అంతరంగాన అమ్మ!

2
10

[శ్రీమతి జె. శ్యామల గారు రచించిన ‘అంతరంగాన అమ్మ!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“హ[/dropcap]లో.. హలో” మైక్‌లో పిలుపుతో కళాభారతి ఆడిటోరియంలోని ప్రేక్షకులు తమ మాటలు ఆపి వేదిక వైపు దృష్టి సారించారు. సూర్య కూడా అటు చూశాడు. బ్యానర్ పైన ‘అమ్మ’ రేఖాచిత్రం అతడి కళ్ళను తన వైపు తిప్పుకుంది. దాని కింద ‘అంతరంగాన అమ్మ!’ అందమైన అక్షరాలు. అంతలో మైక్ పట్టుకుని ఓ వ్యక్తి

“అంతర్జాతీయ అమ్మల రోజు సందర్భంగా, ముందుగా మా ‘మనస్విని’ సంస్థ తరఫున ఇక్కడ ఉన్న అమ్మలందరికీ వందనం.. అభివందనం. సభకు విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. ఇంక ఆలస్యం చేయకుండా సభ మొదలుపెట్టుకుందాం. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా మాన్యులు, ‘అమ్మ లోగిలి’ సంస్థ నిర్వాహకులు వాసుదేవ్ గారిని సవినయంగా కోరుతున్నాను.. సార్! వేదిక మీదకు రండి” అనడంతో ముందు వరుసలో ఉన్న ఆయన లేవడం, కార్యక్రమ నిర్వాహకులొకరు ఆయనను వేదిక మీదకు తోడ్కొని రావడం.. ఆపైన మరో ఇద్దరు ప్రముఖులను కూడా వేదిక మీదకు ఆహ్వానించడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనాగీతం పాడడం అయ్యాక, “ఇప్పుడు ముందుగా సభాధ్యక్షులు వాసుదేవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం” అని ప్రకటించారు.

వాసుదేవ్ గారు లేచి “సభా సరస్వతికి నమస్కారం. ‘అంతరంగాన అమ్మ!’ కార్యక్రమంలో ఇలా పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉంది. ఏవో మామూలు ప్రసంగాలు, సన్మానాల హడావిడి కాకుండా ఈ కార్యక్రమాన్ని కొంత విభిన్నంగా రూపొందించామని చెప్పారు. అది నాకెంతో ఆసక్తిని కలిగించింది. అందుకే ‘అంతరంగాన అమ్మ!’ గురించి అందరూ మాట్లాడాక నేను మాట్లాడుతాను” అన్నారు.

దాంతో నిర్వాహకుడు “పెద్దల మాట శిరోధార్యంగా భావిస్తున్నాం. ఇప్పుడు ముందుగా శ్రీ మాధవ్ గారు మాట్లాడుతారు” ప్రకటించాడు.

మాధవ్ వేదికను చేరుతుంటే అందరూ ఆసక్తిగా చూశారు. అతడు మైక్ ముందు నిల్చుని

“అధ్యక్షులవారికి, ఇతర పెద్దలకు నమస్కారాలు. సభలోని అందరికీ శుభాకాంక్షలు. నేను ఓ ప్రైవేట్ ఉద్యోగిని. సభల్లో మాట్లాడిన అనుభవం కూడా నాకు తక్కువే. ‘అంతరంగాన అమ్మ! ‘ అంశం నన్నెంతో ఆకర్షించింది. నా అనుభూతుల్ని అందరితో పంచుకోవాలనిపించింది. అందుకే వచ్చాను. నాకు చిన్నపటినుంచి కూడా అన్నీ అమ్మే. మా నాన్న అనే వ్యక్తి ఇక్కడ గుమాస్తా గిరితో బతకడం కష్టమని, దుబాయ్‌కి వెళ్ళి రెండుచేతులా సంపాదించి వచ్చి సుఖపెడతానని అమ్మకు మాయమాటలు చెప్పి, అమ్మ వంటి మీద ఉన్న కొద్ది పాటి బంగారం కూడా అమ్మి సొమ్ము చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని నెలలు అడపాదడపా ఫోన్ చేసి మాట్లాడేవాడు. క్రమంగా ఫోన్ చేయడం ఆగిపోయింది. కొంతకాలానికి, ఎప్పుడో ఆయన అక్కడ మరో పెళ్ళి చేసుకున్నాడని తెలిసింది. ఈ లోపు అమ్మ బతుకు తెరువు కోసం టైలరింగ్ షాప్‌లో చేరింది. కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసింది. కుట్టు మెషిన్ ఒక యంత్రం అనుకుంటే మా అమ్మ దాన్ని మించిన మానవ యంత్రంలా పనిచేసేది. మా అమ్మ ఆశలన్నీ నా పైనే. తోటి పిల్లలు అమ్మానాన్నలతో ఆనందంగా ఉండడం చూసినప్పుడు నా మనసు బాధతో మెలితిరిగేది. అమ్మ మనసులోని బాధను పంచుకునే వయసూ కాదు. కొంత జ్ఞానం తెలిశాక అమ్మతో ఆ ప్రస్తావన తెచ్చి మరింత బాధ పెట్టడం ఎందుకని మౌనంగా ఉండేవాడిని. నేను కాలేజీలో చదువుకుంటుండగానే అమ్మ ఆరోగ్యం క్షీణించింది. అందుకే నేను గ్రాడ్యుయేషన్ తోనే చదువు ముగించి ప్రైవేట్ ఉద్యోగంలో చేరిపోయా. నాకు ఉద్యోగం వచ్చిన రోజున అమ్మకు ఎంత ఆనందమో. తన సుఖాన్నంతా త్యాగం చేసి, నేనే తన జీవితంగా గడిపిన అమ్మను నేను బాగా సంతోషపెట్టాలనుకున్నా.. కానీ దేవుడు ఆ అవకాశం కూడా నాకు ఇవ్వకుండా అమ్మను తీసుకెళ్ళిపోయాడు” అతడి గొంతు దుఃఖభరితమైంది. అంతలోనే తేరుకుని, “మా అమ్మ గొప్ప ప్రేమ నిధి. నాలోని మంచి, మమత, మానవత.. అన్నీ అన్నీ అమ్మ ఇచ్చినవే. అమ్మ భౌతికంగా లేకపోయినా నా అంతరంగంలో నన్ను అంటిపెట్టుకునే ఉంది. ఇదే నా అంతరంగంలో అమ్మ” అంటూ చేతులు జోడించాడు.

చప్పట్ల వర్షం..

అంతలో కార్యనిర్వాహకుడు వచ్చి

“మాధవ్ గారి అనుభవం.. అనుభూతులు అందరి మనసుల్ని కదిలించాయనడంలో సందేహం లేదు. వారి అమ్మగారికి జేజేలు. ఇప్పుడు జయంతి గారు మాట్లాడుతారు” చెప్పాడు.

మాధవ్ వేదిక దిగడం, జయంతి వేదిక ఎక్కడం జరిగిపోయాయి. జయంతి సభకు వందనం చేసి “గతంలో మా నాన్న ‘ప్రజా గర్జన’ పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. ఆయనను పగటి వేళ చూసింది తక్కువ. ఏ రాత్రో ఇల్లు చేరేవాడు.. అదీ మత్తులో.. ఎప్పుడూ పార్టీ పనుల్లోనే తిరిగేవాడు. పగటివేళ ఇంట్లో ఉన్న సమయంలో ఎప్పుడూ కోపంగానే ఉండేవాడు. మేం ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక సాకుతో కొట్టేవాడు. మా అమ్మ అడ్డుపడి తాను దెబ్బలు తినేది. మాకు ఏది కావాలన్నా అమ్మే. నెలకు ఖర్చులకని కొంత మొత్తం అమ్మకు ఇచ్చేవాడు నాన్న. మా అమ్మ ఎంతో పొదుపుగా, జాగ్రత్తగా ఇల్లు నడిపేది. ఆడినా, పాడినా, నవ్వినా నాన్న లేనప్పుడే. ఆయన అడుగుల చప్పుడు వినపడితే చాలు అందరి ముఖాల్లో చిరునవ్వులు ఎగిరిపోయేవి. నాన్న ప్రేమను కూడా అమ్మే పంచి మమ్మల్ని పెంచి పెద్దచేసింది. ఎప్పుడైనా ఊరినుంచి నానమ్మ వచ్చినా ‘వాడు మొదటినుంచీ కోపధారి మనిషి. ఏంచేస్తాం. డబ్బులైతే ఇస్తున్నాడుగా. అదీ ఇవ్వకుండా ఏడిపించేవాళ్ళు ఎంతమంది లేరూ? సర్దుకుపోవాలి’ అనేది. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉన్నా, స్కూల్ డే అయినా అమ్మే వచ్చేది. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగా లేకపోయినా నిమ్మకు నీరెత్తినట్లు ఉండేవాడు నాన్న. ఒకసారి నాకు టైఫాయిడ్ వచ్చింది. అమ్మ, నాన్నను ఇంట్లో ఉండమంది. ‘ఏంటి గొడవ? నువ్వు చూసుకో. ఇదేమి రెండు రోజుల్లో తగ్గేదికాదు. నాకవతల చాలా పనులున్నాయి’ అంటూ వెళ్లిపోయాడు. అమ్మ నాకు నిద్రాహారాలు మాని సేవలు చేసి కాపాడుకుంది. నేను సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం సాధించాను. ఇంతలో నాన్నకు నోటి క్యాన్సర్ వచ్చింది. ప్రేమగా మాట్లాడాలన్నా మాట్లాడలేని స్థితిలో ఉన్న నాన్న తన గత ప్రవర్తనకు మన్నించమని కాగితం మీద రాసి చూపించాడు. ఇప్పుడు అమ్మ అనుక్షణం ఆయన సేవలోనే. ప్రేమమయి, దయామయి మా అమ్మ. మమ్మల్ని మంచి విలువలతో పెంచి పెద్ద చేసిన అమ్మ నీడ మాకు చిరకాలం ఉండాలని దైవాన్ని కోరుకుంటాను. ఇదే నా అంతరంగ నివేదన” ముగించింది జయంతి.

కరతాళ ధ్వనులు మార్మోగాయి.

“జయంతి గారి అంతరంగ కథనం విన్నారుగా. ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం. ఇప్పుడు శ్రీ సాగర్ గారు మాట్లాడతారు” కార్యనిర్వాహకుడు చెప్పాడు.

అందరి చూపులూ సాగర్ వైపే మళ్ళాయి. అతడు వేదికపైకి వచ్చి “అందరికీ వందనాలు. నా అనుభవం విభిన్నమైంది. అమ్మను గౌరవించడం మా నాన్నను చూసే నేర్చుకున్నాం. అమ్మ లాలన, నాన్న పాలనలతో మేం ఏ లోటు లేకుండా ఆనందంగా పెరిగాం. తొంభై ఏళ్ళ వయసు వరకు మా నానమ్మ మా మధ్యే ఉన్నారు. మంచంలో ఉన్న మా నానమ్మను మా అమ్మానాన్నలిద్దరూ ఎంతో ప్రేమగా చూశారు. అమ్మ అందరికీ ఆరాధ్య దైవమే. ఆమె ఆశీస్సులే మనకు సర్వదా రక్ష. తొలి వందనం అమ్మకే” అంటూ ముగించాడు.

జోరుగా చప్పట్లు మోగాయి.

కార్యనిర్వాహకుడు వచ్చి “సాగర్ గారి అంతరంగం విన్నారుగా. అమ్మను గొరవించే విషయంలో నాన్నే ఆదర్శంగా ఉండడం ఎంతో ముదావహం. ఇప్పుడు సూర్యగారు మాట్లాడుతారు” అనగానే అతడు వేదిక పైకి వచ్చాడు.

“అందరికీ నమస్కారాలు. నేను చెప్పేది మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. కానీ నేను నిజం చెపుతున్నాను. నాకు ఇద్దరు తల్లులు. ఒకరు జన్మనిస్తే, మరొకరు సాకారు. నన్ను సాకిన అమ్మ మా నాన్నకు మొదటి భార్య. ఆమెకు తండ్రి లేని కారణంగా హైస్కూల్ చదువు కాగానే బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి చేశారట. పల్లెలో పెరిగిన అమాయకురాలు ఆమె. భర్త గురించి పెద్దగా అవగాహన లేదు. నగరంలో జీవితం తొలినాళ్ళలో బాగానే ఉందనిపించింది. ఇద్దరు పిల్లలు పుట్టడం, వారి పెంపకంలో పూర్తిగా నిమగ్నమైన ఆమె, మారుతున్న భర్త తీరు గమనించలేదు. ఒకరోజు మా అసలు అమ్మ తండ్రిని అంటే మా తాతగారిని తీసుకుని ఇంటికి వచ్చిందట. ఆయన మాటలద్వారా ఉద్యోగం కోసం వచ్చిన అమ్మను, నాన్న తనకు పెళ్లి కాలేదని మాయ మాటలు చెప్పి మోసం చేశాడని, డబ్బు కూడా తీసుకున్నాడని, ఇంటి అడ్రస్ ఎలాగో తెలుసుకుని వచ్చామని చెప్పాడుట. తనకు అన్యాయం చేయవద్దని, తాను తల్లిని కాబోతున్నానని చెప్పి ఏడ్చిందట మా అమ్మ. సాయంత్రం నాన్న వచ్చే దాకా అక్కడే ఉన్నారట. నాన్న వచ్చి వాళ్ళను అక్కడ చూసి ఖంగు తిన్నాడట. మా పెద్దమ్మ ఇదేమిటని నిలదీస్తే ‘అవును. ఆమెను కూడా పెళ్లి చేసుకుంటా. ఉద్యోగం ఇప్పిస్తా. నీకేం నష్టం? మనకు ఇంకో జీతం వస్తే మంచిదేగా? నీకెలాగూ చదువు, ఉద్యోగం లేవుగా. సర్దుకుపోయి ఉంటే ఉండు. లేదంటే నీ ఇష్టం.. వెళితే నీకే నష్టం’ అనడంతో ఏ అండా లేని పెద్దమ్మ అతడిని విడిచి వెళితే ఎన్ని సమస్యలు ఉంటాయో ఊహించుకుని మౌనం దాల్చింది. ఆపైన గుట్టుచప్పుడు కాకుండా నాన్నతో మా అమ్మ పెళ్ళి గుళ్ళో జరిగింది. నేను పుట్టాక మా అమ్మ ఉద్యోగానికి వెళితే, పెద్దమ్మ నన్ను సాకింది. అదీ ఏ మాత్రం ద్వేషం లేకుండా తన పిల్లలతో సమానంగా. నన్నే కాదు, మా తమ్ముణ్ణి కూడా. ఆమె జోలపాడితేనే నిద్రపోయే వాణ్ణి. బడిలో చేరాక కూడా మమ్మల్ని స్కూలుకు రెడీ చేయడం, బాక్సుల్లో మాకు ఇష్టమైనవి పెట్టడం..ఇలా చెప్పాలంటే ఆమె సేవలు ఎన్నో. సవతి పిల్లలు అన్న భావన ఏనాడు చూపలేదు. పిల్లలు లేక ఇతరుల పిల్లల్ని ప్రేమగా పెంచడం వేరు. కానీ తనకు పిల్లలు ఉండి, అదీ సవతి పిల్లల్ని అంత ప్రేమగా చూడడం ఆమెకే సాధ్యమైంది అనుకుంటాను. అందుకే మా పెద్దమ్మ అమ్మకు అసలైన నిర్వచనం అనిపిస్తుంది. నిష్కల్మష ప్రేమను చవి చూపిన అమ్మకు శిరసా.. మనసా వందనం” చెప్పాడు.

‘ఎంత గొప్ప మనసు’ అనుకుంటూ అంతా చప్పట్లు కొట్టారు.

ఆ తర్వాత మరో నలుగురు క్లుప్తంగా అమ్మ గురించిన తమ అంతరంగాన్ని ప్రేక్షకుల ముందు పరిచారు.

“ఇప్పుడిక అధ్యక్షుల వారి ప్రసంగం” అని ప్రకటించగానే వాసుదేవ్ గారు మైక్ అందుకున్నారు. “అమ్మ! మనిషికే కాదు, ప్రతి ప్రాణికీ అమ్మ ఉండడం ఒక అదృష్టం. తల్లి లేని పిల్లల్ని మరొకరు ఆదరించవచ్చు. కానీ అది జాలితో కూడిన ఆదరణే కానీ అమ్మ ప్రేమకు సమం కాదనిపిస్తుంది. లాల పోసి, ముస్తాబు చేసి, గోరు ముద్దలు తినిపించడం, జోలపాటలు పాడడం, దోబూచులాడి నవ్వించడం.. ఇవన్నీ పొందడం ఎంత అదృష్టం! కానీ నాకు ఆ అదృష్టం లేదు. నాకు ఊహ తెలియక ముందు అమ్మ చూపిన ప్రేమానురాగాలు నా గురుతుకు అందలేదు. మా అమ్మ మానసిక రుగ్మతకు లోనయి ఉరివేసుకు చనిపోయింది” చెపుతుంటే ఆయన గొంతు వణికింది. “నాకు నాలుగేళ్లు కూడా నిండాయో లేదో అమ్మ అలా అదృశ్యమైంది. అది కూడా ప్రపంచ అమ్మల దినోత్సవం రోజే. ఏటా ఈ రోజు వస్తే చాలు నా మదిలో ఆలోచనల విస్ఫోటనం మొదలవుతుంది. అందరూ అమ్మలకు బహుమతులు కొనడం, సత్కారాలు చేయడం వారి గురించి గొప్పగా చెప్పడం, వారి ఆశీస్సులు తీసుకోవడం చూసినప్పుడు అమ్మ లేని నేను పసివాడిలా మనసులోనే దుఃఖిస్తుంటాను. అందుకే అమ్మకు నివాళిగా ‘అమ్మ లోగిలి’ ఏర్పాటు చేశాను. ఏ ఆధారం లేని అమ్మలు, నిరాదరణకు గురయిన అమ్మలు మా ఆశ్రమంలో ఉండేందుకు తగిన వసతి కల్పించాను. ఇప్పుడు నాకు ఎందరో అమ్మల ఆశీస్సులు అందుతున్నాయి. కానీ ఇంకా నాలో ఏ మూలో బాధ. అది మానని గాయం. ఈ వేదిక నుంచి నేను విన్నవించుకునేది ఒక్కటే, ఏ అమ్మ కూడా బిడ్డల గురించి ఆలోచించకుండా, క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడి, బిడ్డలను అమ్మ లేనివారిగా చేయకూడదు. బిడ్డకు అమ్మే వరం. ఆమె ఆత్మహత్య వారికి శాపమే అవుతుందని తెలుసుకోవాలి. అదే నేను కోరుకునేది. అమ్మలందరికీ వందనాలు” అంటూ ముగించారు.

కార్యక్రమ నిర్వాహకుడు వచ్చి “అమ్మ విలువ తెలిసిన మీరు ‘అమ్మ లోగిలి’ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో అమ్మలకు అండగా ఉండడం గొప్ప సంగతి. మీరు అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమ్మ గురించిన అంతరంగ కథనాలు విన్నాక అందరికీ కూడా అమ్మ మరింతగా అర్థమై ఉంటుందనుకుంటున్నాను. కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఎందరో అమ్మలు. అందరికీ మరోమారు అభివాదాలు.. అభినందనలు తెలియజేస్తున్నాను” అనడంతో అంతా లేచి బయటికి నడిచారు. కానీ అందరి అంతరంగం అక్కడే ఆగిపోయి అమ్మనే స్మరిస్తోంది.. కొందరిలో ఎన్నో సూటి ప్రశ్నలు నిలదీస్తూ నిగ్గదీస్తూ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here