అనుకున్నదొకటి… అయినదొకటి

1
8

[dropcap]”ఝా[/dropcap]న్సీ త్వరగా రా, నీకు ఒక విషయం చెప్పాలి” అని పిలిచాడు కాఫీ తాగుతూ రంగనాథం.

“చెప్పండి” అంటూ తన కాఫీ గ్లాస్ తో వచ్చింది ఝాన్సీ.

“నిన్న నాకు ఒక కల వచ్చింది. ఒక అమ్మాయితో కలిసి సినిమా చూసినట్టు, డిన్నర్ చేసినట్టు, కలగన్నాను” అన్నాడు.

“అలాగా! చాలా సంతోషం సుమా!” అని నవ్వింది భార్యామణి.

“ఇంతకీ కలలో వచ్చిన అమ్మాయి ఎవరు అని అడగవేంటి? ఆ చక్కటి పిల్ల నువ్వే ఏమో కదా? ఆసక్తి లేదు?” ప్రశ్నించాడు.

అది విని ఝాన్సీ పకపకా నవ్వుతూ, ఆశ్చర్యంగా, “నిద్రలో కూడా నా గురించి ఆలోచిస్తున్నారన్నమాట! ఇంతకంటే ఏమి కావాలి? అయినా, నేను నమ్మలేకపోతున్నాను” అని కాసేపాగి, “ఏవండోయ్? సాయంత్రం ఏమైనా పార్టీ ప్రోగ్రాం పెట్టారా, ఏమిటి?” అంది ఆరా తీస్తూ.

“అబ్బే అదేం లేదే?! నీకెందుకు వచ్చిందా సందేహం?” అంటూ రంగనాథం నాలుక కరుచుకుని, స్వగతంగా…”అమ్మో ఇది ఘటికురాలు కనిపెట్టేసింది. నిజంగానే, సాయంత్రం ఆఫీసు వాళ్ళతో పార్టీ ఉండనే ఉంది.ఏం కారణం చెప్పాలబ్బా? రాత్రి లేట్ అయితే…” అనుకుంటూ రంగనాథం ఆఫీసుకి బయలుదేరాడు.

సీట్లో కూర్చోగానే పరుగుపరుగున వచ్చి అడిగాడు రామలింగం. “ఇంట్లో సాయంకాలం పార్టీ ఉంది కదా లేట్ అవుతుందని, దానికి ఏం కారణం చెప్పావు? అదే నాకు చెప్పరా అబ్బాయి! మూకుమ్మడిగా ఒకటే చెప్తే సరిపోతుంది.”

“అబద్ధం అతకలేదు రా! రాంబాబు వస్తే అడుగుదాం. ఏదైనా మంచి ఐడియా ఇస్తాడేమో అడుగుదాం” అన్నాడు రంగనాథం.

ఇంతలో మేనేజర్ సందీప్ ఇంటర్‌కం నుంచి రంగనాధానికి పిలుపొచ్చింది. క్యాబిన్ లోకి వెళ్లి, “గుడ్ మార్నింగ్ సార్. ఇంకా నిన్నటి ఫైల్స్ మీరు చూసినట్టు లేదండీ..” అన్నాడు.

“అందుకు కాదు లేవయ్యా ! నేను నిన్ను పిలిచింది, సాయంకాలం ప్రోగ్రాం గురించి. ఏర్పాట్లు అన్నీ సక్రమంగా చేస్తున్నారా?”

 “ఆ. మన రామలింగం వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది. వాడి ఇంట్లో సిట్టింగ్ పెడదాం అనుకుంటున్నాం అండి” బదులు చెప్పాడు రంగనాథం.

“సరే అయితే లింగంని ఓసారి పిలు.”

రామలింగం వచ్చాడు. “ఎవ్రిథింగ్ ఫైన్. ఏంటి సార్? 6 పెట్ సోడా బాటిల్స్ ఫ్రిజ్‌లో పెట్టాను…” మేనేజరు మధ్యలో “ఆరు ఎలా సరిపోతాయి? 10 పెట్టు” అన్నాడు.

“డన్ సార్!” అన్నాడు లింగం.

“మరి అసలు విషయం సంగతి ఏమిటి?” అన్నాడు లింగం మేనేజర్‌తో. “ఉన్నాయి లేవయ్యా 2 ఫుల్ స్కాచ్ రెడీ” అన్నాడు మేనేజర్.

భక్తులు ఇద్దరూ ఏకకంఠంతో,”సూపర్ సార్” అన్నారు.

“స్నాక్స్, ఫుడ్డు సంగతి ఏమిటో?” నాలిక చప్పరించాడు మేనేజర్. “అవి రాంబాబు గాడి డ్యూటీ అండీ” అన్నాడు లింగం.

“మరి రాంబాబు ఎక్కడ?”

“ఇంకా రాలేదండి”

“కొంపతీసి, హ్యాండ్ ఇవ్వడు కదా?” అంటుండగానే రాంబాబు లోపలకు వస్తున్నాడు. సీసీ కెమెరాలో చూడగానే, అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఐడియా బ్రహ్మ రాంబాబుని అందరూ కలిసి ఒకేసారి చుట్టుముట్టారు.

ఇంట్లో ఆడవాళ్లకు చెప్పాల్సిన అబద్ధం గురించిన సలహాలు సూచనలు చెబుతాడని.

“ఏముంది? ఆడిట్ జరుగుతోంది అందాం. ఇంటికి వెళ్లేటప్పుడు కాసిని మంచి ఐస్క్రీములు పట్టుకెళితే చాలు. వాళ్ళు ఐస్ అయిపోతారు. ఆడిటర్లా పార్టీ ఇవ్వందే వెళ్లరు. దానికి ఫిర్యాదు ఏముంది?” అన్నాడు రాంబాబు.

“నీ బుర్ర పాదరసం గురు!” అన్నారు బ్యాచ్‌మేట్స్.

“ఎనిమిదింటికి కూర్చుందాం. ఏమిటి?” అన్నాడు మేనేజర్.

“అయ్యో లేట్ అయిపోతుంది. ఏడున్నరకే మొదలెట్టాలి” రామలింగం హుషారు చేశాడు. అందరూ ఓకే ఓకే అనుకుంటూ తమ తమ సీట్ల వద్దకు వెళ్లారు.

మధ్యాహ్న భోజనం వాసన చూసి పక్కన పెట్టడమే. ఎక్కితే కదా నోట్లోకి!

“ఆరున్నర అయ్యేసరికి రామలింగం, రంగనాథం కలిపి బైక్ మీద వెళ్తారు సార్.మనం వెనకాల మీ కార్లో సరుకు, స్నాక్స్ పట్టుకుని వెళ్దాం.” రాంబాబు పథకాలు చెప్పాడు. దానికాయన సంబరంగా తలూపాడు.

అయ్యింది 6.

సరంజామా సర్దుకొని ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళారు పురుషులంతా.

ఇంటికి చేరారు. బండి దిగి, లింగం తాళం తీద్దామని జేబు తడుముకుంటున్నాడు. తలెత్తి చూస్తే తాళం తీసే ఉంది!!!.

బుర్ర తిరిగింది. ” ఇదేంట్రా?” అని బయటికి ఒక చిన్న అరుపు అరిచి, మెట్టు ఎక్కాడు, రామలింగం.

“రండి, రండి.” అంటూ భార్యామణి ఎదురొచ్చింది. ఒక్కసారిగా ఇద్దరు మిత్రులు నిశ్చేష్టులయ్యారు. పుండు మీద కారం చల్లినట్టు భార్యామణి వెనకాలే, మామగారు నాగేశ్వరరావు లోపల్నుంచి గుమ్మందాకా వచ్చేసి, “అల్లుడు గారు, బాగున్నారా?”, అని నవ్వుతూ నిల్చున్నాడు.

“ఇదేంటి? మీరంతా వారం రోజుల దాకా రాము అన్నారు కదా?”, అన్నాడు లింగం.

“అదా? నాన్న గారికి పనుంది.ఇక ఎలాగూ కలిసి వద్దాం అని అమ్మ, పిల్లలం, బయలుదేరి వచ్చేసాం. ఇంతకీ, మీరేంటి? ఇబ్బందిగా మొహం పెట్టారు?” అంది రాంబాబు భార్య.

“అబ్బే! అదేం లేదు. నాకు ఇబ్బందేం ఉంది, మీరు వస్తే?” అంటూ, “ఇప్పుడే వస్తాను. నా స్నేహితుడు వచ్చాడు” అని వెనక్కు తిరిగి, చేతిలో సంచులు రంగనాధానికి అందించ బోయాడు.

పుట్టు మునిగిపోయినట్టు వెనకాలే కారు మేనేజర్‌తో సహా వచ్చేసింది. ఇక చూసుకోండి రాంబాబు పరుగో పరుగు!

చెయ్యి అడ్డంగా చూపిస్తూ, డ్రైవర్ సీట్లో ఉన్న మేనేజర్ వద్దకు హడావుడిగా వెళ్ళాడు. “సారీ, సార్! మా ఫేమిలీ వచ్చేసారు. ఊహించని పరిణామం.” అన్నాడు.

విండో గ్లాస్ కిందకు దించి ఏమిటన్నట్లు చూసిన మేనేజర్ మొహం మాడిపోయింది. “అయ్యో! ప్రోగ్రాం అప్ సెట్ అయిపోయింది.ఇప్పుడు ఎలా? మానసికంగా ఫిక్స్ అయిపోయాను” అని చిరాకు పడ్డాడు.” పోనీ మీరు కంటిన్యూ చేయండి సార్ ! ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్ళండి.” అంటూ రామలింగం తత్తర పడ్డాడు.

“నో ! నో ! నువ్వు లేకపోతే ఎలా? నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేసుకుందాం లే” ఆనాడు రంగా.

ఓకే అంటే ఓకే అనుకుంటూ, ఎవరికి వాళ్లు విడిపోయారు. ఈ ప్రయత్నానికి ఎక్స్‌ట్రాగా క్షవరం ఏమిటంటే, స్నాక్స్ మేనేజర్ చేతికి వెళ్లిపోయాయి!

రామనాథం ఇంటికి 9కి చేరి పోయాడు.

“ఏం ట్రాఫిక్ ఎక్కువగా ఉందా?” మెత్తగా అడిగింది ఝాన్సీ.

“కాదు ఆఫీసు పని వల్లే..”అంటూ విసుగ్గా చెప్పాడు.” సరే స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి. పుల్కాలు రెడీ.” లోపలికి వెళ్ళింది ఝాన్సీ.

టీవీలో సినిమాకి ముందు సూక్తి ముక్తావళి వస్తోంది. “ధూమపానం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం”

“అబ్బో నువ్వు చెప్పడం, నేను వినడం!” అనుకుంటూ కోపంగా, టీవీ ఆఫ్ చేసేశాడు రంగనాథం. పాత పాట గుర్తుకు వచ్చింది…. “తలచినదే జరిగినదా దైవం ఎందులకు? జరిగినదే తలచితివా, శాంతి లేదు నీకు.” ఇంతే సంగతులు సణుగుకుంటున్నాడు రంగనాథం.

అక్కడ లింగం ఇంట్లో…”ఏవండీ, భోజనం వడ్డించేనా?” అంది వాళ్ళ ఆవిడ.

“మహా గొప్ప పని చేశావులే ! అసలు మీ నాన్నకి ఏమిటంట అంత అర్జెంటు పని?” లింగం అరిచాడు.

“నాకేం తెలుసు? వాళ్ల స్నేహితుల్ని కలవాలిట.”

“ఇంతకీ ఎన్ని రోజులు ఇక్కడ బస?”

“మూడు రోజులు అన్నారు లెండి. రావడం మీకు ఇష్టం లేనట్టుంది.ఇందాకటి నుంచి చూస్తున్నా. చాలా ఇబ్బందిగా, చిరాగ్గా ఉన్నారు. అభ్యంతరాలు ఏమిటో?” దీర్ఘం తీసింది ఆవిడ.

“అబ్బే అదేం లేదు. కొంచెం తలనొప్పిగా ఉంది” తప్పించుకోబోయాడు లింగం.

“అదేంటి రంగనాథం అన్నయ్యగారు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయారు. లోపలికి రాలేదు” అంది భార్యామణి. “నువ్వు దిగావుగా” అని మనసులో అనుకొని, “నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అంతే!” బింకంగా చెప్పాడు.

 “సర్లేండి! ఆయన ఎందుకు వచ్చారో, వెనకాల కార్ ఎందుకు వచ్చిందో, పరుగు పరుగున మీరు ఎందుకు వెళ్లారో, ఏం చెప్పి పంపించారు…. కథ, స్క్రీన్ ప్లే తెలుసుకోలేనంత వెర్రి దాన్ని అనుకున్నారా? మీరంతా కలిసి మన ఇంట్లో సిట్టింగ్ వేద్దాం అనుకున్నారు. మా రాక వల్ల అంతా తలకిందులు అయినట్టుంది” అని పకపకా నవ్వింది ఇంటి ఇల్లాలు.

“ఇదే నీలో ఉన్న గొప్పతనం. చిన్న క్లూ దొరికితే అల్లుకు పోతావ్. నీ తెలివి సూపర్!” అన్నాడు లింగం.

“అబ్బో పొగిడింది చాలు. ఇది తెలివి కాదు. అనుభవం. పదండి, భోజనాల వేళ అయింది” అంది.

అడ్వర్టైజ్మెంట్ లయ్యాక టీవీ లో సినిమా టైటిల్ వేస్తున్నారు. నేపథ్య సంగీతం. కాసేపటి దాకా బొమ్మ అలాగే ఉంది, కదలకుండా……

టైటిల్ కార్డు…… ఇంటికి దీపం ఇల్లాలు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here