అంతర్వాహిని – పుస్తక విశ్లేషణ

0
9

తేట నీటి కవితా వాహిని:

[dropcap]క[/dropcap]వితకు మారు పేరు గోదావరి శర్మ. రచనే ఆయన ఆశ, శ్వాస. ఎన్నో ఏళ్ళనాడే “గోదావరి గలగలలు” విన్నారు, “నాగావళి తీరం” తీరుతెన్నులూ చూశారు. కవిత్వం మాత్రమేనా.. కథలు, నవలలు, వ్యాసాలు, అనువాదాలు, మరెన్నో రాశారు. అందమైన జీవితం, ఆనంద దాయక బోధనా వ్యాసంగం. ఇంతలో 36 ఏళ్ళ నవ ప్రాయంలోనే నూరేళ్ళూ నిండాయంటే అంతా విధి బలీయం! తర్వాత ఏడాదికే ఆత్మీయుల ప్రేమబలంతో వెలువడిందీ “అంతర్వాహిని “సంకలనం. ఉత్తమ వచన కవితా సంపుటిగా ఆ వెంటనే తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం సాధించింది. తొలి ముద్రణ 1991లో. అంటే ఇప్పటికిది దాదాపు మూడు దశాబ్ద కాల చరిత్ర!

ఇందులోని కవితలు 78. కవి, కవిత, కవిత్వమనే త్రివేణీ సంగమంలోనూ సరస్వతే అంతర్వాహిని అన్నారాయన. రచనకు తనువు, మనసులతో పాటు రంగు, రుచి, వాసనలున్నాయనీ ప్రకటించారు.వాన, నది ప్రవహిస్తున్నది, సముద్రం.. అంటూనే నాగావళి ఒడ్డున ఏముందో కూడా చూసేశారు. పారే నదికి, మారే మదికి ఏ తీరమైనా ఒకటేనని కవి భావం. సదానుభూతే ఇంతటి సుకుమారత సంతరించుకుంది.

విత్తనం, చెట్టు, చెట్లు కూలే దృశ్యాలు, సతత హరితారణ్యాలు, వెన్నెల తోటలో కొబ్బరి రాత్రి- ఈ అన్నీ కవి అనుభవంలోకి వచ్చినవే. “వరుణ దేవుడి కరుణలా కురిసే వాన.. చెట్టంత బాధ్యత తలకెత్తుతుంది, చిట్టి ప్రాణి ఒకటి మొలకెత్తుతుంది”అన్నారొక చోట. ఈ చెట్టు కష్టపడి పైకొచ్చిన హ్యూమనిస్టు – అంటూ వేరొక సందర్భంలో హృద్యమైన వర్ణన. పచ్చని చెట్లను పడగొట్టరాదంటూ.. మహా భూజాల కోపం మహానుభావుల శాపమని చురకంటించారు.

గోదావరి శర్మ హృదయ గాఢత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. అయినా మచ్చుకి కొన్ని-

* మనసులోని మధుర భావాలు.. పాటలుగా పెదవులపై కొస్తాయి
ఆ పాటల కోటి ప్రతిధ్వనుల్లా.. నింగిలో తారలు విరిసి లోకాన్ని చల్లగా వెలిగిస్తాయి

* అస్తమించే సూర్యుడు-వెండి మబ్బు మీసాల మీద నిలబెట్టిన నిమ్మపండు
ఆ వెనక వచ్చే చంద్రుడు-ప్రేమ కళల్ని ప్రోత్సహించే నవ యువతకు నాయకుడు

*ముకుళించిన స్వప్నం.. వికసిస్తే పుష్పం!
అక్షరాల్ని ఏర్చి కూర్చి ఉంచడంలోనూ దిట్ట ఈ కవి. “లోలకం” పేరిట..

“ఊగులాడుతూనే ఉంటుంది మనిషి మానసం
రాగ ద్వేషాల అంచుల్ని స్పృశిస్తూ, వెనక్కి తగ్గుతూ”.. అని సరిపోల్చారు.

ఏది ఏమిటో తేల్చి చెబుతూ -ఇలా అన్నారు…

* భయమే ఓటమి, అజ్ఞానమే భయం, అంతకన్నా చావు నయం
* కారుణ్యం మనిషైనవాడు క్రియాశూన్యుడెప్పటికీ కాడు
* నా కిటికీది బాలకృష్ణుడి నోరు, వామనమూర్తి తీరు
* నిజాన్ని కప్పిపుచ్చి, నిన్ను నిద్రపుచ్చే

దురాచారాన్ని, దుష్ట సంప్రదాయాల్నీ
ధిక్కరించి యుద్ధం ప్రకటించకపోతే,
ఎవడిక్కావాలి బ్రదర్.. నువ్వూ నీ దేశభక్తీ?

ఇంకా ఒక అనువాద కవితలో –

“మీ పాదాలు ఎంత చిన్నవి
కానీ.. భూమి అంతా మీ పాదాల కిందే ఉంది”
అని గడ్డి పరకలను అనడమే సిసలైన రచనా పాటవం!

***

అంతర్వాహిని
రచన: కె. గోదావరి శర్మ
పేజీలు: 126
పుస్తక సమాచారం కోసం- ఫోన్: 98660 08359

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here