అంతరిక్షంలో మృత్యునౌక-5

0
9

[శ్రీ బంకా పార్దు సంపత్ ‘Redemption of the Century’ అనే పేరుతో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలను ‘అంతరిక్షంలో మృత్యునౌక’ పేరిట అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[అంతరిక్ష యాత్రకి, అంగారక గ్రహాన్ని రక్షించే యాత్రకి సన్నాహాలు మొదలవుతాయి. నీల్, శాటో కాసేపు మాట్లాడుకుంటారు. MSM అంతరిక్ష నౌక టేకాఫ్‍కు సిద్ధమవుతుంది. నీల్, యూరీ మాట్లాడుకుని, వాతావరణాన్ని తేలిక చేస్తారు. అంతరిక్షంలోకి వెళ్లబోయే ఆరుగురు వ్యోమగాములని సమావేశపరుస్తారు. వ్యోమగాముల కుటుంబాలని పిలిపిస్తారు. రాకేష్ కృష్ణ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడుతాడు. మిస్టర్ బ్రియన్ నేతృత్వంలో గ్రౌండ్ కంట్రోల్ రూమ్ సిద్ధమవుతుంది. అనుకున్న సమయానికి రాకెట్ వ్యోమనౌకను మోసుకుంటూ అంతరిక్షంలోకి ప్రవేశిస్తుంది. వ్యోమనౌక నిర్ధారిత కక్ష్య లోకి చేరుతుంది. వ్యోమగాములంతా తమ తమ బాధ్యతలను నిర్వరిస్తుంటారు. అణువ్యర్థాలున్న అంతరిక్ష నౌకకు దగ్గరగా వెళ్తారు, మరో ఐదు రోజుల్లో దాన్ని చేరుకుంటారనగా, అణువ్యర్థాల నౌక కనబడకుండా పోతుంది. కొన్ని గంటల పాటు శ్రమించి దానిని మళ్ళీ గుర్తిస్తారు. మిగతావారిలోని ఉద్విగ్నతని తగ్గించడానికి నీల్ తాను పాల్గొన్న ఓ యుద్ధం గురించి చెప్తాడు. ఎట్టకేలకు అణువ్యర్థాల నౌకకు సమీపంగా వెళ్తారు. గణనలో చేసిన చిన్న పొరపాటు వలన, అణువ్యర్థాల నౌకను చేరలేకపోతారు. పైగా వీళ్ళ వ్యోమనౌకలో ఇంధనం తగ్గిపోతూ ఉంటుంది. ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మార్స్ ఖర్మకు దాన్నొదిలేసి, భూమ్మీదకు తిరిగి వచ్చేయడం ఒక పరిష్కార కాగా, కొత్త లెక్కలు వేసి, అణువ్యర్థాల నౌకను చేరుకుని, దాన్ని దారి మళ్ళించటం రెండో పరిష్కారం, అయితే దీని వల్ల వ్యోమగాములు భూమికి చేరలేని పరిస్థితి. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాదు. అత్యవసర సమావేశాలు నిర్వహించిన దేశాలన్నీ చివరికి – తమని తాము రక్షించుకుంటారా లేక మానవజాతిని కాపాడతారా – అనే నిర్ణయాన్ని వ్యోమగాములనే తీసుకోమంటాయి. – ఇక చదవండి.]

ప్రకరణం-5: మిషన్ ‘ఎ’ – మిషన్ ‘బి’: భయంకర, తిరిగి రాలేని ఏక మార్గ లక్ష్యం (మిషన్)

[dropcap]వ్యో[/dropcap]మనౌక లోని నిశ్శబ్దం ఎంత దుస్సహంగా ఉందంటే, దాన్ని ఛేదించగలిగే పరికరమేదీ అక్కడ లేదు. నిశ్శబ్దం ఒక మందమయిన చెక్క అయి ఉంటే, ఒక పదునైన రంపంతో దాన్ని కోయవచ్చు. కానీ ఇక్కడి పరిస్థితి అది కాదే? అందరూ కళ్ళు విప్పార్చుకుని, ఆన్‍లో ఉన్న రేడియో పైనే దృష్టిపెట్టారు. ఎవరూ ఏమి మాట్లాడలేదు. వారి నీరవ నిశ్శబ్దం వల్ల మొత్తం ప్రపంచమంతా స్తంభించిపోయింది. అంతరిక్షంలోని MSM 6 సిబ్బంది నుండి ఏం స్పందన వస్తుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఎవరూ ఏమో అనేలా లేరు. వారి మేధస్సుకు అందనంత సంక్లిష్టమైన విషయం అది.

“డియర్ బ్రియాన్!” నీల్ రేడియోలో పిలిచాడు. గత కొద్దినిమిషాలుగా వారు విన్న పదాలు ఈ రెండే!

“చెప్పు, నీల్!” నాసా చీఫ్ బదులిచ్చాడు

“నా కుటుంబాన్ని రేడియో పరిధిలోకి తీసుకురండి” అతని ఈ చివరి మాటలతో, తర్వాత ఏం జరుగబోతోందో వారికి తెలిసింది. అతడు ఆ అణువ్యర్థాల నౌక వెంట వెళ్లడానికి స్వచ్ఛందంగా సిద్ధమవుతున్నాడు.

“వద్దు నీల్! నీవు వెళ్లకూడదు! మన దగ్గర ఇంధనం చాలా తక్కువ ఉంది. కాబట్టి దాన్ని సాధించడానికి అవకాశం అతి తక్కువ. మనందరం వెనక్కితిరిగి భూమి మీదికి వెళ్ళిపోదాం” అన్నది శాటో.

“పరవాలేదు, శాటో! నేను వెళతాను. కనీసం మన ప్రయత్నం మనం చేయాలి కదా!”

“వద్దు నీల్! వద్దు! వద్దంటే వద్దు!” అని అరిచాడు కృష్ణ. “నీ కోసం నీ ఇద్దరు కవలపిల్లలు ఇంట్లో ఎదురు చూస్తున్నారు అక్కడ. ఈ స్థితిలో ఆ మిషన్‌ను చేపట్టే ఆలోచనే రాకూడదు నీకు. అది ఆత్మహత్యా సదృశం తప్ప మరొకటి కాదు. అందులో నెగ్గడానికి, శాటో చెప్పినట్లు, అవకాశాలు పూజ్యం!”

“మీరిద్దరూ ఆందోళన చెందనవసరం లేదు. అంతా సక్రమంగా జరుగబోతోంది. ఎవరో ఒకరు ముందుకు రావాలి కదా!” అన్నాడు నీల్. ఆ మిషన్ చేపట్టడానికి అతడు కృతనిశ్చయంతో ఉన్నాడు. వారిని అంగీకరింప చేయాలని ఎంతో ఇదిగా ప్రయత్నిస్తున్నాడు.

“నీవు వెళ్లకూడదు నీల్, నీవెవరికీ ఈ విషయంలో ఋణపడి లేవు” అన్నది ఒలీవియా.

“ఇక చాలు!” అని అరిచాడు నీల్. “నేను అందరికీ ఋణపడి ఉన్నా. మానవతకు బుణపడి ఉన్నా. లేకపోతే నా పిల్లల కోసమైనా ఇది చేసి తీరాలి.”

కాక్‌పిట్ మరోసారి మూగబోవడానికి కారణం దొరికింది.

“నా కవల పిల్లల కోసమే ఇది! నేను వెళ్లి మార్స్‌ను రక్షించాలి. ఆ ప్రయత్నంలో మరణించాలి. కాబట్టి నా కుటుంబాన్ని రేడియోలోకి తీసుకు రండి. లేదా వారికి గుడ్ బై చెప్పకుండానే వెళ్లిపోతాను.”

నీల్ తన భావావేశాన్ని దాచుకోలేకపోయాడు. అది అతన్ని అంతగా ఆవరించి ఉంది. అతని గొంతులో, అతని ముఖంతో అది కనబడుతూనే ఉంది.

ఈలోగా, భూమి మీద, నాసా కమాండ్ సెంటర్ వాళ్లు అప్పటికే నీల్ భార్యను రేడియోకి తీసుకొచ్చి అతనితో మాట్లాడించడానికి ప్రయత్నం ప్రారంభించారు. అతనెంత మొండివాడో అందరికీ తెలుసు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకొన్నాడంటే, వెనకు తగ్గడు. దాని కడ్డంగా ఎవరయినా రావాలనుకున్నా ఒప్పుకోడు.

“మిసెస్ టెస్సా బ్యారీ!” నాసా చీఫ్ పిలిచాడు

“ఎస్, హలో! సారీ, నాకు మీరెవరో..”

“స్పేస్ మిషన్ నుంచి మిస్టర్ బ్రియాన్ మాట్లాడుతున్నానమ్మా!” అన్నాడి ప్రొఫెసర్. వెంటనే ఆమె అలర్ట్ ఐంది. అతను చెబుతున్న మాటలపై తన దృష్టిని కేంద్రీకరించింది.

“నీల్ మీతో మాట్లాడతాడట”

“హలో టెస్సా?”

నీల్ గొంతు వినగానే అమె కళ్లలో నీళ్లు ఉబికాయి. ఒక దుఃఖపు ధ్వని ఆమె నోటి నుండి వెలువడక ముందే, తన అరచేతితో దానిని ఆపింది ఆమె.

“నీల్!” టెస్సా బదులు పలికింది. ఆ పిలుపు పలకడానికి ఆమె నానా యాతన పడింది. ఫోన్‌లో తన వెక్కిళ్ల శబ్దం భర్తకు వినబడకుండా తాపత్రయపడింది.

“నేను మొదటి నుంచీ ఒక గొప్ప తండ్రిని కాదు. ఐయామ్ సారీ” ఈ మాటలు ఆమె కన్నీళ్లను ఇంకా పెంచాయి. “నా తప్పిదాన్ని దిద్దుకోడానికి మరింత సమయం లభిస్తుందని, లభిస్తే బాగుంటుందని అనుకోన్నా. కాని లభించేలా లేదు. విశ్వం నాకు మరో అవకాశం ఇవ్వడానికి నిరాకరించింది. దాన్ని మనం ఎందుకని అడగలేం.”

“నీవు అడగాల్సిన అవసరం లేదు” అన్నది టెస్సా. ఈసారి తన వెక్కిళ్లను దాచుకోవడానికని ఆమె ప్రయత్నించలేదు. వ్యోమనౌక కాక్‌పిట్ లోని వారికీ, క్రింద కంట్రోల్ రూం వారికి ఆమె ఏడుపు స్పష్టంగా వినిపించింది.

“నన్ను క్షమించు, టెస్సా! నేను మరింత మంచి భర్తగా ఉండి ఉంటే బాగుండేది. నేను ప్రయత్నించి, మార్స్‌ను కాపాడాలి. మన పిల్లల కోమంచి భవిష్యత్తునివ్వు. నా నిర్ణయం ఇదే!” అన్నాడు నీల్. అతని గొంతులో మానసికమైన బలం ధ్వనించినా, అతని ముఖమంతా కన్నీటితో తడిసిపోవడం కాక్‌పిట్ లోని సిబ్బంది అంతా చూడగలిగారు. తన మాటలు తన హృదయాన్నే, అప్పుడే కొలిమిలో కాల్చి తీసిన వాడి లోహంలా చేదించాయి.

“వెళ్లి తీరాలా?” అడిగింది టెస్సా. అది ఒక భావావేశపూరిత ప్రశ్నే. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, అతని నిర్ణయాన్ని మార్చగలిగే అన్ని ఆశలనూ ఆమె వదులుకుందని స్పష్టమవుతుంది. “నేను తప్ప ఎవరూ వెళ్లలేరు” అని బదులిచ్చాడు నీల్. చేతి వెనుక వైపుతో ముఖం మీది కన్నీళ్లను తుడుచుకొన్నాడు. అతడు దుఃఖంతో ముక్కుచీదుతున్న శబ్దం రేడియోలో వినబడింది. అతడు కూడా ఎంత భావోద్వేగానికి లోనయ్యాడో తెలిపిందది. భార్య ఏమైనా చెబుతుందేమోనని ఎదురు చూశాడు కాని ఆమె నుండి ఏ స్పందనా లేదు.

ఇక భరించలేక, చెప్పాడు “గుడ్ బై టెస్సా, ఐ లవ్ యు వెరీమచ్. రేచల్‌కు జేమ్స్‌కు కూడా చెప్పు. నాన్నకు మీరంటే ఇష్టమని.”

మారథాన్ పరుగు పందెంలో చివరి గీత అప్పుడే దాటిన వాడికి కొట్టుకున్నట్లు నీల్ గుండె కొట్టుకుంది. జీవితం చాలా క్రూరమైనది సుమా! కుటుంబాన్ని తిరిగి చేరుకోవడమా లేక మానవత్వాన్ని, రక్షించుకోవడమా లేక తన ఇద్దరు కవల పిల్లలకూ తండ్రి లేకుండా చేయడమా అన్నది తేల్చుకోమనడంలోనే విశ్యం తన కఠినత్యాన్ని ప్రదర్శించింది. చిన్నవయసులో పిల్లలను తండ్రికి దూరం చెయ్యడమనేది హృదయవిదారకం.

నీల్, భార్యతో తాను చెప్పిన మాటలు గుర్తుచేసుకున్నాడు. అదే తన చివరి మిషన్ అనీ, దాని తర్వాత ఆర్మీకి రాజీనామా చేసి ఇంటిపట్టునే ఉంటాననీ ఆమెకు చెప్పాడు. అది చివరిది సరే, కాని దానిలో తాను చనిపోతానన్న విషయం అతనికి అప్పుడు తెలియదు. అప్పటి అతని మాటలు తేనెటీగ కుట్టినట్లు అతన్ని బాధించాయి. అవన్నీ వెనక్కు తీసుకోవాలని అనుకున్నాడు. ఇంకా ఎన్నో కావాలనుకోన్నాడు. కాని కఠినమైన వాస్తవం అతని ముందు నిలిచింది. వెయ్యికాంతి సంవత్సరాలు ఎదురు చూసినట్లనిపించిన తర్వాత మృదువైన, వెక్కిళ్లతో కూడిన భార్య గొంతు అతనికి వినబడింది.

“ఐ లవ్ యు టూ, నీల్!”

***

“అది అంత ప్రాణాంతకమైన విషయమా?” యూరీ అడిగాడు. అతడి ముఖం కూడా విచారంగా ఉంది. అది స్పష్టంగా తెలుస్తుంది. వ్యోమనౌకలోని డల్ మూడ్, నీల్ తన కుటుంబానికి చెప్పిన అంతిమ వీడ్కోలు వల్ల కొంత సర్దుకొంది.

ఆ సంభాషణ యూరీని ఆలోచింపచేసింది. అసలు మొదట్లోనే హంసపాదు ఎందుకు ఎదురైందోనని అనుకొన్నాడు. ఆ మిషన్ అత్యంత క్లిష్టమైన దన్నమాట నిజమే. సిబ్బంది సమర్థత మీద, నిర్వహణా పటిమ మీద మొదట్లో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. అన్ని లెక్కలూ పక్కాగా ఉండినాయి. నౌక టార్గెట్‌ను సరిగ్గా సమీపించింది. కేవలం ఒక్క అంగుళం దూరంలో తప్పిపోయింది!

నౌక మరో యాంగిల్ లోకి ఒరిగిపోకుండా ఉండి ఉంటే, కథ వేరేలా ఉండేది. కనీసం దాన్ని వారు ఊహించి ఉండినా బాగుండేది. ప్రతి ఒక్కరూ తమ లెక్కలు ఎక్కడ ఖచ్చితంగా లేవో అని ఆందోళన చెందుతున్నారు. ఏదైనా బయటి శక్తి అవరోధం కల్పించి ఉంటుందేమో అని వారు తెలుసుకోలేదు.

అదే తప్పు. ఒకే తప్పు జరిగింది. ఇంకో అవకాశం ఉండి ఉంటే (ఆ వ్యర్థాల నౌకను వెంబడించడానికి), వారు టార్గెట్‍ను సకాలంలో ఛేదించి ఉండేవారు మిషన్‌ను మధ్యలో వదిలేసి, వెనక్కి తిరిగి పోవడం అంత సరైన నిర్ణయం కాదని నీల్ భావించాడు. మానవతకో మంచి జరగడం కోసం, వెనక్కు తీసుకోలేని ఫలితాన్ని జరగకుండా నిరోధించడం కోసం, అతడు ఆ వ్యర్థాల వెంట వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు.

“అది ఆత్మహత్యా సదృశమా? నిజంగా,” యూరీ మళ్లీ అడిగాడు.

“అవును. ఆ వ్యర్థాల నౌక వెంట ఎవరు వెళ్లినా, మళ్లీ భూమికి తిరిగి రావడానికి కావలసినంత ఇంధనం మిగలదు. అందరం వెళితే, మనం భూమికి తిరిగి అసలు వెళ్లలేం. ఈ పాయింట్ నుంచి ఐతే మనకు ఇంధనం సరిపోతుంది” అని వివరించింది ఒలీవియా.

“మనం ఇక్కడ ఉండడానికే మరింత ఇంధనం ఖర్చు అవుతూ ఉంది. అది ఇంకా ప్రమాదం. నిర్ణయం వెంటనే, ఇప్పుడే తీసుకోవాలి. లేదా ప్రమాదం!” అన్నదామె.

“ఒకవేళ ఇలా చేస్తే..” అంటూ యూరీ ఏదో చెప్పబోతున్నాడు. శాటో, కళ్లనిండా నీళ్లతో, అతన్ని ఆపింది. నీల్ వ్యర్థాల వెంట స్వచ్ఛందంగా వెళుతున్నందుకు ఆమెకు చాలా బాధగా ఉంది కానీ పరిస్థితిని గురించిన అవగాహనతో ఉంది.

“ఒక వేళ.., ఇలా చేస్తే.. వంటి మాటలకు ఆస్కారమే లేదు యూరీ! అది ఒక వైపు ట్రిప్ మాత్రమే. రెండో వైపు ఉండదు.” మళ్లీ నిశ్శబ్దం రాజ్యమేలింది. రెండు నిమిషాలు! యారీ రేడియోలో కంట్రోలు రూం వారిని పిలిచాడు. వారు స్పందిస్తూనే, ఇలా అన్నాడు.

“నా భార్యను కూడా పిలవండి. ఆమెకు నేను వీడ్కోలు చెప్పాలి.” కంట్రోల్ రూమంతా నిశబ్దం. క్రింద సూది పడినా వినపడేంతగా. ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ కాసేపు తటపటాయించాడు. నౌక లోని ప్రధాన వ్యోమగాము లిద్దరినీ పోగొట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదసలు. నీల్ యూరీతో తన వెంట అతడు రావాల్సిన పనిలేదన్నాడు.

యూరీ, అప్పటికే, మనస్సులో, వెళ్ళడానికి స్థిరీకరించుకున్నాడు. అది అతని మాటల్లో స్పష్టమైంది.

“నేను నీతో రావడం లేదు నీల్. నేను వెళుతున్నానంతే! నేను కూడా, నీవు నాతో రానక్కరలేదని అనగలను. ఆది కరెక్ట్ కూడా. ఐనా, నీవు ఉపయోగించబోయే సబ్ మాడ్యూల్‍కు మరో జత చేతుల అవసరం ఉంది. అవి నీ జేబులోనే ఉన్నాయని మాత్రం దయచేసి చెప్పకు..”

“మీ ఇద్దరూ సబ్ మాడ్యూల్‍ను ఉపయోగించి మిషన్‌ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయిస్తే, మెయిన్ మాడ్యూల్‌ను నడిపేదెవరు?” అని అడిగాడు ప్రొఫెసర్ ఫ్రాన్సిస్.

“ఒలీవియా ఉంది కదా? సరేనా? ఆమె వ్యోమనౌకను కూడా నిర్వహించగలదు” అన్నాడు యూరీ. అతని గొంతులో ఆమె పట్ల విశ్వాసం. మరింత నచ్చచెప్పడం అతని కిష్టం లేదు.

ప్లాన్ ‘బి’ని సమ్మతించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకపోయింది, ప్రొఫెసర్ ఫ్రాన్సిస్‌కు. ఆయన భూమి మీద ఉన్నాడు. నౌకలో లేడు. అయిన చేయగలిగింది అంత కంటే ఏమీ లేదు.

వెంటనే, యూరీ భార్య ఫోన్‍కి అందుబాటులోకివచ్చింది.

“హలో, హనీ!”

“హనీ, నువ్వేనా, ఏం జరుగుతుంది?” ఆమె అతన్ని పలకరించింది. ఆమె స్వరంలో ఆందోళన. జరుగబోయేదానికి ఆమె సంసిద్ధంగా లేదని తెలిసిపోతుంది.

“అంతా ఓ.కే, మైడియర్! నీకు ఒక విషయం చెబుదామని..”

యూరీ కొనసాగించలేక పోయాడు. ఆ దుర్వార్తను భార్యకు చెప్పనీయకుండా, అతని రెండు ఊపిరితిత్తులూ, ఒక దానికొకటి అతుక్కుపోయినట్లు భావించాడు. తాను మళ్ళీ తిరిగి రావడం లేదని ఆమెకు స్పష్టం చేయబోతున్నాడు. కాని అదంత సులభమా? త్వరగా ముగించబోయే జీవితాన్ని తలచుకొని అతని ముఖం నీలంగా మారింది.

“ఏమిటి చెప్పు!”

“నేను.. నేను వెళ్లడం.. కాదు.. నేనసలు తిరిగి రావడం లేదు!” అన్నాడు యూరీ. మెల్లగా ఒక కన్నీటి బొట్టు అతని బుగ్గ మీదుగా జారింది. వెంటనే మరొకటి.

“నేను.. నేను మానవ జాతిని రక్షించాల్సి ఉంది”

మొదట్లో, లైన్ నిశబ్దం! అటువైపు నుండి ఏమీ వినబడలేదు. రెండు సెకండ్ల తరువాత మెత్తని ఆమె వెక్కిళ్ల శబ్దం. “ఇంటికొచ్చేయి.. యూరీ. ఇంటికి రా!” అతని భార్య బాధగా అరుస్తోంది.

యూరీ ఇక తట్టుకోలేక, చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు. మళ్లీ ఒకసారి ఆలోచించసాగాడు. కాని, నీల్ ఒంటరిగా ఆ మిషన్‌ను నెరవేర్చలేడన్నది స్పష్టం. ఇద్దరుండాల్సిన మహాకార్యంలో, మానవజాతి భవితవ్యాన్ని కేవలం ఒక వ్యక్తి చేతిలో అతను పెట్టబోవటం లేదు.

“ఐ యామ్ సారీ, హనీ! నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. ఈ ప్రపంచం చివరివరకు నిన్ను నేను ప్రేమిస్తాను”

అని, ఫోన్ పెట్టేసి, ఒక మూలకు వెళ్లాడు యూరీ, తనివి తీరా ఏడవడానికి. భార్యంటే ఆయనకంత ప్రేమ! తన భార్యనా, లేక రాబోయే తరాలనా? అని తేల్చుకోవాల్సిన సందర్భం ఒకటి తన జీవితంలో వస్తుందని అతనికి తెలియదు.

“అయితే మీరు సిద్ధమే కద!” అన్నాడు ప్రొఫెసర్, సీటు వెనక్కువాలి, స్క్రీన్లను చూస్తూ. ఆయన కళ్ళు కూడా తడిగా ఉన్నాయి. కాని ఆయన బలంగా నిలబడాలి! వారిలో ఎవరు ఎంత ఏడ్చినా, ఆయన నిబ్బరంగా వ్యవహరించాలి మరి!

“విన్నాం” అన్నాడు నీల్. శాటో, కృష్ణల వైపు తిరిగి చెప్పాడు “మీ ఇద్దరి అవసరం మాకు మరింతగా ఉంది. మా కోసం ఇది చేయండి. మీ భవిష్యత్తును కాపాడుకోండి.”

శాటో మొదట అంగీకరించింది. తర్వాత కృష్ణ కూడా. టోరిమోటో శాటో, తమకు లభించిన కొత్త డేటా ఆధారంగా, లెక్కలు చేసి, అణువ్యర్థాల నౌక ప్రస్తుతం ఉన్న చోటును అంచనా వేయసాగింది. ఎంత దూరం వారు కవర్ చేయాలి, ఆ ట్రిప్‌కు ఎంత ఇంధనం అవసరం అనేది గణించిందామె. తర్వాత ఆమె ఆ నౌక ప్రయాణించబోయే మార్గాన్ని, భూమి నుండి, మార్స్ నుండి అది ఎంత కోణంలో ఒరిగి పోబోతుందో, ఆ ట్రాజెక్టరీ మాడ్యూల్‌ను అంచనా వేసింది. ఇప్పుడు ఆ ప్రోగ్రాంను సమన్వయం చేసే అంశాలు కలవాలి. లెక్కల్లో స్పిన్నింగ్‌ను పరిగణించి చేయాలి.

ఆమె ఎంతో ఆశావహంగా చేసిన గణన వల్ల, న్యూక్లియర్ వేస్ట్ నౌకను చేరుకొని, దాన్ని మార్స్ ప్రభావం నుంచి మళ్లించడం సాధ్యమౌను.. అని తేలింది. తర్వాత తెలిసింది, లభ్యమయ్యే ఇంధనం మెయిన్ మాడ్యూల్‌ను భూమ్మిదకు వెనక్కు తీసుకెళ్లడానికి ఎంతమాత్రమూ సరిపోదని. దాని గురించి ఏదైనా అద్భుతం జరగడానికి అవకాశమే లేదు. వెనక్కి తిరిగివచ్చే అవకాశమే లేదని నీల్, యూరీ అంగీకరించారు.

సబ్ మాడ్యూల్ విడిపోయే ముందు, కృష్ణ, నౌక లోని కంప్యూటర్ల లోని కాంబినేషన్లను పునర్నిర్మాణం (recanfiguration) చేయాల్సి ఉందని తేల్చాడు. అతనా పని మీదే ఉన్నాడు. కంప్యూటర్‌ను ప్రోగ్రామింగ్ చేస్తూ, వ్యర్థాల నౌకను సమీపించడానికి కావలసిన సరైన మార్గాన్ని సెట్ చేయసాగాడు.

మిషన్ కోసం సంసిద్ధమయిన రెండు గంటల తర్వాత, నీల్ బ్యారీ, యూరీ ఇవానోవ్, సబ్ మాడ్యూల్ లోకి వెళ్లారు. దాన్ని మెయిన్ మాడ్యూల్ నుంచి విడదీసి, వేస్ట్ మాడ్యూల్ వెంట వెళ్లసాగారు. వారు ఆ మార్గం వెంటే వెళుతూన్నారు. కానీ అది చాలా కఠిన ప్రయాణం. భూమికి తిరిగివచ్చే ఆశ వారికి ఏ మాత్రమూ లేదు. తమ విధిని తాము, వెనక్కు చూడకుండా నిర్వహించసాగారు.

వారు వెనుదిరిగి చూడలేదు. చూడలేరు కూడా. ఎందుకంటే వారి హృదయాలు భారంగా ఉన్నాయి. వారి కళ్ల నిండా నీరు. ఒక దశలో ముఖాలను తుడుచుకొని, పని కొనసాగించారు. తమ లక్షాన్ని వారు సాధించి తీరాలి. లేకపోతే, వారి త్యాగం వృథా అవుతుంది.

శూన్యంలో ఒక రోజంతా కదుల్తూ, శాటో వేసిన లెక్కలను, కృష్ణ అద్భుతమైన ప్రోగ్రామింగ్‌ను నమ్ముతూ, వారు చివరికి వ్యర్థాల నౌకను కనిపెట్టగలిగారు. సరైన కోణాన్ని మెయిన్‌టెయిన్ చేస్తూ, ఎంతో ముందు జాగ్రత్తలో, క్లుప్తతతో, వారు ఆ నౌకతో అనుసంధానమయ్యారు

శూన్యంలో గాలి వలె, ఈ వార్త వ్యాపించింది. ప్రపంచమంతా సంబరాలు! నౌకకి తగుల్కొన్న తర్వాత, దాన్ని వారు మార్స్‌కు దూరంగా మళ్లించారు. తర్వాత, అప్పటికీ భూమి వైపుగా వెనక్కి వెళుతున్న మెయిన్ మాడ్యూల్‌తో కమ్యూనికేట్ చేశారు. దాని ట్రాజెక్టరీ (పయనమార్గం) మార్స్ వైపుగా కాకుండా, మరో కక్ష్యలోనికి ప్రవేశించినట్లుగా శాటో ధృవీకరించింది. దీంతో, అది భూమికి తిరిగి రావడానికి సిద్ధం అవడానికి వారికి ఇంచుమించు ఒక శతాబ్దం లభించినట్లే. ఈ వార్త, కంట్రోలు రూమును ఆనందోత్సాహాలతో నింపి ఉండేదే. కాని.. తప్పనిది ఒకటి ఉంది కదా! మిషన్ విజయవంతమైంది. అది ముఖ్యం! కానీ నీల్, యూరీలు భూమికి తిరిగి రావడానికి వారి వద్ద ఇంధనం లేదు! అది ముందుగా తెలిసిన విషయమే. కంట్రోలు రూం, మెయిన్ మాడ్యూల్ లోని కాక్‌పిట్, అతి నిశబ్దంగా ఉన్నాయి; మానవజాతిని రక్షించిన వారి, తప్పని మరణానికి సంతాపంగా.

“మా కుటుంబాలకు చెప్పండి.. మేం వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాం. ప్రపంచాన్ని కూడ అంతకంటే ఎక్కువగా!” అన్నాడు నీల్, ‘కామ్’ మీద. నౌకల మధ్య దూరం పెరుగుతూండడంతో, కనెక్షన్స్ బ్రేక్ అవుతూ ఉన్నాయి. రేడియేషన్ వల్ల అవి మరింతగా పాడయ్యాయి.

“నేను ప్రేమి..”

“నీల్, యూరీ! “ శాటో ఎలుగెత్తి పిలిచింది. వారి నుంచి ఏ స్పందనా లేదు.

“నీల్, బ్యారీ!” ఈసారి ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ పిలిచాడు. వారిని కోల్పోయినట్లు నమ్మడానికి ఆయన ఒప్పుకోలేదు.

ప్రపంచమంతటా అదే నిశ్శబ్దం. అది అందర్నీ ఉక్కరిబిక్కిరి చేస్తూంది. కంట్రోలు రూములోని ప్రతి ఒక్కరి గుండె చప్పుడు బయటికి వినబడుతూంది.

రేడియోలో ఆ వార్త విని, టెస్సా తన బాధను, కోపాన్ని, నిగ్రహించుకోలేకపోయింది. ఇల్లంతా తిరుగుతూ, కన్నీళ్లతో, కనిపించిన దాన్నంతా ధ్వంసం చేయసాగింది. ఆ వార్తను ఇరుగుపొరుగు వారు కూడ విన్నారు. టెస్సా ఇంట్లోంచి వస్తున్న శబ్దాలను విని వారు పరుగుపరుగున వచ్చి, ఆమెను పట్టుకున్నారు, ఆమెకేమీ కాకూడదని.

యూరీ భార్య ఇంట్లో ఉంది. సబ్ మాడ్యూల్‌తో సంబంధాలు తెగిపోయాయని ప్రకటించబడిన తర్వాత, ఆమె కన్నీళ్లతో కుప్పకూలిపోయింది.

మిషన్ ఇంకా పూర్తి కాలేదు. మెయిన్ మాడ్యూల్ ఇంకా భూమికి తిరిగి వచ్చే దారి లోనే ఉంది. అది క్షేమంగా చేరుకోవాలనీ అందరి ఆశ!

“మీ కళ్లలో గనుక నీళ్లుంటే వాటిని శుభ్రంగా తుడుచుకోండి! ఇప్పటికే ఇద్దర్ని పోగొట్టుకున్నాం. కాని నలుగురిని కాపాడుకోవడానికి మనకు అవకాశం ఉంది. దాన్ని వృథా చేయొద్దు!” అన్నాడు ప్రొఫెసర్ తన సీటునుండి లేస్తూ.

“ఒలీవియా; నీ స్టేటస్ ఏమిటి?”

“మేం బాగున్నాం. ఇంధనం కొరత ఉంది గాని, మేం భూమిని చేరుకోడానికి అది సరిపోతుంది” అని జవాబిచ్చింది ఒలీవియా.

మెయిన్ మాడ్యూల్ లోని ప్రధాన సీటును తనకిచ్చినపుడు, ఆమె మొదట కొంచెం నెర్వస్‌గా ఉంది. కాని వ్లాదిమిర్ ఆమెకు నచ్చచెప్పి, ఏం ఫరవాలేదన్నాడు. యూరీకి అమె మీద నమ్మకం ఉంది. అతని నమ్మకం వమ్ము కాకూడదనుకొంటే, అణుమాత్రమైనా భయపడకుండా ఆమె తన విధిని నిర్వహించాలి.

“వెరీగుడ్! మీరు భూమికి దాపుగా వచ్చిన వెంటనే మాకు సూచించడం మరచిపోవద్దు”

“అలాగే!” అని బదులిచ్చింది ఒలీవియా.

భూమి నుంచి వెళ్ళే ప్రయాణంతో పోలిస్తే, భూమికి తిరిగివచ్చే ప్రయాణం, అసలేమీ కాదు. అది మరింత వేగంగా, తీవ్రంగా ఉంటుంది. ఇద్దరు ముఖ్యమైన సిబ్బందిని పోగొట్టుకున్నామన్న బాధ కూడా వారి మనసులను కలచి వేస్తూ ఉంది. వారి త్యాగాన్ని సంతాపిస్తూ ఉండడంవల్ల ఆ తిరుగు ప్రయాణం వారికంత సంతోషంగా లేదు.

మార్స్‌ను సురక్షితంగా ఉంచడంలో విజయాన్ని సాధించగలిగారు వారు. కాని తమను తాము రక్షించుకోలేకపోయారు! కొన్ని ప్రఖ్యాత కొటేషన్లు నిజమే అనిపిస్తుంది. గుండెను పిండేసే వ్యాఖ్య లవి. ‘రెండు పక్షులను ఒకే రాయితో కొట్టలేం!’ అనేది ఇక్కడ వర్తిస్తుంది.

భూమికి తిరిగి వచ్చేదారిలో, మొదట్లోవారు చూసినట్లుగా, వారు కొన్ని గ్రహశకలాలను (asteroids) ఎదుర్కున్నారు. అవి అంతరిక్షంలో తిరుగుతూ ఉన్నాయి. మొదట నౌకను నడిపినవాడు నీల్. అది అతనికి సులభమైన పనే. ఒలీవియా నౌకను సక్రమంగా నడపడానికి తన శాయశక్తులా ప్రయత్నించింది. కొన్ని చిన్న చిన్న గ్రహశకలాలను తప్పించుకుంటూ, వారు బయటపడ్డారు.

త్వరగానే, అంతరిక్షంలో పదిహేను రోజులున్న తర్వాత, చివరికి వారు భూగ్రహం కక్ష్య లోని మాధ్యమానికి ప్రవేశించగలిగారు. భూమి అంతా ఉద్వేగంతో నిండిపోయింది. కాని అదే సమయంలో దానిని, దాని ప్రజలను ఒక రకమైన భయం ఆవహించింది. ఒక రోలర్ కోస్టర్ లోని భావావేశాలు, మన ఆలోచనలను భ్రమలను, మన మీద స్వారీ చేసే విధంగా చేసుకున్నట్లుగా, ఆ సమయం సంక్లిష్టంగా ఉంది. మార్స్‌ను రక్షించడం కోసం యూరీని, నీల్‌ను పోగొట్టుకున్న అత్యంత విషాద సమయం అది.

మెయిన్ మాడ్యూల్ భూకక్ష్యలోని అడుగు భాగానికి చేరుకున్న వేళ, హెచ్చరికను సూచిస్తూ ఒక బటన్ వెలిగింది. అది నిరంతరంగా ఎర్రని ఫ్లాష్‌ను వెలువరించ సాగింది. అదెందుకో తెలుసుకోడానికి వారు కంట్రోల్ రూంకు కాల్ చేశారు

“కంట్రోల్ రూమ్, మాకొక వార్నింగ్ లైట్ వస్తోంది” అని రిపోర్టు చేశాడు వ్లాదిమిర్.

ప్రొఫెసర్ ఫాన్సిస్ గబుక్కున ముందుకు వచ్చి అదేమిటని అడిగాడు. ఎప్పుడూ అక్కడే ఉండే అలెక్సిస్ దానికి స్పందించాడు.

“హీట్ షీల్డ్ బహుశా వదులై ఉంటుందని అనుకుంటున్నా సర్. ఏదైనా గ్రహశకలం వారికి తగిలిందేమో?” అన్నాడు. తాను ఖచ్చితంగా చెప్పలేనట్లు, చేతిని పైకి విసిరి, అభినయించాడు.

“MSM 6, మీరు గత కొన్నిరోజుల్లో, ఏదైనా గ్రహశకలాన్ని గుద్దుకున్నారా?” అని అడిగాడు ప్రొఫెసర్. జవాబు కొంచెం ఆలస్యం ఐంది.. కాని వచ్చింది.

“అవును సర్! కరెక్ట్‌గా చెప్పలేం గాని, మేము గ్రహశకలాలు అన్నింటినీ దాటుకొని వచ్చింతర్వాత, ఒక చిన్న ‘బంప్’ అంటే కుదుపు ఏర్పడింది.”

“వారు దాన్ని గమనించలేదంటే, సర్, బహుశా వారికి అదొక బ్లైండ్ స్పాట్ అయివుండవచ్చు. వారి దృష్టికి రాని, అర్థం కానిది” అన్నాడు అలెక్సిస్. అని కుతూహలంగా ప్రొఫెసర్ వైపు చూశాడు, ఏమంటాడోనని..

“MSM 6, మీరు మాతో కనెక్ట్ అయి ఉన్నారా?” నాసా కమాండ్ సెంటర్ పిలిచింది.

“అవును”

“మీరు ప్రతిదీ చెక్ చేసుకోవాలి. అంతా సక్రమంగా, యధాస్థానంలో ఉన్నట్లు ధృవీకరించుకోవాలి. ముఖ్యంగా మరీ, ల్యాండింగ్ బ్యాగ్‌ను!” రెండు నిమిషాలు గడిచాయి. ప్రొఫెసర్ గారు ఎదురుచూస్తున్న జవాబులు వచ్చాయి.

“ల్యాండింగ్ బ్యాగ్, ఇంకా ఇతరాలు అన్నీ ఓ.కే సర్” అన్నాడు కృష్ణ.

“ఆందోళన చెందాల్సింది అది కాదు సర్! మరిన్ని సంక్లిష్టతలున్నాయి మనకు” అన్నాడు అలెక్సిస్. “దిగుతూనే మెయిన్ మాడ్యూలు మండి పేలిపోవచ్చు.”

“అది నేను చెప్పమన్నానా నిన్ను?” అని అడిగాడు ప్రొఫెసర్. అతని ముఖంలో కాఠిన్యం. ఆ మాటలంటున్నపుడు తీవ్రమైన గాంభీర్యం అతనిలో కనిపించింది.

ప్రపంచమంతా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది; MSM 6 యొక్క చివరిదశ సమీపిస్తూండగా. కంట్రోలు రూమ్ లోని ఆందోళన ప్రపంచమంతా వ్యాపించింది. ఎందుకంటే మీడియా, మెయిన్ మాడ్యూల్ ఒక సమస్య ఏర్పడిందని ప్రకటించేసింది.

కంట్రోల్ రూమ్ ప్రశ్నలను అడగసాగింది. నౌకు ఇంకా మంచి స్థితిలోనే ఉందనీ, భూమి మీద ప్రవేశించే సమయంలో ఉత్పన్నమయ్యే అధిక ఉష్ణోగ్రతను అది తట్టుకుని, మండిపోకుండా నిలబడగలదనీ నిర్థారించుకునేందుకే, ఈ ప్రశ్నలు. రెట్రో ప్యాకేజ్‌ను పోగొట్టుకోవడంగాని, నిర్లక్ష్యం చేయడంగాని, అస్సలు చేయకూడదని వారికి ఆదేశం వెళ్లింది. అంటే గతంలోని సాంకేతిక అనుభవాలను పరిగణించమని. హీట్ షీల్డ్, అంటే వేడిమి నుంచి కాపాడే కవచం, నౌకలో కొంత ఇబ్బందిగానే ఉందని, అది తన స్థానంలో తాను ఉండలేకపోవచ్చని, వారు నిర్ధారించారు.

ఒత్తిడి పెరుగుతోంది. ప్రజలకు అనుమానాలూ పెరుగుతున్నాయి. వ్యోమగాముల భవితవ్యం రెపరెపలాడుతుంది. వ్యోమ నౌక మెయిన్ మాడ్యూల్‌లో మిగిలిన వారి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ప్లాన్ చేసిన విధంగా భూమి మీద దిగడం తప్ప వారు చేయగలిగిందేమీ లేదు. ఒకవేళ హీట్ షీల్డ్ గనుక వదులైతే, రెట్రో ప్యాకేజ్ వారికి అండగా నిలవొచ్చు.

శాటో అనేక క్యాల్‌క్యులేషన్స్ చేసిన తర్వాత, మెయిన్ మాడ్యూల్‌ను వారు భూవాతావరణంలోకి దించడానికే నిర్ణయించుకున్నారు, అదీ హీట్ షీల్డ్, అంటే వేడిమి కవచం లేకుండా. వారి ఆశలన్నీ రెట్రో ప్యాకేజ్ పైనే పెట్టుకున్నారు. రెట్రో సీక్వెన్స్‌ను ప్రారంభించారు. ముందు చేయబోయే ‘మూవ్’ను వెనుకటి ‘మూవ్’ తో  సమన్వయం చేయసాగారు; ‘ ఫ్లై బై వైర్’ ను ఉపయోగిస్తూ, ఒలీవియా ఒక జీరో యాంగిల్‌ని మెయిన్‍టెయిన్ చేయసాగింది. ‘ఫ్లై బై వైర్’ అనేది ఫ్లయిట్ ఎన్వెలప్ ప్రొటెక్షన్ సిస్టమ్. ఎయిర్ క్రాఫ్ట్ పరిమితుల్లోనే, పైలట్‌కు దీని వల్ల నౌకపై పూర్తి అదుపు లభిస్తుంది. బరువు, ఈడ్చుకొనిపోవడం బాగా తగ్గుతాయి. సేఫ్టీ, నిర్వహణ మెరుగుపడతాయి. కంప్యూటర్లు ఫ్లయిట్ కంట్రోల్ ఇన్‌పుట్స్‌ను ప్రాసెస్ చేస్తాయి.

భూమి కక్ష్యలోకి ప్రవేశించడానికి కొంచెం ముందు, కంట్రోలు రూముతో వారి సంబంధాలు తెగిపోయాయి! వెంటనే, మెయిన్ మాడ్యూల్ దిగుతూన్నవేళ మంటలు చెలరేగాయి. భూమి మీదకు వారు వచ్చే వేగం వారు అదుపు చేయలేకపోతున్నారు. దానివల్ల నిజమైన మంటలు ఏర్పడ్డాయి.

కంట్రోలు రూంలో, ప్రపంచం అన్ని మూలలా, ఉత్కంఠ, ఒత్తిడి, శిఖరాన్ని తాకాయి. ప్రతి ఒక్కరి మెదడు మొద్దుబారి పోయింది. అందరూ తర్వాతి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. నాసా కంట్రోల్ రూంలోని చాలామంది, ఊపిరి బిగపట్టుకొని, గుండెలు దడదడలాడు తూండగా, వారి పక్కటెముకలు పగిలిపోతాయేమో అన్నట్లున్నారు. వారిని కూడా కోల్పోతామేమో అని ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ చాలా భయపడుతున్నాడు. ఒక్కరు దక్కకపోయినా ఆయన తట్టుకోలేడు. అలా జరిగితే మిషన్ విఫలమైనట్లే.

మెయిన్ మాడ్యూల్ భూమ్మిద దిగాల్సిన చోటు పసిఫిక్ మహాసముద్రం. చాలామంది అసహనంగా ఎదురు చూస్తున్నారు. వారి మనస్సులు క్రుంగిపోతున్నాయి. మేఘాలు ఆవరించిన చోట చిన్న మెరుపు లాంటి ఆశారేఖ కోసం వారి తాపత్రయం. కమ్యూనికేషన్ పరికరం గరగరలాడుతూంది. మాడ్యూల్ నుండి ఏదో వినాలని, ఏదైనా సరే వినాలని, అందరూ ముళ్లమీద ఉన్నట్లు కూర్చున్నారు.

అంతా అయిపోయి ఉంటుందని అందరూ అనుకున్న తర్వాత, ఒలీవియా గొంతు కమ్యూనికేషన్‍లో ప్రతిధ్వనించింది. కంట్రోల్ రూమ్‌లో కేరింతలు మిన్నుముట్టాయి. కొంతమంది టెన్షన్ భరించలేక ఏడవసాగారు.

“అంతా బాగేనా?” అని అడిగాడు ప్రొఫెసర్.

“నాసా కమాండ్ కంట్రోల్‌కు కాపీ చేయండి!” అన్నాడు బ్రియాన్.

“స్పష్టంగా, మాకు కొన్ని ప్యానెల్స్ వదులైనప్పటికీ, దిగడానికి మాకు బాగానే ఉంది సార్” అన్నది శాటో.

న్యూస్ చెప్పేవారు ప్రపంచానికి ఈ విషయం తెలియచేశారు. అందరూ సంతోషించారు. ఊపిరి పీల్చుకున్నారు. అయినా భూప్రవేశం రెండో దశ ఇంకా మిగిలి ఉంది.

అతి త్వరగా, వారు దిగే కోఆర్డినేట్స్‌ను పక్కకు వంచి, పారాచ్యూట్స్‌ను తెరిచారు. దాని వల్ల మాడ్యూల్ వేగం మందగించి, పసిఫిక్ ఉపరితలం మీద మరీ ప్రభావం పడకుండా ఉంటుంది. మాడ్యూల్ నీళ్లల్లోకి, శబ్దం చేస్తూ, నీటిని పెద్దగా చిందిస్తూ, దూసుకుపోయింది. ఆనందోత్సాహలు! చప్పట్లు! కేరింతలతో కంట్రోలు రూం సుసంపన్నమయింది. భూమి ఉపరితలమంతా ఒక విధమైన సుఖభ్రాంతి (euphoria) వ్యాపించింది. చివరి నలుగురు వ్యోమగాములూ క్షేమంగా తిరిగివచ్చినందుకు అందరూ ఆనందించారు.

వ్లాదిమిర్ నోవిక్, టోరిమోటో శాటో, రాకేష్ కృష్ణ, ఇంకా ఒలీవియా స్పెన్సర్ మంచి ఆరోగ్యంతో క్రిందికి దిగారు. మాడ్యూల్‌ను త్వరగా తీసి, సిద్ధంగా ఉన్న షిప్ లోకి ఎక్కించారు. షిప్ సిబ్బంది ఎదురు వచ్చి వారిని గ్రీట్ చేశారు. ఒకటే చప్పట్లు! ఆనందం!! అన్ని ముఖాల పైనా! నలుగురు సిబ్బందికి వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్యం చక్కగా ఉందని నిర్ధారించారు వైద్యులు.

మార్స్ పరిరక్షణ మిషన్ పదిహేను రోజుల, పన్నెండు గంటల తర్వాత విజయం సాధించింది. అదంత సులభం కాలేదయితే. వారెదుర్కొన్న మొదటి సమస్యల మాలికను సులభంగా అధిగమించి, అంతరిక్షంలో ముందుకు సాగగలిగారు. తర్వాత వారు మిషన్ ప్లాన్ ‘బి’కి మారారు. వారిలో కొందరికది కఠిన పరీక్షా సమయం. సబ్ మాడ్యూల్‍లో స్వచ్ఛందంగా వెళ్లడానికి ఇష్టపడని వారు సైతం, తమలో ఒక భాగం చచ్చిపోయినట్లు భావించారు.

మానవుడు సాధించే ప్రతి విజయం ఒక బలి కోరుతుందేమో? ఇద్దరు ప్రధాన సిబ్బంది ఆత్మహత్యా సదృశమైన ఆ సాహసంలో, వారి తర్వాత తరాల భావి కోసం వెళ్లారు. అణు వ్యర్థాల నౌక మార్స్‌తో ఢీ కొనకుండా మళ్లించి, వారు ఘనవిజయాన్నిసాధించారు.

భూమ్మీద అందరూ సంతోషించారు. తర్వాత మానవజాతిని కాపాడిన ఆ రక్షకుల కోసం సంతాపం వ్యక్తం చేయిసాగారు. టెస్సా బ్యారీ, యూరీ భార్య మానసికంగా, భావావేశపరంగా చాలా దెబ్బ తిని ఉన్నారు, ఆ మిషన్ దుష్పలితం వారికి మిగిల్చిన విషాదంతో. వారే కాదు, మొత్తం ప్రపంచం వారి భర్తల మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూనే ఉంది. శాటో మనసు కూడా బాగా గాయపడింది. నీల్ తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి వెళ్లేముందు అతనితో ఆమెకొక అనుబంధం ఏర్పడింది

ఆ రోజు సమావేశంలో మిస్టర్ మార్టిన్ మాట్లాడిన మాటలు చాలామందికి గుర్తొచ్చాయి. మానవజాతి భవితవ్యాన్ని కాపాడటానికి ఎంతో రిస్కు తీసుకొని, అశువులు బాసిన నీల్ బ్యారీ, యూరీ ఇవానోవ్ త్యాగాలు మార్స్ పై భద్రంగా ఉండబోతున్నాయి.

***

కోలార్యాడో రాష్ట్రం. సూర్యుడు నడినెత్తికివచ్చాడు. మేఘాల బందిఖానా నుంచి బయటపడి, తన కాంతిని భూమి ఉపరితలం మీద విరజిమ్ముతున్నాడు. పక్షులు కిలకిలారావాలతో సందడి చేస్తునాయి. ఆనందంగా పాడుతున్నాయి. అదంతా ‘ఔరే ‘పట్టణం లోని ప్రజల మానసిక స్థితికి విరుద్ధంగా ఉంది. ఊరంతా మేలుకొనే ఉంది, దాని చుట్టూ ఉన్న ప్రపంచం కూడా! రెండు వారాల క్రిందటే MSM ముగింపును ప్రపంచం వీక్షించింది. దానికి ముందే అమరులైన ఇద్దరు వ్యోమగాముల కోసం సంతాపం ప్రకటించింది.

‘ఔరే’ అంత బాధ బహుశా ఏ పట్టణమూ పొంది ఉండదేమో? భూమిపై ఉన్న ఏ ఊరూ, ఆ ఊరి బాధతో సరితూగలేదు. నీల్ వారికి ఒక యుద్ధవీరుని కంటే ఎక్కువ. అతనొక తండ్రి. వారికి అత్యంత సన్నిహితుడు. సహచరుడు. ప్రతి మిషన్ తర్వాత అతడు దాని విశేషాలను అందరికీ వర్ణించి చెప్పేవాడు. ఊరందరికీ అతనంటే ప్రేమే. కేవలం అమెరికాకు అతడు సేవ చేశాడని కాదు. తన ఊరి పేరు నిలబెట్టాడని.

ఈ క్షణానికి కేవలం కొన్ని వారాల ముందు, ఆ ఊరి హీరో, తండ్రి, నిస్వార్థంగా బలయిపోయాడు! మానవజాతి మనుగడ ఇక ముందు పదిలంగా ఉండాలని! అతనికి ఋణపడి ఉండని దేశం ఈ భూమిమీద ఉండదు గాక ఉండదు. ఒక ప్రపంచ వీరుడతడు, కొందరన్నట్లు. అతడు విశ్వరక్షకుడు. మార్స్ పై ప్రజలు జీవనం సాగించడానికి అవకాశం ఇచ్చిన మహనీయుడు.

ఆ ఉదయం, తల నుండి మోకాళ్ళ వరకు నల్లరంగు దుస్తులు ధరించి ఒక స్నేహితురాలు వెంటరాగా, టెస్సా బ్యారీ బయటకు వచ్చింది. పురప్రముఖులు, చట్టుపక్కల గ్రామాల పెద్దలు అక్కడ సమావేశమయ్యారు. తమ ప్రియమైన స్నేహితుని అంత్యక్రియలు జరపడం కోసం. ఉదయం ప్రారంభమైన ఆమె కన్నీటి ధారలు, అంతమనేదే లేకుండా, ఆమె ముఖాన జాలువారుతూనే ఉన్నాయి. వాటిని నిగ్రహించుకోలేకపోతుంది పాపం ఆ అభాగ్యురాలు. ఆమె చేతి రుమాలు కన్నీటితో పూర్తిగా తడిసిపోయింది. మాటిమాటికీ ఇంకోటి మార్చాల్సివస్తుంది.

అమెరికన్ సైన్యం నుంచి కూడ చాలామంది మగవారు, ఆడవారు హాజరైనారు. తమ ప్రియతమ నాయకుని అంత్యక్రియలు చూడడానికి. నీల్ బ్యారీ, ఎంతో మందికి, ఎంతో కావలసిన వాడైనాడు. అలాంటి చోట ప్రెస్ ఉండటం అతి సహజం. దానికెక్కడా మినహాయింపు ఉండదు. మిగతా ప్రపంచానికి, ఇటువంటి, హృదయాలను కదిలించే క్షణాలను షేర్ చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది కదా! అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆ కార్యక్రమంలో నీల్ పార్థివ శరీరం లేదు! ఒక ఖాళీ పెట్టెలో, అతని చిత్రపటాన్ని, అతని సైనిక దుస్తులను పెట్టి ఖననం చేయాలని నిర్ణయించారు. అంతరిక్షం నుంచి వారిరువురి శరీరాలను తెప్పించలేకపోయారన్నది కఠిన సత్యం. ఏదో ఒకటి ఖననం చేయాలి మరి. కనీసం, ఒక జాతిగా, అతనికి సముచితమైన నివాళి అంత్యక్రియల రూపంలో నిర్వర్తిస్తున్నారు. కార్యక్రమం జరుగుతూ ఉంది. టెస్సాకు బరియల్ ప్లాగ్ ఇచ్చారు. వణుకుతున్న చేతులతో, కంటినిండా నీటితో ఆమె దాన్ని స్వీకరించింది. కార్యక్రమం ముగిసింది. అందరూ విషాదంగా, నెమ్మదిగా, స్మశానాన్ని వదలి వెళ్లిపోతున్నారు. వారి హృదయాలనో మథిస్తే, అంత చిన్నవయసుతో టెస్సా విధవ కావడం వారికి హృదయ శల్యంగా ఉంది.

మూలరాయి దగ్గర టెస్సా కూర్చుని, సమాధిపై చెక్కబడ్డ భర్త పేరును తదేకంగా చూస్తూ ఉంది. ఆమె స్నేహితురాలు ఆమె వీపు పై మృదువుగా, ఓదార్పుగా రాస్తూనే ఉంది. టోరిమోటో శాటో ఆమె ఉన్న వైపుకు నడచి వచ్చింది. పక్కన చతికిలబడి, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, నీల్ తన మణికట్టుపై ఎప్పుడూ ధరించే బ్రేస్‍లెట్‌ను ఆమెకు ఇచ్చింది.

ఉన్నట్టుండి ప్రత్యక్షమైన ఆ బ్రేస్‍లెట్‌ను చూసి, టెస్సా మనస్సు మరింత క్షోభించింది.

శాటో ఇలా అన్నది – “సంతోషంగా ఉండమని చెప్పాడు. ఈ బ్రేస్‍లెట్‌లో జీవించి ఉన్నాడు.”

ఆమె హృదయాన్ని చూపుతూ, “ఇక్కడ ఎలాగూ ఉండనే ఉన్నాడు” అన్నది. నీల్ సన్నిహిత మిత్రుడు ఒకరి దగ్గర ఉన్న ఇద్దరు పిల్లల వైపుచూ పిస్తూ, “అక్కడా ఉన్నాడు” అంది శాటో.

అమెరికా చేసినట్లే, రష్యన్లు కూడ చేశారు. యూరీ ఇవానోవ్ అద్వితీయుడు. వారిద్దరి త్యాగాలు సమానమే. మానవతకు కీలకమైనవే. కాని అమెరికన్లు నీల్ కోసం బాధపడినంతగా రష్యన్లు బాధపడలేదు. రష్యన్లు యూరీ కోసం బాధపడినంతగా అమెరికన్లూ బాధపడలేదు. అది సహజం.

ఒక దేశం, ఒక జాతి, మాత్రమే కాదు, అతని దగ్గర బంధువులు సైతం అతని కోసం విలపించారు. భార్యతో అతని చివరి సంభాషణను గుర్తుకు తెచ్చుకొని వారు తల్లడిల్లని క్షణం లేదు. అంత్యక్రియల తంతుకు చాలా ఎక్కువ మందే వచ్చారు. వారి మధ్య అంత ప్రశాంతత నెలకొని ఉందంటే నమ్మలేం. అక్కడ నిశ్శబ్దం ఎలా ఉందంటే గడ్డిపరకలు గాలికి చేస్తున్న శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ఆ సవ్వడిగాక మరో ధ్యని ఆ అమరవీరుని తల్లి భార్య, కూతురు, బంధువుల ఆక్రందనం మాత్రమే.

మానవుని మనుగడ పరిఢవిల్లుతూ ఉన్నంతవరకు, అతడు గుర్తుంటాడు. రష్యా ప్రభుత్వం ఆ రోజును సెలవుదినంగా ప్రకటించింది, MSM 6 హీరోలకు అందరూ సంతాపం తెలుపడానికి వీలుగా. వారు రష్యాకు మాత్రమే రక్షకులు కాదు, మొత్తం మానవ జాతికే రక్షకులు.

ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ కాళ్ళు వణుకుతున్నాయి. సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. తనకు అత్యంత సన్నిహితుడైన సహోద్యోగి ఇక లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడాయన. అతన్ని మిషన్‌లో తప్పక పంపాలని పట్టుబట్టినవాడు ఆయనే. అది మరింత క్రుంగదీస్తూ ఉంది ఆయనను. ఆయన బాధను అటుంచితే, ఆయన చేసింది సరైన పనే. అతని ఎన్నిక సరైనదే. యూరీ స్థానంలో మరొకర్ని పంపి ఉంటే మిషన్ సఫలమయ్యేది కాదు.

సైన్యంలో చేరాలన్నఅతని బలమైన ఆసక్తి, అదీ అతి చిన్నవయసులో, తన కుటుంబం కోసం, తన దేశం కోసం అతడు చేసిన త్యాగాలు, అతన్ని గుర్తుంచుకోడానికి బలమైన కారణాలు. ‘మార్స్‌కు ప్రవేశం’ అనే అవకాశం కల్పించి, అతడు మానవాళికి మేలు చేశాడు.

వారిరువురి సాహసాలకు స్మారక చిహ్నాలుగా, వారి విగ్రహలను రెడ్ ప్లానెట్ మీద, అంటే మార్స్ మీద నెలకొల్పాల్సి ఉంది. ఒక విగ్రహం ఐక్యరాజ్యసమితి భవనం ముందు, మరొకటి రష్యా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ముందు ఏర్పాటు చేశారు.

అసలు విగ్రహలు మనుషులను రీప్లేస్ చేయలేవన్నది నిజం. వారు మరి లేరన్నది జీర్ణించుకోలేకపోయినా, ఏదో ఒక విధంగా వారిని స్మరించుకోవాలి కదా! దానికి చక్కని మార్గం ఇటువంటి విగ్రహావిష్కరణలే. విగ్రహం ముందు, పీఠం మీద, వ్యోమగామి పేరు లోని పుటాక్షరాలు ఇలా పొందుపరచారు.

‘NBYI: MSM2’.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here