అంతరిక్షంలో మృత్యునౌక-6

1
10

[శ్రీ బంకా పార్దు సంపత్ ‘Redemption of the Century’ అనే పేరుతో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలను ‘అంతరిక్షంలో మృత్యునౌక’ పేరిట అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[తమని తాము రక్షించుకుంటారా లేక మానవజాతిని కాపాడతారా – అనే నిర్ణయాన్ని వ్యోమగాములనే తీసుకోమన్నప్పుడు వ్యోమనౌకలో నిశ్శబ్దం ఆవరిస్తుంది. కొన్ని నిమిషాల తరువాత నీల్ రేడియోలో నాసా చీఫ్‍తో తన కుటుంబాన్ని పిలిపించమని చెప్తాడు. దాంతో అతడు ఆ అణువ్యర్థాల నౌక వెంట వెళ్లడానికి స్వచ్ఛందంగా సిద్ధపడినట్లు అర్థమవుతుంది. ఇంధనం తక్కువ ఉందనీ, వెళ్ళవద్దనీ శాటో అంటుంది. ప్రయత్నం చేయాలని పట్టుపడతాడు నీల్. బృందంలోని మిగతా సభ్యులు కూడా వారిస్తారు. ఈలోపు నీల్ భార్య రేడియోలో అందుబాటులోకి వస్తుంది. నీల్ ఆమెతో మాట్లాడి వీడ్కోలు చెప్తాడు. ఈలోపు యూరీ కూడా ఆలోచించుకుంటాడు. తన భార్యని కూడా పిలిపించమని రేడియోలో చెప్తాడు. తన వెంట యూరీ రావల్సిన అవసరం లేదంటాడు నీల్. ‘నీవు ఉపయోగించబోయే సబ్ మాడ్యూల్‍కు మరో జత చేతుల అవసరం ఉంది’ అని ఒప్పిస్తాడు యూరీ. కాసేపటికీ యూరీ భార్య రేడియో దగ్గరికి వస్తుంది. ఆమెకి వీడ్కోలు చెప్తాడు యూరీ. శాటో, కృష్ణలు కొత్త లెక్కలు వేసి అణువ్యర్థాల నౌక ఎంత దూరంలో ఉందో తేలుస్తారు. కొన్ని గంటల తరువాత – నీల్, యూరీ ఉన్న సబ్ మాడ్యూల్ – మెయిన్ మాడ్యూల్ నుంచి విడిపోయి, అణువ్యర్థాల నౌకను వెంబడించి దానితో అనుసంధానమవుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ దాన్ని వారు మార్స్‌కు దూరంగా మళ్లిస్తారు. ఈ క్రమంలో నీల్, యూరీలు అమరులవుతారు. భూమ్మీద అంతటా విషాదం! మెయిన్ మాడ్యూల్ భూమికి తిరిగి రావడానికి సిద్ధమవుతుంది. పదిహేను రోజుల తర్వాత వారు భూకక్ష్యలోకి ప్రవేశిస్తారు. ఇంతలో హీట్‍ షీల్డ్‌కి గ్రహశకలం తగిలి వదులై, సమస్య ఏర్పడుతుంది. భూమి మీద కంట్రోల్ రూమ్‍లో ఉద్విగ్నత. రెట్రో ప్యాకేజ్ సహాయంతో, ‘ఫ్లై బై వైర్’ ను ఉపయోగిస్తూ మాడ్యూల్‍ని భూమి పైకి తెస్తారు. నౌక పసిఫిక్ మహాసముద్రంలో దిగగానే, మాడ్యూల్ నుంచి వ్యోమగాముల్ని బయటకీ తీసి సిద్ధంగా ఉన్న షిప్ లోకి ఎక్కిస్తారు. మిషన్ విజయవంతమైనప్పటికీ, నీల్, యూరీలను పోగొట్టుకోవడం అందరికీ బాధగా ఉంటుంది. వాళ్లిద్దరి కోసం సంస్మరణ కార్యక్రమాలు జరుగుతాయి. వారి శిలావిగ్రహాలను నెలకొల్పుతారు. – ఇక చదవండి.]

ప్రకరణం-6: తరాల కోసం చరిత్ర/తరతరాల చరిత్ర

[dropcap]అ[/dropcap]రుణ గ్రహానికి పొంచి ఉన్న పెనుముప్పును తొలగించడానికి MSM 6 చేసిన బృహత్ ప్రయత్నాలు ఒక ఒడెస్సీ లాంటివి. గ్రీకుల చరిత్రలని ఒక మహా యుద్ధం ఒడెస్సీ. ఒడెస్సీ అంటే సుదీర్ఘ యాత్ర అని అర్థం. హోమర్ అనే ఒక మహాకవి ఆ కావ్యాన్ని రాశాడు. MSM 6 యొక్క సాహస యాత్ర కూడ అలాంటిదే. దాన్ని ఎప్పుడూ ప్రపంచం మరిచిపోలేదు.

1970వ సంవత్సరం మధ్యలో, ఆ మిషన్ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత, ఆ కథలు కొత్త తరానికి చేరాయి. 2000 సంవత్సరం తొలినాళ్లలో అప్పటి గొప్ప సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులు భూమి మీద ఇంకా సజీవులై ఉన్నారు.

మానవత భవిష్యత్తు కోసం చేసే యుద్ధంలో ప్రపంచమంతా ఏకమైన అరుదైన సందర్భం 1970లో వచ్చింది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించగానే, ఎన్నో విధానాలు, ఎన్నో కుట్రలు ఉద్భవించాయి. ప్రపంచమే తనకు తాను ఒక శత్రువైంది. రష్యానా, అమెరికానా అన్నదిపోయి, మార్స్‌ను రక్షించడమా, రక్షించకపోవడమా అన్నదే ప్రధానంగా నిలిచింది.

చాలామంది మార్స్ పరిరక్షణకు వ్యతిరేకంగా ఉన్నారు. చాలామంది ఆ ప్రమాదాన్ని పట్టించుకోలేదు పైగా అది వనరులు, డబ్బు దండగయ్యే కార్యక్రమం అన్నారు. ఆ మిషన్ వల్ల ఒనగూడేదేదీ లేదని, చాలామంది కొక అవిశ్వాసం ఉండేది. దీన్నంతటినీ అధిగమించి, కొందరు గట్టిగా నిలబడ్డారు. గట్టిగా నిననించారు. “కుదరదు! మార్స్‌ను రక్షించాల్సిందే!” అని! నాశనం అయితేనేం, మార్స్ మనది కాదు కదా అన్నవాదనలు కూడా వచ్చాయి. కాని అది మొత్తం ప్రపంచానికి సంబంధించిన విషయం.

ప్రపంచానికి ఎదురైన ఈ ఉపద్రవం అంతరిక్ష పోటీని అర్ధాంతరంగా ఒక ముగింపుకు తెచ్చింది. అమెరికా రష్యాలే కాకుండా, ప్రతి ఒక్కరూ ఏది ముఖ్యమో దానిపై తమ దృష్టిని పెట్టారు. ఒక స్థాయిలో కొందరు ఆ ప్రమాదాన్ని, మరింత అధికారం సంపాదించి, ప్రపంచాన్ని పాలించాలనే దురూహకు వాడుకోవాలని కూడా భావించారు. కాని ప్రపంచం వారి ఆటలు సాగనివ్వలేదు. విశ్వ జనావళి నేత్రాలు తెరుచుకొనే ఉన్నాయి విశాలంగా. అన్ని దేశాలు ఐక్యంగా ఉండాలని అవి డిమాండ్ చేశాయి. దాన్ని సాధించాయి. వారి ఆక్రోశం, వారి నిధుల సమకూర్పు, MSM కార్యక్రమం, అన్నీ సద్వినియోగమయ్యాయి, ఏం చేయాలో నిర్ణయించడానికి అన్ని దేశాలు కలసి కూర్చున్న ఆ రోజున.

మార్స్‌ను రక్షించే మహాకార్యం మొదలుపెట్టినప్పుడు వినూత్నమైన ఆనందం, ఉత్సవశోభ వెల్లివిరిశాయి. ప్రజలు రాత్రింబగళ్లు అవిశ్రాంతంగా శ్రమించారు. ఒకప్పటి తమ శత్రువులతో కూడా పనిచేశారు. ఆ క్రమంలో ఎన్నో విశిష్టమైన పరిశోధనాత్మక కార్యకలాపాలు ఊపందుకొన్నాయి. ఒక మిషన్ విజయవంతం కావాలంటే, సరైన టీమును ఎన్నుకోవడం అనేది అతి ముఖ్యం. అదేదో అంతరిక్షంలోకి ఏ కారణం లేకుండా ఎగిరిపోయేది కాదు కదా, ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా. రెడ్ ప్లానె‍ట్‌కు ఎదురైన విపత్తును తొలగించడానికి వేసిన బృహత్ప్రణాళిక అది.

దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రపంచం, అత్యంత శక్తివంతమైన దేశాల నుండి అత్యుత్తములైన వారిని ఆ సమయంలో ఎంచుకుంది. ఒక సమతౌల్యతను సాధించడం కోసం, ఆ శక్తివంతమైన దేశాలతో నేరుగా సంబంధాలున్నవారిని కూడా ఎంచుకుంది. చివరగా ఇతర దేశాల నుండి సైతం అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తను, పోగ్రామర్స్‌ను ఎన్నిక చేసుకుంది. ఇలాంటి బ్యాలెన్సును సాధించి, ప్రపంచం సంతోషించింది

ఒకే ఒక లక్ష్యంతో మిషన్ సిబ్బంది అంతరిక్షంలోకి ప్రవేశించారు. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత వారు మిషన్ లోని పరాకాష్ట దశకు చేరుకోగలిగారు. ఒక చిన్న తప్పు లెక్క వల్ల, విఫలమయ్యారు. కొన్ని క్షణాలపాటు, ఆ మిషన్ అసాధ్యమని, కాలం, వనరులు దానివల్ల వ్యర్థమని అన్నవారి పరిహాసానికి పాత్రులయ్యారు.

ఈ నవ్విన వాళ్లంతా తెలివితక్కువవాళ్లని కాదు. మార్స్ గ్రహాన్ని రక్షించడం లోని ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారు, గుర్తించలేకపోయారంతే. ఇది దేన్ని గుర్తుకు తెస్తుందంటే 1901లో ఒక ప్రముఖ మేధావి, విల్బర్ రైట్ చేసిన ఒక పిచ్చి ప్రేలాపనను. “మనుషులు అంతరిక్షంలోకి ఎగరాలంటే మరో వెయ్యి సంవత్సరాలైనా సరిపోదు!” అంత తెలివైన వ్యక్తి అంత తెలివి తక్కువగా ఎలా మాట్లాడాడో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.

ఇక, మార్స్‌ను మనం రక్షించలేము, ఆ ప్రయత్నం కూడా చెయ్యకూడదు అనేవారి దగ్గర కెళదాం. ప్రపంచం అదృష్టం, విశ్వం ముఖంలో చిరునవ్వు మెరిసింది కాబట్టి సరిపోయింది. ఆ వ్యోమనౌకలోని ఇద్దరు మొనగాళ్లు, మొదటి ప్రయత్నం విఫలమైన తర్వాత కూడా ఇంకా ఏమైనా చేయవచ్చునని దృఢంగా నమ్మారు. ఆ క్రమంలో వారి ప్రాణాలను పణం పెట్టాల్సి వస్తుందని వారికి తెలుసు. ఆలోచించడానికీ భయపడాల్సిన క్షణాలవి. కాని వారు ఏ మాత్రం జంకకుండా ముందుకు దూసుకుపోయారు.

అది పనిచేసింది. జరగాల్సిన మంచి జరిగింది. వారి త్యాగం వమ్ము కాలేదు. వారి మిషన్ విజయవంతమైంది; వారి బృంద సభ్యుల సహకారం కూడా అందులో చాలా ఉంది. వారు తాము సాధించింది చూడటానికి ఇక లేరు. వారు గనుక బ్రతికి ఉండి ఉంటే, మానవ జాతిని కాపాడాటానికి పూర్తి విశ్వాసంతో వారు ముందుకు దూకే అవకాశం కల్గినందుకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పేవారేమో?

వారి త్యాగాల గాథను ఎన్నటికీ మరువలేం. దాని వల్ల ప్రపంచ ప్రజలకు ఒక సవాలు! వారి మరణాలు మానవజాతికి రాసిన ఒక లేఖ లాంటివి. ఆ లేఖ ఇది. “మార్స్‌ను వివేకంతో ఉపయోగించుకోండి! ఐక్యంగా ఉండండి! ముందు ముందు మీ అందర్నీ కలిపి ఉంచే బంధం చాలా ఉంది!” వారి గౌరవార్థం, వారి స్మారకార్థం, వారి మంచి పనులను త్యాగాన్ని గుర్తుచేసుకోవడానికి ఒక విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. వారు ఎరుపురంగులోని మార్స్ కోసం పోరాటం చేశారు. వారు చీకట్లోకి అదృశ్యమై, భూమి మీది ప్రజలకు వెలుగు రేఖలను పంచారు.

వారి కటుంబాలు విలపించాయి, వారి స్నేహితులు సంతాపం చెందారు. ఆ యోధులు మనకు దక్కలేదని విశ్వం ఆక్రోశించింది. కాని 1970 ప్రారంభంలో జరిగిన, ఎవరూ ఊహించని, ఆ సంభటన రాబోయే గొప్ప విషయానికి నాంది.

చాలా దశాబ్దాల తర్వాత, మానవ జాతి కోసం ఒక గొప్ప ముందడుగు పడిన తర్వాత చాలా కాలానికి, నీల్ బ్యారీ, యూరీ ఇవానోవ్‌ల త్యాగాలు ఇంకా పచ్చిగానే జనం స్మృతిలో ఉండగానే, వాటిని మరింత పదిలపరచే రీతిలో, గొప్ప గొప్ప విజయాలు సాధించడం కోసం, ఎన్నో ప్రణాళికలు, ప్రోగ్రాములు రూపొందించబడసాగాయి. వారి అమరత్వం ఎన్నటికీ విస్మరించబడదు, వృథా పోదు. వారి త్యాగాల తీవ్రత అలాంటిది. వాటికి కొంత కాలం తర్వాతే తొలి మానవుడు చంద్రుని మీద కాలు మోపాడు. అదే రాబోయే విజయాలకు తొలిమెట్టు.

సంవత్సరాల తరబడి MSM 6 యొక్క కథ జనం నోళ్లలో నానుతూనే ఉంది. వారి దీర్ఘ విజయయాత్ర పరమాద్భుతమైనదిగా, ఏ విజయవంతమైన విషయానికైనా పునాదిగా పరిగణించబడుతూంది. ఇక మీడియా ఐతే చెప్పనక్కరలేదు. ఆ యాత్ర గురించి, నిరంతరంగా, దానికి అంతమేలేనట్లు, ప్రస్తావిస్తూనే ఉంది. ఒక దశ నుండి మరో దశ వరకు దానిని జనం స్మరిస్తూనే ఉన్నారు. ప్రస్తుత తరంతో బాటు రాబోయే తరం కూడా దాని నుండి స్ఫూర్తి పొందుతూ ఉన్నారు.

ఆ ఇద్దరు గొప్పవాళ్ల కుటుంబాలు, వారి విజయ త్యాగాల వల్ల చాలా చాలా నష్టపోయాయి. వారి భార్యలిద్దరూ వితంతువులయ్యారు. కానీ మానవతను వారు కాపాడారు. వారి భర్తల త్యాగం వల్ల ఉత్పన్నమైన ఒక ప్రపంచవ్యాప్తమైన ఉత్సాహం, ఆసక్తి, వారి దుఃఖాన్ని కొంతవరకు ఉపశమింపచేసింది. నీల్ బ్యారీ, యూరీ ఇవానోవ్‍ల పిల్లలు, వారి నాన్నలు లేకుండానే పెరిగినా, వారి చెవుల్లో, అనునిత్యం, వారి నాన్నల విజయగాథలు మారుమోగుతూనే ఉండేవి.

స్కూల్లో వాళ్ల నాన్నల గురించి వారి పాఠ్యపుస్తకాలతో చదువుకున్నారా పిల్లలు. ఎన్నో క్లాసులో పాఠాలు విన్నారు. ఎవరైనా ఒక ఉపన్యాసం ఇస్తే, వాళ్ల నాన్నల పేర్లు, వారి త్యాగాల  ప్రస్తావించిన మీదటే, దాన్ని వారు కొనసాగించేవారు

వారి చిన్న వయసు నుండే, వారి కుటుంబాల వారసులను ఒక జాతీయసంపదగా గౌరవించడం మొదలైంది. వారిని కూడా, భావి విశ్వమానవులుగా, వారి తండ్రులకు ప్రతిరూపాలుగా జనం చూసేవారు.

వారు చదివే సూళ్లు కూడా గొప్ప గుర్తింపును పొందాయి. అంతా వారి త్యాగాల చుట్టే పరిభ్రమిస్తుంది అంటే అతిశయోక్తి కాదు.

గొప్ప శక్తి అధికారంతో పాటు వాటి వెంట గొప్ప బాధ్యలు కూడా వస్తాయని పెద్దలు అంటూ ఉంటారు. నీల్, యూరీలకు ఆ అధికారం, అవకాశం వచ్చాయి. మానవ జాతి భారాన్ని తమ భుజాల మీద మోయాల్సిన బాధ్యతలు కూడా! ఏ మాత్రం జంకకుండా, ఎటువంటి ఫిర్యాదులు చేయకుండా, వారికి నియోగించబడిన పని కన్నా వారు ఎక్కువే చేసి చూపారు.

కొందరయితే జీసస్ క్రైస్ట్ చర్యలతో వారి చర్యలను పోల్చేంత వరకు వెళ్లారు. కాని కొందరు జీసస్ చర్యలు మరింత గొప్పవన్నారు

ఇరు కుటుంబాల్లోని పిల్లలు కూడా వ్యోమగాములవడానికి సిద్ధపడుతూ ఉండడాన్ని చూసిన వారికి అది అంత ఆశ్చర్యమనిపించ లేదు. వారిలో కొందరు నేరుగా వ్యోమగాములు కావడం కోసం ప్రయత్నించ లేదు, కాని ‘స్పేస్ మిషన్’ అన్న మహావృక్షం గొడుగు నీడలో వారు తల దాచుకున్నారు. వారి తండ్రుల అడుగు జాడలలో పయనించి, మార్స్ గ్రహాన్ని నివాసయోగ్యంగా మార్చగల మహా కార్యంలో వారు విజయాన్ని సాధించాలనే కృతనిశ్చయంతో, వారి ప్రయత్నాలను సాగిస్తున్నారు.

‘మార్స్ మిషన్’ను సాకారం చేస్తున్న క్రమంలో, అందరూ దాని పట్ల క్రేజ్ పెంచుకున్నారు. దానికి ముందే, అన్ని దేశాలూ దానికి సహకరించాలన్న కోరిక ఊపందుకుంది. అమెరికా రష్యాల మధ్య ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం, అసలు మొదలు కానట్లే అంతమైంది. దానికి ‘కోల్డ్ వార్’ అని పేరు పెట్టినవాడు జార్జ్ ఆర్వెల్. 1945లో ఆయన రాసిన ఒక వ్యాసంలో దానిని ప్రస్తావించారు. అగ్రరాజ్యాలు రెండూ ప్రత్యక్షంగా తలపడకుండా, ముఖ్యమైన ప్రాంతీయ సంఘర్షణలలో, ఒకరు ఒక పక్షానికి మద్దతిస్తే, ఇంకొకరు వారి వైరి పక్షం వైపు కొమ్ముకాసేవారు. ఇలాంటి యుద్ధాలనే proxy wars అని పిలిచేవారు. అలాంటి కోల్డ్ వార్ లేని సమయంలో దేశాలన్నీ ఒకదానితో ఒకటి ఏకీకృతం కాసాగాయి.

అమెరికా, రష్యాలాంటి అత్యంత శక్తివంతమైన దేశాలే అంత చైతన్యంతో ప్రపంచాన్ని రక్షించాలని నడుం కట్టడం ఇతర దేశాలకు గొప్ప ప్రేరణగా నిలిచింది. దానికి కారణం కోసం వెనక్కి వెళితే, అది నీల్ బ్యారీ, యూరీ ఇవానోవ్‌ల తోనే మొదలైందని చెప్పవచ్చు. 1970లో, వ్యోమనౌక వారి అనన్య సహకారం గురించి MSM 6 అని ఇతర సిబ్బంది ఎంత మాట్లాడుకున్నా వారికి తనివి తీరేది కాదు.

ఇరవై ఒకటవ శతాబ్దంలో బి.బి.సి వారు ఒక కార్యక్రమం ప్రసారం చేశారు. అందులో, MSM 6 లో పాల్గొన్న సిబ్బందిని ఆహ్వానించి, ఆ మిషన్ గురించి, అప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడమని అడిగారు.

ఆ సిబ్బందితో బాటు, వేదిక మీదికి ఆహ్వానించబడిన వారు నాసా అధిపతి మిస్టర్ బ్రియాన్, ప్రొఫెసర్ ఫ్రాన్సిస్, ఎలాషా, అలెక్సిస్ ఇంకా మిస్టర్ గారిసన్.

ఆ కార్యక్రమం ‘లైవ్’ లో టెలివిజన్, రేడియో లతో ప్రసారమైంది. ఇంకా అనేక సామాజిక మాధ్యమాలతో బాటు. సాంకేతికత లోని విస్తృత అభివృద్ధి కారణంగా ఆ కార్యక్రమం భూమ్మీద ఉన్న అన్ని మూలలకు, అన్నిరకాల వ్యక్తులకు చేరింది. భూలోకవాసులపై ఆ బృందం చూపిన ప్రభావం లోక విదితం కాబట్టి, ప్రతి ఒక్కరూ వారేం చెబుతారో అని ఆసక్తితో ఎదురుచూశారు.

ఆహ్వానితుల్లో కొందరు అప్పటికి ఎనభైల చివర్లో ఉన్నవారే. కాని ఆశ్చర్యకరంగా, వారంతా ఇంకా చురుకుగానే ఉన్నారు. వారందరికీ పిల్లలున్నారు. కార్యక్రమం తిన్నగానీ మొదలైంది. ఇంటర్వ్యూ చేసేవారు మొదట్లు తమ ప్రశ్నలను సున్నితంగానే సంధించినా, క్రమంగా తీవ్రత పెంచారు

మొదటి ప్రశ్న రాకేష్ కృష్ణకు. “చెప్పండి . మార్స్‌ను పరిరక్షించి, మానవ జాతిని కాపాడడానికి ఉద్దేశించిన ఆ మిషన్‌లో పాల్గొని సిబ్బందిని నియమించే క్రమంలో మీ పేరు పరిగణనలోకి తీసుకున్నప్పుడు మీకేమనిపించింది?”

కృష్ణ సమాధానం చెప్పడానికి సంతోషించాడు.

“మీరు అన్న రోజు నేను నా కుటుంబంతో ఉన్నాను, పని చేసుకుంటూ. ప్రొఫెసర్ గారు, మిషన్‌కు ప్రాతినిధ్యం వహించే వారి పేర్లు పిలుస్తూ ఉండగా, మా కళ్ళు టి.వి తెరకు అతుక్కుపోయాయి. అసలు నా పేరు అందులో ఉంటుందని నేను కొంచెమైనా ఊహించ లేదంటే నమ్మండి. అది అసాధ్యం అని నాకు తెలుసు. నలుపు తెలుపు టివి తెరపై నా ప్రొఫైల్ వస్తున్నప్పుడు కూడా, నాకే కాదు, నా సహచరులకు కూడా అనుమానం గానీ ఉంది. అందరం దిగ్భ్రాంతికి లోనయ్యాం,” అని వివరించాడు కృష్ణ.

“ఆయన నా పేరును ‘ఎన్నికయింది’ అని చెప్పినప్పుడు అంతకంటే గొప్ప ఆనందాన్ని నేనెప్పుడూ అనుభవించ లేదంటే నమ్మండి. నాకంటే ఎక్కువగా నాతో పని చేస్తున్న సహచరులు పొంగిపోయారు. భారతదేశంలో, నేను పెరిగిన ఆ చిన్న పల్లెటూర్లో, నేనొక ‘హీరో’నయ్యాను. ప్రపంచ యవనికపై, నాదైన ముద్ర వేయడానికి అవకాశం కలిగినందుకు నేను చాలా సంతోషించాను. ప్రపంచం తరపున మార్స్‌కు వెళ్ళే అన్వేషణలో, పరిశోధనలో, ఆ చారిత్రిక బృందంలో భాగమైనందుకు, నన్ను నేను ఒక గొప్ప ఇతిహాసానికి వారసుడిగా భావించుకున్నాను.”

“అది నిజంగా ఉద్విగ్నవంతమైన క్షణం” అన్నాడు ఇంటర్వ్యూ చేసే ఆయన. కృష్ణ మాట్లాడుతున్నంత సేపూ ఆయన ముఖం మీద చిరునవ్వు వెలుగుతూనే ఉంది. ఎంతో మంది ముఖాలపై విరిసిన చిరునవ్వుకు ఆయన ప్రతినిధి.

తర్వాత మరో ప్రశ్నను అడిగాడు “కీర్తిశేషులైన నీల్, యూరీ గార్లను గురించి ఎవరయినా మాట్లాడాలను కుంటున్నారా?”

వెంటనే శాటో చెయ్యెత్తింది, అలాంటి అవకాశం కోసమే తాను ఓపికగా ఎదురు చూస్తున్నట్లు.

“ఓ.కె. చెప్పండి శ్రీమతి శాటో!”

“మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మొదట మీకు అందరికీ మా ధన్యవాదాలు.” అంటూ ప్రారంభించిందామె. “ప్రపంచానికి తమదైన అద్భుత ప్రభావం చూపిన, ఇంతవరకు భూమి మీద నడయాడిన వారిలో అత్యంత గొప్పవారయిన ఇద్దరి గురించి మాట్లాడే అవకాశం నాకు రావడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నేను చిన్నవారైన నా పిల్లలతో మాట్లాడినపుడల్లా, వారిద్దరి గురించే చెబుతాను. మేమందరం ఆ వ్యోమనౌకలో, రోజుల తరబడి ఆ అణుధార్మిక వ్యర్థాల నౌక వెంట వెళుతూ ఉన్నప్పుడు, మా అందరి మధ్య ఒక ఆత్మీయ బంధం బలపడింది” ఆమె కాసేపాగి మళ్లీ కొనసాగించింది.

“అప్పుడే వాళ్లిద్దరి గురించి నాకు ఎంతో తెలిసింది. వాళ్ల పట్టుదల గల వ్యక్తులు. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొని, వాటిని అధిగమించే విధంగా తమను తాము తీర్చిదిద్దుకున్నారు. వారు పొదున్నే నిద్రలేవడం, ప్రార్థన లేదా ధ్యానం చేసుకోవడం లాంటి అందరూ చేసే విషయాల కంటే, మరింత గొప్ప అలవాట్లను వారు అలవరచుకున్నారు.

వారిద్దరూ విభిన్న నేపథ్యాలకు చెందినవారు. పరస్పరం పొసగని రెండు విభిన్న దేశాల పౌరులు. వారు ఒకరినొకరు ద్వేషించుకోడానికి ఈ కారణం చాలు. కానీ వారు ఆ ఆలోచననే మనసులోకి రానివ్వలేదు. పైగా, వారిద్దరూ దగ్గరవడానికి అదీ ముఖ్యకారణం. వారి వైవిధ్యమే వారికి ప్రేరణయింది.”

ఆమె కాసేపాగి ఇంటర్వ్యూ చేసే అతని కళ్లలోకి చూసింది. తాను సరియైన పంధా లోనే వెళుతున్నానా లేదా అని చెప్పమన్నట్లుగా. ఆమె కరెక్ట్ గానే చెబుతూంది. అతని కళ్లు ఆమె మీద నిలిచాయి. ఆమె మళ్లీ కెమెరా వైపు తిరిగి, వీక్షకుల కళ్లలోకి చూస్తున్నట్లుగా, తన మాటలు కొనసాగించింది.

“నీల్, మూడవ రోజు ఉదయం నాతో అన్నాడు – ‘వైవిధ్యాన్ని స్వీకరించాలి. భేదాలే లేకపోతే ఈ ప్రపంచం మొత్తం కేవలం తెల్లరంగుతో నిండిపోతుంది. తెలుపు తప్ప వేరే రంగులే లేనట్లు ఊహించుకుంటే, అది ఎంత అసహజంగా ఉంటుంది? అలాంటి భావాల గురించి నేను ఎంతగానో ఆలోచించాను. మన దేశాల మధ్య ఏర్పడిన ప్రస్తుత ఐక్యతను మనం అలాగే మెయిన్‌టెయిన్ చేయాలి. సహకారాన్ని మనందరి ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి?’ అని. వారిద్దరూ దాన్ని సాకారం చేసి చూపారు. మనకో దారి ఏర్పరచారు. మనం చేయాల్సిందల్లా ఆ మార్గంపై స్థిరంగా క్రమంగా సాగిపోవడమే. అప్పుడు మనకు అవరోధమనేదే ఉండదు.”

ఆమె మాటలు కొందరి కళ్లతో నీళ్లు తెప్పించాయి. వాటిని వాళ్ళు తుడిచేసుకున్నారు.

“అదీ విషయం! విశ్వంలోని లోలోతు పొరల నుండి మీ కోసం బయటకు తెచ్చినది! వైవిధ్యాన్ని స్వీకరిద్దాం, అందరం కలిసి ఉందాం” మరింత నొక్కి చెప్పాడు ఇంటర్వ్యూ చేసేంతను.

తర్వాత ప్రశ్న అడిగాడిలా – “వారి త్యాగాల గురించి మీ భావన ఏమిటి? వాటివల్ల మనకు ఏదైనా మంచి జరిగిందని అనుకుంటున్నారా?”

“అది చాలా అసహజమైనదని నేను ఒప్పుకోవాలి, మీరు అనుమతిస్తే..” అన్నాడు వ్లాడిమిర్ తన బొంగురు గొంతుతో.

“అవును నిజమే!” అన్నాడు ఇంటర్వ్యూ చేసే ప్రయోక్త, చిరునవ్వుతో.

“నేను మాట్లాడవచ్చా,” అంటూ ప్రారంభించాడు గ్యారిసన్. “మార్స్‌కు సాహసయాత్ర, ఆగదు. కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటినుంచి మరో రెండు సంవత్సరాలు కావచ్చు, లేదా దశాబ్దాలు కావచ్చు. ఖచ్చితంగా చెప్పలేను కాని, మార్స్ జనంతో నిండే రోజు రాబోతుంది.”

“వావ్! ఇది కొత్త సమాచారం.”

“ప్రస్తుతానికి ఇది కొత్త సమాచారం ఏమీ కాదు. ఎన్నో ప్రణాళికలు వేస్తున్నారు. దేశాలన్నీ కలిసి కూర్చుని ఆలోచించడమే తరువాయి. 1970 మిషన్ నుండి, మార్స్ గ్రహన్ని నివాసయోగ్యంగా చేయడానికి పథకాలు రచిస్తూనే ఉన్నారు. మరిన్ని ప్రణాళికలు ముందుకు తెస్తున్నారు.”

“ప్రపంచ జనాభా వేగంగా పెరుగుతూంది. ఆర్థికంగా బలమైన, విపరీతంగా పెరుగుతున్న నగరాలయితే జనంతో కిటకిటలాడుతున్నాయి. పెరుగుతున్న ప్రపంచ జనాభాకు మనం భూమాత నుంచి బయటకు తీస్తున్న వనరులు కరిగిపోతున్నాయి. భూమి, తనలోని శిలాజ ఇంధనాలను, ప్రకృతి వనరులను అన్నింటినీ పోగు చేసుకోడానికి వేల సంవత్సరాలు పట్టింది. కాని కేవలం కొన్ని శతాబ్దాల కాలంలోనే మనం వాటిలో సగాన్ని వాడుకున్నాం” అని అగి, పక్కన ఉన్న నీళ్ల బాటిల్ తీసుకున్నాడు.

“నేను చెప్పేది ఒకటే! నీల్ బ్యారీ, యూరీ ఇవానోవ్‌ల త్యాగాలు వృథా కాకూడదు. అలా కాకుండా, ఒక పక్కా ప్రణాళికను మనం నిర్ధారించుకోవాలి. అరుణగ్రహానికి వలస వెళ్లడానికి మానవ జాతి సిద్ధంగా ఉంది. త్వరలో అది అందరికీ చర్చనీయాంశం అవుతుంది; ఈ ప్రణాళికలో కొంచెం ఇబ్బందులున్నప్పటికీ..”

“ఏమిటో ఇబ్బంది?” అనడిగాడు ప్రయోక్త.

“అలా అడిగినందుకు కృతజ్ఞతలు. ప్రపంచం మార్స్ మిషన్‌ను ఒక విశ్వప్రణాళికగా ఏ మాత్రం చూడడం లేదు. దాన్ని పాశ్చాత్య దేశాల వారి ప్లానుగా చిత్రీకరిస్తున్నారు. అది అలా భావించబడటానికి అస్సలు వీలు లేదు. మిగతా ప్రపంచం గనుక మద్దతు ఇవ్వకపోతే, కోరిన ఫలితాలు సాధించడంలో కష్టాలు ఎదురవుతాయి. దానిని కేవలం పాశ్చాత్యుల మిషన్‌గా చూడకూడదు అనటానికి చాలా కారణాలున్నాయి. నేను చెప్పే మొదటి కారణం, కావలసిన వనరులు. మిషన్ మార్స్‌ను ఆషామాషీ వ్యవహారంగా తీసుకోకూడదు. మొత్తం ప్రపంచమంతా దానికి సహకరించాల్సిన విషయమిది. 1970లో అందరూ ఎలా ఏకమయ్యారో అలా.

ప్రపంచ దేశాలన్నీ పాలుపంచుకోవాల్సిన భవిష్యత్ ప్రాజెక్టు ఇది. రెండవది, పాశ్చాత్యులు మాత్రమే ప్రపంచపు మనుగడ కోసం దోహదం చేయడం లేదు. అప్పుడు కేవలం వారే ఈ గ్రహాన్ని ఎందుకు ఎంజాయ్ చేయాలి? నైజీరియా లాంటి దేశాన్నే తీసుకొందాం. దాని జనాభా విపరీతంగా పెరుగుతుంది. లాగోస్ జనాభా, దాని ఆర్థిక వ్యవస్థ ఎంత, దాని జనాభా పన్నెండు మిలియన్లు. జనాభా తగ్గాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని అది తగ్గే సూచనలు కనబడడం లేదు. పరిస్థితి అలా ఉంది. మార్స్ గ్రహన్ని నివాసయోగ్యంగా మలిచే మహా ప్రయత్నంలో అన్ని దేశాల భాగస్వామ్యమూ ఉండి తీరాలి.

మూడవది, సాధ్యమైన తర్వాత, పాశ్చాత్యులందరూ మార్స్ గ్రహం మీదికి తరలి వెళ్లారని కాసేపు ఊహిద్దాం. మిగిలిన ప్రపంచంలోని నాగరికతలు, సంస్కృతులు ఎక్కడ ఉంటాయి? నా అభిప్రాయంలో, అది భయంకరమైన పెరుగుదల. ఈ రోజు ఈ కార్యక్రమం అన్నిదేశాలకూ లైవ్ ప్రసారం చేయబడుతూ ఉండటం మంచిదైంది. ఎందుకంటే ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి కదా! 1970లో మాదిరిగానే అన్ని దేశాలు ఒకటిగా, పెట్టుబడి పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. ఏ దేశం కూడా తమ పెట్టుబడి వృథా అయిందని ఫిర్యాదు చేయదనే నా విశ్వాసం. అది ఈసారి మిషన్ విజయానికి స్పష్టమైన సూచన.

కాబట్టి, వారి త్యాగానికి ఏమైనా విలువ ఉందా అని మీరడిగిన ప్రశ్నకు జవాబు మీ కళ్ల ఎదురుగానే ఉంది” అని ముగించాడు గ్యారిసన్.

ఆయన ఆ ప్రశ్నకు ఇచ్చిన సమాధానాన్ని విని, మిగిలిన సిబ్బంది సంతోషించారు. కరతాళ ధ్వనులు చేయకుండా ఉండలేకపోయారు.

ప్రయోక్త ఇలా అన్నాడు – “ఎంతో అవగాహనతో కూడిన మీ భాషణానికి కృతజ్ఞతలు, గ్యారిసన్ గారు. నీల్ బ్యారీ, యూరీ ఇవానోవ్‌లను ఏ కారణం లేకుండానే మానవజాతికి రక్షకులుగా పేర్కొనడం లేదు మనం అన్నది రూఢి అయింది. వారి అద్భుత వారసత్వం బలమైన పునాదుల మీద నిర్మించబడుతూ ఉందని తెలుసుకున్నాం. ఇది చాలా మంచి విషయం.”

“అవును అది అక్షరాలా నిజం!”

“ఈ సెషన్‌లో, చివరిదాని కంటే ముందు భాగానికి వచ్చాం. ఇప్పుడు చాలా సంవత్సరాలుగా ఎంతో మంది మదిలో మెదులుతున్న ప్రశ్నను అడుగుతాను. ఎంతో కాలం నుండి సాగుతూన్న ఉహాగానాల ఆధారంగా ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. అది మళ్లించబడిన చోటు నుండి అణువ్యర్థాల నౌక మళ్లీ భూమికి తిరిగివస్తుందని ఊహించారు. ఊహిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం?”

గదిలోని స్త్రీపురుషుల నుండి విడివిడిగా సమాధానాలు రాసాగాయి. కొందరు “అవును అది నిజం!” అన్నారు. కొందరు కేవలం “అవును” అన్నారు.

“దీనికి నేను జవాబు చెప్పాలని భావిస్తున్నాను” అన్నది శాటో. అడిగిన ప్రశ్న స్వభావాన్ని బట్టి ఆమె దానికి తగిన వ్యక్తి అని అదివరకే స్పష్టమైంది. ఆమె ఇలా అంది –

“అది కేవలం ఊహ కాదు. అప్పుడు సూచించబడిన ఫలితాలులో అదీ ఒకటి. జనానికి అది అంత బాగా గుర్తుందో లేదో నాకంతగా తెలియదు గాని, ఆ అణువ్యర్థాల నౌక తిరిగివస్తుందని అప్పుడే చెప్పారు.”

“ఒక వృత్తి నిపుణురాలి నుండి దీన్ని నేను మొదటిసారిగా వింటున్నా” అన్నాడు ప్రయోక్త, స్వల్పంగా నవ్వుతూ.

“సరే, నేనిక్కడే కదా ఉన్నా. మా లెక్కల ప్రకారం, ఆ వ్యర్థాల వ్యోమనౌక, సరిగ్గా ఒక దశాబ్దం తరువాత, అంటే 2070లో తిరిగి వస్తుందని అంచనా. దాని కంటే ముందే, దాన్ని డీల్ చేయడానికి మనం సర్వసన్నద్ధంగా ఉండాలి. అప్పటికెలాగూ మరింత సాంకేతికంగా పురోగమించి ఉంటాం. మార్స్ మిషన్ ఎందుకంత ప్రాముఖ్యత గలది అన్నదానికి అదీ ఒక కారణం. మార్క్ గ్రహంపై, ఒక అభివృద్ధి చెందిన సమాజం ఉండి, దాని సహకారం మనకుంటే, మన పని మరింత సులువు అవుతుంది. మనం సర్వశక్తులూ ఒడ్డి, దాన్ని ఎదుర్కోగలం.”

“కాబట్టి, అవును అది నిజమే! అది రావడానికి ఒక దశాబ్దం పట్టవచ్చని అంచనా. అప్పటికి మనం సాధించే సాంకేతిక ప్రగతిని బట్టి, ప్రపంచ ప్రజలు దాన్ని గురించి పెద్దగా అందోళన పడాల్సిన అవసరంలేదు. ఆ ఆపదను పూర్తిగా మనం అధిగమించవచ్చు.”

“సరే. వినడానికి బాగుంది. కాబట్టి ప్రపంచ ప్రజలారా, కంగారు పడకండి. అంతా అదుపులోనే ఉంది.. ఓహ్..” ప్రయోక్త ఏదో గుర్తొచ్చినట్లు అగాడు. ఇలా అన్నాడు. “లెక్కల్లో ఏ తప్పు ఉండదనీ, అనుకున్నదాని కంటే ముందే ఆ వ్యర్థాల నౌక తిరిగిరాదనీ నమ్ముదాం.”

“ఖచ్చితంగా రాదు. అది సాధ్యం” అన్నది శాటో. “ఆ క్యాల్కులేషన్స్ చేసింది నేనే. దాని వివరాలు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి.”

“సరే! కాబట్టి వీక్షకులారా అదీ సంగతి! ఈ కార్యక్రమాన్ని ఇక ముగిద్దాం. దానికి ముందొక ప్రశ్న. యువతరం ఈ విషయంలో ఇంకా ఏం తెలుసుకోవాలని మీరనుకుంటున్నారు?”

మొదట, బృందంలో ఒక సుందరమైన మర్యాద! అందరి కళ్లూ ప్రొఫెసర్ ఫాన్సిస్ మీద నిలిచాయి. ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగిన సమర్థుడు, ఆ పదవికి వన్నెతెచ్చిన విశిష్ట వ్యక్తి ఆయనే మరి.

“ఈ తరం వారేం తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు తెలుసు. అది MSM 6 గురించే కదా? అంతేనా?”

“ఖచ్చితంగా అదే సర్” అన్నాడు ప్రయోక్త.

“ఓ.కే. మొదటగా, ఈ తరాన్ని ప్రశంసించాల్సి ఉంది. వారు చక్కగా తమ పని తాము చేశారు. ఇంతవరకు నాకు తెలిసిన దాన్ని బట్టి, యువతరం వారు, నా క్రింద నేరుగా పని చేసినవారు, మితభాషులు, నిరంతరం నేర్చుకోడానికి సిద్ధంగా ఉండేవారు. వారి మనస్సు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. వారికి బోధించే వారి పని ఎంతో సులభం. ఏది చెప్పినా యువకులు ఇట్టి గ్రహించేస్తారు.

అలాంటి యువశక్తి మనకుండడం, వారికా స్ఫూర్తి ఉండటం అద్భుతం. అవసరమైన జ్ఞానాన్ని సమకూర్చుకోవడంలో వారి జిజ్ఞాస, ఉత్సుకత ఎంతో గొప్పవి. ఇక వారి గతం గురించి చెప్పాలంటే, వారు మన తరం వారి కంటే ఎక్కువ శోధించే తత్త్వం గలిగిన వారని చెప్పవచ్చు. వారికి లభ్యమైన అన్ని పేపర్లు రీసర్చ్ లాగ్‌లు, చరిత్ర పుస్తకాలు వారు క్షుణ్ణంగా చదివారు.

ప్రస్తుతం, మనం పోగుచేసుకున్న జ్ఞానాన్ని ఎలా ఒక దారిలో పెట్టుకోవాలనేది మన ముందున్న లక్ష్యం. వారిలో ఐక్యత లేదా టీమ్ స్పిరిట్ అంతగా కనిపించదు. ప్రతి ఒక్కరూ తమకే క్రెడిట్ అంతా దక్కాలని తాపత్రయపడుతుంటారు. కాని వారి మధ్య పరస్పర సహకారం అసలు ఉండదు. మీకొక విషయం తెలుసా? నేను చెప్పేదంతా వేరు వేరు దేశాల మధ్య కాదు, ఒకే దేశంలో, ఇరుగు పొరుగున ఉన్న వారి మధ్య ఈ సయోధ్య లేదు. యువకులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ రోజు కెమెరా ముందు కూర్చున్న మేమందరం లేకపోయి ఉంటే, నీల్ బ్యారీ, యూరీ ఇవానోవ్ ఇంత పాపులర్ అయి ఉండేవారు కాదు.

కాబట్టి, యువతరాన్ని నేను కోరేది, కొన్ని అడుగులు వెనక్కివెళ్లి, ఈ విషయాన్ని పునరాలోచించండి. ఐక్యత సహకారం లేకపోతే, ఏదీ సాధ్యం కాదు. నీల్, యూరీలు వీటినే స్వీకరించారు, ఎన్నుకున్నారు. అవి మాత్రమే కాదు. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా వాటినే కావాలన్నాయి. అందుకే మనమంతా ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాం.”

ప్రయోక్త తుది పలుకుల తర్వాత కార్యక్రమం ముగిసింది. ఆ షో చూసిన వారంతా దాని నుంచి ప్రేరణ పొందారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఎప్పుడో 1970లో జరిగిన సంఘటనలు, ఇంకా అంతటి స్ఫూర్తిని యువతలో రగిలించటం. మీడియా పదే పదే దీనిని ప్రస్తావించడం కూడా, ఇది సాధ్యం కావటానికి దోహదపడింది.

2020 ప్రాంతంలో కూడా, టీచర్లు, స్కూళ్లలో పిల్లలకు, ఆల్బర్ట్ ఐన్‍స్టీన్ లాంటి శాస్త్రవేత్తలను గురించి చెప్పినట్లుగా, నీల్, యూరీ లను గురించి చెప్పేవారు. ఆ ఇద్దరూ మానవాళి రక్షకులు, అందరికీ ప్రేరణగా నిలిచారు. వారి ప్రభావం వర్తమానం మీదే కాదు భవిష్యత్తు పై కూడ ఉంటుందనేది ఎవ్వరూ కాదనలేని సత్యం.

దశాబ్దాల తరబడి, నీల్ యూరీల విజన్ వారి కుటుంబాలను నడుపుతూనే ఉంది. వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి సంతానం MSM 6 తో వారి తండ్రులు చేసిన త్యాగానికి అనుగుణంగా తమ జీవితాలను, కెరియర్లను మలచుకొన్నారు. తండ్రుల త్యాగాలు వమ్ము కారాదన్నది వారి లక్ష్యం.

మార్స్‌కు వెళ్ల గల యంత్రాలను వారు అన్ని ‘స్పేస్ రీసర్చ్’ భవనాలలో నిర్మించడం ప్రారంభించారు. చాలా దేశాలు ఆ విషయంలో దయనీయంగా విఫలమయ్యాయి. మిషన్‍లో ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సమయంలో తప్పు జరుగుతూనే ఉంది. చివరికి వారు తమ విధానమే తప్పని తెలుసుకోవటానికి చాలా కాలమే పట్టింది. మార్స్ మిషన్ ఏదో ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. లేదా ఒక దేశం సాధించేది కాదు. మిషన్ విజయవంతమయి, భూగ్రహం కాపాడబడిందంటే, అది టీం వర్క్ వల్లే!

త్వరగానే, ఐక్యరాజ్యసమితి మరో అంతరిక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ నాయకులంతా తమ తమ వనరులను ఇవ్వడానికి, ఒక ఉమ్మడి లక్ష్యంతో పని చేయడానికి అంగీకరించారు. కుజ గ్రహాన్ని నివాసయోగ్యంగా మలచడానికి ఒక విశ్వప్రణాళిక రూపొందించారు.

1970లో చేసినట్లే, ప్రతి దేశం మిషన్‍కు తన వంతు దోహదం తాను చేయసాగింది. ఈ విషయం అధికారికంగా ధృవీకరించబడింది. మిషన్‌కు నాయకత్వం వహించేవారిని ఎన్నుకోవడం కొంచెం కష్టమే అయినా త్వరలోనే, మానవులను మార్స్ మీద చూడాలనే బలమైన అనురక్తి గల ఒక అమెరికన్‌ను గుర్తించారు.

పీటర్ ఇలియట్ అతని పేరు. అరవైల చివరలో ఉన్న ఒక యువకుడు. అమెరికా లోని ఒక పెద్ద కంపెనీకి ఆయన CEO. అది అంతరిక్ష నౌకల విడి భాగాలను తయారు చేస్తుంది. ఆయన తన ముప్ఫైల చివరలో ఉన్నప్పటి నుండి, జీవితమంతా, తన సంపదను మార్స్ కోసమే వినియోగిస్తున్నాడు. దానిపట్ల ఆయనకున్న అద్భుతమైన భావావేశం, వనరుల స్వయంపోషకత, ఆయనను ఈ మిషన్‌కు నాయకుడిని చేశాయి.

పీటర్‌కు ఈ వార్త తెలిసినపుడు, అతడు చాలా చాలా సంతోషించాడు. జీవితంలో అపురూపంగా వచ్చే అవకాశమది. ఆ వ్యవస్థలో అతడొక భాగం అయిన తర్వాత, తాను రూపొందించిన ఒక విశ్వవ్యాప్త అంతరిక్ష కార్యక్రమాన్ని అతడు అభిలషించాడు. అది ఎలాగూ ఒక సామూహిక నిర్ణయం కాబట్టి ఆ ప్రణాళిక ఆచరణలో పెట్టారు.

తన లాంటి విజన్ ఉన్న సిబ్బంది ఆయనకు కావాలి. దానికి, మానవుని మనుగడను రక్షించిన ఆ ఇద్దరి పిల్లలనే ఎందుకు పిలవకూడదు? పీటర్ వెంటనే, నీల్ బ్యారీ సంతానం రేచల్, జేమ్స్ బ్యారీలను, యూరీ ఇవానోవ్ కొడుకైన మిషా ఇవానోవాను సంప్రదించాడు. వారంతా తమ తమ నేపథ్యాలను బట్టి, అతరిక్షానికి మొగ్గు చూపేవారే! వాళ్లంతా తమ తమ ముప్ఫైల చివరలో ఉన్నారు వారందరి విజన్ సుస్పష్టంగానే ఉంది. దాని వల్ల మిషన్ మరింత బలపడింది.

ఈ వార్త మీడియా అంతా వ్యాపించింది. మానవ జీవితంలో ఒక చురుకైన పాత్ర పోషిస్తూన్న ఇంటర్నెట్ దీనికి వేదికైంది. ప్రతి ఒక్కరి వేలికొసలలో ఈ వార్త నాట్యం చేసింది. ప్రపంచం మొత్తం మీద అత్యంత ట్రెండింగ్ టాపిక్ ఇదే! మార్స్‌కు ఉమ్మడి సాహస యాత్ర!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here