యాపిల్ కవర్లతో బొమ్మలు

0
6

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘యాపిల్ కవర్లతో బొమ్మలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ఫో[/dropcap]మ్ షీట్లు ఇప్పుడు ఆర్ట్ షాపులలో దొరుకుతున్నాయి. పిల్లలకు కావాల్సిన ప్రాజెక్టులు, నోటీసు బోర్డులు, ప్యాకేజీ, పార్టీ డెకరేషన్, క్రాఫ్ట్స్ అన్నిటికీ ఫోమ్ షీట్లను వాడుతున్నారు. మేము కూడా మా ఆసుపత్రిలో నేమ్ ప్లేట్ల కొరకు ఫోమ్ షీట్లనే వాడాము. ఇందులో గ్లిట్టర్ ఫోమ్ షీట్లతో ఎన్నో బొమ్మలు తయారు చేశాను. వీటిని సులభంగా మనక్కావాల్సిన ఆకారంలోకి కత్తిరించుకోవచ్చు. అందుకే క్రాఫ్ట్స్‌లో బాగా ఉపయోగిస్తున్నారు. అయితే నేను ఎక్కువగా వ్యర్థ పదార్థాలతోనే బొమ్మలు చేస్తాను కదా. ఫోమ్ షీట్లను కొనడం ఎందుకని ప్రత్యమ్యాయం కోసం చూశాను. అప్పుడే పండ్లకు దెబ్బ తగలకుండా వచ్చే వల లాంటి ఫోమ్ కవర్లు కనిపించాయి. యాపిల్, జామ, డ్రాగన్ వంటి పండ్లు ఫోమ్ వలల్లో పెట్టుబడి వస్తున్నాయి. అందుకని ఇంట్లోకి తెచ్చే పండ్ల కవర్లన్నీ తీసి దాచి పెడుతున్నాను. ఎంతో అందంగా వలలా ఉండే యాపిల్ కవర్లు అనేక రంగుల్లో సైతం లభ్యమవుతున్నాయి. నేను వాటిని దాచి రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు. మీకూ చూపిస్తాను రండి.

మా ఇంట్లో యాపిల్స్ తెచ్చుకున్నపుడు వచ్చే ఫోమ్ కవర్లను ఒక పక్కన పెడతాను. రిలయన్స్ ప్రైష్, స్పైన్సర్, డి-మార్ట్ లలో కొన్నపుడు రంగు రంగుల ఫోమ్ కవర్లు వస్తాయి. వాటిని కూడా తెచ్చుకుంటాను. ప్రస్తుతం ఎరుపు రంగు, నారింజ రంగు యాపిల్ కవర్లను తీసుకున్నాను. సాధారణంగా అయితే తెలుపు రంగులో ఫోమ్ కవర్లు వస్తాయి. రంగుల్లో అయితే బాగుంటాయని వీటిని తీసుకున్నాను. ఇప్పుడు కవరును తీసుకుని ఒకవైపు ముడి వేయాలి. రబ్బరు బాండుతో వేయవచ్చు. ఈ ముడిని వెనక్కి తిప్పి మరల మడిచి మరొక రబ్బరు బ్యాండుతో ముడి వేయాలి. ఇప్పుడు కొద్దిగా లావు అవుతుంది. దీనిని రెండు మూడు సార్లు ముడి తిప్పినపుడు యాపిల్ ఆకారంలో వస్తుంది. ఇలా ఐదారు యాపిల్ కాయల్ని చేసుకోవాలి. ఇప్పుడొక ప్లాస్టిక్ కుండీని తీసుకొని మట్టితో నింపాలి. లేదంటే చిన్న చిన్న గులకరాళ్ళతో కూడా నింపవచ్చు. ఒక కర్ర ముక్కను తీసుకొని దానికి ఆకుపచ్చ రంగు వేసుకోవాలి. లేదా ఆకుపచ్చరంగు టేపుతో చుట్టుకోవాలి. పక్కలకు కూడా కొమ్మలు పెట్టుకోవాలి. ప్లాస్టిక్ ఆకుల్ని తెచ్చుకుని కొమ్మలకు చుట్టాలి. ఇప్పుడు ఫోమ్‌లో తయారైన యాపిల్స్‌ను తీసుకుని కొమ్మలకు అతకాలి. ఒక ఫోమ్ యాపిల్‌కు ఒకటి, రెండు ఆకులు వచ్చేలా చూడాలి.

ఇప్పుడు వంగరంగు ఫోమ్ కవర్లు తీసుకోవాలి. ఇలా రంగుల కవర్లు కావాలంటే మాల్స్‌కు వెళ్ళాలి అని అనుకున్నాం కదా! నేను అలాగే తెచ్చుకున్నాను. ఫోమ్ కవరు గుండ్రంగా ఉంటుంది, దాని మధ్యలో కాయ దూరేలా ఉంటుంది కదా! ఇలాంటి కవర్ని తీసుకుని ఒక వైపు కత్తిరించుకోవాలి. ఇప్పుడు నలుచదరపు ముక్కలా తయారవుతుంది. కత్తెర తీసుకుని ఈ ఫోమ్ ముక్కను నిలువుగా సన్నని ముక్కలుగా కత్తిరించాలి. అంటే ఒక చివరి వైపున తెగిపోకూడదు. చాలా సన్నగా కత్తిరించాలి. సన్నని చీపురు పుల్లను గానీ చెక్కపుల్లను గానీ తీసుకోవాలి. దీనికి గ్లూ రాసుకుంటా చీలికల ఫోమ్ షీటును అతికించుకోవాలి. అంటే కర్ర పైభాగం నుంచి గుండ్రంగా తిప్పుతూ అతికిస్తే కొద్ది దూరం వస్తుంది. ఇలాగే మరొక ఫోమ్ కవరును తీసుకుని సన్నని చీలికలుగా కత్తిరించుకుని మరల పుల్లకు చుట్టుకుంటూ రావాలి. రెండు కవర్లయితే సరిపోతుంది. ఇదొక పుల్ల తయారయింది కదా! సన్నని చీలికలు విడిపోయి పూల గుత్తిలాగా వస్తుంది. అలాగే మరికొన్ని పూల కొమ్మలు తయారు చేసుకోవాలి. వీటిని ఒకే రంగుతో చేసుకోవచ్చు. లేదంటే రంగు రంగుల కొమ్మలతో చేసుకోవచ్చు. గ్లూతో అతికించడం కష్టమయితే డబుల్ టేప్ తెచ్చి అతికించుకోవచ్చు ఇలా తయారైన పూల కొమ్మల్ని ఫ్లవర్ వేజ్‌లో పెట్టుకుంటే బాగుంటుంది.

మా చిన్నప్పుడు ఇలాంటి వల కవర్లు టానిక్ సీసాలకు వచ్చేవి. దానీతో రుబ్బు రోలు అనీ, శివలింగం అనీ తయారు చేసేవాళ్ళం. అవి ప్లాస్టిక్ వలలు నేనీ మధ్య వాటితో అంట్లు తోముకునే ప్లాస్టిక్ పీచులా తయారు చేస్తూన్నారు. ప్లాస్టిక్ పీచు కొనకుండా సరిపోతున్నది. అలాగే ఇప్పుడు తెల్లని ఫోమ్ వలలతో వెడల్పైన సన్ ఫ్లవర్ లాంటి పువ్వుల్ని చేయాలను కున్నాను. ఫోమ్ వలలతో పువ్వులు తయారు చేయడం చాలా సులభం. ముందుగా కవరును కత్తిరించి నలుచదరపు భాగంగా మార్చాలి. ఆ తర్వాత ఒకవైపు మడిచి గట్టిగా ముడి వేయాలి. ఈ ముడిని తిరగేసి మరల ముడి వేయాలి. ఇప్పుడు మధ్యలో ముద్దగా ఉండి చుట్టూ ఖాళీ కవరు కనిపిస్తుంది. విరిసిన రెక్కల మధ్య ముద్దబంతి లాగా కనిపిస్తుంది ఇవి రెండు మూడు పువ్వులు చేసుకున్నా చాలు. ఫ్లవర్ వేజ్‌లో నిండుగా కనిపిస్తాయి. అందుకే చాలా సులభంగా ఐదు నిమిషాల్లో చేసేయవచ్చు.

ఇప్పుడు టెడ్డీ బేర్‌ను చేసుకుందామా! నేను ఇంతకు ముందు స్పాంజి ముక్కలతో టెడ్డీ బేర్లను చేశాను. అదే విధానంలో ఇప్పుడు ఫోమ్ కవర్లతో టెడ్డీ బేర్‌ను చేయటానికి ప్రయత్నించాను, బాగా వచ్చాయి. వీటి కోసం ఫోమ్ కవర్లను తీసుకోవాలి. ఏ రంగు ఫోమ్ కవర్లైనా వాడుకోవచ్చు. గుండ్రంగా ఉన్న ఫోమ్ కవర్లను అలాగే ఉంచాలి. ఒక ఫోమ్ కవర్ లోపలా దూర్చాలి. ఇంకో పోమ్ కవరును తీసుకుని ఆ కవర్ లోపల దూర్చాలి. ఇలా ఐదారు ఫోమ్ కవర్లను ఒక దానిలో ఒకటి దూర్చుకుంటూ రావాలి. లోపల ఖాళీ లేకుండా దూర్చుకోవాలి. ఇప్పుడు ఫోమ్ కవరు లావుగా అవుతుంది. దీనిని తల, శరీరంగా విడగొట్టాలి. కవర్ బండిల్‌కు మధ్యగా గట్టిగా మడివేయాలి. ఇపుడు తల, శరీరంగా విడిపోతుంది. తల వైపు రెండు చివర్లూ ముడులు వేయాలి. అలాగే శరీరం కింది భాగాన రెండు చివర్లూ ముడులు వేయాలి. ఇపుడు టెడ్డీ బేర్ రూపం వస్తుంది. తల భాగంలో ముక్కు, నోరు పెట్టాలి. టెడ్డీ అందగా రేవో తయారయింది.

మరో పూల కొమ్మను తయారుచేద్దాం. ఫోమ్ కవరు డైమండ్ ఆకారపు అల్లికలో ఉంటుంది. డైమండ్ ఆకారపు అల్లిక దగ్గర కత్తిరించుకుంటూ పోవాలి. ఇలా చిన్నచిన్న ముక్కలు తయారవుతాయి. రెండు ముక్కల్ని కలిపి అతికితే చిన్న పూ మొగ్గలా కనిపిస్తుంది. ఇలా రెండు రెండు ఫోమ్ ముక్కల్ని కలుపుకుంటూ వెళ్ళాలి. చాలా పూ మొగ్గలు తయారవుతాయి. ఒక చీపురు పుల్లను తీసుకోవాలి. పుల్లకు ఈ పూ మొగ్గలను అతికించుకుంటూ పోవాలి. పూ మొగ్గలను చీపురు పుల్ల చుట్టా పెట్టుకుంటూ అతకాలి. చీపురు పుల్ల చుట్టూ ఆకుపచ్చ టేప్‌ను అతికించుకుంటూ వెళ్ళాలి. అందమైన పూల కోమ్మ తయారవుతుంది. ఇలా అనేక పూల కొమ్మలు చేసుకుని ఫ్లవర్ వేజ్‌లో పెట్టుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here