అంతరిక్షంలో మృత్యునౌక-8

0
9

[శ్రీ బంకా పార్దు సంపత్ ‘Redemption of the Century’ అనే పేరుతో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలను ‘అంతరిక్షంలో మృత్యునౌక’ పేరిట అనువదించి అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[భూమి మీద కృత్రిమ మేధ ఉపయోగాలు పెరుగుతాయి. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనశాల స్థాపితమవుతుంది. రోవర్‍లను రూపొందించే కంపెనీ యజమాని ఐన పీటర్‍కు – జేమ్స్ నుంచి ఫోన్ వస్తుంది, అర్జెంటుగా కలవమని. ఎన్నో దశాబ్దాల పరిశోధన, మార్స్ కోసం మొక్కవోని, నిరంతర తపన తర్వాత అక్కడికి మనుషులను పంపే మిషన్ సాకారమవుతుంది. 2030లో జేమ్స్ బ్యారీ, రేచల్ బ్యారీ, మిషా ఇవానోవ్, పీటర్‌లని చంద్రగ్రహం మీదకి, మళ్ళీ ఏడాది మరో బృందాన్ని మార్స్‌పైకి పంపుతారు. మార్స్ పైన గొప్ప అభివృద్ధి జరుగుతుంది. భూమి నుంచి వెళ్ళి శాస్తవేత్తలు, ఇంజనీర్లు, పరిశోధకులు అక్కడ స్థిరపడతారు. ఇండిపెండెంట్ మార్స్ బాడీ (IMB) స్థాపించబడింది. 2045లో పీటర్ మరోసారి మార్స్‌కి వెళ్తాడు. IMBకి తొలి అధ్యక్షుడైనాడు. అదొక ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందుతుంది. మార్స్‌పై రోబోల వినియోగం విస్తృతంగా ఉంటుంది. 2070 కల్లా IMB జనాభా మూడు మిలియన్లకు చేరుకుంటుంది. తన తండ్రి వారసత్వాన్ని పుణుకిపుచ్చుకున్న రేచల్ బ్యారీ తన కుమార్తెను మార్స్ పై కనడానికి నిశ్చయించుకుంటుంది. కూతురు పుడుతుంది. ఆమెకి రేమండ్ అని పేరు పెడతారు. రేమండ్ పెరిగి పెద్దదై అంతరిక్ష రంగంలో రాణిస్తుంది. మార్స్ అంతరిక్ష పరిశోధనలో కీలక స్థానానికి చేరుకుంటుంది. ఇక్కడ భూమి మీద యూరీ ఇవానోవ్ మనమడు యూరీ జూనియర్ కూడా అంతరిక్ష పరిశోధనలు కొనసాగించి కీలక స్థానానికి చేరుతాడు. వాళ్ళ తాతయ్యలు దారి మళ్ళించిన అణు వ్యర్థాల నౌక మళ్ళీ భూమి వైపు వస్తోందన్న వార్త అందరినీ కలవరపరుస్తుంది. రేమండ్, యూరీ ఒకరితో ఒకరు సంప్రదించుకుంటూ, అణువ్యర్థాల నౌక ప్రమాదం నుంచి భూమిని ఎలా కాపాడాలో ప్రణాళికలు రూపొందిస్తారు. భూగ్రహ వ్యోమనౌక కన్నా ముందు అరుణగ్రహం వారి కృత్రిమ మేధ వ్యోమనౌక అణువ్యర్థాల నౌకను దారి మళ్ళించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా నౌక వ్యర్థాల నౌకకు అతి దగ్గరగా వెళ్లి, తర్వాత కనబడకుండా పోతుంది. యూరీ, రేమండ్, ఇతర సిబ్బంది అంతా నిరాశకి లోనవుతారు. – ఇక చదవండి.]

ప్రకరణం-8: కృత్రిమ మేధా యుక్తి విన్యాసాలు

[dropcap]మి[/dropcap]షన్ వైఫల్యం చెందిన వార్త ప్రపంచమంతా, దావానలంలా వ్యాపించింది. భూమి మీద ఊర్లలోని వీధులన్నీ అల్లకల్లోలంగా మారాయి. అది రాత్రి జరిగినా, ప్రపంచం సర్వనాశనం కాబోతూందన్న పుకారు, భూమి మీది అన్ని ఖండాలలోని దేశాలలో వ్యాపించింది. అణువ్యర్థాల నౌక ఇంకా భూమికి దూరం గానే ఉంది. అది భూ కక్ష్యలో ప్రవేశించడానికి మరో రెండు నెలలు పైనే పట్టొచ్చు. కాని కనబడని దాని గురించిన భయం, కొందరి అజ్ఞానం, అందరిలో భయాన్ని పెంచాయి. దేశదేశాల ప్రజలు, అటూ ఇటూ, విపరీతమైన ఆందోళనతో పరుగులు తీయసాగారు.

యూరీ జూనియర్ అంతరిక్ష కేంద్రం ప్రయోగశాల లోనే ఇంకా ఉన్నాడు. కుర్చీలో కూర్చొని, దూరంగా, అభావంగా చూస్తున్నాడు. అతని ముక్కు మీదికి అంత వరకు జారి ఉన్న అతని కళ్లద్దాలు అతను మోయలేనంత బరువెక్కాయి. వాటిని తీసేశాడతను. అతని చూపు టేబుల్ మీదున్న ఫోటో ఫ్రేం మీద నిలిచింది. అందులో వాళ్ల నాన్న చిన్నప్పటి ఫోటో, ప్యోమగామి దుస్తుల్లో అతని తాతయ్య ఫొటో కలిసి ఉన్నాయి.

అతని తాతయ్య, వాళ్ల ముత్తాత గురించి ఆయన వెళ్లిన ఉదంతం గురించి అప్పుడేప్పుడో చెప్పిన కథ, ఆ ఫోటాని చూస్తే అతనికి గుర్తొచ్చింది. ఆ కథ అతని మనస్సులో కదలాడసాగింది. అటువంటి గడ్డు పరిస్థితిలో ఆ కథ అసలు తనకెందుకు గుర్తొచ్చిందా అని అతడు ఆశ్చర్యపోయాడు. చివరికి దాన్ని తన మనసులోంచి పక్కన పెట్టి ఇంకో విషయం మీద కేంద్రీకరించగలిగాడు. రేమండ్ బ్యారీ!

ఆమె గొంతు వినాలని అతడు తహతహలాడసాగాడు. అతని అంతరాత్మ అలా మాట్లాడుతున్నట్లు అనిపించింది. ఆమె మాట్లాడాలి! మాట్లాడితే తప్ప, ప్రపంచం ఏం కానుందో తెలియదు. మిషన్‌లో, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎంతో కీలకమైన సమయంలో, కామ్ మూగబోయింది! ఆమె నుండి ఏమీ వినరాలేదు. అతనెంతో మానసిక అలజడికికి గురయ్యాడు. ఏదో జరగరానిదే జరిగి ఉంటుందని అర్థమైంది. అది అందరికీ తెలుసు. కానీ ఖచ్చితంగా ఏం జరిగి ఉంటుందనేది ఎవరికీ తెలియదు.

ఏది ఏమైనా, తమకూ మార్స్‌కూ మధ్య సమాచార బంధం తెగిపోయినప్పుడు, వారి AI కంట్రోలు నౌక ఇచ్చిన హెచ్చరిక సిగ్నల్ వారు వినగలిగారు. దాని తర్వాతే అంతా ఆగిపోయింది. నౌక ప్రస్తుత పరిస్థితిని వారు చెక్ చేసిన తర్వాత, వారు మరింత క్రుంగిపోయారు. దాని దిశ, స్థానం ఒకటేగా ఉండడాన్ని వారు చూశారు.

అతని టేబుల్ ముందు మరో ముగ్గురు నిల్చొని ఉన్నారు. ఇద్దరు మగవాళ్ళు, ఒక స్త్రీ. వారు అతనితో పాటు, అణువ్యర్థాల నౌకను మళ్ళించే వ్యోమనౌకలో వెళ్లవలసినవారు. దాన్ని వారు తమ కక్ష్యనుండి రెండు వేల సంవత్సరాల దూరానికి మళ్లించవలసి ఉండింది.

“మనం ఇప్పుడు ఏం చేయాలి సర్?” అనడిగాడు ముగ్గురిలో పెద్ద. యూరీ జూనియర్ అక్కడ వారి ఆధీనంలో ఉన్న మొత్తం స్కిల్ సెట్‌కు ఇన్-ఛార్జ్. ఎన్నో సంవత్సరాలుగా అతడు తన ప్రతిభతో దానిని నిర్వహిస్తున్నాడు. వారి కతని మీద ఎంత నమ్మకమంటే, అతడీ క్లిష్ట పరిస్థితుల్లో, ఏదో ఒకటి చేయగలడని అనుకుంటున్నారు. నేరుగా అతడే స్పందనా ఇవ్వలేదు. ఒక నిట్టూర్పు విడిచి. ఆఫీసులో అటు ఇటు తిరగసాగాడు.

అతడేం మాట్లాడకపోవడం చూసి, ఆమె, సాధ్యమైనంత మర్యాదగా ఇలా అంది.

“చాలామంది అప్పుడే ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు సార్. అణువ్వర్థాల నౌక తిరిగిరాక ముందే దాన్ని ఎదుర్కొని పోరాడాల్సిన, భూమి మీది పోగ్రాంకు ఏమయిందని? వారికి ఏదో ఒకటి చెప్పాలి మనం, ఇక్కడ వెయిట్ చేయకుండా. దాన్ని మన కక్ష్య లోనికి ప్రవేశించనివ్వకూడదు, ఆపాలి!”

యూరీ జూనియర్ నడవటం ఆపాడు. ఆమె వైపు చూశాడు. ఆమె వెంటనే తల వంచుకుంది. మిగిలిన ఇద్దరూ పెదవులు బిగించి చూస్తూ నిలబడ్డారు, ఈమెకేదో మూడిందని. కాని, యూరీ ఆమె వైపు చూశాడంతే! ఏమి మాట్లాడలేదు.

వారికి తెలీదు కాని, అతనింకా ఆలోచిస్తూనే ఉన్నాడు. ‘ఆమె’ తన ఆలోచనలలో పాలుపంచుకోవడానికి లేనందుకు బాధపడ్డాడు. కాని అతడు కదలాలి. ఏదో ఒకటి చెయ్యాలి.. మళ్లీ, ప్రపంచమంతా, యూరీ ఇవానోవ్ మీదే ఆధారపడి ఉంది మరి. కారణం మళ్లీ అదే!

“ఆమె చెప్పింది కరెక్ట్” అన్నాడు యారీ, స్థిరమైన ముఖంతో. “ఇది మన కక్ష్య. అరుణగ్రహం మనల్ను కాపాడుతుందని మనం చూస్తూ కూర్చోలేం.”

అతని మాటలు వారిలో ఒక ఆశాకిరణాన్ని తళుక్కుమనిపించాయి. సర్దుకొని నిల్చున్నారు. కాని ఏం చేయాలో వారికింకా క్లారిటీ లేదు. సందిగ్ధంగా ఉన్నారు.

“మరి కింకర్తవ్యం సార్” అనడిగాడు ఒకతను. “సూట్ అప్” అన్నాడు యూరీ. వ్యోమగామి దుస్తులు ధరించమని అతని ఉద్దేశం.

ఆఫీసు లోంచి వేగంగా బయటపడి కంట్రోల్ రూం దాటాడు. రూము లోని సిబ్బంది కొందరు లేచి నిలుచుని అతని దృష్టిలో పడటానికి ప్రయత్నించారు. కాని అతడు వారి వైపు చూడలేదు. కారణం, అతని మనసంతా మిషన్ మీదే ఉంది. కంట్రోల్ రూమ్ దాటి, వరండాలన్నీ దాటి ప్రవేశద్వారం చేరుకున్నాడు. బయట అతన్ని వెన్నెల స్వాగతించింది. దాంతో పాటు కెమెరా డ్రోన్ల ఫ్లాష్ లైట్లు పలకరించాయి. ఇద్దరు ప్రెస్ వాళ్లు అతన్ని ఇంటర్వూ చేయడానికి వచ్చారు.

2070లో కెమెరామెన్ అవసరం లేదసలు. ఒక ఆటోమేటెడ్ కెమెరా డ్రోన్ అప్పటి విధానం. అక్కడున్న ప్రతి విలేఖరి – ముంచుకు రాబోతున్న అణువ్యర్థాల నౌకను ల్యాబ్, ఎలా ఎదుర్కోబోతూందో తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. యారీ వారికి జవాబివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.

అది లైవ్ బ్రాడ్‍కాస్ట్ ప్రత్యక్ష ప్రసారం ప్రపంచమంతా అతడు చెప్పేది వింటారు, చూస్తారు. కాబట్టి అతడు మాట్లాడే ప్రతిమాట జాగ్రత్తగా వాడాలి. దాన్ని బట్టి ఈ వార్త తెలియక ముందట ప్రశాంతత ప్రపంచంలో మళ్లీ నెలకొనేది. “దయచేసి శ్రద్ధగా వినండి” అన్నాడు యూరీ. అలా అతడంటాడని ప్రపంచమంతా ఎదురు చూస్తున్నట్లనిపించింది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు.

“అణు వ్యర్థాల ప్రమాదం నుంచి భూమిని రక్షించుకోవడానికి, ఉద్దేశించిన మిషన్ మొత్తాన్ని మార్స్ స్పేస్ మిషన్‌కు పూర్తిగా వదిలేసి, మనం పెద్ద తప్పు చేశాము. మనమంతా విన్నట్లుగా, ఏదో ఘోరమైన వైఫల్యమే జరిగింది. మా తాతగారి రోజుల్లో కూడా ఇలానే జరిగింది. దీన్ని మనం ఊహించలేదు.”

ఈ మాటల్ని యూరీ పెద్ద గొంతుతో ఇంచుమించు అరిచినట్లు వారికి చెప్పాడు. భూమిపై నెలకొంటున్న భయాల నుండి వారి ఏకాగ్రతను మరల్చడం అతని ఉద్దేశం.

“యుద్ధం ఇంకా ముగియలేదు. ఇంకా చెప్పాలంటే యుద్ధం ఇప్పడే మొదలైంది.

అణు వ్యర్థాల నుండి ఉత్పన్నమయ్యే రేడియేషన్ ఈపాటికీ పెరిగి ఉండాల్సింది. నన్ను నమ్మండి. మన గ్రహానికి ముంచుకొస్తున్న ముప్పేమీ లేదు. ఆ వ్యోమనౌక భూమి కక్ష్యలో ప్రవేశించడానికి ఇంకా నెల రోజులు పైనే పడుతుంది. ఇక్కడ, అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో, మేము, మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లి, దాన్ని మళ్లించడానికి సిద్ధంగా ఉన్నాం.

అగ్నిమాపక సిబ్చంది మంటలతో పోరాడినట్లు, శాస్త్ర వేత్తలు వైరస్‌లు వ్యాపించకుండా పోరాడినట్లు మేం కూడా ఈ పెను విపత్తుతో పోరాడతాం. మా తాతగారిలాగా, నా చివరి శ్వాస వరకు.”

వీధుల్లో గుమిగూడి ఉన్న, ప్రపంచ ప్రజలందరూ, అతని మాటలకు జయజయ ధ్యానాలు చేశారు. వారంతా రకరకాలుగా అతను చెబుతున్నదాన్ని వీక్షిస్తున్నారు, కేవలం వింటున్నారు.

“ఇంటికి వెళ్లి రిలాక్స్ అవుదాం”, అతను కొనసాగించాడు “అందోళన చెందాల్సినంత సమయం ఇంకా రాలేదు. మన పూర్వీకులను కాపాడినట్లే, దేవతలు మనల్ను కూడా కాపాడుతారు.”

అతడు ముగించి, వెనక్కు తిరుగుతుండగానే, ఒక మహిళా విలేఖరి అతన్ని ఈ ప్రశ్నవేసింది.

“మీరు ఈ మహత్కార్యానికి తగిన అర్హత కలవారని మాకెలా తెలుస్తుంది?” ఇది నిజంగా అవమానించడమే. ప్రత్యక్ష ప్రసారం. గ్లోబల్ టి.వి.లో అతడు చెప్పినా, ఆమె ఆ ప్రశ్న అడగడం. కాని తన దగ్గర దానికి తగిన జవాబు ఉందని అతడు సంతోషించాడు.

“నాకు ఊహ తెలిసిన నాటి నుండి, ఈ రోజు కోసమే నేను పెరిగాను, శిక్షణ పొందాను. నా జీవితమంతా, నేను, ఈ భవనంలో నాతో పాటు పనిచేసే సిబ్బంది, ఈ రోజు వస్తుందని సిద్ధంగానే ఉన్నాము, అన్ని సన్నాహాలతో!మానవత్వాన్ని కాపాడాలనేదే మా లక్ష్యం.”

అతడు ఆగాడు. ఆమెకు కొంచెం దగ్గరగా జరిగి, చేతులు చాచి, బిగ్గరగా, స్పష్టంగా చెప్పాడు –

“నేను యూరీ ఇవానోవ్ జూనియర్‍ని. యూరీ ఇవానోవ్ సీనియర్ గారికి మనుమడ్ని. నేను, నా సిబ్బంది కలిసి, ఈ ప్రపంచాన్ని సంరక్షిస్తాం.”

***

దీని తర్వాత, మర్నాటి ప్రభాతం యూరీని తాకింది. అతని వ్యోమనౌక సిబ్బంది, వారి అధునాతన కాక్‌పిట్‌లో సిద్ధంగా ఉన్నారు. అది అంతరిక్షంలోకి దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది. వారు అప్పుడే భూకక్ష్యను దాటుతున్నారు. భూగ్రహాం మీది ప్రజల ముఖాలపై ఆనందం!

అణు వ్యర్థాల నౌక వైపు దిశను సెట్ చేసేలా యూరీ వారికి చెప్పాడు. అంతకు ముందు వారు సిద్ధం చేసుకొన్న ప్రణాళికనే వారు అమలు చేస్తున్నారు. ఆ నౌకను భూమి వైపు రాకుండా, పూర్తిగా ఇంకో వైపు మళ్లించడానికి వారు తమ శాయశక్తులా ప్రయత్నించబోతున్నారు.

వారి ప్రయాణంలో, తమకూ, మార్స్‌కూ కనెక్షన్ ఉండేలా నిర్ధేశించుకోటానికి వారు శాయశక్తులా ప్రయత్నించారు. కాని వారికా అదృష్టం లేదు. అంతరిక్షం లోకి వారి ప్రయాణం సుదీర్ఘమైంది. యూరీ దాని వల్ల మానసికమైన స్ట్రెస్‌కు లోనయ్యాడు బాగా. రేమండ్ నుండి ఏ సంభాషణా లేకపోవడం అతన్ని బాధిస్తూ ఉంది. ఆమె అందుబాటు లోకి రావాలని అతడు కోరుకుంటున్నాడు గాఢంగా.

ఆమె కూడా, తనలాగే, తనను కాంటాక్ట్ చేయడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తూ ఉంటుందని అతనికి నమ్మకం. వారి ప్రయాణంలో సగం పూర్తయింతర్వాత, ఒక రోజు, కామ్‌లో ఒక చలనం!

సిబ్బందిలో ఒకరిలా అన్నారు, “సార్, మీరు దీన్ని విన్నారా?” అన్నవ్యక్తి కంట్రోల్ సెంటర్ కూర్చొని అన్ని సిస్టమ్స్ చెక్ చేస్తున్నాడు. “ఏమిటది?” అన్నాడు యూరీ, పెద్దగా ఆసక్తి చూపకుండా.

ఐనా ముందుకు వెళ్లాడు. కమ్యూనికేషన్ బడ్‌ను అందుకున్నాడు

“ఈ ఫ్రీక్వెన్సీలో ఏవో మాటల శబ్దాలు గత కొన్ని గంటలుగా వింటున్నాను సార్. మీరు కూడా దీని పట్ల కుతూహలం కనపరుస్తారని..”

“ఆగండి! ఏమిటి? మన మిషన్‍కు దీని వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుందా?” అనడిగాడు యూరీ, కొంచెం విసుగ్గా.

“సర్. మీరు మార్స్‌తో సంభాషించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని నాకు తెలుసు. అందుకీ నేను సిస్టమ్ కొన్ని ఆకృతీకరణలను ప్రయత్నించాను – అదింకా పని చేయలేదు. మీరు చూస్తే తర్వాత ఏం చేయాలనీ దాని మీద మీకొక నైపుణ్య భావన కలగొచ్చు.”

“ఈ ప్లాట్‍ఫారం మీద మాటలు వినబడటం, మనం దగ్గరగా వెళ్తున్నామనే దానికి తగిన సంకేతమని మీరనుకుంటున్నారా?”

“అవును సర్. మా కొలీగ్స్ చేసిన మునపటి పరీక్షలన్నింటి కన్నా, దీనినే ఇంత సామీప్యానికి రాగలిగాము.”

“ఆల్‍రైట్!” అన్నాడు యురీ, అతని ఆలోచనకు ప్రాధాన్యతనిస్తూ. ‘కామ్స్’ను పని చేయిస్తే వచ్చే నష్టమేమీ లేదని అతనికనిపించింది.

“సరే, మీరింత వరకు చేసింది చెప్పండి!” అన్నాడు యూరీ. చాలా కన్ఫిగరేషన్స్ అప్పటికే వాళ్లు చేసి ఉన్నట్లు అతడు గమనించాడు.

ఆ వ్యక్తి చాలా సేపు ‘కామ్’ను పని చేయించడానికి తానెన్ని పాట్లు పడ్డాడో యారీకి వివరించాడు. యూరీ దీర్ఘంగా ఆలోచించాడు. కంట్రోల్స్ ముందుకు కుర్చీని జరుపుకొని కూర్చున్నాడు. కుర్చీలోని సుఖమైన మెత్తలు అతని ఆలోచనలకు బలాన్నిచ్చాయి. భౌతికం కూడా మానసికాభివృద్ధికి కొంతవరకు దోహదం చేస్తుంది కదా! గడ్డాన్ని రుద్దుకొని, కళ్లద్దాలు తీసేశాడు. చేత్తో ముఖం మీది చెమటను తుడుచుకున్నాడు.

“ఫ్రీక్వెన్సీని పెంచారా?” అనడిగాడతన్ని యూరీ. అతడు దాని గురించి ఆలోచించలేదు. అందుకే కొంత నిశ్చష్టుడయ్యాడు.

“లేదు సార్, పెంచలేదు” అన్నాడు గబగబా. వెంటనే తన ముందున్న కంట్రోల్స్ వైపుకు తిరిగాడు. తనకు యూరీ చెప్పిన దాన్ని, సాధ్యం చేసే ప్యానెల్‍ని వెతకసాగాడు.

“దొరికింది సార్, ఫ్రీక్వెన్సీ పెంచాను” అన్నాడతడు

“మళ్లీ ఒకసారి ప్రయత్నిద్దాం, ఓ.కెనా?” అన్నాడు యూరీ, ఎంతో ఆసక్తితో. మళ్లీ త్వరలో రేమండ్‌తో మాట్లాడగలననే ఊహతో అతడు ఉద్వేగంగా ఉన్నాడు.

అదే ఛానల్‍ను పెంచిన ఫ్రీక్వెన్సీతో వాళ్ళు ప్రయత్నించిన తర్వాత, ఆ మాటల రణగొణ శబ్దాలే వినబడుతున్నాయి. రేమండ్‌తో మాట్లాడగలమనే ఆశ మళ్లీ అడుగంటి పోయింది. ఇయర్స్ ఫోన్స్ తీసేసి కంట్రోల్ ప్యానెల్స్ యొక్క డాష్ బోర్డ్ మీద పడేశాడు. చీకట్లోకి చూస్తూ, కాసేపలా, అక్కడే ఉండిపోయాడు.

తానూ చుట్టూ వ్యాపించిన చీకట్లో కలిసిపోతే బాగుండుననుకున్నాడు, తన తాతయ్యలాగా. ఏదో శూన్యం, అతని కడుపులో దేవేస్తూంది. అతన్ని ముందుకు తోస్తూన్న ఒకే ఒక అశ, అణువ్యర్థాల నౌకను మళ్లించగలమనే నమ్మకమే. అది ఒక ఆత్మహత్యా సదృశ కార్యంగా మారినా అతనేం చేస్తాడో అతనికి తెలుసు.

రేమండ్‌తో మాట్లాడగలననే ఆశలు పూర్తిగా వదిలేసుకొని, సీటు నుంచి లేచి, కాక్‌పిట్ వైపు నడిచాడు యూరీ జూనియర్.

“సర్, సర్!” అని అరిచాడా వ్యక్తి. అతని గొంతులో ఆనందం!

“ఇది కుదురుతుందనుకుంటా. చూడండి!”

་”ఏమిటది?”

“ఆంటెన్నా. ఇంతవరకు తప్పు ఆంటెన్నాను ఉపయోగించాం. నేను చేసిన ఆకృతీకరణ (configuration)ను గనుక మనం కలిపితే, దానికి పెంచిన ఫ్రీక్వెన్సీ తోడయితే! రెండో ఆంటెన్నాను ఉపయోగిద్దాం” అంటూ వివరించాడతడు. రెండు బటన్లు నొక్కుతూ, యూరీ వైపు తిరిగి, కామ్ బడ్స్ అతని అరచేతిలో ఉంచాడు.

“చూడండి.”

యూరీ వాటిని తన చెవిలో ఉంచుకున్నాడు. అతని మనస్సులో ఒక ఆశ! ఆ వ్యక్తి చివరి బటన్ నొక్కాడు. రణగొణ శబ్దాలు!

కాని యూరీ నిరీక్షించాడు. ఆ వ్యక్తి అరస్తూనే ఉన్నాడు “హలో, ఎవరైనా ఉన్నారా అటు?” అంటూ. ఒక నిమిషం తర్వాత ఆ అరుపుకు స్పందన! ఇక ఆశే లేదు అనుకున్న క్షణంలో, ఒక గొంతు కామ్ బడ్స్ గుండా వినవచ్చింది.

“భూగ్రహం నుంచా మీరు మాట్లాడుతుంది?” అది పరిచితమైన గొంతు. సుపరిచితమైంది కూడా. యూరీ మనోభావాలు గంతులు వేశాయి. అతని చెవుల్లో వినిపించిన రాగాలు అతి మధురంగా మ్రోగాయి. వారాల తరబడి విచారం తర్వాత సంతోషం వెల్లివిరిసింది.

“రేమండ్ బ్యారీ! ఓహ్! ఎంత మిస్ అయ్యానో తెలుసా నీ గొంతును!”

“యూరీ జూనియర్! నువ్వేనా?” అడిగింది రేమండ్. ఆమె గొంతుతో ఒక ఉద్వేగం, ఉత్సాహం!

“నేనే! భూమిని మార్స్‌ను కలిపే గొంతు నాది కాక మరెవరిది?” అన్నాడతడు. అతని పెదవులపై చిరునవ్వు.

“వావ్, చాలా కాలంగా నిన్ను కంటాక్ట్ చేయాలని చూస్తున్నాం, ఇప్పటికీ. కాని కమ్యూనికేషన్లన్నీ పడుకున్నాయి. ఏమయింది?” అనడిగింది రేమండ్.

“అదే ప్రశ్న నేను నిన్ను అడగగలను. నీతో మాట్లాడగలుగుతున్నానంటే, అంతా మా ఈ బృందసభ్యుని చలువే! మార్స్‌తో కలవడానికి, కలపడానికి, తన పట్టు వదల లేదసలు. బహుశా మార్స్ మీద ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందేమో?”

ఆ వ్యక్తి సిగ్గుపడి నవ్వాడు. తల ఊపి, “అక్కడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు సర్, స్నేహితురాలు కాదు, మీరనుకున్నట్లు” అన్నాడు.

“ఓ! సారీ!” అన్నాడు యూరీ. నవ్వీ నవ్వి అతని ముఖంలోని కండరాలకు అలుపొచ్చింది!

“ఏం జరిగిందంటే, ఉన్నట్లుండి కామ్స్ మూగబోయాయి. ఎందుకంటావు, రేమండ్? అణువ్యర్థాల నౌక ఇంకా అంతరిక్షంలోనే ఉంది కదా, ఇంకా భూమి వైపుకు దూసుకొస్తూ?”

‘అమ్మను యూరీ. దానికి నాకు చాలా విచారంగా వుంది. కామ్ విఫలమైన తర్వాత, మేం మళ్లీ Al తో అనుసంధానించుకోగలిగాం. కాని కొన్ని సమస్యలున్నట్లు గమనించాం. ఏదీ ఊహించటానికి మా శక్యం కాలేదు. గందరగోళం ప్రారంభం అయింది. కాని ప్రస్తుతం అంతా అదుపులోనే ఉందిలే!”

“అమ్మయ్య!” ఊపిరి పీల్చుకున్నాడు యూరీ.

“ఎలా వున్నావు? మనం మాట్లాడుకుని చాలా కాలమైంది. ఈ వార్తను భూమ్మిది ప్రజలు ఎలా తీసుకున్నారు? నీ మీద కోపం వచ్చింటుంది బాగా. ఆగు. నీవు అంతరిక్షంలోనే ఉన్నావా?”

యూరీ ఆమెకు అప్పటివరకు జరిగిందంతా చెప్పాడు. ప్రజలు ఎలా భయభ్రాంతులయింది, ఎలా తాను ఆ వైఫల్యం వల్ల కుదేలయిపోయింది, అది వాళ్ల తాతయ్య త్యాగాన్ని ఎలా తను గుర్తు చేసిందీ, అంతా చెప్పుకొచ్చాడు. ఆ కథ అతనిలోని స్ఫూర్తిని రగిలించి, తానే మిషన్‌ను నడిపించాలన్న ధైర్యవంతమైన ముందడుగు వేయించిందనీ వివరించాడు.

“నీవు ఇక్కడే ఇప్పుడున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. నా దగ్గర 1970 ప్రణాళిక తప్ప మరేమీ లేదు. విశ్వం నా మీద దయ చూపాలని పార్థిస్తూ ఉన్నా. ఈ విధంగా ఆమె నన్ను కరుణించిందన్నమాట.”

“పందెమా?” అన్నది రేమండ్ చిన్న నవ్వుతో.

ఈ క్షణం, రెండు వ్యోమనౌకలు అంతరిక్షంలో ఉన్నాయి. రెండూ ఒకే విపత్తుతో పోరాటం చేస్తున్నాయి. అది వాళ్ల తాతల కాలం నాటిది.

మార్స్ నుండి పంపిన కృత్రిమ మేధ నౌక నిశ్చలంగా ఉంది; విపత్తును ధ్వంసం చేయడంలో సహాయం చేయడానికి సిద్ధంగా యూరీ జూనియర్ మిషన్‌లో అనుసరిస్తున్న సిబ్బందికి ఈ విషయాన్ని రేమండ్ స్పష్టం చేసింది. రెండు నౌకలు, ఒకటి మనుషులుండినది, ఒకటి లేనిది, రెండిటినీ బేస్‍ల నుంచి మనుషులే కంట్రోల్ చేస్తారు. ఒక శతాబ్దం పాటు రెండు గ్రహాలను గడగడలాడించిన పెను విపత్తును తుదముట్టించటానికి రెండూ సిద్ధంగా ఉన్నాయి.

“మనం ఒక ప్లాన్‍తో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనల్ని అందర్నీ పాలుపంచుకునేలా చేసే ప్లాన్. మనం అణువ్యర్థాల నౌకకు దగ్గరగా ఉన్నామని పరిగణించి ఈ ప్లాన్ తయారుచేయాలి.”

“అది మంచిదే. అదే కాకుండా, మనకు ఇంకో జత చేతులు అవసరమని నాకనిపిస్తుంది” అన్నది, చిరునవ్వు చెరగకుండా.

“బహశా నీకు మరిన్ని మెదళ్లు కూడా అవసరమేమో” అన్నాడు యూరీ. ఇద్దరూ మళ్ళీ నవ్వుకున్నారు.

రెండువైపులా, యాురీ సిబ్బంది, రేమండ్ ఆధీనం లోని కంట్రోల్ టవర్ లోని సిబ్బంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, వీళ్లిద్దరి వ్యవహారం విని. ఇద్దరూ ఒకటే మాట్లాడుకోవడం. ఒకరు చెప్పింది ఇంకొకరికి సరదగా ఉండడం. ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తూనే ఉంది. ఎవరూ ఏమీ అనడం లేదు. ప్రతి మాటలో జోకును జొప్పిస్తూ, వారిద్దరి సంభాషణ కొనసాగుతూంది.

చాలా సమాలోచనల తర్వాత, మేధోమథనం తర్వాత, ఇరువైపు నాయకుల సరసాల తర్వాత, రేమండ్ ఒక ఆలోచన ముందుకు తెచ్చింది, ఆచరణ యోగ్యమని తాను అనుకున్నది.

“నీవు నాతో ఉన్నావా?” చాలా సేపటి మౌనం తర్వాత రేమండ్ అడిగింది

“ఉన్నాను. ఉండక ఎక్కడికి పోతాను?” అన్నాడు యూరీ; చిరునవ్వుతో.

“అయితే సరే, ఈ గొడవ నుంచి బయటపడటానికి ఒక చక్కని ప్లాన్ నాకు తోచిందనిపిస్తూంది.”

ఆమె ఇలా అంటుండగానీ, ఒక కంప్యూటర్ మీద పని చేసి యూరీకి ఒక వీడియో క్లిప్ పంపింది. అతడు దాన్ని ఊహించలేదు.

“నాకు ఏదో పంపినట్లున్నావు?” అనడిగాడు.

“yes. అవును అది ఒక సాకర్ గోల్ యొక్క ఫుటేజ్.”

“ఓ.కె. దీంతో నేనేం చేయాలని నీ భావన? భూమికి నీవు రావాలని బాగా అనుకుంటున్నట్లున్నావు?”

“ఉండొచ్చు. వదిలెయ్ దాన్ని. నేను కొన్ని క్లిప్స్ రాండమ్‌గా చూస్తూండగా, ఇది తగిలింది. నేను బాగా మన ప్లాన్ వివరించటానికి ఇది పనికొస్తుందనిపించింది.”

“సరే”

“వీడియో చూడు, యారీ! నేను వెయిట్ చేస్తా.”

“ఓ.కె. కంగారేం లేదు” అన్నాడు. “అందరూ చుట్టూ నిలబడండి. వీడియో చూద్దాం.”

నౌక యొక్క నావిగేషన్ తెర మీదికి దాన్ని షేర్ చేశారు. అందరూ దాన్ని ఒక ఊహతో చూడసాగారు. అందులో సాకర్ ఫుట్‌బాల్ మ్యాచ్‍లో ఒక గోల్ ఎలా చేయబడిందో ఉంది. రేమండ్ చెప్పినట్లు అదేదో కష్టమైన గోల్ అయి ఉంటుందనుకున్నాడు యూరీ. కాని అది సింపుల్‍గా ఉంది. రొటీన్‌గా చేసే గోల్ అది. దాని వివరాలు ఇలా ఉన్నాయి. బాల్ ముందు, నేరుగా దూసుకెళ్లింది. మిడ్ ఫీల్డర్ నుడి తప్పించుకొని, డిఫెండర్లను చేరుకుంది. స్ట్రయికర్ ఒక పక్కగా ఉన్నాడని నిర్ధారించుకుని, అతని కాళ్ల మధ్యగా చేరింది. తర్వాత, స్ట్రయికర్‌కు ఎన్నో ఛాయిస్‍లు ఉన్నప్పటికీ, అతడు బాల్‍ను ఫినిష్ చేసి, గోల్ వైపుకు పంపడం అతనికి నల్లేరు పై బండి నడకైంది.

అది విజయాన్ని తెచ్చిపెట్టిన గోల్! అందుకే అది కీలకమైనది. ఆట చూస్తున్న వ్యోమనౌక సిబ్బంది భావావేశాలు ఎగసిపడ్డాయి. అంతవరకు బిగపట్టుకున్న ఊపిరిని ఒక్కసారిగా వారు వదిలేశారు, గోల్‍పోస్ట్ వెనుక వైపుకు బాల్ వెళ్లిపోవడంతో భుజాలు కదిపి ఒక్కపెట్టున హర్షధ్వానాలు చేశారు. కొందరు చప్పట్లు కూడా కొట్టారు. స్కోరయిన గోల్ వారిని తమ ‘అసలు గోల్’ పట్ల మరింత ఉత్తేజితులను చేసింది.

“అద్భుతమైన గోల్!” అని అరిచాడు యూరీ. ఎప్పుడో సంవత్సరాల క్రిందట జరిగిన ఒక సాకర్ గోల్‌ను చూసి మనమిప్పుడెందుకు ఇంత సంతోషిస్తున్నాం?”

తన ప్రశ్నను కొంచెం నవ్వుతో కలిపి వేశాడు. ముగ్గురు సిబ్బంది అతని నవ్వుతో జత కలిపారు.

“ఎందుకో నీ ఆలోచనను కేంద్రీకరించు, యూరీ! ఒక ఖండం మొత్తం ప్రమాదంలో ఉందిపుడు!” అంది రేమండ్.

“అలాగే, ఈ క్లిప్‍కు, మన ప్లాన్‌కు పోలిక ఉందని కదా నీవనేది?”

“అవును. చెబుతానుండు. అద్భుతమైన పాస్ ఇచ్చిన మిడ్ ఫీల్డర్ నీవు, నీవిచ్చింది అలాంటి ‘పాస్’. నీవు చేయాలి. ఇక స్ట్రయికర్ ఎవరంటే, ఆటోమేటెడ్ స్పేస్ షిప్ NASS 2. అణువ్యర్థాల నౌక నీ సాకర్ బాల్. ఇక గోల్ పోస్ట్, మనం దాన్ని మళ్లించి తీసుకు పోయే గమ్యం.”

“ఆ! ఇప్పుడు జరుగుతున్న దేవిటో తెలిసింది.”

“గుడ్! కాబట్టి, మీరు ఆ వ్యర్థాల నౌకను ఎదుర్కునే ముందు ఒక మిడిల్ ఫీల్డర్‌గా మీరు చేయాల్సింది, మీ ప్రయాణం ఖచ్చితమైన దిశలో వెళ్ళడం. ఈ విషయంలో మీరు వెంట్రుకవాసి కూడా తేడా లేనంత నిక్కచ్చిగా ఉండాలి. టార్గెట్‍ను చేరడంలో చిన్నగా అటు, ఇటు ఐనా, మొత్తం మిషన్ సంక్లిష్టం అవుతుంది. దీన్ని మనం ఆత్మహత్యల వ్యవహారంగా కాకుండా చేయడానికి ఇంకా చాలా అవకాశం ఉంది. ఇక్కడే మీ పాత్ర కీలకం!  వ్యర్థాలనౌకను దాటిం తర్వాత, మిగతా పనిని, AI నౌక, దానిలోని RVM చేస్తాయి. దాని గురించి మాకు అందోళన అవసరం లేదు.”

“ఓ.కె. అక్కడ చాలా ఒత్తిడి ఉంది” అన్నాడు యూరీ, కుర్చీలో సర్దుకొని కూర్చుంటూ.

“మొత్తం ప్లానంతా ఇదీ కదా?”

“అవును. ప్రస్తుతానికిదే. మీరు వెళ్లే తోవను ఖచ్చితంగా నిర్వహించండి, మిగతాది మాకొదిలేయండి.”

“సరే, మాకూ దానికి కేవలం ఒకరోజు మాత్రమే దూరం ఉంది. మేం మా లెక్కలు వేసుకోవాలిక.”

“సరే వేసుకొండి మరి.”

“మనం తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఆఁ, అగు. మళ్లీ మర్చిపోతానేమో? వ్యర్థాల నౌక నుండి వచ్చే రేడియేషన్ ఎంత తీవ్రంగా ఉంటుందేమిటి?”

“నీవడగడం మేలైంది. అది చాలా ఎక్కువగా ఉంది. ఒక శతాబ్దం క్రిందట ఉన్న దాని కంటే చాలా ఎక్కువ. వాహనం స్పిన్నింగ్ యొక్క లెక్కలు వేసేశాము. మీ లెక్కల్లో వాటిని చేర్చుకోవడం మరువకండి.”

“తప్పకుండా”

ఆమె ప్లాన్‌ను భూమ్మిది సిబ్బందికి షేర్ చేసింది. ఎవరెవరు ఏమేం చేయాలో వివరించింది. యూరీ వెంటనే ఆ క్యాలుక్యులేషన్స్ పట్ల తన సిబ్బందిని అప్రమత్తం చేశాడు. వారు పని ప్రారంభించారు. వారి సూపర్ కంప్యూటర్లు సరైన కో-ఆర్డినేట్లను, ఆ వ్యర్థాల నౌకను వారు సమీపించాల్సిన కోణాన్ని గురించి పనిచేశారు. AI నౌకతో కూడా కాంటాక్ట్ ఏర్పరుచుకోడానికి వారికి ఒక సరైన పొజిషన్ కావాలి. కేవలం 0.5 డిగ్రీల తేడా ఉన్నా, మొత్తం మిషన్ నీరుగారిపోతుంది.

వారి లెక్కలు పూర్తయ్యాయి. సెన్సర్సు, ప్యారామీటర్లను ట్రాక్ చేసి వారి కంప్యూటర్లలో ఫీడ్ చేశారు. అవి మొత్తం వ్యవహారాన్ని అనుకరించి చూపి, సిద్ధం చేశాయి. మానవ జాతి భవితవ్యాన్ని తేల్చే, వారి ప్రయాణదిశను నిర్ణయించడానికి వారు సిద్ధమైనారు. నౌకను నడిపేవాడు యూరీయే కాబట్టి, ఒక వేళ ఏదైనా తప్పు జరిగితే, బహుశా అది బయట పడబోయేది అతని నుండే బయట పడబోయేది.

యూరీ జూనియర్ బరువెక్కిన హృదయంతో ధ్యానం లోకి వెళ్లాడు. అతనికి కొంచెం ఆందోళన గానే ఉంది. అంతకు ముందతడు మిషన్‍ను నడిపినపుడు అతనికి ఏమాత్రం భయం అన్నది లేదు. ఇప్పుడు కూడా, మానవజాతిని కాపాడటం కోసం మహా అయితే తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు, తన తాతయ్య లాగా. కొత్త విజ్ఞానంతో, పడుకోడానికి ప్రయత్నించాడు. ఈ సారి అతని త్యాగం కూడా పని చేయని స్థాయికి వెళుతుందేమో ఆ మిషన్.

మెల్లగా, గాఢ నిద్ర లోకి జారుకున్నాడు యూరీ. ఒక గంట ప్రశాంతంగా పడుకున్నాడు. నిద్ర లేచి కాక్‌పిట్ లోకి వెళ్లాడు. మొత్తం వ్యవహరం జరుగబోయేది అక్కడనుండే. కుర్చీలో కూర్చుని, కళ్ళు మూసుకున్నాడు.

వారందరూ ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. ముగ్గురు సిబ్బంది వారికి కేటాయించిన స్థానాల్లో, యూరీ పైలట్ స్థానంలో కూర్చున్నారు.  నౌకను విజయపథంలో నడిపించటానికి.

“యూరీ, మీరు సిద్ధంగా ఉన్నారా?” రేమండ్ కామ్‍పై అడిగింది. యూరీ బలంగా ఊపిరిపీల్చి, స్పందించాడిలా “నేను పుడుతూనే సిద్ధం!”. అతని ముఖంలో ఒక కృత్రిమపు నవ్వు.

మరు క్షణం, నేవిగేషన్ తెర మీద, వ్యర్థాల నౌక ప్రత్యక్షమైంది. పూర్తి సైజులో. దాని రేడియేషన్ ప్రభావం ప్రచండంగా ఉంది. ఒక గీత కూడా పడకుండా, వారు దానికి సమీపంగా వెళ్లగలిగితే అదృష్టవంతులే. యూరీ తన ముందున్న లివర్ పై గ్రిప్‍ను బిగించాడు.

***

అణు వ్యర్థాల నౌక నుండి దాని వెలుగు బయటికి వస్తూంది. దాని వల్ల అంతరిక్షంలో అది స్పష్టంగా కనబడుతూంది. 30 వేల మైళ్ల దూరంలో, స్వయంచాలక శక్తి గల వ్యోమనౌక NASS2 కూడ మానిటర్ మీద కనబడుతూంది. ఒకరోజు ముందు, యూరీ, అతని బృందం చేసిన లెక్కలను బట్టి, వారు దాన్ని తమ స్పేస్‌షిప్ లోకి ఎంటర్ చేస్తున్నారు. దీనివల్ల వారు ప్రయాణించాల్సిన దిశ తెలుస్తూంది.

యూరీ, వేళ్లు లేని గ్లోవ్స్ ధరించాడు. వాటి లోపల అతని చేతులకు చెమటలు పోస్తున్నాయి. తన ఆత్మనిగ్రహన్ని కోల్పోకుండా అతడు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. తన వాహనాన్ని మార్స్ AI నౌకతో అనుసంధానించేందుకు, కదిలించాడు. వ్యర్థాల నౌక భూమి నుంచి వస్తున్న నౌక వైపు కదులుతూ ఉంది. అదే వేగంతో దానికి వెళ్లి తగిలించడం అంత సులువు కాదు.

‘గుండె గొంతుకలోన కొట్టాడింది’ అన్నట్లుగా ఉంది వాళ్లందరి పరిస్థితి. సిబ్బంది, నౌకను చాకచక్యంగా నడుపుతున్న యూరీనే గమనిస్తున్నారు. నౌక సరైనమార్గంలోనే ఉంది. రేడియేషన్ మరీ ఎక్కువగా ఉంది, వారి ఊహకందనంతగా. కాబట్టి నంబర్లను తన మెదడులోనే త్వరగా అడ్జస్టు చేసుకుంటున్నాడు. వ్యర్థాల నౌకకు అతి దగ్గరగా వెళ్లడానికి, తన నౌకను స్థిరంగా ఉంచడానికి అతని శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాడు. నౌక, నిలదొక్కుకోవాలని ఎంత ప్రయత్నించినా, తీవ్రంగా కదులుతూనే ఉంది.

కొక్కెం విడుదల అయింది. దాన్ని నేరుగా వ్యర్థాల నౌకకు తగిలించాడు యూరీ. అతని నౌకలో కుదుపు! కాని అతని చేయి స్థిరంగా లివర్‌ను పట్టుకునే ఉంది. అయినా అతని చేతులు వణుకుతున్నాయి. చివరకు వ్యర్థాల నౌకపై పట్టు సాధించాడు. వెంటనే, దాన్ని లాగుతున్నాడు.

సిబ్బంది అంతా హర్షధ్వానాలు చేశారు. మార్స్ లోని కంట్రోల్ టవర్ వాళ్ళతో సహా అందరికీ అర్థమైంది. యూరీ విజయవంతంగా వ్యర్థాల నౌకకు  తన నౌకను తగిలించాడని.

“గుడ్ జాబ్ యూరీ జూనియర్, గుడ్ జాబ్! ఇక మార్గంలోకి తిప్పు” అన్నది రేమండ్.

ఆమె గొంతు విని, ఇంకా చేయవలసింది చాలా ఉండడంతో సిబ్బంది నిశ్శబ్దంగా ఉన్నారు. యూరీ ఏం మాట్లాడలేదు. అతడు ఊపిరి పీలుస్తున్న శబ్దం అతడికీ వినిపిస్తుంది. అలా; అంత క్లిష్టంగా ఉంది పరిస్థితి. ఇతర వివరాలపై అతడు మరింత ఏకాగ్రత చూపించాల్సి ఉంది. ఎవరి మాటలూ వినే స్థితిలో లేడతను.

భూమి మాడ్యూల్ విజయవంతంగా వెళ్లి, వ్యర్థాల మాడ్యూల్‍కు తగులుకుంది. కొంచెం పక్కకు జరిగింది, దాని దిశను మారుస్తూ. భూవ్యోమనౌక, యూరీ సారథ్యంలో, భూమి మార్స్‍ల ప్రభావానికి మధ్యంతర స్థితిలో ప్రవేశించింది.

నిదానమే ప్రధానమని పెద్దలన్నట్లు, భూవ్యోమనౌక మెల్లగా AI నౌక వైపు కదలడం ప్రారంభించింది. యూరీ దానికి దగ్గరగా చేరుకున్నాడు. “దిశ, కోణం కరెక్ట్‌గా ఉన్నాయి. వ్యర్థాల నౌకను పోనివ్వు” అని అతనికి ఆదేశం వచ్చింది.

అంతా, అనుకున్నట్లుగానీ, సజావుగా జరిగింది. వ్యర్థాల నౌకను వదిలించి, దాన్ని ఇంకో దిశలో తనకు తానే విడిగా వెళ్లేలా చేశాడు.

“రేమండ్?” అని పిలిచాడు. “AI నౌక మొదట మొరాయించింది కదా, ఇప్పుడది సరిగ్గా చేస్తుందని గ్యారంటీ ఏమిటి?”

“ఉత్పన్నమయ్యే సమస్యలను మేము డీల్ చేశాంలే. దానిలోని మా RVM (రొబోటిక్ కంప్యూటింగ్ మిషన్), ఏదైనా లోపం తలెత్తితే సరిదిద్దగలదు. కాబట్టి మేం నూటికి నూరుశాతం సామర్థ్యం మా నౌక నుండి ఆశిస్తున్నాము” అన్నది రేమండ్, ఒక చిరునవ్వు ముఖాన్ని పరుచు కుంటూ ఉండగా. “అంతా బ్రహ్మండంగా జరుగుతుంది.”

“అలాగే” అన్నాడు యూరీ, పెదవులు బిగించి; నాలుక కొసనున్న ప్రశ్నను నొక్కిపెడుతూ. కాని, నిగ్రహించుకోలేక, నిర్థారణ కోసం ఆ ప్రశ్నని అడగాలనీ తీర్మానించుకున్నాడు

“ఇక వ్యర్థాల నౌక భూమికి తిరిగి రాదు అని ఖచ్చితమేనా?”

రేమండ్ హృదయంగర్వంతో పొంగింది. ఆమె పెదవుల అంచులు కొంచెం లేచి అందమైన చిరునవ్వును సంతరించుకొన్నాయి. తను బదులిచ్చేటప్పుడు యూరీ తన ముఖాన్ని చూసి ఉంటే బాగుండేదని ఆమెకనిపించింది.

“నీవు ఆందోళన చెందాల్సిన పనే లేదు! మనసులో ఎలాంటి భయాలు లేకుండా మీరు భూమికి తిరిగి వెళ్లొచ్చు. ఇంటికి వెళ్లి, ఈ అంతరిక్షయాత్ర తర్వాతి ఎపిసోడ్‌ను చూడందంతే!”

భూవ్యోమనౌక అక్కడి నుండి తొలగి పోయి, భూమి వైపుకు మళ్లింది. ఇక మిగిలిన పని AI నౌక చూసుకుంటుంది. Al నౌక రంగంలోకి దిగిందిక. అతి సులభంగా, తనను తాను వ్యర్థాల నౌకకు తగిలించుకుంది. అసలు రేడియేషన్ అన్నదే లేనట్లు అంత సులభంగా అంతా జరిగిపోవడం చూసి యూరీ ఆశ్చర్యపడ్డాడు. “ఇంతవరకు చాలా బాగుంది” అన్నాడు కామ్‍లో, రేమండ్‌తో.

“నేను చెప్పాను కదా?”

“చెప్పావు”

Al నౌక వ్యర్థాల నౌకకు అనుసంధానమవగానే, వ్యర్థాల నౌకను ఏ మార్గాలకు ఇంచుమించు మళ్లించగలదో యూరీ లెక్కలు వేశాడు. ముఖ్య లక్ష్యం ఏమిటంటే, భూమికి ఏ సంబంధం లేకుండా, అది వెళ్లిపోవటం. అంతేకాదు మార్స్‌కూ, పాలపుంతలోని ఇతర ఏ ఖండాలకు దూరంగా అది వెళ్లిపోవాలి. అది అంతరిక్షంలో పూర్తిగా, ఎప్పటికీ అదృశ్యమై పోయేలాగా భూనౌక గణించింది.

Al నౌక లోని రోబో RVM 6024, మూడు ఆప్షన్లతో ముందుకొచ్చింది. అంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోడం దానికి కష్టమైంది. అందుకు, దానిని వాటిని అది మార్స్ కంట్రోల్ రూముకు పంపింది. అక్కడ, రేమండ్, అమె సిబ్బంది, ఆ మూడు ఆప్షన్లతో అత్యుత్తమమైన దాన్ని ఎన్నుకుంటారు.

రేమండ్. ఆమె బృందం, ఒక సమావేశంలో, వ్యర్థాల నౌకకు ఏం జరిగితే బాగుటుందో కలిసి చర్చించారు. వారేం తేల్చారంటే, భూమి మాతృగ్రహం కనుక, ఆమె ప్రజలకు కూడా ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి అవకాశం ఉండాలని.

దీంతో, రేమండ్ యూరీని సంప్రదించింది. అతడు తన బృందంతో సహా భూమికి తిరిగి వెళ్ళేదారిలో ఉన్నాడు. అతనికి విషయం చెప్పి వాళ్లు ఏ ఆప్షన్ కావాలంటారో అడిగారు. ఆ సమావేశంలో భూగ్రహం ప్రతినిధులు, యూరీ, అతని బృందమే.

అవసరమైన అందరూ, యూరీ నాన్న మీషా, రేమండ్ బ్యారీ అమ్మ రేచల్‍తో సహా, ఉన్నారని నిర్ధారించుకుని, రేమండ్, ఆ మూడు ఆప్షన్లనూ వారి ముందుంచింది.

కాసేపు సుదీర్ఘ నిశ్శబ్దం! మూడూ బాగున్నట్లు గానే ఉన్నాయి. దేన్ని ఎంచుకోవాలో తెలియని స్థితిలో వారున్నారు.

చివరికి ఓటింగ్ జరిగింది. ఒక ఆప్షన్‍కే ఎక్కువ మంది మొగ్గు చూపారు.

“మంచిది. ఈ సమావేశంలో పాల్గొన్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు” అన్నది రేమండ్.

మీటింగ్ తర్వాత, రేచల్ బ్యారీ కంట్రోల్ రూంలో ఉండిపోయింది, రేమండ్ AI నౌకకు చివరి సూచనలు చేస్తూ ఉండడాన్ని గమనిస్తూ.

“NASS 2 రిపోర్ట్!” అని పిలిచింది రేమండ్.

“స్పేస్ క్రాఫ్ట్‌ని, ఎగిరే దిశను, భూమి నుండి ఎత్తును మార్చే పరికరాలు (thrusters) స్థిరంగా ఉన్నాయి. తర్వాతి సూచనల కోసం ఎదురు చూస్తున్నాం” అన్నదొక స్త్రీ గొంతు. అది RVM 6024 లోని స్వయంచాలక స్వరం.

“‘ఆప్షన్ మూడు’ ఎన్నుకోబడింది” చెప్పింది రేమండ్.

“అంటే వ్యర్థాల నౌకను సూర్యుడి నార్త్ పోల్ వైపుకు మళ్ళించాలనేదే కదా? మీరు దాని పట్ల నిర్ధారణకు వచ్చారా? పూర్తి అవగాహనతో ఉన్నారా? మళ్లీ ఆ నౌక భూమికి తిరిగి రాకూడదనే కదా?” అనడిగింది AI నౌక.

“అవును. ఆప్షన్ 3 నే మనం అమలుచేయాలి” అన్నది రేమండ్,

“కన్ఫర్మ్‌డ్ ఆప్షన్ 3. సీక్వెన్స్‌ని ప్రారంభిస్తున్నాం.”

Al నౌక టేకాఫ్ అయిన వెంటనే, చాలామంది వారి నావిగేషన్ సిస్టమ్‌ను చూడటం ప్రారంభించారు. మార్స్ – భూమిల మధ్యనున్న చోటు నుండి కదిలి, అది ఒక ఊహించని మలుపు తీసుకుంది. సౌర కుటుంబం కేంద్ర స్థానం వైపు నేరుగా వెళ్లసాగింది.

రేమండ్ నిశ్చింతగా ఒక నిట్టూర్పు విడిచింది; పెద్ద నావిగేషన్ తెరనుంచి వెనక్కు తిరిగి అమ్మను కౌగిలించుకుంది. తాము రూపొందించిన AI నౌక చక్కగా పనిచేసి, వ్యర్థాల నౌక నుండి మానవాళిని కాపాడినందుకు ఆమె ఆనందంతో పొంగిపోతూ ఉంది. “అనుకున్నట్లే జరిగిందా?” ఒక గొంతు ఆమె చెవిలో కామ్ ద్వారా అడిగింది.

“నీకేం చెప్పాను యూరీ? హాయిగా వెనక్కు చేరగిలబడి, నీ భయాలు గియాలు సూర్యునిలో అదృశ్యమవటాన్ని ఎంజాయ్ చేయి.”

“ఓహ్. ఎంత ప్రశాంతంగా ఉందో!” అన్నాడు యూరీ. అతడు సంతోషంగా నవ్వుతుంటే అతని నోరు గుండ్రంగా మారింది.

మొదటి రెండు ఆప్షన్లను గురించి కూడా యూరీ ఆలోచించాడు; అవేమైనా పని కొచ్చి ఉండునేమో అని. మొదటి ఆప్షన్, వ్యర్థాల నౌకను సుదూరంగా ఉన్న ఒక కక్ష్యలోకి మళ్లించి, రెండు వేల సంవత్సరాల వరకు దాన్ని తిరిగి రాకుండా చేయడం. అప్పటికి దాని న్యూక్లియర్ రేడియేషన్ హానిరహితమైపోతుంది. తర్వాత AI నౌక మార్స్‌కు  తిరిగివస్తుంది.

ఇక రెండోది, దాన్ని లా (Lo) అనీ, జూపిటర్ యొక్క అగ్నిపర్వతాలతో కూడిన, మానవావాసం కాని, ‘మూన్స్’లో ఒక దాని వైపు మళ్లించడం, జూపిటర్ లోని ‘మూన్’, అదే విపరీతమైన రేడియేషన్‍ను వెదజల్లుతూంటుంది. వ్యర్థాల నౌకను దానిలో ప్లేల్చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. తర్వాత AI నౌక మార్స్‌కు ఎలాగూ తిరిగొస్తుంది.

ఇవి రెండూ హేతుబద్ధమైనవే. కాని అందరూ మూడోదానికీ మొగ్గు చూపారు. అణువ్యర్థాల నౌకను నేరుగా సూర్యుని వైపు పంపడం, ఆ క్రమంలో AI నౌకను కోల్పోవడం. అది సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ప్రభావాన్ని, తప్పించుకోలేదు.

యూరీ కళ్ళు మూసుకొని, గాలి పీల్చుకొన్నాడు. తాను దేని కొరకై పుట్టి, శిక్షణ పొందాడో, ఆ లక్ష్యాన్ని నెరవేర్చి అతడు సాఫల్యం చెందాడు. ఆ భావన అతన్ని ఎంతో ఆనందింప చేసింది.

***

వారు భూమికి తిరిగిరాగానే, యారీకి, అతని సిబ్బందికి ఘన స్వాగతం లభించింది. ప్రపంచమంతా వారికి జేజేలు పలికింది. ‘యూరీ’ మంత్రాన్నే జపించింది. మార్స్ – భూమిల మధ్య కమ్యూనికేషన్ తిరిగి పునరుద్ధరించబడింది. భూప్రజలకు, మిషన్ విజయంలో రేమండ్ బ్యారీ. ఆమె బృందం, AI నౌక, ఎంతో సాయపడ్డారని తెలిసింది.

ల్యాబ్‍లో, ప్రెస్ వారి ఎదుట, ఎంతో శ్రమతో కూడిన సుదీర్ఘ రోజును గడిపి, యూరీ ఇల్లు చేరుకొన్నాడు. అతడు లోపలికి వెళ్లగానే, వాళ్ల నాన్న సోఫాలో కూర్చుని, టి.వి. చూస్తూండడాన్ని గమనించాడు. ఆయన యూరీని చూసి, సోఫాలోంచి లేచి, చేతులు చాచి, కొడుకు వైపు నడిచాడు

“నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉందిరా అబ్బాయ్! మీ తాతయ్య, మా అమ్మ కూడా గర్వపడతారు” అన్నాడు మీషా, కొడుకును బలంగా హత్తుకుంటూ. యూరీ బుగ్గల మీదుగా ఆనందబాష్పాలు రాలాయి. తండ్రి పరిష్వంగంలో, పెదవులు కొరుక్కుంటూ వెక్కిళ్లు దాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయాడా కుర్రవాడు.

మార్స్‌ని, భూమిని కాపాడే మిషన్ పూర్తయింది. ఇక AI నౌక పూర్తిగా సూర్యుడిలో అదృశ్యం అయిందనే వార్త కోసం వారు ఎదురు చూడసాగారు. అది ఆ శతాబ్దానికే తలమానికమైన వార్త. ఆరు రోజుల నిరీక్షణ తర్వాత, ఆ వార్తను ముందుగా అందుకున్నవాడు యూరీనే. రేమండ్ అతనికి నేరుగా చెప్పింది దాన్ని. తర్వాత, అది ప్రపంచమంతా ప్రసారమైంది. అప్పుడు మొదలయ్యాయి అసలు విజయోత్సవాలు! ఇక భూమికి గాని, మార్స్‌కి గాని, అణువ్యర్థాల నౌక నుండి ఎటువంటి బెడదా లేనట్లే!

భూమిపై ఉన్న ప్రతి దేశం చాలా ఉద్వేగంగా ఉంది. 2070, ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా సెలవుదినాన్ని ప్రకటించారు. ఆ రోజు చాలలేదు ఉత్సవాలకు. రెండో రోజుకూ అవి పాకాయి. ఆ విజయాన్ని పురస్కరించుకొని, చాలా దేశాల్లో మాస్ పెరేడ్లు నిర్వహించారు. బ్యారీ, ఇవానోవ్ పేర్లున్న బ్యానర్లను పట్టుకొని, ప్రజలు  పాటలు పాడారు, పిచ్చిగా కేకలు వేశారు. అదంతా ఆనందోత్సోహమే!

ఆ రెండు కుటుంబాలను ప్రశంసించడమే కాక, భూగ్రహనికి ఆపదను అధిగమించడంతో తోడ్పడినందుకు మార్స్‌పై కూడా పొగడ్తల జల్లు కురిసింది. ఐక్యరాజ్య సమితి ఒక సమావేశం నిర్వహించింది. అందులో మార్స్‌ని ప్రశంసించి, మార్స్ అభివృద్ధికి, వారు చేసినదానికంటే ఇతోధికంగా సాయపడాలని తీర్మానించింది. రెండు విగ్రహలను నిర్మించారు. వాటి ఉద్దేశం ఒకటే. దాన్ని నిర్మించిన వ్యక్తులూ ఒకరే. ఆ విగ్రహంలో రెండు భాగాలున్నాయి. ఒక అదనపు వివరం వాటిల్లో చేర్చబడింది. ఒక విగ్రహం మార్స్‌కు పంపారు. రెండవది భూమికి!

ఆ విగ్రహంలో ఇద్దరు వ్యక్తులున్నారు, పక్కపక్కన నిలబడి. వారు యూరీ ఇవానోవ్, నీల్ బ్యారీల ప్రతిమూర్తులు. వారి వెనుక రేమండ్ బ్యారీ, యూరీ జానియర్ ఇవానోవ్. ఆ విగ్రహాలు ఆ సంవత్సరానికే ప్రత్యేకతలు! వాటికో పేరు పెట్టారు.

‘ఒక శతాబ్దపు విముక్తి!’

‘The Redemption of a century’

రెండు టీముల మధ్య ఒక అంతర్జాల (virtual) విందు ఏర్పాటయింది. కాలం అనుకూలిస్తే, ఉభయులూ ఒకసారి కలుసుకోవాలని పరస్పరం వాగ్దానాలు చేసుకోన్నారు.

జీవితం సాగిపోతూంది. ఉత్సవాల సంరంభం తగ్గుముఖం పట్టింది. రెండు వారాలు గడిచాయి. అంతరిక్ష కార్యక్రమం సజీవంగానే ఉంది. ఇతర మిషన్లు పరిశోధలనశాలలో మొదలైనాయి. ఆ వార్త ఇంకా ప్రసారం అవుతూనే ఉంది. దేశాల మధ్య ఎలాంటి ద్వేష భావాలు లేకుండా ఉండడానికి ఈ మిషన్ ఎంతో తోడ్పడింది. దీని వల్ల భూమి సర్వతోముఖాభివృద్ధిని పొందసాగింది. మార్స్ కూడా అందులో భాగమైంది. వలస కేంద్రాలు (కాలనీలు) తామర తంపరగా పెరిగాయి. త్వరలోనే IMB వాటికి రాజధాని అయింది.

మార్స్‌పై స్థిరపడ్డ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, మార్స్ అభివృద్ధికి తమ శాయశక్తులా దోహదం చేయసాగారు. మార్స్ మొత్తం టెక్నాలజీ పైనే ఆధారపడి నడవసాగింది. దాన్ని భూమితో కూడా షేర్ చేసుకోసాగింది. దానివల్ల మరింత ప్రయోజనం చేకూరింది. భూమి సాంకేతికత, మార్స్ సాంకేతికత తరచు కలిసి, పరస్పర ప్రయోజనాలు అపారంగా సిద్ధించాయి.

మార్స్‌పై జీవితం ప్రశాంతంగా ఉంది. ఎక్కడా ఎటువంటి ప్రమాదం లేదు. దానివల్ల మార్స్ మరింత కోరదగినదైంది. మార్స్‌కు భూమికి అటు ఇటు రాకపోకలు సర్వసాధారణమయ్యాయి. విపరీతంగా పెరిగాయి కూడా. మునుపు ఆ ప్రయాణం నెలల తరబడి సాగితే, ప్రస్తుతం ఒక నెల సరిపోతుంది. చూస్తుండగానే ఇది సంభవమైంది.

అంతర గ్రహ ప్రయాణాలు ఒక దశలో సాధ్యమైనంత చౌకగా మారాయి. దీనివల్ల చాలామందికి అవకాశం దొరికింది. రెండు గ్రహాల ఆర్థిక వ్యవస్థలూ బలపడ్డాయి. రాబోయే రెండు దశాబ్దాలలో, రెండింట్లో జనాభా సమానంగా ఉంటుందని ఊహిస్తున్నారు.

ఇదంతా జరిగినా, భూమే మాతృగ్రహమనీ, మార్స్ దాని ఆధీనంలోనే ఉందని గ్రహించాలి. మార్స్ మీద జరిగిన అభివృద్ధి అంతా, భూమి నుండి వెళ్లిన వనరుల ద్వారానే సాధ్యపడిందన్నది నిజం.

***

యూరీ జూనియర్, టర్మినల్ దగ్గర, ఒక గుంపు మధ్య నిల్చుని ఉన్నాడు. అందరూ ఓపికగా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. ఎండ బాగా కాస్తుంది. కాని ఒక మేఘం, యూరీపై ఎండ పడకుండా అడ్డంగా ఉంది. తాను తన క్యాప్ మరచిపోయి టర్మినల్‍కు వచ్చేశాడు; తొందరలో.

అతడు నీలిరంగు జీన్స్, వైట్ టాప్ తీసుకున్నాడు. అతని మెడ వంగి ఉంది. వందో సారి తన ముందున్న టెక్స్ట్‌ని చదువుకున్నాడు. మొహమాటంగా నవ్వుతున్నాడు. తన సందేశాలను అతడు చదువుతూ ఉత్సుకత చెందడం, ఆమె చూడకూడదని అతని కోరిక.

రెండో నెలల తర్వాత రేమండ్ భూమికి రావాలని నిర్ణయించింది. ఎవరు ఏ ప్లానెట్‌ను ముందు దర్శించాలనే దాని మీద చర్చ జరిగితే, అందులో యూరీయే గెలిచాడు. భూమి మీద ఎన్నో సహజ పకృతి వనరులున్నాయని, ఆమె ముందు భూమికి వస్తే బాగుంటుందని అన్నాడు. మార్స్‌లో ఏమి లేవు. తాను వ్యక్తిగత సెలవుపై వెళ్లడానికి ఆమె అనుమతి తీసుకుంది. మార్స్ లోని స్పేస్ మిషన్ అసోసియేషన్ వారు, ఆమెకున్న ప్రాముఖ్యత దృష్ట్యా, పొరుగు గ్రహానికి ఆమెను ఒంటరిగా పంపకూడదని నిశ్చయించారు.

ఆమె వెంట, ఎస్కార్టుగా, ఆమె స్నేహితురాలు కీరాను పంపాలని అనుకున్నారు. కీరాకు కూడ ఆనందమే! రేమండ్‌కు, ఇష్టం లేకున్నా, తన రహస్యాన్ని కీరా చెప్పక తప్పలేదు. తాను భూమికి వెళుతున్నది యూరీని కలవడానికేనని చెప్పినపుడు, ఇద్దరి ఆనందం అవధులు దాటింది.

జనం అతన్ని భుజాలతో తోయసాగారు. ఆ గొప్ప భవనం నేల మీద యూరీ నిలుచుండి పోయాడు. ద్వారం తెరుచుకొని, జనం వెల్లువలా బయటికి రాసాగారు. “ఎక్కడన్నావు రేమండ్?” అతని చూపులు బయటకు వస్తున్నవారి ముఖాలను, ఎస్కలేటర్ మీదుగా దిగుతున్నవారి ముఖాలను పరిశీలిస్తున్నాయి.

చివరికి, తాను తెర మీద మాత్రమే చూసిన, గొంతు మాత్రమే విన్న, యువతి దర్శనమిచ్చింది. ఆమెను చూసిన అతని గుండె వడివడిగా కొట్టుకుంది. ఆమె ఎస్కలేటర్ మెట్లు మీదుగా దిగుతూంది. పక్కన ఆమె స్నేహితురాలు ఆమెను కొన్నిసార్లు చూశాడు.

స్నేహితురాలు పక్కనుండడం వల్ల అతను చేయదల్చుకున్న దానికి ఏ ఇబ్బందీ లేదు! ధైర్యం తెచ్చుకొని ఆమె వైపు చేయి ఊపాడు. అతన్ని చూసి ఆమె బుగ్గల్లోకి చిరునవ్వులు వచ్చి చేరాయి.  ఆమెలోని సీతాకోకచిలుకలకు స్వేచ్ఛ లభించింది.

ఒక అడుగు ముందుకేశాడు. ఒక వ్యక్తి అతనికి అడ్డం వచ్చాడు.

“కొంచెం చూసుకొని పోతావా?” అని కోపంగా అన్నాడా వ్యక్తి.

“ఐయామ్ సారీ!” అన్నాడు యూరీ జూనియర్. అతడి వెళ్లిపోయాడు. రేమండ్ ఆమె స్నేహితురాలు, అతన్ని చూసి నవ్వుతున్నారు!

యూరీ ముందుకు నడిచాడు. దారి క్లియర్! రేమండ్, బ్యాగ్ క్రిందపెట్టి, అతని చేతుల్లో వాలింది!

ఇద్దరూ ఒకే ఎత్తు ఉన్నారు, ఒకే రకమైన శరీర పటుత్వాలు. ఎవరు ఎవరి నీడలో చేరారో తెలుసుకోవడం కష్టమే!

కాసేపు ఇద్దరూ కౌగిలిలో ఒదిగిపోయారు. గతించిన సంవత్సరాలన్నీ వారి కౌగిలిలో కొలువు తీరాయి. ఆ ఆలింగనం చాలా సేపు కొనసాగింది. వారిద్దరూ ఒక శతాబ్దాన్నే ఆపద నుంచి విముక్తి చెందించడం కోసం కలిసి పని చేశారు, పరస్పర సహకారంతో, సమర్థతతో, సహనంతో! వారి విముక్తి కూడా ఇప్పుడు సాకారమైంది.

వెనక్కు వెళితే, మానవజాతి, 1970లో యూరీ ఇవానోవ్ సీనియర్, నీల్ బ్యారీల సాహసోపేతమైన త్యాగాలను తమ మనస్సులో పదిలంగా దాచుకుంది. 2070లో, తర్వాతి తరం శాస్త్రవేత్తలు, వ్యోమగాములు తమ కరుణార్ద్ర చర్యను పునరుద్ధరించారు. అలా, ఈ ‘శతాబ్దపు విమోచన’ అన్న కథను ముగిద్దాం!

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here