అవును.. ఆమె జయించింది!

0
8

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]“జ[/dropcap]న్మనిచ్చిన తరువాత తొలిసారిగా తన బిడ్డ చూసిన చూపులకు ఆమె పులకరించిపోతుంది. అమాయకంగా, అబ్బురంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా ఆ కళ్ళు తననే చూడడం చూసి సంబరపడి పోతుంది! పొత్తిళ్ళలో పొదుగు కాచి నులివెచ్చని ఆలింగన ఆనందం అనుభవిస్తుంది. ఇది సర్వసాధారణంగా ప్రతీ తల్లికి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత లభించే అరుదైన అద్భుతమైన అనుభవం.. అనుభూతి!

కానీ.. ఇక్కడ అలా.. అలా జరగలేదు! పుట్టిన బిడ్డ అయోమయంగా చూసింది. చూపుల్ని తనవైపు త్రిప్పుకుందామనుకున్నా సాధ్యం కాలేదు. కాళ్ళూ చేతులలో సరియైన స్పందన లేదు. పొదుగుకున్న అమ్మ కౌగిలి అనుభూతి బిడ్డకు తెలియలేదు. బోసినవ్వుల మాట దేవుడెరుగు? ఆ బిడ్డ నవ్వలేదు..! ఏడ్వలేదు..! జీవచ్ఛవంగా ఉన్న ఆ బిడ్డను చూసి అమ్మ బావురుమంది! అయినా ఆమె ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు. ఆమె ఆత్మశౌర్యం సడలేదు. ఆ బిడ్డను సాధారణ స్థితికి తెచ్చుకొంది. ఎవ్వరూ నేర్పనన్న అక్షరాలు నేర్పించింది. పలికించింది.. ఇంకా.. ఇంకా మరెన్నో అద్భుతాలు చేయించింది. ఆ అమ్మ విజయగాథ.. నేటి.. ‘అవును… ఆమె జయించింది!’”.

అందంగా, అంతకన్నా.. కవితాత్మకంగా వార్తలను, వార్తా చిత్రాలను విశ్లేషించడంలో ఆమె అందవేసిన చేయి! పెద్ద అందగత్తె కాకపోయినా.. అందమైన, ఆహ్లాదకరమైన ఆహార్యంతో, అందుకు అనువైన అలంకరణతో ఆమె కనుల విందుగా టీవి తెరపై కనిపిస్తుంది. కమ్మగా సంఘటనలను వివరిస్తుంది కనుక ఆమె విశ్లేషించే వార్తాచిత్రం చూడాలనిపిస్తుంది.. వినాలనిపిస్తుంది! ఆ టీవీ ఛానెల్‌ను ఆ సమయంలో ఆమె కోసమే మేం ఇద్దరం క్రమం తప్పకుండా చూస్తుంటాం!

“చూడండి! ఎంత చక్కగా చెబుతోందో!” శ్రీమతి వ్యాఖ్యానించింది.

“చక్కగా చెప్పడమే కాదు.. చక్కని అలంకరణ.. భారతీయత, తెలుగుదనం సంప్రదాయం మూర్తీభవించిన ఆ మూర్తి ఆహ్లాదంగా అగుపిస్తోంది కదూ!” ఆ యాంకర్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.

“అవునండీ! చాలా బాగుంది. చక్కగా వార్తా చిత్రం వివరిస్తోంది!” శ్రీమతి టీవి స్క్రీన్‌పై దృష్టి కేంద్రీకరించింది!

యాంకర్ విశ్లేషణ కొనసాగిస్తూనే ఉంది.

“ఎవరో ఒక కవి అన్నట్లు.. ‘అమ్మంటే తొలి ఉషస్సు.. అమ్మంటే జన్మ జన్మల కనికరించిన తపస్సు.. అమ్మంటే.. ఒక పథ! జాతిజీవన నిర్దేశనం పథం!’ రోజులు గడిచిపోతున్నాయి.. వారాలు గడిచిపోతున్నాయి.. నెలలు గడిచిపోతున్నాయి.. సంవత్సరం గడిచిపోయింది. ఆ బిడ్డ ‘అమ్మా’ అని పిలవలేదు. ఆకలి అని చెప్పలేదు. పాలుపడితే నిర్లిప్తంగా త్రాగేవాడు. గోరుముద్దులు తినిపించాలంటే అష్టకష్టాలు పెట్టేవాడు. పిలిచే వయస్సు వచ్చినా పిలవలేదు. మాటలు చెప్పే కాలం వచ్చినా ఉలుకు లేదు.. పలుకు లేదు. ప్రతి స్పందన చూపలేదు. అయినా ఆ అమ్మ అధైర్యపడలేదు. కారణం తెలుసుకుంది. నివారణోపాయం ఆలోచించింది. ఆచరించింది. అతడిని ఎలా తీర్చిదిద్దిందో.. ఆ అమ్మ నోటితోనే విందాం!”

యాంకర్ టీవీ స్క్రీన్‌పై అదృశ్యమైంది. ఓ అమ్మ తెరమీదకు వచ్చేసింది.

“అందరికీ నమస్కారం! నేను ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. మరో మధ్యతరగతి భర్తకు భార్యనయ్యాను. ఇద్దరు అమ్మాయిల తరువాత బాబు పుట్టాడు. ఉలుకూ పలుకులేని వాడు వీడే.. అమ్మా అని పిలువలేని వాడు వీడే! ఇప్పుడు వీడి వయస్సు పదమూడు సంవత్సరాలు!”

టీవి కెమేరా ఆమెపైనా, ఆమె ఇంటిపైనా, భర్తపైనా, ఇద్దరు అమ్మాయిలపైనా, ఆ బాబుపైనా కేంద్రీకరించబడింది!

“ఆ బాబును చూస్తుంటే ఐదేళ్ళ పిల్లవాడిలా ఉన్నాడుకదండీ! ఎదిగీ ఎదగని శరీరంతో పిచ్చిపిచ్చి చూపులు చూస్తున్నాడు. రకరకాల చిత్రాతిచిత్రమైన చేష్టలను చేస్తున్నాడు. అర్థంకాని మాటలేవో అంటున్నాడు!” నిశితంగా చూచి శ్రీమతి అంది.

“అతడు బహుశా మానసిక వికలాంగుడై ఉంటాడు. శరీరంలో వైకల్యం లేదు కనుక వికలాంగుడు కాడు. దానిని వైద్య పరిభాషలో ఏమంటాడో చూద్దాం!”

ఆపాదమస్తకం తెరపై కనిపిస్తున్న పిల్లవాడిని చూచి తల్లి అంది!

“పదమూడేళ్ళ క్రితం పొత్తిళ్ళలో సన్నగా పీలగా, పొడవుగా, బలహీనంగా ఉన్న బాబునే చూచి గుండె బరువెక్కింది. వెక్కి వెక్కి ఏడ్చాను. పాలు త్రాగేవాడు కాదు. పిచ్చి చూపులు చూచేవాడు. మన మాటలకు, చేతలకు ఎటువంటి స్పందన చూపించేవాడు కాదు. జీవచ్ఛవంలా ఉన్నవాడిని కొందరు వదలించుకోమన్నారు. కొందరు అనాథ శరణాలయానికి ఇవ్వమన్నారు. ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకోమన్నారు. వీడు పుట్టనే లేదని అనుకోమన్నారు. అందుకు ససేమిరా.. మా వారు అంగీకరించలేదు. మా పిల్లలు ఒప్పుకోలేదు! పది నెలలు కష్టపడి మోసి, రక్త మాంసాలు పంచి కన్న దాన్ని వాడినెలా వదులుకుంటాను? అసాధారణమైన శిశువును సాధారణ మనిషిలా మార్చడానికి నిర్ణయించుకున్నాము!” క్షణం ఆగి మళ్ళీ చెప్పడం ప్రారంభించింది.

“పెద్దవాడయ్యాక బాగుంటాడేమోననుకున్నాను. కానీ వాడి అనారోగ్యం నాకు విషమ పరీక్షగా మారింది. వాడి ఒళ్ళంతా ముసలివాడిలా ముడతలు పడేది! ముఖం నల్లగా మారిపోయేది! రోజుకు ముప్పైసార్లయినా విరేచనాలయ్యేవి. వాడి ట్రీట్‌మెంట్ కోసం పెద్దగా వసతులు లేని మా చిన్న ఊరి నుండి పట్టణానికి వచ్చేశాం! మా వారు చిన్న వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరమ్మాయిలు ఇక్కడే కాలేజీలో చదువుతున్నారు!”

“డాక్టర్‌కు చూపించారా? డాక్టర్ గారేమన్నారు?” యాంకర్ ప్రశ్నించింది.

“మామూలు డాక్టర్లు మాకు తెలియదన్నారు. మానసిక వికలాంగ కేంద్రానికి వెళ్ళమన్నారు. చెన్నై పిల్లల ఆస్పత్రికి వెళ్తే.. ‘మెదడు పెరగలేదు. ఇతరత్రా అనారోగ్యమేమీ లేదని’ మందులు రాసిచ్చారు!”

“జబ్బు పేరేమైనా చెప్పారా?”

‘చెప్పారు. డాక్టర్లు ‘ఆటిజం’ అన్నారు. ఇదో వంశపారంపర్య అనారోగ్యమన్నారు. మాటలు రావన్నారు. ఇలాగే ఉంటాడన్నారు. ఇలాగే పెరిగి పెద్దవాడౌతాడన్నారు. ఇలాగే అసాధారణమైన అబ్బాయిలా కనులముందు తిరుగుతూనే ఉంటాడన్నారు”.

“మరి.. అప్పుడేం చేశారు?” యాంకర్ మరో ప్రశ్న వేసింది.

“బెంగుళూరులోని నిమ్‌హాన్స్ న్యూరో హాస్పటల్‌కు తీసుకువెళ్ళాం!”

“అక్కడేమని అన్నారు?”

“ఈ పిల్లవాడికి మానసిక ఎదుగుదల నెమ్మదిగా వస్తుంది. సాధన వలన మాత్రమే ఈ బాబు సరియైన మనిషిగా మారగలడు. అందుకోసం ప్రత్యేకమైన స్కూళ్ళున్నాయి. అందులో చేర్పించండి! వారు శ్రద్ధగా చూస్తారని సలహా ఇచ్చారు!”

“మరి.. అటువంటి స్కూల్లో చేర్పించారా?” యాంకర్ గొంతులో ఉత్సుకత తొంగిచూచింది.

“అంత ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత మాకు లేదు. అలాగని వీడిని వదిలిపెట్టలేము. చిన్న వ్యాపారంలో ఇల్లు నెట్టుకొస్తున్నాము. ఇల్లు గడవడానికి, ఇద్దరు పిల్లలు చదువుకే చాలీచాలని ఆర్థిక వనరులున్నాయి. అందుకనే వీడిని మనిషిగా తీర్చిదిద్దే బాధ్యత వీడి అమ్మే తీసుకొంది!” టీవీ స్క్రీన్ మీద పిల్లవాడి తండ్రి కనిపించాడు.

“మేమిద్దరం కూడా అమ్మకు సలహా ఇచ్చాం! వీడిని ఏదైనా స్కూల్లో చేర్పించమనీ.. ఏదైనా ఆశ్రమంలో చేర్పించి సాధన చేయించమనీ! నేనే వాడికి అక్షరాలు నేర్పిస్తానంది, మాటలు మాట్లాడిస్తానంది! అమ్మా అని.. నాన్నా అని.. అక్కా అని.. పిలిపిస్తానంది. ఎంతైనా అమ్మ కదా!?” ఇద్దరు అక్కలు స్క్రీన్‌పై కనిపించారు.

“ఇంతకూ.. ఆటిజం అంటే ఏమిటండీ?” శ్రీమతి అడిగింది.

“చూస్తూండు! ఆ వ్యాధి గురించి వివరించడానికి ఓ డాక్టర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తాడు. ఆ డాక్టర్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆయనే చెబుతాడు ‘ఆటిజం’ అంటే ఏమిటో?”

నేను అంటుండగానే టీవీ స్క్రీన్‌పై సీన్ మారిపోయింది.

ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ కాంపౌండ్ కనిపించింది. కిక్కిరిసిన పేషంట్ల మధ్య నుండి దారి చేసుకుంటూ టీవి కెమేరా ఓ ప్రఖ్యాత వైద్యుని కలుసుకొంది.

“ఆటిజం ఒక అనువంశిక అనారోగ్యమమ్మా! పేషంట్ పైకి బాగా ఉంటాడు. అవయవ లోపాలేవీ కనిపించవు. కానీ మానసికమైన ఎదుగుదల ఉండదు. వారిని పేరు పెట్టి పిలిచినా బదులు పలుకరు. మాట్లాడలేరు. ఆకలి వేసినా ఆహారం కావాలని అడగరు. వారి ఆకలి గ్రహించి సమయానికి అన్నం పెడితే తింటారు. వారికి ఏం కావాలో తెలియదు! ఏదీ కావాలని అడగరు. మునివేళ్ళపై విచిత్రంగా నడుస్తుంటారు. వింతగా ప్రవర్తిస్తుంటారు. కావాలంటే ఆ బాబు అమ్మనే అడిగి చూడండి!”

“ఇది నిజమా.. అమ్మా!” యాంకర్‌కు కూడా ఆ అమ్మను “అమ్మా!” అని పిలవాలనిపించినట్లుంది.

“అవునమ్మా! అంతా డాక్టర్ గారు చెప్పినట్లే చేసేవాడు. ఇద్దరక్కయ్యలు వాడికి ఆకలి తెలుసుకొని పాలు పట్టేవారు. ఫారెక్స్ పెట్టేవారు. గంట గంటకూ డైపర్లు మార్చేవారు. శుభ్రంగా తుడిచేవారు. పౌడర్ వేసేవారు. డ్రస్సు మార్చేవారు. వాడు పెద్దగా ఏడ్చేవాడు కాడు. బాధ తెలిసేది కాదు. స్పర్శ జ్ఞానానికి సరియైన స్పందన చూపించే వాడు కాదు. వాళ్ళు స్కూల్‌కు వెళ్ళిన తరువాత వాడి బాధ్యత తీసుకునే దాన్ని!” వాళ్ళకు తెలియకుండానే హృదయాలు బరువెక్కిపోయాయి.

మళ్ళీ స్క్రీన్ మీదకు యాంకర్ వచ్చేసింది. “‘అమ్మా’ అని పిలువలేని ఆ బాబు కధనంలో చిన్న విరామం!” అంది.

“ఆటిజం ఎలా వస్తుందండీ? ఎందుకు వస్తుంది? ఆ వ్యాధికి కారణాలేమైనా వివరిస్తారా?” శ్రీమతి మరో ధర్మ సందేహాన్ని నా ముందుంచింది.

“చూస్తుండు! మరో డాక్టర్ ఆ వ్యాధి లక్షణాలు వివరిస్తారు!” నేను భరోసా ఇచ్చాను. ఇంతలో మరో డాక్టర్ ఛాంబర్‌లో ఆటిజం వ్యాధి లక్షణాల విశ్లేషణ ప్రసారం ప్రారంభమైంది.

“పిల్లల మెదడు పెరుగుదల సమయంలో పలు రకాల మార్పులు ఆటిజానికి కారణాలని పరిశోధకులు చెబుతున్నారు. పుట్టినప్పుడు వారి తల చాలా చిన్నదిగా ఉంటుంది. ఆరు నుండి పదునాలుగు నెలల సమయంలో పెద్దదిగా మారుతుంది. జన్యువులలో జరిగే మార్పుల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఒక్క జన్యువులో కాక అనేక జన్యువులలో జరిగే మార్పులు ఈ వ్యాధిని కలిగిస్తాయి. ఇది గర్భస్థ శిశువు దశలోనే జరుగుతుందని నిపుణులు అంటున్నారు!” డాక్టర్ వివరిస్తున్నారు.

“ఈ వ్యాధి ఎంత మందిలో కనిపిస్తుంది డాక్టర్?” యాంకర్ ప్రశ్నించింది.

“అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో ప్రతీ ఎనభై మందిలో ఒకరికి ఈ వ్యాధి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు అరవై ఏడు మిలియన్ల మంది పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలే ఎక్కువ!”

డాక్టర్ కొద్దిగా విరామమిచ్చారు.

“దీనికి గర్భధారణ సమయంలో తల్లుల అలవాట్ల ప్రభావం కారణ మంటుందని అనవచ్చా?” యాంకర్ ప్రశ్నించింది.

“కావచ్చమ్మా! గర్భధారణ సమయంలో మాదకద్రవ్యాలు వాడినా, సిగరెట్, గుట్కాలు తీసుకున్నా వాని ప్రభావం పిల్లల పెరుగుదలపై పడుతుంది. వానివలన వ్యాధి అంకురించే ప్రమాదముందని శాస్త్రవేత్తలు అంటారు!”

“అందుకు నిదర్శనమేదైనా ఉందంటారా?” యాంకర్ మళ్ళీ ప్రశ్నించింది.

“ఉందమ్మా! అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల స్త్రీల జీవన విధానాలు వారి గర్భస్థ శిశువులపై ప్రభావం చూపుతున్నాయి. అందుకనే ఆ దేశాలలోనే ఎక్కువగా ఆటిజం కేసులు కనిపిస్తున్నాయి” అంటూ కారణాలు వివరించారు.

“దీనికి ట్రీట్‌మెంట్ ఏదైనా ఉందా డాక్టర్?”

“ఉందమ్మా! ‘బిహేవిరియరల్ ట్రీట్‌మెంట్’ అనబడే ప్రవర్తనా పరమైనా చికిత్సను సకాలంలో అందిస్తే.. ప్రారంభిస్తే.. ఆ వ్యాధి లక్షణాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ‘స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ’ వంటి పద్ధతులలో చికిత్స అందిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అప్పుడు సాధారణ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి. మామూలు మనిషిగా మారే అవకాశముంటుంది!”

డాక్టర్ ట్రీట్‌మెంట్ విధానాలు వివరించారు. మళ్ళీ దృశ్యం మారిపోయింది!

“ఇటువంటి దుర్భరమైన నమ్మశక్యం కాని ఆటిజం వ్యాధి నుండి బాబును ఎలా రక్షించగలిగారమ్మా? ఎలా మామూలు మనిషిని చేశారు?” ఆత్రంగా యాంకర్ అడిగింది.

“అందుకే స్పీచ్ థెరపీ మొదలు పెట్టాను. చిన్న చిన్న పదాలు పదే పదే చెబుతుంటే వాడు అనడానికి ప్రయత్నించేవాడు. ‘అమ్మా!’ అనే పదం కనీసం కోటిసార్లయినా చెప్పి ఉంటాను. వచ్చీ రానీ పాటలూ, పద్యాలు పదే పదే వాడి చేత అదే పనిగా పాడించేదాన్ని! వాడిని స్కూలుకు పంపించడానికి ఎంతో ప్రయత్నం చేశాను!” అని తల్లి అంటుంటే తండ్రి వెంటనే కలిగించుకున్నారు.

“ఒక్క స్కూల్లో మాత్రం ఓ టీచర్ వాడికి నేర్పించడానికి ముందు వచ్చింది. బస్‌లో వాడితో పాటు వెళ్ళి స్కూలు అయ్యేంత వరకూ అక్కడే ఉండి వాడిని ఇంటికి తీసుకువచ్చేది! ఆ సమయంలో ఇద్దరు ఆడపిల్లలే ఇంటి వ్యవహారాలు చూచేవారు” తండ్రి ఇద్దరు కూతుళ్ళకు కాంప్లిమెంట్ ఇచ్చాడు.

“అవునాంటీ! ఆ టీచర్ వెళ్ళిపోయింది. ఆ స్కూలు వాళ్ళు వీడిని రానివ్వలేదు. మిగిలిన వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుందని వీడిని స్కూలు గడప తొక్కనివ్వలేదు” ఓ అక్క అన్నది.

“మరేం చేశారు?” యాంకర్ ప్రశ్నించింది.

“ఏముందీ! అమ్మే టీచర్ అవతారం ఎత్తింది! అక్షరాలు పలికించింది. చిన్న చిన్న పదాలు చెప్పిందింది. మాటలు నేర్పించింది. గట్టిగా అరచి అరచి అమ్మ గొంతు కూడా బొంగురుపోయింది. డాక్టర్లు గొంతుకు విశ్రాంతి నివ్వమన్నారు. లేదంటే స్వర పేటికకు ఆపరేషన్ అవసరమౌతుందన్నారు”. రెండవ అక్క సమస్య వివరించింది.

“మరి.. పిల్లవాడికి మాటలు ఎలా నేర్పించారు?”

“అలాగే.. మూగ బాసలతోనే వాడికి మాటలు నేర్పించింది. ఫోన్ రింగ్ టోన్లను బట్టి పెదవులు కదిలించడం అలవాటు చేసింది. ఆ రిథమ్‌ను బట్టి మాటలు కూడబలుక్కోవడం నేర్పి ఆమె కష్టాలను అధిగమింపచేసింది!” పిల్లవాడి తండ్రి వాడి అమ్మ వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు.

“అవునమ్మా! పెదవుల కదలికను బట్టి పదాలు చెప్పేవాడు. అలా వాడికి భాషను పరిచయం చేశాను. ఇప్పుడు ఎవరు దూరంగా మాట్లాడుకుంటున్నా వారి పెదవుల కదలికను బట్టి మాటలు చెప్పగలుగుతాడు. రింగ్ టోన్స్ బట్టి పాట హమ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ సమయంలోనే డాక్టర్ ఇచ్చిన మరో అమూల్యమైన సలహా వాడిని మామూలు మనిషిలా తీర్చిదిద్దింది!” అమ్మ ఆనందంగా అంది.

“ఇదెలా సాధ్యమైందండీ?” అని శ్రీమతి అనేలోపు డాక్టర్ స్క్రీన్ పైకి వచ్చారు.

“ఆటిజం పీడిత పిల్లల్లో కొందరు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉంటారని వైద్య నిపుణులు అంటున్నారు. వానికి ఆధారాలు కూడా చూపుతున్నారు. ఆ నైపుణ్యాన్ని గనుక తల్లిదండ్రులు గమనించి వారిని సంబంధిత విషయంలో ప్రోత్సహిస్తే.. మంచి తర్ఫీదు ఇస్తే అద్భుతమైన ఫలితముంటుంది. ముఖ్యంగా లలితకళలలో ప్రవేశమున్న వారి ఇంట్లో జరిగే సాధన చూచి వీరు ప్రభావితమౌతారు. సాధారణ సాధకులకంటే మరింత ప్రతిభావంతులౌతారు. అంతకంటే ఉన్నత స్థాయికి చేరుకుంటారు!”

“నిజమే అయి ఉంటుందండీ?”.. అమాయకంగా శ్రీమతి అడిగితే.. నేను జవాబు చెప్పకుండా ఉండలేకపోయాను.

“చూస్తూండు! డాక్టర్ గారి విశ్లేషణ పూర్తి కాలేదు”

“సాధ్యమే అవుతుంది! ఒక వైకల్యం కలిగి యున్నవారు మరో నైపుణ్యం కలిగి ఉంటారు. ఒక అంధుడు తన చేతి స్పర్శతోనే వినికిడితోనే ఎన్నో పనులు చేయగలుగుతాడు. ఎన్నింటినో గుర్తించగలుగుతాడు. సాధారణ మానవులకంటే రెట్టింపు నైపుణ్యత కళ్ళు లేని వాళ్ళు కలిగి ఉంటారనేది మనమెరిగిన విషయమే! అది ప్రకృతి వారికిచ్చిన వరం! అటువంటి నైపుణ్యత మానసిక వికలాంగులలో కూడా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి!” డాక్టర్ విశ్లేషణ పూర్తి చేశారు.

“అటువంటి ప్రత్యేక నైపుణ్యమేదైనా మీ బాబులో కనిపించిందా?” మళ్ళీ అమ్మను అడుగుతున్న యాంకర్ తెరపైకి వచ్చేసింది.

“కనిపించిందమ్మా! సెల్ ఫోన్‌లో ఎన్నో రింగ్ టోన్లుండేవి. వాటిని విని వీడు కూనిరాగం తీసేవాడు. వాడికీ పాటను నేర్పిస్తే మంచి ఫలితముంటుందనిపించింది. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తగాన రసః’ ఇంట్లో ఇద్దరు పాపలూ సంగీతం నేర్చుకుంటున్నారు. అది విని కూనిరాగాలను పెద్దగా పాడమని ప్రోత్సహించేదాన్ని! వాడు నెమ్మదిగా పాడడం ప్రారంభించాడు. ఇద్దరూ శాస్త్రీయం, లలితగీతాలు పాడుతుంటారు..” అని అమ్మ చెప్పేలోపే యాంకర్ అడ్డుకొంది.

“అలా అయితే.. మా కోసం.. మా ప్రేక్షకుల కోసం ఏమైనా పాడించరూ?” టీవి కెమేరా అక్కల ముఖాలపై ఫోకస్ చేయబడింది.

“మంచిపాట పాడుతారా?”

“తప్పకుండా పాడతాం” ఇద్దరూ గొంతు సవరించుకున్నారు.

“ఏ పాట పాడతారు?” యాంకర్ అడిగింది.

“మీరే చెప్పండి.. ఏ పాట పాడమంటారో..”

“ఏదైనా అమ్మమీద పాటపాడండి!”

“పెదవే పలికే మాటల్లోన తీయనిమాటే అమ్మ

కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మా!”

అమ్మ అంటే అద్భుతమైన నిర్వచినమిచ్చిన ఆ పాటలో రెండు నిమిషాలు అందరూ సర్వం మరచిపోయాం!

మళ్ళీ యాంకర్ మాటలతోనే ఈ లోకంలోకి వచ్చేశాము.

“మమ్మల్ని మేము మరచిపోయేలా చేశారుగదా! మిమ్మల్ని మేము మరచిపోలేముగా! బాబు మరచిపోకుండా ఎలా ఉంటాడు? బహుశః తదాత్మ్యం లోంచే అతడు కూడా ఇలాంటి సంగీతం నేర్చుకుని ఉంటాడు. ఇప్పుడు చెప్పండమ్మా! అక్కల సంగీత సాధనలో బాబు ఎలా ప్రభావితమయ్యాడో!”

“వీళ్ళు పాడుతుంటే.. వీడు ఆలాపన ప్రారంభించేవాడు. క్రమంగా పల్లవి పాడేవాడు. తరువాత చరణాలు పాడడం మొదలు పెట్టాడు. అలా ఇలా ఏడేళ్ళ వయస్సులో వందపాటలు పాడి స్టార్ ప్రెయిజ్ తెచ్చుకున్నాడు”. అమ్మ ఆనందంగా అంటుంటే.. తండ్రి కూడా తన సంతోషం ప్రదర్శించాడు.

“అంతే.. కాదండీ! ఇప్పుడు నాలుగు వందల పాటలు పాడగలుగుతాడు. ఇదీ వాడు తెచ్చుకున్న ప్రైజ్‌లు” తండ్రి ప్రైజులను ప్రదర్శించాడు.

ఒక్కొక్క ప్రైజ్ క్లోజప్‌లో చూపించబడుతోంది. చక్కని నవ్వు నవ్వగలిగే ‘జాయ్ ఆఫ్ స్ఫౌట్స్’ ప్రైజ్ మొదటిది. వందపాటలు పాడిన స్టార్ ఫ్రైజ్ రెండవది. బాలోత్సవ్ ప్రత్యేక అతిథి సర్టిఫికేట్ మూడవది! ‘మదర్స్ డే’ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ వారిచ్చిన జ్ఞాపిక నాల్గవది!

ఆ కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత సంతోషం.. పసిఫిక్ మహాసముద్రం ఈదినంత ఆనందం కనబడుతోంది!

“ఇప్పుడైనా వాడిని స్కూల్లో చేర్చుకుంటారా?” శ్రీమతి సందేహం వ్యక్తం చేసింది.

“చూడవోయ్! అదే ప్రశ్న యాంకర్ కూడా అడుగుతోంది!” ఇద్దరం టీవీ తెరపై దృష్టి కేంద్రీకరించాం!

“ఇప్పుడు ఎన్నో ఇంటర్‌నేషనల్ స్కూళ్ళు మా వాడిని చేర్చుకుంటామని ముందుకు వస్తున్నాయి. ఆ రోజు రావద్దన్న వారే, గుమ్మం తొక్కనివ్వని వారే ఈ రోజు రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఎక్కడ చేరాలన్నది వీడి ఇష్టానికే వదలి వేశాం!”

ఆదిగురువైన అమ్మ ఆనందంగా అక్కున చేర్చుకుంది. “బాబూ! మా కోసం ఒక్క పాట పాడవూ!” యాంకర్ ఆఖరి ప్రశ్న వేసింది.

ఆ ఆటిజం అబ్బాయి గొంతు సవరించుకున్నాడు.

“ఎవరు రాయగలరు.. అమ్మా అను మాటకన్నా కమ్మని కావ్యం

ఎవరు పాడగలరు.. అమ్మా అనురాగం కన్నా కమ్మని రాగం

అమ్మేగా.. ఆదిగురువు.. నేర్చుకున్న భాషకి..

అమ్మేగా.. ఆదిస్వరం.. ప్రాణమనే పాటకి!”

“అబ్బ! ఎంత బాగా పాడుతున్నాడో!” శ్రీమతి తన్మయత్యంలోకి వెళ్ళిపోయింది.

ఆ దృశ్యం టీవీ తెరపై కనుమరుగైపోయింది. ఆ పాట వినిపించడం ఆగిపోయింది! ఇంకా ఆ దృశ్యం కనుల ముందు కదలాడుతూనే ఉంది. ఆ పాట చెవులలో మారుమ్రోగుతూనే ఉంది.

అది.. అది.. సజీవ వార్తా చిత్రం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here