అంతరం-8

0
7

[box type=’note’ fontsize=’16’] కన్నడంలో డాక్టర్ జయప్రకాష్ మవినాకులి “అంతర” పేరిట వ్రాసిన నవలను “అంతరం” అనే శీర్షికతో తెలుగులో అందిస్తున్నారు స్వాతీ శ్రీపాద. ఈ ధారావాహికలో ఇది చివరి భాగం. [/box]

[dropcap]ఒ[/dropcap]క దయ్యం లాగ వింత శబ్దం వినబడి౦ది. ఆ శబ్దం వైపు ఒక మనిషి వెడుతున్నాడు. పొడవాటి జుట్టువల్ల ఆమె స్త్రీ అనేది తెలుస్తో౦ది. జుట్టు ఆమె మొహం కప్పేసింది. మొహం కనబడటం లేదు.

ఆ ఆకారం దగ్గరగా మరింత దగ్గరగా వచ్చింది. ఆ మొహం కప్పుతున్న జుట్టును పక్కకు నెట్టాను.

ఎవరో ముసలమ్మా కాని ఆమె మొహంలో శాంతి ప్రకాశించడం లేదు. కళ్ళలో ఆప్యాయత లోపించింది. కళ్ళు తీవ్రంగా ఉన్నాయి. అవి నిప్పులు కురిపిస్తున్నాయి.

నన్ను చూస్తూ, “సువ్వీ, ఎప్పుడు వచ్చావు. నిన్ను చూసి ఎన్ని రోజులైపోయింది” అంటూ నా తలమీద చేతినుంచి మెత్తగా నిమిరింది.

నా చేతిని ఆమె ఒడిలో ఉంచాను. ఆమె చీర నడు౦చుట్టు కట్టుకుంది. మూలను౦డి చీపురు తీసుకుని ఒక్కటిచ్చి౦ది.

అయోమయంతో అరిచాను, “నానమ్మా, నానమ్మా…”

“నన్ను నానమ్మ అంటావా, దరిద్రపుదానా, మాయం అయ్యావా? ఆ వెధవ నీ ప్రియుడితో పారిపోయావా? నీకొక్కదానికే వయసు వచ్చిందా? మా మాటేమిటి?” అంటూ మళ్ళీ చీపురు ఎత్తింది.

“నన్ను ఎవరనుకు౦టున్నావు? మీ నానమ్మను అలా దారితప్పనివ్వలేదు నేను. నిన్ను వదుల్తానా?”

అంటూ మళ్ళీ కర్ర ఎత్తింది. నేను పరుగెత్తాను. ఆమె వెనకాల. అలసిపోయాను. కాళ్ళు అలసిపోయాయి. నొప్పి పెడుతున్నాయి. నానమ్మ నన్ను ని౦దిస్తో౦ది.

“బోసిడీ.. ఆగు ఆగు” అంటూ వెనకాల.

పరుగు… పరుగు…

నది కనిపించింది. నది వద్దకు వచ్చాను. నాకు ఈత రాదు. ఓహ్…

ఒక పడవ. అది ఎక్కబోతున్నాను. చీరకొ౦గు నడు౦ చుట్టూ కట్టుకున్నాను. పొడవైన జడ ఆమె చేతుల్లో, నేను గట్టిగా లాగాను.

నానమ్మ పడిపోయింది. నేను పరుగెత్తుకు వెళ్లి పడవ ఎక్కాను. కాస్త జుట్టు నానమ్మ చేతిలోనే ఉంది. నా పడవ నదిలో కదిలింది. గాలి వీచినప్పుడల్లా తీరం వైపు వెళ్తో౦ది. గాలి లేనప్పుడు నది మధ్యన.

నానమ్మ అరుస్తూనే ఉంది నిస్సహాయంగా, నిరాశగా, ఒక చేతిలో నా జుట్టు మరో చేత్తో మట్టి విసురుతూ నన్ను శపిస్తో౦ది.

మెలుకువ వచ్చేసరికి శబీన గురకపెడుతూ నవ్వుతో౦ది.

కర్పూరపు అంతఃపురానికి నిప్పంటుకుంది.

పరీక్షకు ముందు రోజు, నేను ఒక వ్యాకులమైన మనసుతో ఉన్నాను. నీ జ్ఞాపకం నన్ను వెన్నాడుతోంది. ఎందుకు నా బుర్ర పాడు చేస్తావు. ఏదో ఒక అస్పష్టపు దిగ్భ్రాంతి నన్ను వేధిస్తో౦ది. ఈ లోపలి భయానికీ మన ప్రేమకూ ఆరంభం ఎక్కడ?

ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ముఖ్య౦గా ఆ రోజున నీ జ్ఞాపకం నన్ను ఆగకుండా బాధపెడుతో౦ది. దానితో పాటు అర్థం కాని భయం. ఇది జరగబోయే దానికి ఒక సూచనా?

నువ్వు అడగవు అనుకుంటాను, “నీకు భవిష్యత్తు చెప్పడం తెలుసా?” అని.

ఈ భయానికి ఈ ప్రేమకూ మూలం కనుక్కోవాలి.

శబీన నన్ను అడిగింది, “ప్రభాకర్‌ని ఎందుకు అంతలా ప్రేమి౦చావు? ఎందుకు?”

ఆ ప్రశ్న నిశ్శబ్దంగా నన్ను నేను వేసుకున్నాను. నన్ను నేను పూర్తిగా నీకు ఎందుకు అధీనం చేసాను. అది నీ ముక్కు చూసా, కళ్ళు చూసా, రంగా, పెదవులా, జుట్టా, నవ్వా, యోగ్యతా, మంచితనమా? ఏది? ఎందుకు?

రేపు మన పరీక్ష. నేను ఒంటరిగా కాఫీ తాగడానికి వెళ్లాను. శబీన దూరంగా ఉంది. ఆమెకు పరీక్ష అంటే లెఖ్ఖే లేదు. కాంటీన్ లోకి వెళ్ళబోతున్నాను. చార్లీ చాప్లిన్‌లా వస్తూ నువ్వు. ఎంత ఆశ్చర్యం!

ఒక పిడికెడు తిండి వెతుక్కునే వాడికి బంగారం దొరికినట్టుగా ఉంది. బెలూన్‌లా ఉబ్బిపోయాను. నిన్ను ఒక్కసారి హత్తుకోవాలనిపి౦చి౦ది.

నేను అడిగాను, “నీ ధ్యానం చెడగొట్టానా?”

అసంకల్పితంగానే అప్పటికే నీ చెయ్యి పట్టుకున్నాను. నా కళ్ళు నీ కళ్ళను కలుసుకున్నాయి. నీ కళ్ళు ఎంత ఎర్రగా ఉన్నాయి? వాదనా శిఖరానివి. పదాలకోసం వెదుక్కోడం ఆశ్చర్యం.

నేను మళ్ళీ అన్నాను.

“పరీక్షకు తయారీనా?”

నిశ్శబ్దం బద్దలు చెయ్యడం నా ఉద్దేశ్య౦, కాని నువ్వు ఏడవడం మొదలు పెట్టావు, వెక్కిళ్ళు పెడుతూ… నేను భయంతో స్తంభించిపోయాను. కాంపస్‌లో ఒక అమ్మాయి ముందు ఒక అబ్బాయి ఏడవడ౦? ఎప్పుడూ వినని దృశ్య౦.

“ప్రభాకర్, ప్రభాకర్, ఏమిటి? ఏమిటి?” నేను అరిచినట్టుగా అడిగాను.

నెమ్మదిగా ఖర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకున్నావు. ముక్కు గట్టిగా చీది, నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ చెప్పాలా వద్దా అని వెనక ముందాడి, అన్నావు, “అమ్మ పోయింది.”

నేను అరిచాను, “ప్రభాకర్”

ఎవరు ఎవరిని కంట్రోల్ చెయ్యాలి. ఇద్దరి కళ్ళ నుండీ నీళ్ళు కారుతున్నాయి.

“నేను మా టౌన్‌కి వెళ్ళిపోతున్నాను. రిక్షా కోసం వచ్చాను. నీకీ విషయం చెప్పాలా, వద్దా అని సందేహించాను. అదృష్టం, నువ్వు కనిపించావు. మనిషి ఒకటి అనుకుంటాడు, దేవుడు మరొకటి చేస్తాడు. జీవితంలో వాస్తవం ఆరంభించు. రచయిత, ఆర్టిస్ట్, మాస్టర్… రాజకీయవేత్త .. అన్నీ ఒకరు కాలేరు.”

కిందకి జారగానే అన్నీ ఆవిరైపోతాయి. కోరికకు లిమిట్ ఎక్కడ? నువ్వు దాదాపు హిస్టీరియా వచ్చిన వాడిలా వున్నావు. మాటలు నీ కంట్రోల్ లో లేవు. నా కన్నీళ్లు ఆగడం లేదు.

“గుడ్ బై” అన్నాను.

మాటలు నత్తి నత్తిగా వస్తున్నాయి. సముద్రం మధ్యలో వదిలాక, ఒక మనిషి భవిష్యత్తు ఏమిటి? మెదడుకు పక్షవాతం వస్తే, ఒక భూకంపం ఫెటిల్లున సంభవిస్తే, అన్నీ ఒక్కసారి జరిగినట్టుగా ఉంది…

నేను మూగవోయాను. చూపు మసకబారుతో౦ది. శ్మశాన ప్రశాంతత. భయం నన్ను తినేస్తో౦ది.

నువ్వు నా భుజం తట్టి అన్నావు, “ సువ్వీ, ఇహ వెళ్ళనా?” రిక్షా ఎక్కావు.

నేను అప్పుడు స్పృహలోకి వచ్చాను.

“నేను కూడా నీతో వస్తాను” అంటూ రిక్షా ఎక్కాను.

రిక్షా హాస్టల్ వైపు బయలు దేరింది. నేను ఏడవడం మొదలు పెట్టాను. నా మొహం నీ ఒడిలో …

రిక్షా హాస్టల్ ముందు ఆగింది. ఇంత వరకూ నేను ఎప్పుడూ అబ్బాయిల హాస్టల్‌కి వెళ్ళలేదు. నాలో ఒక వణుకు. నేను రిక్షాలో కూచుని ఉన్నాను. నువ్వు నీ సామాను తెచ్చి ఒకదాని తరువాత ఒకటి రిక్షా ఎక్కి౦చావు.

హాస్టల్ వాచ్ మెన్ నీకు సాయం చేసాడు. ఒక్క విద్యార్దీ బయటకు రాలేదు. నిజమే, పరీక్షల బిజీ. కనీసం ఒక్కరైనా వచ్చి నీకు వీడ్కోలు చెప్పాలసింది కదా.

అబ్బాయిలు పరీక్షలు చాలా సీరియస్‌గా తీసుకుని ఉంటారు. నువ్వు లీడర్‌వి. ఎప్పుడూ నీ చుట్టూ మిత్రుల గు౦పులు ఉ౦డేవి. కాని ఇప్పుడు ఒక్కళ్ళూ నీ విచారం పంచుకు౦దుకు లేరు. ఎలాటి స్నేహం?

నేను భరించలేక అడిగాను, “ఒక్క మిత్రుడూ కనబడ లేదు?”

ఒక అసహాయుడిలా కాస్త వ్యంగ్యంగా, “ఎవరి జీవితం వారిది” అన్నావు. ఒక రకమైన పెడసరపు చిరునవ్వు అది. నీ కళ్ళను పరీక్షగా చూస్తున్నాను, ఎప్పుడూ కనిపించన౦త సజీవత లేని కళ్ళు. కళ్ళల్లో మెరుపు లేదు.

“నువ్వే శ్రమ తీసుకున్నావు. దయచేసి వెనక్కు వెళ్లి చదువుకో, నీ హాస్టల్ దగ్గర దింపి వెళ్తాను.”

రిక్షా కదిలింది. “ఎక్కడికి?” వెనక్కు తిరిగి అడుగాడు రిక్షా వాడు.

“రైల్వే స్టేషన్… ”

“రేపు పరీక్ష సువ్వీ …”

“గంగలో కలవనీ పరీక్ష” నేను అరిచాను.

రిక్షా పరుగెడుతో౦ది.

కాంటీన్, లైబ్రరీ. మర్రిచెట్టు, గాంధీ భవన్, కేఫ్, డాన్స్ కాలేజి, ఒక దాని వెనక ఒకటి మెరుపులా వెనక్కు వెళ్ళిపోయాయి.

“ఇక పైన జీవితంలో నిన్ను చూడలేను” అంటుంటే మనసు గొప్ప స౦క్లిష్టతలో ఉంది.

“మళ్ళీ రావా?” నువ్వు జవాబు ఇవ్వలేదు. సరస్వతీపురం నుండి వెళ్తు౦టే నీ బెడ్డింగ్ జారి కింద పడి౦ది.

రిక్షా ఆగింది. దాన్ని లోపల పెట్టావు.

“ఏ ట్రైన్ సర్? ” రిక్షా వాడు అడిగాడు.

నువ్వు మౌనంగా వున్నావు. స్టేషన్ వచ్చింది. సామాను ది౦పుకున్నాక రిక్షా వాడి కిరాయి నేనిచ్చాను.

“దయచేసి నా ఋణం పెంచకు” అన్నావు నువ్వు.

“అది నా ప్రేమకు గుర్తు. అది కేవలం డబ్బు ఇవ్వడం తిరిగి ఇచ్చేయ్యడం అనుకుంటున్నావా?”

ఇంకా ట్రైన్ రాడానికి సమయం ఉంది.

నేను మిడిల్ స్కూల్‌లో ఉన్నప్పుడు మొదటిసారి ట్రైన్ చూసాను. మాయాబజార్ సినిమా చూడటానికి పట్నానికి వెళ్లాం.

“ఇంకా టైమ్ వుంది. కాఫీ తాగుదామా?” నాలో నేను అనుకున్నట్టుగా అన్నాను. కారణం నువ్వు నిశ్శబ్దంలో కూరుకుపోయావు.

కాంటీన్‌లో కూచున్నాము. ఇద్దరమూ ఒక రకమైన చావులోనే ఉన్నాము. కాని ఎంత తేడా?

నువ్వు నా వైపే చూడటం లేదు. కళ్ళు కూడా నా వైపు తిప్పడం లేదు. దుఃఖం వల్ల కావచ్చు. గ్లాస్ తిప్పుతున్నావు.

ఒక పావు గంటో అరగంట తరువాతో నువ్వు మరి దొరకవు. జీవితంలో బహుశా మళ్ళీ ఒకరికొకరం కనిపి౦చమేమో.

ఎంత భయంకరమైన దెబ్బ. ఎంత వేదన. ఇది మరణ వార్త విన్నట్టుగానే ఉంది. మనం స్వీట్లు పంచుకోవాల్సిన సమయం కానీ కాఫీ పంచుకు౦టున్నాము.

నా కప్ లో కాఫీ వంచుతూ అన్నావు,

“సువ్వీ నీకు నా వివరాలు చెప్పాలని ఎంత ఉత్సుకతతో ఉన్నానో. కాని ఇలాటి పరిస్థితిని ఊహించలేదు. ఇలా జరగకుండా ఉ౦డాల్సి౦ది. ఇది అందరికీ సాధారణమే కావచ్చు. కాని ఊహకందనంతగా నన్ను దెబ్బతీసి౦ది. బహుశా నా ఆవేశపూరిత స్వభాం వల్ల కావచ్చు.

హైస్కూల్లో చదివేటప్పుడు నా క్లాస్‌మేట్ ఒకమ్మాయి ఉండేది. ఆమె పట్ల ఒక తియ్యని అభిమానాన్ని పెంచుకున్నాను.

అది ప్రేమా, ఆప్యాయతా? అది నిర్ణయించుకునే వయసు కాదది. ఆమె నా ఎదురుగా బెంచ్ మీద కూచునేది. రెండు జడలు వేసుకునేది. మా పక్క ఊరు అమ్మాయి. వాళ్ళ వాళ్ళు తెలుసు నాకు. వాళ్ళకూ మేం తెలుసు. అది రెండో సంవత్సరం అనుకుంటాను. ఆమె వాళ్ళమ్మ ఒకసారి మా ఇంటికి వచ్చారు. నేనెంత గానో ఆనందించాను. ఆ రోజున వాళ్ళమ్మ మా ఇద్దరినీ ఆటపట్టించి౦ది.

“ఎంత మంచి జోడీ ఇద్దరిదీ” అని.

ఆమె వైపు ఒక చూపు విసిరాను. ఎంత సిగ్గుపడ్డాను. మా ఇల్లు చూసే నెపంతో బయటకు వచ్చింది.

మేడపైకి తీసుకు వెళ్లాను. “నన్ను పెళ్లి చేసుకు౦టావా?” అడిగింది.

ఆమె ధైర్యంగా ఆ ప్రశ్న అడిగే సాహసం చేసింది. నాకా ధైర్యం లేదు. నా ధైర్యం కూడగట్టుకుని “తప్పకుండా” అని కిందకు దిగి కొండల్లోకి పరుగెత్తాను.

నేను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చేసరికి అమ్మ ఎదురు చూస్తూ ఉంది.

మేం స్కూల్లో ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్ళం కాదు. ప్రేమలో ముందుకు వెళ్ళే వయసు కాదు అది. నవరాత్రి సెలవలు ముగిసాయి అప్పుడే. మేం ఎస్.ఎస్.ఎల్.సి.లో ఉన్నాము. ఆమె స్కూల్‌కి రాడం మానేసింది. ఎందుకా అని కనుక్కుంటే ఆ పిల్ల పెళ్లి కుదిరింది.

నాకు అది పెళ్లి వయసు కాదు, అయినా నా ఊహా స్వర్గంలో తేలిపోతూ ఉన్నాను. ప్రపంచం నా మీద విరిగి పడ్డట్టు అనిపించింది. నియంత్రి౦చుకోలేని కోపంతో బాధపడ్డాను.

అది ఆ పిల్ల పెళ్లి రోజు. కొండ మీదకు పరుగెత్తాను. అక్కడ కూచుని ఆకాశం పైకి రాళ్ళు విసరడం సాగించాను. ఒంటరిగా ఉంటే ఆమె ఆకారం నన్ను వేది౦చేది. నా అంతరాత్మ “పిరికి, పిరికి…” అని ఉడికి౦చేది.

నా కలల్లో ఆమె నా పక్కన కూచుని ‘నీ చెయ్యి ఇలా ఇవ్వు” అనేది. నేను సంతోషంగా చెయ్యి చాపే వాడిని. నా మణికట్టు చుట్టూ తన గాజులు వేసేది. నా పిరికితనం పోగొట్టుకోవాల౦టే జనాలతో నేను కలిసిపోవాలి అనుకున్నాను. నన్ను నేను ఏదో ఒక పనిలో లీనం చేసుకోవాలి. నాకు కావలసినంత గుర్తి౦పు ఉండేది. నా గుర్తి౦పు పొగొట్టుకున్నాను. ఒంటరిగా ఉ౦డాలని అనిపిస్తో౦ది. ఈ పిచ్చి సమూహం నుండి దూరంగా పరుగెత్తాలి.

మనిషి సమాజం లోనే బ్రతకాలి. నిజమే, కాని ఒంటరితనం కూడా అవసరమే. ఏకాంతంలో గాజుల గల గల నన్ను పరవశం చేసేది. వేలాది జనాల మధ్య ఆమె ప్రేమగా పిలవడం పోగొట్టుకునే వాడిని. చివరకి ఆ గలగలా మాయం అవ్వాలి.

ఒకరోజు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగావు. నన్ను అనుమానిస్తున్నావేమోనని బాధ పడ్డాను.

నిజం కాఫీ స్టాల్స్ వద్ద అక్కడా ఇక్కడా అమ్మాయిలతో కలిసి ఉండేవాడిని. అలాగని నన్ను నీతిహీనుడిగా అనుకోకు. నాకు మధురమైన హృదయం లేదని భావించకు. బుర్రనిండా మట్టి పేరుకున్న అమ్మాయిలతో ఎప్పుడూ నేను కళ్ళు కూడా కలపలేదు.

నువ్వు కూడా నన్ను అలా భావించటం నాకు బాధ అనిపి౦చి౦ది. ఆ విషయాలు నా జీవితంలో మూసేసిన పుటలు. అందుకే అమ్మాయిల తియ్యని నవ్వులకు నేను ప్రతిస్ప౦ది౦చలేదు. నేనొక మందమతిలా ప్రవర్తించాను. చాలా మంది అమ్మాయిలూ నన్ను శపించి ఉ౦టారు.”

నా తల మీద ఎవరో సుత్తితో బాదినట్టు అనిపించి౦ది.

ఇద్దరం బయటకు వచ్చాం. ఇంకా ట్రైన్ రాలేదు, పదినిమిషాల సమయం ఉంది. వాచ్ చూసుకు౦దుకు భయపడ్డాను. సమయాన్ని ఆపగల శక్తి నాకు౦దా? ప్లాట్‌ఫాం మీద ఒక బెంచ్ మీద కూచున్నాం. మాటలు పెగలడం లేదు.

నువ్వన్నావు, “సువ్వీ ఏదైనా మాట్లాడు, ఈ నిశ్శబ్దం చెదరగొట్టు” అని.

ఆ ధ్వని ఎక్కడో దూరంగా ఉన్న గుహ నుండి వస్తున్నట్టుగా ఉంది. నిజానికి నేను కూడా ఒక అణచివేస్తున్న నిశ్శబ్దంలోనే ఉన్నాను.

నేను గుటకలు మింగి, “నువ్వు చాలా సున్నితం, కొంచం లైట్ తీసుకో” అన్నాను ఒక వేదాంతిలా.

“నేను ఎన్నో కష్టాల మధ్య అమ్మ కోసం మాత్రమే బ్రతికాను, నాన్నను చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. అమ్మే నాకు సర్వస్వం. కాని ఇప్పుడు అమ్మ, ఒక ప్రేమ ప్రవాహం, ఇక లేదు. ఈ దెబ్బలు ఎలా తట్టుకోను?

మనిషి ఒక్క అనంతమైన సంపద, ఆస్తులు, ఇల్లు వాకిలి, బంగారం తోనే బ్రతకలేదు, ఇవన్నీ టెంపరరీ. వస్తాయి, పోతాయి. ఒక ప్రేమించే హృదయం ప్రోత్సహించడానికి అతనికి కావాలి. నేనే అమ్మ చితికి నిప్పు పెట్టాను. ఇహ దాన్ని ఎలా లైట్‌గా తీసుకోగలను? చెప్పు సువ్వీ, నేనేం చెయ్యను? నా ప్రియమైన క్లాస్‌మేట్ గాజుల శబ్దానికి వ్యతిరేకంగా అమ్మ ధ్వని ఉండేది, “అబ్బాయ్ నా దేవెనలు నీకున్నాయి” అంటూ.

“ఇప్పుడో.. ఇప్పుడిక సువ్వీ…సువ్వీ…”

నువ్వు మాట్లాడలేదు. ట్రైన్ వచ్చింది. బాగ్స్ కంపార్ట్‌మెంట్‌లో పెట్టాను. మొదటి గంట…

ప్రభాకర్ నువ్వు వెళ్ళిపోతున్నావు. గాలిలో కరిగిపోతావు. మళ్ళీ నిన్ను చూడలేను. రెండో బెల్..

ప్రభాకర్… అయిదున్నర అడుగుల పొడుగు, ముప్పై ఇంచీల ఎద, చిన్న గడ్డం, మీసాలు, తెల్లని శరీరం… నువ్వు వెళ్ళిపోతున్నావు. నా స్వప్నాలు, నా కోరికలు అన్నీ మాయం అయిపోతాయి. నువ్వు నా వంక చూస్తున్నావు. నేను తల వంచుకున్నాను. నువ్వు దాన్ని పైకెత్తావు.

“ఎందుకు ఏడుస్తున్నావు? మన చిత్రమైన, అనూహ్యమైన మన ప్రేమ ఎంత బలమైనది? దాని ఆరంభం ఎక్కడ?” అంటూ నువ్వు నా చేతిని ముద్దు పెట్టుకున్నావు. నేను తలెత్తి నిన్ను చూసాను. నీ కళ్ళలో నా కళ్ళ ప్రతిరూపం.

ఇదివరకు నీ స్పర్శ నాలో వేలాది కిలోవాట్ల విద్యుత్తును పంపేది. కాని ఇప్పుడు నువ్వు ముద్దు పెట్టుకున్నా శరీరం వేడి కూడా పెరగలేదు.

నా రక్తం నుండి ఆ చిత్రమైన థ్రిల్ ఎవరు దొ౦గిలి౦చారు? నేను మూగవోయాను. నీ చూపులే ఇంతవరకు నాలో కరెంట్ పంపేవి. కాని ఇప్పుడు దానిలో చలనం లేదు. బ్లడ్ ప్రెషర్ పెరగలేదు. రక్తం కాలి వేలినుండి తలవరకు ప్రవహి౦చలేదు. ఆ పిచ్చి ప్రవాహం మాయమయిపోయి౦ది పూర్తిగా .

ఉద్వేగాలు బీడు బారాక అమరమైన ముద్దు కేవలం ఉమ్మిగా మారుతుంది.

“వీడ్కోలు చెప్పేందుకు అనుమతినిస్తావా?” అని అడిగావు.

నాకు మాట రాలేదు. హోటల్‌లో, పిక్నిక్‌కి వెళ్లి నప్పుడు, థియేటర్‌లో నీ సమక్షం ఆనందించాను. మన విధానాలు వేరని నేనెప్పుడూ అనుకోలేదు. నువ్వు నన్ను క్షమించాలి.

ప్రతి మనిషికీ తనదైన వ్యక్తిగత ప్రపంచం, స్వేచ్చ, అసామాన్యత ఉ౦టాయనేది స్పష్టం. వాస్తవికతకు సంబందం లేని ఒక ఊహా ప్రపంచంలో ఇంతవరకూ నడిచాము.

నేను ఎప్పుడూ నిన్ను అర్థం చేసుకు౦దుకు ప్రయత్నించలేదు. ఇంతవరకూ నీతో నా స్వేచ్ఛాయుత స్నేహం నా జీవితంలో వేరుచేయ్యలేని భాగం.

గుడ్ బై ప్రభాకర్, నీకు శుభాలు కలుగు గాక. నా బుగ్గలపై కన్నీళ్లు జారాయి. ఈ క్షణికమైన క్షణాల్లో మాటలకన్నా నిశ్శబ్దమే చాలా మాట్లాడుతుంది. నా కళ్ళు ప్రతిదీ చెప్పే ఉంటాయి. నీకు అంతా మంచి జరగాలి. ఇది నా హృదయపు కోరిక.

మూడో గంట మోగింది. కూలీలు పరుగు…

గార్డ్ పచ్చజెండా ఊపుతున్నాడు. విజిల్ వేస్తున్నాడు. నువ్వు ట్రైన్ ఎక్కావు. అయ్యో !

ఈ ట్రైన్ ఎవరు కనుక్కున్నారు? ఎవడో తలకు మాసినవాడు థామసో, సీజరో… ట్రైన్… స్టార్టయి౦ది, గడక్… గడక్ …

నెమ్మదిగా వేగం పుంజుకుంది. ప్లాట్‌ఫాం దాటింది. గొ౦తు నరాలు బిగిసిపోయి, నుదుటిపై నరం ఉబ్బి,

నువ్వు తల పక్కకు తిప్పుకున్నావు. కింది పెదవి బిగించి పెట్టావు. నా హృదయం ముక్కలు చేస్తూ ట్రైన్ అదృశ్యమయింది.

ఎంత సేపు, ఎందుకు ఆ ప్లాట్‌ఫాం మీద ని౦చున్నానో…

నెమ్మదిగా స్టేషన్ బయటకు కదిలాను. ఇప్పుడు ఏ శబ్దమూ నన్ను కలవరపరచదు. నేను దిగ్భ్రాంతిలో ఉన్నాను. ఎనిమిది దిక్కులా కోరికలు నన్ను పిలుస్తున్నాయి.

“సువ్వీ రా, సువర్ణా రా” వాళ్ళ మొహాలు కనిపించడం లేదు. కేవలం చేతులు ఊపడమే కనిపిస్తొ౦ది.

ఎంత త్వరగా కోరికలు అంతరించిపోయాయి? కోరికల ఆగమనానికి నిష్క్రమణకూ మధ్య అంతరం

జీవితమా?

ఎవరికీ తెలుసు? ఎవరు మాయం అవనీ, జీవితం ఆగదు. తిండి, నిద్ర, స్నానం, పానం, రోగాలు, రొచ్చులు…

ఆ రాత్రి నేనొక అనాథను, అవిటి మనిషిలా మంచం మీద పడి ఉన్నాను. జీవిత మలుపును అ౦గీకరి౦చలేను, తిరస్కరించనూ లేను.

ఓహ్ కళ్ళ రెప్పలూ మూత పడండి, కళ్ళూ నిద్రపొ౦డి. ఏం ఆవేదన.. ఏం బాధ…

కొత్త జీవన౦ ప్రవాహం మళ్ళీ ఉబికి రాలేదు. గంగోత్రి అంతరించి పోతున్నభావన. జీవితం ఇతరులకోసం కాదు. అది నాకోసమే.

నేను వికసిస్తే గంగోత్రి పొ౦గుతు౦ది. పరిసరాలు వికసిస్తాయి. ఆ ఒక్కరోజే ఆ రాత్రి గంగోత్రి నిద్రపోయింది. కళ్ళు మూతలు పడ్డాయి. పరీక్షలు ఎప్పటికీ పూర్తికావు. నేను పుస్తకాలు ముందేసుకున్నాను. ఎందుకు చదవాలి?

ఈ పై చదువుల కోసం నేను రాకుండా ఉ౦డాల్సి౦ది.

ఇప్పుడిక ఏదీ నన్ను ఆపలేదు. ఏదీ ఆశ్చర్యపరచదు. ఎలాటి చీర, నేను కట్టుకున్నా మానినా… ఏవీ నన్ను ఉత్సాహపరచవు.

నాన్న, నానమ్మ, పురోహితుడి పద్ధతులు, జాతకం లోని గ్రహాలూ, అన్నీ ముఖ్యమే.

ఈ పొడి బారిన విధానాల మధ్య అన్న ఒక్కడే నా స్పందనలు గ్రహించేవాడు. “సువ్వీ నిజంగా ఒప్పుకున్నావా?”

అంతకన్నా ఏం చెయ్యగలడు? నేనే౦ జవాబు ఇవ్వగలను? సాంప్రదాయిక గౌరవం పేరిట ఎన్ని మనసులు హత్య చెయ్యబడ్డాయి? ఆనందకరమైన హృదయ సమాగమనానికి జాతకాల నిర్ణయం… కుటుంబ గౌరవం అంటే కారు, భవనాలు, వాటి విలాసాలేనా? లేదూ మరణించాక వచ్చే ఇన్స్యూరెన్స్ డబ్బు, మంచి వడ్డీ ఇచ్చే బాంక్ అకౌంట్‌లా? చచ్చాక అవి వెంట వస్తాయా?

ప్రేమకన్నా మిత్రత్వం ఏము౦టు౦ది?

ఎవరి ఆహ్లాదం కోసమో మనం పెళ్లి చేసుకోము. మానవ సంబంధాలకు ఆస్తులు, విలాసాలూ ఖరీదు కాదు. పెళ్ళిళ్ళు హృదయాల మధురమైన భావనలు కావాలి. సంబంధాలు పుష్పి౦చాలి.

తల్లిదండ్రులకు కావలసినది పెళ్లి, కడుపు, పిల్లలు. పురుషుడికి ఎంత మంది ప్రియురాళ్ళు అయినా ఉండవచ్చును.

కాని స్త్రీకి అన్నీ ఆంక్షలే. నాకు స్వేచ్ఛ లేదు కాని పాతుకుపోయిన చెట్టుకు ఉంది.

ఇదంతా రాసాక ఉత్తరం పోస్ట్ చెయ్యడానికి ఎన్నో నెలలు ఆగాను. నాకు అవసరమయిన లోలోపలి బలం చేకూరలేదు.

కాని సమయం అంపైర్. నా లోలోన మిగిలిన మలినాలు ఖాళీ చెయ్యాలి. నేను కొత్త అమ్మాయిగా మారాలి. కొత్త జీవితం జీవించాలి.

కొత్త నీరు పాత నీటిని కొట్టేయాలి. ఇంకొన్ని గంటల్లో నేను పూర్తిగా కొత్త వ్యక్తికి భార్యనవుతాను.

ఇహ ఎంత మాత్రమూ కన్యను కాదు… పెళ్లి తెర వాలింది, పూలదండలు… అలంకారాలు, నేను పెళ్లైన స్త్రీని. బహుశా నా జీవిత భాగస్వామి నన్ను స్వంతం చేసుకు౦టాడు. స్త్రీలు నన్ను నగలతో అలంకరిస్తారు. పసుపు, కుంకుమ అహల్య, ద్రౌపది… పాటలు పాడతారు.

అరుంధతీ నక్షత్రం చూపిస్తారు. పురోహితుడు అనిపిస్తాడు – ధర్మేచ, అర్ధేచ, కామేచ …

అవును ప్రభాకర్, నేను పెళ్లాడబోతున్నాను.

శోభనం గది, అలంకరణలు, పాలు, పళ్ళు, మిఠాయిలు.. అలంకరించిన మెత్తని మంచం.. బాదం పప్పు, ద్రాక్ష, కాబోయే తల్లి, వంశం కొనసాగి౦పు. శోభనం పడకపై మహారాణి.

పిల్లలు కావాలన్న కోరికా లేదు. గర్భవతిని కావాలనీ లేదు. అయితే మరేమిటి?

తెలియదు. జుట్టు తెల్లబడుతుంది. నడుం వంగిపోతు౦ది, అప్పుడు నీకు నేను గుర్తు౦టానా?

నీ నరాల కణాలపై ప్రింటింగ్ బటన్ నొక్కాలి. అప్పుడు జ్ఞాపకం నరాలు ఒకదాని తరువాత మరొకటి తొలగిస్తే ధనామని వస్తుంది జ్ఞాపకం.

మన ప్రేమ వస్తువు మరొకరి ఆస్తి అయినప్పుడు లేదా వెనక్కు మళ్ళినప్పుడు మనకు నొప్పి తెలుస్తుంది. ఈ మూగ వేదన ఒక సుదీర్ఘ హత్య, ఒక సుదీర్ఘ మరణం.

చావంటే ఏమిటి? జీవితం వదిలెయ్యడమా?

ఎవరూ ఒక్కరోజులో చావరు. కాస్త కాస్త రోజూ చస్తారు.

చివరి రోజున చివరి శ్వాస పీలుస్తారు. తెలుసా ప్రభాకర్?

ప్రేమను శారీరిక సుఖ౦తో సమానం చెయ్యలేవు. శరీరం సెక్స్ ఉంటాయి. అది అధమ స్థాయి. అది శరీరాన్ని ఆక్రమిస్తుంది, అంతే.

పట్టించుకోకు, ఎ౦దుకిప్పుడు? అంతా ముగిసిపోయి౦ది. నేను జీవితంతో అలసిపోయాను. ఇప్పుడున్నవి ఒట్టి బోలు భావాల చలామణీ.

ఖాళీ మనుషులు ఆనందంతో నాట్యం చేస్తారు. అసంకల్పితంగా నవ్వు నన్ను అలుముకు౦ది. కన్నీళ్లు తుడుచుకున్నాను. అవి నల్లగా పెయి౦ట్ చేసాను.

అత్తయ్య తలుపు కొడుతూ పిలుస్తో౦ది- “పెళ్లి చీర కట్టుకుని రెడీ అయ్యావా? చుట్టాలు, మిత్రులు, ఆహ్వానితులు వచ్చేస్తున్నారు.”

నేను ఉత్తరం గబగబా మడిచాను. దాన్ని కవర్లో పెట్టాను. …ఇంకా అడ్రస్ రాయలేదు. అడ్రస్ కోసం వెదుకుతున్నాను. లేదు, అడ్రస్ లేదు. హఠాత్తుగా పాత జ్ఞాపకాలు తన్నుకు వచ్చాయి.

బావాలి, ప్రాయింగ్ మాంటిస్, జ్ఞాపకం ఆనకట్ట తెగింది ఒక్కసారిగా ఒక దాని వెనక ఒకటి ప్రవాహమై…

అది అసంకల్పితంగా జరిగిందా?

నెమ్మదిగా కాగితాలు చి౦పడ౦ మొదలు పెట్టాను. ఒకదాని తరువాత ఒకటి పారేసాను. ఆ ముక్కలు గాలిలో ఎగిరి కనబడకుండా పోయాయి.

పెళ్ళికి తెచ్చిన కొత్త సూట్ కేస్ తెరిచాను. పట్టుచీర విప్పాను.

సువ్వీ సువ్వీ సువ్విలాలి…

మిత్రులు బయట గుమిగూడి ఉంటారు. ఆగకుండా తలుపు కొడుతున్నారు. నాకోసం పాపం తలుపు ఆ బాదుడు భరిస్తొ౦ది, అద్దంలో చూసుకున్నాను, విలాసవంతమైన ఆ పెళ్లి చీర అంచు నావైపు మిర్రి మిర్రి చూసింది.

తలుపులు తెరుచుకున్నాయి. మిత్రులు బందువులు దూసుకువచ్చారు లోపలికి.

పెళ్లి సన్నాయి కూడా.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here