[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 17వ భాగం. [/box]
[dropcap]అ[/dropcap]యితే ఇలాంటి మహాయుగాలు (71) డెబ్బయి ఒకటి గడచిపోతే దానిని ‘మన్వంతరం’ అంటారు. అలాంటి మన్వంతరాలు పద్నాల్గు గడిస్తే ‘బ్రహ్మ ఆయుర్దాయంలో ఒక పగలు’ ఈ భాగాన్నే మన వాళ్ళు ‘కల్పం’ అన్నారు.
ఇలాంటివి ఏడు వందల ఇరవై (720) కల్పాలను కలుపుకొనగల్గితే అది బ్రహ్మదేవుని ఆయుర్దాయంలో ఒక సంవత్సరం. ‘మనిషి’ అన్నవానికి నూరేళ్ళ ఆయుషు లాగ బ్రహ్మ ఆయుషు కూడా ఇలా అని మన వాళ్ళు చెప్పారు.
“నాన్నగారూ, ఇది అర్దమయింది గానీ ఇంద్రులు చాలా మంది ఉన్నట్లే బ్రహ్మలూ చాలా మంది ఉన్నారంటరా?”
“అవును ఉన్నారు. ఇప్పటికి ఈ సృష్టీలో ఆరుగురి భ్రమ్మల కాలం చెల్లిపోయింది. ఏడవ బ్రహ్మ కాలమిది. ఈయనను ‘పద్మభూ’ అని అంటారు. కలికాలమాన ప్రకారం ఈ భ్రహ్మ ఆయుషు ‘ఏభై ఒక్కటి’ నడుస్తుందంటారు.
ఈయన కాలంలో ఆరుగురు మనువులు పాలించి గతించారు. ఇప్పుడు ఏడవ మనువైన వైవస్వతుడు పాలన జరుగుతుంది” అంటూ ఉండగా దీక్షితులు వేగంగా లోనికి వచ్చాడు.
“ఆయన్ని చూసి ‘రాత్రికి వస్తానన్నావట గదా’ ఏం మునిగిపయిందనీ అర్దంతరంగా ఊడిపడ్డావు? పైగా ఎదో అఘాయిత్యం జరిగినట్టుగా, కాళ్ళు చేతులయిన కడుక్కోకుండా పరుగున రాకపోతే నేం? అసలు నీ పద్దతి నాకు అంతు పట్టదు” అన్నాడు దశరథం.
“మీకేం అంతు పట్టుతది. ఇంటికి వచ్చిన వాడ్ని ‘కూర్చో’ అనడం తెలీదు, ఇన్ని మంచి తీర్ధం ఇయ్యడం తెలీదు కానీ చాలా చాలా చెపుతుంటారు. అనగానే ‘రా’ అన్నయ్యా కూర్చో మంచి నీళ్ళు తెస్తాను” అంటూ లోనికి నడిచింది.
అక్కడ నుంచి ఉత్తరం ముక్కవచ్చింది అన్నాడు దీక్షితులు.
‘వస్తే?’
“పిల్లవాడి తరువువారు ఆదివారం వచ్చేస్తున్నారు.”
“అరేయ్ దీక్షితులూ నీకు వయసొచ్చింది తల పెరగలేదు. ఇది అర్జంటు విషయమా? తెలియనిదా? కబురు కూడా చేస్తారుగదా! దానికింత అర్భాటం దేనికి? అయినా ఇవ్వాళ్ళ ఏం వారం? అనవసరపు హడావుడి పడడం మంచిదా?” అని లోపలకి చూసి “ఇదిగో వీనికి కాఫీ ఇవ్వు” అన్నాడు.
“ఓ క్షణం ఆగి అమ్మాయిని చూస్తారు పెళ్ళి చూపులు. అవుతల వాళ్ళు వస్తున్నారు ఆ ఏర్పాట్లు చూడాలి అని చెపుదామని నేను వస్తే, నేనేదో చేసినట్లు…. మాటలాడేవేంటి? ఉత్తరం నా చేతికి వచ్చిన దగ్గర నుంచీ నీ దగ్గర వాలిందాకా ఆగలేకపోయాను. అంతే!” అన్నాడు దీక్షితులు నొచ్చుకుంటూ.
“అంత ప్రేమ కూడా పనికి రాదు. మనం తలచినట్లూ మన అందుబాటులో ఉంటూ నడిస్తే చాలు.”
కాఫీ కప్పులతో విజయ బయటకి వచ్చి ఇద్దరికి ఇచ్చింది.
“ఇంటి వైపే రావడం లేదు?” అడిగాడు దీక్షితులు.
“మీరు ఉంటే గదా, నేను వస్తూనే ఉన్నాను” అంది విజయ.
“మా పిచ్చిది వచ్చినట్లు చెప్పలేదు” దీక్షితులు.
“అది సరే కానీ ఎట్లా వస్తున్నారు వాళ్ళు?” అడిగాడు ధశరథం
“బస్సుకే….”
“అంటే ఉదయం పదకొండు గంటలకు చేరతారు, అంటే ఏకంగా బోజనాలేర్పాటు చేయాలి. ఆ తరువాతే పెళ్ళి చూపులు అంతేనా?” అడిగాడు దశరథం.
“మంచిది అలాగే చేద్దాం. ఇక్కడ మన బంధువులనందరిని పిలుద్దామా?”
‘కొందర్ని పిలుద్దాం ఎవరెవర్ని అనేది లిస్టు చేద్దాం లే.’
“రాగానే కాఫీ టిఫిన్లు” అన్నాడు దీక్షితులు.
“ఆ పని నువ్వే చేస్తే బాగు.”
“చేద్దాం! అసలు రాగానే మా ఇంటికే తీసుకెళ్తాను. కాళ్ళు చెతులు కడుక్కొని దాహం తీర్చుకుని కాఫీ అయిన తరువాత…”
“టిఫిను మరచిపోయావు” అన్నాడు దశరథం నవ్వుతూ.
“సరేలేరా!” అని “ఆ తరువాత ఇక్కడకు వద్దాం” అని “ఆఁ ఇక్కడకు వచ్చేసరి విజయను బొమ్మలా చేసి ఉంచాలి గదా” అంటూనే లేచి లైం చూసుకొని “ఇప్పుడే వస్తాను” అని చక చక బయటక నడచాడు.
“ఏంటి? ఏమయింది?” అని దశరథం అంటున్నా వినిపించుకోలేదు.
సీతమ్మ వైపు తిరిగి అసలు ‘వీడు నీకేమైనా అర్థమయ్యాడా?’ అడిగాడు.
“అర్థం కావడానికే ముంటుంది? ఏదో మరచిపోయి ఉంటాడు అది చెప్పి వచ్చేస్తాడు.”
“అంతేనా చెప్పివెళ్ళవచ్చుగదా!”
“అందరికి అన్నీ తెలుస్తాయా?” అంది.
“అంటే వీడు నీకు బాగానే అర్థమయినట్లుంది? నాకే అందడం లేదు” అని సణుగుకుంటుండగా
‘నాన్నా’ అంది విజయ.
“ఆఁ! ఏంటి?” అన్నాడు దశరథం అంతా మరచిపోయి విజయను చూస్తూ.
“పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తున్నారా?” అంటూ లోనకు నడచింది విజయ.
“పోస్టు” అని ఓ ఉత్తరం ఇచ్చి “బావున్నారా?” అని పరామర్శించి వెళ్ళిపోయాడు ఆ ఊరి పోస్టు మాష్టారు. ఉత్తరం తీసుకొని పేరు చూసి “అమ్మా విజయా నీకే ఉత్తరం” అన్నాడు.
వచ్చి తీసుకొని అక్కడే చించి, చదువుతూ లోనకు నడచింది.
‘ఎక్కడ నుంచి?’ అంది సీతమ్మ.
“నా రూంమేటు రమణి లేదూ! అది వ్రాసింది.”
ఇంతలో దీక్షితులు ఎంత వేగంగా వెళ్ళాడో అంత వేగంగా తిరిగి వచ్చాడు. చేతిలో పొట్లం ఉంది. సరాసరి సీతమ్మ దగ్గరి కెళ్ళి “అమ్మాయిని పెళ్ళికూతురిని చేయాలికదా! మొన్న వస్తూ టౌనులో చీర తెచ్చారు. తెచ్చిద్దామనుకున్నాను. మరిచిపోయాను. ఇంద” అని చేతికిచ్చి వచ్చి ధశరథం ఎదురుగా కూర్చున్నాడు.
“ఇందుకంట్రా ఉరికింది? అయినా…. ఇంగితం ఉండాలి పెళ్ళి చూపులెప్పుడో నీకు తెల్సుకదా! దీన్ని రేపిస్తే జరిగే నష్టం లెదుగదా? మరి దీని కోసం అకస్మాత్తుగా ఎందుకు పరుగెత్తినట్లు? ఎప్పుడు ఏ పని చేస్తే సబబుగా ఉంటుందో నువ్వు మాకు చెప్పల్సిందిపోయి. నువ్వే ఇలా? చేస్తే ఎలా?” అన్నాడు చికాకుగా.
‘పిల్లదానికి నేను చీరకొని ఇవ్వకూడదట్రా’ అన్నాడు దీక్షితులు కోపంగా
‘నేను అలా అన్నానా. ‘ఛ’ నిన్ను ఆ భగవంతుడే బాగుచేయాలి.’
“అది చేయలేకనే కదా ఉన్న ఒక్కడిని తీసుకెళ్ళాడు, ఆ రోజే అనుకున్నాను నాకు ఎవ్వరితోడు అక్కర్లేదని. అసలు నేను పోయినా ఏం లేదు. నాకు ఎవరెందుకు? అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ దీక్షితులు.
“నా మాట ఏమిటో విన్నావా? నువ్వు అనుకున్నట్లుగానే లోకంలో జరుగుతవా జరిగితే లోకం ఉంటుందా? ‘ఛ’ అసలు నీతో మాట్లాడడమే పొరపాటు. రాను రాను నీతో ఎలా మాటాడాలో తోచకుండా పోతుంది.”
‘అయితే వెళ్ళిరానా’ అన్నాడు లేస్తూ…
“ఏమిటిది? పసివానిలా! నా మీద అలుగుతున్నావా?” అని కూర్చుండబెట్టి, “వాళ్ళను నీ ఇంటికే తీసుకెళ్ళి విశ్రాంతి తరువాత కూర్చుని మాటాడుకుందాం అంతేనా?”
అలాగే అన్నట్లు తల విసిరాడు కానీ కోపం తగ్గిన జాడలేదు.
“ఆఁ! ఈ మాట విన్నావా? మన కరణంగారి మనవడి పెళ్ళి కుదిరిందట?”
‘ఆఁ విన్నాను!’
‘ఏ ఊరో తెలుసా?’
“పెళ్ళి పత్రిక వస్తుంది గదా తొందరెందుకు?”
“వీరికి పిల్లనిచ్చే తండ్రి నాకు క్లాస్‌మేట్‌రా!”
“మంచిదేగా!”
‘నాన్నగారూ’ అంటూ విజయ ఎదురుగా వచ్చింది, బాగా నీరసంగా అనిపించింది.
“ఏమిటి?”
“రమణి అనే నా రూములో ఉన్న అమ్మాయి ఉత్తరం వ్రాసింది.”
‘ఏమిటట?’
“మా ఇద్దరితో పాటు ‘రాధ’ అని ఇంకో అమ్మాయి ఉంది. మా ముగ్గరికి కలపి మాకాలేజిలో 3B అంటుండేవారు.”
“అంటే…”
“ముగ్గురు అందగత్తెలు ‘3B’ అంటే బ్యూటి అనే అర్థంగావచ్చు.”
“మీ ఎదురుగా అనేవారా?”
“ఎదురుగా అనకపోయినా మమ్మల్ని వాళ్ళు పిలుచుకునేది అలానే.”
“అయితే?”
“రాధకో బావ ఉన్నాడు. నాగపూర్‌లో M.B.A చేస్తున్నాడు. మొదటి నుంచి అతన్ని చేసుకోవాలని దాని కోరిక. వాళ్ళు కూడ ఇష్టంగానే ఉన్నరట. పెళ్ళి కూడా దాదాపు ఈ ఎండలలో అవుతదని చెప్పి మురిసిపోతూండేది.”
“ఇదంతా ఎందుకు చెపుతున్నావమ్మా!” అన్నాడు దశరథం.
“రాధ ఆత్మహత్య చేసుకొని చినిపోయిందట నాన్నగారూ” అని కండ్లతుడుచుకుంటూ నిలుచుంది!
ఉలిక్కిపడ్డాడు దశరథం!
‘ఏంటి’ అంటూ ఉన్న చోట నుంచి లేచాడు దీక్షితులు.
“వాళ్ళ బావ పెండ్లి ఈ మధ్యన సడన్‌గా వేరే పిల్లతో కుదిరిందట.”
“ఈ కాలం పిల్లలు ఎప్పుడు ఏం చేస్తార తెలీదు. అతివృష్టో అనావృష్టో ఎప్పుడు నెత్తిన ఉండాల్సిందే” అంది సీతమ్మ బాధపడుతూ.
దీక్షితులు విజయ దగ్గరికొచ్చాడు, చూస్తూ నిలుచున్నాడు.
‘ఒకసారి నేను వెళ్ళిరావాలి నాన్నగారు’ అంది దృడంగా.
‘ఎక్కడికి?’
‘రమణి దగ్గరికి వెంటనే వెళ్తే ఇద్దరం కలసి రాధ ఇంటికెళ్ళివస్తాం.’
“వాళ్ళ ఊరెక్కడ?”
‘ఖమ్మానికి దగ్గర పల్లెటూరు.’
‘నీకు ఆదివారం పెళ్ళి చూపులున్నాయి.’
‘శనివారం మధ్యాహ్నానికి వచ్చేస్తాను.’
‘విజయా ఆడవాళ్ళు ఒంటరి ప్రయాణం చేసే కాలమేనా ఇది?’
‘మీరేవరైనా రండి’ అంది.
“అంత స్నేహితురాలా!”
“ముగ్గురం చదివినంత కాలం ఒక్కటిగా ఉన్నాం. మాకు ఇంటి దగ్గర నుంచి వచ్చిన డబ్బును కూడా ఒకే చోటనే పెట్టి ఖర్చు చేసుకొనేవాళ్ళం.”
‘నేను రానా?’
“మీకు పనులున్నాయి గదా!”
“మామయ్యను తీసుకెళ్ళు!”
‘అక్కర్లేదు లెవోయ్ వెళ్ళి వస్తుందిలే’ అన్నాడు దీక్షితులు.
‘సరే జాగ్రత్త’ అని “ఎప్పుడు బయలుదేరుతావు?”
‘ఇప్పుడే వెళ్ళాలని’ ఉంది.
“నువ్వు అక్కడికి చేరుకునే సరికి అపరాత్రి అవదు గదా!”
“నాకు తెల్సు నాల్గయిదుసార్లు వెళ్ళాను.”
“అలాగే” అని, “ఈ రెండొందలుంచు” అని చేతికిచ్చాడు.
దీక్షితులు విజయ తలపై చేయి ఉంచి నిమురుతూ “అమ్మా, అక్కడ ఎదైన జరిగినా upset గాకు. అంత దగ్గర అంటున్నావు, గనుక చెపుతున్నా. అంత పసితనాననే ఆ పిల్లకు నూరేళ్ళు నిండడం దురదుష్టకరం కానీ మన చేతిలో ఏముంది? ధైర్యంగా వెళ్ళిరా. నన్ను రమ్మన్నా వస్తా.”
‘అక్కర్లేదులే మామయ్య. ఓ మంచి మాట చెప్పావు చాలు’ అంది.
***
‘విజయ రాలేదా?’ అంటూ వచ్చాడు దీక్షితులు
‘రేపొస్తుంది’ అంది సీతమ్మ కూర్చునేందుకు మంచం చూపి…
‘ఈయనేడి..?’
‘రాముడి గారి దగ్గరికి వెళ్ళాడు.’
‘పనా?’
‘ఏమో?’
‘డబ్బుకోసమా?’
‘నాకు చెప్తరా?’
‘ఇల్లు పొలం ఉందిగాదా పొలం రాయుడికి కలుస్తుందిలే. రెండు వైపులు అతని తరి పొలమే ఉంది. అంచేత చాలా ప్రేమగా ఉంటాడు. పెళ్ళి కుదురుతుంది గదా అంటే మనం ఏర్పాటులో ఉండాలిగదా!’
“ఉండాలి కానీ ఆ పేరుతో చిక్కుల్లోకి వెళ్ళొద్దు. నాతో అనడు నేనేదో కష్టపడి పోతానని.”
“అలాంటిదేం ఉండదులే అన్నయ్యా!” అని “మన పిల్లవాడే ఉంటే అసలివేవీ ఉండేవి కాదు. భగవంతుడు భగవంతుడు అని విడవకుండా వెంటపడే మనని ఇలా ఎందుకు చేసినట్లు?” అని ముక్కు చీదుకుంటూ లోనికెళ్ళింది.
దీక్షితులుకి దుఖం ఆగలేదు. అలాగే కూర్చుండిపోయాడు.
“కాఫీ తెస్తున్నాను వెళ్ళిపోకు” అంది ఆ తరువాత.
మాటడలేదు దీక్షితులు. లేచి తోవనపడనూలేదు.
కాఫీ తాగిన తరువాత కానీ ప్రాణం కొంత కుదుట పడలేదు.
‘ఇంకా రాలేదేం?’ అడిగాడు కప్పు ఇస్తూ.
‘వస్తాడు నువ్వు మళ్ళీ రారాదూ!’
“ఆఁ!” అంటూ నడచాడు.
దీక్షితులు ఇంటి ముందుకు వస్తుండగా క్రీస్తుదాసు ఎదురుపడి ఆగి “నమస్తే దీక్షితులవారూ” అన్నాడు.
“దాసు నువ్వేగదా! బాగామారావు తెల్లదొర ఠీవి వచ్చింది పో” అని, “ఎక్కడ ఉంటున్నావు” అడిగాడు.
ప్రభుసేవ నిమిత్తం నన్ను చాలా దూరముగా పంపినారు. అందు చేతనే ఇచ్చట నన్నునా తల్లిదండ్రులను చూచుకొనుటకు కూడా వచ్చు వీలుదొరకటలేదు. అన్నాడు బాధపడుతూ.
రారాదూ! కాఫీ త్రాగిపొదువుగాని అన్నాడు.
మీ ఆప్యాయత నన్ను కదలించుచున్నది. నడువుడు.వచ్చెదను అని వెంటపడి లోనికి వచ్చాడు.
‘కూర్చో’ అని కుర్చీ చూపాడు ఆదరంగా.
‘ఫరవాలేదు’ అంటూనే కూర్చున్నాడు ఆరామ్‌గా.
శాంతా ఒక సారి ఇటు అనిపిలిచాడు దీక్షితులు.
‘ఆఁ!’ అంటూనే బయటకొచ్చి కొత్త మనిషిని గమనించి పైట నిండుగా కప్పుకొని గోడ వారన ఆగింది.
‘ఇతగానిని గుర్తు పట్టావా?’ బాగా చూడు కొత్తమనికాదు అన్నాడు.
తెల్సిన వాడేఅయి ఉంటాడని చూసింది. క్రిష్టియన్ ఫాదర్‌లా ఉన్నాడు
వేషం చూస్తే మనిషి ముఖకవళికలు ఎక్కడో చూసినట్లుగా పరిచయం ఉన్నవానిగా అనిపించిది.
‘మన దాసే అదే క్రీస్తుదాసు’ అన్నాడు.
అప్పుడు గుర్తు కొచ్చింది.
ఓ అడుగు బయటకు వచ్చింది కాని చనువుగా పలకరించాలనిపించలేదు.
“తల్లిదండ్రులను చూసుకొని పోయేటందుకు వచ్చాడట. తోవలో తటస్త పడితే వెంట పెట్టుకొని వచ్చాను. మంచి కాఫీ ఇవ్వు” అన్నడు.
“వీరిని నేను లోగానే చూసియుంటిని గదా” అన్నాడు దాసు.
“అంటే రెండో పెళ్ళి చేసుకొని కొత్తావిడను చూపిస్తాననుకున్నావా? బావుదయ్యా నీ వరస” అని “దాసూ నాకు తెలియక అడుగుతాను నీది గవర్నమెంటు ఉద్యోగం లెక్కనేనా? నెలకు ఎంత ఇస్తారు. బాగా సరిపోతదా. అదీగాక బదిలీలు ఉంటాయంటున్నావు?” అన్నాడు.
“ప్రభువు పాపమును క్షమించుగాక” అని, “మాది ఉద్యోగము కానేకాదు. దైవ సేవ ఆ క్రీస్తు ప్రభవును ఆరాదింఛుకునే భాగ్యము మాకు మాత్రమే ఇలా కల్గినది” అని ఓ క్షణం ఆగి “మనము మనుష్య మాతృలమూ గదా! ఆకలి దాహాము మనకు నిత్యము కలుగును గదా! ఆ ప్రభువు దయవలన ఇప్పటికి గాలిని మాత్రము కొనుక్కొనుట లేదు. ఉచితముగానే తీసుకొనుచుంటిమిగదా! అన్న జలముల కొసము సంసారములను నిలుపుకొనుటకునూ నౌకరీ లాగ జీతభత్యములు పొందక తప్పదుగదా!
ఈ దేహయాత్రలో ఆ ప్రభువు మనకు సర్వదా రక్షించుతూ ఉండును. పాపములను క్షమించును మన సేవలను ఆయన బాగుగా ఇష్టపడును. నిజము” అన్నాడు అతని పద్దతినంతా చెప్పేసానన్న తృప్తితో. ఇంతలో శాంతమ్మ కాఫీ తీసుకొని వచ్చి ఇద్దరికి ఇచ్చింది. కాఫీ త్రాగాక కప్పు కింద పెట్టి “మా దేవుడు మిమ్ములను సర్వదా కాపాడుతాడు” అన్నాడు ఆశీర్వదిస్తున్నట్లు.
తర్వాత దాసు వెళ్ళిపోయాడు. దీక్షితులు ఇంట్లోకి వచ్చాడు.
శాంత ఈయన కోసమే ఎదురు చూస్తున్నట్లుగా కూర్చుని ‘ఆదివారం పెళ్ళివారు వస్తారుగదా’ అని అడిగింది.
‘అవును వస్తారు ఇక్కడికే వస్తారు.’
“ఈ మాట నాతో అంటే నా ఏర్పాట్లులో నేను ఉంటాను గదా!”
“నేను ఎక్కడికి వెళ్ళడం లేదు” అని “ఇప్పుడే వస్తాను” అంటూ బయటపడ్డాడు.
ఎప్పుడూ ఇంతే అని విసుక్కుంది. సీతమ్మ ఏం చేస్తుందో అనుకుంది. ‘వెళ్ళివస్తే బాగు’ అనిపించింది.
విజయ గుర్తుకొచ్చింది. దానితో పాటు పిల్లాడు గుర్తుకొచ్చాడు. కళ్ళు చెమ్మగిల్లినయి అక్కడే కూలబడిపోయింది.
మన పిల్లలు మన కళ్ళముందు పోరాదు.
(ఇంకా ఉంది)