అంతరాత్మ తీర్పు

0
10

[box type=’note’ fontsize=’16’] “మనం చేసే తప్పులకు మనసే సాక్షి, అంతరాత్మే న్యాయమూర్తి. చేసిన తప్పుకు అంతరాత్మ విధించే శిక్షని అనుభవించాల్సిందే” అంటున్నారు డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యంఅంతరాత్మ తీర్పు” కథలో. [/box]

“అమ్మా! శారదమ్మా! నువ్వు ఇంకా పండుకునే ఉన్నావా? ఎవరో ఆడ మనిషి మన ఇంటి అడ్రసు పట్టుకుని ఆళ్ళ నీ ఈళ్ళనీ అడుగుతా ఇంటి ముందుకు వచ్చి నిలబడినాది. తలుపు తెరిచి చూడు” ఇంటి వెనుక వైపు వున్న పడక గది కిటికీ అవతల నిలబడి పెద్ద గొంతుతో శారదమ్మను లేపింది పనిమనిషి.

రాత్రి ఒంటి గంట దాకా నడుము నొప్పితో మూలుగుతూ అటు ఇటు దొర్లుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్న శారదమ్మ వులికిపడి మేలుకుంది.

మంచం పక్కన ఉన్న చేతి కర్ర సాయంతో అడుగులో అడుగు వేస్తూ వెళ్ళి వీధి తలుపు తీసింది.

పనిమనిషి సాయమ్మ మాట నిజమే.

ఎవరో నలభై అయిదేళ్ళ ఆడ మనిషి నిలబడి వుంది.

“ఇది రఘునాథ సార్ గారి ఇల్లే కదమ్మా? మీ పేరు శారదమ్మ. అవునా? ఇదిగో, సారు ఈ ఉత్తరం నీకు ఇమ్మన్నారు” అంటూ ఒక కవరు అందించింది.

“అమ్మా! ఈ ఉత్తరం తెచ్చిన ఆమె పేరు మాధవి. మా ఆఫీసు వాళ్ళ ద్వారా ఈమె వివరాలన్నీ కనుక్కునాము. పెళ్ళయింది. మొగుడు వదిలేసాడు. ఒంటరి ఆడది. నీకు సాయంగా వుంటుందని ఏర్పాటు చేసాము. నీ కోడలు ఆమెకు అన్నీ వివరంగా చెప్పింది. మేము రేపు శనివారం వస్తాం.”

కొడుకు రాసి పంపిన ఉత్తరం పూర్తిగా చదివి, వచ్చిన ఆమె వైపు పరిశీలనగా చూసింది శారదమ్మ.

సరైన తిండి లేక ఎండిపోయిన ఒళ్ళు, ముఖాన చిన్న బొట్టు, చెవికి నీరు దిగిన ఏడు రాళ్ళ కమ్మలు, వెలిసి పోయిన చీరలో దీనంగా ఉంది.

ఇరవై సంవత్సరాల క్రితం తాను ఈ మనిషి లానే వుండేది అన్న ఊహ మనసులో మెదిలి చిన్నగా వణికింది శారదమ్మ.

వయసు హోరులో కులము, అంతస్తు వంటి అడ్డు గోడలు దూకి ఒక రాత్రి ఇంటినుండి బయటపడింది శారద. విషయం తెలిసి కూతురు చచ్చిందని నువ్వులు, నీళ్ళు ఒదిలి వూరుకున్నారు శారద కన్నవాళ్ళు. ప్రేమ కడుపు నింపదని అర్థం కావడానికి సంవత్సరం పట్టింది శారదకు. చదువు సంపాదన లేని మొగుడు తాగుడు మొదలెట్టి చావబాదుతుంటే కళ్ళు తెరుచుకున్నాయి ఆమెకు.

కడుపున పడిన బిడ్డ భూమి మీద పడక ముందే ప్రమాదంలో ప్రాణం పోగొట్టుకున్నాడు శారద మొగుడు. మొగుడి వైపు ఎవరూ లేరు. అతను అనాథ. తను చేసిన తలవంపుల పనికి అమ్మ గుండె పగిలి కళ్ళు మూసింది. చంటి బిడ్డతో గడప తొక్కిన కూతురి ముఖం మీద తలుపు వేసాడు తండ్రి.

అక్కడా ఇక్కడా వంటపని చేస్తూ కొడుకుని పెంచుకుంది. పదేళ్ళ పిల్లాడిని వెల్ఫేర్ హాస్టల్లో వేసింది పెద్ద వాళ్ళ కాళ్ళు పట్టుకుని. వాడికి చదువు అబ్బి ఇంటర్‌మీడియెట్ లోకి వచ్చాడు. స్థిరమైన ఆదాయం వచ్చే పనికోసం చూస్తోంది శారద.

ఒక పెళ్లి ఇంట్లో వంట వాళ్ళకు సహాయం చేస్తున్న శారదను తమ బంధువులైన వీర్రాజు గారికి ఇంట్లోనే ఉండి జబ్బు మనిషిని చూసుకునే వంట మనిషి కావాలని ఆ పెళ్లి కూతురు తండ్రి చెప్పగా హిందూపురం వచ్చి వాళ్ళను కలిసింది.

వీర్రాజు గారి కొడుకు అమెరికాలోను, కూతురు కువైట్ లోను ఉంటారు. ఆయన వ్యాపార రీత్యా సింగపూరు వెడుతుంటాడు.

భార్య నిర్మలమ్మ జబ్బుమనిషి. మతి మరపు. ఆమెకు పథ్యంగా వండి పెట్టి, వేళకు మందులు ఇస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు గాను శారదమ్మకు అయిదు వేలు ఇచ్చి, ఇంటి ఖర్చులకు, నిర్మలమ్మ మందులకు మరో పదిహేను వేలు ఇస్తామని చెప్పడంతో సంతోషంగా ఒప్పుకుంది శారదమ్మ.

వీర్రాజు గారి ఇంట్లో వంట మనిషిగా చేరినప్పుడు శారదమ్మ ఇప్పుడు పనికోసం వచ్చిన మాధవి లాగే పేదగా దీనంగా ఉండేది.

ఇప్పుడు శారదమ్మ ఒంటిమీద ఖరీదైన జరీ అంచు వెంకటగిరి చీర, మెడలో నాలుగు పేటల గొలుసు, చేతులకు రెండేసి బంగారు గాజులు ఉన్నాయి.

“లోపలికి రా” అంటూ వెళ్ళి కుర్చీ లో కూర్చుంది శారదమ్మ.

మాధవి వినయంగా వచ్చి ఎదురుగా నిలబడింది.

“చూడు ఎవరు లేని దానివని, నమ్మకంగా ఉంటావని నిన్ను పంపించాడు నా కొడుకు. నాకు కూరల్లో కారం, నూనె తక్కువగా వేసి వండాలి. నీకు కావలిసినట్టు ఘాటుగా, నూనె తేలుతూ చేస్తే కుదరదు.”

“అట్లాగే అమ్మా! మీకు కావలసినట్టు వండి పెడతాను. నాదేముంది మిగిలిన నాలుగు మెతుకులు చాలు” అణకువగా అంది మాధవి.

“అబ్బా కూర ఇంత కారంగా ఉందేమిటి శారదా? వేపుడు కూరలు తినకూడదు అన్నాడు డాక్టరు. నీకు చెప్పినా ఇంత నూనె పోసి చేశావు” నిర్మలమ్మ గొంతు చెవిలో వినబడింది శారదమ్మకు.

“ఆ కూర నేను తింటాను లేమ్మా! నువ్వు చారు అన్నం కలుపుకో. బాగా జీర్ణం అవుతుంది. “

మనసులో ఎవరో మాట్లాడినట్టు వినబడింది శారదమ్మకు. “ఆ గొంతు ఎవరిది? తనదే కదూ?”

తల విదిలించి తిరిగి యజమానురాలి హోదాలో చెప్పింది. “ఆ మూలన ఉన్న చిన్న గదిలో నీ సామాను పెట్టుకో. నాకు వేళకు మందులు ఇవ్వడం, నడుము నొప్పికి నూనెలు మర్ధన చేయడం, రాత్రి పూట నేను పిలిస్తే పలకడం నీ పనులు. అనవసరంగా పడక గదులలోకి వెళ్ళడం, అలమారులు తెరవడం చేయకు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు” కచ్చితంగా చెప్పింది శారదమ్మ.

“అన్నట్టు నీ వివరాలు, ఫోటో పోలీస్ స్టేషన్‌లో ఇస్తాము. జాగ్రత్తగా ఉండు” హెచ్చరిస్తున్నట్టు అంది మళ్లీ.

“సరేనమ్మా! మీరే చూస్తారుగా! నాకు తిండి, బట్టలు, ఉండడానికి చోటు ఉంటే చాలు మీకు నచ్చినట్టు పనిచేయడానికి, మిమ్మల్ని బాగా చూసుకోవడానికే కదా నన్ను పెట్టుకుంటున్నది. మీ ఇంటి మనిషి లాగా వుంటాను చూడండి” అంది మాధవి.

ముఖాన చెళ్ళున కొట్టినట్టు అనిపించింది శారదమ్మకు.

“ఇరవై సంవత్సరాల క్రితం నీవు అచ్చం ఈ మాటలే కాదూ అన్నది?” అని ఎవరో అడుగుతున్నట్టు తోచింది. ఆమె ముఖం నెత్తురు చుక్క లేనట్టు పాలిపోయింది.

“ఏమైందమ్మా అట్లా అయిపోయినారు? మంచినీళ్ళు తెచ్చేదా?” ఆదుర్దాగా అడిగింది మాధవి.

“అక్కర్లేదు. నువ్వు వంట మనిషిలా ఉంటే చాలు. ఇంటి మనిషిగా కాదు” కఠినంగా చెప్పి, లోపలికి పొమ్మని సైగ చేసింది శారదమ్మ.

మరునాడు శారదమ్మ కొడుకు రఘునాథ్, కోడలు అంజలి వచ్చారు. కొడుకు కర్నూలులో నీటి పారుదల శాఖలో పని చేస్తాడు. కోడలు ఆ వూళ్ళోనే ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్. వాళ్ళు అక్కడే ఉంటారు. వారానికి ఒకసారి వచ్చి పోతారు.

కోడలిని చూడగానే ముఖం చిట్లించింది శారదమ్మ.

ఈమె ఏదో ప్రపంచ సుందరి అయినట్టు పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాడు. పేదవాళ్ళు. కట్నం కానుకల మాటే లేదు.

“మీ నడుము నొప్పి ఎలా ఉంది అత్తయ్యా? వంట మనిషి బాగానే చేస్తోందా?” రాగానే కుశల ప్రశ్నలు వేసింది అంజలి.

“ఇంకా నిన్ననే కదా వచ్చింది. అప్పుడే ఏం తెలుస్తుంది? ఎలా వున్నా సద్దుకోవలసిందే. నువ్వు ఇక్కడ ఉండి ఈ ముసలి అత్తకి చాకిరీ చేయవు కదా” నిష్ఠూరంగా అంది.

“వీడికోసం ఎంత కష్ట పడింది? చదివించి ప్రయోజకుడిని చేయడానికి చేయరాని పనులు చేసింది. అదంతా ఈమె గారి పాలు” మనసులో అనుకుంది.

***

ఈ అమ్మగారి తత్వమేమిటో మాధవికి అర్థం కావడం లేదు. తనతో కూడా భోజనానికి కూర్చోమంటుంది. ముందు తాను తినడం మొదలు పెట్టాక ఆవిడ ముద్ద నోట్లో పెట్టుకుంటుంది. మందులు ఆమె మంచం పక్కనే ఉంటాయి. ఆవిడ ఎదురుగా తీసి ఇవ్వాలి.

ఒకరోజు నాలుక పీకి, నాలుగు తమలపాకులు తెచ్చుకుని రెండు కిళ్ళీలు కట్టి, ఒకటి శారదమ్మకు ఇచ్చింది “నేను కిళ్ళీలు బాగా కడతానమ్మా” అంటూ.

అంతే ఆమె కోపంతో ఊగిపోయింది.

“ఇదేనా? నీకు నల్లమందు అలవాటు కూడా ఉందా. దీనిలో నల్లమందు వేసావా?” అని అరుస్తూ రెండు కిళ్ళీలు లాక్కుని బయటకు విసిరి వేసింది.

మాధవి విస్తుపోయి చూస్తోంది. “నేనేం చేశానమ్మా? ఆకూ వక్క తింటే తప్పా? మీకు ఇష్టం లేకుంటే ఇంకెప్పుడూ తీసుకురాను లేమ్మా” అంది గొంతు పెకల్చుకుని.

స్పృహలోకి వచ్చినట్టు చుట్టూ చూసింది శారదమ్మ. “నన్ను మాట్లాడించకు” అంటూ గదిలోకి వెళ్లిపోయింది.

ఆమె మనసు ఇరవై ఏళ్ల క్రిందటి జ్ఞాపకాల లోకి వెళ్లిపోయింది.

“నాకో కిళ్ళీ ఇవ్వు శారదా ! కడుపులో నొప్పిగా ఉంది. కిళ్ళీ వేసుకుంటే తగ్గుతుందని అన్నావు కదా. ఒక్కటి ఇవ్ఫు. నీకు ఈ గాజులు ఇచ్చేస్తా!” నిర్మల గొంతు పదే పదే వినిపిస్తోంది.

నిద్రలో నుండి ఉలికిపడి లేచింది శారదమ్మ. ఒళ్లంతా చెమటలు. చేతులు వణుకుతున్నాయి. చేతులకు ఉన్న గాజులు చూసుకుంది. మెడలో గొలుసు తడుముకుంది.

లేచి మంచి నీళ్ళు తాగి దుప్పటి నిండా కప్పుకుని పడుకుంది. మనసులో ఆనాటి జ్ఞాపకాలు ముళ్ళ కంపల లాగా కదులుతున్నాయి

“ఏం శారదా, అమ్మగారు ఎలా ఉన్నారు? సింగపూర్ నుండి ఫోనులో నిర్మల భర్త గొంతు.

“ఎప్పుడు మబ్బుగా ఉంటారయ్యా. పడుకునే ఉంటారు. అన్నంతిని మళ్లీ పెట్టమంటారు” శారద

వినయంగా చెప్పింది.

“అడిగిందని మళ్లీ మళ్లీ పెట్టకు, బరువు పెరిగి పోతుంది. మందులు ఇస్తున్నావు గా!”

“అవునయ్యా.”

నీరసంతో మంచానికి అంటుకు పోయిన నిర్మల “ఆకలిగా ఉంది శారదా అన్నం పెట్టు” అంటోంది.

“ఎప్పుడంటే అప్పుడు పెట్టొద్దని అయ్య చెప్పినాడు” శారద కసరుకుంది.

కువైట్ నుండి నిర్మల కూతురు ఫోను శారదే తీసింది.

“అమ్మ ఎలా ఉంది? ఇప్పుడు కూడా వేసిన తాళాలు మళ్లీ మళ్లీ లాగి చూస్తూ, చేతులు మాటిమాటికీ సబ్బుతో కడుగు కుంటూ, చెప్పిన విషయాలే మళ్లీ మళ్లీ చెబుతూ వుందా?” అంటూ అమ్మ గురించి ఆరా తీసింది.

“అవునమ్మా” అంది శారద.

”ఊరికే సతాయిస్తూ ఉందనే కదా వక్కాకులో నల్లమందు మాత్ర పెట్టి ఇస్తోంది. ఎప్పుడు మత్తుగా పడుకుని ఉంటుంది” అని నవ్వుకుంది.

“జాగ్రత్తగా చూసుకో శారదా. మమ్మల్ని గుర్తు చేసుకుంటుందా?”

“లేదమ్మా! బొత్తిగా జ్ఞాపకం ఉండడం లేదు అమ్మకు. మీరు పంపిన ఫోటోలు చూపిస్తే నీ కూతురువా అని అడిగిందమ్మా. “

“అమ్మ జాగ్రత్త శారదా! నువ్వే భద్రంగా చూసుకోవాలి.”

లేచి కూర్చుంది శారదమ్మ. గుండె డబ డబ కొట్టుకుంటోంది.

“అమ్మా ఏదో కలవరిస్తున్నారు. మంచినీళ్ళు ఇచ్చేదా?” గదిలోకి తొంగి చూసి అడిగింది మాధవి.. “నా గదిలోకి నిన్ను రావొద్దని చెప్పానా? మంచం పక్కనే బల్ల మీద నీళ్ళు పెట్టావు కదా? పోయి పడుకో” కోపంగా అరిచింది.

“ఇదేం మనిషి మంచి మాటాడినా మీద పడిపోతుంది” మనసు లోనే అనుకుంటూ వెళ్లిపోయింది మాధవి.

అంజలి పని చేస్తున్న స్కూల్లో అర్థ సంవత్సరం పరీక్షలు జరుగుతుండడం వలన నెల్లాళ్ల తరువాత వచ్చారు శారదమ్మ కొడుకు రఘునాథ్, కోడలు అంజలి.

“ఏంటమ్మా ఇంత చిక్కి పోయావు? సరిగ్గా తినడం లేదా?” కొడుకు ఆప్యాయంగా అడిగిన దానికి కలవర పడింది శారదమ్మ.

“చిక్కి పోయానా? అదిగో ఆ మాధవీ ఏదన్న మందు పెట్టిందేమో అన్నంలో” అంది భయంగా.

“ఉరుకో అమ్మా! వింటే పని మానేసి పోతుంది” రఘునాథ్ హెచ్చరించాడు.

“ఏవంటోంది మా అత్తమ్మ?”వంటింటి లోకి వెళ్ళి మాధవిని అడిగింది అంజలి.

“ఏమోమ్మా! అన్ని అనుమానాలే ఆ అమ్మకు. కూర బాగుంది తినమ్మా అంటే ఆరోజు కూర ముట్టుకోదు.. పండ్ల రసం తీసి తాగమ్మా అంటే నువ్వూ తాగు అంటుంది, నాకేమీ అర్థం కావడం లేదమ్మా!” అంది మాధవి..

అత్తగారి పక్కన వచ్చి కూర్చుని “ఎలా ఉన్నారు అత్తయ్యా?” అని పలకరించింది అంజలి.

“ఇదేమిటి అత్తయ్యా చేతి గాజులు, మెడలో గొలుసు తీసేసి బోసిగా కనబడుతున్నారు” పరీక్షగా చూసి మళ్లీ తానే అంది.

“అందరి కళ్ళు నా నగల మీదే ఉంటాయని భయంతో తీసిదాచి ఉంచాను” అప్పుడే వంటింటి నుండి బయటకు వచ్చిన మాధవిని, కోడలిని మిర్రి మిర్రి చూస్తూ చెప్పింది శారదమ్మ.

అంజలి ముఖం కోపంతో ఎర్రబడింది. మాధవి చిన్న బుచ్చుకుని లోపలికి పోయింది.

***

“అమ్మా నా చీరలు చిరుగు పట్టాయి రెండు పాత చీరలు ఉంటే చూసి ఇవ్వండి” ఒక రోజు ధైర్యం చేసి శారదమ్మను అడిగేసి ఏమంటుందోనని భయంగా చూసింది మాధవి

“నన్ను అడగడం దేనికి? బీరువా తెరిచి నీకు కావలసినవి తీసుకో లేకపోయావా?” వ్యంగ్యంగా అంది శారదమ్మ.

అంతలో ఉన్నట్టుండి రెండు చేతులతో కణతలు నొక్కుకుంది.

శారదమ్మ పనిలో చేరాక ఏడాది తరువాత సింగపూరు నుండి వచ్చాడు వీర్రాజుగారు.

ఆయనకు స్నానానికి వేడి నీళ్ళు పెట్టి, రుచిగా వండిపెట్టింది.

వొళ్ళు నునుపు తేరీ, మంచి రంగు వచ్చి అందంగా కనబడుతున్న శారదను పదే పదే చూస్తున్నాడు ఆయన. తాను ఘుమ ఘుమ లాడే గంధం సబ్బుతో స్నానం చేసి, గులాబీ రంగు చీర కట్టుకుని రాత్రి భోజనం తరువాత వీర్రాజు గారి గదిలోకి వెళ్ళి ఆయన కాళ్ళు ఒత్తింది శారదమ్మ. ఇంకో గదిలో ఈ ఏడాదిలో మరింత చిక్కి శల్యమైన ఆయన భార్య మత్తుగా నిద్ర పోతోంది.

శారదమ్మ తలలో ఏదో రొద. ఎవరివో మాటలు వినబడుతున్నాయి.

“నా చీర కట్టుకున్నా వెందుకు?” నిర్మల కోపంగా అడుగుతోంది.

“నీ చీరలన్నీ నువ్వే నాకు ఇచ్చేసినావు గదమ్మా” శారద నవ్వుతోంది..

“అయ్యగారే చెప్పారు మీ చీరలలో నాకు కావలసినవి తీసి వాడుకోమని. అందుకే కట్టుకున్నా. అయినా అమ్మా! ఎన్నాళ్లు బతుకుతావని? ఇన్ని బట్టలు ఏం చేసుకుంటావు? ” తన గొంతు అడుగుతోంది.

శారదమ్మకు తల తిరిగి పోతూ వున్నట్టుగా అనిపించింది

“ఏమిటి అన్నావు? “అంది స్పృహ లోకి వచ్చి.

“నేను మాట్లాడలేదు కదమ్మా” బిక్క మొగం వేసింది మాధవి.

***

శారదమ్మ గదిలో నుండి బయటకు రావడం లేదు. మంచానికి అతుక్కు పోయింది. రాత్రి కళ్ళు మూస్తే చాలు కలలు కలవరింతలు.

“అయ్యా రాత్రి వెనుక తలుపు గడియ విరిచేసి దొంగలు లోపలికి వచ్చి నన్ను తోసేసి అమ్మగారి నగలు దోచుకు పోయారు.”

“అమ్మ కళ్ళు తెరవడం లేదు అయ్యగారు. డాక్టర్ గారిని పిలిస్తే చూసి ఇక రోజుల్లోనే అన్నారు. పిల్లలకి కబురు పెట్టి, మీరు బయల్దేరి రండి.”

“అమ్మ పోయిందని అర్థాంతరంగా నన్ను పొమ్మంటే ఎక్కడికి పోతానయ్యా నీ ఇల్లు కనిపెట్టుకుని ఇక్కడే పడి వుంటాను.”

“అమ్మ పోయినాక కూడా రెండేళ్ళుగా నిన్నే కనిపెట్టుకుని వున్నాను కదయ్యా. అందరు నన్ను నీ మనిషి అనే అనుకుంటున్నారు. ఇప్పుడు కొడుకు దగ్గరకు అమెరికా పోతాను నీదారిన పొమ్మంటే ఎట్లా? నాకు ఉండడానికి నీడ, నా కొడుకు చదువుకు డబ్బు ఏర్పాటు చేసీపో లేకుంటే నలుగురిలో పంచాయితీ పెడతాను. రచ్చ రచ్చ చేస్తాను.”

“అనంతపురంలో తపోవనంలో వున్న రెండు సెంట్ల ఇంటి స్థలం దానికి రాసి ఇచ్చి, రెండు లక్షలు ముఖాన కొట్టి పీడ వదిలించుకో నాన్నా” నిర్మల కూతురు.

ఇరవై ఏళ్ల క్రిందట చేసిన పాపాలన్ని పలవరింతలు గా బయటకు వస్తున్నాయి

***

మాధవి తన గదిలోకి రాకూడదని తలుపు గడియ వేసుకుంటోంది శారదమ్మ.

కోడలు అంజలి కడుపుతో ఉంది. పుట్టింటికి పోయింది. రఘునాథ్ వచ్చి చూసి పోతున్నాడు. అతను వున్నప్పుడు మరింత శ్రద్ధగా మంచి వంటలు చేసి పెడుతోంది మాధవి.

“ఇదిగో మాధవి మా ఆవిడ నీకు ఈ రెండు చీరలు పంపింది. అమ్మ ఇవ్వదనీ తెలుసు తనకు” నవ్వుతూ మాధవికి అందించాడు. కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు ఒక కన్ను వాళ్ళ మీద ఉంచుతున్న శారదమ్మ చేతి కర్ర సాయంతో అక్కడికి వచ్చింది.

“ఒసేయ్ నా కొడుకుతో ఏమిటే ఆ వికవికలు పకపకలు? ఈ కొంప, ఆస్తి రాయించుకుని పొదాము అనేనా?”

పట్టలేని కోపంతో ఆవేశంగా అరిచింది. చేతి లోని కర్ర పైకి ఎత్తింది మాధవిని కొట్టడానికి.

మరుక్షణం కుప్ప కూలి కిందపడి పోయింది.

కాలు చేయి వంకర తిరిగి పోయాయి. నోరు సొట్ట బోయింది. నోట్లో నుండి మాట రాకండా వగరుస్తోంది.

కొడుకు అమ్మా అంటూ పరిగెత్తుకు వచ్చాడు.

మాధవి కూడా ఒక్క అంగలో దగ్గరికి వచ్చింది.

మాధవిని చూడగానే వద్దు అన్నట్టు తలతిప్పింది శారదమ్మ.

పట్టించుకోకండా ఇద్దరు కలిసి ఆమెను మంచం మీదకి చేర్చారు.

పదిహేను రోజుల తరువాత వూరికి బయలు దేరాడు రఘునాథ్.

“అమ్మ జాగ్రత్త మాధవీ” అని ఒప్పగించాడు.

శారదమ్మ కళ్ల లో నుండి నీళ్ళు కారుతున్నాయి.

తల అడ్డంగా తిప్పుతోంది.

“నువ్వు ఉండవమ్మా మళ్లీ వారం వస్తారు లే” అంది మాధవి.

ఆమె మాటల్లో ఇదివరకటి వినయం విధేయత లేవు. ఒక రకమైన చులకన వుంది.

అసహాయంగా మంచం మీద పడి ఉన్న శారదమ్మకు అర్థమవు తున్నది. తాను చేసిన పాపం కట్టి కుడుపుతోంది. జబ్బు మనిషి నిర్మలమ్మకు తాను తిండి సరిగ్గా పెట్టలేదు. మందులకు ఇచ్చిన డబ్బు తనకోసం వాడుకుంది. పాలు,హార్‌లిక్స్ తాను తాగింది. మత్తుగా పడి వుండాలని నల్లమందు అలవాటు చేసింది. దొంగలు పడ్డారని కథ అల్లి నగలు దోచుకుంది.

చేసిన పాపానికి శిక్ష ఇక్కడే అనుభవిస్తోంది. ఎవరు చూడడం లేదనుకుంది. కానీ తన మనసే సాక్షి. అంతరాత్మే న్యాయమూర్తి. ఈ జన్మలో చేసిన తప్పుకు ఈ జన్మలోనే శిక్ష పడింది. అంతరాత్మ తీర్పును అనుభవించాల్సిందే.

శారదమ్మ కళ్ళు బేలగా మాధవిని చూస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here