అనుబంధ బంధాలు-36

0
9

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 36వ భాగం. [/box]

[dropcap]భో[/dropcap]జనాలయి ఆరుబయట కూర్చుంటుండగా దీక్షితులొచ్చాడు. వస్తునే ఇంటి ముందు ఆగి ఉన్న స్కూటరును చూసాడు. సంతోషమనిపించింది.

దశరథం దగ్గరిగా నడచి ‘చుట్టాలొచ్చినట్లుంద’ని అన్నాడు.

“ఆఁ! అదే! అల్లుడొచ్చాడు” అంది సీతమ్మ.

“ఎప్పుడు?”

“ఇందాక.”

“రాగానే నీ కోసం బయలుదేరాడు. నేనే ఆపాను. పది నిముషాలయిన ఇంటి పట్టున పట్టుమని ఉండే అలవాటు మా వాడికి లేదు అని, అంతకీ వెళ్ళాలంటే రాత్రికి వెళ్దువు కానీ అని…”

“కరెక్టుగా చెప్పావు. నేను ఊళ్ళనే లేను. మన నాగులు లేడు, వాడికి మధ్యన పెళ్ళి అయింది. పిల్లదాన్ని కాపురానికి పంపారు. వారం తిరగకుండానే ఆ పిల్ల పుట్టింటికి ఉడాయించి వచ్చింది. వీడేమో కాలుగాలిన పిల్లిలాగా దానింటికి తిరగడం ప్రారంభించాడు. బయట ఎంత సేపైనా బాగానే మాటాడుతుందా పిల్ల. కానీ మంచం దగ్గరకు రానీయడం లేదు. వాడికేమో ఆరాటం. అసలు సంగతెందో తెల్సుకొని వద్దామని వెళ్ళాను. ఆ పిల్ల వీనితో రానంటుంది. గట్టిగా అప్పగిస్తే ఏ నుయ్యో, గొయ్యో చూసుకునేలా ఉంది. కాపురం అంటే అంతలా భయపడుతూంది. ఈ వెధవ అంతలా భయపడేలా చేసాడు. అదే బెదురు గొడ్డో అర్దం కావడంలేదు. పిల్లదైతే నిండుగా ఉంది. కాపురానికి వచ్చే ఈడే.”

“అయితే ఏం జేసావు?”

“చేసేదేముంది. ఇష్టం లేని కూరలు తినిపించలేం మనం. ఇష్టం లేని కాపురాన్నేమి చేయించగలం. అందుకే విడుదల చేసి వచ్చాను. ఎవరెవరు ఏమేం ఇచ్చుకున్నారో వాటిని మార్పిడి చేసి పిల్ల దానికి వెయ్యి రూపాయాలు అదనంగా ఇప్పించి పుస్తె తీసుకొని వచ్చాం. చేసింది మంచి పనే అయినా…. జరిగింది మంచిది కాదేమె అనిపించింది. పంచభూతాల సాక్షిగా జరిపిన వివాహాన్ని రద్దు చేయడం బాగనిపించలేదు” అన్నాడు.

శ్రీనివాసు బయటకొస్తూ దీక్షితులుని చూసి నమస్కారం చెప్పాడు. పరామర్శల తరువాత వచ్చిన విషయం చెప్పాడు.

“అమ్మాయిని ఎప్పుడు తీసుకెళ్తున్నావు?” అడిగాడు సంతోషంగా

“మీరెప్పుడు పంపితే అప్పుడు” అన్నాడు నవ్వుతూ

“అదేంటయ్యా, అది నీ పెళ్ళాం మీ ఇష్టం” అన్నాడు లేస్తూ.

“ఎక్కడికిరా వచ్చినట్టే వచ్చి లేస్తావెందుకూ?” అన్నాడు దశరథం.

“ఊరు నుంచి ఇక్కడికే వచ్చాను. చికాకుగా ఉంది. తల స్నానం చేసి వస్తాను.”

“తలలో చికాకుంటే తలారా స్నానం చేస్తే పోతుందంట్రా” అన్నాడు నవ్వుతూ. వినిపించుకొనకుండానే నడిచాడు దీక్షితులు.

శ్రీనివాసు, దశరథం మిగిలారు. తల్లీ బిడ్డలు ఇంట్లో ఉన్నారు.

“వ్యవసాయాలు బాగా దెబ్బ తిన్నాయంటున్నారు, మీ దగ్గరెలా ఉన్నాయి?” అడిగాడు దశరధం.

“ఫరవాలేదు కాకపోతే పోయిన సాలంత దిగుపడి లేదు. మిరప తోటలు మాత్రం బాగా దెబ్బతిన్నయి. ఆమందం కందులు బాగున్నాయి. ధరలేమో సగం తగ్గినయి.”

“ఈ మధ్య మీ ఊళ్ళో ఒక పెస్టిసైడ్స్ డీలరును అరెస్టు చేసారన్నారు.”

“అదా అతను కల్తీ మందులు తెచ్చి మంచి కంపెనీ లేబుళ్ళు వేసి అమ్మాడు. మినరల్సు తెచ్చి కూడా అదే పని చేసాడు. అందుకే పోలీసులు పట్టుకుపోయారు. ఏది ఏమైనా ఈ పురుగు మందులు వాడకంలోను రసాయిన ఎఱువుల వాడకంలోను మన రైతులకు అంతగా అవగాహన లేదు. బావుందని ఒక్కడంటే దాని వెంట పడతారు. పురుగు చావకపోయినా దాన్నే నాల్గు సార్లు కొడతారు. వచ్చిన జబ్బేమిటో, మూలమేమిటో, దేనితో పోతుందో తెల్సుకోరు. రైతు సంఘాలని ప్రతి అడ్డమైన పార్టీ వాడు పెట్టాడు. ఓట్లు కోసం తమ తోకలుగా ఉంచుకునేందుకు తప్ప వ్యవసాయ పద్దతుల్ని చెప్పి చావరు. రైతు బాగుంటేనే గదా వ్యవస్థా బాగుండేది. రాజకీయం కూడా వ్యాపారంగానే తయారయింది. ఇంత ఖర్చు పట్టి గెలుస్తున్నాం, మనకేంటి ఈ వ్యాపార బంధం? వ్యక్తి స్వార్ధానికి తన ఉద్ధరణకు మాత్రమే పనికి వస్తుంది మిగిలిన సమాజాన్ని తన రూపాయి కోసం మోసగించడం ప్రారంభమవుతది. దాంతో ఎవడికుంటే వాడే తింటాడు అన్న భావన పెరుగుతుంది. అయితే ఉన్నవాళ్లు ఉన్న వాళ్ళను గౌరవించుకోవడం మొదలయి అది లేని వాణ్ణి న్యూనతపరచే ధోరణికి చేరుతుంది ఇలా అన్ని విభేధాలే. పైసలు ఒక్కటే ప్రధానం అందరికీ” అని క్షణం ఆగి దశరథాన్ని చూసి కొంచం సిగ్గు పడి తేరుకొని…

“విజయను తీసుకెళ్తాను. ఆ తరువాత వచ్చి మొత్తం కుటుంబాన్ని గురించి మాటాడుతాను. మీకూ విజయ కాక ఉన్నదెవరూ?” అన్నాడు.

మాటడలేదు దశరథం. చూస్తున్నాడు.

“విజయ బడి నడపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కారణం నాకు తెల్సు. గట్టిగా అడిగితే స్కూటరు ఇస్తారనే ఉద్దేశం తప్ప మీ ఇల్లు అమ్మి ఇవ్వల్సిన పనేంటి? మనం సీదాగా మాటాడుకోవచ్చుగదా? దాన్ని దీక్షితులుగారు ఇచ్చారు. నేను దీని పైకం ఆయనకు ఇవ్వగలను. అంత శక్తిహీనుణ్ణి కాదు. పంటలు చేతికి అందినయి. దాన్ని వదిలేయండి. నా విషయం మీతో ప్రస్తావించాలి.

ఆ అవసరం ఇప్పుడు వచ్చింది. మా నాన్న (అమ్మ లేదు గదా) వేరింటి కాపురం పెట్టమంటున్నాడు. మా అన్న నా చిన్నతనానే విడిపోయాడు. నన్ను విడగొట్టి ఆయన పద్ధతిలో ఆయన ఊరేగుదామని….

మా ఊళ్ళో సూర్యంగారని ఉన్నాడు. ఆయనకు ఆరుగురు మగ సంతానం. ఆయిదుగురు ఆడవాళ్ళు. ఆడపిల్లలందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసాడు. ఆరుగురు కొడకులకు మంచి కోడళ్ళు వచ్చారు. వారికి ఇరవై మంది దాకా సంతానం. ఎవరి సంసారాలు వారికున్నాయి. ఎవరి అదృష్టం ఏమిటో తెలీదు. అందుచేత మీరు ఉన్నదాన్ని పంచుకోండిరా అన్నాక కూడా… రెండు సంవత్సరాలు ఒకే కుటుంబంగా జీవించారు. కుటుంబ సభ్యులందరినీ ఎలా కలుపుకొని పొరపొచ్చాలు లేకుండా నెట్టుకొచ్చారో అర్థం గాదు. అట్లాంటిది మాయమై ఎవడికి వాడుగా ఉండే వ్యవస్థకు అందరం కలసి (సంసారాని కోసం) ఆహ్వనిస్తున్నాం అనిపిస్తుంది. ఉమ్మడి కుటుంబం అంటే కలసి బ్రతికేందుకు కావల్సిన సామాగ్రిని ప్రోగు చేసుకోవడం అది ఇప్పుడు దాదాపు కనిపించని స్థితి” అన్నాడు.

“అయితే నీ ఆలోచన ఏమిటి?” అడిగాడు దశరథం.

“మా నాన్న వేరుపడి ఉన్నదాన్ని పంచుకుంటే చాలే వ్యవసాయం కాదు. అంటే ఏదో ఒకటి చేయాలి.”

“అర్థమైంది, టైముంది గదా, ఆలోచిద్దాం. మన దీక్షితులు ఉన్నారు గదా. మనస్సులోది చెపితే మార్గం ఆలోచిస్తారు.”

“అవును.”

“అయితే నేను బయలుదేరి వెళతానేం” అన్నాడు.

“అమ్మాయిని తీసుకెళ్తానన్నావు గదా” అన్నాడు దశరథం.

“అలా అనే అనుకున్నాను కానీ మళ్ళీ వస్తాను” అని…. స్కూటరు స్టార్టు చేసాడు.

“భోంచేసి వెళ్దువు గాని” అన్నాడు.

స్కూటరు చప్పుడుకు సీతమ్మ బయటకొచ్చింది. ఆవిడ వెంట విజయ ఉంది. గేటు దాటాడు శ్రీనివాసు.

“ఏమిటండీ?” అంది సీతమ్మ అర్థం గాక భర్తవైపు చూస్తూ….

“ఏం లేదు, వెళ్ళాడు. పనులున్నాయి పని కాగానే వస్తాడట. వాళ్ళ తండ్రి వేరు పడమంటున్నాడట.”

సీతమ్మకు ఇదంతా ఏమిటో అర్ధం కాలేదు.

‘నేను గానీ తొందర పడలేదు గదా’ అనుకుంది విజయ.

***

“దశరథం” అంటూ దీక్షితులు వచ్చాడు.

సూర్యోదయమవుతోంది. నీరెండ అందంగా మిల మిల మెరుస్తోంది. వేప చెట్టు పైకి కోతుల మంద వచ్చినట్టుంది. బుడతడు అదిలిస్తున్నాడు. వాటిని చూసి బజారు కుక్క అరుస్తోంది. ఎలుక కోసం గుబుక్కున బయటకొచ్చిన పిల్లి, కుక్క తనను జూచే అరుస్తుందేమోనని బెదిరి లోనికెక్కడికో పారిపోయింది.

“ఇంత పెందళాడే ఊడిపడ్డావేంటి?” అన్నాడు నవ్వుతూ.

“అమ్మా విజయా మొదట రెండు కప్పుల కాఫీ పట్రా” అన్నాడు వంటింటి వైపు చూస్తూ.

“ఇక కూర్చుందామే” అని కూర్చుని “నువ్వు కాఫీ పట్రామ్మని చెప్పింది అమ్మడినే గద” అన్నాడు.

“ఆఁ కమ్మగా కాస్తుంది.”

“నువ్వు చెప్పావు గదా?”

లాల్చీ జేబులో నుంచి కాగితాలు బయటకు తీసి “ఇదిగో దీన్ని చదివేసెయ్యి” అన్నాడు దీక్షితులు.

సీతమ్మ కాఫీతో వచ్చి “మధ్యన ఎవ్వరు తగలలేదా, చివరకు మన పూజారయ్య కూడా” అని నవ్వింది.

“మీరు నా చెవులకు తాటాకులు కడతారని తెల్సు అయినా వస్తున్నానంటే… ఎందుకు? దాని కోసం” అని, అప్పుడే వస్తున్న విజయను చూపి –

“అదిగో” అని, “దశరథం కాగితాలు చదవమన్నానా? వాటిని కానియి ముందు” అన్నాడు.

“అవును చదువుతాను” అని దానిలో తల దూర్చాడు.

“దశరథా ఇది నేనుగా చెప్పింది గాదు. ఓ వాక్యం ఇంగ్లీషులో చదివాక ఇలా వ్రాయాలనిపించింది రాసాను. మన సంబంధాలు అనుబంధాలు అంతరిస్తున్నయి. ఒక్క డబ్బుకు తప్ప దేనికీ ప్రాధాన్యత లేకుండా పోతుంది. చివరకి మనిషి కూడా దాని ముందు వెధవవుతున్నాడు. ఏదో రకంగా డబ్బు చేతి కొచ్చాక అతను ఎలా మారుతాడో అతన్ని అదేం చేయిస్తుందో కూడ చదువు.”

“ఇది నాకు ఇష్టమైన విషయం తప్పక చదువుతాను. కానీ నీ పైగా చేతి రాతతో వ్రాసావు గదా! తొందరగా నడవదు” అన్నాడు నవ్వుతూ.

కొంత మేరకు చదివి ఆగి…

“నన్ను ఇలా హింసించకపోతే, మూలం నా మొఖాన వేయవచ్చుగదా. ఇందులో మధ్యమధ్యన నీ అభిప్రాయాలు ఇవి ఎవడికి కావాలి?” అన్నాడు.

“నీలాంటి వాళ్ళకు పనికి వస్తుందని సరళమైన తెలుగులోనే వ్రాసుకొస్తే, ఇంగ్లీషులోనే బాగా అర్థమవుతుందంటావా, అంటే నా వ్రాత బాగలేదనే గదా అర్థం?” అన్నాడు ఉక్రోషంగా చూస్తూ.

మౌనంగా ఉన్నాడు దశరథం అన్నాడేదో అని.

“అరేయ్ ఉలుకు పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా నువ్వు కూర్చుంటే అర్థం ఏమిటి? మౌనం అర్థం అంగీకారమనేగా? అంటే నా వెధవ వ్రాత అనే గదా నువ్వు నోరు విప్పకుండా చెప్పదలచుకున్నది?” అని లేచాడు కోపంగా.

“దీక్షితులూ నిన్ను నువ్వు అనవసరంగా కించపరుచుకని నన్ను ఊబిలోకి దింపకు. నీ వ్రాత అదే తర్జుమా బాగుండదన అనడానికి ఎవడికైనా ఎన్ని గుండెలుండాలి. అలా అంటే నువ్వు అసలు ఊర్కునే మనిషివేనా? ఇదంతా వదిలెయ్యి. నేను అనొచ్చేది అది కాదు. నీ శక్తి నాకు తెల్సు కాకపోతే నీ గొలుసు కట్టు వ్రాత నాకు అర్థమయి చావదు. పుస్తకం అది రామాయణం అయినా…. గుడ్డివాని చేతికిస్తే వచ్చే ప్రయజనం ఏమిటి? కళ్ళున్న అక్షరజ్ఞానం లేనివాని కిచ్చి సుఖం ఏమిటి? ఫలితం ఒక్కటే గదా.”

“నువు అనదల్చుకున్నదే ఇలా డొంకతిరుగుడుగా చెప్పడం..”

“ఎందుకురా నేనేది మాటాడినా వక్రంగానే తీసుకుంటావు? ఇక దాన్ని వదిలెయ్యి. నేను చచ్చినట్టుగా చదివి తీరతానని హామీ ఇస్తున్నాను గదా. మన మంత్రుల లాంటి హామీ కాదు నమ్ము” అన్నాడు.

“మంచిది నమ్మక చేసేదేముంది” అని సీతమ్మ వైపు తిరిగాడు.

అప్పటికి ఆవిడ లోనకెళ్ళింది. విజయ ఆసక్తిగా కూర్చుని చూస్తుంది ఇద్దరిని.

దశరథం ఒపికగా పైకే చదవసాగాడు మొదటి నుంచి…

“మనది వ్వవసాయపు దేశం.”

“కాని ఇది వ్యవసాపు యుగం కాదు…. వ్యాపార యుగం”

“అలా అని పూర్తిగా వ్యాపార యుగం కాదు.”

“కాకపోతే వ్యాపార బంధాలే మాములు బంధాలు అవుతున్న రోజులు.”

“మన దగ్గర అనాది నుంచి నెలకుని వస్తున్న సాంప్రదాయాలు, వ్యవహారికత, చుట్టరికాలు, ఆపేక్షలు ప్రేమలు…. డబ్బు పరిధిలో వెనక్కి వస్తున్న కాలం. దీని ఫలితాలను మనం సరిగ్గా బేరీజు వేసుకొనలేక, దానిలో ఇమడలేక దీన్ని పూర్తిగా వదులుకోనులేక వదిలి బ్రతకలేక సతమతమవుతున్న రోజులు. అందుకే మేథావులు, ఆర్ధిక శాస్త్రవేత్తలు, మన వాళ్ళు కూడా దీన్ని “బిజినస్ ఎరా” అన్నారు, అంటున్నారు.

అయితే ఈ వ్యాపార యుగానికి సంస్కృతి ఉంది.

“దీనినే వ్యాపార సంస్కృతి” అన్నారు కూడా.

ఈ జగత్తు మొత్తంలో…. మనిషి అన్నవాడు చేసే చేస్తున్న ప్రతి పనిలోను వేసే ప్రతి అడుగులోను కదిలే ప్రతి కదలికలను ఈ సంస్కృతి మనకు తెలీకపోయినా నిబడీకృతమై ఉంది అనేది నిర్వివాదాంశం.

ఇదే ఇప్పుడు మనను శాసిస్తుంది. లెఖ్ఖలు చెపుతుంది. వీటి ఆధారంతోనే మన అనుబంధాలు సాగుతున్నాయి.

చివరికి “యూనివర్సల్ లా” లాగా మారి కూర్చుంది.

అసలు వ్యాపారం అంటే ఏమిటి? ఈ సంస్కృతికి ఇది మొదటి ప్రశ్న.

వ్యాపారం అంటే పెట్టుబడి – శ్రమ – లాభం – అని అర్థం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here