అంత్రాల రొట్టె..!!

1
12

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన బి. కళాగోపాల్ గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు సంచిక వెబ్ పత్రిక.]

[dropcap]“అ[/dropcap]మ్మీ! నువ్వు చేస్తున్న రొట్టె వెనుక పంట పండించిన రైతుల శ్రమ ఉంది. ఒక్కో గింజకు వాళ్ల దుఃఖపు చినుకుల వ్యథ ఉంది. కంటికి రెప్ప లెక్క పొలాన్ని కాపాడి కలుపు తీసి, మందుగొట్టి, అడవి పందుల బెడద నుండి పంటను రక్షించుకొని రెక్కలు ముక్కలు చేసి పండించిన ధాన్యాన్ని అంగట్ల అమ్ముకుందామంటే దళారుల దోపిడీ, అగ్వకు మంచి ధాన్యాన్ని కొని ధనికులకు ఎక్వ పైసలకు అమ్ముకుంట, బీదలకు తాలు, తర్రలు కలిపి ఇస్తున్న గోధుమల్లో ఇగ బలమెక్కడిది? అంతా కల్తీ.. కల్తీ..! బక్కచిక్కిన బడుగులు ధనికుడి క్రింద అయ్యా! బాంచెన్ నీకాల్మొక్తా! నంటూ నలిగిపోవాల్సిందేనా? అబ్బాజాన్ అంటాడు కదా! దానే దానే పర్ హోతా హై! ఖానేవాలా కా నామ్! అని.. మరి మన కిస్మత్‌ల గవే కల్తీ పిండి రొట్టెలే ఉన్నయా? మనమూ మంచి పిండి అంగట్ల కొనుక్కోలేమా? గిట్ల పురుగులు వట్టిన పిండిని జల్లెడ వట్టి ఎండలవెట్టి ఎన్నేండ్లని గిదే పిండిరొట్టె తినుడు? ఓ రుచీ పచీలేక బలం ఇంకి మన పానాలిలా గొట్టివడి పోవుడేనా?” ..పదిహేనేళ్ళ లేత వయసు గొంతుతో ప్రశ్నిస్తున్న షౌకత్ ఆత్మస్థైర్యానికి అబ్బురపడింది సాజిదా. బుస్సపొయ్యి మంటను సరిచేస్తూ పెంకపై రొట్టెను అటుఇటు వేసి ఎర్రగా కాల్చి దించింది సాజిదా. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకొని షౌకత్ కని తీసిపెట్టిన అలసంద పప్పు, రొట్టెలను మందుకు జరిపి “బేటా! ఖావో ఈ మాత్రం రొట్టె దొరక్క అల్లాడుతున్న బీదపానాలెన్నో గీ కరువు దినంల గిది దొరుకుడే మా గొప్ప! బయట ఆకలికి ఎంతోమంది జనం సచ్చిపోవట్టే.. చివరికి బంకమట్టి తోటి రొట్టెలు చేస్కొని తింటూ పానం నిలుపుకుంటున్న ఎంతోమంది బీదలున్నారు. గీ రజాకార్ల జమానాల బయట ఆడోళ్ళు పిల్లలు కనవడితే సాలు ఎత్తుకపోవుడు. నువ్వా చిన్న పిల్లగాడివి.. గిప్పుడే గిన్ని గిన్ని పెద్ద పెద్ద మాటలెందుకని? ఎప్పుడు ఎవరు మన గ్రామం మీద దాడి చేస్తరో తెల్వదాయే..! ఏం చేద్దాం బేటా? గీ సైతాన్ రాజ్యంల ఊపిరున్నంత వరకు పిలపిలమనుకుంట బతుకుడున్నది?” అంది సాజిదా.

పొయ్యి దగడుకు ఆమె మొహం ఎర్రబడింది. అలా ఎర్రబడి ఉబ్బిన కండ్లలోకి పొగ చూరుతుంటే మాసిన చున్నీతో తుడుచుకుంట “అబ్బాజాన్ వచ్చాడేమో చూడు. గొళ్ళెం సప్పుడు గావట్టే” అంటూ బుస్స పొయ్యిలయి కట్టెలను తీసి పొయ్యి ఆర్పసాగింది.

సాజిదా, రెహ్మాన్ దత్తపుత్రుడు షౌకత్. రెహ్మాన్ అన్న ఊపిరితిత్తుల వ్యాధి ముదిరి మరణించగా, ఒంటరివాడైనాడు షౌకత్, పసిగుడ్డుకు జన్మనిచ్చి చనిపోయిన సలీమా యాదిలో మళ్ళీ పెండ్లి చేసుకోలేదు షౌకత్ తండ్రి. పిల్లల్లేని సాజిదా పసివాడి ఆలనాపాలనా నేనే చూస్తానంటూ చొరవ చూపి అక్కున చేర్చుకుంది.

రెహ్మాన్ కు అరెకరం నల్లరేగడి భూమి ఉంది. గదే భూమిల గోధుమలు, ఎర్రజొన్నలు కొండవాలు నుండి వచ్చే నీటి చాలుతో పండించుకునేవాడు. ఎవరూ లేని షౌకత్‌ను తమ సొంత బిడ్డలా చూసుకున్నారా దంపతులు. పెరిగి పెద్ద వాడయ్యే క్రమంలో షౌకత్ నలుగుర్ని కూడగట్టుకొని “ఇంక్విలాబ్ జిందాబాద్..” అంటూ నినదించేవాడు. నూనూగు మీసాల యవ్వనంలో ఉడుకు రక్తం సలసలమరిగి దేహాన్ని ఆవేశపరుస్తుండే నిజాం రాజ్యం జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేవాడు. అణగారిన వర్గాలకు మేలు జరుగాలనేవాడు. ఎక్వతక్వల్లేని సమసమాజమే ధ్యేయమంటూ తన గదిలో బొగ్గుతో నినాదాల్ని గోడలపై రాసుకునేవాడు.. రాత్రివేళ ఎక్కాబుడ్డీ దీపం వెలుగులో ఎక్కడిదో రహస్య సాహిత్యం తెచ్చుకొని చదివేవాడు. కాగితాలు, కలాలు ముందేసుకొని రాత్రంతా ఆలోచిస్తూ ఏదో ఏదో రాసుకునేవాడు.

“షౌకత్‌ని చూస్తే గీ నడుమ భయమేస్తుంది. వాడు ఊర్లె పిల్లగాండ్లను పోగేసుకొని నిజాం రాజుకు వ్యతిరేకంగా ఏదో ఉద్యమం చేస్తాడట. మనక్కూడా స్వాతంత్ర్యం కావాలని పోరాటం చేస్తానంటాడు. దైవం పలికిన సమాన రాజ్యం కావాలంటాడు. అడవులకెళ్తానంటడు, మనూర్లె వీడు గిట్లనే గనుక ఉంటే మిగతా పిల్లలు కూడా ఖరాబైతరు గానీ.. వీడి ఆవేశం తగ్గాలంటే ఏం చెయ్యాలంటారు?” అంది సాజిదా దిగులుగా.

“అవును మొన్ననే నేనూ విన్నాను. అంగడి చౌరస్తాలో నిలబడి తాను రాసిన కాగితాలను పంచుతూ, నాతో బాటు కలిసి నడుస్తారా? హైదరాబాద్ వెళ్దాం అంటున్నాడు. వీడు ఇగ ఇక్కడుంటే ఆ పిల్లల తల్లిదండ్రుల నుండి వ్యతిరేకత ఏర్పడుతుంది. మరో రెండు రోజుల్లో కాలేజీల సదువుకునేందుకు పోతానంటున్నాడు కదా. జరూరీగ పోనిద్దాం. ఎట్లైనా పైసలు తెచ్చిఎల్లుండి షౌకత్‌ను పంపించుడే” అన్నాడు రెహ్మాన్ భరోసాగా.

***

“అమ్మీ పండుగొచ్చింది ఖుషియా మనానా హై! సేమ్యా ఖీర్ వండు, మా దోస్తులను పిల్సుకొస్త” అన్నాడు షౌకత్ సందడిగా. “ఏమైంది బేటా? నిజాంల నుండి మనకు గీన విముక్తి దొరికిందా?” సాజిదా గొంతులో అదే ఆనందం తాండవించింది. “కాదు కాదు అమ్మీ! గాంధీజీ కలలుకన్న సమసమాజం రష్యాలో వచ్చింది. అక్కడ ధనికులు, పేదలు అన్న బేధభావం లేదు. ఆకలి పేగులకు దొరికే రొట్టె అందరికీ సమానం. మనక్కూడా త్వరలోనే విముక్తి లభించనున్నదని జాతీయోద్యమకారులు చెప్పగా మా దోస్తుల ద్వారా తెల్సింది” అన్నాడు షౌకత్ ఆనందంగా. చెట్టంత ఎదిగిన కొడుకుని కౌగలించుకున్నాడు రెహ్మాన్ . “బేటా! హైద్రాబాద్ వెళ్లి మంచిగ సదువుకొని నీకు నచ్చిన ఉద్యోగం చేయి. గదే సాలు మాకు” అన్నాడు.

మరుసటి రోజు బట్టలు, పుస్తకాలు సర్దుకొని తల్లితండ్రులకు అల్విదా అంటూ.. హైద్రాబాద్ ప్రమాణమయ్యాడు షౌకత్. సిటీల మంచి పేరున్న కాలేజీల సీటు వచ్చింది. సహజంగా ఆవేశపరుడు, నలుగుర్ని కూడగట్టి చైతన్యపరిచే ఉత్తేజం గలవాడవటం మూలంగా కాలేజీలోనూ, పేద విద్యార్థుల తరపున వర్గపోరాటాన్ని ప్రారంభించాడు షౌకత్. ఫలితంగా దొర బిడ్డలు, అగ్రవర్ణాల విద్యార్థుల నుండి అవమానాలను ఎదుర్కొన్నాడు. ఓ రోజు వేసుకొనే బట్టల్ని దొంగిలిస్తారని భావించి, తన మేజోళ్ళను కూడా బట్టల ముల్లెలోనే దాచి తలగడలా పెట్టుకొని నిద్రించాడు. ఆ యేడు సకాలంలో వర్షాలు కురవక గ్రామాల్లో కరువు విలయతాండవం చేసింది. తిండి గింజలకు, పైసలకు లవు తిప్పలయింది రైతులకు. ధాన్యం, పిండి బస్తాలు కరువై ఆకలితో గ్రామ గ్రామాలు అల్లాడసాగాయి.

సాజిదాకు ఏం చేయాలో అర్థంగాని పరిస్థితి. డబ్బాలన్నీ దులిపితే కేవలం ఒక్క దోసెడు పిండి మాత్రమే రాలింది. ఒక్క రొట్టెకు కూడా సరిపోని పురుగులు వట్టిన పిండి. పస్తుల పొట్టకు నీళ్ళే గతి.. అనుకుంటూ నీళ్ళ కొరకై నూతిగట్టుపైకి వెళ్ళింది. గీ దొంగల రాజ్యంల మా ఆకలి బతుకులు ఎన్నడు వెలుగు చూస్తాయో? కట్టు బానిసలలెక్క బత్కవడ్తిమి, ఆజాదీ ఎప్పుడొస్తుందో? ఆకలి పొట్టకు ఎన్నిమార్లని నీళ్ళు తాపిస్తామ్?” కసి ఆవేశంతో నూతి గట్టుమీద రొప్పుతూ చేద తోడుతూ.. తోడుతూ బలహీనపడ్డ ఆమె శరీరం తూలి బావిలో పడిపోయింది. రెహ్మాన్ రెక్క తెగిన పక్షిలా విలవిల్లాడు. ఆమె చేయి అక్షయం. ఇంట్ల ఏది ఉన్నా.. ఉండకున్నా సమయానికింత తినేందుకు ఏదో ఒకటి సగవేట్టేది. తిండి లేక బక్కచిక్కిన బడుగు రైతు రెహ్మాన్ మానసికంగానూ సాజిదా మరణానికి కృంగిపోయాడు. తట్టుకోలేని బాధతో తొందర్లోనే కన్నుమూశాడు.

షౌకత్ మరీ ఒంటరివాడై పోయాడు. పట్నంల తలదాచుకునే చోటు లేక వీథులన్నీ తిరుగాడాడు. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు.. అన్నట్లు దగ్గర్లోనే ఉన్న మసీదు ఇమామ్ ఒకతను షౌకత్ దయనీయ పరిస్థితిని చూసి రాత్రిపూట మసీదులో నిద్రించేందుకు కొంత జాగా చూపాడు. ప్రార్థనలకు వచ్చే ఓ ధనికుడు షౌకత్ మాటలకు ఆకర్షితుడై తన ప్రియురాలికి లేఖ రాసి ఇమ్మంటే షౌకత్ అందమైన ప్రేమలేఖను అతడికి రాసిచ్చాడు.. అప్పటికే ప్రఖ్యాత జర్మన్ పండితుడు గోథే లేఖా సాహిత్యం చదువుకున్న అనుభవం అతనికి కొంత ఉపయుక్తమైంది.

ఆ వీధుల్లో రంగురంగుల చిత్రపటాలకు అందమైన ఫ్రేములు తయారు చేసి ఇచ్చేవాడు.. ఈద్గాహ్‌లో ప్రార్థనలకై ప్రతిరోజూ వచ్చే నయీం పరిచయమయ్యాడు. షౌకత్ చదివిన పుస్తకాలు, ఉద్యమ భావాలు, బీదల పట్ల అతనికి గల ప్రేమ వంటివెన్నో అతడ్ని బాగా ఆకర్షించాయి.. సాయుధ దళమై కదులుదాం, నిజాంకు వ్యతిరేకంగా వర్గ పోరాటం చేసి స్వాతంత్య్రం సాధించుకుందాం ..అని తీర్మానించుకున్నారు.

అజ్ఞాతంగా ఉండాలి. రహస్యంగా అడవులల్లో సమావేశమవాలి. మెరుపు వేగంతో దాడి చేస్తూ, నిజాంను, అతడి సైన్యాన్ని ఎదుర్కొనాలి.. అని ఒకరికొకరు ఒప్పందం చేసుకున్నారు. ఓరోజు నయీం అప్పజెప్పిన రహస్యలేఖను తన దుస్తుల్లో దాచుకొని చిట్టడివి దాటి మరో గ్రామం చేరుకున్నాడు షౌకత్. ఇల్లు వెతికే క్రమంలో అలసట చెంది, చల్లటి గాలి వీస్తున్న ఓ అరుగుమీద కూలబడి పోయాడు.

ఎవరో తచ్చాడిన అలికిడికి గుమ్మంకున్న పరదా జరిపిన నాజూకు చేతుల గలగలలు, ఆపై ఆ సుర్మా కళ్ళలో వెల్లి విరిసిన ఆశ్చర్యం.. ఎవరో పరదేశి ఆకలితో ఉన్నాడనుకొని, లోనకు వెళ్ళిన ఆమె వెంటనే కుంపటి రాజేసి రొట్టెపెంక మీద గబగబా ఐదారు రొట్టెలను చేసి తీసికొచ్చి అతడ్ని లేపి కూర్చో బెట్టింది. అతడా రొట్టెలను ఆవురావురని తిని కృతజ్ఞతా పూర్వకంగా ఆమె పేరు వివరాలు అడిగాడు.

ఆమె తన పేరు సలీమా అని తన తాతతో కల్సి ఉంటున్నానని పొలం పనికి వెళ్లిన తాత సాయంత్రం అయ్యే వరకు తిరిగి వస్తాడని వివరాలు అందించింది. సలీమా మాటల్లో ఏదో మహత్తుంది. ఆకలి తీర్చిన వారు దేవుడిలాగ కన్పిస్తారు ఎవరికైనా, కాలే కడుపులకింత రొట్టెముక్క దొరుకుడే గగనమైంది నిజాం సర్కార్‌ల. ఆ పై పండిన పంటల కింత అని శిస్తు చెల్లించాలి. ధాన్యం బస్తాలు ఇండ్లలకు తోలుకపోవద్దు. చుట్టు పక్కల గడీల జమీందార్లకు జమ చేయాలి. ఆయన దయ ఔదార్యం ఉంటే కొన్ని బస్తాలు మనకిస్తాడని, మిగిలినదంతా సర్కార్‌కే చెందుతుందని రైతులు రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించినా తిండి గింజలు దొరకక ఆకలితో అల్లాడి చనిపోతుతున్నారని ఆవేదనతో చెప్పింది. షౌకత్‌కు సలీమా మాటలపై నమ్మకం కుదిరింది .

ఎంతైనా తన అసలు పేరును మాత్రం ఎక్కడా చెప్పవద్దన్న ఒప్పందం ప్రకారం పరదేశి గానే పిలువ బడ్డాడు. ఉనికి పోల్చుకోకుండా ఉండేందుకై చిక్కటి గుబురు గడ్డాన్ని పెంచుకోసాగాడు. “అలాగా.. మళ్ళీ కలుస్తాను ఖుదాహాఫీజ్ !” అంటూ అదే గ్రామంలోని మరో వీధిలో తాను కలవాల్సిన వ్యక్తితో పనుందంటూ వెళ్లిపోయాడు. అలా వెళ్లిన షౌకత్ వీధిమలుపు తిరగగా పాడు పడిన సత్రం పక్కన భుజాన గొంగడి ధరించి ఉన్న శివయ్యను కలిశాడు. నయీం చెప్పిన ఆనవాళ్ళను పోల్చుకొని తన దగ్గరున్న రహస్యలేఖను అందించాడు. “మంచిది. మీరు మాతో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషం. ఈ రాత్రి గడీలో జమీందారు లేడని అందుకున్న సమాచారం ప్రకారం గడీలోని ధాన్యపు సంచుల్ని, గోధుమల బస్తాల్ని ఎన్ని వీలైతే అన్ని లూటీ చేయాల్సిందే, అందుకై రచించుకున్నదే ఈ రహస్య ప్రణాళిక” అంటూ శివయ్య అలియాస్ రాజన్న షౌకత్‌తో చెప్పి వేగంగా వీథి మలుపు తిరిగాడు.

అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా నిచ్చెనలు, తాళ్ల సహాయంతో గడీ ప్రహారీ గోడలోకి దుమికి అక్కడే తమకు జత కల్సిన పాలెగాండ్లు గోధుమ సంచుల్ని అందిస్తుంటే.. బయట నిల్పిన బండ్లపై వేసుకొని అడవి మార్గాన చీకట్లో కల్సిపోయారా దండు.

ఇరుగుపొరుగు పల్లెల్లో బీదాబిక్కి బడుగురైతులు ధాన్యాన్ని, భుజాన వేసుకొని నయీం దండుకు “జిందాబాద్” అంటూ వెనుదిరిగారు. అదే గుంపులోనున్న సలీమా “షుక్రియా..!” అంది ప్రేమపూర్వకంగా. కళ్ళెగరేస్తూ నవ్వాడు షౌకత్. ఎడ్లబండి దిగబోతుంటే పల్చటి చేతివేళ్ళను అందించింది. అతడి ధృడమైన చేతిలో ఆమె చేయి ఇక ఎన్నటికీ వీడని తోడంటూ..

***

“దాదాజీ!! అప్పటి రజాకార్ల జమానా చూసిన మీరు ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు కదా, మరి భారత్‌కు స్వాతంత్వం వచ్చాక ఉద్యమ మూలాల్ని భావజాలాన్ని వదలక అనుక్షణం ధనిక, పేద వ్యత్యాసాలు సమసి పోవాలన్న మీ ఆశయాల్ని నేటి సమాజానికి అందించాలన్న తాపత్రయం తోనే నేను మీ అపురూప అనుభవాల్నే ‘జ్ఞాపకాలు’గా రాస్తున్నా కదా! ఇప్పుటి వరకు మీరందించిన వివరాల ప్రకారం మీ జీవిత చరిత్ర దాదీతో మీ షాదీ వరకు వచ్చింది” అంది ఇరవై ఐదేళ్ల షబానా పుస్తకాన్ని మూసేస్తూ.. జాగ్రత్తగా బుక్ మార్కర్‌ను పేజీల నడుమ ఉంచింది, ఆయన డైరీలు, పాతఫోటోలు, పేపర్ కటింగ్‌లు ఎంతో విలువైన సమాచారాన్ని ఫైలు చేయసాగిందామె, షబానా ఇటీవల కామన్వెల్త్ ఫౌండేషన్ వారి షార్ట్ స్టోరీ కాంపిటీషన్ కొరకై మంచి రచన చేయాలనే తాపత్రయంలో ఉంది. పాఠశాలల్లోను, కళాశాలల్లోను గోడ పత్రికకు ఎడిటర్‌గా పనిచేసిన చిగురంత అనుభవం కూడా ఉంది. నాన్నమ్మల్ని, తాతయ్యల్ని దత్తత తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ‘గ్రాండ్‌పాస్ ఆర్ అజ్ ..’ అని వారి ఆలోచనల్ని, జ్ఞాపకాల్ని ఈ తరానికి అందించాలన్న ఉద్దేశ్యంతో తన తాతయ్య కథను సిద్ధం చేసుకోసాగింది. పాతరోజుల్లో దాదీమా కొన్ని రకాల పూలను కూడా పిండితో కలిపి పూల రొట్టె తయారు చేసేదని అలా వారి ఆహారంలో రాలె పూలు, గోంగూర కాయలు, పూలు, గుమ్మడి, దోసె పిందెలు, పూలు కూరగ వండుకున్న వైనం.. వెన్నాద్రి ఆకులతో పులుసు, బజ్జీల తయారీ వీటి గూర్చి చెప్పినపుడు నాటి కాలం వాళ్ళు కరువును ఎదుర్కొనేందుకు ప్రకృతిని ఎంతో సమర్థవంతంగా వినియోగించుకున్నారనీ, గుప్పెడు గింజల కొరకై ఎన్నో భూపోరాటాల్లో పాల్గొన్నారని, చారెడు పిండితో గిన్నెడు అంబలి కాచి ఇంటిల్లి పాది క్షుద్భాదను చల్లార్చుకునేవారని తెల్సుకొని బోలెడు విస్మయపడింది షబానా.

***

“షబ్బో! ఎనభై ఏళ్ల తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని గ్రంథస్థం చేయంలనుకుంటున్న నీ ప్రయత్నం గొప్పది – నీవడిగిన మరికొన్ని డైరీలు, పేపర్ వార్తలు, కరపత్రాలు కొన్ని నయీం.. దగ్గర మరికొన్ని రాజన్న దగ్గర కూడా ఉన్నాయి. హూ!, మా ముగ్గరిలో ఇప్పుడు బతికి ఉంది నేనే! దోస్తులందరూ కల్సి నన్ను ఒంటరివాడ్ని చేశారు..” షౌకత్ పాలిపోయిన కళ్ళలో రెండు కన్నీటి చుక్కలు నిలిచాయి.

“క్షమించండి దాదా..! మీకు బాగున్నప్పుడే మరిన్ని వివరాలు చెప్పండి. ఈ సాయంకాలానికి మాత్రం ఓ కమ్మని గరం చాయ్” అంది షబానా షౌకత్ చేయిని మెత్తగా నొక్కి. ఆరాం కుర్చీలో కూర్చున్న షౌకత్ చూపు షబానా సేకరించి పెట్టుకున్న జర్నల్స్‌పై పడింది. గాజాలో దాడులు లక్షలాది జనాల హాహాకారాలు రొట్టె కొరకై అల్లాడుతున్న ఆకలి పేగుల బాధలు, ఇండ్లులేక, నా అన్నవాళ్లు కరువై రోగాలతో చనిపోతున్న జనం. షబానా తెచ్చిన చాయ కప్పును అందుకున్నాడు షౌకత్. “నువ్వీ నడుమ రాస్తున్న కథ ఏమైంది. షబ్బో!” అన్నాడు షాకత్ కళ్ళజోడును సవరించుకుంటూ..చాయను పెదవులపై తాకిస్తూ “ఓ.. అదా! దాదా! గ్రాండ్‌పాస్ ఆర్ అజ్.. అని రాసుకుంటున్నాను. ఓ పరదేశి ప్రేమ రొట్టెలు ఉపకథగా మీ జీవితమే తొంగి చూస్తుంది అందులో.. మీలాగే ఓ సైనికుడు ఓ ఇంట్లో దాక్కుంటాడు. శత్రువుల దాడిలో ఆ ఇల్లు ధ్వంసం కాకముందే తనలాగ వచ్చేవారి కొరకై ఇంట్లో పిండి, కొంత ధాన్యాన్ని వదలి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తన ప్రియురాలితో రహస్య మార్గాన చొరబాటుదారుడిగా మరో దేశంలో ప్రవేశించే సాహసాన్ని చిత్రిక పట్టే సంఘటనల్ని రాసుకుంటున్నాను దాదా! మీరిప్పుడు చెప్పారే అప్పటి నిజాం రాజ్యంలో పేట్రేగిన రజాకార్ల దోపిడీ, శవ అత్యాచారాలు, గోతిలో మొండెం దాకా కప్పెట్టిన నగ్న శరీరాల హింసా క్రీడలు థూ!  అంది షబానా ఆవేదనతో.

“ఠీక్ కహా షబానా! గప్పట్ల రజాకార్ సైతాన్ రాజ్యంల గొడ్డులెక్క కష్టవడ్డం. కట్టు బానిసలుగా చెప్పుకోలేని బాధలు వడ్డం. ఆడ కూలీలు తమ బిడ్డలకు పాలియ్యాలంటే చన్ను పిండి పాలు చూపించాల్సిన అమానవీయమైన సంఘటనలు.. చెప్పుకుంటూ పోతే పెత్తందార్ల అకృత్యాలకు అంతే లేదు షబ్బో! గోధుమ పిండిల సిమెంటు కలిపిన రొట్టెలను ఉద్యమకారులకు తినవెట్టినరు. మేమెన్నో కష్టాలు వడితే వచ్చిన ఆజాదీని ఈ తరం అనుభవిస్తున్నరు. మతమన్నది మంచికే ఐతే ఇంత ఆధిపత్యధోరణి, ఇన్ని బేధభావాలు ఎందుకో మరి? మతమౌఢ్యంతో మరో జాతిని రాక్షసంగా ఊచకోత కోయడం ,ఇంత విధ్వంసం జీర్ణించుకోలేకపోతున్నా షబ్బో! మతమౌఢ్యంవల్ల ఇళ్ళువాకిళ్ళు కోల్పోయి స్వంత దేశాల్లోనే కాందిశీకులుగా జీవిస్తున్న  ప్రజల ఆకలి రొట్టెల మీద నీవు తప్పక కథ రాస్తావా? షబ్బో..!” అన్నాడు షౌకత్ అంతే ఉద్వేగంగా.

“తప్పకుండా దాదా! చీకటిపడింది. ఈ చలి మీకు అంత మంచిది కాదు లోపలికి వెళ్లాం పద” అంటూ షౌకత్ చేయి పట్టుకొని లోనకు నడిపించింది షబానా.. వెచ్చని రగ్గు కప్పి చేయిపై చిన్న ముద్దుతో “షబ్బా ఖైర్ (శుభరాత్రి) దాదా..!” అంది లైటు ఆర్పుతూ.

ఉదయం తాజా గులాబీల మీద మంచు బిందువులను చూసే తమ దాదా ఇంకా లేవకుండా ఎలా ఉంటారబ్బా..! అనుకుంటూ ఓరగా వేసిన గది తలుపులను తోసుకొని లోనకు వెళ్లిన షబానా మంచుముక్కలా బిగుసుకు పోయిన దాదాను చూసి కుప్పకూలింది.

ఆ స్వాతంత్య్ర సమరయోధుడి ఇంటివద్ద నివాళులంటూ జనం పుష్పగుచ్ఛాల్ని ఉంచసాగారు. ఓ వీరుడి అంతిమయాత్ర మొదలైంది. టీవీల్లోనూ సోషల్ మీడియాలోను “వీరుడే విజేత! ఓ తరం ముగిసి పోయింది” అని వార్తా కథనాలు ప్రసారమవసాగాయి.

***

మరో నెల్లాళ్ళ తర్వాత షౌకత్ సమాధి ముందు మోకరిల్లి తానందుకున్న కామన్వెల్త్ యంగ్ రైటర్ అవార్డు సర్టిఫికెట్‌తో బాటు ప్రచురించిన రచనల పుస్తకం కొన్ని గులాబీ రేకుల్ని దాదా సమాధిపై ఉంచుతూ “దాదా, కామన్వెల్త్ షార్ట్ స్టోరీ విన్నింగ్ ప్రైజ్ అమాంట్‌ని ఆహారం కొరకై అల్లాడుతున్న అభాగ్యుల ఆకలి రొట్టెలకే విరాళంగా ఇస్తున్నాను. మీ ఙ్ఞాపకాలు శాశ్వతం దాదా..! మీరు సమరభూమిలో సైనికులు, పూలతోటలో ప్రేమికులు, విశ్వనగరిలో మానవుడు, ప్రాణం తృణ ప్రాయమైన యుద్ధ నేపధ్యంలో బతికారు.. బతికించారు.. అందుకే మీరు, మీ సహచరులు వీరులు, శూరులు, ధీరోదాత్తులు దాదా! విప్లవం అంటేనే చుట్టూ జరుగుతున్న దానిని ఎలుగెత్తి ప్రశ్నించడమేనని చెప్పిన మీ మాటలు గొప్ప సంజీవని లాంటివి. మా తరానికి గొప్ప ఉత్ప్రేరకం మీ జీవితం. బహిరంతరాళలో పోరాడిన వీరులు మీరు. వీరుడికి మరణం లేదు.. మరణం లేదు..!” అని దాదా ఆత్మ శాంతికై ఆ సాయంకాలం ప్రార్థించసాగింది షబానా .

చల్లగా వీస్తున్న శీతలగాలులతో బాటు ఆకుల నుండి రాలిన ఓ రెండు మంచుబిందువులు ఆమె చేతులను ముద్దాడాయి సున్నితంగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here