు “గ్లాస్ పగిలి౦దా దాని అవసరం పోగొట్టుకున్నట్టే” అని. ఆ తరువాత గాఢమైన నిశ్శబ్దం. ఇప్పటికే నాన్నకు తీవ్రమైన శిక్ష విధించాను. ఇప్పుడిహ నాన్న మొహం చూడలేను. ఆ ఆలోచన నా ప్రస్తుత నిర్ణయానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టింది.

రిక్షాలో హాస్టల్‌కి తిరిగి వెళ్లాను. నా రూమ్ మేట్ డ్రెస్ మార్చుకు౦టో౦ది- బెల్ బాటం నుండి నైట్ డ్రెస్ లోకి. తలుపు తీసే ఉంది. పాడ్ బ్రా వేసుకుని ఉంది. దాని వల్ల ఎద మామూలుకన్నారె౦డి౦తలు కనిపిస్తుంది. విపరీతమైన సెక్సీగా అనిపిస్తుంది. వాళ్ళని మోహపరచడానికి అదొక వల అని చెప్తూ ఉంటుంది. అది కృత్రిమమైన బ్రా అని వాళ్ళకెలా తెలుస్తుంది?

నా పురాతన విధానాల ను౦డి ఆధునికతకు మారాలని నన్నెపుడూ మరులు కోల్పుతూనే ఉంటుంది ఆమె. నాకది వికారంగా అనిపిస్తుంది. నేను రూమ్ తలుపు వేశాను. నా చేతిలో కిట్ బాగ్ ఉంది.

“ప్రేమికుడితో పారిపోవాలని ప్లాన్ చేశావా ఏమిటి?” అంటూ నన్ను గట్టిగా పట్టుకుని నా బుగ్గ బలంగా కొరికింది.

ఆరోజున ఆమె విపరీతంగా స్వలింగ సంపర్కిలా ఉద్రేక పడింది. ఆమె తన వీపు నావైపు ఉండేలా తిరిగి బటన్స్ పెట్టమని అడిగింది. నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు.

“సువ్వీ ఈ విషయం తెలుసా? మన డిపార్ట్‌మెంట్ రీడర్ రామమూర్తి నన్ను తన గదిలోకి పిలిచాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకు. నన్ను ముద్దుపెట్టుకున్నాడు. ముసలాడే అయినా ఒక రకంగా యువకుడిలానే ఉన్నాడు” అంటూ నా వెనక నుండి నన్నువేగంగా గట్టిగా హత్తుకుంది. స్పృహ తప్పినట్టు అనిపించింది నాకు. నా కళ్ళు గట్టిగా మూసుకున్నాను. నేను మామూలు స్థితిలో లేను. అది ఆమెకు ఆ పరవశపు స్థితిలో ఎలా తెలుస్తుంది?

నేను ఏం స్పర్శి౦చాలనుకున్నానో అది ఆమెకు ఒక తీపి వంటకన్నా తక్కువ. చివరలో ఆమె మాట్లాడటం ఆపి నా భుజాలు కుదుపుతూ “ఏంటి? నువ్వేమీ మాట్లాడటం లేదసలు?” అని హిందీ పాట ఒకటి పాడుతూ తలుపు తీసి బయటకు పెరుగెత్తింది. నిజం ఆమె ఉల్లాసంగా బ్రతికే మనిషి. ఆమెకు భయంలేదు. ఆమెకు హద్దులు లేవు ఆంక్షలూ లేవు.

నేను స్వేచ్చగా ఉ౦డాలి. స్వేఛ్చ.. స్వాతంత్ర్యం. నేను సోషల్‌గా మారాలి., నేను ఉల్లాసంగా, స్వేచ్చగా, రెక్కలు మొలిచిన పక్షిలా ఉండాలి నేను. మన ఊహలు తప్పు కావచ్చును, సంఘటనలు జరగవచ్చును. ఎందుకు? అన్ని సంఘటనలూ మానవజాతికి ఏవో సందేశాలు ఇస్తాయని అనుకోడం కష్టం. ఇలాటి ఏవో సంఘటనలు ఎన్నో ఉండవచ్చును. నాకెలా తెలుసనీ నన్ను అడగవద్దు.

హోమోసెక్సువల్ యాక్ట్ సందర్భంగా- నాకు ముసలి పీనుగ, డా. రామకృష్ణయ్య ఇంగ్లీష్ ప్రొఫెసర్ అతని రీసర్చ్ అసిస్టెంట్ బట్టతల భరత్ కుమార్ కొజ్జా గుర్తుకు వచ్చారు. వాళ్ళిద్దరి మధ్యా స్వలింగ సంపర్కం ఉండేది. యూనివర్సిటీలో అందరికీ ఈ విషయం ఎరుకే.

నాకు శబీన సమాచారం చెప్పింది. అది ఆమె డిపార్ట్‌మెంట్. ఆమెకూ తెలిసేది కాదు. ఆమె క్లాస్ మేట్ వామన. ఆమె అతనికి చాలా క్లోజ్. అతను చాలా తెలివైన వాడు. అందగాడు. ఆడ వేషం గనక వేసినట్టైతే గంగోత్రిలో చాలా మంది అమ్మాయిలకన్నా బాగా కనిపిస్తాడు.

అతని సిద్ధాంత వ్యాసం సమర్పించడానికి ప్రొఫెసర్ దగ్గరకు వెళ్ళాడు. ఆ రోజున కాలేజిలో బిజీగా ఉన్నాను సరస్వతీపురంలో తన ఇంటికి రమ్మని ప్రొఫెసర్ చెప్పారట.

ఏ విద్యార్థి మాత్రం కాదని అనగలడు? చర్చించడానికి ప్రశ్నలు సిద్దం చేసుకుని వామన ఆ రోజున ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళాడు.

ప్రొఫెసర్ గారింటికి పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. బ్రిటిష్ కాలంలో కట్టిన పెద్ద బిల్డింగ్. కాంపౌండ్ వాల్ బయట పరచుకున్న శాఖలతో ఒక పెద్ద చెట్టు.

దానికి కట్టేసిన ఒక జెర్సీ ఆవు. వామన తలుపు తట్టాడు. అది లాక్ చేసి లేదు. వామన పిలిచాడు

“సర్… సర్”

“ఇక్కడికిరా” సుపరిచిత స్వరం. మెల్లిగా మెట్లెక్కి ముందుకు వెళ్ళాడు. మెత్తని స్పాంజ్ మీద నడిచినట్టుగా ఉందతనికి. అది ప్రొఫెసర్ గారి పడక గది.

ప్రొఫెసర్ ఎప్పుడూ వామనను తనతో పడుకోమని అనడం ఆహ్వానించడం చెయ్యలేదు.

“వద్దు సర్, వద్దు సర్ ప్లీజ్ ప్లీజ్…” ఆ నిర్జన ప్రాంతంలో ఒక అరుపు.

వామన బల౦గా ఆయన్ను ఒక తోపు తోశాడు. అక్కడ అతన్ని కలవక ముందు ఎన్నో ప్రశ్నలు వామనకు చర్చించడానికి. ఎంతటి రోతైన, లజ్జాకరమైన ఘటన ఆ బెడ్ రూమ్‌లో పొంచి ఉన్నది.

మనిషికీ మనిషికీ మధ్యన ఎంత విశాలమైన దూరం. ఎంత లోతైన అగాధం? ఒక మనిషిలో కూడా బయటి శరీరానికీ లోలోపలి హృదయానికీ మధ్యన గాఢమైన తేడా?

ఆ అబ్బాయి చాలా రోజులు కోలుకోలేక పోయాడు. ఎప్పుడూ టిప్ టాప్‌గా కనిపించే అతను గడ్డం పెంచుకుని బిచ్చగాడిలా మారాడు. స్వలింగ సంపర్కం మొదలైతే మరొక జాతిపై ఆకలి చచ్చి పోతుంది. ఈ స్వలింగ సంపర్కానికి అలవాటుపడిన వాళ్ళు సహజ౦గా భార్య పట్ల అనాసక్తత పెంచుకుంటారు. ఆ ముసలి ప్రొఫసర్ అలా వుంటే ఇహ అక్కడ జల్సాగా ఉండే అమ్మాయిల మాటేమిటి?

లేడీస్ హాస్టల్ స్వలింగ సంపర్కమనే రోగానికి ఒక సారవంతమైన క్షేత్రం.

రీడర్ శంకర మూర్తి నాతో నవ్వుతూ ఒక జోక్ పేల్చాడు.

“మేడం మీరు అందగత్తే. కొంచం మేకప్ చాలు క్లాస్ మొత్తంలో బ్యూటీ క్వీన్ అవుతారు.” లెక్చరర్లు కూడా మతి పోయి ఇలాటి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు.

బెడ్ లైట్ కూడా ఆర్పి రగ్గు కప్పుకుని నిద్రను ఆహ్వానించాను. కాని నిద్ర ఎక్కడో జారిపోయింది. ఒక్క క్షణమైనా కన్ను మూతపడలేదు. బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతూ ఉండిపోయాను. నాలా ఇలాగ ఎవరూ బాధపడకూడదు.

నేను చిన్నప్పుడు కిచెన్‌లో ఒక బల్లమీద పడుకునే దాన్ని. అమ్మ పనయ్యాక నన్ను తీసుకు వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టేది. అమ్మ ఉదయమే నిద్రలేచేది.

“లే, నిద్రలే సువ్వీ, సూర్యోదయం తరువాత పడుకోడం అంటే దరిద్రం, బిచ్చమెత్తుకునే స్థితిని ఆహ్వానించటమే.” అందుకే అమ్మ నన్ను చాలా సార్లు నిద్రలేపేది. ప్రతిసారీ నేను లేవడానికి నిరాకరించే దానిని. కాని ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. దానివల్ల ఎనాళ్ళుగానో ఉన్న పుకారు స్థిరపడింది.

మైసూర్‌లో ఒక అయిదు నక్షత్రాల హోటల్ ఉంది. లేడీస్ హాస్టల్ అమ్మాయిలూ కొందరు కృత్రిమ సౌందర్య సాధనాల కోసం, శారీరిక ఆనందం, అలంకరణ అందం కోసం పాకెట్ మనీ నిమిత్తం రాత్రిపూట అక్కడకు వెళ్తారు.

పగటి పూట పూర్తిగా హుందాగా మంచి అమ్మాయిలుగా ఉంటారు. అబ్బాయిలతో అస్సలు మాట్లాడారు. పబ్లిక్‌గా తెలిసిన వాళ్ళైతే గర్భం వస్తుందన్న భయం నటిస్తారు.

శకుంతల నా ప్రియమైన సన్నిహితురాలు. ఒక వేళ సీరియస్ విషయాలు రహస్యాలు పంచుకోవాలంటే అది ఆమె తోనే. కారణం ఆమె స్వచ్ఛమైన వ్యక్తిత్వం. పూర్తిగా కొంగు కప్పుకుని నుదుట పెద్ద కుంకం బొట్టుతో కనిపిస్తుంది ఎప్పుడూ.

కాని ఆ రోజున రిక్షా దిగుతున్న ఆమెను చూసి షాకయ్యాను. మర్నాడు అడిగితే తన కజిన్‌ను చూడటానికి వెళ్లానని కాని ఆమె ఎరుపెక్కిన మొహం రహస్యాలు విప్పి చెప్పింది. మొత్తానికి చివరకు తెలిసినది ఆమెకు రోజూ ఎవరో ఒకరు కావాలి. అందుకే ఈ పగలూ రాత్రీ ఆట.

అప్పుడో ఇప్పుడో నిన్ను కలుస్తూనే ఉన్నాను. మరో దారికి మళ్ళి నన్ను నువ్వు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నావు. గడ్డం మీసాలు దట్టంగా పెంచుకుని అలాకూడా స్మార్ట్‌గా కనిపిస్తున్నావు.

రణబీర్ కపూర్ లాగ తెల్లని నీ మోహంలో అవి బాగానే ఉన్నాయి. అమాయకత్వం స్థానంలో గాంభీర్యం చోటు చేసుకుంది. మెరిసే నీకళ్ళలో ఒక రకమైన గాంభీర్యం. ఎందుకు ఇదంతా?

ఎవరి కోసమో వాటి గాఢత అనేది చివరి వరకూ తేల్చుకోలేక పోయాను. నీకు మిత్రులు పుష్కలంగా ఉన్నారు కాని నేను ఏకాకిని.

గుంపులో ఏకాంతం దాచుకు౦టాము. నీకు అనుభవమా అది? మనుషులకు దూరంగా ఉండటం ఎంత బాగు౦టు౦దో నీకు తెలియదు. ముఖ్యంగా కావలసినది ఏకాంతం. భ్రాంతిమయమైన ప్రపంచంలో, ఈ అల్లరి మూకల మధ్య తిని తాగి తుళ్ళిపోడం కన్నా ఏకాంతం ఎంతో ఉత్తమం కదూ. గొప్ప ఆలోచనలు ఏకాంతం లోనే వస్తాయి. గుంపుల మధ్య వ్యక్తిగత గుర్తింపు ఉండదు. మన గుర్తింపు కోసం మనం బయటకు రావలసిందే.

నేనెప్పుడూ ఎవరూ లేని ప్రాంతమే కోరుకుంటాను. ప్రతి చోటా ఈ గు౦పులెందుకు? ఈ శూన్యతలో మన ఉద్వేగ జీవితం కనుగొంటాము. మన సృజనాత్మకత మనం అనుభవిస్తాము.

నేను మైసూర్‌లో చెరువు గట్టున ఒంటరిగా కూచునేదాన్ని.

ఒక రోజు ఏ౦ జరిగిందో నీకు తెలుసా? నా ఆలోచనల్లో నేను మునిగి ఉన్నాను. ఒకదాని వెనక ఒకటి రాళ్ళు చెరువులోకి విసురుతున్నాను. ప్రతి రాయీ ఒక అలల గుంపును ఏర్పరుస్తోంది. అవి నా మనసులో ఆలోచనల అలలు సృష్టిస్తున్నాయి.

పాత జ్ఞాపకాల్లో ఊగుతున్నాను. సమయం గడిచిపోయింది. చీకట్లు కమ్మాయి. అయోమయ స్థితిలో లేచి నడక సాగించాను. కాస్త దూరంలో నలుగురు మనుషులు తాపీగా నడుస్తున్నారు. నేను భయంతో హాస్టల్ వైపు వేగంగా నడక సాగించాను. వాళ్ళూ నా వెనకే వస్తున్నారు. వాళ్ళి౦క నన్ను అందుకోబోయే సమయంలో ఒక స్కూటర్ మా వైపు వేగంగా వచ్చింది. ఆ స్కూటర్ రాకపోయి ఉంటే నేను రేప్‌కి గురయ్యేదానను కావచ్చు. నేను రక్షి౦చ బడ్డాను.

కొ౦దరు సైకాలజిస్ట్‌లు చెప్తారు.

‘రేప్ చెయ్యబడటం లోనూ ఆనందం ఉ౦టు౦ద’ని. ఎందుకో తెలుసా? అది రెండు విధాల వరం. ఒకటి ఆనందం, మరొకటి సానుభూతి కూడా లభిస్తాయి.

నేను సెక్స్ ప్రపంచాన్ని వె౦టాడుతున్నానా లేక సెక్స్ నన్ను వెంటాడుతోందా?

మిగతా ఆలోచనలు ఉక్కిరిబిక్కిరయాయి. సెక్స్…సెక్స్.. సెక్స్…

చాలా సేపు మనుషులను ఈ మాటకు దూరంగా ఉ౦చలేము. అది వాళ్ళ మెదడును ఆక్రమించి ఉంటుంది. అది కలల్లో, సాహిత్యంలో మతంలో అన్ని చోట్లా తొంగి చూస్తుంది.

కొన్ని కోరికలకు లొ౦గిపోయి వాటిని తృప్తి పరచుకోవాలి లేదా మరణాన్ని ఎంచుకోవాలి. అన్ని ఆత్రుతల నుండి మనను మనం స్వత౦త్రులను చేసుకోడం మనను మనం సమర్పి౦చుకోడమే.

లేదూ మృత్యువే జవాబు. మన జనన౦ సెక్స్ మన మరణమూ సెక్సే.

గుమ్మంలోకి తొంగి చూసిన మృత్యువు

ఒక్కోసారి నాకు చచ్చిపోదామని అనిపించేది. నా శవాన్ని మోసే వాళ్ళను నేను చూడాలి. నాకు వాళ్ళను చూడాలని ఉంది. ఎంత మంది బంధువులు, మిత్రులు నా శవాన్ని అనుసరిస్తారో, ఎంతమంది ఏడుస్తారో చూడాలి.

ఆ ఆలోచనే పిచ్చిగా వుంది. నా చావు నేను చూడలేనుగా. ఇతరుల మరణమే నేను చూడగలను.

చావు గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి నన్ను చెప్పనీ.

నా కళ్ళముందు ఎప్పుడు మరణం మా ఇంట్లోకి వచ్చిందో నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. నాలుగైదేళ్ళ క్రితం కావచ్చు.

అది ఏప్రియల్ నెల. పెద్దక్క వచ్చింది. చెప్పడం మర్చిపోయాను నేను చిన్నదాన్ని. మా అక్క గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు కదూ. శాంత దాని పేరు. అక్కా అనో శా౦తక్కా అనో పిలిచే వాళ్ళం. దానిపేరు ఇంట్లో ఎవరూ పిలిచేవారు కాదు. పెద్దవాళ్ళు అమ్మీ అనీ, చిన్నవాళ్ళు అక్కా అనీ అనేవారు. ఒక ఏడాది క్రితం దాని పెళ్లి చేసారు. అది ఇంట్లో మొదటి పెళ్లి. ఎలాటి పెళ్లి అది? కలలో జరిగినట్టుగా జరిగింది.

ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఇంటికి రెండు వైపులా కాస్త ఎత్తుగా వున్న మండపంతో పందిరి వేశారు. ఇరవైమంది కూలీలను ఘాట్ కింద నుండి తెచ్చి పదిహేను రోజులపాటు ఇరవై నాలుగు గంటలూ పని చేయించారు.

అప్పుడు నాకు పదహారేళ్ళు. ఊళ్ళోని ఆడవాళ్ళ౦తా చేరి పచ్చళ్ళు అప్పడాలు, వడియాలు ఒక పరిశ్రమలా చేసేవాళ్ళు.

మరో జ్ఞాపకం కూడా పుట్టుకు వస్తోంది. ఇది నీకు తప్ప మరెవరికి చెప్పగలను? పెళ్లి రోజు సమీపించింది. నాకోసం ఒ౦టిపేట గొలుసు. ఒక సిల్క్ చీర మాత్రం కొన్నారు. అప్పుడు నాకు చీర కట్టుకునే అలవాటు ఉండేది కాదు. సరిగ్గా కట్టుకోకపోతే సిల్క్ చీర జారిపోతూ ఉండేది. కాలేజికి లంగా ఓణీ సరిపోయేవి. ఇంట్లో చీర తప్పని సరి. నా భయం పెళ్లి సంబరాల్లో చీర ఎక్కడ జారిపోతు౦దనో అనే. కాని అక్క పెళ్ళిలో చెల్లెలు చీర కట్టడం తప్పనిసరి.

నేను ఆ సంఘటనే వివరి౦చబోతున్నాను. పెళ్లివారు విచ్చేశారు. సా౦ప్రదాయికంగా అతిధులను ఆహ్వని౦చారు.

సూత్రధారణ సమయం వచ్చింది. మేనమామ దేవుడి గదిలో ఉన్న పెళ్ళికూతురిని తల చుట్టూ బాసి౦గాలతో తీసుకు వచ్చాడు.

పందిట్లో అలంకరించిన వేదిక మీద ప్రతిదీ సవ్యంగా జరుగుతోంది. నేను కూల్ డ్రింక్ తేడానికి ఇంట్లోకి వెళ్లాను. నానమ్మ తొందర చేస్తో౦ది. మామయ్య లోపలికి పరుగెత్తాడు ఆ విపరీతమైన హడావిడిలో నానమ్మ దీవి౦చకు౦డానే పెళ్లికూతురిని మండపం లోకి తెచ్చారు. తప్పనిసరిగా పాఠి౦చవలసిన సంప్రదాయానికి వ్యతిరేకంగా.

నానమ్మ మామయ్య మీద మ౦డిపడి౦ది. “సందేహం లేదు అది నీ అక్క కూతురే. కాని నేను పెంచాను దాన్ని”

“ఆమె జన్మ నిచ్చి ఉ౦డవచ్చు. నువ్వ సంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేసావు, పెద్ద వాళ్ళను మరచిపోయెంత నిర్లక్ష్యం. పవిత్రమైన, అతి ముఖ్యమైన విధానాల్లో ఎవరి అనుమతితో పిల్లను అప్పజెప్పావు.”

అప్పుడే ఆ వార్త మా నాన్నను చేరి౦ది. ఎవరికీ నోరువిప్పే ధైర్యం లేదు. నానమ్మ సంగతి అందరికీ బాగా తెలుసును. మాట్లాడటానికి ఎవరూ ముందుకు రారే, నాన్న వెనక ముందవుతున్నాడు.

“ఇంత గొప్ప హడావిడిలో, మర్చిపోయారు” తడబడుతూ మాటలు తొట్రుపడ్డాయి.

“ఏమిటీ, హడావిడా? నువ్వు దాని తండ్రివి కావచ్చు మీ నాన్నే నామాట ఎప్పుడూ జవదాట లేదు.” నాన్న కండిషన్ దీనంగా ఉంది. కళ్ళలో నుండి నీళ్ళు రాలడానికి సిద్ధంగా ఉన్నాయి.

గొంతు వణుకుతుంటే, “టౌన్‌కి చెందిన ఎవరో ఈశ్వర భట్ట అనుకుంటా… పురోహితుడు తొందరచేసాడు.” అని అరిచాడు

“ఏంటీ ఆ ఈశ్వర భట్టును జుట్టుపట్టి లాక్కురా, వాడు ఇచ్చిన దక్షిణ గింజలు, బట్టలు పట్టుకు వెళ్ళవలసినవాడు. వాడు చావు ఖర్మలు చెయ్యవలసిన వాడు, ధాన్యం ధర గురించి ఎందుకు మాట్లాడతాడు”

క్రమంగా ఆవిడ కోపం తగ్గింది. మళ్ళీ తన శాంతమైన సహజ స్థితికి తిరిగి వచ్చింది. అలసిపోవడం వల్లనేమో దేవుడి గదిలోకి వెళ్ళింది. పెళ్లి ముగిసింది. అంతా సవ్యంగా జరిగిపోయింది.

అక్క వస్తూ పోతూ ఉండేది. కాని ఈ సారి విశేషమే. ఆమె గర్భవతి.

నాకంటే తెల్లగా ఉండేది అక్క. వర్ణి౦చలేము, పూర్తిగా వికసించిన శరీర భాషతో పెళ్ళికి ముందు స్త్రీ అందంగా ఉంటుంది. పెళ్లి తరువాత పూర్తిగా విరుద్ధం. సహజమైన ఆకర్షణ పొగొట్టుకు౦టు౦ది. కాని అక్క అలాకాదు. ఎక్కడ చూసినా సంపూర్ణంగా వెలిగిపోతోంది. ఆమె కడుపు చూస్తే ప్రతి వాళ్ళూ కవలలు ఉన్నారేమో అనే అనేవారు.

కడుపుతో ఉన్న అక్క పుట్టింటికి వచ్చింది. అది తొలి గర్భం ఆమెకు. అమ్మ ఆనందానికి అవధులు లేవు. నానమ్మ పుట్టబోయే మునిమనవరాలి కోసం రె౦డితలు ఆనందంగా ఉంది. అక్కను అపురూపంగా మరింత ప్రేమ మరింత జాగ్రత్తతో చూసుకో సాగారు.

“ఆరో నెల వెళ్ళింది” నానమ్మ అన్నది.

ఒకరోజు, నేను పరీక్షకు వెళ్ళాలి. వద్దన్నా వినకుండా నా జడ అల్లుతోంది అక్క. రెండు జడలు వెయ్యాలని దాని కోరిక.

“ఎంత అందంగా ఉన్నావిప్పుడు. నీలం ఓణీ బాగా మాచ్ అయింది. నీ జడలు చూస్తే ఎవరైనా నీ వెనకే పరుగెత్తుకు వస్తారు” అంటూ నవ్వింది అక్క.

నేను అక్క వంక చూసాను, “పొలిటికల్ సైన్స్ పరీక్ష” అన్నాను.

అది చివరి పరీక్ష. నేను సంతోషంగా దాన్ని ముగించాను. టెన్షన్ ముగిసిపోతే ఎంత స్వేచ్ఛ.

ఎగురుతూ ఇంటికి వచ్చే సరికి ఎదురు చూడని వింత ఆహ్వానం పలికింది. అక్కర్లేని నిశ్శబ్దం. మగవాళ్ళు అక్క గది ముందు మూగారు. అన్న డాక్టర్‌ని పిలవడానికి పరుగెత్తాడు. అమ్మ, నానమ్మ గదిలో ఉన్నారు. మరణ నిశ్శబ్దం. టౌన్ పెద్దాళ్ళు ఆడవాళ్ళు చేరారు. శశి పొరుగూరి నుండి వచ్చింది.

కల్లూరక్క గది నుండి బయటకు వస్తూ “తెలిసిన వాడివి భట్టు, ధైర్యంగా ఉండు” అంది.

కాస్సేపట్లో వేదనా భరితమైన కేక, ఆ వెనువెంటే అరుపులు ఇంటిని ని౦పేశాయి. అక్కకి గర్భస్రావం. ఆగకుండా రక్తస్రావం. ఆకాశాన్ని అలుముకున్న విషాదపు శబ్దం. అక్క చివరి శ్వాస తీసుకుంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి.

నానమ్మ మునిమనమరాలిని చూసుకోవాలని ఎంతో ఆత్రుతగా ఉ౦డి౦ది. అమ్మా నాన్న మనవడు కలగాలని ఆశపడ్డారు. అమ్మ విషాదపు హృదయలోతులను ఎవరు అంచనా వెయ్యగలరు?

నేను మా ఇంట్లో చూసిన మరణం అది. ఎవరయినా నమ్మవచ్చు నమ్మకపోవచ్చును, నాన్న బంగారు మురుగులు గొలుసు చేయించి పెట్టాడు. నేనెలా భరి౦చానో నాకే తెలియదు.

మా ఇంటి పుటల్లో ఒక విషాదపు కాగితాన్ని మృత్యువు తన చల్లని చేతితో తిప్పింది. నాన్న నిశ్శబ్దంగా మారిపోయి ఇంటి పనులూ ఆర్థిక వ్యవహారాలకూ కూడా దూరంగా ఉంటున్నాడు.

అతని హృదయంలోని వేదన అంతులేనిది, అమ్మ భయాలు ఎవరు తొలగించాలి?

ఇంట్లో అందరూ అపరిచితులే. అమ్మ నిశ్శబ్దంగా కూచుని ఉంది. ఆమె ఎప్పుడు చూసినా అంతం లేని పనిలో లీనమై ఉండేది. అసలామే అలా నిరంతరం ఇంటిపనిలో లీనమై పోడానికే పుట్టిందేమో. ఆమె పెదవుల మీద ఎప్పుడూ ఒక చిరునవ్వు చూడలేదు నేను. భయంకరమైన ధీరోదాత్తత.

ఆమె మా అదృష్ట దేవత. మహాలక్ష్మి. ఆమెను అత్తారింటికి పంపించేటప్పుడు వాళ్ళ అమ్మ ఇచ్చిన సలహా, “అమ్మాయ్, పెద్దింటి బాధ్యతలు తీసుకోబోతున్నావు. నీ కంట్లో నీరు రాకూడదు. ఆడవారి కన్నీళ్లు ఇంటికి అరిష్టం”

ఆమె జీవిత౦లో ఎప్పుడూ ఒక సినిమా కూడా చూడలేదు. పండగకో మరి దేనికో పుట్టింటికి వెళ్లాలని ఉందని కూడా అడగలేదు.

ఒక్కోసారి యక్షగాన ప్రదర్శకులు బృందాలుగా వచ్చేవారు. చూడటానికి వెళ్దామని నేనే ఆవిడను సతాయించేదాన్ని. జీవితంలో ఎన్నడూ ఒక చీరో ఒక నగో అడిగిన గుర్తే లేదు.

కాని ఇప్పుడు మా అక్క మరణం ఆవిడ వెక్కిళ్ళను ఆపలేకపోయింది. నానమ్మ రాతి గుండె దానిలా, మనోస్తైర్యం ఉన్నట్టు కనిపిస్తోంది కాని ఆమె అందరినీ ఓదార్చాలి మరి. ఆవిడ తన మొగుడి మరణాన్నే ధైర్యంగా స్వీకరించింది.

అమ్మకు ధైర్యం చెప్తూ, ఓదారుస్తూ ఆవిడ చెప్పేది, “ప్రతి వారికీ వారి వంతు సుఖ సంతోషాలు లేదా దుఃఖాలు రాసే ఉంటాయి. అదే విధి, మా ఇంటి లక్ష్మివి నువ్వు. నువ్వు కన్నీరు పెట్టరాదు. మరణం తప్పించుకోలేనిది. ఏ తల్లీ తన పిల్లల మరణం చూడలేదు.”

నేను నా ఉద్విఘ్నత ఎలా కంట్రోల్ చేసుకున్నానో ఆశ్చర్యమే. ఏవైనా తిరిగి పొందవచ్చును, ఆస్తులో, ధనమో, ఇల్లు, బ౦గారం కాని మరణించిన సోదరిని కాదు. నా అక్క నాకు మిత్రురాలు, తాత్వికురాలు, నా మార్గదర్శి కూడా.

ఆ ఉదయం ఆమె స్వరం ఎంత తియ్యగా ఉ౦డి౦ది. నా జడ ఎంత ప్రేమగా అల్లింది. ఆ అద్భుతమైన రోజు సాయంత్రానికల్లా ఆమె ముగి౦పును హత్తుకుంది. ఆమె అల్లిన జడ చెదిరిపోకముందే ఆమె బూడిదగా మారిపోయ౦ది.

పుట్టుక అనేది వెన్నంటి వచ్చే చావు, ఎప్పటికీ ఆగకుండా ఒకదాన్ని ఒకటి వెన్నాడుతూ వచ్చే చక్రం. ఎవరు వాటిని జయిస్తారు? ఎప్పుడు? అవన్నీ అయోమయమే.

ఆ రోజున శవాన్ని తీసుకెళ్ళి చితిమీద పెట్టినప్పుడు నానమ్మ నన్ను ఒంటరిగా వదలలేదు. నాతో పాటు దేవుడి ముందు కూచుని శ్రీరామ శ్రీ రామ అంటూనే ఉంది. అక్క ఎలా కాలిపోయి౦ది?

పుర్రె పేలిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి౦దా? మంచులా తెల్లనైన అక్క శరీరం నల్లగా మారిపోయి ఉంటుందా? ఎంత బాధ. ఎవరికి ఎలా చెప్పను దీన్ని?

తీసిపారేయ్యలేని ఆ బాధ ఇంట్లో అందరినీ ప్రభావితం చేసి౦ది. నేను నానమ్మ పక్కన పడుకోడం మొదలు పెట్టాను. ఆవిడకు మరింత దగ్గరయ్యాను. ఆవిడకు దగ్గరగా చుట్టుకు పడుకోడం వల్ల నిద్ర నన్ను జోకొట్టేది. ప్రతి చెడు విషాదం వెనకా తప్పకుండా ఓదార్చే ఒక ప్రియమైన హస్తం ఉండే ఉంటుంది. నానమ్మ నా ఉదాహరణ. ఇది సూర్యుడున్నంత నిజం. నన్ను నమ్ము, ప్రభాకర్.

నీకు చుట్టూ మనుషులు ఉ౦డాలి. ఒక్కసారి కాంటీన్ లోకి ఒంటరిగా వచ్చే వాడివి కాదు. ఎప్పుడూ విడిపోని వాళ్ళే -శ్రీకాంత, కరాళి, మునార్, శివ ప్రకాష్,మూర్తి, గణపతి, జయరాం. కృష్ణ గౌడా, చంద్రు, శ్రీనివాస గౌడ, కొడగు జయరాం.

కాని నాకు ఒంటరిగా ఉండే వ్యక్తిగత ఆనందమే నచ్చేది. అందుకే తోటలో ఒంటరిగా కూచుని కలలు కనే దాన్ని. నీకు ఈ భావం అర్థం కాదు అందుకే నీకిది నచ్చదు కదూ. ఈ విషయాలన్నీ అశాశ్వతం, త్వరలో అదృశ్యమైపోతాయి.

పున్నమి తరువాత అమావాస్య లాటిదే ఇది. మన జీవితాలలో మనం ముందుకు వెళ్తాం, నీ నా విద్యార్థి జీవితం ఒక రోజున ముగిసిపోతుంది. అప్పుడు నా మాటలు గుర్తుతెచ్చుకుంటావని అనుకుంటాను. నేను వేదా౦తం మీద ఉపన్యసిస్తున్నానని అనుకోవద్దు ప్లీజ్. నిన్నీ కాంపస్‌లో చూసిన అమ్మాయలు వచ్చి నాతో చెప్పారు.

“సువర్ణా, అతనికి గడ్డం తీసేయ్యమని చెప్పు. కాని ఆ రోజు ఎంతో దూరం కదా, నీ బాయ్ ఫ్రెండ్ ఋషిగా మారుతున్నాడు”

కాని వాళ్ళకేం తెలుసు మన సాన్నిహిత్యం వెలసిపోయి౦దని. చాలా రోజులుగా మనం కలుసుకోడం మాట్లాడుకోడమే లేదు. అదీ గాక నేనొచ్చి ఎందుకు చెప్పాలి? ఆ ప్రశ్న నన్నువేధిస్తో౦ది. కాని వాళ్ళు మన సాన్నిహిత్యం గురించి మాట్లాడినప్పుడు నా ఒళ్లంతా ఒక థ్రిల్ పాకినట్టనిపి౦చి౦ది. నా ఒళ్ళు అసంకల్పితంగానే పొ౦గి పోయేది. ఇదంతా ఎలా అనుభవి౦చేదాన్ని? దీన్ని ఎలా అధిగమి౦చాలి?

చెప్పు ప్రభాకర్, ఈ వ్యాఖ్యలు నువ్వేమీ పట్టించుకోకుండా నువ్వేమీ వర్ర్రీ అవడం లేదు. పెదవుల మధ్య సిగరెట్ ఇరికి౦చుకుని, పెంచుతున్న గడ్డంతో హాయిగా తిరిగేస్తున్నావు. దీనికి అంతం ఎప్పుడు, ఎక్కడ?

నేను బయటకు రాడానికే విసిగిపోయాను. ఒకరోజు టెర్రస్ పై కూచున్నాను, చుక్కలు మెరుస్తున్నాయి, నేను చాలా చిన్నప్పుడు ఆ చుక్కల్లో మా మామను, అతని జనాలను, క్లాస్‌మేట్‌ని, భట్‌కి చెందిన అబ్బాయిని మరెందరినో చూసే దాన్ని. ఒక పాట గుర్తుకు వచ్చింది. “ ట్వి౦కిల్…ట్వి౦కిల్ లిటిల్ స్టార్” చంద్రుడు కనిపిస్తున్నాడు అతనిలో కుందేలుతో సహా.

“చందమామ రావే, జాబిల్లి రావే” ఎంత మధురమైనవి ఆ రోజులు? అందరం కలిసి తినడం ఎంత ఆనందించాం? నేను వెచ్చని పడక నా ప్రియమైన నానమ్మతో హాయిగా పంచుకుంటున్నాను. నానమ్మ చేయించే వేడి నీళ్ళ స్నానం ఎంత సమ్మోహనంగా ఉండేది. నా హృదయానికి ఎంతో ప్రియమైన చిన్నప్పటి నోస్టాల్జిక్ జ్ఞాపకాల్లో తేలిపోతున్నాను. ఆ స్వప్నం వంటి రోజులు మళ్ళీ వస్తాయా? ఎక్కువ ఎమోషనల్ అయ్యే నా స్వభావం వల్ల మాట గొంతులో అడ్డుపడి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. రోజులు దొర్లిపోయాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here