అనుబంధ బంధాలు-26

0
8

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 26వ భాగం. [/box]

[dropcap]ఇ[/dropcap]ద్దరూ ‘చట్టా పట్టా’లెసుకొని దోవలోకొచ్చారు.

తెల్సిన వాళ్ళు ఎదురుపడగానే శ్రీనివాసు చేతి నుంచి తన చేయి లాక్కుంది విజయ.

‘ఏమయింది’ అన్నట్లు చూసాడు.

“నాకిలాంటివి ఇష్టం ఉండదు” అంది.

“మనం భార్యాభర్తలం. తప్పేముంది?”

“మనం మొగుడు పెళ్ళాలమయినంత మాత్రాన దోవన అలా చెయాలనేముంది? అయినా చేతిలో చేయి కలిపి బిగుసుకుంటూ నడవకపోతే మొగుడు పెళ్ళాలం కాదా? అలా ఎవ్వరు అనలేదు గదా! మాంసం చాలా మంది తింటారు. ఎముకల్ని మెళ్ళో వేసుకోరు” అంది నవ్వుతూ.

“చానా చెప్పావు చాలు” అంటుండగా సందులో గోలీలాడుతున్న పిల్లలు కనిపించారు. ఆగి అటు చూసి ‘అబ్బ, ఎంత దూరం గోలీని కొట్టాడు వెధవ’  అనుకున్నాడు.

విజయ అటు చూసింది. గోలీలాట కనిపించింది.

“మీరు ఈ ఆట బాగా ఆడతారా?” అడిగింది.

“బాగా ఏమిటి? గెలుపు ఎప్పుడూ నాదే! గోలీలన్నీ నాకే వస్తుండేవి. అదో సరదా ఆ రోజులే వేరు! ఇప్పుడు ఆడదామనమనా ఆడలేం!”

“గోలీకాయ ఖరీదెంత ఉంటుంది?”

“లోగా పైసాకొకటి ఇచ్చేవారు. ఇప్పుడు నాలుగు పైసలకొకటి అయింది.”

“అమ్మో చాలా పెరిగింది.”

“దీన్ని పెరగడం అనరు. ‘Inflation ద్రవ్యోల్బణం’ అంటారు. రూపాయి విలువ తరగడం మరో విధంగా చెప్పాలంటే మన ఆర్ధిక స్థితులు దివాళాతీయడం.”

వినే ఆసక్తి లేకపోయినా నడుస్తూనే తల ఊపింది. పూజరయ్య వెనక నుంచి వచ్చి కలిసాడు.

విజయను చూసి “ఎప్పుడొచ్చావమ్మా?” అనడిగాడు ఆగి. శ్రీనివాసు చూసాడు పూజరయ్యను. ప్రశాంతత మూర్తీభవించిన యోగిపుంగవునిలా అనిపించాడు. ఎంత అదృష్టం కావాలి ఇలా ఉండాలంటే? అనిపించింది. వెంటనే నమస్కరించాడు.

“ఓఁ ఇద్దరూ కలిసే వచ్చారన్నమాట” అని, “బాబూ బావున్నావా? మా విజయను చూసి ఇక్కడ ఆడపిల్లలు ‘ఇలా ఉండాలి’ అని సరిచేసుకుంటారు. మంచికీ, సంస్కారానికీ వాళ్ళ ఇల్లు ఆదర్శం. మంచి దంపతులకు కల్గిన ఆణిముత్యం మా విజయ. ఇది పొగడ్త కాదు. అలాంటి పిల్లను నీకు అప్పజెప్పాం. నీ పద్ధతిని బట్టి ఈ ముత్యం ప్రకాశిస్తుంది” అని “ఎక్కడిదాకా?” అనడిగాడు.

“మామయ్యగారింటికి” అంది.

“పదండి నేనూ అటే రావాలి గదా!” అని నడక ప్రారంభించాడు.

“విజయా! నువ్వు ఇక్కడే ఉంటే రాత్రి బడి గుడిలో నడుపుతామనుకున్నాను. నీ పెళ్ళి కుదరడంతో ఆ ఆశ పోయింది. నేను గుడి కట్టేసే సరికే నిద్రవేళ్ళ అవుతుంది గదా. ఆ తరువాత కూడా కొందరుంటున్నారు. కానీ ఆ మగతలో వారికి న్యాయం జరగడం లేదు. నాకేమో వాళ్ళు వెళ్ళిపోయాక ఇక ఇంటికి దాక ఏం పోతాంలే అనిపించి గుడి చప్టా మీదనే పడుకోవలనిపిస్తున్నది” అని నవ్వాడు.

“ఇక ఇటుగా వెళ్దాం. అదిగో అదే మామయ్యగారిల్లు” అంది విజయ. మనసారా దీవించి ముందుకెళ్ళాడు  పూజరయ్య.

దీక్షితులు గారింటికి నడచే సరికి అక్కడ జాలయ్య ఉన్నాడు. ఏదో చెపుతుంటే మామయ్య వింటున్నాడు.

“ఇదిగో! ఆ అనంతరాములు లేడూ వాడు వాడికి అసలు స్వతంత్య్రం మంటే ఏమిటో ఇప్పటికి తెలీదు. ఎప్పుడొచ్చిందో అంత కన్నా తెలీదు. అది వచ్చిన రోజులలో షావుకారు చిల్లర కొట్లో పొట్లాలు కడుతుండేవాడు, వాడి బ్రతుకు ఎలా తెల్లారుతుందో?” అనే ఆలోచన తప్ప అట్టాటి వానికీ స్వతంత్య్రసమర యోధుల పించను వస్తున్నది అంటున్నాడు.”

“నిన్ననే వచ్చావట ఇక్కడకు రావడానికి ఇప్పుడు తెమిలిందటే” అంది శాంతమ్మ వస్తూ.

“అది కాదత్తయ్యా” అంటుండగా జాలయ్య ‘బావున్నావా? ఇతనేగదూ నీ భర్త. మంచి మనసున్న వాళ్ళను భగవంతుడు చల్లగా చూస్తాడమ్మా’ అని “ఇక వెళ్ళొస్తా దీక్షితులు బాబూ మనసాగక ‘సొద’ చెప్పుకున్నాను. ఇలాగే అన్ని విభాగాలలోనూ అవినీతి వెళ్ళునిండుతున్నయి.  వీటికి తోడు పైరవీకారులు” అంటూ వెళ్ళిపోయాడు ఆవేదనగా.

విజయ దగ్గరికికొచ్చి శ్రీనివాసును కూర్చోమని….. “గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు వస్తున్నాయని బాధపడడం లాంటిదిది. ఈ అన్యాయ వర్తనం మన జీవితాలలో భాగంగా అయినయి. ఈ రాజకీయాలోళ్ళ బానిస వ్యవస్థలో పుట్టినా విముక్తి కోసం పోరాడిన మనుషుల మేమూ నిజాయితీయే ఊపిరి ఇప్పటి వారికే వ్యవహారం గిట్టదు. ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉంటుంది. మానసికంగా వాళ్ళు వృద్ధులు కారు. చూస్తున్న స్థితిని చూసి భరించలేక ఎంతగాన ఏడుస్తున్నారు. వారు కాదనుకొని పారద్రోలిన తెల్లవారికంటే ఈ కుళ్ళు కంపుకొడుతున్న మన సమాజాన్ని వారు భరించలేక పోతున్నారు. అందుకే…” అని ఆగి…. “విజయా నాన్నేడి? ఇంటి దగ్గరే ఉన్నాడా” అనడిగాడు.

తల ఊపింది విజయ. అప్పటి దాకా నిల్చునే ఉన్న శ్రీనివాసుతో “నువ్వు కూర్చో బాబూ, అదంటే ఇంటి పిల్ల” అన్నాడు.

“నేను వేరు కాదు లెండి” అంటూ కూర్చున్నాడు శ్రీనివాసు.

“శాంతా! దాన్ని ఎదురుగా పెట్టుకొని నిల్చుంటావేం? కొద్దిగా కాఫీ అయినా ఇవ్వు” అన్నాడు దీక్షితులు.

“విజయ రా, వాళ్ళుంటారులే” అని వెంట పెట్టుకొని లోనకి నడచింది.

కుశల ప్రశ్నలు వేశాడు దీక్షితులు శ్రీనివాసును. ఆ తరువాత “ఎన్ని రోజులుంటున్నారు?” అడిగాడు.

“రేపు వెళ్తున్నాను” అన్నాడు.

“పనులున్నాయా?”

తల ఊపాడు.

“నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది?”

తల ఊపాడు, బాగానే ఉంది అన్నట్లు.

“బాబూ విజయ పసిది, తెలిసి తెలియని వయస్సు పైగా  కొత్త కొంచెం జాగ్రత్తగా చూసుకో” అన్నాడు.

దీక్షితులుగారి ఆత్మీయతకు చాలా సంతోషమనిపించింది శ్రీనివాసుకు.

“మంచిది” అన్నట్లు నవ్వాడు.

ఇంతలో ఎఱుకలసానిలోన కొచ్చి ‘అమ్మేది  దొర?’ అంది దీక్షితుల్ని .

“ఉంది కానీ రేపు రారాదు” అన్నాడు.

శ్రీనివాసుని పారజూసి “దశరథం బాబాయ్య అల్లుడా?” అనడిగింది.

అవునన్నట్లు తల ఊపాడు.

“అచ్చు మీ పిల్లడున్నట్లే ఉన్నాడు దొర కాకపోతే ఛాయ తరుగు” అంది.

“బుఱ్ఱీ” అన్నాడు కోపంగా దీక్షితులు.

“ఓరి నామతి మండా చిన్నయ్యను గుర్తుచేసినానెందుకు” అనుకొని దొరా! పోయినోడు తిరిగిరాడు. రాలేడు రాడని తెలిసినా పోయినంక దిగులవుతది. కానీ ఏం జేస్తం. నన్నుకన్నదీ పోయింది. దాన్ని కన్నదీ పోయింది. అది మరపు కొస్తుండగానే కట్టుకున్నోడ్ని కాలం దీసుకుపోయింది. అయినా రాయిలాగ బతుకుతనే ఉన్నా అని దొరా ఎవరి టైం మెప్పుడో తెల్సిచావదు” వస్తా అంటూ గడపదాటింది.

దీక్షితులు మనసంతా గందరగోళమైపోయింది. పిల్లాడి మీదకి ధ్యాస మళ్ళి గుండె నిండా బాధ నిండింది.

“నా వయసున్న బాబూన్నాడా?” మీకు అడిగాడు శ్రీనివాసు.

కళ్ళు తుడుచుకుని “ఉండేవాడు, పోయాడు” అన్నాడు.

“సారీ” అన్నాడు.

“ఛీ. నీదేముంది” అంటుండగా కాఫీ వచ్చింది.

బయటకొచ్చిన శాంతమ్మ ఇదర్ని చూసి “ఏమయిందీ?” అని గాబరాబడింది.

“ఏం లేదు” అన్నాడు శ్రీనివాసు.

“ఆఁ! అంటే ఏం లేదు” అన్నాడు దీక్షితులు కూడా.

“బావని ఎవరైనా గుర్తుచేసారా?” అడిగింది విజయ.

“ఏం లేదులే” అన్నాడు.

“బుఱ్ఱి వచ్చి వెళ్ళిందన్నమాట” అనుకుంది.

***

శ్రీనివాసు ప్రొద్దుటే వెళ్ళిపోయాడు, నాల్గురోజులుండి వస్తానన్న విజయను వదిలి.

“నేను రానా రాగలవా” అడిగాడు వెళ్ళేప్పుడు.

“మీ ఇష్టం” అంది.

బయలుదేరి వెళ్తున్న శ్రీనివాసును కనిపించేంత వరకు చూస్తూనే ఉంది. ఆ తరువాత వెనక్కి తిరిగింది.

సరిగ్గా వెనక సీతమ్మ ఉంది. సిగ్గనిపించింది విజయకు.

తను చూస్తున్న తీరు ‘అమ్మ’ గమనించి “ఏం పనులున్నాయట పరుగెడుతున్నాడు?” అడిగింది.

తెలీదన్నట్లుగా చూసింది.

“అసలేదైన చేద్దామనే ఆలోచన ఉద్దేశం ఉందా?”

“అదీ తెలియదు”

“నీతో ఏమి అనలేదా?”

“ఊహు…”

“కనీసం ఉద్యోగ ప్రయత్నంలోనైనా ఉన్నాడా?”

“అమ్మానాకు పెళ్ళి చేసే ముందు వీటిని గురించి మీరు ఆలోచించే ఉండాలి. అంటే నా కంటే మీకే ఎక్కువగా తెలియాలి. నాకు కొత్త, వెళ్ళి వారం రోజులు కాలేదు. నాకు అతగాడ్ని అర్థం చేసుకొనే అవకాశమే పూర్తిగా దొరకలేదు. అసలు బెరుకుదనమే ఇంకా వదలలేదు. కాకపోతే పెళ్ళితంతు ముగిసింది గనుక శారీరకంగా ఒకటయ్యాం. నేనుగా ఇంత వరకు ఆ ఇంటి సంగతి ఆలోచించలేదు.”

“ఇంట్లోని వ్యక్తులు మాత్రం పరిచయస్తులుగా మారారు. పరిచయము మనిషిని అర్థం చేసుకునేందుకు ఉపకరించే మాట నిజమే గానీ నాకున్న వ్యవధి తక్కువ అర్ధంగానిది చెప్పడం కుదరదు. సుఖంలో కనిపించే మనిషికీ, కష్టంలో కనిపించే మనిషికీ తేడా ఉంటుంది. ఆవేశంలో మరో రకంగా, దయగా ఉన్నపుడు సరేసరి ఇలా ఎన్ని రూపాలో ఇప్పటి వరకు మా సంబంధం ఒకర్నొకరం గౌరవంగా సాదరంగా చూసుకుంటూ ఉండే వరకు మాత్రమే నడుస్తుంది.”

“విజయా ఉపన్యాసంలా ఏమిటిది? నీ బ్రతుకు పూల బాట కావాల అనే కదా నా తాపత్రయం అందుకేనే అడిగేదీ.”

“అదీ నిజమేనమ్మా, కాదనను. ఆ ఇంట్లో ఉన్న సభ్యులం నల్గురం. నేను మీ అల్లుడూ, మామగారు, వంటలక్క. ఇంత వరకు వారంతా నాతో బాగా ఉంటున్నారు. నా సుఖం కోసమే వారు తాపత్రయ పడుతున్నట్లుగా అనిపించింది. ఇక పోతే నేను ఆ ఇంటి కోడలిని. అక్కడ ఉన్న వంట మనిషికి అత్తగారి హోదా ఉంది. కానీ దాన్ని ఆవిడ ఒకలపోయడం లేదు. పైగా నన్ను బాగా ప్రేమించే మనిషిగా అనిపిస్తుంది. కొత్త వారికి మాత్రం అదోరకంగా అనిపిస్తది. అసలావిడ ఎలా ఉన్నా పెద్ద సమస్య కాదనుకో” అని కొద్దిసేపాగి “అమ్మా మామగారు వ్యవసాయం చేయరు, చూడరు. ఇంట్లో ఉండరు. ఆయన తంతు కుటుంబానికి బొత్తిగా పనికి రాదు. కాగా ఖర్చులు అనేకం వచ్చి పడుతుంటాయి. ఆయనకంటూ ప్రత్యేకంగా ఆదాయం లేదు. దీనితో తినాల్సిందే. ఇక నా భర్త చదవరి తెలివి ఉంది. కానీ పొలం పని చూడడు. దాన్ని నామోషిగా భావించుతాడు. ఎంత పండుతుందో ఎంత ఇంటికి వస్తుందో కూడా తెలిదీ. దున్నపోతు ఈనిందంటే గాట కట్టెయమనే బాపతు. వ్యవసాయాన్ని గురించి అరక్షణం ఆలోచించడు. కానీ వృత్తిగా ఈ అబ్బాకొడుకులది వ్యవసాయమే. మనిషీ మంచివాడే కావచ్చు. కానీ క్రీయాశీలత లేదు. వ్యాపార వ్యవహారాలు తెలీదు. అంచేత నా వైపే ద్యాసతో ఉంటాడు. ఏ పని లేనప్పుడు చేసేదేముంది. ఉన్న పని ముందేసుకుని కూర్చోక తప్పదు గదా.”

“అలా అంటావేంటి?” అంది.

“అమ్మా ఒక్క వాళ్ళనే అని ఏం లాభం? ఈ దేశంలో ఉన్న వ్యవసాయ కుటుంబాల పరిస్థితే అంత. చేసుకుందామంటే చాలని వ్యవసాయం కొందరిది. ఉన్నా చేయలేని వ్యవసాయం కొందరిది. ఇవేవి లేకున్నా రాజకీయాల పేరుతోనో, గుండాగిరి పేరుతోనో, పోరంబోకుగా ఉండే జనం కొంత. చేసేందుకు పని దొరకని స్థితి. దొరికినపుడు చేయని స్థితి. ఇలా అన్నీ కలసి త్రిశంకు స్వర్గంలో ఉన్నవి. వీళ్లకు పని లేకుండా ఏదో ఒకటి కావాలి. అందుకు లాటరీలు, సారా వ్యాపారాలు, గంజాయి అమ్మడాలు, స్మగ్లింగులు, మోసాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఉన్నయి గద. వీటిని ఆశ్రయించుకొని సుఖంగా ఉందామనే ప్రయత్నంలో పడతారు. పైగా ఈ పల్లీయలకు అక్కర లేని రాజకీయం లేదు. అక్కర లేని భేషజం లేదు.

ఏది ఉత్పాదకం కానిదో, ఏది నిరుపయోగమైనదో దాన్ని ఎన్నుకొని  దానెంట పరుగెత్తడమే ఇవ్వాళ్ళ వ్యవస్థలో ఉన్న విచిత్ర వ్యసనం. దీన్నే గ్రామ నాయకులు ప్రోత్సహించేది” అని లోనికెళ్ళి మంచం పై పడుకుంది.

‘అసమర్థుని జీవయాత్ర’ కనిపించింది బల్లపైన. అన్ని కాలాలకు పనికి వచ్చే విధంగా రచన చేయడం చాలా కష్టం. అలాంటిది ఏ కొద్ది మందో చేయగలరు అనుకుంది. తాను శ్రీనివాసు తోవ చివరి దాకా వెళ్ళడం అమ్మ గమనించడం గుర్తుకొచ్చింది.

‘… ఏమిటి ప్రేమ? ఎందుకంత ఇది? వారం దినాల క్రితం నిజంగా అతనేవరు? ముక్కు మొఖం తెలీని వాడు గదా! ఇంత తక్కువ కాలంలో ఈ మమకారాలనుభంధం ఏమిటి? శారీరక బంధమా? మూడు ముళ్ళు వేయబట్టా? ఇంకా కారణాలేమైనా ఉన్నాయా? మరి కని పెంచి సాకి సంబాళించిన తల్లిదండ్రులను అంత కాంక్షగా చూడలేని దశ ఈ మూడు ముళ్ళ తంతుతోనే ఎందుకు ఏర్పడుతుంది. ఇతనొక్కడే తనవాడా? తనని ఇంత చెసిన వారు ఆ అపేక్ష మన పైన  ఆత్మీయత ఉన్నవార్ని వదలి మరొకర్ని ప్రేమిచడం ధర్మం అవుతదా? అది ఇంత త్వరగా…

అసలీ సమాజపు పోకడ ఏమిటి? తమ సంతానం పై తమకు అనుభంధం సహజమే. అది అంత వరకే పరిమితమా?

తల్లిదండ్రులను చీత్కరించే సంతానము కనిపిస్తుంది సమాజంలో. తల్లిదండ్రులు కన్నవార్ని బాధించడం కనిపిస్తున్నది. వీరిలో ఈ అనుబంధాలు, ఆపేక్షలు ఏమవుతయి. వారు కన్నవారే పెంచిన వారే.  మమకారం చూపిన వారే గదా. అంతా చికాకుగా అనిపించింది. కానీ దీని పొర ఎక్కడో ఉంది, అర్థం కావడం లేదు!’ అనుకుంది. కళ్ళు మూసుకుంది ఆలోచిస్తూనే. నిద్రపట్టింది. అకస్మాత్తుగా మెళుకవ వచ్చింది. ప్రొద్దుకూకిందా తెల్లారుతుందా తెలియని దశలో లేచింది. ‘ముఖం కడుక్కొని వచ్చి భోం చేసి పడుకో’ అంది సీతమ్మ. ‘అంటే రాత్రయందన్న మాట’ అనుకొని మంచం నుంచి లేచింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here