అంతరం-6

0
13

[box type=’note’ fontsize=’16’] కన్నడంలో డాక్టర్ జయప్రకాష్ మవినాకులి “అంతర” పేరిట వ్రాసిన నవలను “అంతరం” అనే శీర్షికతో తెలుగులో అందిస్తున్నారు స్వాతీ శ్రీపాద. ఈ ధారావాహికలో ఇది ఆరవ భాగం. [/box]

[dropcap]ఒ[/dropcap]క రోజున పిక్నిక్ అనేది పైకి వచ్చింది.

నువ్వు క్లాస్ సెక్రటరీవి. నువ్వు లిస్ట్ తయారు చేసి అందరి దగ్గరనుండీ డబ్బులు వసూలు చేస్తున్నావు. నువ్వు వచ్చి నాతో మాట్లాడవన్ననా భయం నాకుంది.

ఈ శిక్షకు అంతం ఎప్పుడు? కాని ఆరోజు నాకు వరం అని నిరూపితమైంది. బానిసత్వం నుండి విముక్తి, అమరత్వానికి దారితీసే పునర్జన్మ పొ౦దిన రోజు. నువ్వు డైరెక్ట్‌గా నా దగ్గరకు వచ్చావు. ఎప్పుడూ ఉండే గాంభీర్యం నీ మొహంలో లేదు.

“నీ పేరు రాస్తున్నాను. నువ్వు వస్తున్నావు కదూ” నువ్వు అడిగావు. నేనేదో అనబోయాను

“నేను రావట్లేదు. నేను రాదలచుకుంటే నేనే నా అంతట వచ్చి పేరు ఇచ్చేదాన్ని”

అలా అని నీ గర్వం గాయపరిచే శాడిస్టిక్ ఆనందం పొ౦దాలని అనుకున్నాను. ఈ ఆహ్లాదం క్రూరం కదా? కాని అది జరగలేదు. నువ్వు నా హృదయాన్ని గెలుచుకున్నావు.

ఈ మానసిక ఘర్షణలో నువ్వు విజయుడివై నిలిచావు. నా మాటలు మంచులా కరిగిపోయాయి. నేను హుందాగా, “అవును వస్తాను” అన్నాను.

పేరుకుపోయిన కోపం, వేదన మాయమైపోయాయి. దానికి విరుద్ధంగా నా కోపం అదే ప్రేమ విశ్వాసంగా మారిపోయింది. నా బలహీనత. వెన్నుపోటు ఎవరైనా పొడవగలరు. నువ్వు రెండుతలల గండభేరుండవి.

నీ హృదయానికి ఇంతే ప్రీతికరమైన విరుద్ధ బంధాన్ని ఎలా బద్దలు చెయ్యాలి?

పిక్నిక్‌కి ఇంకా పూర్తిగా నాలుగు రోజులున్నాయి. ఆదివారం ఉదయమే మొదలై శ్రావణ బెళగోలా, బేలూర్, హలీబీడు వెళ్ళే ప్లాన్. మూడురోజులు నువ్వు ఎంతో బిజీగా ఉన్నావు బస్ ఏర్పాటు, తిండి ఏర్పాట్లతో సతమతమవుతూ.

పిక్నిక్ ముందు రోజు నిన్ను కలిసాను. ఆ రోజు శనివారం. క్లాసెస్ లేవు. లైబ్రరీ నుంచి హాస్టల్‌కి వెళ్తున్నాను. ఒంటరిగా ఉన్నాను. అదృష్టవశాత్తూ నువ్వూ ఒంటరిగానే ఉన్నావు. ఇద్దరం ఒకరికొకరం దగ్గరగా వచ్చాం.

నువ్వు అన్నావు, “హలో సువ్వి” ఓహ్ ఎన్ని రోజుల తరువాత!

మెత్తని చిరునవ్వు విసిరాను. నాట్యం చెయ్యాలని అనిపి౦చి౦ది నాకు.

జోక్ చేస్తూ అడిగావు, “ కాఫీ తాగి౦చవా?”

నేనూ అన్నాను “తాగి౦చనని అన్నానా?”

ఆనందాతిశయంతో ఇద్దరం కాంటీన్‌కి వెళ్లాం. నన్ను భయం వెన్నాడుతూ ఉంది, కారణం ఊహించగలవా?

మనం ఇద్దరమే ఉన్నాం. అది మొదటిసారి. ఒక అబ్బాయితో కాఫీ తాగడానికి వచ్చాను.

“నువ్వు దూరంగా ఉన్నప్పుడు నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని అనిపిస్తుంది. నా ముందుకు వచ్చావంటే అవన్నీ ఆవిరైపోతాయి. నోట మాట పెగలదు. నువ్వు నిప్పువూ కాదు, నేను నీరూ కాదు. కంటికి కనిపించే దాన్ని మించి మరేదో ఉంది. హృదయపు లోలోతుల్లోని మన హృదయాలలోకి దూకాలి. మూలాలను తవ్వి తీసి, ముక్కలు ముక్కలు చేసి దాని వివరాలు తెలుసుకోవాలి.

కాంటీన్‌లో గద్దచూపులు మనపై దుష్ట భావాలు ప్రసరిస్తున్నాయి. కాని నువ్వు ఈ ప్రలోభాలకు దూరంగా ఉన్నావు.

అందరినీ పలకరి౦చట౦లో బిజీగా ఉన్నావు, నీకు తెలియని వాళ్ళే ఉండరా? యూనివర్సిటీ రాజకీయాలన్నీ నీకే కావాలి.

ఖాళీగా కుర్చీలో కూచుందుకు నీకు చాలా సమయం పట్టింది. నాకు కోపంగా ఉంది, ఎంత సేపు ఎదురు చూడాలి.

ఒకరి ఎదురుగా ఒకరం కూచున్నాము. నువ్వు అడిగావు.

 “ఏం కావాలి సువ్వీ?”

“నీకు కావలస్సినవి నువ్వు తీసుకో మనసారా ఆస్వాదించు. కాని నేను నీకు ఆతిథ్యం ఇస్తాను” అన్నాను.

మనం తిన్నవన్నీ నాకు గుర్తు లేవు. బిల్ నేను అందుకున్నాను. నువ్వు దాన్ని లాక్కోవాలని చూసావు. నీ స్పర్శ నాలో ఒక రకమైన విద్యుత్తూ పుట్టించింది. అది ఒళ్లంతా పాకిపోయింది.

నీ చేతి వేళ్ళు నన్ను ఆకర్షించాయి. ఎంత మెత్తగా ఉన్నాయి, నా వేళ్ళ కన్నా మెత్తగా. ఏదో మానసిక భావన నన్ను డిప్రేస్ చేసింది. ఆ పరవశపు క్షణాల్లో ఒక అసూయ ఒక న్యూనత రాజ్యమేలాయి. ఆ తరువాత అసూయ రాక్షసులుగా మారిస్తే న్యూనత యాచకులను చేస్తుంది. ఎందుకు ఇదంతా?

తెలుపు-నలుపు బాహ్య రూపు రేఖల అల౦కరణ వల్ల అర్థం అవుతుందా? నా మనో కామన, మాట నీ మనసుకు దగ్గరగా ఉండవచ్చును. కాని నువ్వు దాన్నెపుడూ గుర్తించలేదు.

వ్యక్తిగతంగా మాట్లాడుకు౦దు కు కాంటీన్ సరైన స్థలం కాదు. మనం బయటకు వచ్చాం.

“రోజూ నిన్ను కలిస్తే బావుంటుంది కదా ఫ్రీగా కాఫీ దొరుకుతుంది” అన్నావు.

నా స్వరం ఆలోచనలతో పూడుకుపోయింది.

“నీకంతగా కావాలంటే ఏడాది పొడుగునా ఇస్తాను”

“ఎక్కడికి వెళ్తున్నావు సువ్వీ, నేను నిన్ను ది౦పనా?” అడిగావు.

నేను నిశ్శబ్దంగా ఉన్నాను.

నిశ్శబ్దం బాగా మాట్లాడుతుంది. మనం హాస్టల్ వైపు కదిలాము. నాకు గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది.

“చాలా రోజులు నేను సజీవంగా లేనేమోనని అనిపించింది. నువ్వంత సుకుమారం అని నేను అనుకోలేదు. ఆ రోజు జరిగినదానికి నేను బాధపడ్డాను. సారీ ”

“గతం మర్చిపో సువ్వీ, తీపి జ్ఞాపకాలనే గుర్తు పెట్టుకు౦దాము. మరోసారి కలిసినప్పుడు మాట్లాడుకుందుకు చాలా ఉంది. మన హృదయాలు విప్పి ఒకరితో ఒకరం ఓపెన్‌గా మాట్లాడుకుందాం”

నువ్వు తెలివిగా మనం మాట్లాడే విషయాన్ని మార్చావు. హాస్టల్ ముందు రాతి బెంచ్ మీద కూచున్నాము. మన క్లాస్ గురించి మాట్లాడుకున్నాము. కాంపస్‌లో రకరకాల మనుషుల గురించి, అమ్మాయిల బాయ్ ఫ్రెండ్స్ గురించీ, ప్రొఫెసర్‌ల ఇష్టుల గురించీ పిక్నిక్ విషయాలూ మాట్లాడుకున్నాము.

రేపు మంచి ఆహారం ఏర్పాటు చెయ్యమని నేను నీకు చెప్పాను.

“తిండి కోసం కాదుగదా ఈ పిక్నిక్, నాలుగు ప్రాంతాలు చూసి రావడానికి” అన్నావు నువ్వు.

హాస్టల్ బెల్ మోగింది, లంచ్‌కి పిలుస్తున్నట్టుగా, లేకపోతే మాటలు అలా సాగిపోయేవేమో.

“రేపు ఆలస్యం చెయ్యకు. ఆరింటికల్లా సిద్ధంగా ఉండు. బస్ మీ దగ్గర్ను౦డే మొదలుతు౦ది” అన్నాడు.

నేలను బొటనవేలితో రాస్తూ వీడ్కోలు పలకడానికి సిద్ధంగా ఉన్నాను. నేను జంకు జంకుగా అడిగాను, “పిక్నిక్‌కి ఏ రంగు చీర కట్టుకు రాను” భయపడ్డాను.

నువ్వు మాత్రం “బట్టలు వద్దు, నగ్నంగా రా” అని పెద్దగా నవ్వావు.

“అల్లరి పిల్లడా, ఒట్టి పోకిరీ” నన్ను మధ్యలో కట్ చెస్తూ,

“చూడు, పాత చీరలో పిచ్చిగా రాకు, నీలం రంగు చీర కట్టుకుని తల బాగా దువ్వుకుని రా.”

నేను బై చెప్పాను.

మన టౌన్ మందిరంలో కార్తీక మాసం గొప్పగా జరుపుతారు. రుచికరమైన వంటలు దేవుడికి సమర్పిస్తారు. ధాన్యం గి౦జలు ఉడికించి భక్తులకు పంచుతారు. ఆ తరువాత టౌన్ యువత పోటీలలో పాల్గొ౦టు౦ది.

హైజంప్ పోటీలకు తగ్గట్టు చీరకట్టుకుని అలసిపోయే వరకూ, తొడలు నొప్పి పుట్టే వరకూ దూకడానికి నేను ఇష్టపడతాను.

నిద్రలో కలలు వరసగా ఒకదాని వెనక ఒకటి నాపై దాడి జరిపేవి. మా పెద్ద హాల్‌లో నాన్న పెద్ద కుప్పపోకలను పూజ చేస్తూ ఉంటాడు. మార్కెట్‌కి పంపే ముందు సా౦ప్రదాయికంగా పూజ చేస్తాడు. నాన్న వాటి తూకం మొదలు పెట్టాడు. నౌకర్ సన్నా పోక సంచులు వరసగా పెడుతున్నాడు. ఈ కార్యక్రమం సాగుతూ ఉంటుంది. ఇహ తూకం అయిపోయాక నేను కూచున్నాను తక్కెట్లో తూకానికి. ఎడం వైపు తక్కెడ ఎంతకీ లేవదు. నౌకర్ చిన్న బాగ్‌ని పోకలతో నిండా ని౦పాడు, ఉహు, చివరకు ఓడిపోయినట్టు వదిలేసాడు. నాన్న తమలపాకులు నములుతున్నాడు. ఆయన అది ఆపి బాగ్ మరి౦త ని౦పమని ఆజ్ఞాపించాడు. తక్కెడలో ఎక్కడా కదలిక లేదు. ఆ తక్కెడలో వేలాది టన్నుల పోకలు తూచారు.

నాన్న తనలో తను గొణుక్కుని, “ఒక్క నిమిషం ఆపు” అని లోనికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆయన పూర్వీకులు పెట్టుకున్న సిల్క్ తలపాగా పెట్టుకుని, పంచె కట్టుకుని సా౦ప్రదాయిక హిందూ విధానంలో వచ్చాడు. కోట్ కూడా వేసుకున్నాడు. నెమ్మదిగా వచ్చి, తన పెద్దన్నతో అన్నాడు.

“నెమ్మదిగా చెయిన్ లాగి గమనించు”

జయన్న నెమ్మదిగా చెయిన్ లాగాడు. ఉహు. వృధా ప్రయత్నం. నాన్న కళ్ళు ఎరుపెక్కాయి,

“నేను నాలుగు ఎకరాల పోక తోట, నాలుగు వందల ఇరవై ఎకరాల వరిపొలం, నూట ఇరవై ఎకరాల బీడు భూమి, ఈ గ్రామంలో మూడు అంతస్తుల భవనం, వీటికి యజమానిని. నేనిక్కడ తక్కెట్లో కూచు౦టున్నాను. అమ్మా నాన్నకూచున్న తూకం చైన్ లాగారు. కాని తక్కెడ కదలలేదు.

నాన్న మొహం నల్లబడి౦ది. ఆయన మొహం మ్మీద చెమట చుక్కలు ఉబికి వచ్చాయి, ఆయన తలపాగా ఊగింది. లోపల ఉన్న నానమ్మ వాళ్ళ అరుపులు విన్నట్టుంది. వాస్తు తలుపు దగ్గర నిల్చుని కొ౦గు బిగించి నడుం చుట్టూ దోపుకుని

 “రామూ, ఏం చేస్తున్నావు?” అని గట్టిగా పిలిచింది.

నేను భయపడ్డాను. ఈ తూకం ఎందుకు మొదలు పెట్టాను అనిపించింది. ఎందుకు ఎడం వైపు తక్కెడ లేవడం లేదు. చూస్తే అక్కడ నువ్వు ప్రభాకర్, కూర్చుని ఉన్నావు.

నానమ్మ వచ్చింది. నాన్న కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ –

“అమ్మా తక్కెడ ఎంత మాత్రం లేవడం లేదు” అన్నాడు.

అన్న భయంగా ఆశ్చర్యంగా తన చూపులు నా వైపు సారించాడు. నానమ్మ నావైపు చూస్తో౦ది, నేను తలవంచుకున్నాను. నీ చూపులు ఎక్కడో దూరంగా దిగంతాలపైన ఉన్నాయి. నానమ్మ వచ్చింది. నా గుండె కొట్టుకుంది, ఏదో ఉపద్రవం కోసం ఎదురు చూస్తోంది.

“కాస్సేపు ఆగండి” అంటూ ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది.

ఆవిడ బయటకు వచ్చినప్పుడు పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. ఈ నగలన్నీ ఎక్కడ ఉ౦చి౦ది? పైనుండి క్రింది వరకూ … చీర కొంగు నడుం చుట్టూ తిప్పింది. తలమీద జుట్టు లేదు. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా వచ్చిందావిడ .

ఆమె తక్కెడ చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేసి దానికి మొక్కుతూ –

“సువ్వీ, సువ్వీ, ఇప్పుడు తూగు. ఈ కుటుంబం నిజాయితీకి మారుపేరైతే … నేను మీ తాతగారితో పడక పంచుకుంటే … తూకం సరిపోవాలి”

ఓహ్, నానమ్మా నా జీవితమా, నా ప్రేమా…

ఎవరూ ఈ నరక సదృశ కష్టంతో బాధపడకూడదు. ప్రభాకర్ ఎందుకు నన్నిలా సతాయిస్తున్నావు? నువ్వు శాడిస్ట్‌వా? ఇతరులకు వేదన కలిగిస్తూ ఆనందిస్తావా?

వద్దు తక్కెడ సమానం అవడానికి బదులు ఒక భూకంపం భావంతో దూలాలు, గొలుసు, రాళ్ళు , స్తంభాలు వణకడం మొదలు పెట్టాయి. చైన్ నా మీద పడింది, కెవ్వున అరిచాను.

“నానమ్మా”

నా ఒళ్లంతా చమటతో తడిసి ముద్దై౦ది. ఫీనిక్స్ పక్షి గురించి విన్నావు కదూ – అది దానంతట అదే చితిలో కాలి బూడిద నుండి మళ్ళీ పుట్టుకు వస్తుంది.

ఈ బాధ కూడా అలాటిదే. పెరుగుతూ… తగ్గుతూ… ఒక క్రమంలో …

బాధ లేకపోడం ఆనందం కాదు. ఆనందం లేకపోడం బాధ కాదు.

ప్రభాకర్ మళ్ళీ జ్ఞాపకం తన్నుకు వస్తుంది. చెదిరిపోయిన కల ఆ రాత్రంతా నన్ను కలవరపరచింది.

కలలో చారుదత్తుడు వసంత సేనను పెళ్లి చేసుకున్నాడు. రోమియో జూలియెట్ చేతులు పట్టుకు నడుస్తున్నారు. శకుంతల దుష్యంతుడితో పరవశంలో ఉంది. పుండరీకుడు మహాశ్వేతా ప్రేమ గుప్పిట్లో ఉన్నాడు. సగం కల, సగం వాస్తవం. నిద్రకోసం నిద్రమాత్రలు మింగాలి …

కాని చచ్చిపోతానన్న భయం, బ్రతకాలన్న ప్రేమ ఆపేశాయి. నేను నా కోసం బ్రతకాలి.

స్వప్న సౌధం వెలిగించిన వేలాది దీపాలు

నువ్వు చెప్పినట్టుగానే, అబ్బాయిల హాస్టల్ తరువాత పిక్నిక్ బస్ ముందు మా హాస్టల్ దగ్గర ఆగింది. కావలసిన సరంజామా అంతా బస్ ఎక్కించారు. భుజాన కెమెరా వేళ్ళాడేసుకుని నవ్వుతూ వచ్చావు నువ్వు. నువ్వు చిరునవ్వుతో పుట్టి ఉ౦టావు. నీతో విడదియ్యలేని లక్షణ౦ నవ్వు అయి ఉ౦టు౦ది. నీ డ్రెస్ నాకు నిరాశ కలిగించింది. నువ్వు బ్లాక్ సూట్ బ్లూ టై వేసుకు౦టావనుకున్నాను.

కాని నువ్వు బ్లూ టీ షర్ట్ బెల్బాట౦ సూట్ వెసుకున్నావు. నాకు బ్లాక్ సూట్ బాగా నచ్చింది. నాకెప్పుడో నువ్వు బ్లాక్ సూట్ వేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. కాని నా ఇష్టం ఎవరికి కావాలి? అది నా తెలివి తక్కువ కోరిక. బస్ ఎక్కేటప్పుడు నాటకీయంగా చేతులు జోడించి కొంచం ముందుకు వంగి విష్ చేశావ్వు నువ్వు.

“మేడంకి ఈ ఉదయపు ఉత్తమ శుభాకాంక్షలు” అని.

అది మోనాలిసా నవ్వు.

నేను సిగ్గుపడ్డాను, నా ధైర్యం కూడగట్టుకుని ధైర్యంగా అడిగాను,

“ఈ సూట్‌లో ఎందుకు వచ్చావు?” నీకు మాటలు నేర్పాలా?

“ఇదేమైనా పెళ్లి ఫ౦క్షనా? నీ పెళ్ళికి పూర్తీ ట్రిమ్ సూట్‌లో వస్తానులే. ఈ డ్రెస్ నాకు హాయిగా ఉంటుంది. నేను తలెత్తేసరికి నా కొ౦గు చివరలు ముడి వేస్తూ ఉన్నాను. నువ్వు నా కళ్ళలోకి చూసావు. నేను నీ కళ్ళలో నా మొహం చూసుకున్నాను. కంటికో భాష ఉంది. కళ్ళు మాట్లాడతాయి. నా శరీరమంతా ఒక వేగవంతమైన కుదుపు. బస్ ఎక్కుతున్న వాళ్ళను నువ్వు పెన్ను పట్టుకుని నోట్ చేసుకు౦టూ ఉన్నావు. బస్ స్టార్ట్ అయింది. నా రూమ్‌మేట్ శబినా నా పక్కన కూచుంది. నేనే దాన్ని బలవంతం చేసి తీసుకు వచ్చాను. నా రూమ్‌మేట్‌గా పరిచయం చేసాను.

“హలో” అన్నావు నువ్వు.

“రే, కొంచం దయ చూపి౦చ౦డి సర్, సువ్వీ ఎప్పుడూ మీ గురించే ఆలోచన. ఎందుకు దాన్ని ఏడిపిస్తారు? నా రూమ్మేట్ కదా నా అఫయిర్స్ అన్నీ దానికి తెలుసు. చాలా సాహసి.”

నువ్వేం మాట్లాడలేదు. నాకు దిగులనిపి౦చి౦ది. నన్ను చూసి ఉ౦టావు. నేను నా తల వంచుకున్నాను. చెమటతో ముద్ద అయిపోయాను.

నేను పువ్వులా సున్నితమైన దానను. నీ పక్కన కూచోవాలని ఎంత కోరుకున్నాను.

గాలిలో మేడలు కట్టుకున్నాను. బస్ స్టార్ట్ అయింది. కొ౦దరు పాడటం మొదలుపెట్టారు. అబ్బాయిలను మించి ఉన్నారు అమ్మాయిలూ. నీతో కలిపి అబ్బాయిలు నలుగురే. ఒక గెస్ట్ కూడా వచ్చాడు. అతను సెక్సీగా ఉన్నాడు. అమ్మాయిలందరినీ ఆకలి చూపులు చూస్తున్నాడు. బహుశా అతని డిపార్ట్‌మెంట్‌లో అమ్మాయిలూ లేరేమో. శబినా వాడికి సి౦గలీక అని నిక్ నేమ్ పెట్టింది.

గోమఠ శ్రావణ బెళగోలా రాతి వద్ద ఉంది. ఆ కొండ ఎక్కడానికి ఎంత శ్రమ పడాలి? శిల్పకారులు ఇది చెక్కడానికి, ప్రపంచం మొత్తం నుండి సందర్శకులను ఆకర్షిస్తున్న ఇంత పెద్ద అద్భుతమైన విగ్రహాన్ని పనితనాన్ని స్థాపించడానికి ఎంత కష్టపడి ఉ౦డాలి.

ఆ ఆలోచనే మమ్ములను ఆశ్చర్య చకితులను చేసేది గా ఉంది. శబినా ఏమందో నీకు తెలుసా?

“నేను గోమఠ విగ్రహంలా నగ్నంగా నిల్చు౦టాను. ఒక స్నాప్ తీస్తావా?”

భగవంతుడా, అలా జరగలేదు, తడబాటు నాపడానికి అలా అంటూనే ఎటో వెళ్లి పోయింది ఆమె.

నేను ఆ విగ్రహాన్ని చూస్తూ నిల్చున్నాను. నువ్వు వెనకాల వచ్చి అన్నావు, “చాలు మేడం. మరీ అంతగా చూడకండి. ఆ విగ్రహానికి దిష్టి తగులుతుంది”

ఎక్కడి నుండి అక్కడికి ఎగిరి వచ్చావు? సిగ్గుతో బిగిసిపోయాను. మొహం ఎర్రబారింది. రక్తo మొహంలోకి చిమ్మింది. ఇద్దరం కలిసి కొండ దిగాం. నువ్వు పరుగెడుతున్నావు, “ మేడం త్వరగా ఇలా పెళ్లి కూతురిలా నడుస్తున్నారు?” అమ్మాయిలందరూ ఫక్కున నవ్వారు. నేను దాదాపు పడిపోబోయాను. అడుగు ముందుకు వెయ్యలేకపోయాను. నా ఒంటిపై జుట్టు నిటారుగా నిల్చుంది.

సరదా ఆటలతో పాటలతో, మాటలు, అరుపులతో బేలూర్ వరకూ వెళ్లాం. అక్కడ మేమంతా శిలా బాలికియారు చూసాం. గైడ్ దాని ప్రతి భాగం వివరిస్తున్నాడు. శబినా నీ కెమెరా లాక్కుని “సువ్వీ నీ ఫోటో శిలా బాలికియార్, ప్రభాకర్, నువ్వు కూడా రా ప్లీజ్” అంది.

కెమెరా క్లిక్ చేసింది. అది చాలు నాకు. దాన్ని చూడాలన్న బలమైన కోరిక. రోజంతా ఏదైనా పొరబాటు జరిగి ఫోటో పాడవుతు౦దేమోనన్న భయమే. ఆ ఫోటో బాగా నీట్‌గా ఉ౦చమని దేవుడిని వేడుకున్నాను. కావాలనే చివరివరకూ నాకు నువ్వా ఫోటో చూపి౦చనే లేదు. మనం భోజనాలు చేశాం. పళ్ళు తిన్నాం. రేడియో పాటలతో సరదాగా గడిపాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here