గొప్ప ప్రయోగాత్మకమైన సినిమా ‘అనుగ్రహం’

1
7

[dropcap]‘అ[/dropcap]నుగ్రహం’ 1978లో వచ్చిన తెలుగు సినిమా. దీన్ని శ్యాం బెనెగల్ హిందీ, తెలుగు భాషలలో ఒకేసారి తీసారు. అందరు నటులు రెండు భాషలలో నటించినా, జమిందారు పాత్ర మాత్రం తెలుగులో రావు గోపాలరావు గారు చేస్తే హిందీలో సత్యదేవ్ దూబే గారు చేసారు. హిందీలో ఈ సినిమా పేరు ‘కొందురా’. ఇది చింతామణీ. టీ. ఖానోల్కర్ అనే మరాఠీ రచయిత రాసిన ‘కొందురా’ అనే నవల ఆధారంగా తీసిన సినిమా. దీనికి స్క్రీన్ ప్లే శ్యాం బెనెగల్, గిరీష్ కర్నాడ్ చేస్తే, మాటలు ఆరుద్ర గారు రాసారు. కే. వెంకట రామ రెడ్డి ఈ సినిమా నిర్మాత. దీనికి సినిమాటోగ్రఫీ చేసింది గోవింద్ నిహలాని. అనంత్ నాగ్, వాణిశ్రీ, స్మితా పాటిల్, అమ్రిష్ పురి, రావు గోపాలరావు ప్రధాన తారాగణం.

నమ్మకం, అన్నది మనిషి జీవితాన్ని శాసిస్తుంది. అది దైవం మీద కావచ్చు, మతం మీద కావచ్చు కాని ఒక నమ్మకానికి మనిషి లొంగిపోతే అది అతని జీవితాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటుంది. మనిషి ఆలోచన, ప్రవర్తన, జీవన పరిణామం ఈ నమ్మకం పైనే ఆధారపడతాయి. ప్రపంచంలో చాలా సంఘటనల వెనుక, మనిషి జీవితంలోని గెలుపు ఓటములు వెనుక అతని నమ్మకం పని చేస్తూ ఉంటుంది. అందుకే మనిషి నమ్మకాన్ని చూరగొన్న ఏ ఆదర్శమైనా అతన్ని ఒక ఆయుధంగా మార్చుకోగలదు. మనిషి పూర్తిగా లొంగిపోయేది ఈ నమ్మకానికే. ‘అనుగ్రహం’ కథ ద్వారా రచయిత చెప్పాలనుకున్నదీ ఇదే.

పరశురాం ఒక మధ్యతరగతి బ్రాహ్మణుడు. ఇతని భార్య అనుసూయ. పరశురాం ఆర్థికంగా అన్నగారిపై ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. తనకంటూ ఏ గౌరవం లేక కుటుంబంలో అవమానాలకు గురి అవుతూ ఉంటాడు. ఊరిలో కూడా అన్న నీడన బ్రతికే తమ్ముడిగా అందరూ అతన్ని చులకనగా చూస్తూ ఉంటాడు. కోపంతో జీవితాన్ని అంతం చేసుకుందామని ఒకసారి ఊరు వదిలి సముద్రం వైపుకు వెళతాడు పరశురాం. దారిలో కొందురా అనే స్వామి దర్శనం ఇతనికి కలుగుతుంది. ఒక ఎండిన మూలికను పరశురాంకి ఇచ్చి దాన్ని తిన్న స్త్రీ గర్భాన్ని పోగొట్టుకుంటుందని, అది శక్తివంతమైన మూలిక అని అది పరశురాం జీవితాన్ని మారుస్తుందని చెప్పి అతన్ని తిరిగి ఇంటికి వెళ్ళమని చెబుతాడు కొందురా. ఆ మూలిక సన్యాస ధర్మాన్ని ఆచరిస్తున్న వారికే పని చేస్తుందని అందువలన పరశురాం నిష్ఠగా సంసార సుఖానికి దూరంగా ఉంటూ దైవ ప్రార్థన చేయాలని చెప్పి మాయమవుతాడు కొందురా. ఇంటికి చేరిన పరశురాం తాను దైవాన్ని చూసానని తల్లికీ, భార్యకు చెబుతాడు. అతనితో అమ్మవారు భార్య రూపంలో వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. కొందురా అనుగ్రహం సంపాదించానని ప్రకటించి నిత్యం ద్యానంలో కూర్చునే పరశురాం, దైవాంశసంభూతుడిగా ఊరిలో గౌరవాన్ని సంపాదిస్తాడు. ఊరి వారికి సలహాలిస్తూ భక్తిలో మునిగితేలుతూ ఎందరో భక్తులను సంపాదించుకుంటాడు అతను.

ఒక సారి అనసూయ ద్వారా అమ్మవారు పరశురాంని ప్రజల పాపాల భారం నుంచి ఊరిని రక్షించమని చెప్పిస్తుంది. అమ్మవారి మాటను తన నమ్మకంతో విశ్లేషించుకునే పరశురాం, అమ్మ తనను ఊరి గుడి బాగు చేయమని అడుగుతుందని అర్థం చేసుకుని గుడి మరమ్మత్తు మొదలెడతాడు. దానికి ఆర్థిక సహయం కోసం ఊరి జమిందారు భైరవమూర్తిని సంప్రదిస్తాడు. భైరవమూర్తి స్త్రీ లోలుడు. తనకు నచ్చిన ప్రతి స్త్రీని లొంగదీసుకుంటాడు. అతని కామానికి అతని తమ్ముని భార్య కూడా బలి అవుతుంది. భైరవమూర్తి తమ్ముడు అతని భార్య మరణించిన తరువాత వారి బిడ్డ వాసుని భైరవమూర్తి భార్య పెంచుతుంది. వాసుకి ఒక పేదింటి అందమైన అమ్మాయి పార్వతితో వివాహం జరిపిస్తాడు భైరవమూర్తి. పార్వతిని లొంగదీసుకోవాలని భైరవమూర్తి ప్రయత్నిస్తాడు. కాని ధైర్యం తెలివి ఉన్న పార్వతి అతన్ని ఎదిరిస్తుంది. అమాయకుడైన భర్తను భైరవమూర్తి క్రూరత్వం నుండి నిత్యం కాపాడుకుంటూ ఉంటుంది. అతనికి చదువు చెప్పిస్తుంది. పార్వతిని భైరవమూర్తి ఇంట్లో చూసిన పరశురాంకి ఆమె రోజూ కలలోకి వస్తూ ఉంటుంది. ఆమె పట్ల ఒక విధమైన ఆకర్షణ కలుగుతుంది అతనికి. మరో పక్క ఊరిలో పెద్ద స్వామిగా అతన్ని కొలిచే భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది.

మరోసారి భార్య ద్వారా అమ్మవారు పరశురాంకి కనిపించి ఒక విషబీజం ఊరిలో మొలకెత్తబోతుందని దాన్ని నిర్మూలించమని ఆదేశిస్తుంది. అప్పుడే ఊరివారికి పార్వతి గర్భవతి అని తెలుస్తుంది. అమాయకుడైన వాసు ఆ బిడ్డను తండ్రి కాడని అది భైరవమూర్తి పాపం అని ఊరి వారందరూ చాటుగా మాట్లాడుకుంటూ ఉంటారు. భైరవమూర్తి పార్వతి గర్భంలో ఉంది తన బిడ్డే అని పరశురాంని నమ్మిస్తాడు. అది పాప బీజం అని నమ్మి పరశురాం కొందురా ఇచ్చిన మూలికను పార్వతితో తినిపిస్తాడు. ఆమె గర్భం పోతుంది. ఇది జరిగాక భైరవమూర్తి పరశురాంతో తాను అబద్దం చెప్పానని పిల్లలు లేని తను, బుద్ది మాంద్యం గల తమ్ముని కొడుకు పార్వతిని తల్లిని చేయడం తట్టుకోలేక ఆ బిడ్డను గర్భంలోనే హత్య చేయించానని, దానికి పరశురాం నమ్మకాన్ని వాడుకున్నాని చెప్పి పరశురాంని అపహాస్యం చేస్తాడు. తాను చేసిన పాపం అర్థం అయి, అది తట్టుకోలేక పరశురాం తాను స్వామిగా ఉండడానికి తగనని నిర్ణయించుకుంటాడు. అందుకని భార్యతో కలిస్తే తన మహిమలు పోతాయని ఆమెని బలవంతంగా అనుభవిస్తాడు. అప్పటి దాకా భర్త కోసం నిష్ఠగా జీవిస్తున్న అనసూయ తాను భర్త నిష్ఠను భంగాన్ని కలిగించానని తనను తాను దోషిగా నిర్ణయించుకుని తాను చేసిన పాపానికి పరిహారంగా ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె మరణం తరువాత పరశురాం పిచ్చివాడయి ఆమెని పిలుస్తూ కొండల మధ్యకు వెళ్ళిపోతాడు.

సినిమా మొత్తంలో రమణయ్య మాస్టారు ఒక్కరే ఆలోచనతో విజ్ఞతతో కనిపిస్తారు. తాను భగవంతుని అనుగ్రహం పొందానని నమ్మి ఊరివారి ముందు స్వామిగా అవతరించిన పరశురాంని అతను మందలిస్తాడు. భైరవమూర్తి అధికారాన్ని ప్రశ్నిస్తాడు. అందరూ మానవులే అని, దైవశక్తిని అడ్డుపెట్టుకుని మూఢభక్తిని ప్రదర్శించడం తప్పని అతను ఊరి వారికి చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాని ఊరంతా పరశురాం చూపే దైవత్వాన్ని, అతనిలోని దేవుడిని నమ్ముతుంది. పార్వతిని తనకు తెలియకుండానే మోహించిన పరశురాం కూడా అది తన మానవ సహజమైన బలహీనత అని అర్థం చేసుకోడు. పార్వతిలోనే పాపం ఉందని, ఆమెను చరిత్రహీనురాలిగానే చూస్తాడు. అందుకే ఆమె గర్భంలో ఉన్నది పాప బీజం అని నమ్ముతాడు. ఆ నమ్మకాన్ని భైరవమూర్తి పెంచి పోషిస్తాడు. తన స్వార్థాన్ని తీర్చుకుంటాడు. ఈ దైవత్వాన్ని నమ్మకానికి లొంగనిది మాస్టారు, భైరవమూర్తి మాత్రమే. ఒకరు మంచితనంతో ఆలోచనతో నమ్మకాన్ని ఎదిరిస్తే, మరొకరు ఆ నమ్మకాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకుంటారు. బలహీన మనస్కుడైన పరశురాం తన నమ్మకానికి బందీ అవుతాడు. విచక్షణ కోల్పోతాడు. చివరకు ఆ కారణంగా భార్య చావుకు, పార్వతి దుఃఖానికి కారణం అవుతాడు. జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. ఈ మూఢభక్తి కారణంగా అకారణంగా నలిగిపోయింది కూడా ఇక్కడ స్త్రీలే. పరశురాం తన నమ్మకంతో ఊరిలో మర్యాదను గౌరవాన్ని పొందుతాడు, పూజలు అందుకుంటాడు. దానికి బదులుగా బ్రహచర్యాన్ని ఆనందంగా స్వీకరిస్తాడు. వయసులో ఉన్న అనసూయ తాను సన్యాసినిగా బ్రతకడానికి కష్టపడుతుంది. భర్తకు అన్ని సేవలు చేస్తూ అతనితో శారీరికంగా దూరంగా ఉండడానికి కష్టపడుతుంది. చివరకు భర్త తనను బలవంతంగా అనుభవిస్తే తాను కోరికను జయించలేకపోయానని నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. మరో పక్క భైరవమూర్తి భార్య, కోడలు ఇద్దరూ కూడా ఈ నమ్మకం అనే మాయలో పడి నష్టపోయిన వారే. ధైర్యవంతురాలయిన పార్వతికి భైరవమూర్తి ఈ భక్తి, నమ్మకంతోనే గర్భం పోగొట్టుకునే పరిస్థితి కల్పిస్తాడు.

అనసూయ కూడా భర్తతో శారీరికంగా కలవడం పాపం అని పూర్తిగా నమ్ముతుంది. భర్త తనను బలవంత పెడితే ఆ చర్యకు కారణం తానే అని నేరం తన మీద వేసుకుంటుంది. ఒక భక్తుడి మార్గానికి అడ్డు వచ్చానని కుమిలిపోతుంది. సహజంగా చూడవలసిన చర్యను పాపం అని నమ్మి దానికి పరిహారంగా ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె గుడ్డి నమ్మకం, మూఢత్వం ఆమె ప్రాణాలను బలి తీసుకుంటాయి. ఈ సినిమా భక్తిని ప్రశ్నించదు. దైవాంశను ఖండించదు. కాని వీటిపై నమ్మకంతో ప్రజలలో పెరిగే మూఢత్వాన్ని ఎత్తి చూపుతుంది. భక్తి మూఢమైనప్పుడు దాని పర్యవసానం భయంకరంగా ఉంటుంది. భైరవమూర్తి లాంటి వారు ఆ మూఢత్వాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటారు. తరతరాలుగా ప్రపంచంలో అన్ని చోట్ల, అన్ని మతాల్లో కూడా, అధికారం కోసం భక్తి అనే మూఢత్వాన్ని తమ ఆయుధంగా మార్చుకున్న రాజకీయ నాయకులు మనకు కనిపిస్తూనే ఉంటారు.

ప్రజల మూఢభక్తి, విశ్వాసం, అధికారుల స్వార్ధం మధ్య ఆలోచన ఉన్న మాస్టారు లాంటి వారు అసహాయులుగా ఏమీ చేయలేక ఒంటరిగా ఊండిపోతారు. జరిగే నష్టాన్ని తెలిసి కూడా ఆపలేనంత నిస్సహాయ స్థితులో ఆలోచించే మనుషులు ఉండిపోవడం మూఢనమ్మకాల పర్యవసానం. అందుకే మూఢత్వానికి ఉన్న శక్తి ముందు ప్రతిసారి ఆలోచన ఓడిపోతూనే ఉంటుంది.

‘అనుగ్రహం’ సినిమాను అర్థం చేసుకోవడం కొంత కష్టం. కొందురా పరశురాంకి కనిపించడం అబద్దం అని చెప్పరు దర్శకులు, అలాగే అది నిజం అని కూడా స్పష్టపరచరు. కాని కొందురా కనిపించాడని నమ్మి ఆ నమ్మకాన్ని మూఢభక్తిగా మార్చుకుని, ఆ మూఢత్వాన్ని ప్రజలకు పంచి, చివరకు పరశురాం ఎన్ని జీవితాల వినాశనానికి కారణం అయ్యడు అన్నదే ఈ కథలోని మూల విషయం. ఇది నమ్మకానికి, హేతువాదానికి మధ్య నడిచిన యుద్ధం కాదు. మూఢనమ్మకం కారణంగా ఛిద్రమైన జీవితాల కథ. తెలుగు సినిమాలో ఇది గొప్ప ప్రయోగాత్మకమైన సినిమా. శ్యాం బెనెగల్ పనితనం ప్రతి సీన్లో కనిపిస్తుంది. నటీనటులందరూ పాత్రలకు జీవం పోసారు. ఎటువంటి వారయినా గాని మనుషులుగా బలహీనతలకు అతీతులు కారు అన్నది ఈ కథలోని ముఖ్య విషయం. నాలుగవ హాంగ్‌కాంగ్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఎన్నికైన భారతీయ చిత్రం ఇది. కొత్త రకం సినిమాను అభిమానించే ప్రేక్షకులు మిస్ కాకూడని చిత్రం ‘అనుగ్రహం’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here