అపభ్రంశం

0
8

[dropcap]ఆ[/dropcap] రోజు నేను ఇంటికి వచ్చేసరికే బాగా పొద్దుపోయింది. దాదాపుగా ఏడున్నర. స్నానానికి వెళదాం అనుకుంటుండగా, అనుకోకుండా చెల్లెలు మధుమతి రెండవ కూతురు.. అవంతిక వచ్చింది. అంత రాత్రి వచ్చిన౦దుకు ఆశ్చర్యపోతూ “ఏం? పిల్లా” అన్నా, వచ్చిన కారణం ఏమిటన్నట్లు.

అవంతిక డిగ్రీ చదివి కనపడిన ఉద్యోనికల్లా అప్లై చేస్తుంది. ఇక పైకి చదివే ఆలోచన ఉన్నట్టులేదు.

“మా మమ్మీ మనీ ఇచ్చిరమ్మంది” అంటూ హేండ్ బేగ్ లోంచి నోట్ల మడతలు తీసి౦ది. మధుమతికి రెండేళ్ళ క్రిందట పదిహేనువేలు ‘అప్పు’గా ఇచ్చాను. మూడు నెలలలో తీర్చేస్తానని అన్నది. ఇప్పటికి పదివేలు ఇచ్చి, ఆ పైన .. మాట్లాడలేదు.

దాని సంగతి తెలిసిందే కాబట్టి, వదిలేసాను.

అయితే, ఆశ్చర్యంగా.. ప్రస్తుతం మధుమతి ఆ డబ్బు కూతురితో పంపింది. ‘పోనిలే, ఇప్పటికైనా వచ్చాయి’ అని అందుకున్నాను.

ఇలాగే.. అయిదేళ్ళ క్రిందట.. ఓసారి పెద్దవాడు విహన్ పెళ్లి టైములో కూడా పదివేలు తీసుకుని, నాలుగు నెలల తరువాత అయిదు వేలు పట్టుకొచ్చి ఇచ్చింది.

“ఎందుకు” అన్నా ఆశ్చర్యంగా.

“అప్పుడు మలబారు గోల్డ్‌లో తీసుకున్నాను కదా” అంటూ గుర్తు చేసింది.

“హా! మర్చేపోయాను సుమా! లెక్కల్లో తేడా వచ్చినా గమనించుకోలేదు. ఏమిటో” అంటూ ఆశ్చర్యపోతూ… చేతిలో నోట్లను చూసి తప్పిపోయిన మేక పిల్ల దొరికినట్లు ఆనందపడ్డాను.

“అయ్యో! మర్చిపోయావా! అనవసరంగా గుర్తు చేశానన్నమాట ” నవ్వింది.

“పోనీలే నేను మర్చిపోతే ఏమిటి? నీకు గుర్తు ఉందిగా” సంతృప్తి పడ్డాను.

అయితే… ఆ తరువాత నిజంగానే మర్చిపోయింది.

ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు… ఆయనతో అంటే, “మీ చెల్లెలు మన చిన్నోడితో… ఓసారి అంటుంటే విన్నాను. మీ అమ్మ, విహన్ అన్నయ్య పెళ్ళిలో… ఆడపిల్లలు ఎవరికీ ఆడపడుచు కట్నాలు ఇవ్వలేదు. ఆడపెళ్ళివాళ్ళు ఇవ్వకపోతే, మీ అమ్మ అయినా ఇవ్వాలి కదా! అడిగితే ఏమనుకుంటు౦దో! అని, పిన్నిలు ఎవరూ ఏమీ అనకుండానే వెళ్ళిపోయారు.  మా చిన్నది అయితే, శుభలేఖలకు పసుపు రాసి, బొట్లు కూడా పెట్టింది. కాబట్టి, నేను ఇవ్వాల్సిన… ఆ డబ్బుని అలా ఉంచేసుకుంటున్నానని మీ అమ్మకి చెప్పు.. అని అనడం విన్నాను ” అని.

అవసరానికి డబ్బు అడిగి తీసుకుని… ఇవాల్సి వచ్చేసరికి ఇలాంటి కారణాలు వెతుక్కుంటే, ఎలా అని మాత్రం అనుకున్నా. అందుకే ఈసారి తిరిగి ఇవ్వబోయే… మూడో ఇన్‌స్టాల్‌మెంటు ఆశలు పెట్టుకోలేదు. అలాంటిది అనుకోకుండా తిరిగిరావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

చెల్లెల్ని బాకీలా ఏం .. అడుగుతాం .. జాగ్రత్త లేని మనిషి అని ఊరుకున్నాను.

అలాంటిది.. రెండవసారి తీసుకున్నది దానికి మాత్రం లెక్కచెప్పిసినందుకు సంతోషించాను.

మధుమతి పెద్దకూతురు ప్రమోద… హైదరాబాదు నుంచి పంపి ఉండవచ్చు. పోయిన నెలలోనే కుటుంబాన్ని షిరిడీ, బొంబాయి అంటూ టూర్ తీసుకు వెళ్ళింది. ‘అక్కడ ఖర్చు అంతా పిల్లే పెట్టుకుంద’ని… తనేమీ పెట్టలేదనీ చెప్పిది మధుమతి.

ప్రమోద పంపితేనే, అప్పుడో అయిదు వేలు, అప్పుడో అయిదు వేలు పంపించింది. ఇప్పుడూ అంతే అయ్యుంటుంది.

వేసవి సెలవుల్లో టీచర్లకు జీతాలు ఉండవు. ప్రతిసారీ నా దగ్గరే చేబదులు తీసుకునేది. అలాంటిది. జూన్ నెల మొదట్లోనే… స్కూళ్ళు అయినా తెరవకుండానే… బాకీ తీర్చేసింది అంటే, మరిది సూరిబాబుకి కూడా జీతం వస్తూ ఉండాలి. మరిదిది ఓ చిన్న ప్రైవేటు ఉద్యోగం… అందుకే ఇచ్చేసి ఉంటుంది.

సమాధానపడ్డాను.

వెళ్ళడానికి తయారుగా ఉన్న అవంతికని ఉద్దేశి౦చి “కూర్చో“ అన్నా.

“లేదు. వెళ్ళాలి. క్రింద డాడీ వెయిట్ చేస్తున్నారు”

“పైకి రమ్మను. క్రింద వెయిట్ చెయ్యడమేమిటి? లిఫ్టే కదా”

“కొన్ని ప్రోవిజన్సు, వెజిటబుల్సు తెచ్చుకోవాలి. అందుకని అటునుంచి అటే వెళ్ళాలని అక్కడే ఉండిపోయారు” చెప్పింది.

పగలంతా ఇంట్లో పడుకుని, రాత్రుళ్ళు బయలుదేరుతారు… తిరగడానికి. ఓసారి ఇలానే కనుచీకటి పడే వేళ కారు బయటకి తీస్తే, ఆర్.టీ సీ బస్సు గుద్దడంతో మైనరు ఏక్సిడెంటు అయ్యింది. అయినా తెలిసిరాదు. వీళ్ళు మారరు .. అనుకుంటూ “సరే” అన్నా.

నోట్లు బీరువాలో పెడుతుంటే…  ఆయన అన్నారు “డబ్బు అడిగావా” అని.

‘అనుకోకుండా నాలుగు రోజుల క్రిందట వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు గాని అడిగానేమో’ అన్నట్లు.

“లేదు” చెప్పాను స్నానానికి వెళుతూ.

తను ఇస్తే పుచ్చుకోవడమే గాని అడిగే ఆలోచన ఎప్పుడూ లేదు. ఆ సంగతి ఆయనకూ తెలుసు.

అయితే, స్నానం చేస్తున్నంతసేపూ ‘ఆయన మాటే’ నన్ను వెంటాడింది… అప్పుడే ఓ విషయం స్పురణకు వచ్చి… బహుశా దాని ఫలితమేమో ఇది… అన్న ఆనుమానమూ బలపడింది.

బయటకొచ్చి అదే చెప్పాను ఆయనతో.

***

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం ప్రత్తిపాడు అనే మండలంలో పని చేసినప్పుడు… అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఇద్దరం ఉండేవాళ్ళం. శనివారం సాయంత్రం బయలుదేరి, ఇంటికి కాకినాడ వచ్చి, మళ్ళీ సోమవారం వెళ్ళిపోయే వాళ్ళం.

అక్కడ ఉండగా…

ఓ రోజు మదుమతి నుంచి ఫోను. “అక్కా! పి.హెచ్.డి.కి ఫీజు కట్టడానికి డబ్బు కావాలి. పదివేలు, కొన్ని పై ఖర్చులకి గానూ… మొత్తానికి ఓ పదిహేనువేలు అవసరం. ఈ ‘మే’ నెలలో నాకు జీతాలు రావని తెలుసుగా… మీ పెద్దక్క కాకపోతే మనకు డబ్బేవరిస్తారు… అని సూరిబాబు కూడా అన్నాడు” అంటూ ముందరి కాళ్ళకు బంధం వేసింది.

ఆ వెర్షను విన్న తరువాత ఎవరికీ కాదనాలని అనిపించదు. కాదంటే… అన్నాళ్ళ తన కష్టాన్ని మనం పాడుచేసిన వాళ్ళం అవుతాం! అన్నట్లు.

సూరిబాబు ఎలియాస్ సూర్యనారాయణ అంటే వాళ్ళాయన. మాకు దగ్గరివాడే. మేనత్త కొడుకు. అందుకే పేరుతో పిలుస్తుంది.

చదువు పేరు చెప్పి అడిగినప్పుడు కాదని ఎలా అంటాను. పైగా సూరిబాబు కూడా నా మీద ఆశలు పెట్టుకున్నప్పుడు కాదనడానికి ఏముంది? తన కన్నా పన్నెండేళ్ళు ముందు ఉద్యోగంలో చేరినదాన్ని.

“రేపు సాయంత్రం బయలుదేరి ఇంటికి వస్తున్నాను. ఎల్లుండి… ఆదివారం సాయంత్రం వచ్చి, డబ్బు తీసుకో” అని చెప్పాను.

అలా ఆ ఆదివారం భార్యాభర్తలు వచ్చి డబ్బు పట్టుకెళ్ళారు.

అది మే నెల… ఇరవైనాలుగవ తారీకు. మర్చిపోదామన్నా మర్చిపోయే రోజు కాదు.

మా పెద్దవాడు విహన్ పెళ్లిరోజు. అప్పటికి పెళ్లై రెండేళ్ళు.

వెళ్ళే ముందు అంది “నెలకు అయిదు వేలు చొప్పున మూడు నెలలలో తిరిగి ఇచ్చేస్తాను” అని.

మూడు నెలలు కాదు కదా! మూడో ఏడు కూడా వచ్చేసింది. రెండు విడతలు ఇచ్చింది గానీ, మిగిలినది ఇచ్చే ఆలోచన ఉన్నట్లు కనిపించలేదు.

అలాంటిది ఈ జూన్ నెలలో… స్కూళ్లు తెరవక ముందే ‘ఇవ్వడం’ నన్ను కాస్త ఆలోచనలో పడేసింది.

***

మొన్నొక రోజు… మా ఆఫీసరుగారు మీటింగుకి… వెళ్ళడంతో కాస్త వెలుతురు ఉండగానే… ఇంటికి బయలుదేరాను. మాములు రోజైతే రాత్రి ఏడు గంటలు దాటితేగాని వీలుపడదు.

పైగా నేను ఎక్కిన ఆటో కూడా వాళ్ళ ఇంటి మీదుగా రావడంతో… మధుమతిని చూసి చాలా రోజులయ్యింది. స్కూళ్ళు తెరిచారంటే… తను అసలే రాదని, అక్కడే దిగిపోయాను.

ఇంట్లో సూరిబాబు, కూతురు అవంతిక కూడా ఉండడంతో ఓ గంట సేపు ఉండిపోయాను.

టీ.వీ చూస్తూనే కబుర్లు చెప్పుకుంటున్నాం. ప్రస్తుతం టీ.వీ. జనజీవన౦లో ఓ భాగమై పోయింది.

ఇంకా చెప్పొచ్చేది ఏమిటంటే ..

మూడు నెలల క్రిందట… ఆఫీసులో నాకు అనుకోని ‘ఇబ్బంది’ ఒకటి జరిగింది.

నేను ‘చెయ్యని ఒక పొరపాటు’ని… సెక్షను క్లార్క్ నైన నా మీద వేసి .. కలెక్టరు ఆఫీసుకి సరెండర్ చేసారు. పొరపాట్ల౦టూ చేస్తే క్లార్కులే చేయ్యలన్నట్లు.

సరెండర్ పనిష్మెంట్ కాకపోయినా… చెయ్యని నేరానికి బలి అయ్యాను.

నేనేం తప్పూ చెయ్యలేదని కలెక్టరు ఆఫీసులో నిరూపించుకుని… మళ్ళీ మా ఆఫీసులో జాయిను అవడానికి యాభై అయిదు రోజులు పట్టింది. అంటే దాదాపుగా రెండు నెలలు.

ఈ ‘పని చెయ్యని కాలానికి’ శెలవు పెట్టుకోమన్నారు కలెక్టరుగారు.

నేను మళ్ళీ వచ్చి జాయిను అవడం మా ఆఫీసరుగారికి ఎంత మాత్రం ఇష్టం లేదు.

తప్పు చేసావ్ అంటూ… అంత పెద్ద కాగితం వ్రాసి, బయటకు పంపినా… వెనక్కు తిరిగి వచ్చేసినందుకు జీర్ణించుకోలేక పోయారు.

కలెక్టరు ఆర్డర్స్‌ని కాదనలేక అంగీకరించినా, కలెక్టరుగారు పెట్టుకోమన్న ‘శెలవు మంజూరు’ చెయ్యడానికి మాత్రం ఇతనికి… మనసు రాలేదు. ఆఫీసరుగార్ని అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఇప్పుడు ఇష్టం లేని క్లార్కుని నేను. జాయిను అయి, రెండు నెలలు గడుస్తున్నా… ‘శెలవు జీతం బిల్లు’ పెండింగులోనే ఉండిపోయింది

మధుమతి వంటగదిలో ‘టీ’ పెడుతుంటే, ఆఫీసు విషయాల్ని అవగతం చేసుకుంటూ… యధాలాపంగా అన్నా “అసలు జీతానికి ఇబ్బంది లేకపోయినా… శెలవు బిల్లే నత్త నడకలు నడుస్తుంది. మా ఆఫీసరుగారికి నా శెలవు జీతం చెయ్యాలని అనిపించడం లేదు” అని పరిస్థితి వివరిస్తూ.

మనసులోని అసంతృప్తిని ఇంట్లో వాళ్లతోనూ… అయిన వాళ్లతో కాకుండా మరెవరితో ఎవరితో చెప్పుకుంటాం?

టీ.వీ చూస్తూ నా మాటలు వింటున్న సూరిబాబు ఎందుకో ‘ముఖం… ప్రక్కకు తిప్పుకున్న’ట్లు అనిపించింది. నా మాట విని తిప్పుకున్నాడో! లేక మాటల సందడిలో టీ.వీ.లో డైలాగు అర్ధంకాక తల పంకించాడో అర్థం కాలేదు.

అయినా… అప్పుడే నా పొరపాటు… నాకు తెలిసి వచ్చి౦ది. వెన్ను చరిచి కళ్ళు తెరిపించినట్లయ్యింది.

ఛ ఛ .. పిలవని పెరంటంగా, పని గట్టుకు ఇంటికి వెళ్లి… నేను జీతానికి ఇబ్బంది పడుతున్నా, మీరు నాకు ఇవ్వాల్సింది ‘ఇవ్వలేదు’ సుమా అని గుర్తు చేసినట్లు లేవు కదా నా మాటలు అని. వెంటనే, తేరుకుని… అంతటితో ఆ ప్రసక్తి వదిలేసి, సంభాషణని మార్చాను.

***

అయినా జరగాల్సిన అపభ్రంశ౦ జరిగిపోయింది.

ఈ రోజున… నా డబ్బు నాకు ‘తిరిగోచ్చేసిందన్న సంతోషం కంటే, జీతాలు రాని సమయంలో… చెల్లెలు బాకీ తీర్చేసిందన్న బాధే నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టింది.

పని గట్టుకుని ఇంటికి వెళ్ళి… పొరపాటు చేసానా! డబ్బిచ్చి… ఇంటికి వెళితే, బాకీ కోసం వెళ్ళినట్లే ఉంటుందా! అలా అని… ఎప్పటికీ వసూలు కానీ బాకీ కోసం… వాళ్ళ ఇంటికి ఎన్నాళ్ళు వెళ్ళకుండా… ఉండను?

జరిగిన కష్టం చెప్పుకోవడం బాకీ.. అడగకనే, అడిగినట్లు అయ్యిందేమో!

ఆయనకు చెప్పాను.

నా మాటలకు సూరిబాబు ‘ముఖం’ తిప్పుకున్న విషయం.

“తనకి నచ్చని విషయం చెప్పినప్పుడు కూడా మీ చెల్లెలు అలానే తిప్పుకుంటు౦ది” అన్నరాయన. నా తరుఫు వాళ్ళు ఏం చేసినా ఆయన అలానే మాట్లాడతారు.

రెండు నెలలు కాదు కదా! మరో నాలుగు నెలలు జీతం రాకపోయినా నా ఆర్థిక పరిస్థితికేం ఢోకా ఉండదని, అయితే, నా జీతాన్ని… నేను… తీసుకునే, హక్కుని కలిగి ఉన్నందున… అది సమయానికి… అందనందుకు మనస్తాపం చెందానే గానీ ‘తనని’ వేలెత్తి చూపే ఆలోచనతో కాదని… చెప్పలేక పోయాను.

ఎందుకంటే .. ఎదురొచ్చిన లక్ష్మిని అందేసుకున్నాక… ఏం చెబితే ఏం ప్రయోజనం.

ఎప్పటిలా తీసుకున్నది ఇవ్వకపోయినా అంత పట్టించుకోలేదు గానీ, ఇచ్చింది తీసేసుకోవడం ఎక్కువ ఇబ్బంది పెట్టింది నన్ను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here