మెట్రో జీవన చలనచిత్రాలు ‘అపగామిత మరి కొందరు’ కథలు

1
13

[కృష్ణవేణి చారి గారి ‘అపగామిత మరి కొందరు’ అనే కథా సంపుటిని విశ్లేషిస్తున్నారు సూరపరాజు పద్మజ.]

[dropcap]స[/dropcap]ముద్రంలో తుఫాన్ కథను భయోత్పాతం కలిగించేట్టు భీభత్సం భరితంగా చెప్పొచ్చు, నిమ్మళంగా ఎక్కించే విషాదపు సూది మందు కథలానూ చెప్పవచ్చు, రెండు రకాలూ రక్తి కట్టించవచ్చు. ఒక టీ కాచుకుని తాగే కథను తేటనీటి హైకూ లా చెప్పి ఔరా అనిపించవచ్చు, మసాలా కలిపి పిసికి సాగదీసి నవలిక చేసి మెప్పించనూవచ్చు.

టీ కప్పులో తుఫాన్ ఇది అని, కొట్టిపడేసే వాట్లలా కనిపించే బోన్సాయ్ బాధల కథలు చెప్పటానికి ఏ style పనికివస్తుందో మాత్రం కష్టమే ఎంచుకోవడం. వ్రాసే వారికి ప్రతి కథా ఒక పరీక్షే. ఆ కఠిన పరీక్ష తీసుకోవడం ఎందుకంటే, అందుకు ఒక్కో రచయితకూ ఒక కారణం ఉంటుందేమో.

I write, therefore I am! అవును అది ఒక అస్తిత్వ సమస్యే. వ్రాయడం ఇందుకైతే, వ్రాసిన కథ ఎలా ఉండాలి?

ఒక విస్పష్ట ప్రత్యేకతను సహజంగా సంతరించుకోగలది రచయితకు హృదయగతమైన కథ మటుకే. తనదైన అనుభవమో, అను నిత్యం తను మసిలే పరిసరాలలో కనపడుతూ ‘నా గురించి కథ వ్రాయవూ’ అని ప్రశ్నించే ఒక జీవితమో జవజీవాలున్న కథ కాగలదు అనేందుకు ఉదాహరణలు కావలిసినన్ని ఉన్నాయి.

కృష్ణవేణి చారి గారి కథలు ఒక ఇలైట్, నాజూకు లోకం నుంచి నడిచొచ్చాయి. ఆ urban లోకం తన మంచి, చెడు అన్ని విషయవిశేషణాల తోటి మన ముందుకొస్తుంది ఈ కథల్లో. సొగసు మసకేసిన పెద్ద పట్ణణాల ప్రపంచపు వాస్తవరూపాలు, మెట్రో జీవన చలనచిత్రాలు ఈ కథలు.

చలనచిత్రాలు ఎందుకంటున్నానంటే, కదిలే దృశ్యంతో మొదలై, దృశ్యాల గమనంలో వేగం కలిగి, వాటి నిడివిలో క్లుప్తతతో ఉంటాయి ఇవి. Brilliant brevity is her style!

ఎక్కడా సమయాన్ని వ్యర్థం చేసే వర్ణనలు ఉండవు. నేరుగా విసిరిన ఒక వాక్యంతో పాఠకులు కథ తలవాకిలి దాటి కథ నడిమధ్య గడిలో నిలుచుని ఉంటారు. ఎప్పుడు అయిపోయిందో తెలీకుండానే కొంతసేపటికి మనల్ని దింపి వెళ్తుంది, ఇంతసేపూ ఓ ఇల్లనిపించిన ఆ కథల బండి. A breeze of a fresh new metro air every time.

80లలో చురుకందుకున్న మధ్యతరగతి మహిళల ఉరుకు పరుగుల జీవితం గత పదేళ్ళ వరకూ కూడా ఇల్లు, ఉద్యోగం అనే ఇరుకు పెట్టెల్లోనే అటూ ఇటూ షటిల్ ట్రిప్లోనే ఉండేది. ఇటు ఇప్పటి పాతిక ముప్పైలలో ఉన్న స్త్రీల స్పష్టత, ధైర్యం, మెలకువలకూ అరవై డెబ్భై లలోని స్త్రీ లకు ఉన్న తప్పనిసరని సరిపెట్టుకునే survival మనస్తత్వాలకూ మధ్య త్రిశంకు కాలం అది. Micro నుంచి macro levels వరకూ ప్రపంచం తన గతి, గమనాలలో పెద్ద మార్పు చూసిన కాలమది. మధ్యతరగతి మహిళల జీవితం ఆ మార్పుకు ఒక రకంగా ప్రేరకం, ఒకరకంగా బాధిత వర్గము అయింది. శక్తి కొలదీ వేగము, పిండి కొద్దీ రొట్టె దొరికిన కాలమది, విస్తారమైన ప్రపంచం అందుకోగలిగిన వారికి. అంతదాకా రాలేని వారిని మరీ మెకానికల్ నరకనగర జీవితం వరించింది. అటువంటి వారిని ఎప్పుడూ లేనంతగా ‘ennui’ ఆవహించిన జీవితాల దశాబ్దాలు అవి. ఆ సమయంలో మనిషి జీవితంలో నీతి నియమాలు, ధర్మ పన్నాలు పూర్తిగా వీగిపోయాయని అనలేరు గానీ వాటిని చూసే దృక్కోణం మారింది. వాటిని ప్రశ్నించే తెగువ రాలేదుకానీ, భద్రతనీయని జీవన పరిస్థితుల పట్ల నిస్పృహ, ఆగ్రహం చోటుచేసుకున్నాయి.

అటువంటి ఆవరణలో తలెత్తిన కథలివి. ..

ఏదో ఒక తగ్గ చదువు, ఉద్యోగాలతో సహజంగా అందివచ్చిన sophisticated life style of urban young ladies, వారి చాలీచాలని ఆకర్షణలు, సహచరుడిని ఎంపిక చేసుకునే ఉత్సాహాలు, ఆ స్థానంలోకి ఎవరొస్తారో అనే ఉత్సుకత నిండిన వారి ఊహలు.

అప్పటివరకూ భద్రజీవితంలో జాగ్రత్తగా బ్రతికినవాళ్ళం ఇక్కడ పొరపాటు choices చేయము అనుకుంటారు వీరు.

కానీ sadly, ఘోరంగా చేస్తారు. తెలివి, పట్టుదలలు వీగిపోయే జారుడు మాటలకు వెళ్ళి పడిపోతుంటారు.

అమ్మాయిలకు అఖిలస్ హీల్ వాళ్ళ హృదయం. వివాహం ఒక ఆనందకరమైన మలుపుగా నిల్చిన కథలూ ఈ పుస్తకంలో ఉన్నా, హెచ్చుగా చూసేవి ఈ వివాహాలనే విఘాతాల పడిన జీవితాలే.

అయితే ఈ రచయిత్రి ఏ స్త్రీ పాత్ర పైనైనా వేరే ఎవరి అధికారమో, నిర్ణయమో లేవు. మంచో చెడో రెండింటికీ ఇక్కడ తన పరిస్థితిని తనే వ్రాసుకున్న బ్రహ్మ కథానాయకే. ఇది చాలా నచ్చవలసిన విషయం. సాధారణంగా ఎవరో ఒకరి దుర్మార్గానికి బలైపోయిన శోక కథల అలవాటును తప్పించిన స్వయంకృతాల కథలివి.

అందుకే అనవసరంగా ఇక్కడ victim playing, blame gaming ఉండదు. అక్కడ కురుస్తున్న వర్షం అక్కడి అప్పటి మేఘం తెచ్చుకున్న నీళ్ళెంతో అంతే.

మనిషి నడవడిక ఎక్కడెక్కడ, ఎంతెంత మేరకు ఏ యే చిన్న విషయాల్లో కూడా ప్రతిఫలిస్తుందో, ఎంత మేరకు చుట్టూ ఉన్న జీవితాలను ముళ్ళకంపల్లోకి విసురుతుందో నిష్పాక్షికంగా చూపించడంలో రచయిత్రి ఉట్టిగా తీర్పులు చేయకండా విషయాలను మాట్లాడే నేర్పు విదితం.

‘ఆనా కరనీనా’ లో భర్త, పిలల్ల గవర్నెస్‌తో శృంగారం నడుపుతున్నాడని భార్యకు తెలిసిపోయి ఆమె శోకించి అలిగి గడియవేసుకుని తన గదిలో ఉండిపోయిందన్న విషయంతో నవల మొదలవుతుంది. అప్పుడు ఇల్లు, పిల్లలు, ఇంట్లో పనివాళ్ళూ ఒక నేతృత్వం లేక, అరాచక పరిస్థితి నుంచి ఆరు వాక్యాలు మించకుండా చెప్తాడు టాల్‌స్టాయ్.

అలాగే వీరి ‘తెగిన గాలి పటాలు’, ‘చిరిగిన గాలిపటాలు’ కథలు ఒకటీ రెండు వాక్యాలు తోటే కథను లాక్కొస్తాయి నేరుగా.

కృష్ణవేణి గారు ఎక్కడా మోరల్స్ ప్రవచించలేదు. తటస్థంగా పాత్రల ఎంపికలను, వారి చర్యల పర్యవసానాలను చిత్రీకరించారు. తీర్పులు ధ్వనించదు, కొండకచో అమాయకంగా దారి తప్పుతున్న తన పాత్రల పైన జాలితో కూడిన అసహనం పొడగట్టినా. కొందరు అపగామితల కథలివి, అవి చెప్పడంలో రచయిత దయతో కూడిన ఒక దూరం పాటించి చెప్పడంలో నిరాపేక్ష లేదు కానీ, రచయితకు ఉండవలసిన తటస్థత ఉంది.

ఈ రచయిత్రిది కఠినమైన కలం కాదు, pedagogic అసలే కాదు. ఒక విధమైన అక్కరతో జాలి సంవేదనలతో వ్రాసిన సామాజిక జీవిత వ్యాఖ్యలు. వ్యాఖ్యానాలు కాదు.

ఈ పుస్తకంలో పొందుపరిచిన వీరి ఒకే ఒక పరిచయ సమీక్ష, ప్రేమ్‌చంద్ కథ ‘కఫన్’ మీద దాంట్లో కూడా వీరిది controlled language.

ఇవి చదవవలసిన కథలు. వీటిల్లో వీటికే ప్రత్యేకమైన ఒక నాజూకు అందం ఉంది. మెట్రో జీవితాల మైల్డ్ ఫెరఫ్యూమ్ ఉంది. ఆ గాజుగ్లాసులతో కలిసి వినవచ్చే polite , subdued, empathetic voices ఉన్నాయి.

బాహాటంగా కనిపించని మర్యాదాపరుధులు త్రోసిపుచ్చని నిశ్శబ్దపు కన్నీళ్ళు, నిట్టూర్పులూ ఉన్నాయి.

అన్నిటికీ మించి గత ఇరవై ముప్పై ఏళ్ల క్రిందటి సజీవ మెట్రో జీవనశకలాలు ఇవి.

గమ్మత్తుగా వీటికొక unmistakable aerial quality ఉంది, మెజారిటి కథలు airport ఆవరణలోంచి వచ్చినవి కాబట్టి.

కృష్ణవేణి గారి తెలుగు ప్రత్యేకమే. కొన్ని మాటలు, పదప్రయోగాలు, ఈమె తెలుగేతర రాష్ట్రంలో పెరిగిన వారనే సంగతి పట్టిస్తాయి. కాని అవి లోపాలగా కంటే ఒక తమాషా ఆకర్షణ కలిగి ఉన్నాయి.

శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ తెలుగంత కాదు.

కానీ, నాకు ఆ style ఇష్టమే! ‘అనంద్’ అంటూ ఆనంద్‌ని ఆ పేరు అర్థమే మారుస్తూ పిలిచే ఆ చిన్నపిల్లలో ఉచ్చారణ, వ్యాకరణ దోషం చూస్తామా!

ఆ sophisticated style ముద్దొస్తుంది గానీ.

అలాగే!

‘అపగామిత’ – దారి తప్పిన అనుకోవచ్చు, కార్యకారణాలు ఏవైనా, దారి మళ్ళించబడిన అనీ అనుకోవచ్చు. ఈ పుస్తకంలో తొమ్మిది కథలు, ఒక పరిచయ సమీక్ష ఉన్నాయి.

***

అపగామిత మరి కొందరు (కథలు)
రచన: కృష్ణవేణి చారి
ప్రచురణ: ఆరెంజ్ బుక్స్ పబ్లికేషన్
పేజీలు: 206
వెల: ₹ 308.00
ప్రతులకు:
https://www.amazon.in/Apagaamita-Krishna-Veni-Chari/dp/9356212120

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here