అంతరిక్షంలో మృత్యునౌక-1

0
8

[శ్రీ బంకా పార్దు సంపత్ ‘Redemption of the Century’ అనే పేరుతో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలను ‘అంతరిక్షంలో మృత్యునౌక’ పేరిట అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

నేపథ్యం:

[dropcap]వం[/dropcap]ద సంవత్సరాల పరిధి గల ఒక చారిత్రిక, చారిత్రాత్మక గాథ ఇది. మానవ జాతి ఒక ఎటూ పాలుపోని సంకటస్థితిని ఎదుర్కొంటూన్న ప్రచ్ఛన్న యుద్ధ కాలం. అన్ని దేశాలూ ఒక్కటై, పక్క పక్క ఉన్న రెండు గ్రహాలను నిరంతరం ప్రభావితం చేయబోయే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సందర్భం. అన్ని దేశాలకు ఏకీకరణకై పిలుపు వచ్చిన కష్టకాలం. ఏ గ్రహాన్ని రక్షించాలి? మాతృగ్రహమైన భూమినా, లేక ఎరుపు రంగులోని కుజ గ్రహాన్నా?

ప్రచ్చన్న యుద్ధం – అంతర్యుద్ధం మధ్యలో సంభవించిన ఈ అల్లకల్లోల పరిస్థితిలో, అరుణ గ్రహాన్ని, భావి తరాల కోసం సంరక్షించుకోడానికి దేశాలన్నీ కలిసి కట్టుగా ముందుకు వస్తాయా?

మానవుడు గతంలో చేసిన చర్యల తాలుకు దుష్పరిమాణాలేమిటి? అవి భవిష్యత్తులో ఏ విధంగా దిద్దుకోబడుతున్నాయి?

***

ప్రకరణం-1: 1970 ప్రచ్ఛన్న యుద్ధశకం – తెలియని గందరగోళం

తేదీ మార్చి 18, 1970

స్థలం – న్యూక్లియర్ పరీక్ష జరిగే చోటుకు దగ్గరగా ఉన్న సైనిక స్థావరం. వైట్ శాండ్స్ మిస్సైల్ పరిధి, న్యూమెక్సికో, అమెరికా.

కాలం – 5.11 PM

భూమాత ముఖం మీద లయబద్ధంగా తాడిస్తున్న పదాల ఘట్టనం, ఆ సైనిక స్థావరంలోని గాలిలో వ్యాపించింది. కొన్ని సైనిక దళాలు రెండు వరుసలుగా రోడ్డు పక్కన కవాతు చేస్తున్నాయి. అక్కడ మరో అదనపు శబ్దం కూడా వినిపిస్తూంది. అది సరుకులను, సైనికులను చేరవేస్తున్న వాహనాల రొద. నిరంతరం మోగుతున్న హారన్ల శబ్దాలు, వాహనాల ఇంజన్ల హోరు కూడా దానికి తోడైంది. గాలి, పరిసరాల్లోని ఈ ధ్వనులతో, వాహనాల నుండి వెలువడుతున్న పొగలతో, కవాతు చేస్తున్న సైనికుల పాదాల నుండి రేగిన దుమ్ముతో, కలుషితమయింది.

గాలి మంద్రంగా వీస్తూంది. నీటి కుంట పక్కన పాతిన గొడుగు మెల్లగా అటూ ఇటూ ఊగుతూంది. సూర్యస్తమయం ఇంచుమించు కాబోతున్నట్లే! కాని సూర్యుడు పశ్చిమాద్రిలో ఇంకా గోచరిస్తూన్నాడు. మబ్బులు ఆయనను ఆవరించి లేవు. ఆయన తన ప్రకాశాన్ని ఇంకా, భూమి అంతటా వెలుగు లీనేలా చేస్తున్నాడు. సాయంత్రం అయింది కాబట్టి, సూర్యుని వేడిమి బాగా తగ్గినట్లే.

నీటి కుంటలో, నీళ్ల మీద చేతులతో తపా తపా కొడుతూ ఈదుతూన్న చప్పుడు. దాని వల్ల కుంట అంచు మీద చిట్లుతున్న నీటి తుంపరలు. ‘నీల్ బ్యారీ’ తల నీటిలోంచి పైకి లేచింది. నీట ఉపరితలం చలించే ఫలకంలా ఉంది. అతని శరీరమంతా నీటిలో తప్పనానింది. నీటి కుంట అంచుకు చేరి, గట్టు మీదికి ఎగబాకాడు నీల్. గట్టు మీదే కూర్చుని కాళ్లతో నీటిని కొట్టసాగాడు.

అతడు లోదుస్తులు వేసుకుని ఉన్నాడు. ధృడమైన విశాలమైన అతని ఛాతి కనబడుతూంది. అతని వయసుకు మించి, చక్కని శరీరాకృతి, అందమైన ముఖం. ముఖం మీద ఎటువంటి వెంట్రుకలు లేవు. అతని చర్మం మధ్యస్తమైన తెలుపు రంగులో ఉంది. నీళ్లు కారుతున్న అతని నల్లని జుట్టు ఆ రంగును సుసంపన్నం చేస్తూ ఉంది. అతడు ఆరడుగుల రెండంగుళాల పొడవున్నాడు. సాధారణ ఎత్తరులు అతన్ని తల ఎత్తి చూడవలసిందే!

నీల్ తన పక్కన ఉన్న తువ్వాలునందుకొని, నెమ్మదిగా ముఖం తుడుచుకోసాగాడు. ఒక చేత్తో అక్కడే ఉన్న తన ఫోన్ తీసి, చూశాడు. అంతకు ముందది కాసేపు రింగై ఆగిపోయింది.

టవల్‌తో తల రుద్దుకుంటూ, నీల్ ఆ నంబరు కలిపాడు. దాన్ని చెవి దగ్గర పెట్టుకున్నాడు. ఒక ‘బీప్’ వినిపించింది.

“హలో!” అన్నాడు ముఫై ఐదేళ్ల నీల్.

“హలో!” ఒక మగ గొంతు జవాబిచ్చింది. “నేను మాట్లాడుతున్నది నీల్ బ్యారీతోనేనా?”

“అవును. నీల్ తోనే. చెప్పండి. నేనేం చేయగలను? “ అనడిగాడు నీల్. అవతలి వ్యక్తి గొంతు కొంచెం వింతగా ఉంది.

“నేను ‘నాసా’ లోని ఆమెస్ రీసర్చ్ కేంద్రం నుంచి కాల్ చేస్తున్నాను సర్. నా పేరు జస్టిన్. ఇక్కడ అధినేత డాక్టర్ బ్రియాన్ హకిన్స్‌కు సహాయకుడిని. మీకు కాల్ చేసి, పరిస్థితిని వివరించమని నన్ను ఆదేశించారు.”

“సరే, వినడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నాడు నీల్, కొద్ది నిముషాల క్రిందట తాను పోసి పెట్టుకున్న వైన్ కప్పును అందుకుంటూ.

“ఓ.కే. సర్. ఈ వారం మొదట్లో, మా సిబ్బంది, ఉపగ్రహాన్ని ఉపయోగించి ఒక తెలియని అంతరిక్షశకలం నుండి వెలువడుతున్న అదనపు రేడియోషన్‌ను కనుగొన్నారు. ఆ ‘బాడీ’ చాలా పెద్దది. దాన్ని కనుక్కొన్న వాళ్లం మేం ఒక్కరమే కాదని కూడా మాకు బాగా తెలుసు. ఇది ఒక ప్రపంచ అత్యవసర పరిస్థితికి దారి తీయబోతుందని మేం అనుకుంటున్నాము. అది మన భూగ్రహానికే అత్యంత కీలకమైనది. ప్రస్తుతానికి పూర్తి సమాచారం ఇవ్వలేం కాని, మీరు సాధ్యమైనంత త్వరగా ఒక ఎమర్జెన్సీ మీటింగ్‌కు హాజరు కావాలని ఆదేశం.”

ఫోనులో అతను మాట్లాడిన మాటలను నీల్ తన మెదడులో రికార్డు చేసుకున్నాడు. ప్రతి రోజూ వచ్చే కాల్స్ లాంటిది కాదది. కాని అది అసంభవమైనది కాదని అతనికి తెలుసు. అతడు కనుచూపు మేరా తన దృష్టిని సారించాడు. దూరంగా, అడవులే కంచెంగా గల కాంపౌండ్ వరకు. ఆ కాలర్ చెప్పిన మాటలు మననం చేసుకున్నాడు. అంతరిక్షానికి గ్లోబల్ ఎమర్జెన్సీకి సంబంధించినదేదో జరుగబోతూంది. లోతుగా ఆలోచించే కొద్దీ అతనికి అర్థమైంది.

“హలో సర్. మీరు ఖచ్చితంగా వస్తున్నారని భావించవచ్చా?” ఆ గొంతు మళ్లీ అడిగింది, అతని ఏకాగ్రతను తన వైపు మళ్లిస్తూ.

“తప్పకుండా!” జవాబిచ్చాడు నీల్. ఒక్క క్షణం తటపటాయించి. “అయితే, నేను తెలుసుకోవలసిన వివరాలన్నీ పంపండి.”

***

తేది మార్చి 19, 1970

స్థలం లెనిన్ సిక్, రష్యా

సమయం – 1.10 AM

యూరీ ఇవానోవ్ బద్ధకంగా పక్క మీద అటు వైపుకు ఒత్తిగిల్లాడు. గట్టిగా శ్వాస తీసుకున్నాడు. అతని ఫోన్ చెవులు బద్దలయ్యేలా మోగుతూంది.

లేచి కూర్చున్నాడు కోపంగా. ఆ రోజంగా తీరిక లేకుండా పని చేశాడు. కంటి నిండానిద్రపోతే చాలనుకున్నాడు. రజాయి క్రింద నుంచి చేతిని తీసి, రెండు అరచేతులతో ముఖం తుడుచుకున్నాడు. నిద్రను దూరం చేసుకోడానికి. చలి నేరుగా రొమ్మును తాకుకుండా ఒక టాప్ అతన్ని రక్షిస్తూంది.

ఆ గది పూర్తి చీకటిగా ఉంది. ఏ రంగు తెలియటం లేదు. యూరీ కొంత పక్కకు వంగి, ప్రక్కగా ఉన్న షెల్ఫ్‌లలో పై దాన్ని తెరిచాడు. వెంటనే లైటు కాంతి అతనున్న మూలను ప్రకాశింప చేసింది.

దేన్ని గుద్దుకోకుండా తన రూమ్‌లో తిరగడానికి, బాగా చూడడానికి అతనికి వీలైంది. అతని బార్య, బెడ్‌కు ఒక్క పక్క పసిపాపలా హాయిగా నిద్రపోతూంది. చలిని తట్టుకునేందుకు ఒక మందపాటి రగ్గును కప్పుకుని ఉందామె.

షెల్ఫ్ వైపు తిరిగి ఫోన్ తీసుకున్నాడు. అప్పటికి రింగ్ ఆగిపోయింది. కాని కాల్ చేసే వాడంత సులభంగా వదలడని అతనికి తెలుసు. ఆ కాల్ గనుక అతని భార్యను నిద్ర లేపి ఉంటే, ఆ కాలర్ ఎవరియనా కావచ్చుగాక, అతనితో యూరికి పెద్ద వాగ్యుద్ధమే అయి ఉండేది.

బెడ్ దిగి, తలుపు వైపుకు నడుస్తూ, “హలో!” అన్నాడు. “మీరెవరైనా, ఈ సమయంలో ఫోన్ చేయడానికి మీకు సరైన కారణం ఉందనే అనుకుంటున్నా.”

సాధ్యమైనంత నెమ్మదిగా మాట్లాడాడు యూరీ, భార్య పిల్లలకు నిద్రా భంగం కాకూడదని. తలుపును శబ్దం రాకుండా మూసి, కొంచెం సందులోంచి, భార్యా పిల్లలను చూశాడు, నిద్రపోతూనే ఉన్నారా లేదా అని.

“హలో!” అవతలి గొంతు ఆగి ఆగి పిలుస్తూనే ఉంది.

“మీరెవరు, ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారని ఇందాకే అడిగాను” అన్నాడు మళ్లీ యూరీ. అతని రష్యన్ యాస అతడు మాట్లాడేటప్పుడు అంతగా లేదు.

“ఇలాంటి సమయంలో కాల్ చేసినందుకు క్షమించండి. కాని ఇది ఒక గ్లోబల్ ఎమర్జెన్సీ. మిమ్మల్ని సాధ్యమైనంత తొందరగా కాంటాక్ట్ చేయమని ఆదేశం ఉంది” అటునుంచి ఎలాషా వివరించింది. ఆమె గొంతు మృదువుగా, క్షమాపణ అడుగుతున్నట్లుగా ఉంది. యూరీని ఏ విధంగా కూడా బాధ పెట్టకూడదనే భావం అందులో ధ్వనించింది.

“సరే, చెప్పండి, నేనేం చేయగలను” అడిగాడు యూరీ, మళ్లీ కళ్లు తుడుచుకుంటూ, నిద్రపోగొట్టకోడానికి.

“కృతజ్ఞతలు. నా పేరు ఎలాషా. ఇక్కడ అంతరిక్ష పరిశోధనా ప్రయోగశాల చీఫ్ డాక్టర్ ఫ్రాన్సిన్ డిగ్రిగారియో గారికి సహాయకురాలిని. ఆయన పేరు మీకు తెలుసు కదా?”

“తెలుసు.”

“అద్భుతం. ఈ వారం తొలినాళ్లలో, మా సిబ్బంది, మా ఉపగ్రహం సాయంతో, విపరీతంగా రేడియేషన్‌ను వెదజల్లుతున్న ఒక స్పేస్ బాడీని గుర్తించారు. ఇది భూమి మనుగడనే దెబ్బతీస్తుంది. కాబట్టి ఒక గ్లోబల్ ఎమర్జెన్సీ అని నమ్ముతున్నాం సర్.”

“ఊ”

“ఇప్పుడు పూర్తి సమాచారం ఇవ్వలేం కాబట్టి, సాధ్యమైనంత త్వరగా మీరొక అత్యవసర సమావేశానికి హాజరుకావాలని ఆదేశం. దీన్ని అన్నింటి కంటే అతి ముఖ్య విషయంగా భావించాలని ప్రొఫెసర్ గారు కోరుతున్నారు.”

“ఆహా!” అన్నాడు యూరి. అతనిలో కుతూహలం. ఆమె చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తూ, ఇలా అడిగాడు.

“ఈ సమాచారం వార్తల్లో రాకుండా ఉంటుందా?”

మీడియా ఎప్పుడూ గడ్డు పరిస్థితుల వార్తల కోసం తహతహలాడుతూ ఉంటుంది. అది ఎంతైనా సహజం.

అతనికి జవాబు చెప్పే ముందు ఒక క్షణం ఆగింది ఎలిషా.

“ఈ విషయం మీడియాకు తెలియకుండా ఉండటానికి మాకు సాధ్యమైనంత ప్రయత్నించాం సర్. కాని ఆ వార్త దావానలంలా ఉదయమే వ్యాపిస్తుంది మరి.”

“సరే అయితే మీటింగ్ ఎప్పుడు?”

“మాస్కోకు మీ విమాన ప్రయాణం ఒక రోజు కాబట్టి. రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అని అనుకుంటున్నాము. ఇక్కడికి రావడానికి కావలసిన పేపర్లు, సమాచారం, అంతా మీకు పంపుతాం.”

యూరీ నవ్వాడు. “అలా అయితే, ప్రపంచం కూలిపోకముందే, బెడ్ రూంకు వెళ్లి హాయిగా పడుకుంటా కాసేపయినా.”

“అలా చేయండి సర్. ఎలాగూ వచ్చే రెండు వారాలూ మనకు ముమ్మురంగా ఉంటాయి.” అన్నది ఎలాషా, దాపరికం లేకుండా.

“సరే, నా భార్య నన్ను వెతుక్కోకముందే పైకి వెళతాను.”

“ఇంత తక్కువ వ్యవధిలో. ఆదేశాన్ని అంగీకరించినందుకు కృతజ్ఞతలు, సర్” అని ఎలాషా ఫోన్ పెట్టేసింది.

యూరీకి కిచెన్ లోకి వెళ్లాడు. మధ్యలో టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఫోన్‌ను పక్కన పెట్టి, ఫ్రిజ్ తెరిచాడు. ఫ్యామిలీతో రాబోయే కొన్ని నెలలు హాయిగా గడుపుదామనుకున్నాడు. కాని రాత్రికి రాత్రే ఆపద ముంచుకొస్తుందని ఎవరికి తెలుసు? ఫ్రిజ్ లోంచి నీళ్ల బాటిల్ తీసి, దాన్ని ఖాళీ చేశాడు.

అతడు తాను విన్న దాన్ని మళ్లీ తలుచుకున్నాడు. అంత గ్లోబల్ ఎమర్జెన్సీకి దారి తీసేంత రేడియోషన్ అంతరిక్షంలో ఏమయి ఉంటుందా అని అలోచించాడు.

ఉదయం చూద్దాంలే అని అనుకొని బెడ్ రూంకు వెళ్లాడు. పిల్లలెలా ఉన్నారో చూద్దామనిపించి వాళ్ల బెడ్ రూం తలుపు తీశాడు. షెల్ఫ్ పక్కన లైటు ఇంకా వెలుగుతూంది.

యూరీకి ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. కొడుక్కు పద్నాలుగేళ్లు. వాడికి అంతరిక్షమన్నా, పాలపుంత అన్నా, చచ్చేంత ఇష్టం. వాడు గాఢంగా నిద్రబోతున్నా, వాడి చేతుల్లో అంత వరకు వాడు చదివిన, ఏదో స్పేస్ బుక్ ఉంది. దాని అట్ట మీద నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ బొమ్మ.

“అబ్బా మీషా!” అనరిచాడు యూరీ. వాడి బెడ్ దగ్గరకు వెళుతూ ఒక అంతరిక్ష యూత్రికుడి గదిలో ఉండాల్సినదంతా ఉందా గదిలో. పిల్లవాడి రొమ్ము మీద నుంచి పుస్తకాన్ని మెల్లాగా తీసోసి, పక్కన ఉన్న లైటును ఆపేశాడు. గది నుంచి బయటకు వచ్చే ముందు, వాడికి నిద్రాభంగం కాకుండా నుదిటి మీద ముద్ద పెట్టుకున్నాడు.

తర్వాత అమ్మాయి రూములోకి కూడా వెళ్లాడు. షోన్‌ను షెల్ఫ్‌లో ఉంచి, మెల్లగా పరుపు మీదకెక్కి, భార్య పక్కన పడుకున్నాడు. సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ, రగ్గు క్రింద నిద్రపోవడానికి ప్రయత్నించాడు. కాలం ఎంతకీ గడవనట్లు అనిపించింది.

అతని భార్య అతని వైపు తిరిగి, కళ్లు విప్పార్చుకొని అతని వైపు చూసింది. అతని కళ్లు ఆమె కళ్లతో కలిశాయి. ఇంకా నిద్రపోతూనే ఉందనుకున్న ఆమె మేల్కొని ఉండడం అతనకి ఆశ్చర్యం కలిగించింది. ధైర్యంగా విషయాన్ని వివరిదాదమని నోరు తెరిచాడు. కాని ఆమె నోరు అతని నోటిని మూసింది. చేతిని అతని శరీరం మీదికి పోనిచ్చి తడిమింది. గుసగుసగా అంది.

“రేపు ఉదయం మాట్లాడుకుందాం.”

***

తేదీ మార్చి 19, 1970

లోకేషన్ నాసా వారి ఆమెస్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం, శాన్‌జోస్, కాలిఫోర్నీయా, యు.ఎస్.

సమయం – 12.10 PM

నీల్ బ్యారీ ఒక ప్రత్యేక మిలిటరీ విమానంలో నాసా స్పేస్ పోర్టులో దిగాడు. స్పేస్ క్రాఫ్ట్‌లు దిగడానికి ఉపయోగించే రన్‌వే 3600 మీటర్ల పొడవుంది. నాసా ఆమెస్ స్పేస్ రీసర్చ్ సెంటర్ సకాలానికి చేరుకున్నాడు. అది ఆకులు రాలే కాలం, గాలులు మెల్లగా వీస్తున్నాయి. ఆకులు, పుల్లలు వీధులంతా పడి ఉన్నాయి.

నీల్ బ్యారీ, అతని టీం, ఫ్రంట్ ఆఫీస్ లోని ఎక్జిక్యూటివ్ ఇన్‌చార్జ్‌ని వెంటనే కలిశారు.

నాసా కేంద్రం నిర్ణీత యూనిఫాం వేసుకుని, హ్యాట్ తల మీద పెట్టుకుని ఉన్న ఆయన పేరు రోడ్రిగ్యెజ్.

“హాయ్! నీల్ బ్యారీ! నాసా స్పేస్ కమాండ్ సెంటర్ నుంచి, నేను రోడ్రిగ్యెజ్‌ని. మనం వెంటనే కమాండ్ సెంటర్‌కు వెళ్లాలని కబురొచ్చింది!” అన్నాడతడు.

“మీరు సిద్ధమే కదా?”

ఈ ఫార్మాలిటీస్ నీల్ అంత పట్టించుకోడు. రోడ్రిగ్యెజ్‌తో అన్నాడిలా – “అంతా ఓ.కె. మనం కమాండ్ సెంటర్‌కి వెళదాం.”

రన్‌వే నుంచి సెంటరు మూడు మైళ్లుంటుంది. నాసా వెహికల్ వారికి ఎయిర్‌పోర్టు నుంచి అక్కడికి తీసుకు వెళ్లింది. అక్కడ ఛీఫ్ డాక్టర్ బ్రియాన్ హకిన్స్‌కు అసిస్టెంట్ అయిన జస్టిన్‌ను కలిశారు.

“హాయ్ నీల్ అండ్ టీమ్. ఇంత తక్కువ వ్యవధిలో వచ్చినందుకు ధన్యవాదాలు” అన్నాడు జస్టిన్.

“నేనే జస్టిన్‌ను. మీకు ఫోన్‌లో పరిస్థితిని చెప్పింది నేనే.”

నీల్ కొంచెం సరదాగా అన్నాడు – “హాయ్ జస్టిన్ గొంతుకన్నా ముఖాన్ని చూడడం బాగుంది.”

“తెలియని శత్రువుతో అంతరిక్ష యుద్ధం ఉండదనే మనం ఆశిద్దాం. రష్యన్లను నమ్మలేం. వారు స్పేస్‌లో ఒక న్యూక్లియర్ పరికరాన్ని పరీక్షించి ఉండొచ్చు. అది ప్రమాదకరమైంది కావచ్చు. న్యూక్లియర్ రేడియేషన్‌ను స్పేస్ బయట మోస్తూన్న వెహికల్‌ను చూడడం అంత మంచిదేమీ కాదు కదా!”

“ఆ స్పేస్ బాడీ తాలూకు పుట్టుక గురించి మనకే వివరాలూ తెలియవు. అందుకే ఆ డేటాను డీకోడ్ చేయడానికి మీ నైపుణ్యం కావాలి.”

జస్టిన్ కాన్ఫరెన్స్ రూంలో ఒక పెద్ద 30 అంగుళాల సి.ఆర్.టి డిస్‌ప్లే మానిటర్ ఏర్పాటు చేశాడు. ఉపగ్రహం రికార్డు చేసిన దాన్ని అందులో చూడచ్చు. నీల్ టీంలో నలుగురులో అణు వనరుల విషయంలో వివిధ స్థాయిల్లో నిష్ణాతులు. న్యూక్లియర్ వార్ హెడ్స్‌తో, రాకెట్‌ని వారు ప్రయోగించగలరు.

జస్టిన్ అన్నాడు “మిస్టర్ బ్రియాన్ హాకిన్స్, ఇంకా ఒక శాస్త్రవేత్తల బృందం త్వరలో వస్తున్నారు. ఈలోగా మీరు మొహమాట పడకుండా మీ కాఫీ, స్నాక్స్‌ను తీసుకోండి.”

కాఫీ తాగుతూ నీల్ తన టీం సభ్యులతో చర్చించాడు. గుర్తు తెలియని స్పేస్ బాడీ ఒకటి భూమి నుంచి అంతరిక్షానికి, రేడియేషన్‌ను మోసుకుపోతూ ఉండడం మన వాళ్లు గుర్తుంచారు. రష్యన్లు ఇలాంటి దురగతానికి పాల్పడి ఉండవచ్చా?

“మనం సోవియట్ రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూ ఉన్నా, వాళ్ల నుండి అటువంటిది ఊహించలేమని నా నమ్మకం. ఎందుకంటే దాని వల్ల భవిష్యత్తలో వచ్చే దుష్పరిణామాలు వారికి తెలుసు. వారు రహస్యంగా తయారు చేసిన న్యూక్లియర్ కాపబుల్ మిసైల్ నుండి మిస్ పైర్ అయిన స్పేస్ ఆబ్జెక్ట్ అయి ఉండవచ్చా అది! ఏది ఏమైనా, నిర్ధారణ కాలేదు కాబట్టి దేనికైనా, ఆస్కారముంది.”

సహచరులు అందించిన ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత నీల్ ఆలోచననలివి.

ఈలోగా మిస్టర్ బ్రియాన్ హాకిన్స్ వచ్చేశాడు. అరవై సంవత్సరాలుంటాయి ఆయనకు. ఆ రంగంలో ఆయనను లెజండ్ అంటారు. ఆయనే ఆ కమాండ్ సెంటర్‌కు అధిపతి. వీల్ చెయిర్‌లో వచ్చాడాయన. ఆయన నడుము క్రింది భాగం పాక్షికంగా చచ్చుబడిపోయింది. కాని పని పట్ల ఆయనకున్న అకుంటిత దీక్ష చైతన్యశీలంగానే ఉంది. ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలిస్తాడని ఆయనకు పేరు. కలుపుగోలుతనం, ప్లాంట్ లోని ఏ స్థాయిలో వారితోనైనా హాయిగా పని చేసే, చేయించుకునే తత్వం ఆయనది. ఎన్నో అంతరిక్ష పరిశోదనలను, యాత్రలను రూపొందించిన వాడు. ఆయన చేసిన అన్వేషణలు, కొత్త డిస్కవరీలు అంతరిక్షాన్ని మథించడంలో సహాయం చేశాయంటే అతిశయోక్తి కాదు.

“హలో, సైనిక వీరులకు శుభోదయం!” అంటూ నీల్‌ను, అతని టీమ్‌ను చిరునవ్వుతో గ్రీట్ చేశాడాయన. ఆయన బృందంలో 20 మంది అంతరిక్ష శాస్త్రవేత్తలున్నారు. వారంతా టెలిమెట్రీ, ఇంకా ట్రాకింగ్ రంగాలకు చెందిన వారు. ఉపగ్రహం కనుగున్న దాన్ని గురించి చర్చించడానికి వచ్చారు.

“హాయ్ మిస్టర్ బ్రియాన్! మిమ్మల్ని మళ్లీ కలుసుకోవడం ఆనందంగా ఉంది. మనం కలిసి అయిదేళ్లయింది. ఆర్లింగ్టన్‌లో ప్రెసిడెంట్ ఉపన్యాసం సందర్భంగా కలిశాం. అధ్యక్షుని ప్రక్కన నాసా దుస్తులలో, బ్యాడ్జ్ ధరించి మీరు నిలబడి ఉండడం నాకింకా గుర్తే! ఈ పరిస్థితి మీద మీ వివరణ వినడానికి చెవులు రిక్కించుకుని ఉన్నానంటే నమ్మండి” అంటూ ఆయనకు మిలిటరీ శెల్యూట్ చేశాడు నీల్.

బ్రియన్ మైక్ తీసుకుని ఇలా అన్నాడు “అవును నీల్. మీరు ప్రెసిడెంట్‌కు మన ఆయుధ సామగ్రిని గురించి వివరించారు కదా అప్పుడు.” అని,

“మిస్ లూసీ, దయచేసి డిస్‌ప్లే మానిటర్ మీద టెలిమెట్రీ, రేడియాలజీ సెన్సార్స్ డేటాను ప్రదర్సించగలరా?” అడిగారు.

మానిటర్స్ ఆ గుర్తు తెలియని స్పేస్ ఆబ్జెక్ట్‌ను చూపసాగాయి. అది భూమి నుంచి అంతరిక్షానికి నిలకడగా కదులుతూంది. ఇంకో స్రీన్‌, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ట్రాక్ చేసిన రీడింగ్‌ను చూపుతూంది. అందులో రికార్డయిన గామా కిరణాల స్థాయిలు, ఎమిషన్స్ స్థాయిలు, అంత వరకు పరిశీలించిన కామెట్స్ (తోకచుక్కలు) వాటి కంటె చాలా ఎక్కువగా ఉన్నాయి. స్పేస్ ఆబ్జెక్ట్ వెళ్లే మార్గం భూమి యొక్క పరిభ్రమణ కక్ష్యలోనే ఉంది. బహుశా అది భూమి నుండే పుట్టిందేమో అన్న ఊహకు తావిస్తుంది.

మిస్టర్ బ్రియాన్ నొక్కి చెప్పాడు “ఈ స్పేస్ ఆబ్జెక్ట్ ఏమిటనేది ఇంకా నిర్ధారించవలసి ఉంది. కాని అది తప్పకుండా – అంతరిక్షంలో పడవేసిన న్యూక్లియర్ మెటీరియల్ అయి ఉంటుంది. లేదా మిస్‌ఫైర్ అయిన రాకెట్ అయినా కావాలి” ఆ సమావేశంలో అందరికీ అంతుబట్టని, తికమక పెట్టే అంశం ఏమిటంటే, అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ కాకుండా – ఈ పని చేసినవారు ఎవరని.

“రష్యాతో మనం ఒప్పందం కుదుర్చుకున్నాం, న్యూక్లియర్ పరీక్షల కోసం అంతరిక్షాన్ని కలుషితం చేయకూడదని. కాబట్టి ఇది వారి చెత్త పని అయి ఉండదు.”

“ఏమయినా, దీనిపై ప్రపంచవ్యాప్త చర్చ అవసరం. ఈ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి ఒక విశాల వేదిక కావాలి.”

నీల్ నొక్కి చెప్పాడు. “ఈ స్పేస్ ఆబ్జెక్ట్ ఏదో న్యూక్లియర్ రేడియోషన్ ద్వారా అంతరిక్షాన్ని కలుషితం చేసేదని కొట్టి పడేయడానికి వీల్లేదు. ఇది మరింతగా సోలార్ సిస్టమ్ లోకి చొచ్చుకుపోతూందేమో చూడాల్సిన అవసరం ఉంది. దాని మీద వివరాలు కావాలి.”

టెలిమెట్రీ డిపార్డుమెంటు నుండి వచ్చిన శాస్త్రవేత్త మిస్టర్ వికాస్ తాను మాట్లాడుతానని చేయెత్తాడు. ట్రాక్ చేసిన టెలిమెట్రీ మార్గాన్ని వివరించసాగాడు.

“ఈ స్పేస్ బాడీ నిర్ధారిత, గంటకు 7000 కి.మీ కంటే వేగంగా ప్రయాణిస్తూంది. భూమి నుండి దూరంగా నిలకడగా వెళుతూంది. భూకక్షకు ఇరవై డిగ్రీలు, తిన్నగా కాకుండా వక్రంగా (tangential) వెళుతుంది దాని రూట్. దీని మార్గం మార్స్ గ్రహానికి ముఫై వేల కి.మీ. ముందు అంతమవచ్చు. అప్పుడు మార్స్ తనలోకి దాన్ని లాక్కుంటుంది.”

“ప్రస్తుతం మన రీడింగ్స్ చూపిస్తున్నదేమంటే – అది మార్స్ మీద అంతమవడానికి +0.3 అనుకూల అవకాశం ఉంది.”

“ఒకవేళ మార్స్‌ను మిస్ అయితే అది అంతరిక్షంలోకి మరింత ముందుకు వెళ్లి, ఫలానా అని తెలియని ఒక కక్ష్యలో ప్రవేశిస్తుంది.”

అది మళ్లీ భూమి మీదికి తిరిగి వచ్చే అవకాశం లేదని నీల్ రిలీఫ్‌గా నిట్టూర్చాడు. అలా అయితే అది పెద్ద సమస్య అయి ఉండేది. మార్స్ గ్రహం అణుధార్మిక పదార్థాలతో కలుషిత మవుతుందా అనే దాని మీద అందరి అభిప్రాయాలు కొంచెం అనిశ్చితంగా ఉన్నాయి.

“అలా జరిగితే మటుకు అంగారక గ్రహం (Mars) మానవులకు కొన్ని శతాబ్దాలపాటు అందుబాటులో ఉండదు. అంటే మార్స్ మీద న్యూక్లియర్ రేడియేషన్ అనేది లేకుండా పోయేంత వరకు.”

అంగారక గ్రహం అదృష్టాన్ని టేబుల్ మీదే వదిలేయడానికి నీల్, బ్రియన్ సిద్ధంగా లేరు. దాని సంగతి మరింత లోతుగా అధ్యనం చేయాలని వారి ఆలోచన. కాని జవాబులకంటే ప్రశ్నలే ఎక్కువ కనబడుతున్నాయి. ఈ ఉత్పాతాన్ని నిలువరించడం ఎలా?

***

తేదీ మార్చి 20,1970

స్థలం అంతరిక్ష పరిశోధనా కేంద్రం, మాస్కో.

సమయం – 8.21 AM

తెల్లవారింది. సూర్యుడు యథాప్రకారం ఉదయించాడు. భూమితోగాని, అంతరిక్షంతో గాని ఏ పనీ లేని వాళ్లందరూ కూడా లేచారు. వ్యోమగాములు, స్పేస్ ఇంజనీర్లు, రాకెట్ సైంటిస్ట్‌లు ఖగోళ శాస్త్రవేత్తలు, ఇంకా ఇతర సంబంధిత వృత్తి నిపుణులు ఒక సమావేశానికి ఆహ్వానించబడ్డారు. ప్రపంచాన్ని త్వరలో వణికింప చేయబోయే ఒక కీలక విషయం ఆ సమావేశానికి అజెండా.

యూరీ ఇవానోవ్ అప్పుడే ఎయిర్‌పోర్టు నుంచి వచ్చాడు. ఉదాయన్నే. అతడు హోటల్‌కు వెళ్లి ఫ్రెష్ అవడానికి కూడ సమయం లేదు. అతడు రావడం కాస్త ఆలస్యం అయినందు వలన, అత్యవసర సమావేశం కొంత డిలే అయిందని కూడ అతనికి తెలిసింది.

తెల్లని, నాలుగు డోర్ల కారు యూరీని మాస్కోలోని అంతరిక్ష పరిశోధనా ప్రయోగశాల యొక్క సువిశాల ప్రాంగణానికి వేగంగా తీసుకెళ్లింది. భవనం ప్రవేశ ద్వారం వద్దకు చేరుకునేసరికి, దాని వేగం మందగించింది. కారు ఆగీ ఆగక ముందే యూరీ తలుపు తెరుచుకొని బయటకి దూకాడు.

అతడు క్యామో ట్రవుజర్, కాలర్ ఉన్న టాప్ ధరించి ఉన్నాడు. టాప్‌ను ట్రవుజర్ లోకి దోపుకున్నాడు. తలుపు దగ్గర ఒక యువతి అతన్ని రిసీవ్ చేసుకుంది.

తాను ఆతృతగా ఉన్నందుకు ఆమెకు సారీ చెప్పాడు.

“నేనే ఎలాషాను. ఫోన్ చేసిన యువతిని” అన్నదామె. ఒక పుస్తకాన్ని రొమ్ములకు గట్టిగా హత్తుకొని ఉంది. అందమైన, లేత పసుపు రంగులో ఉన్న ఆమె జుట్టు ఆమె భుజాల పై పరచుకొని ఉంది. అందమైన తన మోముతో, అలజడిగా ఉన్న యూరీ వైపు చూసిందామె.

“నాతో రండి.” అంటూ అతన్ని లోపలికి రానిచ్చి తలుపు వేసిందామె. కారిడార్ వెంట గబగబనడవసాగింది. చిన్న శరీరం ఆమెది. కాని కారిడార్లో గుంపులు గుంపులుగా ఉన్న వర్కర్స్‌ను లాఘవంగా తప్పించుకుంటూ వెళుతుంది. అనేక కారిడార్లు దాటి వారు భవనంలో ప్రవేశించారు. ఎలాషాను యూరీ అనుసరించాడు. భవనంలో చక్కని వెలుతురు ఉంది.

చివరికి వారొక ఆకుపచ్చ రంగు గల తలుపును చేరారు. నాబ్ తిప్పి తలుపు తెరిచింది ఎలాషా. ఒక విశాలమైన గది అది. ఇంచుమించు ఆరు వరసల్లో కంప్యూటర్లున్నాయి. ప్రతి దాని ముందు ఒక ఆపరేటర్.

రూమ్‌కు ఒక వైపు గ్లాస్ పార్టిషన్ ఉంది. దాంతో ఇంకో గదిని ఏర్పాటు చేశారు. అందులో ఒక పెద్ద టేబుల్, దాని మీద ఒక స్క్రీన్ ఉన్నాయి. అక్కడ ఇంకో పెద్ద స్క్రీన్ కూడ ఉంది. గోడ మీద నలుపు, ఆకు పచ్చ రాడార్ల, డేటాను అది చూపిస్తుంది. పెద్ద రూమంతా ఆపరేటర్ల మాటలతో నిండి ఉంది. వారు నీలి రంగు షర్ట్‌లు, పాల మీగడరంగు ట్రవుజర్లు వేసుకుని ఉన్నారు. వదులుగా ఉన్న టై కట్టుకున్నారు.

స్క్రీన్ టేబుల్ వెనుక నించి ఒక గొంతు పిలిచింది “మిస్టర్ యూరీ!” అంటూ. యూరీ అటు వైపు చూశాడు. ఒకతను తన పొట్ట మీద చేతులు అడ్డంగా పెట్టుకుని కూర్చున్నాడు. అతని ముఖం గుండ్రంగా ఉంది. అతడు సీరియస్‌గా ఉన్నాడు. అతని ముఖం మీద ముడతలు, అతని వయస్సును సుమారుగా తెలియజేస్తున్నాయి. ఒక తెల్లని షర్ట్ వేసుకుని ఉన్నాడతడు. టై లేదు.

“మనం అనుకున్న ప్రొఫెసర్ ఆయనే” అన్నది ఎలాషా. యూరీ తల ఊపాడు.

“రండి, దయచేసి కూర్చోండి. ఇప్పుడే ప్రారంభించబోతున్నాం.” అన్నాడు ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ డి గ్రిగారియో. పరిస్థితిని చక్కదిద్దడానికి ఐక్యరాజ్యసమితి నియమించిన ప్రత్యేక అధికారి అయిన ఫ్రొఫెసర్ కూర్చున్న చోటు ఎత్తుగా ఉంది. వీళ్లిద్దరూ నాలుగు మెట్లు ఎక్కి ఆయనను చేరుకున్నారు.

“మరి ప్రారంభిద్దామా ఇక?” అనడిగాడు యూరీ. అతని కళ్లలో అసహనం. “ఏమి లేకుండా ఇక్కడికి పరిగెత్తుకు రాలేను.”

“ఆందోళన చెందకండి, యూరీ! సాధ్యమైనంత త్వరగా చేద్దాం. త్వరలో యూనివర్సిటీలో వెళ్లడానికి కావలసినదంతా ముందు మనం సమకూర్చుకోవాలి.”

“ఏ యూనివర్సిటీ?” అనడిగాడు యూరీ, టేబుల్‌కు మరింత దగ్గరగా వెళ్లి.

“అదిప్పుడు చర్చించలేం. అసలు ప్రమాదం ఏమిటో ముందు తేల్చాల్సిన అవసరం ఉంది” అన్నాడు ప్రొఫెసర్ ఫ్రాన్సిస్.

“ఎలీషా, ప్రమాదాన్ని గుర్తించిన ఆ యువకుడిని పిలు” అన్నడు.

“అలాగే సార్” అన్నదామె. మరుక్షణం ఒక యువకుడు వచ్చాడు. అతని పేరు అలెక్సిన్. తాను గమనించిన దాన్ని వివరించసాగాడు. ఈ వారం మొదట్లో, అంతరిక్షంలో ఒక రకమైన రేడియేషన్‌ను గమనించానని, దాన్ని మన ఉపగ్రహం కనుక్కుందని, ఉపగ్రహాన్ని తాను రొటీన్ చెక్ చేస్తుండగా అది తెలిసిందని ఆ పిల్లవాడు చెప్పాడు.

“ఇక్కడ రేడియేషన్ అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే అది సహజపరిణామమే. అది చాలా ఎక్కువగా ఉండడమే అసలు విషయం. అది ఎలాంటిదో తెలుసుకుందామని నాకు కుతూహలం కలిగింది. గైగెర్ మ్యూల్లెర్ (GM) డిటెక్టర్స్, ఉపగ్రహంలో ఉన్నవి, ఆ రేడియేషన్‌ను గామా కిరణాలుగా గుర్తించాయి. అంతరిక్షంలో గామా రేస్ అంటే.. ఒకటే విషయం.. అది..”

“న్యూక్లియర్ రేడియేషన్” అంటూ అందిచాడు యూరీ.

అలెక్సిన్ అవునన్నట్లు తల ఊపాడు. “అవును సార్ అదే!”

“మరి అది ఎక్కడి నుంచి వస్తున్నట్లు?” యూరీ ప్రొఫెసర్ వైపు తిరిగి అడిగాడు.

“అతన్నే చెప్పనివ్వండి. అతని పరిశీలనను నా వద్దకు తెచ్చినప్పుడు నేనడిగిన ప్రశ్న కూడా అదే” అని జవాబిచ్చాడు ప్రొఫెసర్.

“నేను పరిశోధించాను. కొంతలోతుగానే.. నాకు తెలిసిందేమంటే..” అలెక్స్ మాట్లాడుతూనే టేబుల్ స్క్రీన్ మీద పని చేస్తున్నాడు.

“ఇది!”

వారి ముందు ఆకుపచ్చ రంగులో పరుచుకున్న భూమి చిత్రం కనబడింది. దానిలో వరుసలు వరుసలుగా ఏవో ఉన్నాయి. వారికి ప్రతి వరుసా పరిచితమైందే. ఆ కుర్రాడు ఇమేజ్‌ని పెద్దదిగా చేసి (ZOOM) చూపాడు, ఒక ఉపగ్రహం యొక్క ప్రతిబింబం స్కెచ్‌ను విశదపరస్తూ.

“రేడియేషన్‌ను.. అణుధార్మికతను కనుక్కోవడానికి ఉపయోగించిన ఉపగ్రహం ఇదే, ఇంకా..” అలెక్స్ ఆగి, తెరను మరింత జూమ్ చేశాడు. ఒక సిలిండర్ ఆకారంలో నిర్మించబడిన ఒక స్పేస్ వెహికల్‌పై కేంద్రీకరించాడు. ఒక ఒక రాకెట్ యొక్క నమూనా లాగుంది అచ్చంగా.

“ఇదే, ఇదే ఆ వెహికల్. రేడియోషన్‌ను తీసుకుపోతూన్నది.”

అక్కడ ఒక వ్యగ్రతతో కూడిన నిశ్శబ్దం, గదిలో ఒక రకమైన టెన్షన్. సూది క్రింద పడినా స్పష్టంగా వినిపించేంత నిశ్శబ్దమది.

సూది క్రింద పడడేయడానికి సిద్ధమై, యూరీ అన్నాడు “చాలా పెద్దదిలా కనపడుతూంది?” అని. గదిలో నిశ్శబ్దం భగ్నమయింది.

“పెద్దదే సర్” అన్నాడు అలెక్సిన్.

“నేను నా టీము కదులుతున్న దాని బరువు ఎంత ఉంటుందో లెక్కలు వేశాం. సుమారు మూడు వేల కిలోల న్యూక్లియర్ వేస్ట్!”

“అది చాలా ఎక్కువ” యూరీ ఒప్పుకున్నాడు.

“సరే ఇదంతా ఎక్కడికి వెళుతుందో చెప్పండి దయచేసి. అంటే అంతరిక్షంలో టన్నుల కొద్దీ న్యూక్లియర్ వేస్ట్ అలా తేలుతూ ఉందని మీరు చెప్పదల్చుకున్నారా? దాని గురించి మనం ఇక కుయుక్తులు పన్నాలా ఏమిటి? అసలు దీనికేమైనా ప్రాముఖ్యత ఉందా? అంతరిక్షంలో షికార్లు చేస్తున్న న్యూక్లియర్ వేస్ట్ గురించి మనం కంగారు పడనవసరం లేదని నేను అనుకుటున్నా” అన్నాడు యూరీ, గోడ కానుకుని నిలబడి.

“మీరన్నది కరెక్టే. మనం కంగారు పడాల్సిన పని లేదు. కాని ఆ స్పేస్ షిప్ కేవలం అంతరిక్షంలో అలా ఉంటం లేదే, అది కదులుతూ ఉంది. దాని చలన పథం బట్టి చూస్తే అది మార్స్ వైపుగా వెళుతూంది” ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ వారి మీద, చెప్పకుండా ఒక బాంబు వేశాడు.

“మార్స్ వైపుకా?” ఆ ఇద్దరూ ఒకేసారి అరిచారు, ఆ చలన పథంలో అది సృష్టించబోయే భీభత్సాన్ని గ్రహించి.

“అలా అయితే ఆ గ్రహాన్ని నివాసయోగ్యంగా మార్చాలనుకునే ఏ అవకాశమైనా అది నాశనం చేస్తుంది” అన్నాడు యూరీ.

“అలా జరిగితే, మన భూగ్రహానికి కూడ పెను ముప్పు పొంచి ఉన్నట్లే.”

అక్కడున్న అందరి మనస్సుల్లో భయం! యూరీతో సహా. ప్రపంచానికి పొంచి వున్న పెను ప్రమాదం గురించి వారికి తెలిసిపోయింది.

ప్రొఫెసర్ ఫ్రొన్సిస్ తల రిక్కించి ఇలా చెప్పాడు “ఈ విపత్తు, ఉత్కంఠల ప్రయాణంలో మీరిద్దరూ మాతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన ప్లానులోని తర్వాత దశలోకి మనం వెళ్లాలి, వెంటనే!”

“ఏమిటి? ఏమిటి? ఇప్పటికే ఒక ప్లాన్ ఉందా?” అని అడిగాడు యూరీ, ఒక విధమైన అపస్మారకంగా.

“అవును ఉంది.” అన్నది ఎలాషా. ఇంత వరకు ఏం మాట్లాడాలేదు.

“ఏమిటా ప్లాను?” అని అడిగాడు యూరీ.

“దాని కంటే ముందు, దాన్నెవరు తయారు చేశారు? ఎవరు, ఏ దేశం ఈ తిరుగుబాటుకు నిందమోస్తుంది?”

“మాకు తెలియదు. ఇప్పుడు చెప్పలేం. మా టీం ఏదైనా రీడ్ చేయడానికి ప్రయత్నించింది, ఏదైనా! ఆ షిప్ మీద మాకేమీ దొరకలేదు. అసలు దానికి కావలసిన టెక్నాలజీయే మా దగ్గర లేదు” అలెక్సిన్ జవాబిచ్చాడు. అతని మాటలతో వారు సంతృప్తి చెందరని ప్రొఫెసర్‌కు బాగా తెలుసు. అంత విషపూరిత వ్యర్థాలను మార్స్ వైపుగా పంపే వాళ్లెవరైనా, దాన్ని మేమే పంపామని చెబుతారా? చెబుతారని అనుకోవడం కూడా తెలివితక్కువతనమే.

“గత మూడు నాళ్లుగా నేను అన్ని దేశాలనూ, నా సాధ్యమైనంతగా సంప్రదిస్తూనే ఉన్నా. వాళ్ల న్యూక్లియర్ పరీక్షల ప్రదేశాల కమాండర్‌లను ప్రశ్నించమని కోరా. ఎవరు దీన్ని చేసి ఉంటారో అని. కాని నా ప్రయత్నాలు ఫలించలేదు.” అన్నాడు ప్రొఫెసర్.

“ఫలించలేదంటే, దానర్థం?” అన్నాడు యూరీ కోపంగా.

“దానర్థం, ఏ దేశం ఒప్పుకోలేదు. నోరు తెరవటం లేదసలు. ఒక్క దేశం కూడా. న్యూక్లియర్ వేస్ట్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యమున్న దేశాలు కూడా దీనికి బాధ్యతను తీసుకోవడానికి నిరాకరించాయి.”

“బుల్‌షిట్!” అనరిచాడు యూరీ.

“ప్రస్తుతం అది కాదు సమస్యకు పరిష్కారం. దానికోసమే మేం ప్లాన్ చేస్తున్నాం” అన్నాడు ప్రొఫెసర్.

మళ్లీ నిశ్శబ్దం కాసేపు రాజ్యమేలింది!

“నేననేదేమంటే, ఎవరు దాన్ని స్పేస్ లోకి పంపించారనేది మనం కనిపెట్టినా, దాని వల్ల వెంటనే ఒరగబోయేదేమీ లేదు. భూమిని, అంగారకుడిని ఎలా రక్షించడమనేదే మన ప్రయారిటీ. ఒక్క ఖండం కూడ తట్టుకోలేదు. ఇది మీరన్నట్లు నిజంగా గ్లోబల్ ఎమర్జెన్సీయే. మన ప్లాన్ విజయవంతం కావాడానికి ప్రతి దేశం తన వంతు పాత్ర పోషించాల్సిందే, తప్పదు!”

“ప్రొఫెసర్ గారు చెప్పింది కరెక్ట్ సర్! మేం కొన్ని లెక్కలు వేశాం ఇది వరకే. రష్యా, అమెరికా కలిసి ఐనా, దీన్ని ఒక్కరే చేయలేరు!” అన్నాడు అలెక్సిన్.

యూరీ నిట్టూర్చి, గ్లాస్ పార్టిషన్ వైపుకు నడిచాడు. మొత్తం ఆ రూంలోని వారంతా, ప్రపంచాన్ని సేవ్ చేయడానికి తమవంతు కాలిక్యులేషన్స్‌లో నిమగ్నమై ఉన్నారని అతడు గ్రహించాడు. అందరి ముఖాల్లో తీవ్రమైన అలజడి!

మర్నాడు యూరీ ఎమర్జెన్సీ మీటింగ్‌కు హాజరైన తర్వాత, మీడియా చెలరేగిపోయింది. “అంతరిక్షంలో ‘డంప్’ చేయబడిన అణుధార్మిక వ్యర్థాలు!” అంటూ దాన్నొక బ్రేకింగ్ న్యూస్‌గా, హాట్ టాపిక్‌గా ప్రకటించసాగింది. ప్రతి చానెల్‌లో ఇదే చర్చ. దీన్ని ఆపకపోతే రాబోయే క్లిష్ట పరిస్థితిని ఒకటికి రెండూ కల్పిస్తూ వండివర్చసాగింది మీడియా. ‘సృజనాత్మకత’ ఇలాంటప్పుడు మరింత విజృభిస్తుంది మరి! ప్రజల చెవులకు కుట్రలను చేరవేయడం వారి తక్షణ, నిరంతర కర్తవ్యమైంది. ఆ కుట్రల్లో సింహభాగం పుకార్లే, ఒకటో రెండో తప్ప!

బి.బి.సి, సి.ఎన్.ఎన్, న్యూస్ 9, సి.బి.ఎస్., ఎన్.బి.సి, కా అన్ని రకాల మీడియా ఆ వార్తను, ఎటువంటి నిర్భంధాలు లేకుండా, వ్యాపింపచేయసాగారు. ప్రతి వారూ వేరే దేశాలపై నింద మోపుతున్నారు. ఈ న్యూక్లియర్ వేస్ట్ డంప్‌కు బాధ్యులని ఒక కుట్ర వైరల్ ఐంది. సోవియట్ రష్యానే దీని వెనక ఉన్నదని, ఎందుకంటే ‘స్పేస్ రేస్’లో తమ పోటీదారులకు మరింత ఇబ్బంది కలిగించాలని.

ఏ దేశాన్నీ వదలలేదు. ప్రపంచమంతా ఇదే హాట్ టాపిక్. ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట! పొరుగు గ్రహాల మీద అణుధార్మిక వ్యర్థాలను పడేసి రెండు సహస్రాబ్దాల పాటు వాటిని కలుషితం చేయడం!

అన్ని పుకార్లలోకీ ఒక పుకారు ‘నూక్లియర్ నిజం’ గాని నిలబడగలిగింది. అదేమంటే, ఒక రహస్య యుద్ధతంత్రం ప్రకారం, ప్రచ్ఛన్నయుద్ధం కాలంలో, ఒక దేశం, ఇతర దేశాల మీద తన న్యూక్లియర్ టెక్నాలజీ అనే అస్త్రాన్ని ప్రయోగించబోతూందనీ, త్వరలో అది అన్ని దేశాలను కబళిస్తుందనీ.

అన్ని దేశాలకూ వారి వారి ప్లాన్లున్నాయి. వాటిలోని ప్రమాదాల పట్ల అవగాహన కూడా ఉంది. ఎవరికి వారు తామే ఈ సాహస యాత్రను ప్రారంభించాలనే ఆతృతతో ఉన్నారు. త్వరలోనే వారికి అవగతమయింది. వారి పరిశోధనల, ప్రయత్నాల ఫలితం కేవలం కొన్ని ఎకరాల భూమికే పరిమితం కాబోదని, మొత్తం గ్రహాన్నే దెబ్బతీస్తుందని. ఆ ఆపరేషన్ వల్ల ఉత్పత్తి అయ్యే నూక్లియర్ వేస్ట్ అంతా కుప్పలుగా పేరుకుపోయిందని, దాన్ని నిర్వహించే ఖచ్చితమైన ప్లాన్ ఏదీ తమ దగ్గర లేదని.

పరిస్థితి మరింత విషమిస్తే, ఆ దేశం సముద్రగర్భంలోకి దాన్ని పారవేయడం ద్వారా వదిలించుకుందామనుకున్నారు. దీన్ని గమనించిన ఇతర దేశాలు వారి ప్రయత్నాలను అనుమతించలేదు. ‘ఆ దేశం’ ఆ అణుధార్మిక వ్యర్థాలను, భూమికి దూరంగా, బాహ్య అంతరిక్షంలో పడవేయాలని రహస్యంగా ఒక ప్రణాళిక తయారు చేసింది.

ఆ విషయంలో వారు కృతకృత్యులయ్యారు కాని, రాబోయే ప్రమాదాన్ని కొంత డిలే చేయడానికి మాత్రమే అది ఉద్దేశించబడింది. ఇదీ ప్రపంచంలోని ప్రతి మూలా పాకిపోయిన న్యూక్లియర్ నగ్నసత్యం!

ఐరోపా దేశాల మీడియా, రష్యా దేశాల సమాఖ్య (USSR) ఇంకా ఇద్దరు ఎంత వరకు వెళ్లారంటే, అమెరికాకు ఇదంతా తెలుసు, దాన్ని బలంగా వ్యతిరేకించడానికి బదులు, అది ఘాతుకాన్ని సమర్థించింది. ట్యాన్‌జావీ రిపబ్లిక్ (TANZAVI REPUBLIC) అనే ఆ ముద్దాయిని భుజం తట్టి ప్రోత్సహించింది అని.

కళ్లకు కనపడే దానికంటే, అసలు సత్యం వేరుగా ఉంది. ట్యాన్‌జావీ రిపబ్లిక్ ఒక అందమైన దేశం. ఆఫ్రికాలోని ధక్షిణ మధ్యభాగంలో ఉంటుంది. దాని సహజ వనరులు అపారం. కాని నాయకత్వం నిలకడైనది కాదు. ఆ దేశంలో కారు నలుపు ఖనిజం (PITCH BLACK ORE) నిల్వలు దోపిడీకి గురుయ్యాయి. అది న్యూక్లియర్ ముడి సరుకుగా, ఇంధనంగా బ్రహ్మండంగా పని చేస్తుంది. దాన్ని తవ్వి తీయడానికి రష్యా, అమెరికాలు ఆ దేశంలో పోటాపోటీగా తమ కనుకూలమైన నాయకత్వాలకు మద్దతునిస్తున్నాయి. ఆయుధాల రేస్ లోని విశ్వనాయకులు ఎదుటి పక్షానికి లంచాలు ఎరచూపాయి., ట్యాన్‌జావీ రిపబ్లిక్‌ను తమ మిలిటరీ ఆపరేషన్స్‌కు ‘అడ్డా’గా చేసుకున్నాయి.

ఈ ఆపరేషన్స్ వల్ల ఆ దేశం దొడ్డి దారిన కీలకమైన రాకెట్ విడి భాగాలను, న్యూక్లియర్ ప్రాజెక్ట్ లకు కావలసిన సాంకేతిక సహాయాన్ని అమెరికా, రష్యాల నుంచి పొందగలిగింది, అదీ ఒకరిది ఒకరికి తెలియకుండా. కాబట్టి, రెండు దేశాలూ తాము పెంచి పోషించిన క్రూర మృగం చేసే దారుణానికి సమానంగా బాధ్యులే!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here