అంతర్మథనం-2: సనాతనం – శాశ్వత వాదం

0
9

[box type=’note’ fontsize=’16’] “సనాతన ధర్మంలో ఎన్ని ధర్మాలున్నాయో, అన్ని, అంతకు మించీ ధర్మసూక్ష్మాలున్నాయి. ఇన్ని సూక్ష్మాలు, ఇంత మీమాంస మరే వాదంలోనూ ఉండవు” అంటున్నారు పొన్నాడ సత్యప్రకాశరావు. [/box]

[dropcap]ఏ [/dropcap]వాదమయిన తనలోని ప్రత్యేకతని, గొప్పదనాన్ని తెలిపి తను మిగిలిన వాదముల కన్నా ఎందులో మెరుగో చాటి చెబితే బాగుంటుంది. కాని ఆధునిక వాదాలన్నీ కేవలం సాంప్రదాయవాదాన్ని ఆడిపోసుకుని మాత్రమే ఉనికిని నిలబెట్టుకొంటున్నాయి. వ్యాసుల వారు మహాభారతాన్ని వ్రాస్తూ – ‘ప్రపంచంలో ఉన్నదంతా ఇందులో ఉన్నది. ఇందులో లేనిది మరెక్కడా లేదు’ అని ఢంకా బజాయించి చెప్పారు. అది సనాతనవాదానికి వర్తిస్తుంది. ఆధునికవాదులు చెప్పే అభ్యుదయం సాంప్రదాయవాదములో లేకపోలేదు. అసలు సనాతనవాదము విమర్శకు గురి అయినదీ అంటే లోపము వాదములో లేదు, సంప్రదాయవాదుల స్వలాభాపేక్షలో ఉన్నది. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాలకు సిద్ధాంతాలని వక్రీకరించడం వలన కలిగిన దుష్పరిణామం ఇది. వ్యక్తుల లోపాలను సంప్రదాయవాదానికి ఆపాదించి దెబ్బ తీయాలనేది ఆధునిక వాదుల లక్ష్యం. భర్త ద్వారా సంతానం పొందలేకపోతే భర్త అనుమతితో పరాయి పురుషుని ద్వారా సంతానం పొందవచ్చటోంది సంప్రదాయవాదం… ఇంతకన్నా ఆధునికత ఏం కావాలి? అయితే ఈ అనుమతి సంతానేచ్ఛకి మాత్రమే పరిమితం. సంతానం కలిగిన తరువాత భౌతిక సుఖాలకు అక్రమ మార్గాలు నిషిద్ధం.

నిజానికి సనాతన ధర్మం భౌతిక విషయ వాంఛలను ఏనాడూ కాదనలేదు. రాజ్యాలనీ, సిరి సంపదలనూ, స్త్రీ సౌఖ్యాలని అన్నిటినీ అనుభవించమనే చెబుతోంది. అయితే అవన్నీ ధర్మబద్ధంగా మాత్రమే చెయ్యాలని నిబంధన పెట్టింది… అందుకే ఇంతకాలం నిలబడగలిగింది. సంసారిగా సుఖించమన్నది, ఆ తరువాత సన్యాసిగా తరించమన్నది. మానవుడు సాధారణంగా ఏం కోరుకుంటాడు? ఆరోగ్యం, ఐశ్వర్యం, అందమైన బార్య, సంతానం, వస్తువాహనాలు, అధికారం, ఇంకా శత్రునాశనం ఇవే కదా. ఇవే గాక, మానవాళికి ఏయే రకాల కోరికలు ఉంటాయో వాటన్నింటినీ ప్రసాదించమనే ‘చమకం’ వేడుకొంటోంది. మూడు వందల పై చిలుకు కోరికలను ప్రస్తావించింది చమకం. కోరికలు కలగడం తప్పుకాదు… కోరికలు లేకుండా ఉండమనీ చెప్పలేదు. ఎవరినీ నొప్పించకుండా, ఒప్పించి తీర్చుకోమంటోంది. అయితే వాటికన్నా ముఖ్యంగా మోక్ష సాధనని మరువ వద్దంటోంది సనాతన ధర్మం.

అయితే సనాతన ధర్మంలో ఎన్ని ధర్మాలున్నాయో, అన్ని, అంతకు మించీ ధర్మసూక్ష్మాలున్నాయి. ఇన్ని సూక్ష్మాలు, ఇంత మీమాంస మరే వాదంలోనూ ఉండవు. వీటితోనే చిక్కు. వక్రీకరణకు ఆస్కారం ఇక్కడే ఉన్నది. చాలామంది ముఖ్యంగా సనాతన వ్యతిరేకులు అపార్థం చేసుకుని అదే అర్థమనుకొని లేనిపోని అభియోగాలు మోపుతుంటారు.

రామాయణం అంతా వింటారు. మర్యాదా పురుషోత్తముడైన రామునిలో వీరికి లోపాలు మాత్రమే కనిపిస్తాయి. చాటు నుంచి వాలిని వధించడాన్ని ఖండిస్తారు. గర్భవతైన భార్యను త్యజించటాన్ని ప్రశ్నిస్తారు. భారతంలో ద్రోణుడు తక్కువ కులానికి చెందిన ఏకలవ్యుని మోసం చేసాడంటారు. భాగవతంలో శ్రీకృష్ణుడు గోపికలతో అందునా పెళ్ళయిన వాళ్లతోనూ రాసలీలలు జరపటాన్ని దుయ్యబడతారు.

నరుడెలా బ్రతకాలో చూపటానికి నారాయణుడు రాముడయ్యాడు. అందుకే శ్రీకృష్ణునిల లీలలు చూపించలేదు రాముడు. వాలిని వధించడంలో, లక్ష్యం మంచిదయినప్పుడు ధర్మహాని కలుగకుండా చూడవలసి వచ్చినప్పుడు ఆపద్ధర్మాన్ని వాడవచ్చని చూపిస్తాడు. రాజులు పాటించే వేట ధర్మాన్ని వినియోగించి వాలిని వధించాడు. వాలిని ఓ మృగంగా భావించి మట్టుబెట్టాడు. పితృవ్యాక్కుని, ప్రజావాక్యాన్ని గౌరవించడం కోసం రాముడు భోగించవలసిన సమయంలో యోగిగా బ్రతికాడు. కేవలం వేటకుక్కలను చంపడానికి ఎంతో సాధన చేసి పొందిన ‘శబ్దభేది’ని ప్రయోగిస్తాడు ఏకలవ్యుడు. విచక్షణా జ్ఞానం లేనివారి వద్ద దివ్యాస్త్రాలు ఉండటం మంచిది కాదని ఏకలవ్యుడిని అశక్తుడిని చేస్తాడు ద్రోణుడు. రాసలీలలను ఓ కామకేళిగా మాత్రమే కలియుగపు దృష్టితో చూసేవారికి సుమారుగా పదేళ్ళ చిన్నికృష్ణుడు తనకన్నా పెద్దవాళ్లతో ఎలా క్రీడించగలడనే సందేహం రాదు. అది కూడా ఒకే సమయంలో వందలాది గోపికలతో ఎలా కూడగలడనే ఆలోచన చెయ్యరు.. పాతికేళ్ళ వారికి మాత్రం సాధ్యమా? ఒకే సమయంలో వందలాది మందితో క్రీడించిన మరొక వ్యక్తిని చూపించగలరా? ఇవన్నీ, దివ్యత్వానికి చిహ్నాలని గమనించలేరు వీరు.

ఇద్దరు వ్యక్తులున్నారనుకొందాం. ఒకరు తొంభై శాతం చెడ్డవారు. మరొకరు తొంభై శాతం మంచివారు. వీరిద్దరూ తలపడాల్సి వస్తే తొలి జయం చెడ్డవానిదే అవుతుంది. తొంభైశాతం చెడ్డవానికి తొంభైశాతం మంచివానిలో మంచితనం కన్నా, పది శాతం చెడ్డతనమే కనబడుతుంది. దానిని తనకు అనుగుణంగా వాడుకుని ఇతను కూడా చెడ్డవాడే అనేటట్టుగా లోకాన్ని భ్రమింపజేయగలడు. కాని తొంభై శాతం మంచివాడు అవతలవాని లోని చెడ్డదనాన్ని వాడుకోలేడు. ఎందుకంటే ఇతరు తొంభై శాతం మంచివాడవడం వలన. దుర్యోధనుడికి ఒక్క మంచివాడూ కనబడలేదట. అలాగే ధర్మరాజుకి ఒక్క చెడ్డవాడూ కనబడలేదు. దుర్యోధనుడు ధర్మరాజు బలహీనత అయిన జూదం మీద పాచికలాడాడు. తొలి విజయం సాధించాడు. ధర్మరాజు ధర్మనిరతి అతనికి అంతిమ విజయాన్ని అందించింది. సకల శాస్త్ర కోవిదుడు, పరమ శివభక్తుడు, అగ్రకులస్థుడు అయిన రావణాసురుని మట్టుబెట్టిన రాముడు నిమ్నకులస్థురాలైన శబరి ఎంగిలి ఆతిథ్యాన్ని స్వీకరించలేదా? అరుంధతి, విదురుడు, వాల్మీకి, గుహుడులకు సమున్నత స్థానం కల్పించిన సనాతన ధర్మం రాగద్వేషాలకు అతీతం. దుష్టశిక్షణ – శిష్టరక్షణ, సర్వేజనా సుఖినో భవంతు ఇవే సనాతనవాదపు ఆదేశాలు.

విషయాన్ని అర్థం చేసుకోవటానికి తెలివితేటలు కావాలి. పరమార్థం తెలుసుకోవాలంటే, జ్జానం కావాలి. అర్థం చేసుకోకపోయినా పరవాలేదు కాని, అపార్థం చేసుకొంటే మిగిలేది అనర్థమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here