అపరాధ సహస్రాణి క్రియంతే

0
9

[dropcap]రెం[/dropcap]డు రోజుల క్రితం ఒక ఆర్టికల్‌ కోసం రిఫరెన్స్ కావాల్సి వచ్చి ఇంటర్‌నెట్‌లో వెతుకుంటే అనుకోకుండా ఓ విషయం తెలిసింది. ఈ ఆదివారం అంటే 7 జూలై ‘ప్రపంచ క్షమా దినం’ (గ్లోబల్ ఫర్‌గివ్‌నెస్ డే) అని! మన్నించడానికీ, క్షమించబడడానికీ ఈ రోజు గొప్ప అవకాశమట. అభిప్రాయ భేదాలను పక్కనబెట్టి, గాయాలకీ వెతలకీ అతీతంగా కొత్తగా, తాజాగా జీవితాన్ని పునఃప్రారంభించడం ఈ దినం ఉద్దేశమట.

కానీ ఇప్పటికే ఆగస్టు నెలలో ఒక క్షమా దినం ఉంది, దాన్ని ‘వరల్డ్ వైడ్ ఫర్‌గివ్‌నెస్ అలయన్స్’ వారు జరుపుతారు, జూలై 7న జరిపే క్షమాదినాన్ని ‘సిఇసిఎ’ వారు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రెండు రోజులు మౌలికంగా అందించే సందేశం ఒకటే – ‘క్షమించండి’ అని.

మనం ఇప్పుడు ఎన్నో ఒత్తిళ్ళతో కూడిన జీవితాలు గడుపుతున్నాం. అభద్రత, భయాలు, లేమి, నిస్సహాయత వంటివి జనాలను మొద్దుబారిపోయేలా చేస్తున్నాయి. స్వార్థం పెరిగిపోయి, సాటివారిని పట్టించుకోకపోవడం జరుగుతోంది. ఎన్నో తప్పులు చేస్తూ, వాటిని సమర్థించుకుంటున్నాం. నోటిపై అదుపు కోల్పోయి ఇంటా బయటా, తెలిసీ, తెలియక ఇతరుల మనసులని గాయపరుస్తున్నాం. ఇళ్ళల్లో భార్యా పిల్లల్నీ, ముసలి తల్లిదండ్రులను; ఆఫీసులో అయితే సబార్డినేట్స్‌నీ, కొలీగ్స్‌నీ మాటలతో తూట్లు పొడుస్తాం. చాలా సందర్భాలలో మనవాళ్ళే అని ‘ఫర్ గ్రాంటెడ్‌’గా తీసుకుంటాం. మాట తూలి బంధాలను, స్నేహాలను పలచన చేసుకుంటాం. ఫలితంగా ఇంట్లో, ఆఫీసుల్లో అశాంతి! మనసులో అలజడి. పైకి గాంభీర్యం నటిస్తూ, ప్రస్తుతానికి ఏదోలా పని కానిచ్చేద్దాం, తరువాత చూసుకోవచ్చు అనుకుంటాం. కాని గాయపడిన హృదయాలను, చెదిరిన మనసును వెంటనే సరిజేయకపోతే… జీవితం నరకం అవుతుంది. దానికి నివారణోపాయం – మాటలతోనూ, చేతలతోనూ చేసిన తప్పులని ఒప్పుకోడం, మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకోవడం!

తప్పు చేయడం కన్నా, మన్నించమని అడగడానే ఎక్కువ ధైర్యం కావాలి. కాని ఒకసారి క్షమించబడ్డాకా, క్షమించాక ఇద్దరి మనసులు తేలికవుతాయి. మనోభారం తగ్గుతుంది.

***

“నీ పాదాల క్రింద నలిగిన పువ్వు వెదజల్లే పరిమళం క్షమాపణ” అన్నారు మార్క్ ట్వైన్.

“క్షమించడం వల్ల, నువ్వు గతాన్ని ఏ మాత్రం మార్చలేవు – కాని ఖచ్చితంగా భవిష్యత్తును మార్చగలవు” అన్నారు బెర్నార్డ్ మెల్ట్‌జర్.

“క్షమించడం అంటే నిన్ను నువ్వు బలోపేతం చేసుకోవడం, నీ గతాన్ని కాదు” అన్నారు టి.డి. జేక్స్.

“క్షమించడం అనేది నీ కోసమే, ఎందుకంటే అది నిన్ను విముక్తిడిని చేస్తుంది. నిన్ను నువ్వు బంధించుకున్న కారాగారం నుంచి నిన్ను విడుదల చేస్తుంది.” అన్నారు లూసీ ఎల్. హే.

క్షమించడం అనేది అప్పుడప్పుడు జరిగే చర్యలా కాకుండా, ఒక నిరంతర వైఖరిలా ఉండాలి” అన్నారు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.

ఈ కొటేషన్స్ అన్నీ చెప్పకనే చెబుతాయి క్షమించడం వల్ల కలిగే మేలు ఏమిటో.

***

మా ఇంటికొచ్చిన మా మేనకోడలు వాళ్ళ కాలేజిలో ఏదో ప్రోగ్రాం కోసం డబ్‌‍స్మాష్ చేయడానికి డైలాగులు, పాటల కోసం యూట్యూబ్ వెతుకుతోంది. వాల్యుం పెద్దగా పెట్టుకోడంతో పైకి వినబడుతున్నాయి. వాటిని వింటూ నేను నా పని చేసుకుంటాను. ఓ పాప ‘ఠాగూర్’ సినిమాలో “తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ‘క్షమించడం’ ” అని చిరంజీవి చెప్పిన పంచ్ డైలాగ్‌ని డబ్‌‍స్మాష్ చేసింది. అది విన్నాకా నాకు సినిమాలో క్షమాపణ చెప్పే, అడిగే కొన్ని సీన్స్, పాటలు గుర్తొచ్చాయి.

చిరంజీవి చెప్పిన ఆ డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది, కానీ నిజానికి తెలుగులోనే కాదు, ఏ భాషలోనైనా మనస్ఫూర్తిగా పలికితే ‘క్షమించు’ అనే అర్థమున్న మాట అత్యంత అందమైన పదం అవుతుంది.

‘లేత మనసులు’ సినిమాలో “పిల్లలు దేవుడు చల్లని వారే” అనే పాటలో “తప్పులు మన్నించుటే దేవుని సుగుణం/ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం” అంటూ మనిషి స్వచ్ఛమైన మనసుకి మకిలి ఎలా పడుతుందో వివరిస్తారు ఆరుద్ర.

కన్ను మిన్నూ కానక తాను చేసిన దుష్కార్యాలని క్షమించమని తల్లిదండ్రులను వేడుకుంటాడు కథానాయకుడు ‘పాండురంగ మహత్యం’ సినిమాలో. సముద్రాల జూనియర్ వ్రాసిన “అమ్మా అని అరచినా” పాటలోని “ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు చేసితీ/తలచకమ్మా తనయుని/తప్పులు క్షమించవమ్మా…. అమ్మా… అమ్మా…” అని హృదయం కరిగేలా ఆలపిస్తాడు. మాతాపితరులను క్షమాపణలు కోరే పాటలలో ఇది అగ్రశ్రేణిలో ఉంటుంది.

‘सचाई’ అనే సినిమాలో రాజేంద్ర కృష్ణ వ్రాసిన मेरे गुनाह माफ़ कर मेरा ज़मीर साफ़ कर అనే పాట అద్భుతంగా ఉంటుంది. “నా తప్పుల్ని క్షమించు, నా అంతరాత్మను పరిశుద్ధం చేయ్” అంటూ కథానాయకుడు పరమాత్ముని వేడుకునే ఈ పాటకి శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చగా, రఫీ ఆలపించారు.

రాజ్‍కపూర్ నటించిన ‘मैं नशे में हूँ’ అనే సినిమాలో “मुझको यारो माफ़ करना, मैं नशे में हूँ ” అనే పాట “ज़ाहिद शराब पीने दे, मस्जिद में बैठकर या वो जगह बता दे जहाँपर ख़ुदा न हो” అంటూ గాలీబ్ పదాలతో ప్రారంభమవుతుంది. శైలేంద్ర గీతానికి శంకర్‌ జైకిషన్ సంగీతం. ముకేష్ స్వరంలోని ఆర్తి శ్రోతలని కట్టిపడేస్తుంది. ‘నేను మత్తులో ఉన్నాను, నన్ను క్షమించండి’ అంటాడు కథానాయకుడు. చాలామంది కులం మత్తు, మతం మత్తు, ధనం మత్తు, అధికారం మత్తులో ఉండి తప్పులు చేస్తున్నారు. వాళ్ళు మైకంలో ఉన్నారని గ్రహించి ఈ గీతాన్ని మనసులో ఉంచుకుని వాళ్ళని క్షమించేయాలి.

‘ఘరోనా’ సినిమాలో పిల్లలు పాడే “दादी अम्मा दादी अम्मा मान जाओ” అనే పాటలో తమ తప్పుల్ని మన్నించి, కనీసం పళ్ళయినా తినమని తమ నానమ్మని బ్రతిమాలుకుంటారు. షకీల్ బదాయునీ వ్రాసిన ఈ గీతాన్ని ఆశాభోస్లే, కమల్ బారోట్ పాడారు. తమని గుండెలకి హత్తుకుని, మనసుల్ని శుభ్రం చేసి, చక్కని కథ వినిపించమని కోరుకుంటారు పిల్లలు. అలతి పదాలతో హృద్యమైన భావాన్ని అందించిన పాట ఇది.

‘’మేరే హుజూర్’ సినిమాలో “ग़म उठाने के लिये मैं तो जिये जाऊँगा, साँस की लय पे तेरा नाम लिये जाऊँगा” మరో చక్కని పాట. హస్రత్ జైపురి గీతానికి శంకర్ జైకిషన్ సంగీతం సొబగులు అద్దింది. తన చేసిన తప్పులకి చావే రాని శిక్ష వేసి సుదీర్ఘంగా బ్రతికేలా, ఫలితం అనుభవించేలా చేయాలని కోరుకుంటాడు. రఫీ స్వరంలోని వేదన శ్రోతల హృదయాలను తాకుతుంది.

‘ఆ అబ్ లౌట్ చలే’ అనే సినిమాలో విదేశానికొచ్చిన కథానాయకుడు అక్కడి భారతీయులతో కలిసి పాడే పాట “ओ यारो माफ़ करना कुछ कहने आया हूँ कुछ अपने बारेमे समझाने आया हूँ” లో తనని క్షమించమని అడుగుతూ, తన గురించి చెప్పడానికి వచ్చానంటాడు. ఈ పాటలో భారతదేశం గొప్పదనాన్ని చెబుతారు. సమీర్ గీతానికి నదీమ్ సైఫీ సంగీతం సమకుర్చగా అభిజీత్ పాడారు.

‘నా పేరే భగవాన్’ సినిమాలో సినారె వ్రాసిన “మన్నించుమా ప్రియా మన్నించుమా/మరుమల్లె నల్లగా ఉంటే… చిరునవ్వు చేదుగా ఉంటే/ఆ తప్పు నాది కాదంటే… /మన్నించుమా ప్రియా మన్నించుమా” అనే పాట సాహిత్యం బావుంటుంది, సంగీతమూ బావుంటుంది. సంగీతం చక్రవర్తి, గానం – ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం, పి. సుశీల.

‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాలో “లాలిజో లాలిజో ఊరుకో పాపాయి” అనే పాటలో… “తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా/తల్లిలా మన్నించు మెల్లగా దండించు/కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా/బుద్దిలో లోపాలే దిద్దుకోనీవమ్మా…” అని కూతురుని అడుగుతాడు మారిన మనిషైన తండ్రి. మనసుని బరువెక్కిస్తుందీ పాట.

కాలేజీల్లో అల్లరి చేస్తూ, చదువు ముగించుకుని వెళ్ళిపోతున్న పిల్లలు తమ అల్లరి గురించి, జ్ఞాపకాల గురించి పాడుతూ, “మరపురాని తిరిగిరాని గురుతులండి.. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండీ” అంటే… లెక్చరర్స్, స్టాఫ్… “మనకు మనకు క్షమాపణలు ఎందుకండి.. మీ వయసులోన మేం కూడా ఇంతేనండీ” అంటారు ‘స్టూడెంట్ నెం 1’ సినిమాలోని “ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము” అనే పాటలో. ఎందరిలోనో ఎన్నెన్నో మధుర స్మృతులను మేల్కొలుపుతుందీ పాట.

ఇక తెలుగు/హిందీ సినీ గీతాలలో ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు క్షమించమని అడిగే పాటలకి కొదవలేదు.

‘ముసాఫిర్‌ఖానా’ సినిమాలో ప్రేయసీ ప్రియులు అపార్థాలను తొలగించుకుని, ఒకరి నొకరు క్షమించుకుందామనుకుంటారు “अच्छा जी माफ़ कर दो थोड़ा इन्साफ़ कर दो दिल पर जो तीर चलाए उसका हिसाब कर दो” అనే పాటలో. మజ్రూహ్‌ సుల్తాన్‌పూరి గీతానికి ఓ.పి.నయ్యర్ సంగీతం సమకూర్చగా; రఫీ, గీతా దత్ పాడారు.

‘అనగనగా ఒక రోజు’ సినిమాలో తన కోసం ఎదురుచూస్తున్న ప్రేయసిని కలుసుకోడానికి ఆలస్యంగా వెళ్ళిన హీరో “ఓ చెలీ క్షమించమన్నానుగా.​..​” అంటే, హీరోయిన్ “నీకిది ఇవాళ కొత్త కాదుగా…” అంటూ రిటార్ట్ ఇస్తుంది.

‘ఏ మాయ చేశావే’ సినిమాలో ఎ.ఆర్. రెహమాన్ సంగీతదర్శకత్వంలో శ్రేయా ఘోషల్ పాడిన “పలుకులు నీ పేరే తలచుకున్నా” అనే పాటలో “మౌనంతో నీ మదిని బంధించా మన్నించు” అని అడుగుతుంది ప్రేయసి. అనంత శ్రీరామ్ గారి ఈ గీతం పదాలతో మాయ చేస్తుంది.

‘దేవదాస్’ (రామ్, ఇలియానా) సినిమాలో “నిజంగా చెప్పాలంటే క్షమించు/నా పరంగా తప్పే ఉంటే క్షమించు/చిరాకే తెప్పించానంటే క్షమించు/నీ మనస్సే నొప్పించానంటే క్షమించు/దయచేసి ఎక్స్‌క్యూజ్ మి, దరిచేరి ఫర్‌గివ్ మి, ఒకసారి బిలీవ్ మి” అంటూ తన మనసుని అర్థం చేసుకోమంటూ ప్రేయసి ప్రియుడిని బ్రతిమాలుతుంది.

అపోహలలో చిక్కుకున్న ప్రేయసిని “మన్నించవా మాటాడవా కరుణించవా కనిపించవా” అంటూ బ్రతిమాలుకుంటాడు ‘నచ్చావులే’ సినిమాలో భాస్కర్ భట్ల రవికుమార్ రాసిన గీతంలో ప్రియుడు.

క్షమించడం గురించి తెలుగు, హిందీ సినిమాలో చాలా డైలాగులు ఉన్నాయి. నాకు గుర్తొచ్చిన కొన్నింటిని ప్రస్తావిస్తాను.

‘మాయాబజార్’ సినిమాలో అభిమన్యుడు సుభద్రతో కలసి అడవిలో వెళ్తుండగా ఘటోత్కచుడితో పోరాటం చేయాల్సి వస్తుంది. అంతకు ముందు తను పంపిన రాక్షసులని అభిమన్యుడు ఎదుర్కున్న తీరు ఘటోత్కచుడికి నచ్చుతుంది. అభిమాన్యుడి రూపం, కోపం చూసి ముచ్చటపడతాడు. “పేరు చెప్పి, శరణు కోరరా, నా వాడవవుతావు” అంటాడు. క్షమించమని మనఃపూర్వకంగా కోరితే, ఎదుటి వ్యక్తి మన్నిస్తే మనుషులు కలిసిపోతారని ఈ డైలాగ్ చెబుతుంది.

“माफी माँगने से कोई छोटा-बड़ा नहीं होता, और जो माफ़ कर देता है, उसका दिल बहुत बड़ा होता है” అని ‘కభీ ఖుషీ కభీ గమ్’ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. క్షమించడం వల్ల ఎవరూ పెద్దా, చిన్నా అవరు. కానీ క్షమించే వారి హృదయం విశాలమవుతుంది” అని అర్థం.

‘పెదరాయుడు’ సినిమాలో “గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే లేదనుకుంటే క్షమించు” అనే డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్. తర్వాతి కాలంలో దానికి పేరడీలు రాసి కామెడీ చేసేసారు.

‘అతడు’లో ధర్మవరపు చేత “సే సారీ టు పూరీ” అని హాస్య ధోరణిలో అనిపించినా, ‘అత్తారింటికి దారేది’లో పవన్ కళ్యాణ్ నోట “వీలైతే క్షమించు, లేదా శిక్షించు” అని పలికించినా త్రివిక్రమ్ డైలాగ్స్ అందరినీ అలరించాయి. ‘జల్సా’ సినిమాలో “వీలైతే వాడిచేత క్షమించు అన్నా అనిపించు… తెలుగులో….” అనే డైలాగ్‌లో ఆ పాత్రధారి అహంకారం ధ్వనిస్తుంది. భయంతో కోరే క్షమాపణ వల్ల మనసుకి సాంత్వన కలగదు.

***

క్షమించమని కోరితే, అది నిజాయితీగా ఉండాలి. చేసిన తప్పు మళ్ళీ చేయకూడదనే కనువిప్పు కలగాలి. కొన్నిసార్లు క్షమించడానికి సమయం పడుతుంది, కానీ మన్నింపు లభిస్తుంది. వ్యక్తులు, సమాజాలు, జాతులు, దేశాలు తాము చేసిన తప్పులకి క్షమించమని కోరితే ఘర్షణలు ఉండవు. వైషమ్యాలు తొలగుతాయి.

అయితే క్షమాపణ చెప్పడం వల్ల చేసిన తప్పు ఒప్పు అయిపోదు, తర్వాత కలిగే బాధ, టెన్షన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. అహాన్ని పక్కనబెట్టి బంధాలని పునర్నిర్మించుకునేందుకు వీలు కల్పిస్తుంది. ‘నన్ను క్షమించు’ అనే రెండు పదాలు జీవితకాలం కొనసాగే వివరణలకన్నా, సాకుల కన్నా గొప్పవి. అయితే క్షమాపణలను అలుసుగా తీసుకునేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. క్షమించరాని నేరాలు ఘోరాలు చేసినవారికి తగిన శిక్ష పడాలి. నిత్యం మనం కలిసి బ్రతకవలసిన మనుషులతో మాత్రం క్షమాపణ చెప్పడం గొప్పగా పనిచేస్తుంది. అహం, దర్పం వదిలిపెట్టి మనస్ఫూర్తిగా క్షమించమని అడిగితే మన వల్ల బాధపడినవారికి సాంత్వన కలుగుతుంది, మన మనసు తేలికవుతుంది. జీవనయానం సజావుగా సాగుతుంది!

“An apology is a lovely perfume; it can transform the clumsiest moment into a gracious gift.”– Margaret Lee Runbeck

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here