అనుబంధ బంధాలు-30

0
6

[dropcap]’భూ[/dropcap]మి గుండ్రంగా ఉందట’ అనుకుంటూ నడచిండు. ‘ఈ దొర సందేదో అంటుంటడు. సమజ్ గాదు’  అనుకుంటూ ఇంటేపు పోయిండు.

దేవళం దాకా వెళ్ళాడు దీక్షితులు.

దేవుడున్నాడు. పూజరయ్యలేడు.

కంతలో నుంచి చూసి నమస్కరించి మెట్లు దిగాడు. క్రింద ఒక పంచాయితి నడుస్తుంది. ఆగాడు.

“రండి బాబయ్య” అంటూ పిలచారు వాళ్ళు.

‘విడదల కేసు.’

‘ఇవి ఇక్కడ మాములే’ అనుకుని “మీరు కానివ్వండి. వస్తాను” అంటూ చెఱువు వాయి వైపుగా నడచాడు.

కొంత దూరం నడచాక నల్గురయిదుగురు పాలేర్లు ఒక చోట కూర్చొని మాటాడుకొనడం కనిపించింది.

“నిరుడు ఎట్టాగూ జీతాలు పెంచలేదు. ఈయేడు మనం జీతాలు కుదరకుండా ఆగీతే గాని రైతులు తెమల్చరు. ఎవడికి వాడే కుదిరితే లోకువయిపోతాం” అంటున్నాడొకడు.

“కుదరక ఏం చేయను. వెయ్యి అప్పు ఇచ్చే దానికి వడ్డీ లేదు గదా. పాతిక బస్తాలు జీతం ఇస్తంటిరి. నెల కుంపలు తీసేస్తిరి. పొగాకుకు వేరే పైసలిస్తుంటిరి. చెప్పులు ఇస్తుంటిరి ఇంక ఏం అడగాలంటావు?”

“అట్లనవద్దు అందుకే మనం లోకువ అయినం, మనకటికి కావల్సినవన్నీ పెరిగనయి గనుక ఇంక రెండు బస్తాలు పెరగాలి. నిండా రూపాయి ‘సార’కే పెంచినారు. వెచ్చాలు పెరిగినయి. న్యాయంగా నాలుగు బస్తాలు అడిగిన తప్పు లేదు. కాని రెండే అడుగుతున్నాం.”

“ఇదిగో ఇయ్యేడు కౌళ్ళ కిచ్చినోళ్ళకే పూడ లేదు. మనకు అట్టాంటిదేం లేదు గదా ఆలోచించండి” అన్నాడొకడు.

“అందుకే మన ఉద్యమం లెక్క లేకుండా పోయింది. అసలు మన కష్టంతోనే గది ఇదంతా పండేది? అది ఆలోచించరేం?”

“ఇదిగో! ఎద్దులు నిత్యం దుంతన్నయి, అవేం అడగడం లేదు. అయినా వాటికి దాణా పెడతున్నడు. మేత కుడితి ఇస్తున్నడు. రోగాలు రొష్టులు వస్తే పిల్లల్లెక్క చూసుకుంటున్నడు. అట్టనే మననెందుకు చూడడు నోరున్నదని అడగడమెందుకు? అమ్మకి మన ఆకలిని గురించి చెప్పి నట్టుంటది మీ యిష్టం” అని లేచిండొకడు.

“మనం మాట్లాడేది అందరి తరుపున అందుకే మన డిమాండ్లను పెడదాం, ఆనక చూద్దాం ఎవడిలో మన వాడుండొద్దు.”

తల ఊపారి నల్గురూ..

ఇంతలో ఒకడు లేచి అన్నాడు “పెద్ద జీతం తీసుకుని రైతుపని ముంచేటోళ్లు ఉన్నారు. పాలు తాగే పొదుగుకోయడం అవుతదిగద, వాళ్ళని నిలదీసెట్టగ మనం ఉండాలి. రైతు చల్లంగ ఉంటేనే గదా మనం నునుంగ ఉండెడిది”

“ఆడే ‘బువ్వ’ అంటుంటే మనకేమిస్తడు? కొందరు నడి మధ్యన ఎగగొడతన్నరు, ఆళ్ళనేం చేద్దాం? ఇయ్యన్ని మాట్లాడాలి. రోజుకు ముప్పయి ఇచ్చి అరవై పని చేయించుకోవడం ఎంత తప్పు. ముప్పయి తీసుకొని పది పది పని చేయడం కూడా అంతే తప్పు గదా ఎమంటావు?”

“అది సరేననుకో.”

“అనుకొనడమేంది? అట్ట పకడ్బందీగ ఉంటేనే కుదురుతది. ఇగో ఈ అలాగా పనులు చేసెటోడ్ని చూసి మంచోళ్ళు ఆగమవుతున్నారు.”

తల అడ్డంగ ఉపాడు. “మరయితే బాగ ఆలోచన జేసి చెప్పు! అందరం వస్తం” అన్నాడు.

మెల్లగా లేచాడు.

ఎవరితోవన వాళ్ళు వెళ్ళారు.

చాలకపోతే అడగడంలో తప్పు కనిపించదు.

కానీ….

ఈ చాలకపోవడం? అనే దానికి ‘మితం’ ఎంత? దామాషా ఉండాల. ఇదే కొందరికి సరిపోతది. ఉన్న కొందరికి చాలదు. కొందరికి మిగులుతది.

ఇది వ్యక్తిగా అతను మోస్తున్న కుటుంబాన్ని బట్టి, వనరుని బట్టి, అలవాట్లను బట్టి, పొదపరితనాన్ని బట్టి ఉంటది. వాటికి తోడు అకాలంగా వచ్చే అక్కరలు.

చేసే పని మొఖం ఒక్కటే. ఇచ్చేది ఒక్కతే.

కాని అదే వ్యక్తుల జీవన స్థితి భిన్నంగా కనిపిస్తుంది.

వీటిని కూడా చూసి అవగాహనలకి తెచ్చుకొనే దక్షత రైతుకు రావాల. రైతు స్థితినీ ఇతను గమనించాల. అలాంటి సమస్య కల్గిన స్థితి కోసం చూడాల.

నిజానికి ఈ దేశానికి వెన్నముక అనుకుంటున్న రైతు నిత్యం ఎంతగా దోపిడికి గురి అవుతున్నాడో, క్షోభ చెందుతున్నారో ఉహకందదు. ఇతని వెన్నముకపై ‘నారి’ పుండును మొలిపించి తెంపుతూ సాగదీస్తున్నది ఈ వ్యవస్థ. వాస్తవాంగా గమనిస్తే రైతు పరిస్థితి ఇక్కడ అరణ్యరోదన లాంటిది.

ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు అనాథ సింబల్‌గా రైతును చూడచ్చు. ఇతగానికి వనరుంటే కూలి సమస్సే రాదు. తినేదే ఇంత పెట్టడం. కడుపుని చూసి ఆకలిని గుర్తించడం. ఇతనికి అలవాటు. ఇతనిది కటికి వృత్తి కాదు. వ్యవసాయం. ప్రొద్దు పొడుపుతో అందిరితో కలిసి అరుసుకునేవాడు. ఎక్కడో తప్ప దోపిడితనానికి అలవాటు పడ్డవాడు కాదు. శ్రమ జీవి. దొరతనాల వేరు.

‘దశరథం ఇంటికెళ్దాం’ అనుకుంటూ లేచాడు. చకచకా నడిచాడు. ఇంటి ముందుకొచ్చాడు. విజయ బయట నిల్చుని ఉంది. దశరథం వరండాలోని బల్లపై కూర్చుని ఉన్నాడు. సితమ్మలోన ఉన్నట్లుంది కనిపించలేదు.

“మామయ్యా” అంటూ వచ్చింది విజయ.

పరిశీలనగా చూసాడు విజయను.

ప్రశాంతంగా లేదు.

“అమ్మ ఉందా?” అడిగాడు.

“తల ఊపింది” ఉన్నదన్నట్లు.

“పిండి వంట లేమైనా చేస్తుందా ఏం?”

“కాఫీ కలుపమన్నాను బహుశా అదే పనిలో ఉందేమో.”

“అంతేనేమోలే” అని దశరథం వైపు చూసి “యోగనింద్రలో కానీ ఉన్నవా” అన్నడు నవ్వుతూ.

“అదేం లేదు” అని “నాన్నా” అంది.

దీక్షితుల్ని చూసి “ఉళ్ళోకి బయలు దేరి చాలా సేపయిందట” అన్నడు

తల ఊపాడు.

“పూజరయ్య ఉళ్ళో లేడన్నారు గదా?”

“లేడట.”

“మరి అక్కడేం పని?”

“ఉర్కే” అన్నాడు నవ్వి.

“కూర్చున్నావా?” అన్నాడు దశరథం.

“కాఫీ తెస్తాను” అంటూ విజయ లోనికెళ్ళింది.

సీతమ్మ తెస్తూ ఎదురు వచ్చింది.

“ఊళ్ళోనే ఉన్నావా?” అడిగింది దీక్షితుల్ని.

తల ఊపాడు నవ్వుతూ

“మనిషికి దినగండం. ఈ హంస ఎప్పుడు లేచిపోతుందోనని అర్థం గాక చస్తుంటాం. నా ప్రయాణం కూడా అలాంటిదేననా నీ అభిప్రాయం?” అడిగాడు దీక్షితులు.

“ఓర్నీ! ఇంకా వీధిలో విన్న వేదాంతసారం ఏదైనా చెప్పేస్తున్నావేమోననుకున్నాను. ఒక వేళ్ళ నువ్వు అది మొదలెడితే జీర్ణం అవక వాము పూసి ఉప్పు కలిపి ఎన్నిసార్లు నమలాల్నో…”

“అంటే నీ అభిప్రాయం కూడా…”

“నాల్గు రోజుల క్రితం పొలం వైపు వెళ్దామన్నావు గుర్తుందా.”

తల ఊపాడు.

“ఫర్వాలేదు గుర్తుంది, నాన్నా”

“వప్పుకున్నావు నువ్వు ఎంతకీ రాక నా ఇంటికి వస్తే ఊరెళ్ళావని చెప్పారు. ఏ ఊరు ఇంత అర్దాంతరంగా అని అడిగితే ‘అది చెప్పే అలవాటు కొత్తగా ఇవ్వాళ్ళ రమ్మంటే వస్తుందా అన్నయ్యా’. అంది నీ ఇల్లాలు. అది పోనియ్ నిన్న పంచాయితీకి నన్ను పొమ్మంటివి, నువ్వు వస్తానని రాకపొతవి. తీరా వాకబు చేస్తే ఎవరో అయ్యగారు వస్తారట, ఏర్పాట్లు భుజాన వేసుకున్నానంటివి. ఇదంతా ఎందుకు నువ్వు ఇక్కడ కని బయలు దేరి ఎటేళ్ళావు?” అడిగాడు.

“ఇక్కడికనే బయలు దేరానురా కానీ ఛ ఏ చట్రంలోను ఇమడలేక పోతున్నాను. ఎదుటి వానికి ఎంత గట్టిగా మాట ఇచ్చినా ఎదురుగా జరిగే సంఘటనలకు స్పందించడంతో ఈ చికాకు వస్తుంది. ఇది న్యాయంగా తప్పే అయినా కుదరడం లేదు. నా స్వభావం కఠినమైంది కాకపోవడాన. దెబ్బతగిలిన వాణ్ణి ముందర చూద్దాం అనుకుంటాను అంతే…”

ఇంతలో మోటరు సైకలు ఆగిన చప్పుడు వినిపించి ఇంటి ముందుకు చూసారు అంతా….

పోలీసు S.I కాళీప్రసాదు వాహనం దిగి లోనికి వస్తూ కనిపించాడు. అతని వెంట లాఠీతో బీటు కానిస్టేబులు ఉన్నాడు.

“దీక్షితులు గారున్నారా?” అడిగాడు.

“ఉన్నాను” అంటూ ఎదురుగా వచ్చాడు.

“విష్ణుమూర్చిని ఇందుగలడందు లేడని అంటారు కానీ, ఆయన్ని దొరికించుకోవడమే తేలికలా ఉంది. ఈ ఊర్ని ఇప్పటికి గంట నుంచి మూడు చుట్లు వేసాను. లీటరు పెట్రోలు కాలి ఉంటుంది” అన్నాడు నవ్వుతూ.

“ఊళ్ళోనే ఉన్నానండి” అన్నాడు దీక్షితులు.

“ఊళ్ళోనే ఉన్నావనడానికి లక్ష ఆధారాలున్నయి కాని దొరకదేం చేయను” అని, “చిన్న పని ఉండి వచ్చాను” అన్నాడు.

“రండి మాటాడుకుందాం.”

“ఫరవాలేదు. మొన్న పదిహేనవ తేదిన బంగారయ్య అనే సేటు ఇంట్లో దొంగతనం జరిగింది.”

“అసలు బంగారయ్య ఎవరు?”

“ఉల్లిపాలం షావుకారు. దాన్ని నాగులు అని స్టువర్టుపురం అతను చేసాడని అనుమానం. అతగాడు ప్రస్తుతం ఈ ఊళ్ళోనే ఉన్నడని మాకు సమాచారం ఉంది.”

“ఈ ఉళ్ళోనా?” అడిగాడు దీక్షితులు ఆశ్చర్యంగా.

“అసలు వాడు దొరికే సరికే వారం పట్టింది. నానా గడ్డి గరచి పట్టుకున్నాం. అయితే వాడు రాత్రి నంబర్ 2కని బయటికొచ్చి మాయమయ్యాడు. వాడు ఎదో ఒక్క తోవనే పరుగెత్తి ఉంటాడు. నేను మాత్రం పిచ్చికుక్కలాగా అన్ని తోవలెంట లగెత్తుతున్నాను. మోకాళ్ళలోని గుజంతా ఈ కొడుకు మూలంగా కరిగింది.”

“ఇక్కడంటే?”

“రెండు పేర్లున్నయి. రాత్రి గుడి వెనక నుంచి ఊళ్ళోకి రావడం ఇక్కడి వాళ్ళే చూసారు. ఇక్కడ మా దగ్గరున్న రెండు పేర్లతోను ఈ నాగులుకు పూర్వం సంబంధాలున్నాయి. నాగులే గుడి వెనక నుండి వచ్చాడని అనుకోగలిగారు.”

“వాడిని చూసిన వాడు మీ ఊరి వాడు అంచేత అని ఆగి….”

ఖాకీ వాళ్ళకు కోపం తెప్పించడం అంటే కల్లు తాగిన కోతికి తేలుకుట్టించడం అని తెల్సిన దీక్షితులు “ఆ పేర్లేమిట చెప్పండి కాయో పండో ఇక్కడే చెప్తా” అన్నాడు.

“హమ్మయ్యా అని నిట్టూర్చి నీకింకా ఏమైనా అనుమానాలున్నాయోమో?” అని నవ్వి రెండు పేర్లు చూపించాడు. “కొంగర సత్యం, ముద్దూరి అబ్బయ్య” అని ఉంది.

ఈ ఇద్దరూ చిన్న పాటి కాంట్రాక్టర్లు. అయితే ఒకరికొకరు ఎన్నడు పోటీపడరు. కల్సి పని చెయ్యరు. చానా ఎడంగా ఉంటూ ఎవరికి దొరికిన పనిని వారు చేసుకుంటూ పోతుంటారు. ఉళ్ళో వీరికి ఆయితే ఆస్తులు లెవ్వు. వ్యవసాయాలున్నా కొద్దివి. అయితే బయట టౌనులో కొనుక్కున్నారని వినికిడి. నిజానిజాలు తెలియవు.

“అయితే మీరు ఎక్కడుంటారు. అరగంటలో వస్తాను” అన్నాడు దీక్షితులు.

“మా కానిస్టేబుల్‌ని పంపమంటారా?” అడిగాడు.

“పిల్లిని చంకనెట్టుకుని పోయినట్టు ఈయనెందుకు గానీ మీరు ఉండేదెక్కడ చెప్పు?”

“ఇక్కడే ఉండనా” అన్నాడు S.I.

“వద్దు. పోలీసు పటేలు ఇంటి దగ్గర ఉండు. వస్తాను” బయలుదేరి వెడుతూ నాలుగు అడుగులేసి, ఆగి “ఒక వేళ అతడు ఉంటే మంది మార్బలము ఉందా?”  అనడిగాడు.

“దాన్ని గురించి ఆలోచించకు. మా చావు మేం చస్తాం” అన్నాడు.

“మంచిది” అని వెళ్ళిపోయాడు.

చెప్పా చెయ్యకుండా దీక్షితులు వెళ్ళడం చూసాక సీత అన్నమాట ఎంత చక్కగా సరిపోయిందో అర్దమయింది దశరధానికి.

ముగ్గురూ అలాగే చూస్తూండి పోయారు. యస్.ఐ మోటారు సైకిలు స్టార్టయింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here