[శ్రీ వల్లీశ్వర్ గారి ‘అనువాద రచనలు’ అనే అధ్యయన పత్రాన్ని అందిస్తున్నాము.]
[dropcap]‘‘ఈ[/dropcap] రచనలో అనువాద శైలి అక్కడక్కడ బాగుందండి.’’
‘‘ఈ రచనలో అనువాద శైలి అక్కడక్కడ బాగా లేదండి.’’ … ఇలా ఏదైనా ఒక అనువాద రచన గురించి పాఠకుడికి అనిపించిందంటే, నా దృష్టిలో ఆ అనువాదం విజయవంతమైనట్లు కాదు.
ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే – ఏ భాష నుంచి అనువాదం చేస్తున్నారో ఆ భాష పదాలకు తెలుగులో ఉండే సమానమైన, లేదా దగ్గర దగ్గరగా ఉండే పదాలను వాడుతుంటారు. ఈ అనువాదం ఇతర భారతీయ భాషల నుంచి తెలుగులోకి చేస్తున్నట్లయితే వాక్యనిర్మాణం కూడా అదే రకంగా చేస్తుంటారు. హిందీ, ఇతర దక్షిణాది భాషల్లో వాక్య నిర్మాణంలో కర్త-కర్మ-క్రియల ప్రయోగంలో పెద్దగా తేడా ఉండదు.
కానీ, ఆంగ్ల భాష అలా కాదు. వాక్యాలు యాక్టివ్ వాయిస్‌లో ఉన్నా, పాసివ్ వాయిస్‌లో ఉన్నా అవి తెలుగు వాక్య నిర్మాణ శైలిలో అనువాదం చేయడానికి అనువుగా ఉండవు.
ఉదాహరణ:-1 ‘‘I was told she would never return to her native place.’’ ఈ వాక్యాన్ని ఇదే తీరులో అనువాదం చేస్తే… ‘‘నేను చెప్పబడ్డాను ఆమె ఎప్పటికీ తన సొంత ఊరికి తిరిగి రాదని.’’ ఇది ఎంత కృతకంగా ఉంది!
అలా కాక – ‘‘ఆమె ఎప్పటికీ తన స్వగ్రామానికి తిరిగి రాదని నాకు తెలిసింది’’ అని రాశాం అనుకోండి. బాగుంది కదా!
ఉదాహరణ -2: ‘‘That organization has grown on leaps and bounds.’’ ఈ వాక్యాన్ని కూడా ఇదే తీరులో అనువాదం చేస్తే…. ‘‘ఆ సంస్థ గెంతుతూ మరియు దూకుతూ పెద్దది అయింది.’’ ఇది ఎంత కృతకంగా ఉంది!
అలా కాక – ‘‘ఆ సంస్థ చాలా వేగంగా విస్తరించింది. లేదా చూస్తూండగానే పెద్దదై పోయింది.’’ ఈ రెండింటిలో వాక్య నిర్మాణం ఇలాంటి సహజమైన తెలుగులో జరగాలంటే ఆయా వాక్యాల స్ఫూర్తిని తెలుగులో అర్థం చేసుకొని ఉపయోగించాలి.
ఉదాహరణ-3: Rama and Krishna were going for walk in every morning and evening. దీన్ని తెలుగులో ఎలా రాస్తాం? ‘‘రాముడు మరియు కృష్ణుడు ప్రతి ఉదయమూ మరియు సాయంత్రమూ నడవడానికి వెళ్తుంటారు.’’ …
ఇందులో ‘‘రాముడు మరియు కృష్ణుడు’’ అని రాశాం. మళ్లీ అదే వాక్యంలో ‘‘ఉదయము మరియు సాయంత్రము’’ అని రాశాం. ఇంగ్లీషులో ‘and’ అనే పదానికి అర్థం ఏమిటి – అని కాక తెలుగులో ఆలోచించండి – ‘‘ఇప్పుడు ఈ సభలో చాలామంది చిట్టెన్ రాజులు మరియు చాలామంది వల్లీశ్వర్‌లు మరియు చాలామంది సుమిత్రలు మరియు చాలామంది రాధికలు ఉన్నారు’’ అని వాక్యం రాస్తామా?
తెలుగులో ‘మరియు’ అనే ప్రయోగం లేదు. ఈ వేదిక మీద పెద్దలు ఎంతమంది ఉన్నారో అందరి పేర్లు ‘కామా’ ఉపయోగించి చెప్పేస్తాం. ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసినప్పుడు, మాట్లాడినప్పుడు మాత్రమే చివరి పేరుకు ముందు ‘మరియు’ వాడుతున్నాం. ఇంగ్లీషులో నుంచి తెలుగులోకి జరిగే అనువాదాల్లో ఈ ‘మరియు’ ప్రయోగాలు, ప్రతి ఇంగ్లీషు పదానికి సమానమైన తెలుగు పదాన్ని కచ్చితంగా వాడాలన్న తాపత్రయాలు అనువాదాలను కృతకంగా లేదా కటువుగా మార్చేస్తున్నాయి.
తరచుగా అనువాదాల్లో నేను గమనిస్తున్న మరో అంశం ఏమిటంటే – కొందరు అనువాదకులు అతి స్వేచ్ఛను తీసుకోవడం, మరికొందరు అనువాదకులు గిరి గీసుకుని వాక్యాల స్ఫూర్తి కన్నా పదాల అర్థానికే కట్టుబడి ఉండటం.
ఈ స్వేచ్ఛను తీసుకొనే వాళ్లు తమకి ‘‘అనవసరం’’ అనిపించిన, లేదా ‘‘అతిగా రాసినట్లు’’ అనిపించిన భాగాలని కుదించేయడం, లేదా తొలగించేయడం చేస్తున్నారు. కానీ అంతర్జాతీయంగా సాహిత్యంలో అనువాదకులు ఇంత స్వేచ్ఛను తీసుకోవడాన్ని ఏ రచయితా అంగీకరించడు. పైగా అలా చేయడం అనైతికం. అంతేకాదు, చట్టవిరుద్ధం. అలాంటి చర్యల వల్ల ఒక్కోసారి అసలు రచన యొక్క స్ఫూర్తికి భంగం కలిగే ప్రమాదం కూడా ఉంటుంది. (కొన్ని కొన్ని దేశాల్లో రాజకీయ, సామాజిక కారణాల వల్ల అనువాదాల మీద కొంత సెన్సార్ ఉండవచ్చు. ఉదాహరణకి ఒక అమెరికన్ నవలని తెలుగులోకి అనువదిస్తాం. అందులో పరిధికి మించిన అశ్లీల విషయాలు ఉంటే వాటిని వాడటం మన దేశంలో చట్టవిరుద్ధం. అలాంటి సందర్భాల్లో ఆ విషయాల్ని తొలగించటం, లేదా సందర్భానికి తగినట్లు అభ్యంతరకరం కాని భాషలో వ్యక్తీకరించటం చేయవచ్చు.)
అందుకే వాక్యాల స్ఫూర్తిని తీసుకొని సరళమైన అనువాదాన్ని ఎంత బాగా చేయవచ్చో చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.
తాజాగా విడుదలైన ఒక అనువాదంలో వచ్చిన ఈ వాక్యం చూడండి. ‘‘ఆమె ప్రజ్ఞకి, సౌందర్యానికి ఆరాధకులైన జమీందార్లు, వ్యాపారస్థులు ఆమెను విలువైన కానుకలతో ఉక్కిరిబిక్కిరి చేసేవాళ్లు.’’ ఇంగ్లీషులో ‘ఉక్కిరిబిక్కిరి’ అనే పదం ఉందో లేదో ఒక తెలుగు పాఠకుడిగా నాకనవసరం. కానీ, తెలుగులో ఆ సందర్భంలో ఆ పదప్రయోగం ఎంత సుందరంగా ఉంది! ఎంత హాయిగా ఆస్వాదించగలుగుతున్నాం!
అయితే, అవసరమైన చోట్ల తెలుగు పాఠకుడి పఠనాసక్తికి అనుగుణంగా పరిధులు దాటని స్వేచ్ఛ తీసుకోకపోవటం కూడా సరికాదు. ఇంగ్లీషులో లేని అనేక భావోద్వేగ సంకేతాలు తెలుగులో ఉన్నాయి. ఆంగ్ల రచనలో రచయితలకు లేని ఈ వెసులుబాటు తెలుగులో బాగా ఉంది. కొన్ని వాక్యాలను చూద్దాం:
వాక్యం-1: కుమార్ నాకు ఫోన్ చేసి ‘‘మీకు అవార్డు వచ్చింది’’ అని ఉత్సాహంగా చెప్పాడు. అంతే! ఒక్కసారిగా ‘వారే వ్వా’ అంటూ కేక పెట్టేశాను.
ఇక్కడ ‘అంతే’ అన్న పదప్రయోగం ఎలాంటి ఉత్సాహ, ఉద్వేగాల మలుపును సూచిస్తోంది?
వాక్యం-2: ‘‘ఉరుకులు పరుగుల మీద స్టేషన్‌కి చేరుకున్నాం. ప్లాట్‌ఫారం మీదకి పరుగెత్తాం. కానీ ట్రైన్ వెళ్ళిపోతోంది. అరెరె! ఎంత అవస్థ పడి వచ్చాం.’’
ఇక్కడ ‘అరెరె’ అన్న ప్రయోగం ఎంత నీరసాన్ని, నిస్పృహని సూచిస్తోంది!
వాక్యం-3: ‘‘నేను నిన్ను నమ్మి నెత్తిన పెట్టుకున్నందుకు ఇంత మోసం చేస్తావా?’’ అన్నారు మాస్టారు. ఆ మాట ఛెళ్లున తగిలింది. నేను మ్రాన్పడిపోయాను.
ఇందులో ‘ఛెళ్లున’ అనే పదాన్ని ఇంగ్లీషులో రచయిత వాడి ఉండకపోవచ్చు. కానీ, ఆ సందర్భానికి ఇది తగి ఉన్నప్పుడు ఆ వాక్య ప్రభావాన్ని మనం తెలుగులో ఆస్వాదించేలా చేస్తోంది కదా! ఆయా సందర్భాలలో అతికినట్లుండే తెలుగు జాతీయాలు, నుడికారాలను ప్రయోగించడం వల్ల ఆ అనువాదం సుసంపన్నం అవుతుంది.
ఈ క్రింది ఉదాహరణలు చూడండి:
He was guilty. But he was silent.
అతను తప్పు చేశాడు. కాని, నంగనాచిలా నోరు మూసుకొని కూర్చున్నాడు.
You are playing games with fire.
నువ్వు నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు.
My boss was caught red-handed. He was struggling to escape.
మా బాస్ తప్పు చేసి దొరికిపోయాడు. దాంతో కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకుంటున్నాడు.
My grand-daughter wanted more chocolates. I said I won’t give unless you complete that one chapter. She cut a sorry figure.
మా మనుమరాలు మరికొన్ని చాక్లెట్లు కావాలని అడిగింది. నువ్వు ఆ అధ్యాయం పూర్తి చేస్తేనే ఇస్తాను అని ఖండితంగా చెప్పాను. ఆమె దీనంగా బుంగమూతి పెట్టింది.
అయితే, కొన్ని సాంకేతిక అంశాల మీద అనువాదాలు చేయాల్సి వచ్చినప్పుడు ఈ భావోద్వేగాల ప్రకటనకు అవకాశం ఉండకపోవచ్చు. రక్షణరంగం, సాఫ్ట్‌వేర్ రంగం, ఇంజనీరింగ్, ఫైనాన్స్ తదితర రంగాలకు సంబంధించి పూర్తిగా సాంకేతిక సమాచారాన్ని మాత్రమే అందించే రచనల విషయంలో అనువాదకుల స్వేచ్ఛకు పరిమితులు చాలా తక్కువ.
ఉదాహరణకి –
రిజర్వ్ బ్యాంక్ పని తీరు గురించి వచ్చిన ఒక పుస్తకంలో రచయిత రాసిన ఒక ఆంగ్ల వాక్యాన్ని చూడండి:
And there was advice aplenty, predictably from both ends of the ideological spectrum: slay inflation with all the policy force at the Reserve Bank’s command vs recognize the paramount importance of supporting growth at a time of business-cycle downturn; leave the exchange rate to the dynamics of the market vs you can’t afford to abandon the exchange rate to the vagaries of the market; open up the capital account with blitzkrieg reforms vs beware of the pitfalls of hasty capital-account liberalization; invite foreign banks with open arms vs keep in mind the sorry experience of other emerging markets which had embraced foreign banks prematurely; implement financial sector reforms with alacrity vs focus on the macroeconomy and let reforms wait.
ఇలాంటి సంక్లిష్ట వాక్యాల్ని యథాతథంగా రాయాలని ప్రయత్నం చేయడం వల్ల రచయిత ఆశించిన స్ఫూర్తి తెలుగులో రావడం కష్టం. చదివేవాళ్లు ఆస్వాదించడం దుస్సాధ్యం. అలాకాక, చిన్న చిన్న వాక్యాలుగా విడదీసి రాస్తే హాయిగా ఆస్వాదిస్తారు. అనువాదకుల స్వేచ్ఛకు పరిమితి అంతవరకే ఉంటుంది.
అయితే…
కొందరు అనువాదకులు ఇటీవలి కాలంలో తమకు అర్థం కాని ఆంగ్ల పదాల్ని యథాతథంగా వాడేస్తున్నారు. ఇలాంటి ప్రక్రియల్ని తెలుగు పాఠకులు ఎలా ఆస్వాదించగలరు?
మరికొంతమంది అనువాదకులు ఈ మధ్య కాలంలో ‘గూగులమ్మ’, ‘మైక్రోసాఫ్ట్’ వంటి సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ -ఇంగ్లీషు పదాలకి తెలుగు ఇస్తుంది. కానీ, సందర్భానికి తగిన భావోద్వేగాలను స్ఫూర్తిమంతంగా ప్రతిఫలించే పదాలను ఇవ్వలేదు. కృత్రిమ మేధ (AI) శక్తి కూడా మనుష్యుల భావోద్వేగాల లోతుల్ని ఒడిసిపట్టే స్థాయికి ఇంకా రాలేదు.
స్వాతంత్ర్య సమరయోధులు క్రొవ్విడి లింగరాజుగారు అనువదించిన మాక్సిమ్ గోర్కీ నవల ‘అమ్మ’ నేను చదివిన తొలి అనువాద నవల. అది 1963లో. అప్పటి నుంచి అడపాదడపా తెలుగు అనువాద రచనలను చదువుతున్నాను. 20 ఏళ్లుగా అనువాదాలు చేస్తున్నాను. ఎంతో సాధారణమైన రచన కూడా అనువాదంలో సరళత, సహజత్వం ఉట్టిపడుతుంటే చదవడంలో ఎంతో ఉత్సాహం వస్తుంది. ఎంతో మంచి పుస్తకం కూడా తెలుగు అనువాదం కటువుగా ఉంటే చదవాలనిపించదు.
అలాగే, ఆంగ్ల రచనలలో కన్నా తెలుగులో విరామ సంకేతాల వాడుక ఎక్కువ. అందుకే అనువాదాలు చేసేటప్పుడు తెలుగులో అవసరమైన చోటల్లా విరామ సంకేతాలు వాడడానికి రచయితలు స్వేచ్ఛ తీసుకోవాలి. ముఖ్యంగా సంభాషణల విషయంలోనూ, కొన్ని కొన్ని నామవాచకాలకు స్పష్టతనివ్వడానికి విలోమ కామాలు (కోట్స్) వాడటం అవసరం.
ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘ఇది అనువాద రచన’ అని అనిపించకుండా చదివించే అనువాదానికి జీవితం ఎక్కువ ఉంటుంది. అలా అనిపించలేదంటే, ఇక చెప్పేదేముంది!
విలువైన సాహిత్యాన్ని అనువాదాల్లో అందించాల్సి వస్తే, రచయితలు తమ రచనని రెండు రోజుల తరువాత కొత్త పాఠకుడిలా చదివితే చాలు – ఎక్కడెక్కడ సహజత్వం మరింత పెరగాలో తెలిసిపోతుంది. మెరుగుపరచడం సాధ్యపడుతుంది.
ముగించే ముందు 2008లో నేను ‘నిప్పులాంటి నిజం’ టైటిల్‌తో అనువదించిన రాజీవ్‌గాంధీ హత్య-దర్యాప్తు రచనలో కీలక సన్నివేశం ఇక్కడ ఉటంకిస్తాను:
Triumph of Truth (English original)
Young woman in the salwar kameez was just behind Kokila and stepped towards Rajiv Gandhi. As sub-inspector Anasuya tried to hinder the woman with her hand, Rajiv Gandhi signalled against it and asked her to relax. As Anasuya stepped back slightly, the bespectacled woman moved and was now in front of Rajiv Gandhi. She placed the sandalwood garland around his neck. She then bent as if to touch Rajiv Gandhi’s feet. This was about ten minutes after Rajiv Gandhi had stepped out of his bullet-proof car. The time was 10.20 pm. As she bent down, there was a sudden and deafening sound, with fire and smoke rising to about 20 feet at the spot where Rajiv Gandhi stood. As the smoke lifted, there was no sign of any life near where Rajiv Gandhi had been standing.
What confronted the onlookers was a macabre scene, numbing their senses; flesh and blood was strewn all over.
‘నిప్పులాంటి నిజం’ – తెలుగు అనువాదంలో
కోకిల వెనకాల నిల్చొన్న సల్వార్ కమీజ్ – కళ్ళద్దాల యువతి ముందుకు తోసుకువచ్చి, రాజీవ్‌గాంధీకి గంధపుదండ వేయాలని యత్నించింది. మరుక్షణం మహిళా సబ్ ఇనస్పెక్టరు అనసూయ చేయి అడ్డంపెట్టి ఆమెను నిరోధించింది. ఇది గమనించిన రాజీవ్‌గాంధీ ఆ మహిళా సబ్ ఇనస్పెక్టర్ని వారించారు. “ఫరవాలేదు, రానీయ్” అన్నట్లుగా చిరునవ్వు నవ్వుతూ చేయి ఊపారు. అనసూయ ఆగిపోయింది.
మరుక్షణం…
కళ్ళద్దాల సల్వార్ కమీజ్ యువతి మెరుపువేగంతో ముందడుగు వేసింది.
తన చేతిలో గంధపు దండ రాజీవ్ గాంధీ మెడలో వేసింది. ఆమె వేస్తున్న దండని చిరునవ్వుతో స్వీకరించటం కోసం తలకొద్దిగా వంచారు రాజీవ్ గాంధీ…
ఆయన మళ్ళీ తల ఎత్తేలోపు ఆమె ఆయనకి పాదాభివందనం చేయడం కోసం అన్నట్లుగా క్రిందకు వంగింది…
అంతే…
భళ్ళున చెవులు బ్రద్దలయ్యేటంత శబ్దంతో ఆ మైదానం ప్రతిధ్వనించింది. శబ్దం వచ్చిన మరుక్షణం ఒక్కసారిగా 20 అడుగుల ఎత్తుకి అగ్నిజ్వాలలు ఎగిశాయి. …కన్నుపొడుచుకున్నా ఏమీ కనుపించనంతటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని చుట్టేసింది.
హాహాకారాలు, ఆర్తనాదాలతో ఆ పరిసరాలు మారుమ్రోగాయి. అంతా గందరగోళం, కేకలు, అరుపులు, ఏడుపులు…!
భయం, సంభ్రమం, ఆశ్చర్యం, ఆందోళన, కంగారు ముసురుకున్న ముఖాలతో చుట్టూ వున్న పోలీసు అధికారులు, నాయకులు షాక్ లోంచి తేరుకుని, పల్చబడుతున్న పొగల మధ్య ఏం జరిగిందోనని ఆత్రుతగా పరుగెత్తారు. అక్కడ…!
రాజీవ్‌గాంధీ వుండాల్సిన చోట ఆయనగానీ, ఆయన్ని చుట్టుముట్టి వుండాల్సిన కార్యకర్తలు, పోలీసులు గానీ… ఎవ్వరూ లేరు. మంటలు, బూడిద, అటూ ఇటూ విసిరేసినట్లు పడున్న మాంసం ముద్దలు, చిక్కటి రక్తపు మడుగులు తప్ప ఏమీ కనబడటం లేదు!
*****