అన్వేషణ

0
13

[జి.ఎస్.ఎస్. కళ్యాణి గారు రచించిన ‘అన్వేషణ’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]దివారం. తెల్లవారుఝామున సమయం మూడు గంటలయ్యింది. ఆఫీసులకు, కాలేజీలకు, పాఠశాలలకు ఆ రోజు సెలవు కావడంవల్లనో ఏమో నగరంలో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు – ఒక్క ప్రశాంత్ తప్ప!

ప్రశాంత్ తన ఆఫీసు లాప్‌టాప్‌లో తల దూర్చేసి విపరీతమైన పనిలో మునిగి ఉన్నాడు. అంతలో తనకు ఆఫీసువాళ్ళు ఇచ్చిన ఫోను మోగటంతో ‘అబ్బా!’ అనుకుంటూ ఫోను ఎత్తాడు ప్రశాంత్.

“హలో ప్రశాంత్..! లేటెస్ట్ స్టేటస్ ఏమిటీ?”, ఫోన్‌లో అడిగాడు ప్రశాంత్ బాస్ మధు.

“నాకొచ్చిన ఫైల్స్‌లో సగం ప్రాసెస్ చేశాను సర్. ఇంకా ఒక నలభై ఉండచ్చు”, చెప్పాడు ప్రశాంత్.

“ఏంటి ప్రశాంత్? ఇంత నెమ్మదిగా చేస్తే ఎలా? అవతల కస్టమర్స్ గొడవ పెట్టేస్తారు”, చిరాగ్గా అన్నాడు మధు.

“ఏం చెయ్యమంటారు సర్. రాత్రంతా నిద్ర కూడా మానుకుని మరీ ఫైల్స్ ప్రాసెస్ చేస్తూనే ఉన్నాను. వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉంది!”, అన్నాడు ప్రశాంత్.

“నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మధ్యాహ్నానికల్లా అన్ని ఫైల్స్ ప్రాసెస్ చేసి నా ఈమెయిల్‌కు పంపించాలి. అర్ధమయిందా?”, కోపంగా అన్నాడు మధు.

“సరే సర్!”, అన్నాడు ప్రశాంత్ కొంచెం భయంగా. మధు ఫోన్ కాల్ అవ్వకమునుపే ప్రశాంత్ ఆఫీస్ మొబైల్ లోని రెండో సిమ్‌కి ఇంకో కాల్ వస్తూ ఉంది.

“హలో!”, అన్నాడు ప్రశాంత్.

“ప్రశాంత్! నేను సెంట్రల్ ఆఫీస్ నుండీ అజయ్ మాట్లాడుతున్నాను. నీ ఎం.ఐ.స్. కోసం మేము రెండు గంటలనుంచీ వెయిటింగ్. అసలు నీకు పంపే ఉద్దేశం ఉందా?” అడిగాడు అజయ్.

“పంపుతాను సర్. లోన్ ఫైల్స్ చాలా వచ్చాయి. అవి ప్రాసెస్ చేస్తున్నా”, అన్నాడు ప్రశాంత్.

“అంటే మా పని నీకు అస్సలు విలువ లేదన్నమాట”, కటువుగా అన్నాడు అజయ్.

“అదేం కాదు సర్. మీ పని కూడా ముఖ్యమే. రెండు పనులు ఒకేసారి ఎలా చెయ్యను సర్?”, దీనంగా అడిగాడు ప్రశాంత్.

“ఎక్కడినుండి వస్తారయ్యా మీలాంటివాళ్ళు? చేతకాకపోతే వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కదా? ఇంతింత జీతాలిచ్చేది పని చెయ్యడానికే! పదింటిలోపు నాకు వివరాలివ్వకపోతే నీ విషయం ఎస్కలేట్ చెయ్యాల్సొస్తుంది”, అని ఫోన్ పెట్టేసాడు అజయ్.

ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో పడ్డాడు ప్రశాంత్.

ప్రశాంత్ చాలా పెద్ద పేరున్న కంపెనీలో లోన్ ప్రాసెసింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. తనకు ఆ ఉద్యోగం వచ్చినప్పుడు తన చదువుకు, ప్రతిభకు తగ్గ ఉద్యోగం వచ్చిందని ఎంతో ఆనంద పడ్డాడు ప్రశాంత్. కానీ పోను పోను కంపెనీలో పరిస్థితులు మారిపోయాయి. ఆ కంపెనీ ఉన్న రంగంలో ఎన్నో కొత్త కంపెనీలు రావడంతో వాటి మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఆ ప్రభావం ఆ కంపెనీ ఉద్యోగులపైన పడింది. గత మూడేళ్లలో ప్రశాంత్ జీవితంలో మానసిక ప్రశాంతత పూర్తిగా కనుమరుగైపోయింది! తనకు వచ్చే జీతం లక్షల్లో ఉన్నప్పటికీ ప్రశాంత్‌కు సుఖం అన్నదే లేకుండా పోయింది. ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఒకేలాంటి పని ఒత్తిడిని ఎదుర్కునే వాడు ప్రశాంత్. ఆ కారణంగా వేళకు తినడం వేళకు పడుకోవడం వంటివి ఎప్పుడో మర్చిపోయాడు తను. తనకు ముప్పయేళ్లు దాటినా వివాహం గురించి ఆలోచించే తీరిక లేక ప్రశాంత్ ఒంటరిగా ఉండిపోయాడు. ఎప్పుడైనా ఆనందంగా గడుపుతున్న కుటుంబం ఎదురుపడితే మాత్రం ‘నా జీవితం ఈ కంపెనీకి అంకితం!’ అని సమాధాన పడిపోతూ ఉండేవాడు ప్రశాంత్.

రెండు నెలల క్రితం ప్రశాంత్ పని చేసే కంపెనీ యాజమాన్యంలో ఏవో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటినుండీ ప్రశాంత్ పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది. తన పనితనం పై ఉన్నతాధికారుల అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ఆదివారం, సెలవు రోజువంటివి తనకు మచ్చుకైనా కనపడకుండా పోయాయి. ఒక్కొక్కప్పుడు తన జీవితంలో ఉత్సాహం లోపించిందని గుర్తుకువచ్చి నిరాశలో కూరుకునిపోయి, ‘ఛ! నేనీ ఉద్యోగం వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతే నయం. కాస్తైనా ప్రశాంతత దొరుకుతుంది!’, అని అనుకుంటూ ఉండేవాడు ప్రశాంత్.

ఆ రోజు అజయ్‌తో ఫోను మాట్లాడిన తర్వాత అటువంటి నిరాశే ఎదురయ్యింది ప్రశాంత్‌కి. ఏం చెయ్యాలో తెలియక సోఫాలో వెనక్కి వాలి ఆలోచిస్తున్నంతలో ప్రశాంత్ ఆఫీస్ ఈమెయిల్‌కి ఒక ఎన్.ఆర్.ఐ. కస్టమర్ కంప్లైంట్ వచ్చింది. కంగారుగా ఈమెయిల్ తెరిచి చూశాడు ప్రశాంత్. అందులో కస్టమర్ తన ఫైలును లేటుగా ప్రాసెస్ చేసినందుకు ప్రశాంత్‌ను పిచ్చి పిచ్చిగా తిడుతూ అందుకు సరైన వివరణ ఇవ్వకపోతే లీగల్‌గా వెళ్ళవలసి వస్తుందని బెదిరించాడు. ప్రశాంత్‌కి చెమటలు పట్టాయి. రాత్రంతా కష్టపడి పనిచేసిన తరువాత తన పై అధికారులు చూపిన అసంతృప్తి, కస్టమర్ పంపిన ఘాటైన ఈమెయిల్ ప్రశాంత్ మనసును కలచివేశాయి. సరైన ఆహారం, కంటి నిండా నిద్ర లేక ప్రశాంత్ ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. కళ్ళు ఎర్రబడి నీళ్లు కారడం మొదలుపెట్టాయి. నీరసం, నిస్సత్తువ అతడిని ఆవరించాయి.

‘ఇక లాభం లేదు!’, అని అనుకుంటూ ప్రశాంత్ కొద్ది నెలల క్రితం తన లాప్‌టాప్‌లో రాసి పెట్టుకున్న రాజీనామా పత్రం (రెసిగ్నిషన్ లెటర్) తీసి, దానిపై ఆ రోజు డేట్ వేసి తన మేనేజర్‌కు ఈమెయిల్‌లో పంపించేసి, గబగబా సూట్ కేసులో నాలుగు జతల బట్టలు సద్దుకుని ఫ్లైట్‌లు, రైళ్లు, బస్సులు మారుతూ హిమాలయ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ఊరికి చేరుకున్నాడు. అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు శంభు ఇంటికి వెళ్ళాడు ప్రశాంత్. అనుకోకుండా వచ్చిన స్నేహితుడిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి, భోజనం పెట్టి, పడుకోవడానికి చోటిచ్చాడు శంభు. ప్రయాణ బడలికతో పడుకున్న ప్రశాంత్‌కు ఎంతకీ నిద్ర పట్టలేదు. అనుకున్న పనినే చేస్తున్నా తన మనసులో ఏదో అసంతృప్తి. ఎందుకా అని కాసేపు ఆలోచించాక అసలు విషయం తట్టింది ప్రశాంత్‌కు. తను ఎన్నో సంవత్సరాలుగా ఫోన్లు, కంప్యూటర్లవంటి ఆధునిక పరికరాలకు బానిసైపోయాడు. అలాంటిది ఆ రోజు పొద్దున్న లాప్‌టాప్‌ను మూసిన తరువాత ఇప్పటివరకు కనీసం జేబులో ఉన్న తన సొంత ఫోనును కూడా చూడలేదు ప్రశాంత్!

‘ఏంటో! ఆ భయంకరమైన పని ఒత్తిడిలో అసలు నన్ను నేను మర్చిపోయినట్టున్నాను!’, అని నిట్టూరుస్తూ ప్రశాంత్ తన జేబులోని ఫోన్ తీసి మెసేజీలు చూసుకున్నాడు. అది ప్రశాంత్ సొంత మొబైల్ ఫోనే అయినప్పటికీ దానికి ఆఫీస్ మెసేజీలే ఎక్కువగా వచ్చేవి. ఆ రోజు మాత్రం ఒక్కటీ రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యబుద్ధి కాలేదు ప్రశాంత్‌కి. తన ఫోన్‌లో ఇంకా ఏదో చూడాలనే ఆత్రం.

‘ఏం చూడనూ? అసలు నా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుని చాలా కాలమైంది. కాసేపు వార్తలు చూద్దాం’, అని అనుకుని ప్రశాంత్ ఒక ప్రముఖ వార్తా పత్రిక వెబ్ సైట్ తెరిచి వార్తలు చదవడం మొదలుపెట్టాడు.

ఆ పత్రికలో ప్రముఖంగా ప్రచురించిన వార్తలన్నీ లోకంలో జరుగుతున్న అరాచకాలూ, నేరాలూ, ఘోరాలూ, అత్యాచారాలూ, హత్యలూ, అంతుపట్టని రోగాల గురించే ఉండటం చూసి, ‘అయ్యబాబోయ్..! అసలీ ప్రపంచంలో ఏం జరుగుతోంది??!’, అని ఆలోచిస్తూ పడుకునే ప్రయత్నం చేశాడు ప్రశాంత్.

ఎంతకీ ప్రశాంత్‌కు నిద్రపట్టలేదుకానీ కాసేపటి తర్వాత సూర్యోదయమైపోయింది.

‘ఇక నిద్ర పట్టదు!’, అని అనుకుంటూ లేచి గది బయటకు వచ్చిన ప్రశాంత్‌కి తనుంటున్న భవంతి పక్కనే తెల్లటి మంచుతో కప్పబడి ఉన్న ఒక పెద్ద పర్వతం కనబడింది. ఆ పర్వతం కొనపైన సూర్య కిరణాలు పడుతూ ఉండటంవల్ల అది బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. అత్యద్భుతంగా ఉన్న ఆ పర్వత సౌందర్యాన్ని చూసి ఒక్క క్షణం అలాగే ఉండిపోయాడు ప్రశాంత్.

‘నాకు కావలసిన ప్రశాంతత ఈ పర్వతంలోనే దాగి ఉన్నట్టుంది!’, అనుకున్నాడు ప్రశాంత్.

అనుకున్నదే తడవుగా ప్రశాంత్ తను అత్యంత ఇష్టపడే పర్వతారోహణకు కావలసినవన్నీ తీసుకుని ఆ పర్వతం ఎక్కడం మొదలుపెట్టాడు. పర్వతమంతా మంచు పేరుకునిపోయి ఉంది. అందుకనేనేమో ఎవ్వరూ ఆ పర్వతాన్ని ఎక్కే సాహసం చెయ్యడం లేదు. చాలా కాలం తరువాత తనకిష్టమైన పని చేస్తూ ఉండటంతో వాతావరణాన్ని లెక్క చెయ్యకుండా ముందుకు సాగిపోయాడు ప్రశాంత్. కొద్ది దూరం వెళ్ళాక విపరీతమైన చల్ల గాలి వీచి మంచు కురవడం మొదలయ్యింది. అది మెల్లిగా మంచు తుఫానుగా మారింది. ప్రశాంత్‌కు ఎంత ప్రయత్నించినా పట్టు దొరక్క కిందకు జారడం ప్రారంభించాడు. ముందు రోజు ప్రయాణ బడలికవల్లనో లేక రాత్రి సరిగ్గా నిద్ర పోకపోవడంవల్లో బాగా అలిసిపోయి ఉన్న ప్రశాంత్‌కు స్పృహ తప్పుతున్నట్లు అనిపించింది.

‘ఇక నా పని అయిపోయింది. భగవంతుడా నువ్వే దిక్కు!’, అనుకున్నాడు ప్రశాంత్.

“ఇదిగో బాబూ! ఈ తాడు పట్టుకుని ఇటు రా!”, అని ఎవరో తనను పిలవడం వినబడి ఆశ్చర్యపోయి ఆ పిలుపు వినపడిన వైపుకు చూశాడు ప్రశాంత్.

అక్కడ తనకు కొద్ది దూరంలో, కొంచెం ఎత్తుగా గట్టులా ఉన్న ప్రాంతంలో ఒక బక్క పల్చటి వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడు సాధారణ దుస్తులు ధరించి ఉండటం చూసి మరింత ఆశ్చర్యపోయాడు ప్రశాంత్.

ఆ వ్యక్తి అందించిన తాడు పట్టుకుని కొంచెం కష్టపడి అతని వద్దకు చేరుకున్న ప్రశాంత్, “మీరెవరో కానీ సమయానికి నన్ను ఆదుకుని రక్షించారు. చాలా థాంక్స్!”, అన్నాడు ఆయాసపడుతూ.

“సరే. నాతో రా!”, అంటూ ఆ వ్యక్తి చకచకా ఒక సన్నటి దారిలో నడవటం ప్రారంభించాడు.

ప్రశాంత్ అతని వెనుక మంచులో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెడుతూ, ‘అసలు ఇతను ఎవరై ఉంటాడో? ఇంతటి చలిలో మామూలు బట్టలు ఎలా వేసుకున్నాడు? నా తెలుగు భాష కూడా చక్కగా మాట్లాడగలుగుతున్నాడే!’, అనుకున్నాడు.

ఆ వ్యక్తి ప్రశాంత్‌ను ఆ పర్వతంలోని ఒక గుహలోకి తీసుకుని వెళ్ళాడు. గుహంతా చీకటిగా ఉన్నప్పటికీ ఒక చిన్న దీపం మిణుకుమిణుకుమని వెలుగుతోంది.

“ఇప్పుడు చెప్పు బాబూ! ఎవ్వరూ ఎక్కడానికి సాహసించని ఈ పర్వతం నువ్వెందుకు ఎక్కుతున్నావ్?”, అడిగాడా వ్యక్తి.

“ఆ.. అదీ.. నా మనసుకు ప్రశాంతత కరువైపోయింది. దాన్ని వెతుక్కుంటూ ఇలా బయలుదేరా”, ఉన్న విషయం చెప్పాడు ప్రశాంత్.

ఆ మాట వింటూనే, “ప్రశాంతత కోసమా నీ అన్వేషణా??”, అంటూ ఆ వ్యక్తి పగలబడి నవ్వాడు.

“మీకిది హాస్యంగా అనిపించొచ్చు. కానీ నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు పడ్డ మానసిక వేదన ఇంతా అంతా కాదు!”, అని కొంచెం బాధగా అన్నాడు ప్రశాంత్.

“అయ్యో..! నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసుగా! కానీ నీకు కావలసిన ప్రశాంతతకు మార్గం తెలిస్తే.. అది నువ్వున్న చోటికే వస్తుంది. ప్రశాంతత కోసం నువ్వింత సాహసం చెయ్యనవసరంలేదు. అందుకే అలా నవ్వాను”, అన్నాడు ఆ వ్యక్తి.

“ఇంతకీ నేను మీ గురించి తెలుసుకోవచ్చా?”, వినయంగా అడిగాడు ప్రశాంత్.

“నన్నందరూ శివయ్య అంటారులే. నేను ఎన్నో ఏళ్లగా ఈ గుహలోనే ఉంటున్నాను. ఇప్పటికీ వివరాలు చాలు. ఇంతకీ నువ్వెప్పుడూ తిన్నావో ఏమో! ఇంద ఈ రొట్టె తిను!”, అన్నాడు శివయ్య.

విపరీతంగా అలిసిపోయి ఆకలితో ఉన్న ప్రశాంత్‌ కి ఆ రొట్టె రుచి చాలా నచ్చింది.

“స్వామీ! మీరు నా కళ్ళకెందుకో అన్నీ తెలిసినవారిలా కనపడుతున్నారు. ఇంతకీ, ప్రశాంతతకు మార్గం చెప్తారా?”, కాస్త కుతూహలంగా అడిగాడు ప్రశాంత్.

“ఏముందీ..?! కళ్ళు మూసుకుని కూర్చుని ఏకాగ్ర చిత్తంతో ఈశ్వరధ్యానం చెయ్యడమే!”, అన్నాడు శివయ్య.

“అదంత సులభమైన పని కాదు. అయినా, ఇప్పుడు ఇంట్లోనూ బయటా.. ఎటు చూసినా సమస్యలే! ఆ గందరగోళంలో ధ్యానం సాధ్యం కాదు”, అన్నాడు ప్రశాంత్.

శివయ్య చిన్నగా నవ్వి, “ఏమిటా గందరగోళం?”, అని అడిగాడు.

“మీరీ గుహలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నానన్నారుగా! మీకు ఇప్పటి పరిస్థితులేవీ తెలియకపోవచ్చు!” అన్నాడు ప్రశాంత్.

“నాకు తెలియకేం నాయనా! అయినా, అటువంటి స్థితికి కారణం ఒక విధంగా మనుషులే!” అన్నాడు శివయ్య.

ఆశ్చర్యపోయాడు ప్రశాంత్.

“మనుషులేం చేశారు స్వామీ? వాళ్ళు తమ విజ్ఞానంతో ఎంతో ప్రగతిని సాధించి, ఒకప్పుడు ఊహకి కూడా అందనివి ఎన్నో చేసి చూపించి అందరికీ మంచే చేస్తున్నారుగా?”, అన్నాడు ప్రశాంత్.

శివయ్య చిరునవ్వు నవ్వి, “విజ్ఞానం!! నిజమే! మనిషి ఎంతో సాధించాడు. ఏదో చేసేద్దాం అన్న తొందరలో తనకు తాను నష్టం కలిగించుకుంటూ, ఆ పరమాత్ముడు అందించిన సృష్టికి కూడా హాని కలిగిస్తున్నాడు!”, అని అన్నాడు.

“అదేమిటి స్వామీ? అలా అంటారూ? మనిషి తన మేధస్సుతో అద్భుతాలెన్నో సాధించాడు కదా?! ఒకప్పుడు ఏదైనా వార్తను అందరికీ చేర్చాలంటే ఎంతో అవస్థ పడేవాళ్ళు. దూర ప్రదేశాల్లో ఉన్న వారితో మాట్లాడాలంటే అసలు కుదిరేదే కాదు. ఎవరికైనా సందేశం పంపాలంటే వెంటనే చేరే ప్రసక్తే లేదు. కానీ ఇప్పుడు, కేవలం కొద్ది క్షణాల్లోనే ప్రపంచమంతా వార్తలు తెలిసేలా చేస్తున్నారు. ఎంత దూరంగా ఉన్నవారితోనైనా వారిని ఫోన్ లో చూస్తూ కూడా మాట్లాడచ్చు. ఎస్.ఎం.ఎస్.లు, చాటింగ్ మెసేజ్‌లు వచ్చాక అసలు అందరూ మన పక్కనే మన చుట్టూ కూర్చుని కబుర్లు చెబుతున్నట్లు ఉంటుంది. ప్రయాణాలలో వేగం.. పనులు పూర్తి కావడంలో వేగం.. అబ్బో! ఎంతో సాధించాడు మానవుడు!”, అన్నాడు ప్రశాంత్.

అందుకు శివయ్య, “మానవుడు సంపూర్ణ జ్ఞానం పొందిన స్థితి నుండీ అజ్ఞానం వైపుకు వెళ్లి, తిరిగి జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ అదంతా తానే సాధించానని సంబరపడిపోతున్నాడు! ఇందాక నువ్వు చెప్పినవన్నీ మన పురాణాలు వెదికితే దొరికే విషయాలే! మనిషిలో స్వార్థం పూర్తిగా తొలగక ముందే, అతడి జ్ఞానం పరిపక్వత పొందక ముందే, ఏదో సాధించి మరింత సుఖపడాలన్న తపనతో రకరకాల మార్గాలు కనుక్కుని తన మనశ్శాంతిని తానే దూరం చేసుకుంటున్నాడు. అసలు అశాంతి ఎక్కడుందంటావ్ ప్రశాంత్?”, అని అడిగాడు.

“ఎటుచూసినా అశాంతే!”, అన్నాడు ప్రశాంత్.

“కాదు. నీ మనసులో ఉంది ఆ అశాంతి! దానిని తొలగించే ప్రయత్నం చెయ్యి. అసలే మనసు చంచలమైన స్వభావం కలది. దాన్ని నియంత్రించడం అసాధ్యం. అలాంటిది ఇప్పుడు ఆధునికత పేరుతో వస్తున్న ఉపకరణాలన్నీ మనసును కుదురుగా నిలువనీయక మనిషిని అశాంతికి గురి చేస్తున్నాయ్. వాటివల్ల అనవసరమైన విషయాలు చాలా తెలుస్తున్నాయి. అక్కర్లేని ఆలోచనలు విలువైన సమయాన్ని వృథా చేసేస్తున్నాయ్. కాదంటావా? ఉన్నదాంతో సంతృప్తిని పొందలేక లేనిదేదో కావాలని ఆశిస్తూ స్వార్ధంతో ప్రవర్తించే వారికి మనశ్శాంతి ఎక్కడిదీ? కాస్త ఆలోచిస్తే ప్రశాంతతకు మార్గం నీకే కనపడుతుంది”, అంటూ గుహనుండీ బయటకు తొంగి చూసి, “మంచు కురవడం ఆగింది. ఇక ఎవరి దారిన వారు వెడదాం!”, అంటూ ప్రశాంత్ బదులిచ్చేలోపే మంచులో చక చకా నడుస్తూ కనుమరుగయ్యాడు శివయ్య.

ఎంతో జ్ఞానంతో శివయ్య అన్న మాటలు నిజమేననిపించింది ప్రశాంత్‌కు. తన వస్తువులన్నీ తీసుకుని పర్వతం దిగాడు ప్రశాంత్. అక్కడ శంభుతో సహా కొందరు ప్రశాంత్ కోసం వేచి చూస్తూ ఉన్నారు.

శంభు ప్రశాంత్ వద్దకు పరుగు పరుగున వచ్చి, “నువ్వు క్షేమంగా రావడం నిజంగా ఒక అద్భుతం! కొద్దిసేపటి క్రితం వచ్చిన మంచు తుఫాను ధాటికి ఎవ్వరూ బ్రతికి ఉండలేరు. నీకేమైపోయిందోనని మేమంతా కంగారు పడుతున్నాం”, అన్నాడు.

“ఎందుకురా కంగారు? నాకేమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను. కొండ మీద శివయ్య అని ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. తుఫాను తగ్గే వరకూ అతడి గుహలో ఉన్నాను. శివయ్య ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తి!”, అన్నాడు ప్రశాంత్.

“ఏమిట్రా నువ్వంటున్నదీ? నువ్వు నిజంగా శివస్వామిని కలిశావా??! ఆయన ఒక మహా యోగి! ఆయన వయసు మూడు వందల సంవత్సరాల పైమాటే! ఆయన దర్శనం కోసం ఇక్కడ ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు తెలుసా?! అలాంటిది నువ్వు ఆయనతో కాసేపు గడిపి మాట్లాడావు కూడానా?? నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివిరా!”, అంటూ ప్రశాంత్ ను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు శంభు.

ప్రశాంత్ ఒళ్ళు గగుర్పొడిచింది. శివయ్య తనతో అన్న మాటలు ప్రశాంత్‌కి పదే పదే గుర్తుకువచ్చాయి.

అప్పుడు ప్రశాంత్ పర్వతం వైపు తిరిగి, “స్వామీ! మీరన్నది నిజమే! ఆధునిక పరిజ్ఞానాన్ని అవసరమైన మేరకు వాడితే, అది మానవాళికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అలాకాక ఆ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సాంకేతికతకు మనిషిలోని స్వార్థం తోడైతే, మానవజాతికి జరిగేదంతా అనర్థమే!”, అన్నాడు.

“అసలేం జరిగిందిరా?”, ప్రశాంత్ ని అడిగాడు శంభు.

ప్రశాంత్ తన ఉద్యోగంలో ఎదురైన పరిస్థితులను శంభుకి చెప్పాడు.

అప్పుడు శంభు, “నువ్వు ఆ ఉద్యోగాన్ని వదిలేసి మంచి పని చేశావు. ఎందుకంటే తమ ఉద్యోగుల ఆరోగ్యాలను పణంగా పెట్టి కేవలం లాభాపేక్షతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అటువంటి సంస్థలు ఎక్కువ కాలం నిలవవు. నువ్వు మరో ఉద్యోగం వెతుక్కోవడం ఉత్తమం!”, అని అన్నాడు.

అందుకు ప్రశాంత్, “లేదురా! నేను మా ఊరు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. మా కుటుంబం తరతరాలుగా సంగీత వాయిద్యాలను తయారుచేసే వృత్తిలో ఉందని నీకు తెలుసు కదా! నాన్న నన్ను ఎప్పటినుంచో తన దగ్గరకు వచ్చి తనకు పనులలో సాయం చెయ్యమని అంటున్నారు. ఆయన మాట వినకుండా పట్నంలో ఉద్యోగం చేసి కోట్లు సంపాదిద్దామని కక్కుర్తి పడి, మనశ్శాంతిని పోగొట్టుకుని ఆరోగ్యం పాడుచేసుకున్నాను. ఇప్పటికైనా మా ఊరు వెళ్ళి మా తాతముత్తాతల లాగా నేను కూడా సంగీత వాయిద్యాలను తయారు చేస్తూ, నా తల్లిదండ్రులను చూసుకుంటూ నా ధర్మాన్ని నేను చేస్తున్నానన్న తృప్తితో హాయిగా జీవిస్తాను! ఆ సంగీత వాయిద్యాలనుండీ వెలువడే నాదం ‘శివయ్య’కు ఎంతో ఇష్టమని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. సంగీతం వినడంవల్ల నా మనసుకు శాంతి కూడా లభిస్తుంది!”, అన్నాడు.

“చూశావా ప్రశాంత్! శివస్వామి ఎంతటి గొప్పవారో నీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. ఆయన చెప్పినట్లుగా ప్రశాంతతకు మార్గం నీకే కనపడింది!”, అన్నాడు శంభు ఉత్సాహంగా.

“నిజమే! నా అన్వేషణ ఫలించిందిరా శంభూ! ఇక నేను వెళ్ళొస్తా!”, అంటూ తన స్నేహితుడికి వీడ్కోలు పలికి తమ ఊరికి బయలుదేరాడు ప్రశాంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here