అనుబంధ బంధాలు-7

0
7

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 7వ భాగం. [/box]

[dropcap]పొ[/dropcap]ద్దు పొడుపు ఇప్పుడే ప్రారంభమైంది.

తెల్లగా తెల్లారలేదు.

కావురు మబ్బులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి.

బుడతడు కంది పుల్లల పొరక పట్టుకొని, కసువు చిమ్మే ప్రయత్నంలో పడ్డాడు.

గేదె ముందు ‘మేత’ బొత్తిగా కనిపించలేదు.

‘రాత్రి ఇంటికి వెళ్ళేప్పుడు దీనికి గానీ మేత వేయడం మర్చిపోయానా?’ అనుమానం వచ్చి గాట్లోకి బాగా వంగి చూసాడు.

రొల్లు పుల్లలు కూడా కనిపంచలేదు.

పాపం అనుకొని పొరక అక్కడే వదిలేసి గడ్డి వామి దగ్గరకు వెళ్ళి వాటెడు గడ్డి తీసుకొచ్చి గేదె ముందు గాట్లో పడేసాడు.

ఆవురావు మంటూ ‘పంజల పంజల’ నమల సాగింది.

దాని వీపు పై చెయేసి నిమిరి తిరిగి పొరక పట్టుకున్నాడు. ‘ఆవుకు వేసానా?’ అన్న అనుమానం వచ్చింది. అటుగా నడిచాడు.

గాట్లో మిగిలిన మేత కనిపించింది.

పనిలో పడ్డాడు.

ఊడుస్తూనే ఇంకా తలుపులు తెరచుకోనక పోవడాన్ని గమనించాడు.

వాకిలి పారగొట్టిన తరువాత తలుపు దగ్గర నిలబడి ‘అమ్మా’ అని పిలిచాడు.

‘వచ్చావా’ అన్న సీతమ్మ మాట వినిపించింది.

పేడ కళ్ళు తీసేందుకు పశువుల కోష్టం వైపుగా నడచాడు.

తలుపులు తెరచుకున్నాయి. సీతమ్మ బయట కొచ్చింది, కసువు పూర్తి అవడం గమనించి, కళ్ళాపి చల్లేందుకు సిద్ధమైంది.

‘అమ్మా’ అంటూ విజయ గడపలోకి వచ్చింది.

“నేను కళ్ళాపి చల్లి, ముగ్గేసి వస్తానుగానీ నువ్వు వంటింటి పని చూడు” అంది.

“పాలు పితకాలి గదా” అంది విసుగ్గా.

“ఆకలిగా ఉందే, వెళ్ళి ఏదైనా చెయ్యి” అంది.

“సర్లే” అంది సీతమ్మ.

కళ్ళాపి చల్లేందుకు బయటకు వచ్చింది విజయ, చకచకా చల్లింది, ముగ్గేసింది.

“దూడని విడవనా” అడిగాడు బుడతడు.

‘ఇడువు’ అని పాల చెంబుతో బయటకొచ్చింది. అప్పుడే లేచాడు దశరథం. అటూ ఇటూ చూసాడు. విజయ వంటింట్లోకి నడుస్తూ కనిపించింది.

వెంటనే నడచి “అమ్మా ఇంకా చదవాలని ఉందా?” అనడిగాడు.

“B.Ed లో సీటు వస్తే చదువుతాను” అంది.

“పరీక్షలు బాగా వ్రాసావా తల్లీ!”

తల ఊపింది.

“‘పస్టుక్లాసు’ వస్తే ప్రయత్నించ వచ్చునట.”

“వస్తుంది” అంది దృఢముగా.

“ఫలితాలు ఎప్పుడొస్తాయి?”

“వారం పదిరోజులో రావచ్చు.”

“ఆ!” అని బయటకొచ్చి, “అరేయ్, ఒక మొఖం పుల్ల ఇరువు” అన్నాడు పెద్దగా.

“మీకు వేప కొమ్మ అందుతుంది గదా మధ్యన వాడెందుకు? వాడయితే చెట్టు ఎక్కాలి” అంటూ ఎదురయింది సీతమ్మ.

“మంచిది” అంటూ నడచాడు.

‘అయ్యా’ అన్న బుడతడి మాటలు వినిపించడంతో ఆగాడు. ‘మొఖం పుల్ల’ అని చేతికిచ్చాడు.

“మీ అమ్మగారి కంటే కాస్త నువ్వే నయంరా” అన్నాడు నవ్వుతూ.

“అదేం లేదయ్యా, ఇందాకనే విరిచాను మీకిద్దామని” అన్నాడు.

వాడి శ్రద్ధకు సంతోషమనిపించింది. కోష్టం వైపు చూసి “పని పూర్తయినట్లుంది గదా. నువ్వు మొఖం కడుగు” అన్నాడు. విజయ పాలు పితికి దూడని విప్పింది.

వాడి దగ్గరికి జరిగి “ఉప్మా చేసినట్లుంది. నువ్వూ ఇంత తిందువుగాని” అన్నాడు మెల్లగా.

హుషారుగా నీళ్ళగాబు వేపు నడచాడు బుడతడు.

***

పరీక్ష ఫలితాలు వచ్చినాయి. విజయ తను చెప్పినట్లుగా పస్టు క్లాసులో పాసయింది. కాలేజిలోనే ఫస్టుక్లాసులు ఎక్కువగా వచ్చినయి. విజయతో ఫైనల్ పరీక్ష వ్రాసిన విద్యార్దులు ఆ ఊళ్ళో ఇంకా ఇద్దరున్నారు. వారి నెంబర్లను విజయ ఎంతగా ఏ క్లాసులో వెతికిన కన్పించలేదు.

చివరకు ర్యాంకులు కూడా చూచింది, పొరపాటున బాగా చదివారేమోనని.

విజయ తండ్రికి విషయం చెప్పి B.Edకి అప్లికేషను పెడతాను అంది.

“నీయిష్టం” అన్నాడు దశరథం.

“నా ఇష్టం అని కాదు నాన్నగారూ! ఫస్టుక్లాసు వస్తే B.Ed చెద్దామనుకున్నాను. ఆ మాటే మీకు చెప్పాను గదా! అప్పుడేమో ‘సరే’ అని ఇప్పుడు నీ యిష్టం అంటున్నారు.”

“అంతే కదమ్మా, నీ ఇష్టం లేంది బలవంతముగా చదివించలేము గదా.”

“నా కిష్టమైనంత మాత్రానా మీ ఇష్టాఇష్టాలు కాదని చదువుతానా?”

“విజయా! ఏంటమ్మా ఇది. నీకు చదవాలని ఉంది చదువు అంతే.”

“అమ్మా వింటున్నావా?” అంది తల్లి దగ్గరకెళ్ళి.

“నీకు పెళ్ళిచేసేయ్యాలనే ఉద్దేశం ఉందేమోనే” అంది తల్లి.

“ఆ మాట చెప్పొచ్చుగదా! చదివింది చాలూ నీ చదువులు ఉద్యోగాలు చేయడానికా, ఊళ్ళేలడానికా? మొగడు అనే వాణ్ణి తెస్తున్నాను గనుక ఆపు అని.”

“విజయా నా దృష్టిలోకి ఓ సంబంధం వచ్చింది. మనం తూగగల్గేది కూడా. చదువు ఎప్పుడైనా చదువవచ్చు. కానీ మన పరిస్థితికి మనకు తగిన వరుడు అంత త్వరగా దొరకడం కష్టమమ్మా. పెళ్ళి అంటే నూరేండ్ల బ్రతుకు. పెండ్లి విషయం నీతో ఎప్పుడో ఒకప్పుడు చెప్పాల్సి వస్తుంది గదా. మనం ఉన్నది ముగ్గురం. మనలో మనకు దాపరికాలెందుకు. మనసులోని మాటలు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది?” అనగానే తండ్రి దగ్గరికి వెళ్ళి –

“నాన్నగారూ మీరు ఎప్పుడూ నా క్షేమాన్ని దృష్టిలోనే ఉంచుకుంటారని తెల్సు. అలాంటి మీరు ఇది ఫలానా అని చెప్పక మరో ఆలోచనకు అవకాశం ఏం ఉంటుంది?” అని ఓ క్షణం ఆగి “తల్లిదండ్రులు పిల్లల్ని కంటారు. బంగారంలా సాకి సంభాళిస్తారు. మంచి సంబంధాలు చూసే పెండ్లి చేస్తారు. మీ బాధ్యత ఎంత జాగ్రత్తగా నిర్వహించినా ఎవరి తలవ్రాత వాళ్ళదే గదా” అంది విజయ.

“విజయా నువ్వు పెద్దదానవయ్యావురా! చదువూ అబ్బింది” అని, “దీక్షితులు మామయ్యకు నీ రిజల్టు చెప్పి వచ్చావా?” అన్నాడు.

“ఇంకా లేదు” అంది.

“నీ మంచి కోసం పుట్టెడు కలలు కంటున్నవాడమ్మా మీ మామయ్య. ఈ మాట నువ్వుగా వెళ్ళి చెప్పితే వాడెంత సంతోషిస్తాడో.”

“నాకు తమ్ముడు లేని లోటు అతనితోనే తీరుతుందమ్మా” అని సీతమ్మ అంటుడగానే-

 దీక్షితులు హడావిడిగా లోనికొచ్చి “విజయా! మీ రిజిల్టు వచ్చిందట గదా! మన ఊరి నాయుడి గారబ్బాయి పరీక్ష పాసయ్యనని స్వీట్లు పంచుతున్నాడు. నువ్వు ఫస్టున పాసయ్యావా?” అన్నాడు.

ముగ్గురూ అక్కడే ఉండాన్ని ఆలస్యంగా గ్రహించి. “అయితే అంతా ఇక్కడే ఉన్నారన్న మాట!” అని విజయ దగ్గరకు చేరాడు.

“మీ విజయ గదా పాసయింది” అన్నది.

‘భగవంతుడా!’ అనుకొని “అమ్మా మా ఇంటికి వెళ్దాం రా” అన్నాడు చెయ్యి పట్టుకొని.

“అత్తయ్యకు కూడా చెప్పిరా!” అంది సీతమ్మ.

తల ఊపి దీక్షితులు వెంట నడిచింది విజయ.

గడప దాటుతూ తండ్రి వైపు చూసింది.

వెళ్ళిరా తల్లీ అన్నట్లు చూసాడు దశరథం. విజయ నా బిడ్డ అన్న గర్వం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది.

వీధిలోకొచ్చారు. నడుస్తున్నారు.

వెయ్యి ఓల్టుల బల్బులాగా వెలిగిపోతుంది దీక్షితులుగారి మొఖం.

ఆయననే గమనిస్తూ నడిచింది విజయ.

“నాయుడుగారబ్బాయి ఫస్టున పాసయ్యాడా?” అడిగాడు దీక్షితులు.

“నాకతని నెంబరు తెలీదు.”

“అవును ‘మగవెధవల’ నెంబర్లు నీకెందుకు తెలుస్తాయి?” అని, “నువ్వు ఫస్టున పాసయ్యావు చాలు” అన్నాడు ఆనందంగా.

“నేను మీ దగ్గరికే వద్దామనుకున్నాను. అనవసరంగా ఇంటికి రప్పించాను సారీ” అంది.

“పిచ్చిదానా ఇందులో సారీ ఎందుకు?” అని, “అయినా నువ్వు చెసిందే కరక్టు. కన్నవాళ్ళకు మొదట చెప్పావు. మా వాడే ఉంటే అప్పుడు పంచాయతికొద్దును ‘ఆడపిల్లకి మెట్టినిల్లే ముఖ్యం గదా!’ అని. వాణ్ణే భగవంతుడు తీసుకెళ్ళాడు!” అంటూ ఓ నిముషము నడిచాక “విజయా అసలు నువ్వు నా తలపులోకి వస్తే చాలు, ఆ వెంటనే వాడు నీకు సరిజోడిగా నా కళ్ళ ఎదుట కనిపిస్తాడు. అలాంటిది నువ్వు ఫస్టున పాసయ్యావన్న వార్త వినగానే వాణ్ణి మరచానమ్మా. నీ వెంట వాడుంటాడనుకున్న, ఉండడనిపించలేదు, నిజం” అంటుండగానే ఇల్లు వచ్చింది.

శాంతమ్మ బయటనే ఉంది. అరుగుకు పెచ్చికలు ఊడితే పెడతో మెగుతున్నది. దీక్షితులు, విజయ ఒకేసారి లోనికి రావడాన్ని గమనించి ఏ జరిగిందో అర్థంగాక కొంచెం కంగారుపడి- “ఏమయిందండీ?” అంది శాంతమ్మ.

ఇద్దరూ ఆగారు.

“ఇదిగో శాంతా అమ్మాయి ఫస్టున ప్యాసయిందే. నోరు తీపిచెయడం మన ఆనవాయితీ. ఏం తినిపిస్తావో ఏమో?” అని, “ఇదిగో నువ్వు మొదట ఆ పేడ చేతులు శుభ్రంగా కడుక్కొనిరా” అన్నాడు.

విషయం అర్థమయింది శాంతమ్మకు.

“మా తల్లి పాసవకపోతే ఎవరవుతారు?” అంటూ చేతులు కడుక్కొని మొదట ఇంత బెల్లం ముక్క పిల్లదాని నోట్లో వేసి తినిపించి –

“అమ్మా గోధుమ పిండి ఉంది, నిన్ననే పట్టించాను. ఇంత పంచదార వేసి అట్లు పొయ్యనా? లేదా పాలున్నాయి సేమ్యా కలిపి ఇవ్వనా?” అంది.

భుజాలు పట్టుకొని ఆత్మీయతగా కన్న బిడ్డను దగ్గరకు తీసుకన్నట్లుగా తీసుకుంటూ “అత్తయ్య నువ్విచ్చే ప్రేమ చాలు ఇంకా ఏమిస్తావు? అయినా నీ చేతి వంటకం ఇవాళ్ళ తినాలి” అంది.

“అయితే మీరు మాట్లాడుకుంటూ ఉండండీ” అని హడావుడిగా లోనికెళ్ళింది.

అయిదు నిముషాలు గడవక ముందే మొదట మంచి కాఫీ కలిపించింది. మాములుగా ఎక్కవగానే మాట్లాడే దీక్షితులు పిల్లది పాసయ్యిందన్న సంతోషం. పిల్లవాడు లేకుండా పోయాడే అనే బాధ కలమెలగి కొట్టుమిట్టాడుతున్నాడు. విజయ దీక్షుతుల్ని గమనించి నెమ్మదిగా వంటింట్లో దూరింది.

***

“అబ్బా పణ్ణ వివాహేసమం

ఓసో ఆఇ తదరుణోదయం

వదన్తే మహమహణీ

సంబన్దాణిహ్ణు విజ్ఞన్తి”

అని గాథాసప్తశతి శ్లోకం.

“దీని అర్దమేమిటంటే యశోద ముద్దుల గారాలపట్టి కృష్ణుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. వాణ్ణి ఎలాగయినా ఓ ఇంటి వాణ్ణిచేయాలి అనుకొని ఒక ముగ్ధ లాంటి గోపికను చూచి పిలచి తన మనసులోని మాటను చెప్పింది.

యశోదమ్మ నోటంట ఈ మాట వినగానే ఆ గోపిక స్వయంగా ఎదురొచ్చింది. “మా క్రిష్ణయ్య పెళ్ళి చేయాలనుకుంటే వేరుగా సంబంధాలు వెతుక్కొవడం ఎందుకు? నన్ను మొన్ననే ఒంటరిగా కనిపించినప్పుడు పట్టుకొని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. నా పైన ఎంత ఇష్టం ఉంటేనో గదా అలా చేసేది” అంది బోలేడు సిగ్గును ఓలకపోస్తూ. యశోదమ్మ బిత్తర పోయిందా పిల్ల చెప్పిన మాటలకు. అప్పటికి ఏం చెప్పాలో తోచక ‘చూద్దాంలే వెళ్ళిరా’ అంది. ఈ గోపిక కొంచెం ఎడంగా వెళ్ళగానే మరో గోపిక తన అందాలను నిర్భీతిగా చూపతూ యశోదమ్మ దాపునకు వచ్చి చెవి దగ్గర గుసగుసగా “యశోదమ్మా నేను మొన్ననే మన క్రిష్ణయ్యను ఎదురు పొదల మాటున కలుసుకొని, ఊసులాడుకున్నాము. నేనంటే క్రిష్ణయ్యకు అంతులేని యిష్టం. వేరు సంబంధాలు చూడటం మానుకొని నన్ను కోడలుగా చేసుకో” అంది.

దాంతో యశోదమ్మకు మతిపోయింది. సమాధానం చెప్పలేకపోయింది. ఈవిడ నుంచి తప్పుకునేందుకు గాను గుమ్మం ముందు నిలుచున్నదల్లా ఏదో పని ఉన్న దానిలా వెనుక గుమ్మం దగ్గరకు వెళ్ళిపోయింది. అయితే అక్కడో గోపిక – యశోదమ్మ కోసం ఎదురు చూస్తూ కనిపించింది. యశోదమ్మ రాగానే…. దాపుకు చేరి బోలెడు సిగ్గును అభినయించి వినయంగా నమస్కరించి “యశోదమ్మా నేను ఫలానా వారి అమ్మాయిని, నన్ను కోడలుగా చేసుకో. ఎందుచేత అలా అంటున్నానంటే మీ క్రిష్ణయ్య ఒంటరి…..” అని చెపుతూనే ఉంది. యశోదమ్మ ఈ గోపికల దాడికి ఖిన్నురాలై దిక్కుతోచక నిస్సహాయముగా నిలుచుండి పోయింది అని అర్థం” అంటూ శాంతమ్మ వైపు చూసాడు దీక్షితులు.

“అకారణంగా శ్రీకృష్ణలీలలు నాకు ఎందుకు వినిపించాలనుకుంటున్నారు?” అంది లేవబోతూ.

“ఇదా మిట్ట మధ్యాహ్నపు సమయం. మనము పడుచు వాళ్ళం కాదు. అలా కాదనుకుంటే కనీసం వివాహం కాని వారం కాదు. సంసార జీవితంలో తల మునకలు వేసి దానిపై విరక్తి భావం కలుగుతున్న వాళ్ళం. ఒకవేళ మనలాంటి వాళ్ళకు పొరబాటున అలాంటి కోరికల వలయం ఏర్పడ్డా, శరీరం అందుకు అనుకూలంగా సహకరించాలి గదా. ‘క్రిష్ణా రామా పాహిమాం’ అని జపం చేస్తూ కూర్చోవాల్సిన రోజులు…” అన్నాడు.

“మరి తెల్సి ప్రారంభించాల్సిన అవసరం ఎందుకు కల్గింది?” అని నిగ్గదీసింది.

“ఇది ఎందుకు గుర్తుకొచ్చిందో నువ్వే ఉహ చేసి చెప్పు” అన్నాడు దీక్షితులు.

ఆలవోకగా ఈ మాటలు విని కొంచెం కోపంగా దీక్షితుల వైపు చూసింది.

“రాను రాను మీకు సిగ్గు చితికిపోయి నోరు పెగులుతుంది. అంతుకు మినహా కారణం నాకు కనిపించడం లేదు” అని మాట మార్చి “ఇవ్వాళ పిల్లది ఇంకా రాలేదేం?” అంది లేస్తూ.

”కూర్చోవోయ్ లేద్దువు గానీ అయినా నాకు తెలీక అడుగుతానూ? వంట ఇంట్లో నీకు నాకంటే హితులున్నారా? నా మాట వినిపించినపుడల్లా అయ్యో పసిడి తాడు గట్టిన మగడు – ఇన్నేళ్ళ నుంచి సాకుతున్నాడు అన్న కనీస గౌరవభావమైన లేకుండా వంటింటిలోకి పారిపోవడం వుంది చూసావు? అది నిజంగా నన్ను అవమానించడం కాదంటావా?” అన్నాడు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ.

“అలానా అయితే ఎదురుగానే కూర్చుంటాను లెండి. వేళకు సాపాటు మాత్రం నను అడగవద్దు. మీ వాక్ ప్రతిభతో బిక్ష్యాలు ఉడికి శుభ్రగా ముందు కొచ్చేస్తాయిగ” అంది.

“మగడైన మగాడికి వెళ్ళకింత పెట్టలేని ఆడది ఆడదేనా? కలిప్రవేశం జరిగి చాలా కాలం పూర్తయినా ఇట్టాంటి విడ్డూరాలను వినాల్సివస్తుందని నేన తలచలేదు” అన్నాడు శాంతమ్మను ఇంకా ఉడికిస్తూ.

‘ఈయన కివ్వాళ్ళఏమయింది? ఎందుకిలా మాట్లాడుతున్నారు?? ఒకవేళ మనస్సులోని బాధను కప్పిపుచ్చుకోవడానికి ఇలా లేక మనస్సులోని మాటను చెప్పేందుకు తన ధోరణిలో ఇలా ప్రారంభిస్తూన్నాడా?’ అర్థం కాలేదు శాంతమ్మకు. అందుచేత దీక్షితులు వైపు చూస్తూ కూర్చుంది.

నాల్గయిదు నిముషాల నిశ్శబ్దం తరువాత-

“ఇదిగో మన విజయ ఫస్టన పాసయ్యందని చెప్పానా, ఇప్పుడే మో B.Ed లో సీటు దొరికించుకొని చదవాలంటున్నది” అన్నాడు.

“ఇంకా ఏం చదువులు? మంచి సంబంధం ఒకటి చూసి ముడవేయ్యక? ఆడపిల్ల అరిటాకుతో సమానంగదా?”

“కాలం ఎవ్వరి చేతిలోనూ ఆగదు. ఇప్పటికిది బాగానే ఉంది”

“మనం బాగా ఉండడమొక్కటే సరిపోదు. మన చుట్టూరా ఉన్న వాతావరణము బావుండాలిగదా? ఈ వయస్సు ఉంది చూసావు ఎప్పుడు ఎలా మార్పును ఆహ్వానిస్తుందో తెలీదు. ఇంతెందుకు మా శ్యామలమ్మ కొడుకు స్కూటరు వద్దురా అంటే వినక కొన్నాడు. ఇవ్వాళ్టికి వారం క్రితం వాడి సైడున వాడు జాగ్రత్తగా వస్తున్నా వెనుక నుంచి వచ్చన కారు తగిలిందట. దాన్ని తప్పుకోన బోతే ఎదుటివాడు డ్యాష్ కొట్టాడుట. క్రిందపడటం కాలు ఎముక విరగడం కొత్త స్కూటరుకు రెండు వెయ్యల రూపాయల వరకు రిపేరు రావడం క్షణాలపైన జరిగింది. ప్రస్తుతం వాడు ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. నలభైరోజులకు గానీ కట్టు ఊడదీయరట” అంది.

“మన వాడు ఉంటే అసలీ వ్యవహారం జోలే ఉండేది కాదు” అన్నాడు బాధగా.

“ఎప్పుడూ వాడ్నేందుకు గుర్తుచేసుకోవడం?”

“అసలు మరచిపోతే గదనే గుర్తుకు తెచ్చుకునేది” అన్నాడు.

ఇక లాభం లేదనుకొని లేచి లోనకు నడచింది శాంతమ్మ.

“నేను మాట్లాడనులే నువ్వు లోనికెందుకు వెళ్తావు?” అన్నాడు దీక్షితులు.

***

“విజయకు సంబంధం చూసినట్టున్నాడు” అన్నాడు దశరథం.

“మీకు చెప్పలేదా?” అంది సీతమ్మ.

“ఊ”

“పిల్లవాడెలా ఉన్నాడట? ఏం చదివాడు?”

“బావున్నాడట. అందరికీ నచ్చాడట.”

“అందరికీనా? అందిరికీ అంటే?”

“అదేనే, చూసిన వాళ్ళకు.”

“ఎవరెవరు చూసారట? మీరు చూసారా?”

తల అడ్డంగా ఊపి “ఇంకా వాడు నాతో అనలేదు అంటే వాడే ఎటూ తేల్చుకోన లేకుండా ఉన్నాడన్నమాట.”

“పెళ్ళి ఇది. ఎవరికి వారుగా అనుకుంటే సరిపోదు.”

“అంతేననుకో.”

“పిల్లకయినా చెప్పాడా?”

“ఊహు”

“పిల్లవాడ్ని విజయ చూడాల్సిన పనిలేదా?”

“ఎందుకు లేదూ?”

“అసలది పెళ్ళి చేసుకోవడానికి సుముఖంగా ఉందా? బి.యిడి చదవుతానంటున్నది.”

“ఆడపిల్ల పెళ్ళి ఈడుకు వచ్చాక చేసుకొనక ఏం చేస్తుంది?”

“చేసుకుంటుంది – కానీ – దాని యిష్టాన్ని గూడా గమనించండి. మనం ఇంత ఆరాటం పడేది అది సుఖంగా ఉండేలనే గదా. దాని యిష్టంతోనే అది సుఖాన్ని వెతుక్కుంటుంది. అమాయకురాలు కాదు. తెల్సిన పిల్ల” అంది.

లేస్తూ అవునన్నట్లు తలూపాడు దశరథం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here