అపర్ణ

1
10

[సంచిక 2022 దీపావళి పోటీకి అందిన కథ.]

[dropcap]లో[/dropcap]కానికి వెలుగుని ప్రసరింప ఆయత్తమవుతూ తూర్పున ఉషా కిరణాలు మెల మెల్లగా విచ్చుకుంటున్నాయి. తలారా స్నానం చేసి దైవతార్చన ముగించుకొని తమ ఇంటి పెరట్లో కొలువై ఉన్న తులసి కోట చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు చేయసాగింది శ్యామల. ఆ తరువాత ఇంట్లో ముందుగా ఒక పీట మీద అమర్చిన తన అక్క అపర్ణ ఫోటోకి తాజా పూల దండతో అలంకరించి పరమాన్నం, అరటి పండ్లను ముందుంచి, రెండు చేతులను జోడించి నమస్కరించింది. అక్క ఆత్మకు శాంతిని ప్రసాదించమని మరో సారి ఆ దేవ దేవుని వేడుకొంది.

ఇంతలో ఫ్రెష్ అప్ అయి తన చుట్టూ బిల బిల మంటూ మూగి పోయారు.. పెద్దాడు అభిమన్యు, చిన్నోడు వివేక్, మూడో సంతానం త్రివేణి.. అభిమన్యు గీతంలో బి. టెక్ ప్రథమ, వివేక్ నారాయణ కాలేజ్‌లో జూనియర్ ఇంటర్, త్రివేణి ఏమో చైతన్య టెక్నోలో తొమ్మిది చదువుతున్నారు. వాళ్ళ ముగ్గురి చేతా స్నానాలు ముగింప జేసి, అప్పటికే సిద్ధంగా ఉంచిన ఉప్మా దగ్గరుండి వడ్డించింది.

సమయం ఎనిమిది కావొస్తూంది. గబ గబా మాస్టర్ బెడ్ రూమ్ లోకి వెళ్లి, భర్త సీతాపతి నిద్ర మత్తు వదిలించి బ్రష్, పేస్టు చేతిలో ఉంచి, బాత్ రూమ్ లోకి సాగనంపింది. పిల్లలు టిఫిన్ పూర్తి కానివ్వడంతో, అందరికీ బోర్నవిటా ఇచ్చేసరికి త్రివేణి స్కూల్ ఆటో వాడి హారన్ కాస్తా బోయ్ బోయ్ మని వినిపించింది.

ముగ్గురినీ లిఫ్ట్ దాక సాగనంపి, ఇంట్లోకి వచ్చేసరికి శ్రీవారు స్నానాదులు ముగించుకొని రిలాక్సింగ్ ఛెయిర్‍లో కూర్చొని న్యూస్ పేపర్ తిరగేయ సాగాడు. అతని చేతిని దొరక బుచ్చుకొని అపర్ణ ఫోటో దగ్గరికి భర్తని తీసుకెళ్లింది. ఆ ఫోటోని చూసిన మరు క్షణం అతని వదనంలో ఏదో తెలియని విషాదం పొడ సూపింది. ఇద్దరూ ఆమెకు నమస్కరించాక భర్తని సముదాయిస్తూ డ్రాయింగ్ రూమ్ వైపుగా నడిపించింది. వేడి వేడి కాఫీ ఇచ్చి అతని పక్కనే కూర్చుంది.

“చూడండి.. మీరలా విచారంగా ఉంటే, అక్క ఆత్మ శాంతించదు.. మీకు గుర్తుందిగా.. తన చివరి కోరిక ఏమిటో.. మీ మోహంలో చిరు నవ్వు ఎప్పుడూ మాసి పోకూడదు.. సరేనా?” అని ఓదార్పుగా అంది.

భార్య శ్యామల చేతిని తన చేతిలోకి తీసుకొని,

“అవును శ్యామా.. నువ్వు చెప్పింది ముమ్మాటికీ నిజమే. మనిద్దరం చిరకాలం అన్యోన్నంగా ఉండాలన్నదే అపర్ణ కోరుకున్నది..” అని దీర్ఘంగా శ్వాస వదిలి, “తను మనందరి నుంచి దూరమై ఇవాల్టికి పన్నెండేళ్ళు పూర్తి కావొస్తూంది” అన్నాడు గద్గద స్వరంతో. అవునన్నట్లుగా తలూపింది శ్యామల. భర్తను కాస్త ఒంటరిగా వదిలేయడమే మంచిదని భావించి కిచెన్ వైపుగా సాగిపోయింది శ్యామల.

సీతాపతి మదిని గతం గురించిన అస్తవ్యస్తమైన ఆలోచనలు కందిరీగల్లా దొలిచేయ సాగాయి. మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయిన అపర్ణతో తన పెళ్లి, ఆమె ఆకస్మిక నిష్క్రమణం తన గుండెకు చేసిన గాయం, శ్యామల ఓ దేవతలా తన జీవితంలోకి రావడం, తనను ఓ మనిషిగా తీర్చి దిద్దడం.. అన్నీ కళ్ల ముందు కదలాడాయి. ఏది ఏమైనా, అంతా మన మంచికే అనుకొని చిన్నగా నవ్వుకున్నాడు.

***

సీతాపతి వాళ్ళది విశాఖ జిల్లా చోడవరంలో ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం. నాన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కుటుంబంలో అయిదవ వాడు కావడంతో అంతగా ప్రాధాన్యత లేకుండానే బతికాడు సీతాపతి. ఉన్న కాస్తా సంపద అతని దాకా వచ్చే సరికి ఆరిపోవడంతో సీతాపతి చదువు కూడా ఎస్.ఎస్‌.ఎల్.సి.తో ముగిసి పోయింది. ఆ తరువాత ఎలాగోలా ఎమ్మార్వో ఆఫీసులో గుమస్తాగా కుదిరి పోయాడు సీతాపతి.

స్వతహాగా బిడియస్తుడు కావడంతో చిన్నప్పటి నుంచీ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఎల్లప్పుడూ ఏదో తెలియని ఆత్మన్యూనతా భావంతో సతమత మవుతూ ఉండేవాడు. తన చుట్టూ ఉన్న వాళ్లంతా అతన్ని ఎప్పుడూ ఎగతాళి చేసేవారు. మనసులో బాధ అనిపించినా ఎవరినీ పల్లెత్తు మాట అనేవాడు కాదు.

ఉద్యోగంలో చేరాక కూడా అతనికీ అవహేళనలు తప్ప లేదు. ఎందుకంటే, అందరిలా టేబిల్ కింద చేతులు చాచే అలవాటు అతనికి లేదు. దాని అర్థం అతనికి డబ్బు అవసరం లేదని అనుకుంటే, అది పొరపాటే! మంచితనం, నిజాయితీ రెండూ అతనికి ఆభరణాలుగా ఉన్నా, అతని మెతకతనమే అతనికి శత్రువుగా మారిందని చెప్పాలి.

సీతాపతికి యుక్త వయసు రావడంతో బంధువులు అతనికి సంబంధాలు తేవడం మొదలు పెట్టారు. గవర్నమెంట్ ఉద్యోగం కావడంతో సంబంధాలు చాలానే వచ్చాయి. గోవాడ గ్రామ సర్పంచ్ అష్టావధానుల మూడవ కుమార్తె అపర్ణ టెన్త్ వరకు చదువుకుంది.

ఓ మధ్యవర్తి ద్వారా ఆ సంబంధం రావడంతో ఆ అమ్మాయి గురించి సీతాపతి తండ్రి వాకబు చేసాడు. అమ్మాయి అందాల అపరంజి బొమ్మ. ఈడూ జోడూ కూడా సరి పోతుంది అని అంతా భావించడంతో పెళ్లి చూపులకు ఏర్పాట్లు జరిగాయి.

ఇరు పక్షాలకీ ఆమోద యోగ్యం కావడంతో ఆ సంబంధం వెంటనే ఖాయం చేసేసుకున్నారు. పెళ్లి చూపులు ముగిసి నెల తిరక్కుండానే సీతాపతి, అపర్ణల పెళ్లి జరిగి పోయింది. సీతాపతి జీవితంలో కొత్త అధ్యాయం అలా మొదలయ్యింది.

***

అపర్ణ స్వతహాగా చాలా తెలివైనది, చురుకైనది కూడా. చదువులో, ఆటల్లో అన్నింట్లో చలాకీగా ఉండేది. ఆమె మనస్తత్వానికి, తరహాకి పూర్తి వ్యతిరేకంగా ఉన్న సీతాపతి పట్ల ఆమె మనసులో మెలమెల్లగా అసంతృప్తి పేరుకో సాగింది. దానికి తోడు, వీధిలో అందరూ అతన్ని హేళన చెయ్యడం, అన్నింటికీ అతను మౌనంగా భరించడం ఆమె తట్టుకోలేక పోయింది.

ఎదిరించమని చెప్పబోతే, “ఎవరి పాపానికి వాళ్ళే పోతారులే అపర్ణా” అంటూ ఉదాసీనంగా మాట్లాడేవాడు. చాలా సార్లు భర్తకి బోధపరచడానికి విశ్వ ప్రయత్నం చేసినా, ఏమీ ఫలితం కనిపించక పోయేసరికి అతని మీద రాను రానూ ఆమెకు విసుగు, చిరాకు కలగ సాగాయి.

అదీ కాక, వ్యక్తిగతంగా కూడా సీతాపతి ఇంట్రావర్ట్‌గా ఉంటూ, ఆమె కళ్ళకు ఓ మొద్దావతారంలా అనిపించే వాడు. పోను పోను ఆ భావనలు ఆమెలో అసంతృప్తి జ్వాలలను రేకెత్తించ సాగాయి. ఎన్నో బంగారు కలలు కన్న తన జీవితం ఇలా నిరాశాజనకంగా ముగిసి పోయిందని తరచు తనలో తాను కుమిలి పోతూ ఉండేది.

తల్లితో ఈ విషయం చాలా సార్లు ప్రస్తావించినా, జీవితంలో ఇవన్నీ సర్వ సాధారణ విషయాలనీ, మనుషులంతా ఒకేలా ఎలా ఉంటారని సముదాయించి తన నోరు మూయించేసేది. యాంత్రికంగా అలా ఏడు సంవత్సరాలు గడిచి పోయాయి. గడిచిన ఈ కాలంలో రెండేసి సంవత్సరాల తేడాతో అపర్ణ ముగ్గురు పిల్లలకు తల్లి కావడం విశేషం. పిల్లల పనులతో ఎంత బిజీగా ఉన్నా, తనకు తీరని అన్యాయం జరిగిందన్న ఉక్రోషం మాత్రం ఆమెను వేధిస్తూనే ఉంది. అసంతృప్తి జ్వాలలతో ఆమె మనసు లోలోన రగులుతూనే ఉంది.

రోజులు ఇలా గడుస్తూ ఉండగా, సీతాపతి, అపర్ణలు కాపురం ఉండే ఇంటికి ఎదురు పోర్షన్‌లో ఆరడుగుల అందగాడు, ఆజానుబాహుడు అయిన ఓ పెళ్లి కాని యువకుడు అద్దెకు దిగాడు. అతని పేరు అభిషేక్. ఆ ఊరి పంచాయతీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ట్రాన్స్‌ఫర్ మీద వచ్చాడు. అనతి కాలంలోనే, అపర్ణ తనకు తెలియ కుండానే, అతని పట్ల ఆకర్షితురాలవడం మొదలుపెట్టింది.

అభిషేక్ స్వతహాగా స్త్రీలోలుడు, వ్యసనపరుడు కూడా. అపర్ణను అతను చూడక పోలేదు. ఆమె అందగత్తె అయినా కూడా, అతను ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే, ఆమె వివాహిత. అదీ కాక, ముగ్గురు పిల్లల తల్లి. ఎందరో పెళ్లి కాని అందగత్తెలు అతనికి దాసోహమవుతుంటే, ఈమెను పట్టించుకోకపోవడంలో అంతగా ఆశ్చర్య పడాల్సిన విషయం కూడా ఏమీ లేదు.

కానీ, అపర్ణ మానసిక పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తను కన్నె వయసులో ఎలాంటి అందగాడిని పరిణయమాడాలని కలలు కన్నదో, అచ్చం అలాంటి రాజకుమారుడు తన కళ్ళెదురుగా తచ్చాడుతుంటే అతనిపై ఆమెలో మోహం రోజు రోజుకీ రెట్టింపు అవసాగింది.

అలాంటి అందగాడిని పెళ్లాడే యోగాన్ని ఎలానూ కోల్పోయింది. కనీసం అతని సామీప్యాన్ని ఆమె మనసు తీవ్రంగా వాంఛించ సాగింది. తను ఎలా అయినా అతనికి దగ్గర కావాలి. అతని సన్నిధి కోసం తన తనువెల్లా పురి విప్పిన నెమలిలా నాట్యం చేయ సాగింది. అనుభవజ్ఞులు చెప్పినట్లు, స్త్రీ తలచుకుంటే, కాని పని ఈ ధరిత్రిలో ఏమైనా ఉన్నదా?

రోజు వారీ దిన చర్య ప్రకారం, అపర్ణ భర్త, పిల్లలు పొద్దున్న తొమ్మిదింటికల్లా వెళ్ళిపోతారు. కానీ, అభిషేక్ తొమ్మిదిన్నర తరువాత ఇంటి నుంచి ఆఫీస్‌కి బయలు దేరుతాడు. ఆ గ్యాప్‌ని అపర్ణ తెలివిగా వాడుకుంది. రోజూ ఏదో వంక పెట్టుకొని అభిషేక్ రూమ్‌కి వెళ్ళేది. తన భర్త గురించీ, పిల్లల గురించీ కబుర్లు చెప్పి, చివరగా తనకు అన్నీ సదుపాయంగా ఉన్నాయో లేవో అంటూ కుశల ప్రశ్నలు వేసేది.

“ఒంటరిగా ఉన్నారని మీరేమీ ఫీల్ కావద్దు.. మమ్మల్ని పరాయి వాళ్లుగా ఎప్పుడూ భావించకండి. ఏ సమస్య ఉన్నా, మాకు చెప్పండి. ఏమి తింటున్నారో ఏమిటో.. చూసే వాళ్ళు కూడా లేరు.. ఇదిగో కాఫీ తెచ్చాను.. తీసుకోండి!” మొదటి రోజు అలా తనను తాను పరిచయం చేసుకుంది అపర్ణ.

అభిషేక్ ఆమె చనువుకి కాస్త మొహమాట పడిన మాట వాస్తవమే. కానీ, పెళ్లి అయి ఏడేళ్లు గడచినా చెక్కు చెదరని ఆమె అపురూప లావణ్యం అతణ్ణి ముగ్ధుణ్ణి చేసింది. ఒక్కో రోజు, అభ్యంగన స్నానం చేసి తడియార బోసుకొనే కురులతో ఆమె అతణ్ణి వివశుణ్ణి చేసేది. కాఫీతో మొదలైన పరిచయం భోజనాల దాకా రావడానికి ఎన్నో రోజులు పట్ట లేదు.

తన గుండెలోని గుసగుసలు అతనికి కడు రమ్యంగా వినిపించడానికి ఉదయాన చిక్కిన ఆ అరగంట ఆమెకు చాలా స్వల్పంగా అనిపించ సాగింది. అతనితో ఎలాగైనా ఇంకా ఎక్కువ సమయం గడపాలని ఉంది. ఆలోచించగా ఆమెకో ఉపాయం తట్టింది.

భర్త, పిల్లలు అంతా రాత్రి తొమ్మిదింటికల్లా నిద్ర పోతారు. వాళ్లంతా గాఢ నిద్ర లోకి వెళ్ళిపోయాక సుమారు పదకొండు గంటలకి ప్రతి రోజూ అపర్ణ అభిషేక్ రూమ్‌కి వెళ్లడం ఓ అలవాటుగా చేసేసుకుంది. ఆఫీస్‌లో సిన్సియర్‌గా కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చే సీతాపతి దృష్టికి ఈ విషయం రానే రాలేదు.

ఇలా కొన్ని రోజులు గడిచే సరికి అభిషేక్‌కి అపర్ణ పట్ల విపరీతమైన ఆకర్షణ మొదలై పోయిందనే చెప్పాలి. ఏ రోజైనా తను రావడం ఓ అయిదు నిముషాలు ఆలస్యం అయితే అతనికి పిచ్చెక్కి నట్లుగా ఉండేది. తట్టుకోలేని అసహనంతో గదిలో పచార్లు చేసేవాడు. ఒక రోజు లేటుగా వచ్చిన అపర్ణను అమాంతం వాటేసుకొని కళ్ళ నీళ్లు పెట్టుకొని, “నువ్వు లేకుండా నేను బ్రతకలేను అపర్ణా, ఐ లవ్ యూ!” అన్నాడు ఎమోషనల్‌గా. అతని అవ్యాజమైన ప్రేమకు ఆమె పూర్తిగా కరిగి పోయింది.

“చూడు అభిషేక్, ఇలా దొంగతనంగా కలుసుకోవడం మనిద్దరికీ ఇబ్బందిగానే ఉంది. నాకో ఐడియా వస్తోంది. కొన్నాళ్ళు ఇద్దరం స్వేచ్ఛా విహంగాల్లా ఎక్కడికైనా వెళ్లి హాయిగా తనివి తీరా ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ తర్వాత, నువ్వెలాగూ నన్ను పెళ్లి చేసుకుంటానన్నావుగా. ఇంక మనిద్దరికీ అడ్డేముంది.. ఏమంటావు?” సమాధానం కోసం అతని కళ్ళలోకి చూసింది అపర్ణ.

“ఓకే, నీ ఆలోచన అద్భుతంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? ఎల్లుండి శుక్రవారం రాత్రి యథావిధిగా రూమ్‍కి వచ్చేయ్.. ఇక్కడి నుంచి పెరటి మార్గం ద్వారా బెజవాడ చెక్కేద్దాం. సరిగ్గా ఒంటి గంటకి ఎక్స్‌ప్రెస్ ట్రయిన్ ఉంది. దానికి రేపే మనిద్దరికీ తత్కాల్ టికెట్స్ బుక్ చేస్తాను. సరే.. ఇక వెళ్ళు . ఇప్పటికే చాలా పొద్దుపోయింది” ఉత్సాహంగా అన్నాడు అభిషేక్. అతని బుగ్గ మీద ముద్దు పెట్టి

”గుడ్ నైట్ డార్లింగ్.. బై!” అంటూ చీకట్లో కలిసిపోయింది అపర్ణ.

***

కాలం ఎవరి కోసం ఆగదుగా..! అనుకున్న ఆ శుక్రవారం రానే వచ్చింది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అభిషేక్, అపర్ణ ఇద్దరూ అర్ధరాత్రి గడప దాటేసారు. ఆటోలో రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ నుంచి రైల్లో విజయవాడకి పక్షుల్లా ఎగిరి పోయారు.

మర్నాడు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అక్కడ దిగి దగ్గరలోని లాడ్జిలో రూమ్ బుక్ చేసుకున్నారు. అపర్ణ మనసు ఇప్పుడెంతో ఉద్విగ్నంగా ఉంది. తన కలల రాకుమారుడితో ఇలా ఏకాంతంగా.. అదీ కాక, అస్సలు పరిచయం లేని మనుష్యుల మధ్య సుదీర ప్రాంతంలో.. ఏదో స్వప్నం లోలా గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది!

అభిషేక్‍ని తన హృదయానికి హత్తుకొని అతని ఒళ్ళంతా ముద్దులతో ముంచేసింది. “అభీ! యూ ఆర్ మై లవ్.. యూ ఆర్ మై లైఫ్.. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ.. నువ్వు దేవుడు నాకిచ్చిన వర ప్రసాదానివి. నన్ను విడిచి ఎప్పుడూ, ఎక్కడికీ వెళ్లనని మాటియ్యవూ.. ప్లీజ్!” అంటూ అతని కళ్ళలోకి చూసింది.

“కలలోనైనా నీ ఎడబాటు నే సహించ గలనని ఎలా అనుకున్నావు అపర్ణా..! ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? నువ్వు లేకుండా నేనూ జీవించలేను డియర్!” అంటూ ఆమె అధరాలను గాఢంగా చుంబించాడు. అలా వాళ్లిద్దరూ తనివి తీరా సరస సరాగాలలో తేలియాడారు.

తదుపరి, ఇద్దరూ ఫ్రెష్ అప్ అయి, ట్రిమ్‌గా తయారై సిటీలో హుషారుగా షికారు చేసారు. అలా వలపు సాగరంలో తెలియాడుతుండగా పది రోజులు పది క్షణాల్లా గడిచి పోయాయి.

ఇక ఇద్దరూ తిరుగు ప్రయాణం అయ్యే ఆలోచనలో పడ్డారు.

ఆ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక తామిద్దరి పెళ్లి ప్రస్తావన లేవనెత్తింది. “చూడు అపర్ణా.. అమ్మా, నాన్నలను నేను ఎలా అయినా ఒప్పిస్తాను. ఆ నమ్మకం నాకుంది. ముందుగా మనం మా ఊరు వెళదాం. సరేనా?” అంటూ ఆమెను ఒప్పించాడు. ఇద్దరూ హోటల్ రూమ్ ఖాళీ చేసి అభిషేక్ వాళ్ళ పల్లె వెంకటాపురానికై ప్రయాణమయ్యారు.

***

ఇదిలా ఉండగా, చోడవరం గ్రామంలో సీతాపతి ఎటూ తోచని అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడు తున్నాడు. శుక్రవారం రాత్రి అపర్ణ ఇల్లు వదలి వెళ్లిపోగా, మరునాడు మామూలుగా నిద్ర లేచిన సీతాపతిలో ఏదో తెలియని గుబులు మొదలయ్యింది. తన మనసు ఏదో కీడు శంకించ సాగింది.

తెల్లారి సమయం ఎనిమిది కావస్తోంది. పిల్లలు లేచిన అలికిడి ఏమీ వినిపించక పోవడంతో గదులన్నీ కలియ తిరిగాడు. పిల్లలు అంతా గాఢ నిద్రలో ఉన్నారు. అపర్ణ ఎక్కడా కనిపించక పోవడంతో బెడ్ రూమ్ లోకి వెళ్లి పరిశీలనగా చూసాడు. ఫ్లవర్ వాజ్ కింద రెప రెప లాడుతున్న ఓ లెటర్ అతని దృష్టిలో పడింది. అది అపర్ణ స్వహస్తాలతో రాసినది.

అందులో ఇలా రాసి ఉంది.

“ప్రియమైన భర్త సీతాపతి గారికి.. మీ భార్య అపర్ణ రాయునది. పెళ్లంటే చేసుకున్నాను గానీ, ఎప్పుడూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా భర్తగా స్వీకరించలేక పోయాను. పెళ్ళికి ముందు ప్రతి కన్య కాబోయే తన భర్త గురించి ఎన్నెన్నో బంగారు కలలు కంటుంది. మన పెళ్లితో నేను కన్న ఆ కలలన్నీ భగ్నం అయిపోయాయి.

సగటు అమ్మాయి ఊహించుకొనే ఏ మంచి సుగుణమూ మీలో లేక పోవడం నా దురదృష్టం. అలా తప్పనిసరి పరిస్థితుల్లో యాంత్రికంగా ఇన్నాళ్లూ మీ భార్యగా ఉన్నా, ఉంటూ మీ ముగ్గురి పిల్లలకు తల్లిని అయినా, ఈ రోజు వరకూ మీ పట్ల నాకు ఏ రకమైన ఆకర్షణ కలగలేదు సరి కదా, విముఖతయే పెరుగుతూ వచ్చింది.

ఇలా నిర్జీవంగా కాలం వెళ్లదీస్తున్న నా జీవితంలోకి నా కలల రాకుమారుడు మన ఎదురింటి అభిషేక్ రూపంలో వచ్చాడు. మేమిద్దరం ఒకరి నొకరం చాలా గాఢంగా ప్రేమించుకున్నాము. అందుకనే, నా ఈ బానిసత్వపు జీవితం నుంచి విముక్తిని వాంఛిస్తూ నేను అభిషేక్‌తో ఇష్ట పూర్వకంగా వెళ్లి పోతున్నాను.

మేమిద్దరం వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నాము. కాబట్టి, నా గురించి వెదికే వృథా ప్రయత్నం కానీ పోలీస్ కంప్లయింట్ ఇచ్చే శ్రమ గానీ తీసుకోవద్దు. ఆ పై మీ మనసును కష్ట పెడితే అన్యధా భావించవద్దు.

 ..ఏనాటికీ మీకు ఏమీ కాని మీ అపర్ణ.”

ఉత్తరం ఆసాంతం చదువుకున్న సీతాపతి వదనం క్షణంలో మ్లానమైంది. సామాజికంగా అది ఏ భర్తకైనా తట్టుకోలేని అవమాన భారం. చేతిలోని ఉత్తరాన్ని అయోమయంగా చూస్తూ దిగాలుగా అలా ఉన్న చోటనే జీవాన్ని కోల్పోయిన వాడిలా చతికిలబడి పోయాడు. మెల మెల్లగా ఆ కఠోర వాస్తవాన్ని జీర్ణించుకోడానికి ప్రయత్నించ సాగాడు. పిల్లలు ఒక్కొక్కరుగా లేచి వాళ్ళ అమ్మ గురించి వెదక సాగారు. వాళ్ళడిగే ప్రశ్నలకు సీతాపతి దగ్గర సమాధానాలు కరువయ్యాయి.

గుండె దిటవు చేసుకొని జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు, అత్తామామలకు క్లుప్తంగా ఫోన్‌లో తెలియ పరిచాడు. ఆఫీస్ సూపర్‍వైజర్‌కి ఫోన్ చేసి తన ఆరోగ్యం సరిగ్గా లేని కారణంగా సిక్ లీవ్ తీసుకుంటున్నట్లు తెలియజేశాడు.

దగ్గర్లోని హోటల్‌కి వెళ్లి అందరికీ టిఫిన్ తెమ్మని పెద్దబ్బాయికి పురమాయించాడు. దగ్గర గ్రామంలో కాపురం ఉంటున్న తన అక్క విజయలక్ష్మికి విషయం వివరించగా “నువ్వేమీ గాభరా పడకు తమ్ముడూ.. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను.” అంటూ ధైర్యం చెప్పింది.

అరగంటలో అక్కడికి టాక్సీలో చేరుకున్న అతని అక్క చిన్నమ్మాయి త్రివేణిని త్వర త్వరగా తయారు చేసి, టిఫిన్ బాక్స్ చేతిలో పెట్టి స్కూల్ కి పంపేసింది. మిగిలిన ఇద్దరూ తయారై వాళ్ళ వాళ్ళ కాలేజీలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసింది.

‘మీ అమ్మ ఊరెళ్ళింది. వారం రోజుల్లో వచ్చేస్తుంది’ అని వాళ్లందరినీ నెమ్మదిగా సముదాయించింది. ఆ రోజు ఆ ఇంట్లో చెలరేగిన ఆ తుఫాను ని ఆమె అలా డీల్ చెయ్యడంతో సీతాపతి మనసు కాస్త శాంతించింది.

***

అక్కడ విజయవాడలో హోటల్ గది ఖాళీ చేసి అభిషేక్, అపర్ణలు ఇద్దరూ రాత్రి పదకొండు గంటలకి బయలుదేరే వోల్వో బస్‌లో అనకాపల్లికి ప్రయాణం అయ్యారు. తెల్లారి అక్కడ దిగి, బ్రేక్‌ఫాస్ట్ వగైరా కానిచ్చి, అభిషేక్ వాళ్ళ గ్రామం వెంకటాపురానికి వెళ్లే బస్సు ఎక్కారు.

అభిషేక్ మనసు నిండా ఆందోళన కమ్ముకొని గజి బిజిగా ఉంది. తన తల్లిదండ్రులను ఒప్పించి తీరుతాను అని అపర్ణకి మాట ఇచ్చాడు గానీ, అది అంత సులభం కాదని తనకు ఖచ్చితంగా తెలుసు.

ఎందుకంటే, తమది సనాతన శోత్రియ బ్రాహ్మణ కుటుంబం. నిప్పును సైతం నీళ్లతో కడిగేంత చాదస్తం. తండ్రి సోమయాజులు గానీ, తాత జోగయ్య శాస్త్రి గానీ తమ వివాహానికి ఒప్పుకోవడం అసంభవం అని నిక్కచ్చిగా తనకు తెలుసు.. అయినా, ఎలాగోలా వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తే.. ఏమో ఎవరు చెప్పగలరు.. మారుతున్న కాలాన్నిబట్టి వాళ్ళ మనసూ మారవచ్చునేమో నేమో అనే చిన్న ఆశాకిరణంతో ఉన్నాడతను.

ఎలాగైతేనేమి వాళ్లిద్దరూ వెంకటాపురంలో అడుగు పెట్టారు.

ఈ గ్రామం, గోవాడ, చోడవరం అన్నీ దగ్గర దగ్గర గ్రామాలే. నాలుగైదు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. ఆ కారణంగా, అపర్ణ అనే ముగ్గురు పిల్లల వివాహిత ఎవరో యువకుడి మోజులో పడి అర్ధరాత్రి అతనితో వెళ్ళిపోయిందనే వార్త ఆ సంఘటన జరిగిన మర్నాడే చుట్టు ప్రక్కల గ్రామాల్లో నిమిషాల్లో గుప్పుమంది.

అపర్ణ, అభిషేక్ ఆటోలో అతని ఇల్లు చేరుకున్నారు. ఎదురుగా ఉన్న పెద్ద మర్రి చెట్టు అరుగు మీద అపర్ణని కూర్చోబెట్టి, ‘ఇంట్లో వాళ్ళని మెల్లగా ఒప్పించి మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్లి పరిచయం చేస్తాను’ అంటూ ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా తమ ఇంటి వైపుగా సాగిపోయాడు.

అప్పటికే ఆ వార్త ఇంట్లో వాళ్ళ చెవిన పడడం మూలాన గుమ్మం దగ్గర కొడుకుని చూసిన తల్లి అనసూయలో వివేకం మేల్కొంది. ఎవరి కంటా పడకుండా పరుగు పరుగున వచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లిచ్చి, లో స్వరంలో కొడుకుతో.. “ ఏరా.. ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? ..అంత పెద్ద చదువులు చదివి ఇంత బుద్ధి తక్కువ పని ఎలా చేసావురా.. ఆ ముగ్గురు పిల్లల తల్లిని ఏ ధైర్యంతో ఇక్కడికి వెంట బెట్టుకు వచ్చావురా.. చదివేస్తే ఉన్న మతి కాస్తా పోయిందట.. అట్లా ఏడిసింది నీ భాగోతం.. ఛీ.. ఛీ.. నా కడుపున చెడ బుట్టావురా.. పో.. పోయి ఆ ముదనష్టాన్ని వదిలించుకుని రా..” ఆమె వాక్ ప్రవాహానికి అడ్డు తగిలాడు అభిషేక్.

“చూడమ్మా.. నువ్వెలాగైనా అనుకో.. నేను అపర్ణని గాఢంగా ప్రేమించాను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. ఆమె కూడా నేను లేకుండా బ్రతకలేనంతగా నన్ను ఆరాధిస్తోంది. ఇక తను పిల్లల తల్లి అంటున్నావు. ఆమె గతమంతా ఓ పీడకల. ఆ పంజరం లోంచి స్వేచ్ఛను కోరుతూ నన్ను చేరింది. తనకు జీవితాంతం తోడుంటానని నేనామెకు వాగ్ధానం చేశాను. దాన్ని ఎలాగైనా నిలబెట్టుకుంటాను. అందుకు నీ ఆశీర్వాదం కావాలి. అంతే.” అంటూ ముగించాడు.

చావిడిలోని వాలు కుర్చీలో కూర్చొని దినపత్రిక చదువుతున్న అభిషేక్ తండ్రి ఒక్క సరిగా ఉగ్రుడై లేచాడు. “ఏరా.. నీ కళ్ళు నెత్తికెక్కాయా ఏమిటి.. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నీకు ఇదేమి పోయే కాలంరా.. త్రాష్టుడా.. సిగ్గు ఎగ్గూ లేకుండా ఒక పిల్లల తల్లిని వెంట బెట్టుకొని వచ్చి మా ఎదురుగా నిలబడడానికి నీకు ఎన్ని గుండెలురా..” అంటూ తిట్ల వర్షం కురిపించ సాగాడు.

అభిషేక్ నీళ్లు నములుతూ.. “చూడండి నాన్నా.. మేమేమీ చెయ్యరాని పనేమీ చెయ్యలేదు. ప్రేమించుకున్నాం. అది నేరమా?” కాస్త ధైర్యాన్ని కూడగట్టుకుని అన్నాడు. అభిషేక్ మాటలకు నిలువెల్లా ఊగిపోతూ..

“నువ్వు ఆవిడను వదల్లేని పక్షంలో నీకు ఈ ఇంట్లో స్థానం ఉండదని మాత్రం గుర్తుంచుకో!.. అప్రాచ్యపు వెధవా.. మన వంశంలో చెడబుట్టావురా.. దౌర్భాగ్యుడా.. నా ఇంట్లోంచి బయటకు పో.. గెట్ అవుట్.. యూ రాస్కల్!”

తట్టుకోలేని ఆవేశంతో అభిషేక్ తండ్రి అలా ఆయాస పడుతుండగా.. అనసూయ పరుగెత్తుకొచ్చి.. “ నేను వాడికి సర్ది చెబుతా గానీ మీరు ఇలా వచ్చి విశ్రాంతి తీసుకోండి. నా మాట నమ్మండి.. నేను దీన్నుంచి వాడిని బయట పడేస్తాను. మీకు అసలే బీపీ.. ఏమాత్రం ఉద్రేకం పనికి రాదని డాక్టర్ చెప్పాడు.. అప్పుడే మర్చిపోయారా?” అంటూ అతని చెయ్యి పట్టుకొని బెడ్ రూమ్ వైపుగా సాగి పోయింది.

వసారాలోని అరుగు మీద చతికిలబడి పోయాడు అభిషేక్. ఇంతలో అనసూయమ్మ వచ్చి అతని పక్కన కూర్చుంది. “చూడరా అభీ.. మన ఇంటి సంగతులు నీకు తెలియనివి కావు. మాకు మాత్రం నువ్వు, నీ తమ్ముడు తప్పించి ఈ లోకంలో ఎవరున్నారు చెప్పు? మేము బ్రతుకుతున్నదే మీ ఇద్దరి కోసమన్న సంగతి నీకు తెలియని దేమీ కాదు. ఒక్క క్షణం ఆలోచించు.. ముగ్గురు పిల్లల తల్లిని నువ్వు చేసుకుంటే, మన కుటుంబం పరువేం కావాలి. రేపు సమాజంలో మనం తలెత్తుకొని బ్రతకగలమా చెప్పు..? ఏడు సంవత్సరాలు కాపురం చేసిన భర్తను, ముగ్గురు కన్న బిడ్డలను గాలికి వదిలేసి నీ మీద వ్యామోహంతో, క్షణికావేశంతో నీ వెంట వచ్చేసింది చూడు. ఆమె మనసు ఎంత స్థిరమైనదో నువ్వే ఆలోచించు. నువ్వు ఎర్రగా, బుర్రగా ఉన్న అందగాడివనేగా..? కొంచం బుర్ర పెట్టి ఆలోచించు.. రేపు మీ పెళ్లయి కొన్నేళ్లు గడిచాక నీకన్నా అందగాడు, యవ్వనవంతుడు ఇంకో అబ్బాయి ఆమెకు తారస పడితే, అతనితో వెళ్లిపోదని గ్యారంటీ ఏమిటి? నువ్వు చదువుకున్న వాడివి. కాస్త విజ్ఞతతో ఓ నిర్ణయం తీసుకో. ఈ ఇంటి పెద్ద అబ్బాయిగా నీ బాధ్యతను మరువకు” అంటూ చిన్నగా ఉపదేశం చేసింది.

అమ్మ చెప్పిన విషయం తార్కికంగా ఆలోచిస్తే కరక్టే అనిపించ సాగింది. కానీ, అపర్ణని అర్ధాంతరంగా అలా వదిలేయడానికి అతని మనసు అంగీకరించడం లేదు.

“చూడమ్మా.. పాపం.. అపర్ణ!.. నన్ను నమ్ముకొని వచ్చేసింది.. నేను ఆమెకి ఎలా ద్రోహం చేయను.. నువ్వే చెప్పు?” అని అమ్మను నిలదీసాడు.

“చూడరా అభీ!.. ఆమె ఇలా వచ్చేయడం వలన ఆమె పిల్లలు ఎలా తల్లడిల్లి పోతుంటారో నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? ..తనిలా అర్ధాంతరంగా వదలి వెళ్లిపోవడంతో ఆమె భర్త ఎంతలా తల్లడిల్లి పోతున్నాడో నీ మెదడుకు తట్టినదా అసలు? ఇలా తల్లీ, పిల్లల్ని వేరు చేసిన పాపాన్ని మూటగట్టుకోకు. నా మాట విని ఆమెకు అర్థం అయ్యేలా చెప్పు. నీ తల్లిదండ్రులు ఈ పెళ్ళికి ససేమిరా ఒప్పుకోవడం లేదనీ, కొన్ని రోజులు గడిచాక అన్నీ సర్దుకుంటాయనీ, అందాకా తనను తన భర్త దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరి, పిల్లలకి దగ్గరగా అక్కడే ఉండమని సముదాయించు. ఆమె భర్త ధర్మరాజు అంతటి శాంతపరుడనీ, మంచివాడని ఈ చుట్టు పక్కల గ్రామాల్లో ప్రతీతి. ఆమె తిరిగి వెళ్లి కాళ్ళ మీద పడితే తప్పక స్వీకరిస్తాడు అని చెప్పు. అంతకు మించి వేరే మార్గం కూడా ఏమీ లేదని ఆమెను ఒప్పించు. వెళ్లు.. ఆమెను ఎలా అయినా ఒప్పించి ఆటోలో తీసుకొని వెళ్లి వాళ్ళ ఊరికి వెళ్లే బస్సు ఎక్కించి రా. వెళ్లు.” అంటూ కుమారుడికి హితబోధ చేసింది అనసూయమ్మ.

ఆవిడ ప్రయోగించిన బాణం కొడుకు మీద బాగానే పని చేసింది.

బయట ఇద్దరూ ఓ అరగంట ఏవేవో చర్చించుకొని చివరికి ఆటోలో అక్కడ నుంచి నిష్క్రమించడం తలుపు సందుల్లోంచి అనసూయ గమనిస్తూ తనలో తాను చిన్నగా నవ్వుకుంది.

***

అపర్ణ అభిషేక్‌లు ఇద్దరూ చివరికి చోడవరం చేరుకున్నారు. ఆటో సీతాపతి ఇంటికి పదడుగుల దూరంలో ఉండగా..

“సరే అపర్ణా.. ఇక నే ఉంటాను. నువ్వు మీ వారిని క్షమాపణ కోరి ఎలాగోలా తిరిగి నీ పిల్లలను చేరుకో. నేను ఓ వారం రోజుల్లో వస్తాను.. ఓకే, బై!” అని ఆటో దిగి బస్ స్టాండ్ వైపుగా సాగిపోయాడు.

ఆటోలో దిగిన అపర్ణను గమనించిన విజయలక్ష్మికి ఆమెపై ఏహ్య భావం కలిగింది. ఎయిర్ బాగ్ చేతిలో పట్టుకొని మెల్లగా నడుస్తూ ఇంటిని చేరి గడప బయటే దుఃఖిస్తూ చతికిలబడిపోయింది. ఆ స్థితిలో ఆమెను చూసిన విజయలక్ష్మి మనసు జాలితో నిండిపోయింది.

‘ఏదో వ్యామోహంలో తొందర పడింది.. పాపం.. ఇప్పుడు పంచాయతీ పెట్టి ఆమెను గెంటించవచ్చు. అప్పుడు తమ్ముడు, పిల్లలు దిక్కు లేని వాళ్ళు అవుతారు.’ అని మనసులో అనుకొని ఆమె వచ్చిన సంగతి తమ్ముడికి చేరవేసింది. భారమైన హృదయంతో గుమ్మం దగ్గరికి వచ్చాడతను. ఏకధారగా విలపిస్తున్న అపర్ణ పరుగున వచ్చి అతని కాళ్ళను చుట్టేసింది

“ఏ భార్యా చెయ్యరాని తప్పు నేను చేసానండీ. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హతను కూడా కోల్పోయేను. మీరు, పిల్లలు లేకుండా నేను బ్రతకలేనండీ. నాకీ ఇంట్లో ఇంత చోటు ఇవ్వగలరా ప్లీజ్!” అంటూ గుండె పగిలేలా ఏడవ సాగింది. అసలే మెత్తని మనసు గల సీతాపతి వెంటనే కరిగి పోయాడు.

అక్క వైపు చూసి, “అపర్ణను లోపలికి తీసుకెళ్ళు” అని చెప్పి తన బెడ్ రూమ్ లోకి వెళ్లి పోయాడు. విజయలక్ష్మి అపర్ణను ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయింది.

***

భర్త క్షమించి ఇంట్లోకి రానిచ్చినా ఈ లోకం రాళ్లు విసరక మానదుగా..! అపరాధ భావనతో దిగాలుగా ఉన్న అపర్ణను వీధిలోని ఆడవాళ్లు సూటిపోటి మాటలతో వేధించసాగారు. అటు, పిల్లలతో చదువుకుంటున్న తోటి విద్యార్థులు సైతం వారిని హేళనగా చూసేవారు. ‘మీ అమ్మ లేచి పోయిందటగా’ అంటూ పక పక నవ్వేవారు. ఆ అవమానాలు తట్టుకోలేక పిల్లలు బయటకు వెళ్లడం మానేశారు.

అపర్ణకి కుమార్తె ద్వారా ఇంటి బయట వాళ్ళు ఎదుర్కుంటున్న అవమానాల గురించి తెలిసి కుమిలి పోతుంది. ఈ చిక్కుముడిని ఎలా విప్పాలి అని ఆమె అహోరాత్రులు ఆలోచించ సాగింది. అప్పుడు ఆమెకు తన చిన్ననాటి స్నేహితురాలు శ్యామల గుర్తుకొచ్చింది. మనసులో ఎన్నో తర్జన భర్జనలు చేసుకున్నాక, ఆమె మదిలో చివరికి ఒక ఆలోచన రూపు దిద్దుకుంది.

***

అపర్ణ, శ్యామల ఇద్దరూ టెన్త్ వరకూ కలిసి చదువుకున్నారు. తను రిటైర్డ్ హెడ్ మాస్టర్ రమణ మూర్తి గారి నాలుగో అమ్మాయి. మూర్తి గారికి ఏడుగురు సంతానం. మొదట నలుగురూ ఆడబిడ్డలే. ఉన్న ఆస్తి కాస్తా ముగ్గురు అమ్మాయిల పెళ్లిళ్లు చేసేసరికే కరిగి పోగా, అద్దె ఇంట్లోకి మారి పోయారు.

రోజులు గడిచే కొద్దీ శ్యామలకు సంబంధాలు రావడం తగ్గిపోయాయి. ఒకటి.. కట్నాలు ఇచ్చుకోలేని దుస్థితి, ఇక రెండోది.. ముప్పై ఏళ్ళ వయసు దాటి పోవడం, ఈ రెండూ శ్యామల పాలిట శాపాలుగా పరిణమించాయి.

అయినా అమ్మా, నాన్నలకు తను భారం కాకూడదు అనుకుంది.

ట్యూషన్ సెంటర్ లో పిల్లలకు పాఠాలు చెప్పి కాస్తో కూస్తో సంపాదించేది. అదీ కాక, ఇంటి దగ్గర జాకెట్లు, లంగాలు అవీ కుట్టి కొంత కూడబెట్టి సర్‌ప్రైజ్ గా అమ్మకిచ్చేది. వినయం, విధేయత, పెద్దల యెడల అపారమైన గౌరవం, నలుగురిలో నాలుకలా వుండే ఆమె కలుపుగోలు స్వభావం.. ఇవన్నీ ఆమె ఆభరణాలని చెప్పొచ్చు. కాకపోతే, పెళ్లి కాకపోవడం గురించి ఆమె బాధ పడడం మానేసి చాలా రోజులయింది. నిజానికి, ఇక తనకు పెళ్లి యోగం లేదని ఆమె ఏనాడో ఫిక్సయి పోయింది.

ఈ శ్యామల గురించే ప్రస్తుతం అపర్ణ ఆలోచిస్తున్నది .

‘మహిళా లోకానికి ఆదర్శ ప్రాయమైన లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న ఈ శ్యామల సీతాపతి భార్యగా ఈ ఇంటిలో అడుగు పెడితే ? శిధిలమైన ఈ ఇంట్లోని మనుష్యుల ఆత్మ విశ్వాసాన్ని తిరిగి వికసింప జేయ గలిగే మహత్తు శ్యామలలో ఉంది!

నేను ఎలాగూ సీతాపతి వంటి ఉత్తముడికి మంచి భార్యను కాలేక పోయాను. నా మూలంగా అతను ఏ సుఖ సంతోషాలను అనుభవించ లేదు. కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, శయనేషు రంభ.. అన్నారు. ఏ రకంగానూ అతన్ని సుఖపెట్టలేక పోయాను.

సమాజంలో అందరూ భర్త మెతకతనాన్ని గేలి చేస్తుంటే, తనూ అతన్ని సూటి పోటి మాటలతో క్రుంగదీస్తూ వచ్చింది. అయినా ఆ అమృత మూర్తి తనను ఆదరించాడు. ఇంతటి మంచితనాన్ని తట్టుకునే శక్తి తనకు లేదు.

ఈ కుటుంబానికి తీరని మనస్తాపాన్ని కలిగించాను. పైగా, పిల్లల లేత హృదయాలలో అవమాన భారాన్ని నింపాను. ఈ దుస్థితికి కారణమైన నాకే దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఉంది.

ఇక తన జీవితానికి ఎటూ ఓ అర్థం, పరమార్థం లేకుండా పోయాయి. అలా అని ఓ జీవచ్ఛవంలా ఆత్మన్యూనతా భావంతో తనలో తాను క్రుంగిపోతూ జీవితాన్ని కొనసాగించ లేదు.

కనీసం అతని జీవితం నుంచి నిష్క్రమించే ముందు, అతనికి ఓ ఆదర్శప్రాయమైన మహిళను అర్ధాంగిగా ప్రసాదిస్తాను. అర్ధాంగి అనే పదానికి సరైన నిర్వచనం శ్యామల. ఆమెను ఎలా అయినా ఇందుకు ఒప్పిస్తాను’

అని మనసులో స్థిరంగా అనుకొంది అపర్ణ. ఆ నిర్ణయానికొచ్చిన మరుక్షణం ఆమె మనసు ప్రశాంతతతో నిండి పోయింది.

***

మరుసటి రోజు అపర్ణ తన పుట్టింటికి వెళ్ళొస్తానని విజయలక్ష్మికి చెప్పి ఊరికి బయలు దేరింది. తిన్నగా శ్యామల ఇంటికి చేరుకొని, ముందుగా తన ఆలోచనను మిత్రురాలు శ్యామలతో షేర్ చేసుకొంది. ఆమె ఎంతకీ తన ప్రపోజల్‌కి అంగీకారం తెలుప లేదు. తనకు ఈ జీవితం మీద విరక్తి కలిగిందని, ఓ ఆధ్యాత్మిక సంస్థలో చేరాలని ఉందనీ, తన కోరికను ఎలా అయినా తీర్చమనీ మరీ మరీ బ్రతిమాలి ఆమెను ఒప్పించింది.

పిమ్మట రమణ మూర్తి గారిని, అతని భార్య ఇందుమతినీ ఒప్పించడం అంత కష్టం కాలేదు. కారణం, ఎలానూ తామిక శ్యామలకు పెళ్లి చేయ గలిగే అవకాశాన్ని కోల్పోయారని వాళ్లకు తెలుసు. అదీ కాక, సీతాపతి కూడా బ్రాహ్మణుడే, పైగా బుద్దిమంతుడు కూడానూ. పైగా, ఆ ఇంటినీ, పిల్లలినీ చక్కదిద్ద గలిగే తెలివి తేటలు తమ కుమార్తె శ్యామలకు ఉన్నాయని వాళ్లకు తెలుసు.

***

వారం రోజులు తిరక్కుండానే సీతాపతి, శ్యామలల పెళ్లి రిజిస్ట్రార్ ఆఫీస్‌లో పెద్దగా ఆర్భాటం లేకుండా జరిగి పోయింది. శ్యామల తన తెలివి తేటలతో సీతాపతిలోని ఆత్మన్యూనతా భావాన్ని నశింప జేసి అతన్ని ఓ వ్యక్తిత్వం గల మనిషిగా తీర్చి దిద్దింది. ఆనతి కాలంలోనే ఆమె సీతాపతి పిల్లలందరికీ ఆత్మీయురాలై పోయింది. సీతాపతి జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్లుగా చాలా హుషారుగా తయారయ్యాడు.

***

పుణ్య క్షేత్రాల స్పెషల్ బస్‌లో వెళ్లిన అపర్ణ ఓ నెల రోజుల తరువాత తిరిగి వచ్చింది. అంతా తను అనుకున్నట్లుగా జరుగుతున్నట్లు గమనించి చాలా సంతోష పడింది. అదే రోజు రాత్రి తన భర్త సీతాపతికి ఆమె ఓ లెటర్ రాసింది. తను ఎలానూ ఓ మంచి భార్యను కాలేక పోయానని, పిల్లలకూ ఓ ఆదర్శ మాతగా ఉండలేక పోయానని, ఏ భార్యా చెయ్యరాని, క్షమించరాని తప్పు తాను చేసానని దాంట్లో వివరించింది.

అతని జీవితం నుంచి తప్పుకొనే ముందు తనకు సరి అయిన అర్ధాంగిని తన వంతు బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాననీ, తన జీవిత లక్ష్యం ఇక నెరవేరిందనీ చెప్పుకొచ్చింది . తన ఆప్త మిత్రురాలు శ్యామలతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవితం కొనసాగించాలని కోరింది.

పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటూ, పాప ప్రక్షాళణార్థం తన శేష జీవితాన్ని భగవత్ సాన్నిధ్యంలో గడపాలని ఉందనీ, తన గురించి ఎవరూ వెదక వద్దని, ఏ రోజూ తన గురించి బాధపడ వద్దని, అదే తనను సంతోషాన్ని కలిగిస్తుందని తన మనసుని విప్పి ఆ ఉత్తరంలో రాసింది.

***

ఆ రోజు ఇంటి నుంచి బయల్దేరిన అపర్ణ మనసు ఆత్మన్యూనతా భావం నుండి విడివడి, పూర్తిగా ఆధ్యాత్మిక భావనలతో నిండి పోయింది. ఏవేవో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ దేశమంతటా ఒక విరాగినిలా తిరిగింది. చివరి మజిలీగా వారణాసి పట్టణం చేరుకొని అక్కడ ఒక మఠంలో సేద తీరింది.

ఐహిక వాంఛలను తృణప్రాయంగా ఎంచి, అన్నీ త్యజించి అక్కడికి చేరుకున్న ఎందరో సర్వ సంగ పరిత్యాగుల సన్నిధిలో ఆమెకు ప్రశాంతత సిద్ధించ సాగింది. అలా ఎన్నో సంవత్సరాలు గడిచి పోయాక ఆమెకు శివ సాన్నిధ్యం లభించింది.

ఆమె గురువు శారదా దేవి అపర్ణ కోరిక మేరకు ఆమె నిర్యాణ విషయాన్ని ఆమె భర్త సీతాపతికి తెలియజేసింది.

***

అలా క్షణికావేశంలో ప్రౌఢ ప్రాయంలో అపర్ణ వేసిన తప్పటడుగు వెనక్కు తీసుకోలేని ఓ అపరిపక్వ నిర్ణయమే! ఎంతటి వారైనా, తాము ఎదుర్కొన్న జీవన తరంగాల ఆటుపోట్లకు విచలితులు కావడం సర్వ సాధారణమే కదా! అయితే, తను చేసిన తప్పు ఎంత క్షమించ రానిదో గ్రహించి ఎంతో మానసిక వేదనకి గురి అయినదని చెప్పాలి. భర్తకి అందించలేని సుఖ సంతోషాలను, ఆనందాన్ని అతనికి దీటైన వేరొక మహిళను అతనికి అర్ధాంగిగా ప్రసాదించడం ద్వారా నెరవేర్చాలని సంకల్పించింది.

మానసిక ప్రక్షాళన చెందిన ఒక ఉత్తమ మహిళగా భగవత్ సాన్నిద్ధ్యంలో జీవిత పరమావధిని వెదుక్కుంటూ బయలు దేరిన అపర్ణ నిజం చెప్పాలంటే తన పేరును సార్ధకం చేసుకుంది. అందుకే, అగ్ని పునీత సీతలా ఆమె అభిలషించినట్లు తన కుటుంబ సభ్యులందరి మదిలో ఎప్పటికీ మరచిపోలేని ఒక మధురమైన స్మృతిగా నిలిచిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here