అనుబంధ బంధాలు-18

0
8

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 18వ భాగం. [/box]

[dropcap]ఇం[/dropcap]కా పొద్దుపొడవ లేదు. పున్నం రోజులు గనుక చల్లటి పగలులా ఉంది. చంద్రుడు లోకాన్ని చల్లగా చూస్తూ తన యాత్రలో ఉన్నాడు.

జనావాసంలో కదలిక ప్రారంభమైంది.  కోళ్ళు కూస్తున్నాయి… కుక్కలు అప్పుడప్పుడు అరుస్తున్నాయి…

పొద్దుపొడస్తది…

బస్సు ఊళ్ళోకొచ్చి ఆగింది. లోకాన సింధూరం చల్లినట్లుగ దోర ఎఱుపు, పసుపుదనం. పొగ మంచు విడివడుతుంది.

విజయ బస్సు దిగింది. సీదా తల ఎత్తకుండా ఇంటికి చేరింది. లంఖణాలు చేసి పత్యంలో కొచ్చిన పిల్లలా ఉంది. మొఖంలో జీవం లేదు.

లోనికొచ్చిన బిడ్డను చూసి ‘ఎల్లుండి పెళ్లి చూపులు. నువ్విట్లా ఉంటే?’ అంది తల్లి.

మాటాడలేదు విజయ. బ్యాగ్ ప్రక్కనే వేసి కూర్చుంది.

‘మీ నాన్నగారు నీ కోసమే ఎదురు చూస్తున్నారు. లేచి మొఖం కడుక్కో’ అంది.

విన్నది మౌనంగా…

“అసలక్కడ ఏం జరిగిందే?” అంది.

అయినా మాటడలేదు. లోనకెళ్ళి మంచానికి అడ్డంగా పడుకుంది.

ఇక ‘అనవసరం’ అనుకొని నడిచింది సీతమ్మ.

‘ఏం, పిల్లలో ఏమో? అనుకుంటూ ఈయన ఉన్నాడేమోనని చూసింది. కనిపించలేదు. ఈయనకు పొద్దు పొడిస్తే చాలు. బజారుననే పని ఇంటి పట్టున పని ఉన్నా ఉండడు. ఉచిత సలహాలివ్వడంతోనే కాలం చెల్లిపోతుంది. అన్నయ్య నిన్ననగా వచ్చాడు. ‘విజయ రాలేదా?’ అంటూ ఇవాళ్ళ ఆయన జాడ లేదు’ అనుకొని లోనకి వెళ్ళింది. విజయ వెల్లకిలా పడుకొని కళ్ళు మూసుకొని కనిపించింది. ముఖం కడుక్కోవడం గాని బట్టలు మారవడం గాని చేసిన జాడ కనిపించలేదు. పలకరించి వంటింట్లోకి వచ్చింది కాఫీ కలిపి బిడ్డ దగ్గరకు నడిచి “కాఫీ అయిన త్రాగి పడుకో” అంది.

ఉలకలేదు పలకలేదు.

‘నా మాట కూడా వినిపించడం లేదా విజయా’ అంది అసహనంగా.

‘అమ్మా! నేను పండు ముసలి దాన్నా వినిపించక, కనిపించక పోవడానికి? నా మనస్సు బాగాలేక ఇలా ఉంటే విసిగించడంతో పాటు కోపం తెచ్చుకుంటావు వెందుకు? నన్ను ఇలా ఉండనీ’ అంది విసుగ్గా మొఖం చిట్లించి.

కనీసం స్నానం అయినా చేసి పడుకోరాదూ?’

‘అమ్మ నేను బొప్పెమ్మనుగాను, నేనేం చేయాలో నాకు తెల్సు’ అంది పెద్దగా .

‘మంచిది నీ ఇష్టం’ అని చేతిలో కప్పు అక్కడే పడేసి నడచింది.

ఆవిడ వెళ్ళాక నెమ్మదిగా లేచి కాఫీ త్రాగింది.

మంచం దిగింది. వరండా దాటి బయటకొచ్చింది. అక్కడ ఎక్కవ సేపు ఉండలేదు. వెనక్కు మళ్ళింది. తల నిండా తెగని ఆలోచనలు. ఏం చేయాలో, ఎలా దిగమింగుకోవాలో తోచని స్థితి. కూర్చోబుద్ది కాదు, కుదురుగా నిల్చోను లేదు. ఓ రకమైన వింత పరిస్థితి.

దీక్షితులు ఎక్కడి నుంచో హడావిడిగా లోనికొచ్చాడు.

వస్తూనే వరండా నుంచి లోనికి వెళ్తున్న విజయను చూసాడు. ఆయనకు మనస్సు ఎగిరి గంతేసింది.

ఇంకొంచెం గబగబా నడచి  ‘అమ్మా! విజయ వచ్చావు గదా’  అని… నడుస్తున్న విజయ దీక్షితులు పలకరింపుకు ఆగింది. తల ఊపింది.

“అసలు ఏం జరిగిందట?”

మెల్లిగా నడిచి సూట్ కేసు దగ్గర ఆగింది. దాన్ని తెరచి అందులో నుండి ఒక కవరు తీసి దాన్ని దీక్షితులు చెతికిచ్చి మంచం పై బొక్క బోర్లపడి పసిదానిలా వలవలా ఏడ్చింది.

ఈ హఠాత్ సంఘటనకు ఖంగు తిన్నాడు దీక్షితులు.,

“అమ్మా ఏమిటి? ఊర్కో… మనంగా ఏం చెయ్యగలం? చెప్పు” అని అనునయించి చెప్పబోయాడు…

విజయ మంచం నుంచి సర్రున లేచి కూర్చుని ‘మామయ్యా భగవంతుడు వ్రాసిన వ్రాతయితే విధి అనుకుందాం. కానీ ఇది ఆయన రాయలేదు. మనం మనం మనుషులం వ్రాస్తున్నాం. ఆయనకు పులిమి సంతృప్తి పడుతున్నాం. మనకున్న అజ్ఞానాన్ని అలానే నిలుపుకుంటున్నాం. న్యాయానికి వీళ్ళు వ్యవస్థలో వస్తున్న మార్పుకు చేరువ కాలేక ఆహుతి అవుతున్నారు. దీన్ని మనం తలరాత అనరాదు. అనకూడదు’ అని “మామయ్యా నువ్వు మొదట ఆ ఉత్తరం చదువు అది ఏమిటో అర్థమవుతుంది”.

‘నమ్మిన వాళ్ళను నయవంచన చేయడం విధెలా అవుతది.’  అంది పెద్దగా.

‘అమ్మా! విజయా నేను చదువుతాను గానీ నువ్వు బెంబేలు పడకు ఇప్పుడెవరేం చేసినా ఆ పిల్ల తిరిగి రాదు గదా, జరిగిందేమో జరిగిపోయింది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసేందుకు శాయుశక్తులా ప్రయత్నం చేద్దాం’ అని కళ్ళ జోడును జేబు నుంచి తీసి తగలించుకొని ఉత్తరం విప్పాడు. ‘నాలుగు కాగితాలు ఉన్నాయి పాపం? ఎంత క్షోభపడి వ్రాసిందో ఏమో అనుకున్నాడు?’

‘విజయా!

బావున్నావు గదా.

సంస్కారం తెలిసిన తల్లిదండ్రుల బిడ్డవు నువ్వు. బాగానే ఉంటావు. నీ సుకృత మిది.

నాకు తెలుసు.

రిజల్స్ వచ్చాక నేను నీ దగ్గరికి రావాలనుకున్నాను.

ఎందుకోగానీ అలా రావాలనిపించిందోయ్!

నిన్ను బాగా చూడాలనీ. నీతో కొన్ని రాత్రులు మాటాడుకుంటూ పండు వెన్నెట్లో గడపాలనీ అనిపించింది.

కానీ అప్పటి నుంచే నా పట్ల ఒక్కొక విషయం వెలుగులోకి వచ్చింది.

పైగా బావ ఊళ్ళోనే ఉన్నాడు. నాగపూర్ నుంచి నాల్గదినాల క్రితం బయలుదేరి వచ్చి చేరాడు.

మా ఇంటికి వస్తాడనుకున్నాను రాలేదు, బాగా ఎదురు చూసాను.

నా విషయం మా వాళ్ళు గమనించారు. నేను వాళ్ళింటికి వెళ్ళాను.

నేను కనిపించగానే  ‘రాధా రా!’ అన్నాడు బావ. దగ్గరికెళ్ళాక ‘కంగ్రాట్సు రాధ మొదటి తరగతి కొట్టేశావు గదా!’ అన్నాడు.

నా కెందుకో ఆ మాటలు రుచించక అటే చూస్తూ ఉండిపోయాను.

నేను పాసయిన సంగతులు వీళ్ళందరికి తెల్సు అయినా అభినందించడానికి రాలేదు అని అర్థమయింది. మనస్సు కలుక్కుమన్నది. అసలు అక్కడకు ఎందుకెళ్ళానా అనిపించింది. అయినా నిబ్బరంగా బావ దాపుకు నడచి  “బావా నువ్వు వచ్చావనీ నా దగ్గరికి వస్తావనీ ఎంతో ఆశతో ఇప్పటిదాకా ఎదురు చూసి చూసి ఆగలేక ఇలా వచ్చాను” అన్నాను.

‘ఆఁ! అదే వద్దామనుకున్నానూ, నువ్వే వచ్చేసావు గదా అయినా ఇద్దరిలో ఎవరు వచ్చినా ఒకటే  గదా!’  అని నవ్వాడు.

విజయా నాకా నవ్వులో నిజంగా జీవం కనిపించలేదు. పేలవంగా కృతకంగా ఉంది. తడబాటు కనిపించింది. ఇంతలో మా అత్తయ్య బయటకొచ్చి ‘ఎవరురా’ అంది నన్ను చూస్తూనే.

‘నేను’ అన్నాను.

“రాధా! నువ్వటే, ప్యాసయ్యావట గదా! ఎవరో అన్నారు ఇందాక” అని ‘ఏం చెద్దామనుకుంటున్నావేటి? ఇంకా చదువుతావా? అక్కడెందుకున్నావు. నీకేం కొత్తే రా లోపలకు’ అనలేదు. కనీసం నువ్వెప్పుడొచ్చావే? అన్నా సంతోషించేదాన్ని

విజయా ఈవిడేనే ఆరు మాసాల క్రితం మా ఇంటికి వచ్చి ‘ఏం చదువులు వాడికి ఎట్లాగూ నౌకరీ వస్తుందాయే. ఆ మూడు ముళ్ళు దీని మెడలో వేయించి పంపిస్తే పోతుంది’ అంది. ఆ అత్తయ్య ఇలా మాటడమే కాక ‘రాధ! చెప్పడం మరచానే వీడు వచ్చి మూడు రోజులయింది. అదేదో ‘ఫ్లోరా’ కంపెనీలో జాయినయి వచ్చాడు. భగవంతుడు సక్రమముగా చూడబట్టే చదువు అట్టా కాగానే ఇట్టా నౌకరి వచ్చేసింది. ఎంత పెట్టి పుట్టితేనో గానీ రాదట. అంటున్నారూ అందరూ’ అంది.

ఇంత మంచి వార్తను నాకు చెప్పేందుకు కూడా ఊళ్ళోకి వచ్చిన ‘బావ’కు తీరలేదా? లోగా అయితే ఊళ్ళోకి రాగానే నా కోసం పరుగెత్తుతూ వచ్చి వాలేవాడు. మరి ఎందుకు రాలేదు? ‘అసలేదో జరుగుతున్నది. మా వాళ్ళకు అర్థం కావడం లేదు’ అనిపించింది. మనస్సు పరి పరి విధాలుగా పోయింది. ‘రా! రావోయ్ అలా నిల్చుండి పోయావేంటి?’ అన్నాడు బావ చివరకు. ‘ఈ ఇల్లేమయినా కొత్తా? కలయతిరిగిన పిల్లగాదూ’ అంటు అత్తయ్య లోనికి నడచింది.

నా కెందుకో వాతారవరణమంతా కొత్త కొత్తగా అనిపించింది.

‘ఇక వెళ్తాను’ అన్నాను బావతో. నవ్వాడు.

ఇంటికి చేరాను… ఎట్లా చేరానో మాత్రం నాకు తెలీదు.

‘బావ దగ్గరకు వెళ్ళి చెప్పి వస్తున్నట్లుంది పిచ్చిది’ అంది అమ్మ నన్ను చూసి. తలదించుకొని లోనకెళ్ళాను. బావకు ఉద్యోగం వచ్చింది. నా చదువు పూర్తయింది. గత ఎండలలోనే పెళ్ళి చేయాలని తొందరపడ్డ వాళ్ళలోని స్థబ్దతకు కారణం అవగతం కాలేదు. అదే తెలుస్తుంది లే అనుకున్నాను.

‘కానీ నన్ను మనసారా ప్రేమించిన బావ ఏం చదువులోయ్ నాతో వచ్చెయక, నువ్వు గుర్తుకొచ్చి పని తోచకుండా పోతున్నది అని సిగ్గు విడిచి వ్యవరారించిన బావ మూడు ముళ్ళు పడకపోయినా మనం భార్యా భర్తలమే అని దగ్గరకు తీసుకొని ఉక్కిరి బిక్కిరి చేసిన బావ నా చేయి వదలడు అనిపించింది.’

ఆ రాత్రి నాకు తిండి తినబుద్ది అవలేదు. నిద్ర కూడా అరకొరగానే పట్టింది. వాటితో పీడకలలు వచ్చినయి. తెల్లవారింది… నిన్న మెదిలిన ఆశాంతి కొంత తగ్గింది. నిద్రపోయాను గదా!

‘ఇవ్వాళ్ళ బావను ఒంటరిగా కలసి మాటాడాలి’ అనుకున్నాను.

మధ్యాహ్నం బోజనాలయ్యాక బావను కలుద్దామని బయలుదేరాను.

‘ఎక్కడికి?’ అంది అమ్మ.

‘ఎక్కడికెళ్తుంది వాడిక్కడే ఉన్నాడు గదా!’ అన్నాడు నాన్న.

ఇంతలో మామయ్యలోనికి వస్తూ కనిపించాడు.

నాన్న ఎదురెళ్ళి లోనకు తీసుకొచ్చి కూర్చునేందుకు కుర్చీ చూపి కుర్చున్నాక “మంచి నీళ్ళు త్రాగుతావా?” అని ఆడిగి “బోజనాలయ్యాయా?” అన్నాడు.

“ఆఁ! అయినాయి” అన్నాడు.

‘అమ్మాయి ఫష్టున పాసయింది’ అన్నాడు నాన్న.

‘తెల్సింది. దానికేంటి తెలివిగలది’ అన్నాడు ముక్తసరిగా.

“ఇక చదివించాలని లేదు?” అన్నాడు.

ఆడపిల్లలకు ఇక చదువులు అనవసరం అన్నాడు.

ఒక క్షణం ఆగి ‘మరి పెళ్ళి చెద్దామా?’ అనడిగాడు నాన్న.

‘ఆఁ! అదే’ అని నసిగి “మనోడికి అనుకోకుండా సంబంధం ఖాయమయింది. అని అది చెప్పి పోదామనే వచ్చా” అన్నాడు.

‘ఏంటీ?’ అన్నాడు నాన్న కొయ్యబారిపోయి.

అదే ‘పెళ్ళి రా…’

‘ఎవరికి?’

‘మనోడికే ఇంకెవరికి?’

‘ఎవరితో?’

‘విజయనగరం సంబంధం…’

‘మరి దాన్నేం చేద్దాం?’ అన్నాడు నన్ను చూపి…

‘పెళ్ళి చేయమను, పది పరక తక్కువైతే ఇద్దాం అని చెప్పి రమ్మనదోయ్ నీ చెల్లి’  అన్నాడు.

‘బావా! అది చెప్పి రమ్మన్నప్పుడు నీకు ఏమి అనిపించలేదా?’ అన్నాడు నెమ్మదిగా.

‘అనిపించడానికి ఏముంది చెప్పు? ఏడు లక్షల కట్నం ఇచ్చి పట్నంలో ఉండేందుకు ఫ్లాట్ ఇస్తామన్నారు. కారు వస్తుందని తెల్సింది. దానికి ఇప్పుడు నేనే కనిపించడం లేదు? ముడ్డి మీద గుడ్డ నిలిచి చావడం లేదు? అన్నాడు తన ధోరణిలోనే.

‘బావా! పసిదాని మనస్సు విరవవద్దు. మళ్ళీ ఒకసారి ఆలోచించమని చెప్పు. వేరే వేరే విషయాలయితే నేనసలు పట్టించుకోను. చిన్నతనం నుంచీ వాళ్ళీద్దరిని భార్యాభర్తలుగానే పెంచాం. అలాంటి అభిప్రాయాన్ని మనంగా కల్గించాం. ఇవ్వాళ్ళ కట్నం చాలదని మనస్సు ఇచ్చి పుచ్చుకున్న వాళ్ళని అన్నాయం చేయడం బొత్తిగా ధర్మంకాదు. పిల్లను అన్నాయం చెయొద్దు. మనం బ్రతుకేది వాళ్ళ కోసం బాధ పెట్టడానికి గాదు అయినా ఒక మాట మీ వాడు ఎమన్నాడు?

“ఇక్కడికి వచ్చే ముందే అడిగాను – అదే ఈ గడపలో కొచ్చే ముందు. కనీసం ఆ భ్రష్టుడైనా ఏదైనా చెప్పుతాడేమోనని చూసాను. వాడు ఉఁ అంటే నీకు కూడా తెలీయకుండా నేనే తీసుకెళ్ళి నిశ్చింతగా ముడి వేయిద్దును. కాని వాడు వాడి అమ్మ చెప్పిందే గదా అన్నాడు. అంత గొప్ప అభిప్రాయం వాడు చెప్పాక ఏ రాయి అయితేం తల బాదుకోవడానికి అనిపించింది” అని… ఓ నిముషం ఆగి ‘ఇదిగో బాధపడకు పడ్డా ప్రయోజనం ఉండదు. నికృష్ట మనస్తత్వం గల వాళ్ళతో ఖర్మవశాత్తు జరగాల్సినది… జగలేదనుకో కాస్త మునుషులయిన వాళ్ళను చూడు. అది సుఖపడతది’ అన్నాడు కండువాతో కళ్ళు వత్తుకొంటు.

“అది కాదు అమ్మాయి మీ వాడే భర్త అనుకుంటుంది. మరొకణ్ణి ఉహల్లోకి కూడా రానివ్వదు. అంచేత అడుగుతున్నాను. అక్క కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతాను పదా” అన్నాడు నాన్న.

‘అప్ప కాళ్ళు పట్టకుంటే తప్పులేదు. ఓపిక ఉంటే నూరు సార్లు పట్టుకోవచ్చు. కానీ దాని కొడుకు కాళ్ళు పట్టుకోవుగా? వాడు వినేలా లేడు. అయినా నీ పిచ్చిగానీ ఎన్ని మాటలు రూపాయల ముందు నిలుస్తాయి?’ అని లేచి చక చకా వెళ్ళిపోయాడు.

ఇల్లంతా నిశబ్దం. శ్మశాన ప్రశాంతత. ఎవరికి వారే అన్నుపట్టినట్లుగా కులబడిపోయారు. కనీసం ఒకరినొకర ఓదార్చుకోలేదు. పట్టపగలు మసక బారిన స్థితి….

ఆ సాయంత్రం బావను ఓంటరిగా కలిసాను, చాలా ప్రయత్నం మీద.

‘నీతో పది నిముషాలు మాటాడాలి’ అడిగాను.

‘ఊఁ!’ అన్నాడు ఆగి.

‘నేను విన్నది నిజమేనా?’ అడాగను.

‘పెళ్ళి మాటేగా?’

‘ఆఁ!’

‘నిజమే’ అన్నాడు తలదించుకొని నేల గీతలు గీస్తూ….

‘నేనే భార్యనన్నావు, ఈ ఎండల్లో పెళ్ళాడుదామన్నావు. నేను లేందే వెలుగు లేదన్నావు?’ అన్నాను.

‘నేను అలా అన్నప్పుడు చదువుకోవాలన్నావుగదా’ అన్నాడు.

‘ఇదిగో మనం మానసికంగా బార్యాభర్తలమైనాము. లోకం కోసం చేసుకొనే పెళ్ళి తంతు మాత్రం ఆగింది. అంతా మరచి పోయినట్లున్నావు?’

‘ఇప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకోవాలా?’

‘నా పెళ్ళి కుదిరింది. కాకపోతే మామ కూతురువు గనుక చేతనయిన ఆర్థిక సహకారం నేను చెస్తాను. అలా అనుకున్నాను’  అన్నాడు పొడిపొడిగా.

నేను చూస్తూన్నాను. మాట పెగలడంలేదు ‘ఎవరి జాతకం వాళ్ళది మార్చలేం గదా అందుకేనేమో రెండు సార్లు నువ్వు చదువు పూర్తి అవాల అన్నది. మరి ఇప్పుడు నాకు వచ్చిన అదృష్టాన్ని చెడగొడతావా?’ అన్నాడు.

‘నాల్గు పైసలు ఎక్కువ దొరుకుతాయని చుట్టరికాన్ని ఉన్న అనుబంధాన్ని వదలుకుంటావా? రక్త సంబంధాన్ని, తన వాళ్ళు అన్నభావననూ, ఎప్పటి నుంచో పెనవేసుకున్న ఆత్మీయతలనూ’ అన్నాను.

ఏడుపు ఆగింది కాదు. కళ్ళలో నీరు ఆగడం లేదు . గిరుక్కున వెనక్కి తిరిగి చర చరా ఇంటికి వచ్చి మంచం పై పడిపోయాను. ఎప్పుడు మగతలోకి వెళ్ళానో మెళుకవ వచ్చేసరికి లైటు వెలుగుతుంది. లేచాను.

తలంతా నాదుగా ఉంది. ఆకలయింది. సుష్టుగా భోంచేసాను పెట్టుకొని.

అమ్మ నాన్న గమనించుతూనే ఉన్నారు.

‘నీకు బాధగాలేదటే?’ అంది, వస్తున్న ఏడుపును ఆపుకుంటూ…

‘ఉంది, ఉందమ్మా. ఉంటే ఏమి చేయను రోడ్డెక్కి ఏడవనా? డబ్బుకోసం అన్యాయం చేసాడు అని ఇల్లెక్కి అరవనా?’ అని అమ్మ దగ్గరికి వచ్చి “అమ్మా అమ్మమ్మ చనిపోయింది గుర్తుందా….’

‘పెద్దగా ఎడ్చావు గుండె పగిలేలా పొర్లి పొర్లి మరీ…. తిరిగి వచ్చిందా?’

‘ఈ ఏడ్పు మన శరీరపు మనస్సుల యొక్క బరువును కొంత దింపుతుంది. అంతే గానీ మరే ప్రయోజనము ఉండదు.’

“అమ్మా ఒక మాట. మన అనుకున్నవాడు దగ్గిరివాడు కావాలనుకున్నవాడు అకస్మాత్తుగా చచ్చాడనుకో… బాధ ఉంటుంది కానీ వాడు రాడే? రాడని తెల్సినాక అనవసరంగా కన్నీటిని వృదాచేయడం నాకిష్టం లేదు. అంతే” అన్నాను.

మా నాన్న నా మాటలు విన్నట్లుంది, కళ్ళు తుడుచుకుంటూ కనిపించాడు. ‘నాన్నా’ అంటూ దగ్గరికెళ్ళాను.

‘విజయా! నా కంట తడిని భరించలేడే మా నాన్న. నేను దగ్గరికి వెళ్ళగానే “అమ్మా” అంటూ నా భుజాన చేయివేసి “చిన్నదానివైన నువ్వు చెప్పిందే బాగా ఉందిరా అమ్మడు” అన్నాడు.

ఆ రాత్రి అందరు పెందళాడే పడుకున్నాం.

చాలా ప్రశాంతంగా ఉందా రాత్రి. పడుకోగానే మంచిగా నిద్రపట్టింది. అర్ధరాత్రి దాటక మెళుకువ వచ్చింది.

‘ఆ భ్రష్టడి పెళ్ళికంటే ముందు మన ఇంట్లో పెళ్ళి జరగాలి అంటున్నాడు నాన్న. మీ అక్కను మళ్ళీ ఒకసారి అడిగితే బాగేమో’ అంటంది అమ్మ.

‘ఇక ఎవరిని అడగను.’

“అట్లా అంటే ఎలా? పిల్లదాని మనసు అక్కడే ఉంది.”

‘ఎవరిని అడగక్కరలేదమ్మా’ అన్నాను నేను ఎదురుగా వెళ్ళి.

‘నీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటే’ అంది అమ్మ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here