అనుబంధ బంధాలు-13

0
7

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 13వ భాగం. [/box]

[dropcap]”ఇం[/dropcap]కా ఏమైనా పని ఉందా?”

“లేదు.”

“దీక్షితులుగారు మీరు వింటానంటే ఒక మాట చెపుతాను” అన్నాడు.

“చెప్పండి.”

“శ్రీరామ పట్టాభిషేకానికి ముహుర్తం పెట్టింది ఎవరునుకున్నారు?”

“బ్రహ్మఋషి వషిష్ఠులవారు, మరి ఏం జరిగింది?”

“పట్టాభిషేకం జరగక పోతే మానే, పాపం అరణ్యవాసానికి వెళ్ళాల్సి వచ్చింది” అని నవ్వాడు.

“అంటే?”

“మనం చేసేది మనస్పూర్తిగా చేసుకుంటూ పోవడమే. ఫలితం పైన మనకు అధికారం లేదు. ఆశ … అంచేత ఇలా ఉండాలి అని కలలు కనకండి. మనం మనుషులం, అంతా కలసి వస్తే మనం దేవుడిలా వెలిగిపోతాం. లేదా మన మెక్కడ కనిపించుతామో మనకే అర్థమయి చావదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మన పరిధిలో మాత్రమే ఊహించుకొనగలము. ఆ పరిధే సర్వస్యం అనే భావన కలిగిందో మనకు చేటు ప్రారంభమైందన్నమాటే.”

“అర్థం కాలేదు…”

“పూర్తి శుభంగా ఉండే రోజు చూడమన్నారు కదా మీరు అందుకే చెపుతున్నాను. మీరన్నమాట మీకు అవతల మనిషి పై ఉన్న అంతులేని అభిమానాన్ని ప్రేమానురాగాలనూ వ్యక్తం చేస్తుంది” అని నవ్వి.

:మనం పూర్తిగా నిమిత్తమాత్రులం. మన ప్రయత్నము సమగ్రం కాదు. అయినా పద్దతిగా పూర్తి చేయాలి. అంతే! పెద్ద పెద్ద ఆశలను పెంచుకొనకుండా మన నడక మనం నడిస్తే మంచే జరిగిందనుకోండి, సంతోషం లేదు తట్టుకొనగలము. స్థైర్యం ఉంచుకోండి. అలా ఉంటే జరిగిన దాన్ని సరిదిద్దుకునే అవకాశము మనకు ఉంటుంది అవునా!” అన్నాడు.

“అవును! అవును! నిజం చెప్పారు ఇక శలవా?” అన్నాడు మెట్లు వైపు చూసి.

తలూపాడు పూజారయ్య.

దీక్షితులు దోవ చివరికి వెళ్ళిందాకా అలా చూస్తూనే ఉన్నాడు.

కనుమరుగయిన తరువాత సిద్దయ్య గుర్తులోకొచ్చాడు.

అప్పుడు జరిగిన సంఘటన తలలో కొచ్చింది.

పదేళ్ళ క్రితం…

పెళ్ళి ముహుర్తం కోసం పట్నం వెళ్ళి లగ్నపత్రిక వ్రాయించుకొని వచ్చాడు సిద్దయ్య.

పెళ్ళి కూడా చాలా శుభంగా గొప్పగా జరిగింది.

కోరి చేసుకున్న పెళ్ళి. పిల్ల బుద్దిమంతురాలు. రూపసి, చదువరి. బంధు వర్గంలోని అమ్మాయి కాకపోయినా… హితులు కొందరు వద్దంటున్నా వినక… ఇష్టపడి చేసుకున్నాడు.

అందరి ఆశీస్సులు పొందారు. వివాహానంతరం విందు జరిగింది.

ఆ తర్వాత… సిద్దయ్య, పెండ్లి కుతురు వారు బందువుల చిన్నమ్మాయి, మేనత్త కారులో బయలుదేరారు.

దైవదర్శనం చేసుకొని వచ్చేందుకు… ఆ తరువాత ఇంటికి వెళ్దామని వారి అభిప్రాయం…

గుడి అంతా కలిపితే ఇరవై కిలోమీటర్లలోపు ఉంటంది.

మిగిలిన పెండ్లి వారు కూడా గుడి దగ్గర ఆగి దైవదర్శనం చేసుకునే వెళ్దామనుకున్నారు. పెండ్లి బస్సులో…

మెయిన్ రోడ్ ఎనిమిది కిలోమీటర్లు ఉందనగా క్రిందికి దిగింది కారు గుడి రొడెక్కారు.

చిన్న బ్రిడ్జి కనిపించింది.

దాని ముందు మలుపు. ఎదురుగా చెఱుకు లోడుతో లెలాండ్ లారీ వచ్చింది. అదుపు తప్పింది.

కారు డ్రైవరు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ప్రమాదాన్ని తప్పించేందుకు కృషి చేసాడు కానీ….

అతను తప్పించిన దిశకే లారీ ఒరగడంతో అచేతనుడయ్యాడు. లారీ కారుకు తగలడమేగాక దాని పైకి పొర్లింత కొట్టింది. లారికి తగలగానే కారు ముందు డోరు ఫట్ మని తెరుచుకొని ఊడిపోయినది. మేనత్తగారు మాత్రం ఇవతలకు దొర్లి కందకంలో ఆగింది. దాని నిండా అంతు మాలిన ముళ్ళ కంచె ఉంది. అయితే అప్పటికే ఆవిడ స్పృహతప్పింది.

కారులో మిగిలిన వారు అప్పచ్చిలా అణిగిపోయారు. వార్ని కారు నుంచి బయటకు లాగడం కష్ట సాధ్యమయింది. మొత్తం రక్తసిక్తమయినారు.

కొందరి కొన్ని శరీర భాగాలు విడివడి ఏది ఎవరిదో తెలియని స్థితి, అందున్న ఎవ్వరూ ప్రాణంతో మిగలలేదు.

చెఱుకు ఆసామీ మాత్రం కాలు తొంటి వరకు విరిగిపోయి దూరంగా విసరివేయబడినాడు. ఊపిరితో మిగిలాడు.

పెద్దగా మూల్గుతున్నాడే తప్ప ఒంటి పైన సోయి లేదు.

వెనుకనే వస్తున్న పెండ్లి బస్సు అక్కడకు చేరుకుంది….

మలుపు తిరగగానే కనిపించిన దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు.

బస్సు ఆపి పురుగు మిగలకుండ బిలబిల క్రిందకి దిగారు.

నడుస్తూ మొత్తుకుంటూనే మేనత్తగారిని, చెఱుకు రైతును రోడ్డుకు చేర్చి అదే బస్సులో ఆసుపత్రికి చేర్చారు.

ఆ తరువాత… లారీని పక్కకు జరిపి కారులోని నూతన వధూవరుల శవాలను రక్తం గడ్డ కట్టిన స్థితిలో బయటకు తీయగలిగారు.

పెండ్లివారు ఇంటికొస్తున్నారని ఎదురు చూస్తున్న వారికి ఈ వార్త చేరింది అంతే… ఊరు ఊరంతా కదిలింది. జరిగిన ఘోరానికి కంట తడిపెట్టని మనిషి లేడు.

భగవంతుడు తనను చూసేందుకు వస్తున్న వారిని ఇంత నిర్దాక్షిణ్యంగా ఎందుకు చేసాడో అంతుపట్టడం లేదు.

శుభ ముహుర్తపు బలం అంతా ఏమయి ఉంటుంది? దోషం ఎక్కడ ఉంది?

తెలిలేదు…

ఆ ఊరికే జాగారపు రాత్రయిందది.

ఇది గుర్తు కొచ్చినపుడల్లా పూజరయ్య ‘స్వామి ఏమిటిది? ఎందుకిలా నడుపుతున్నావు? ఎంత కాలం నీ పాదార్చనలో ఉన్నా చింతాకంత కూడా అర్థం కావా? అసలీ లీల ఎందుకు చెప్పు స్వామీ? నీ కొక్కడికి ఇది తెలిసి ఉంటాలి’ అని వేడుకోవడం అలవాటు, కానీ ఈ దేముడిలో ఉలుకు పలుకూ కనిపించదు. ఏదో అర్థమయినట్టుగా కొంత విడత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆలోచిస్తే మాత్రం ఆ అర్థమయిందేమిటో బొత్తిగా తెలీదు.

“పూజారయ్యా నీకూ ఉలుకూ పలుకులేక ఆ రాతి దేముడికి లేకపోతే ఎలాగయ్య. ఆయన ఎట్టాగు పలకడనే మేం నిన్ను ఇక్కడ ఉంచింది. ఆ రామయ్యతో గానీ మాటాడుతున్నావా ఏంటి?” అంది అప్పుడే వచ్చిన భవానమ్మ.

ఆవిడ పిలుపుకు తేరుకొని పారజాచి ‘అమ్మా మీరా’ అన్నాడు.

“నేనొచ్చి ఏ కాలమయిందో తెలుసా?” అంది నవ్వుతూ.

“ఎదురుగానే ఉన్నానుగదా?”

“ఉన్నావు ఎక్కడో ఉన్నావు? నీ మనస్సు దేని కోసమో తిరిగాడుతుంది. అందుకే కొంత విడత చూసాను. నీ అంతట నువ్వు ఇటు వచ్చేజాడ కనిపించలేదు. ఇక లాభం లేదనుకొని పిలిచాను” అంది! మళ్ళీ అదే నవ్వు.

“ఆఁ ఏదో గుర్తుకొచ్చింది” అని…, “అయినా మీరు రాగానే పిలువ వచ్చుగదా?” అన్నాడు చేతిలోని పూలు పండ్లు అందుకుంటూ…

‘నీ ద్యాసను తెంపడం ఇష్టం లేక ఆగాను’ అంది.

“సిద్దయ్య పెండ్లి ముహుర్తం గుర్తుకొచ్చింది… జరిగింది జరిగినట్లు మనస్సు చెపుతూపోయింది. మన శక్తి ఎంతో? ఎలా అర క్షణంలో పనికి రాకుండా పోతామో? ఎంత నిమిత్త మాత్రులమో? కళ్ళ ముందు అయినా ఈ కాస్త ఆటలో ఎన్నెన్ని పంతాలో ఎన్ని పట్టింపులో? నరుక్కోవడాలో, ఆనందిచండాలో, అందలాలెక్కడాలో, పడిపోవడాలో…”

“అవును అంతే మరి. నిండు నూరేళ్ళు దంపతులుగా జీవించమని ఆశీర్వదించి పంచభూతాల సాక్షిగా వివాహం చేసి ఒక్క రోజయిన గడవక ముందే.. అమ్మో ఊహలోకి వచ్చినా జంకు అనిపిస్తది.”

“ఇక్కడున్న మనిషి స్థితి అంతే ఉన్నంత సేపూ ఆడే ఆట ఇది.”

“అదీ ఎందుకు ఎలా వచ్చేయో తెలియక. ఎలా నిష్ర్కమిస్తాయో తెలిసి చావక అగమ్యంగా జీవిస్తూ అంతా నేనే అన్న అహంతో అయిపోయిదాక ఆడే వింత విడ్డూరపు ఆట. ఇదంతా తెల్సిన మహానుభావులు ఉర్కోరు. లోకపు దారెంట పడికొట్టుకొని పోతూనే ఉంటారు. అలా పోవాల్సిందే. నాది అనేది కొంత సమకూరగానే అసలిదేంటి అని అర్థంచేసుకొనే ప్రయత్నంలో ఉండగానే ఏమి అవగతం కాకుండానే వెళ్ళిపోవడం ఈలోకపు తీరు. ఈ కట్టెను తగలేసి వచ్చి తిరిగి పరుగులో పడతారు.”

‘మీరు పూజ ప్రారంభించండి’ అంది.

‘అలాగే’ అని, ‘మీరిలా వచ్చి కూర్చోండి’ అని కూర్చునేందుకు చోటు చూపాడు. లీలా మానుష విగ్రహమయిన ఆ శ్రీరామ చంద్ర ప్రభువును చూస్తూ కూర్చుంది. ఏదో అనుకున్నాను. అందగాడే ఈ రాముడు.

నీలమేఘశ్యాముడున్నారు గానీ అదో అందం. ఎంత సమ్మోహనకరంగా ఉన్నాడు. చూసారూ ఆ చెరగని చిరునగవు ముద్ర, ఎప్పుడూ ఆయన ముఖారవిందాన్ని వదలదు.

అందరి అన్ని కోరికలను తీర్చే అభిరామునిలా ఆనంద దాయకంగా… ప్రసన్నంగా కనిపిస్తాడు.

అందుకే… ఆయన్ను చూసి… మోసపోయి… భక్తులుగా మారి… పరిధి దాటి ప్రవర్తించుతారు.

ఆ ‘గోపన్న’ సంగతేంటి?

చేసింది తహసీలుదారు నౌకరీ. ‘ఖజానాకు వచ్చిన శిస్తునంతా పైసా పంపకుండా రాముడికే పెట్టాడు గదా.’

తీరా తానీషా ఇదేం పని అని జైలులో పారేస్తే… రామా ఏమిటిది? అని పంచాయితీ.

నీ కోసం నా సర్వస్వం అర్పించి సేవ చేసాను గాదా!…

అది చాలక ప్రభుత్వ నిధిని కూడా దొంగతనంగా నీకు సమర్పిస్తిని గదా ఆ నేరానికి నేను జైలులో పడితే!…

సీతమ్మను అంకంపై కూర్చోపెట్టుకుని కులుకుతూ ఉన్నావా?

ఎవడబ్బ సొమ్ముతో నేను చేయించిన నగలన్నింటినీ అలంకరించుకొని నీ చంతకు చేరింది ఆ తల్లి? ఇంత ఇంగితం లేదా?

అని….

అంతే కాని నేరస్తునిగా జైలు గొడల మధ్యన ఉండి కూడా రామ చంద్రుణ్ణి… ఒక్క పరుషపు మాట అనలేకపోయాడు.

అంతటి సమ్మోహనకారుడే రామ చంద్రుడు.

అసలాయన్ని చూసిందేవరు?

వాల్మీకి అయినా చూసాడా?

రాముడిలా ఉంటాడని ఈ రాళ్ళు చెక్కిన శిల్పాచార్యులకు చెప్పిందేవరు? ఏ స్ఫూర్తి ఇంత సమ్మోహనకరమైన మూర్తిని చెక్కేందుకు దోహదమిచ్చింది? అర్థం గాదు కానీ అలాగే చెక్కారు.

అది చూసి ఇప్పటికీ… రామా! రామా! కళ్యాణరామా అంటునే ఉన్నారు.

‘గోత్రం’ చెప్పండి అడిగాడు పూజారయ్య.

రామునిలోకి వెళ్ళిపోయిన భవానమ్మ తేరుకొని…

‘భరద్వాజ గోత్రం’ అని చెప్పింది.

అప్పటి నుంచి పూజక్రమాన్ని విన్నది.

పూజ పూర్తయిం తరువాత హారతిచ్చి టెంకాయకొట్టి ఒక చెక్క ఆవిడకిచ్చి లేచాడు.

భవనమ్మ రామచంద్ర ప్రభువుకు సాష్టంగ పడి లేచి వరండా ఇవతల ‘చప్టా’ లోకి వచ్చింది.

పూజారయ్య వైపు మళ్ళి ‘ఇక వెళ్ళొస్తాను స్వామి’ అంది.

“మంచిది” అన్నాడు పూజరయ్య ఆశీర్వదిస్తూ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here