అనుబంధ బంధాలు-9

0
9

[box type=’note’ fontsize=’16’] చావా శివకోటి గారు వ్రాసిన నవల ‘అనుబంధ బంధాలు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 9వ భాగం. [/box]

[dropcap]”తె[/dropcap]ల్సిన మేరకు చెప్తాను.”

“మనకు రత్నాలు ఉన్నాయి గదా!”

“అనాది నుంచి ఉంటూనే ఉన్నాయి”

“అవి తొమ్మిది రకాలంటారు. అంతేనా?”

తల ఊపాడు పూజారయ్య.

“ఆ రత్నాలు ఒక్కో గ్రహానికి సంకేతాలుగా ఉంటాయని విన్నాను.”

“చెప్పండి.”

“ఏ రత్నం ఏ గ్రహానికి సంకేతమో తెలుసుకోవాలని చాలా కాలంగా ఉందయ్యా” అన్నాడు.

“మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?” అన్నాడు నవ్వుతూ పూజారయ్య.

లేవనట్లు తల ఊపాడు జాలయ్య.

“కనీసం ధరించాలనే కోరికైనా ఉందా?”

“అదీ లేదు. తెలుసుకుందామనే ధ్యాస తప్ప” అన్నాడు.

“మంచిది… అలాగే చెప్తాను… మనకు ఉన్న నవరత్నాలలో మొదటిది ముత్యం. ఇది చంద్రుని తేజస్సు కలిగి ఉంటుంది. రెండవది పగడం. కుజుడున్నాడే ఆయన దీనికి అధిపతి. మూడవది పుష్యరాగం. జ్ఞానాధిపతియైన బృహస్పతి దీనికి యజమాని. నీలం నాల్గవది. శనిగ్రహం అధీనంలో ఉంటుంది. దీనికి అంతులేని ప్రాముఖ్యత ఉంది. దుష్టునికి దూరంగా ఉండమని సామెత ఉంది గదా” అని నవ్వి… ’ఇక పోతే అయిదవది వజ్రం, ఇది శుకృని ఆధీనంలో ఉంటుంది. ఇప్పటికి అయిదు చెప్పాను గదా?

ఆరవది వైఢూర్యం. చంద్ర, సూర్య గ్రహణ కారకులైన రాహుకేతువులలో రాహువు దీనికి అధిపతి. కేతువేమో గోమోధకం పైన ఉంటాడు. ఇక మకరం. ఇది బుద్ధుని అదీనంలో ఉంటుంది. చివరిది కెంపు, సూర్యనిదిది.

మనిషిన్నవాడు ఏయే గ్రహాల అనుకూలత కోసం సాధారణంగా వెంపర్లాడుతుంటాడో ఆయా రత్నాలను శరీరం పై ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. కొందరు కుహనా మేధావులు ఒక్క శనిని మన జోలికి రాకుండా చూసుకుంటే చాలు అనుకొని తెలివిగా నీలాన్ని ధరిస్తారు.

ఈ శాస్త్రం తెల్సిన పండితులు కూడా ఈ నీలాన్ని ధరించడం సర్వవిధ శుభదాయకం అని చెప్పగా నేను విన్నాను. ఇవి నాకు తెల్సిన వివరాలు. ఇంతకుమించి నేను లోతుకు వెళ్ళలేదు” అన్నాడు.

“ఇంత వరకూ బాగానే ఉంది గాని పూజరయ్యా, ఇంకో ప్రశ్న నా తలను చాలా కాలంగా తొలుస్తుంది. అడగమంటావా?” అన్నాడు జాలయ్య.

“నేను కాదన్నా ఊర్కోవు గదా! కానియ్యి” అన్నాడు నవ్వుతూ.

“మనకు ఎందరో ఋషులున్నారు. వారి ఇల్లాళ్ళు ఉన్నారు. వీరు ఆశ్రమాలలోనే నివశించేవారు. అయితే వీరు తపం చేసేటప్పుడు దాన్ని భగ్నం చేయడానికి దేవేంద్రుడు దేవ వేశ్యలను పంపడం, వారు తపంలో ఉన్న తాపసులను తపోనిష్ట నుంచి భగ్నం చేసేందుకు ఒంటి వంపుసొంపులను ప్రదర్శించడం. ఆ ప్రలోభానికి కొందరు లొంగడం, వారితో కలవడం లాంటివి జరిగినవి కదా! అందకు ముందే ధర్మపత్నులతో సంసార సుఖం అనుభవించిన ఆ తాపసులకు దేవ వేశ్యల పైన మోహం ఎందుకు? క్షణిక వ్యామోహమా? చాపల్యమా? శృంగారం పట్ల వారికుండే అనురక్తా? నువ్వుగా చెపితే వినాలని ఉందయ్యా” అని నవ్వి, “న్యాయానికి ఇది నేనుగా వెయ్యావలసిన ప్రశ్న కాదు… ఒక వేళ్ళ వేసినా మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నయితే బొత్తిగా కాదు. కానీ నాకు తెలుసుకోవాలనే కోరిక” అన్నాడు.

“ప్రశ్న ఏదైనా ఎవ్వరు వేసినా ప్రశ్న ప్రశ్నేకదా!

దాన్ని తెల్సిన వరకు విప్పే ప్రయత్నం చేస్తూ సమాధానం చెప్పడం ధర్మం అయితే…

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగల అర్హత నాకు ఉందా?… అని ఆలోచిస్తూన్నాను…” అని ఓ క్షణం ఆగి –

“మంచిది. తెల్సిన వరకు చెపుతాను.

ప్రణయం అన్నది ఒక్క శారీరకమైందే కాదు. శరీరము మనస్సు మమైకమైనపుడు మాత్రమే కలగాలి. సహజంగా మనకు శారీరక తృష్ణ చాలా అధికం. మనస్సుల స్పందనా – రోదనా – ఇక్కడ ఒకింత ఎక్కువ. కామం దానిలో ప్రధాన పాత్ర… ఇంతెందుకు?

ఒక చిన్న విషయం చెప్పతాను. స్త్రీని రంజింప చేసే ప్రక్రియలలో ఉపరతి ఒకటి. అందులో చేయవలసిన ఆచరించ వలసిన పద్దతులూ అనితర సాధ్యంగా చెప్పగలిగాడు. … ఏయే ప్రదేశాలలో ఎలా ఎలా తాకాలో వారి తాకిడికి స్త్రీ పురుషుల స్పందన ఎలా ఉంటుందో అనే దానిని గురించే ఎనిమిది పద్దతులు చెప్పాడు. స్త్రీని సంయోగానికి ఎలా ఆయత్తపరచాలో, ఎలాంటి స్థితికి చేరుకున్నాక సంగమిస్తే ఆనందపుటంచుల్ని చూడగలదో.. ఏ ఏ స్థితి గతులలో స్త్రీ పురుషునితో సంగమించడానికి సుమకత వ్యక్తం చేసి పాల్గొంటుందో క్షుణ్ణంగా హేతుబద్ధంగా వివరించగలగిగాడు. ఆ ఎనిమిది తరగతులను ఇలా చెప్పాడు – అర్ధచంద్రకము, ఛురితము, రేఖ, మండలకము, మయూరపారము, వ్యాఘ్రపారము, శశప్లుతకము, ఉత్పలపత్రకము. ఒక్క గోళ్ళతో అందుకు సంబందించిన అవయవాల పైన తాకితే పారవశ్యపు దశకు చేరుకుంటారన్నమాట. స్థూలంగా కామం అనేది దేశ, కాల, వాతావరణ శారీరక పరిస్థితులను బట్టి కొద్దిగా మార్పులు చెందినా ముఖ్యంగా శారీరక సంగమానికే ప్రాముఖ్యతనిస్తారు. అయితే ఇదే స్త్రీ వ్రాసి ఉంటే పురుషునెలా ఆయత్తపర్చాలో తెలిసేది.”

తలూపాడు జాలయ్య.

“మన దగ్గర స్త్రీలు మాత్రమే కుంకుమా కాటుక పెట్టుకుంటారు గదా! ఎందుకు?” అడిగాడు.

“ఇది మంచి ప్రశ్న. చెప్తాను. స్త్రీలు మనకన్నా శారీరకంగా సుకుమారులు. అదీగాక వారికి సహజంగా ఉన్న గుణాలలో అలంకరణ చేసుకోవడం ఒకటి. అయితే ఈ అలంకరణ ఎందుకు? అంటే సుకుమార్యానికి ఆకర్షణనూ, వన్నెను తెచ్చేందుకు. ఈ ఒక్కటే గాక శారీరకంగా ఆరోగ్యపరంగా కూడా. ఈ అలంకరణకు చాలా ప్రాధాన్యత ఉంది. మనవారు వెండి బంగారు పంతం పట్టి ఆభరణాలను ధరిస్తారు. అవి వారికి అందముగా నప్పుతాయని వారి సౌందర్యం ఈ నగలు ధరించడం వల్ల ఇనుమడిస్తుందనీను. బంగారం ధరించడం వలన మన శరీరంలోని ఎఱ్ఱకణాలు ఎక్కువగా ఉత్పత్తి అవడానికి దోహదమవుతుందని. మన శరీరంలో ఇనుము అనే ధాతువు ఉంది. అది ఈ వెండి బంగారు నగలు శరీరంపై ధరించడాన శుచిగా తయారవుతుంది. ఇక చెవులకు ముక్కులకూ కూడా ఆభరణాలు ధరించడం మనం చూస్తున్నాం. మొడలో, చేతులకు కూడా ఆయా అవయవాలకు ఆభరణాలు ధరించడం మూలాన ఉపయోగం ఉంది. చెవి కమ్మలున్నాయి. చెవికి సంభందించిన రుగ్మతలను అది నివారించేందుకు పనికి వస్తుంది. ముక్కుపోగులు శ్వాస కోశపు రుగ్మతలను నివారిస్తుంది. ఇక మనిషి కళ్ళు ఉన్నాయి. కళ్ళు అగ్నిగోళం లాంటివి. భగవంతుడు అందులో జలాశయాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అయితే దానికున్నటు వంటి నిరంతర శ్రమ వలన వేడెక్కుతుంటుంది. వేడెక్కినపుడు చల్లబరచాలి గదా, ఆ పని కాటుక భేషుగ్గా చేస్తుంది. ఇక కుంకుమ కనుబొమ్మల మధ్యనున్న నాడీ మండలాన్ని ఇది రక్షిస్తుంది. అంతేగాక ముఖానికి అందం. అలాగే పసుపు స్త్రీలు ముఖ్యంగా మొఖానికి కాళ్ళకు ఎక్కువగా వ్రాసుకుంటుంటారు. కానీ ఇది శరీరం మొత్తానికీ రాసుకోవడం వల్ల తల్లి చేయలేనంత మేలును చేస్తుంది. అన్ని రకాల చర్మ సంబంధమైన వ్యాధులను ఇది నివారిస్తుంది. క్రిమిపరమైన అనేక చీడ పీడలను ఇది దరికి చేరనీయదు” అని అన్నాడు.

“పూజరయ్యా తమరు ఎప్పుడూ రాముని సన్నిధిలోనే ఉంటారు గదా, ఈ విషయాలనూ….” అన్నాడు.

అందుకు పూజారయ్య నవ్వి జాలయ్య వైపు ఆనందంగా చూసి… “ఆయన దర్శనంలోనే అన్నీ తెలుస్తాయి అంటారు పెద్దలు” అన్నాడు.

“అర్థం కాలేదు.”

“ఇది అర్థం కావాలంటే మొదట రామా అంటే ఏమిటో మనం తెల్సుకోవాలి” అన్నాడు నవ్వుతూనే.

‘నాకు రామయ్య అంటే తెలీదనా?’ అనుకున్నాడు.

“ఆ రోజుల్లో గాంధీజీ మనం ఇలా నడవాలి పదండి అన్నాడు. అనడం ఆలస్యం జనం మొత్తం అనాలోచితంగా అయన మాటను ఆనతిగా నమ్మి నడిచారు. ఫలితం దక్కింది. స్వాతంత్య్రాన్ని ఈ కళ్ళతో చూస్తున్నాము.

ఆయన కంటే మనకు తెల్సేది ఎంత” అన్నాడు.

కదిలాడు జాలయ్య.

***

ప్రేమ ‘కావ్యం’ లాంటిదయితే, పెళ్ళి ‘జీవితం’ అని చదివి ఆగింది విజయ.

మళ్ళీ చదివింది. బాగా వ్రాసాడనిపించింది.

బ్రతుకు అనుభవం కొన్ని స్థిరమైన అభిప్రయాలను ఏర్పరిస్తే వాటి పరిశీలనానంతరం చెప్పే మాటలవి.

దాదాపు కొన్ని నిత్యసత్యాలుగా అనిపిస్తయి.

పొద్దు పొడిచింది. పొడవటమేమిటి? – బారెడెక్కింది. నీరెండ ముదిరింది.

“ఏమిటే స్నానం పూర్తి చేసి కూర్చోరాదు?” అంది సీతమ్మ ఇంట్లో నుంచి.

పలకలేదు విజయ.

“పుస్తకము ముందుటే చాలు పిల్లలకు వంటి పైన ధ్యాస కూడ పోతది” అనుకుంటూ విజయ దగ్గరకు వచ్చింది.

అయితే విజయ చదువుతూ లేదు. పుస్తకం మూసి ఆలోచనల్లో ఉంది.

ముచ్చటేసింది విజయ కూర్చున్న తీరు.

“లేస్తావా? స్నానానికి నీళ్ళు పెట్టి ఎన్ని సార్లు పిలవను?” అంది పెద్దగా.

ఉలిక్కి పడింది విజయ. “వస్తున్నానమ్మా” అంటూ లేచింది.

“ఏం పుస్తకమే? అంత ఆలోచనలో పడ్డావు?” అంది.

“చదువు. తెలుస్తుంది” అని విజయ అనగానే, మాట్లడకుండా వంటింటివైపుగా నడచింది సీతమ్మ.

ఉతికిన కండువా భుజాన వేసుకొని, స్నానాలు చేసే తడికలలోనికి వెళ్ళింది విజయ.

వీధిలో నుంచి దీక్షితులు, దశరథం వరండాలో కొచ్చారు. ఎదురు బొదురుగా చెరో కుర్చీలాక్కుని కూర్చున్నారు.

“కాఫీ కొంచెం త్రాగుదామంటావా?” అడిగాడు దశరథం.

“నీకు త్రాగాలనిపిస్తే చెప్పు” అన్నాడు దీక్షితులు.

ఈ తిరకాసంతా ఎందుకనుకొని “ఇదిగో ఎవరొచ్చారో చూడు” అన్నాడు.

“వస్తున్నా” అంటూ వరండాలోకి వచ్చి దీక్షితుల్ని చూచి…

“ఎటెటు తిరిగి వస్తున్నారేంటి?” అంది నవ్వుతూ.

“నాకు పెద్దగా తిరిగే అలవాటు లేదని నీకు తెల్సు గదా!” అన్నాడు దీక్షితులు.

“అంటే నేను తిరుగుబోతునా?” అన్నాడు దశరథం.

“ఎవరన్నారు?” అంది సీతమ్మ.

“నీకు వినపించలేదా?” అన్నాడు.

తల అడ్డంగా ఊపింది.

“నాకు వినిపించగా లేనిది, నీకెందుకు వినిపించదు. అవునులే కొన్ని వినిపించవు” అన్నాడు కోపంగా.

“అసలెవరన్నారు. అంతలా సాగదీసుకుంటున్నారు?” అంది.

“పైగా ఇదొకటి? ఏరా, నువ్వు అన్నమాటేదో ఈవిడగారి ఎదురునే గదా” అన్నాడు నిలదీస్తూ.

“ఏమన్నాను? ఏమన్నాను, అయినా నిన్ను తిరుగుబోతు అని నేను అన్నానా?”

“మరేమన్నావు?”

“మరేమంటే నీకేం? ఆ మాట అనలేదు గదా! దీనికింత…”

“రాజుగారి పెద్ద భార్య పతివ్రత అంటే ఏమిటి?”

“ఇది తెలిదనుకున్నావా? చెప్తాను… పెద్ద భార్య గుణవంతురాలు అని అంటే చిన్న భార్య గుడిసేటిదనే గదా!”

“ఎవరన్నారు?”

“….. ఇదిగో అనవసరంగా విపరీతార్థాలు తీసుకోనడం అంత మంచిది కాదు. రాజుకు చిన్న భార్య ఉన్నట్టూ, ఆవిడ ఫలానా అయినట్టూ నువ్వుగా ఊహించుకొని కంగారు పడటం నాకు బొత్తిగా నచ్చడంలేదు.”

“ఇన్‌ఫీరియారిటి కాంప్లెక్సు అని అంటారు దీన్ని” అంది సీతమ్మ నెమ్మదిగా.

“ఇలాంటి ఆలోచనలు వస్తుంటే పరీక్షించిన డాక్టరుగారు రోగికి ఇలా అని చెపుతుంటారు” అన్నాడు దీక్షితులు.

“ఆహా ఈ తెలివి ప్రదర్శించడం ప్రారంభించి ఎంత కాలమైందంట? ఇదిగో నీ యింటికి పిలవక పోయినా నేను వస్తున్నాననే గదరా నన్ను అనేస్తున్నావు? ఎంత ఇదయినా ఇంటికి వచ్చిన వాడు అతిథి.”

“ఇదిగో కాఫీ త్రాగవా?” అన్నాడు దీక్షితుల్నే చూస్తూ ధశరథం అసహనంగా.

నవ్వాడు దీక్షితులు…

“ఇంటికి స్నేహితుడొచ్చి కాఫీ కలపమంటే ఉలుకూ పలుకూండదు” అన్నాడు కొంచెం అసహనంగా.

“ఆ మాట సూటిగా చెప్పవచ్చుగదా” అంది సీతమ్మ లోనికెళ్తూ.

విజయ స్నానం ముగించి బయటకొచ్చేసరికి ఇద్దరూ కాఫీ సేవనం పూర్తి చేస్తున్నారు.

“ఇప్పుడేనా రావడం” అని అడిగింది విజయ.

తలుపాడు…

“పేపరు కోసం కరణం గారింటి కెళ్తుంటే మీ నాన్న కనిపించాడు. ఇద్దరం కలసి ఇలా వచ్చాం…”

“అయితే ఒక్క నిముషం” అని లోనికెళ్ళింది..

“కాఫీ బావుందిరా దశరథా. అసలందుకే వంక పెట్టి ఇక్కడి దాక రావడం” అని ఓ క్షణం ఆగి “దశరథా, పిల్లదాని B.Ed. సీటు సంగతెమైందో చెప్పు” అన్నాడు.

‘ఊసరవెల్లిలా మారిపోతున్నాడు వెధవ’ అనుకొని ‘ఊ’ అన్నాడు.

“అసలు ఇవ్వాళ పేపరు చూసాక మనసంతా ఎలాగో అయిదనుకో” అంటుండగా…

“అంటే రోజు నాకు పేపరు చూసే అలవాటు లేదు అని చెప్పడమా?”

‘వీణ్ణి భగవంతుడు కూడా రక్షించలేడు’ అనుకొని లేచాడు దీక్షితులు.

“నేనేమన్నాననీ?”

“ఇంకా ఏమనాలి?”

“సర్లేవోయ్. ఏదో మాట్లాడాలన్నావుగా, చెప్పరాదూ?” అన్నాడు దీక్షితుల్ని చూస్తూ…

***

ఇంకా పొద్దు పొడవలేదు…

చీకటి పొరలు వదలలేదు… అలాగే నిలచి ఉన్నాయి…

నక్షత్రాలు మాత్రం బాగానే మెరుస్తున్నాయి.

అయితే పొద్దు పొడిచే వేళ దాదాపు దగ్గర పడింది.

గుఱకొయ్యలు బాగా పైకి జరిగినయి.

అక్కడక్కడ జనావాసంలో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి.

కొడిపుంజు కూత ఒకటి అరకొరగా వినిపించింది…

వెలుగు – చీకటి

మంచి – చెడు.

వెలుగు లేని చీకటి

మంచి లేని చెడు

తమ అస్థిత్వాలను ప్రదర్శించుకోవాలంటే కుదరదు…

రెండూ ఉండాల్సిందే, అంచేత ఉంటాయి..

భిన్నదృవాలైనా విడివడవు – విడివడే ఉంటాయి.

ఒక దాని వెంట ఒకటి పరుగు పరుగున వస్తాయి.

పొద్దుగూకులూ తగువులాడుకుంటూ రాత్రి అవగానే పక్కలో హాయిగా తొంగునే అలుమగలలా…

ప్రొద్దు పొడవదు అనుకుంటే ఆగుతుందా?

చీకటి రాకుడదు అనుకున్నా అంతే

బుఱ్ఱ చెడటం తప్ప ఏమీ ఉండదు.

కాకపోతే

మన తర్కానికి ఆలంబన దొరికినట్టుగా కొంత తృప్తి. ఈ తృప్తిలో కలిగే ప్రయోజనం?

విజయకు బి.యిడిలో ఎక్కడా సీటు రాలేదు.

పెళ్ళిళ్ళ సీజను మాత్రం ఇంకా మిగిలింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here