అనుసృజనకి తీరని లోటు శాంత సుందరి మహాప్రస్థానం

0
6

[box type=’note’ fontsize=’16’] ఇటీవల మృతి చెందిన ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు శ్రీమతి శాంత సుందరి గారికి ఈ వ్యాసం ద్వారా నివాళి అర్పిస్తున్నారు డా. టి. సి. వసంత. [/box]

[dropcap]శాం[/dropcap]త సుందరిగారి తలంపు రాగానే అజరామరమైన అనుసృజన కలం కళ్ళ ముందు కదలాడుతుంది. అనువాద సాహిత్య వనంలో ఒక వటవృక్షం శాంత సుందరి. శాంత సుందరి కేవలం శబ్దంలో జీవించలేదు. మాటలోని అర్థంతో పాటు జీవించారు. మేం ఇద్దరం ఫోనులో ఎంతోసేపు మాట్లాడుకునేవాళ్ళం. పుస్తకాల గురించి చర్చించుకునేవాళ్ళం. వారి కుటుంబంలోనే సాహిత్య సువాసన నిండి ఉంది. వారి నాన్నగారు కీ.శే. శ్రీ కొడవటిగంటి కుటుంబరావుగారి గురించి చెబుతూ ఉండేవారు. నాన్నగారి ‘చదువు’ నవలను హిందీలో ‘పఢాయీ’ అన్న పేరన చేశానని ఎంతో సంతోషంగా చెప్పారు. తండ్రి రాసిన పుస్తకాలను మరో భాషలో అనువదించి వాటిని ప్రచురించే అదృష్టం ఎంతమందికి కలుగుతుంది? తనే వృద్ధురాలు అయినా చివరివరకూ తల్లి 96 సంవత్సరాల వృద్ధురాలు వరూధినిగారిని నెత్తిమీద పెట్టుకుని ఒక కొడుకులా చూసుకున్నారు. శ్రీ గణేశ్వర రావు గారు, శాంత సుందరిగారు ఆదర్శ దంపతులు. దాదాపు ఆరునెలల నుండి ఆవిడ ఆరోగ్యం బాగోలేదు. “వసంతా! మా ఆయనే అంతా చూస్తున్నారు. ఆయనా పెద్దవారైపోయారు” అంటూ బాధపడేవారు. “మీ దాంపత్య జీవితంలో ఎంతో ఖుష్‌బూ ఉందండి, మీరు అదృష్టవంతులు” అని నేను అనేదాన్ని.

చనిపోకముందు దాదాపు ఒకనెల కిందట మాట్లాడారు. అప్పటికే మాట ముద్దముద్దగా ఉంది. “వసంతా!” అన్న ఆవిడ పిలుపు వినగానే నాలో ప్రాణం లేచి వచ్చింది. “ఫిజియోథెరపి చేయించుకుంటున్నాను మళ్ళీ తప్పకుండా లేస్తాను” అని అన్నారు. “శాంత గారూ! నేను మీరు తొందరగా కోలుకోవాలని రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాను. దేవుడు ఉన్నాడు” అంటూ నేను ఏడ్చేశాను. మా చెల్లెలు జయశ్రీతో కూడా మాట్లాడుతూ ఉండేవారు. “నాకు అక్కచెల్లెలు లేరు, మీరే నాకు అక్కాచెల్లెళ్ళు” అని అంటూ ఉండేవారు.

నేను రాసిన కీ.శే. గుడిపాటి వెంకట చలంగారి జీవితచరిత్ర ‘రమణీసే రమణాశ్రమ్ తక్’ (మూడు భాగాలు దాదాపు 1400 పేజీలు)కి శాంతగారు ముందుమాట ‘శుభాషీష్’ అన్న పేరన రాశారు. “చలంగారి మనవరాలిగా నేను ఎంతో గర్వపడుతున్నాను” అంటూ నా శ్రమను, నాకు వారిపట్ల ఉన్న గౌరవాన్ని మెచ్చుకున్నారు. “నాకు తెలిసినంత వరకు చలంగారి గురించి హిందీలో ఇటువంటి సమగ్ర రచన రాలేదు” అని చెప్పారు. “రమణీసే రమణాశ్రమ్ తక్” కి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాధ త్రిపాఠీ గారు ‘అక్షరాగ్ని కీ మహాగాథా’ ; శ్రీ నిఖిలేశ్వర్ గారు ‘విద్రోహీ చలం పర్ పూర్ణ ప్రకాష్’ అన్న శీర్షికలతో రాయడం ఆవిడకి ఎంతో సంతోషాన్ని కలిగించింది.

అనువాదం చేసేటప్పుడు ఏవైనా శబ్దాలకి అర్థాలు కావాలంటే వారు అడిగేవారు. “మీరైతే ఎన్ని ప్రయత్నాలైనా చేసి అర్థాలను వెతుకుతారు”. అట్లాగే నేను కూడా ఏదైనా శబ్దాలకు అర్థాలు తెలియకపోతే వారిని అడిగేదాన్ని.

డా. భారతి ‘గీతాంజలి’ ‘పహచాన్’ అనే పుస్తకాన్ని శాంతగారు హిందీలోకి అనువదించారు. మహ్మదీయ స్త్రీలు పడే లైంగిక హింస, వాళ్ళ దయనీయ గాథల చిత్రీకరణ ఇందులో ఉంది. దీనిని రోషనాయీ ప్రకాషన్ బెంగాల్ వాళ్ళు ప్రచురించారు. గీతాంజలి నిన్న ఫోనులో మాట్లాడినప్పుడు శాంతగారు ‘పహచాన్’ రెండోపార్టు కూడా రాయమన్నారని, తను హిందీలోకి అనువాదం చేస్తానని చెప్పారని – ఆవిడ ఉన్నప్పుడు పార్టు 2 రాయలేకపోయాననీ బాధపడుతున్నానని చెప్పారు. తను తప్పకుండా పార్ట్ 2 రాస్తానని అన్నారు. ఇందులో ‘బచ్చేదాని’ అన్న కథని కాకతీయ యూనివర్శిటి వాళ్ళు పాఠ్యభాగంలో చేర్చారని చెప్పారు. శాంత గారి ప్రోత్సాహంతో ప్రస్తుతం మరాఠీ క్లాసిక్ కీ.శే.శివాజీ సామంత్ గారి ‘మృత్యుంజయ’ (దాదాపు 700 పేజీలు)ని నేను తెలుగులోకి అనువదిస్తున్నాను. “దీని అనువాదం మీరే చేయగలరు, తప్పకుండా చేయండి” అని అన్నారు. ఈ పుస్తకం చాలా బాగుంది. ఇప్పుడు అనువాదం చేస్తున్నప్పుడు ప్రతిక్షణం వారు గుర్తుకువస్తూనే ఉన్నారు.

మేము పూణెలో ఉన్నప్పుడు మా శ్రీవారు కీ.శే. టి. కామేశ్వర సోమయాజిగారు ఫోనులో శాంతగారితో మాట్లాడారు. కుటుంబరావుగారి సాహిత్యంపై మాట్లాడారు.

శాంతగారికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు కొండవీటి సత్యవతిగారు ‘భూమిక’పై ఆవిడది చక్కటి ఫొటో వేశారు. వారితో ఇంటర్వ్యూ ప్రచురించారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విలువైన విషయాలు ఉన్నాయి. శ్రీ రాజన్న గారు నన్ను రాధేశ్యామ్ గారి (ప్రముఖ అనువాదకులు) ని ఆవిడ గురించిన వివరాలు అడిగి ‘వార్త’ ఆన్‍లైన్‍లో వారి గురించి రాశారు. ప్రముఖ హిందీ కవి, అనువాదకులు శ్రీ మైయిలా దేవా ప్రసాద్ గారు శాంతగారిని ఎన్నోసార్లు కలవాలనుకున్నాను. సాహిత్య సేవా సంస్థకి పిలవాలని, సన్మానం చేయాలనుకున్నారు, కాని దురదృష్టం, ఏదీ చేయలేకపోయానని చాలా బాధపడుతున్నారు. హైదరాబాద్‍లోనే కాదు దేశం అంతటా ఎవరో ఒక సాహిత్యకారులు ఆవిడని తలచుకుంటూనే ఉంటారు.

“ఇదివరకు మనమే సెలెక్ట్ చేసుకుని తెలుగు నుండి హిందీకి, హిందీ నుండి తెలుగుకి అనువాదం చేసేవాళ్ళం. ఇప్పుడు రచయితలు మనలను తమ రచనలను అనువాదం చేయమని కోరుతున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది” అని శాంతగారు ఎన్నోసార్లు అన్నారు.

డా. పెరుగు రామకృష్ణగారు “శాంతసుందరి గారు మీరు హిందీలో అనువాదం చేసిన నా కవితా సంకలం ఒక ‘పరిమళభరిత కాంతి దీపం’ అని ఎంతో మెచ్చుకున్నారు” అని ఫోనులో చెప్పారు.

ఇదంతా రాస్తున్నాను, ఇంతలో ప్రముఖ రచయిత్రి ముక్తేవి భారతిగారు ఫోను చేశారు. వారి ’మహాభారతంలో ప్రేమకథలు’ని శాంతగారు హిందీలో చేశారని ‘మహాభారతంలో నీతికథలు’ అని మీరు హిందీలోకి అనువాదం చేస్తే బాగుంటుంది, గణేశ్వర రావుగారు మీ నంబరు ఇచ్చారని చెప్పారు. నేను వారి పేరు విన్నానే కాని వారితో ప్రత్యక్షంగా పరిచయం లేదు. నేను చాలా సంతోషపడ్డాను.

రచయిత, 84 సంవత్సరాల వయోవృద్ధులు శ్రీ పుల్లారెడ్డి గారు శాంత గారి, వారి నాన్నగారి వ్యక్తిత్వం – కృతిత్వం గురించి చెబుతూ ఉంటారు. వారు అనుభవజ్ఞులు. వారు ఇంగ్లీషు, తెలుగు, హిందీ రచయితలను గురించి చెబుతూ ఉంటారు. వారికి చాలామందితో పరిచయం ఉంది. వింటూ నేను ఎంతో భావుకురాలనై పోతాను.

మేం స్నేహితులందరం ఏదో సందర్భంలో వారి గురించి మాట్లాడుకుంటూనే ఉంటాము.

శాంతగారూ! మీ జ్ఞాపకాలనే పూర్ణకుంభం మా అందరి దగ్గర ఉంది. దీని సుగంధం ఎప్పుడూ మాతోనే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి కలగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఎందరో అనువాదకుల ‘అనుసృజన వసంతం’ మీకు శ్రద్ధాంజలిని సమర్పిస్తోంది.

ఒక విశిష్ట అనువాదకురాలు, స్నేహమయి మనలందరిని వదిలి వెళ్ళిపోయారు. ఆవిడ భర్త శ్రీ గణేశ్వర రావు గారు ఫోనులో మాట్లాడుతూ ఉంటారు. వారు నిలదొక్కుకోవాలని, ధైర్యంగా ఉండగలగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here