అంతర్మథనం

0
11

[dropcap]రెం[/dropcap]డు రోజులనుంచీ మబ్బులు కమ్మిన ఆకాశంలా ఉంది నా మనసు. ఏదో అస్థిమితం, అశాంతి. ఏ పని మీద మనసు నిలవదు. యాంత్రికంగా ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాను. అక్కడ పని చేయటంలో ఏ మాత్రం ఆసక్తి ఉండటం లేదు. నా పెళ్లయి సుమారు పాతికేళ్ళు అయింది. ఇప్పటివరకూ ఏ రోజూ ఇలా అనిపించలేదు. పుస్తకం చదవాలని సోఫాలో కూర్చున్నాను. కళ్ళు అక్షరాల వెంట వెళుతున్నాయి కానీ ఆలోచనలు ఏటో వెళ్ళిపోతున్నాయి. చదవటం ఆపి సోఫాలో వెనక్కువాలి కళ్ళు మూసుకున్నాను. నా మనసు గతంలోకి వెళ్ళింది.

నేను డిగ్రీ చదువు ముగించి ఉద్యోగం కోసం వెతుకుతున్న రోజులు అవి. అప్పుడప్పుడు గుడికి వెళుతూ ఉంటాను. ఆ రోజు కూడా వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళినప్పుడు మొదటిసారి చూసాను వాసవిని. కాళ్ళు కడుక్కుని లోపలకి వెళదామని పంపు దగ్గర నిలబడ్డాను. వాసవి అప్పటికే ఒక చేత్తో పంపు కొడుతూ, మరో చేత్తో చీర కుచ్చిళ్ళు కొద్దిగా పైకెత్తి కాళ్ళు కడుక్కుంటూ ఉన్నది. తెల్లటి పాదాలు వెండిపట్టీలతో మెరిసిపోతూ కనిపించాయి. ఆడవాళ్ళకి పాదాలు కూడా ఇంత అందంగా ఉంటాయా! అనిపించింది. ఆమె వెళుతూ ఎందుకో వెనక్కి తిరిగి నా వంక చూసింది. నేను కూడా అప్రయత్నంగా అటువైపు చూసాను. చెంపకు ఒక పక్కన పుట్టుమచ్చ, పొడవాటి జడలో కనకాంబరం మాలతో, ఆ రూపం మనసులో గిలిగింతలు పెట్టినట్లు అనిపించింది.

ఆ మర్నాడు కూడా గుడికి వచ్చాను. ఆమె మళ్ళీ కనిపిస్తుందేమో అని! అనుకున్నట్లుగానే కనిపించింది. నన్నుచూసి చిరునవ్వు నవ్వి గుడిచుట్టూ ప్రదక్షిణాలు చెయ్యటానికి వెళ్ళింది. ప్రదక్షిణాలు ముగిసి బయట దేవుడి ప్రతిమ దగ్గర కొబ్బరికాయ కొడుతూ ఉంది. కొబ్బరికాయ గుళ్లో కొట్టనివ్వరు. బయటే పగలగొట్టి, చిప్పలు లోపలికి తీసుకు వెళ్ళాలి. పీచు తీయటానికి ఇబ్బంది పడుతూంటే “నేను తీసి ఇవ్వనా!” అని అడిగాను కొంచెం చనువు తీసుకుంటూ. సరేనన్నట్లు అందించింది. పీచు ఊడదీసి “మీ పేరేమిటో తెలుసుకోవచ్చా!” అన్నాను.

“వాసవి” అన్నది కళ్ళు రెపరెపలాడిస్తూ. “మీ పేరు?” అడిగింది.

“మీ పేరంత చక్కనిది కాదు. హరికృష్ణ…….” అన్నాను.

“హరికృష్ణ పేరుకేం? బ్యూటిఫుల్ నేమ్…”నవ్వింది.

ఆరోజు నుంచీ ప్రతిరోజూ వెంకటేశ్వరస్వామి గుడి దగ్గర కలుసుకునే వాళ్ళం. మా పరిచయం పెరిగింది. కొన్నాళ్ళకి ఒకళ్ళని ఒకళ్ళు చూడకుండా ఉండలేనంత దూరం వచ్చాము. అదే సమయానికి నాకు పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగం వచ్చింది.

“నాకు ఉద్యోగం వచ్చింది. ఈ ఊరునుంచీ వెళ్ళిపోతున్నాను” అన్నాను ఒకరోజు.

“ఊ” అన్నది మౌనంగా. “మనం పెళ్లిచేసుకుంటే ఏమౌతుంది? నీకు ఇష్టమేనా!” సూటిగా అడిగాను. కళ్ళెత్తి నావంక చూసి ఇష్టమే అన్నట్లు తలూపింది సిగ్గుగా. “ధాంక్యూ” అన్నాను ఆమె చేతిని నాచేతిలోకి తీసుకుంటూ.

ఆ తర్వాత సంఘటనలు అన్నీ ఒక దాని వెంట మరొకటి శరవేగంగా జరిగిపోయాయి. నా వైపు బంధువులు కానీ, వాసవి వైపు బంధువులు గానీ అభ్యంతర పెట్టలేదు. వాసవికీ, నాకూ వివాహం అయిపోయింది. ఉద్యోగం వచ్చిన ఊరిలో కొత్తగా కాపురం పెట్టాము. మనసు కలిసిన మనిషితో జీవితం ఎంత హాయిగా ఉంటుందో అప్పుడు అర్థం అయింది. ఇన్నాళ్ళూ ఈమె లేకుండా ఎలా బ్రతికాను? అనిపిస్తుంది. పెళ్లి కాకముందు మనసులో ఏదో ఖాళీ, ఒంటరితనం! ఇప్పుడు నిండుమనిషి నైనట్లు భావన. వాసవి నాకోసం ఎదురు చూడటం, నాకు కావలసినవి అన్నీ అందించటం, కమ్మని భోజనం సిద్ధం చేయటం, అనుక్షణం నా సుఖంకోసం తాపత్రయపడటం, రాత్రికి స్వర్గం చూడటం నాకు ఎంతో సంతోషం కలిగించేది. రోజులు శరవేగంగా జరిగిపోయాయి.

వాసవి గర్భవతి అని విన్నప్పుడు చెప్పలేని ఆనందం కలిగింది. ఇంకో కొత్త హోదా రాబోతున్నది. నేను తండ్రిని కాబోతున్నాను అనే గర్వం కలిగింది. ఆ క్షణం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసాను. బాబు పుట్టినప్పుడు తెల్లగా, వెన్నముద్దలా ఉన్న వాడిని చూస్తూంటే మా ప్రేమకి ప్రతిఫలం అనిపించింది. “మనం పెళ్లికాక ముందు వెంకటేశ్వరస్వామి గుడిచుట్టూ తిరిగినందుకు, ఆ స్వామి ఇచ్చిన ప్రసాదం వీడు” అన్నది వాసవి నవ్వుతూ. అవునన్నట్లు తలూపాను.

ఆరోజు నుంచీ బాబుని చూస్తూఉంటే క్షణక్షణం ఆనంద వీక్షణం అన్నట్లు అనిపిస్తూ ఉంది. ‘వంశీ కృష్ణ’ అనే పేరు పెట్టుకున్నాము. వాడు క్రమక్రమంగా నన్ను గుర్తుపట్టి నవ్వటం చేసేవాడు. పారాడే వయసు వచ్చింది. నేను డ్యూటీకి టైం అయి హడావిడిగా బయలుదేరుతుంటే నా ప్యాంట్ పట్టుకుని ఆపేవాడు. నేను పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే గుక్కపట్టి ఏడిచేవాడు. ఎత్తుకుని ముద్దు పెట్టుకుని “నాకు టైం అవుతూంది నాన్నా!” అని చెప్పి దించేవాడిని. వాడు అర్థమైనట్లు అప్పుడు ఏడుపు మానేవాడు. చిన్నగా అడుగులు వెయ్యటం నేర్చుకుంటున్నాడు. కుర్చీలు, టేబుళ్లు పట్టుకుని నడిచేవాడు. చేతులు వదిలేసి నిలబడి నన్ను చూడమన్నట్లు చప్పట్లు కొట్టి పెద్దగా నవ్వేవాడు. వాడి ముద్దుముద్దు పనులు చూసి వాసవి, నేను మురిసిపోయేవాళ్ళం. స్కూల్లో చేర్పించాను. చిన్నపిల్లలకి ఒక్కపూటే స్కూల్ పెట్టి వదిలేసేవారు. భోజనానికి నేను ఇంటికి వచ్చేసరికి మళ్ళీ వాడు నా కళ్ళకు కనబడకపోతే బెంగగా ఉండేది.

వంశీ పుట్టినరోజు నాకు పండగలాగా ఉండేది. నేను కొన్న కొత్తబట్టలు వాడు ఫెండ్స్‌కి చూపించి “మా డాడీ నా పుట్టినరోజని కొత్తబట్టలు, బూట్లు కొన్నాడు. మా మమ్మీ నాకు ఇష్టమైన స్వీట్లు చేసిపెడుతూంది” అని చెప్పేవాడు. అది వినగానే నామనసు ఆనందంతో ఉప్పొంగిపోయేది. అసలు పుట్టినరోజు అనేది పిల్లలకి జరిపి, తల్లిదండ్రులు ఆనందపడాల్సిన వేడుక! ఎవరికివారు పుట్టినరోజు చేసుకోవటమేమిటి? అనిపించేది. అదేదో అసహజమైనదిగా అనిపించేది.

వంశీ పెరిగి పెద్దవుతున్నాడు. వాడిని నాదగ్గరే పడుకోబెట్టుకునేవాడిని. పక్కనేఉన్నా ఆ కొద్ది దూరంకూడా భరించలేనట్లు వాడి తలఎత్తి గుండెమీద ఆనించుకునే వాడిని. వాడి ముఖం, చెంపలు, నుదురు స్పర్శిస్తూ ఉంటే అంతకన్నా ఆనందం నాకేమీ లేదు అనిపించేది. టెన్త్ క్లాస్ వరకూ అలాగే నా బెడ్ మీదే పడుకోబెట్టుకునేవాడిని. వంశీ కాలేజీకి వచ్చిన తర్వాత విడిగా పడుకునేవాడు. ఇప్పుడు వాడికి ఇరవై మూడేళ్ళు. ఇప్పటికి కూడా తను చిన్న పిల్లాడినని ఫీలైనప్పుడు, గారాబం వచ్చినప్పుడు నా గుండె మీద తల పెట్టుకుని పడుకుంటాడు.

“మరీ అంతగా ప్రేమను పెంచుకోకండి. ఏదైనా కారణంతో వంశీకి దూరంగా ఉండాల్సివస్తే ఏం చేస్తారు?” అనేది వాసవి.

“రాముడు అడవికి వెళ్ళాడని వినగానే దశరథుడు ప్రాణాలు విడిచినట్లే నేను కూడా ప్రాణాలు విడిచేస్తాను” అన్నాను నవ్వుతూ.

“ఛీ ఛీ! ఏం మాటలవి?” వాసవి నానోరు మూసేసింది. మళ్ళీ ఎప్పుడూ ఆ ప్రసక్తి తీసుకురాలేదు.

అనుకున్నట్లుగానే మరో ఆరునెలలకు వంశీ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. మరో ఇరవైరోజుల్లో ఢిల్లీ వెళ్లి జాయిన్ కావాలి. ఆమాట విన్నప్పటి నుంచీ నా మనసు మనసులో లేదు. ఇప్పటి వరకూ నా బిడ్డని వదలి ఒక్కరోజు కూడా ఉండలేదు. ప్రతిరోజూ వాడిని చూస్తే కానీ నిశ్చింతగా ఉండలేను. ఇప్పుడు ఉద్యోగం కోసం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతే, వాడిని చూడకుండా ఉండగలనా! రెండురోజుల నుంచీ ఇదే దిగులు నాకు. ఏమీ తినాలనిపించదు. తాగాలనిపించదు. ఆకలి, దాహం చచ్చిపోయాయేమో అనిపిస్తుంది.

“ఏమిటి డాడీ! అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?” అడిగాడు వంశీ. సోఫాలో తలవెనక్కి ఆనించి ఆలోచనలో మునిగిపోయిన నేను ఉలిక్కిపడి ఈలోకంలోకి వచ్చాను. వంశీ సోఫాలో నా పక్కనే కూర్చున్నాడు. “నాకు నీ గురించి తప్ప వేరే ఆలోచనలు ఏముంటాయి నాన్నా!” అన్నాను నిరాసక్తిగా. “నేను ఉద్యోగానికి వెళుతున్నాననా!” అడిగాడు. అవునన్నట్లు తలూపాను.

“ఎంతదూరం వెళుతున్నాను డాడీ! ఢిల్లీనేగా! ఈ రోజుల్లో అందరూ అమెరికా వెళుతున్నారు. మీరు బాధ పడతారనే నేను అంతదూరం వెళ్ళ దలచుకోలేదు” అన్నాడు.

“నువ్వు పుట్టిన తర్వాత ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేదు. అయినా ఇప్పుడు నువ్వు సంపాదించాల్సిన అవసరం ఏముంది? నేనున్నాను కదా! నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను. నీ భార్యా పిల్లలని కూడా నేనే పోషిస్తాను” అన్నాను.

“అప్పుడు నలుగురూ నన్ను పనికిమాలినవాడి కింద లెక్కకట్టేస్తారు. ఇంత వయసు వచ్చినా డబ్బుకోసం తండ్రి దగ్గర చేయి జాపుతున్నాడు అని హేళన చేస్తారు. మీ కొడుకు అలా అనిపించుకోవటం మీకు ఇష్టమా!” అన్నాడు.

“లేదు.. లేదు… అలా కలలో కూడా కోరుకోను.”

“మరింకేం? నన్ను పంపించండి. నేను ప్రతిరోజూ ఫోన్ చేస్తాను. వీలైనప్పుడల్లా వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు. శలవు దొరికినప్పుడు ఇంటికి వచ్చేస్తాను. మీకు మీ అబ్బాయితో కలిసి ఉండాలని ఎలా అనిపిస్తుందో, నాకు కూడా నా పేరెంట్స్ దగ్గర ఉండాలని అనిపిస్తుంది డాడీ! కానీ… తప్పదు” అన్నాడు.

వాడు అంతగా చెప్పిన తర్వాత ఏమీ మాట్లాడలేకపోయాను.

రెండురోజులు గడిచాయి. ఆరోజు మా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలసి నాదగ్గరకి వచ్చారు. “హరికృష్ణా! మనం ప్రతి సంవత్సరం నాటకాలు వేస్తూంటాం కదా! ఈ ఈసారి నంది నాటకాలలో ఏదైనా మంచి నాటకం వేయాలి” అన్నాడు ఒకతను.

“రామాంజనేయ యుద్ధం, కురుక్షేత్రం, చింతామణి లాంటి నాటకాలు జనం చూసీ, చూసీ విసిగిపోయి ఉన్నారు. ఏదైనా కొత్త నాటకం తయారు చేయి. జనం కదలకుండా కుర్చోబెట్టేటట్లు ఉండాలి”

“నువ్వు రచయితవి, దర్శకుడివి. బాగా అలోచించి రాయి. ఇంకా పదిహేను రోజులు టైం ఉంది. మనందరం సీనియర్స్ కాబట్టి అయిదారు రిహార్సల్స్ అయితే సరిపోతాయి” అన్నాడు ఇంకొక అతను.

“సరే చూస్తాను” అన్నాను. కొద్ది సేపు కుర్చుని వాళ్ళంతా వెళ్ళిపోయారు.

నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉన్నది. ప్రాచీన, ఆధునిక సాహిత్యం ఎంతో ఉన్నది నా కలెక్షన్‌లో. పుస్తకాలు అన్నీ వెతికాను. రామాయణ, భారతాలు రకరకాల సినిమాలుగా వచ్చి జనం నోళ్ళలో నానిఉన్నాయి. ఈ సారి ఏదైనా ప్రబంధం ఆధారంగా కథను తయారుచేసుకుంటే బాగుంటుంది అనుకున్నాను.

చివరికి మనుచరిత్ర కావ్యంలో ఒక పాయింట్ తట్టింది. దానిని బట్టి కథ తయారు చేసాను. వరూధిని అనే అప్సరస ప్రవరాఖ్యుడిని ప్రేమిస్తుంది. కానీ అతడు ఆమెని తిరస్కరించి తన ఊరికి వెళ్ళిపోతాడు. వరూధిని మీద మనసున్న ఒక గంధర్వుడు మాయాప్రవరుడిగా రూపం మార్చుకుని ఆమె దగ్గరకు చేరతాడు. ఇద్దరికీ పిల్లలు కూడా పుడతారు. చాలాకాలం తర్వాత అతని నిజస్వరూపం బయట పడుతుంది. “ఎంత మోసం? నన్ను ఇంత మోసం చేస్తావా?” అని అడుగుతుంది.

అప్పుడు గంధర్వుడు “నా రూపం ఏదైతే నీకెందుకు? నా మనసు చూడు. నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించాను. అగ్నిసాక్షిగా స్వీకరించిన అర్ధాంగివి అనుకున్నాను. నీతో ఉన్నంతకాలం మరో స్త్రీ వంక కన్నెత్తి కూడా చూడలేదు. నిజమైన భర్తలా ఉన్నాను. ఇందులో నేను మోసం చేసింది ఏమిటి? నువ్వు నష్ట పోయింది ఏమిటి?” అని నిలదీస్తాడు. ఆమె అలోచించి అతనిని భర్తగా అంగీకరిస్తుంది. ఈ నాటకానికి ‘అందిన జాబిల్లి’ అనే పేరు పెట్టాను.

మా వాళ్ళందరినీ పిలిచి నేను తయారు చేసిన నాటకాన్ని గురించి చెప్పాను. అందరూ బాగుంది అన్నారు. ఈ చివరి పాయింట్ వెరైటీగా ఉన్నది అన్నారు. రిహార్సల్ మొదలు పెట్టాము. ఎవరి పోర్షన్ వరకు వారు గుర్తు పెట్టుకోవటం నాకు ఇష్టం ఉండదు. ఆర్టిస్ట్‌లు అందరూ కధంతా తెలుసుకుని ఉండాలి అని నా అభిప్రాయం. కథ తెలిస్తేనే మన డైలాగ్ ఎప్పుడు చెప్పాలో తెలుస్తుంది. అలాగే నాటకం జరిగేటప్పుడు నటీనటులు ప్రేక్షకుల వంక చూడకూడదు. కొంతమంది ప్రేక్షకుల వంక చూస్తూ, తక్కువ మంది వస్తే కథ కుదించేస్తారు. మధ్యమధ్యలో మంచినీళ్ళు తాగటానికి కర్టెన్ లోపలకి వెళ్లివస్తూ ఉంటారు.

అలాంటివి అన్నీ నాకు గిట్టవు. డైలాగ్ చెప్పేటప్పుడు పక్క ఆర్టిస్ట్ కూడా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి. కథలో లీనమై పోవాలి. వెనక నుంచీ ప్రాంప్టింగ్ ఇవ్వటం నాకు అసలు ఇష్టం ఉండదు. ఈ నిబంధనలు అన్నీ అంగీకరిస్తేనే నేను డైరెక్షన్ చేస్తాను. మా టీంలో అందరూ నా నిబంధనల ప్రకారం నడుచుకుంటారు కాబట్టి మేము వేసే నాటకాలకు ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది.

పది రోజులు రిహార్సల్స్ వేసారు. నేను దగ్గరుండి దర్సకత్వం వహించాను. ప్రదర్శన వేసే రోజు రానే వచ్చింది. నాటకం పేరు వైవిధ్యంగా ఉన్నది. తెర లేచేసరికి హాలంతా జనంతో నిండిపోయింది. ఇంకా చోటుచాలక, మెట్లమీద కూడా కొంతమంది కూర్చున్నారు. నాటకం మొదలు అయింది. వరూధినిగా వేసిన అమ్మాయికి నాట్యంలో కూడా ప్రవేశం ఉన్నది. ఆమె నడుస్తూ ఉంటేనే నాట్యం చేస్తున్నట్లు ఉంది. ఇక నాట్య సన్నివేశంలో ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. ప్రవరాఖ్యుడిగా వేసిన అతను తెల్లగా, అందంగా ఉన్నాడు. ప్రతి సీను సీనుకీ జనం చప్పట్లు కొడుతున్నారు. అనుకున్న లాస్ట్ సీను వచ్చింది. గంధర్వుడు వరూధినిని నిలదీసి అడుగుతూ ఉంటే ఊపిరిపీల్చటం కూడా మర్చిపోయినట్లు విన్నారు. నాటకం అయిపోయిన తర్వాత హాలంతా కరతాళధ్వనులతో ప్రతిధ్వనించింది. రెండున్నర గంటల సేపు వచ్చిన వాళ్ళంతా మంత్రించి నట్లు కూర్చుండిపోయారు. ఒక్కరు కూడా మధ్యలో లేచి వెళ్ళిపోలేదు. నాటకం అయిన తర్వాత మా కందరికీ చాలా సంతృప్తిగా అనిపించింది.

ఇంకో నాలుగు రోజుల తర్వాత నందినాటకోత్సవాలు ముగుస్తాయి. చివరి రోజు బహుమతులు నిర్ణయిస్తారు. ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. మేము ప్రదర్శించిన ‘అందిన జాబిల్లి’ నాటకానికి ప్రథమ బహుమతి వచ్చింది. ఉత్తమ నటీనటులు, ఉత్తమ దర్శకుడి బహుమతులు కూడా మా నాటకానికే వచ్చాయి. కళలు, సినిమాటోగ్రఫీ మంత్రి గారి చేతులమీదుగా బహుమతి అందుకున్నాము. స్థానిక యం.యల్.ఏ., ఆర్.డి.వో., మొదలైన పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. ప్రెస్ వాళ్ళ కెమెరాల ఫ్లాష్ లు, వీడియో లైట్లు మిరుమిట్లు గొలిపాయి.

ఆ మర్నాడు దినపత్రికల నిండా ఇవే వార్తలు. మా టీం అంతా వచ్చి నన్ను అభినందించారు. ఆకాశానికి ఎత్తేసారు. చాలాసేపు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయారు. వంశీ నా దగ్గరకు వచ్చి “డాడీ! హైదరాబాదుకి బస్ రిజర్వేషన్ చేయించుకున్నాను. ఈ రోజు రాత్రికే వెళ్లిపోవాలి. రేపు ఉదయం డిల్లీ ప్లైట్ ఎక్కుతాను” అని చెప్పాడు. “అవునా! వెళ్ళేరోజు అప్పుడే వచ్చేసిందా!” అనుకున్నాను. వంశీ ఊరు వెళ్లాలనే విషయం ఈ ఇరవైరోజులు అసలు గుర్తేలేదు. మొదట ఆ రెండురోజులు వాడిని విడిచి ఉండాలని ఎంత బాధ పడ్డాను? ఆ బాధంతా ఇప్పుడు ఏమైంది? ఆలోచిస్తున్న నాకు హటాత్తుగా ఒక విషయం అర్థమైంది.

ప్రతి మనిషి మనసులోనూ కొన్ని గదులు ఉండాలి. ఏ గదిలో చేయాల్సిన పని ఆ గదిలో చేయాలి. నేను పోస్ట్ మాస్టర్‌గా ఉద్యోగం చేయాలి. ఇంటి యజమానిగా ఇల్లు నడపాలి. భర్తగా, తండ్రిగా నా బాధ్యత నిర్వర్తించాలి. స్నేహితులతో కూడా కొంత సేపు గడపాలి. నా వ్యక్తిగత అభిరుచులకి కొంత సమయం కేటాయించాలి. మనకి ఇష్టమైన పనిలో ప్రశంసలు దొరికినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాను. అవన్నీ లేకుండా కేవలం కొడుకు కోసమో, భార్య కోసమో, ప్రియురాలి కోసమో కలవరిస్తూ వాళ్ళనే అంటి పెట్టుకుని ఉంటే కొన్నాళ్ళకి, మనం చూపే ప్రేమ కూడా వాళ్ళకు బందిఖానా లాగ ఉంటుంది. ఆ బందిఖానా నుంచీ బయట పడి, స్వేచ్ఛగా గడపాలి అనిపిస్తుంది. ఆ క్రమంలో మనల్ని దూరం పెడతారు. మనుషుల మధ్య బంధాలకు కూడా హద్దులు ఉండాలి. అతిగా ఏదీ చేయకూడదు. జీవితం తాడు మీద నడక లాంటిది. బంధాలు వెదురుగడలా ఆ తాడుమీద బ్యాలెన్స్ చేసుకోవటానికి ఉపయోగపడాలే తప్ప కత్తిలా మారి ఆ తాడును తెంచేసేలా ఉండకూడదు. వంశీకి నా మీద గౌరవం పోకముందే, నా ప్రేమ బంధిఖానాలాగ భావించక ముందే నా ప్రేమను తగ్గించుకోవాలి. వాడి కెరీర్‌కు అడ్డుపడకూడదు. అప్పుడే వాడు నన్ను గౌరవిస్తాడు అనుకున్నాను.

ఆ రోజు సాయంత్రం నేను, వాసవి వాడిని పంపించటానికి బస్టాండ్ వరకూ వచ్చాము. “మమ్మీ! డాడీ! వెళ్లొస్తాను” అన్నాడు. “విష్ యు ఆల్ ది బెస్ట్” నవ్వుతూ వీడ్కోలు చెప్పాను. “థాంక్యూ డాడీ!” అని బస్ ఎక్కాడు. బస్ కదిలింది. కిటికీలో నుంచీ వంశీ చెయ్యి ఊపాడు. వంశీ రూపు క్రమక్రమంగా దూరమై పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here