కాజాల్లాంటి బాజాలు-51: అప్పుడయితే

2
6

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఏ[/dropcap]విటో ఈ లాక్‌డౌన్ కాదుకానీ ఈమధ్య వదినని కలవలేకపోవడ మన్నది చాలా కష్టంగా వుంటోంది. ఫోన్‌లో మాట్లాడుకుంటున్నా కూడా ఇదివరకులా మా మాటలు సాగడంలేదు. ఇదివరకైతే మగాళ్ళు ఆఫీసులకీ, పిల్లలు స్కూళ్ళకీ వెళ్ళిపోయేవారు కనక వదినా, నేనూ ఇంట్లోవాళ్ళమీదా బైటవాళ్లమీదా ఇష్టమొచ్చినట్టు మాట్లాడేసుకునేవాళ్లం. కానీ ఇప్పుడేం మాట్లాడినా ఇంట్లోవాళ్లకి వినిపిస్తుందాయె. అందుకని కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసొస్తోంది. అందుకే అసలు కడుపులోమాట బైటకి చెప్పుకునే అవకాశం లేక కడుపునెప్పి కూడా ఎక్కువైపోతోంది.

నా అదృష్టం బాగుండి ఇవాళ నాకు బలే విషయం దొరికింది. మా పినమావగారి మనవరాలికి పెళ్ళి కుదిరింది. ఎప్పుడో నాలుగునెలల క్రితం పెళ్ళిచూపులయిన ఆ సంబంధం మాటలన్నీ కుదిరి ఇప్పుడు “శుభం” అనుకున్నారు. ఆ పెళ్ళికొడుకువాళ్ళూ వదినకి దూరపు బంధువులే. ఈ విషయం వదినకి తెలుసో లేదో ననుకుంటూ వెంటనే ఈ విషయం చెప్పెయ్యాలని ఫోన్ చేసేను.

“హలో వదినా, మా వాణీకి, అదే మా పినమావగారి మనవరాలికి పెళ్ళి కుదిరింది…”

వదిన – అవునట కదా! మా కజిన్ పద్మ చెప్పిందిలే… మగపెళ్ళివారు మాకూ బంధువులే. అయినా ఆడపెళ్ళివారికంత అహం వుండకూడదమ్మాయ్…

నేను – మాకేవుంది అహం! ఆడపెళ్ళివాళ్లం కనకే అడిగినవాటికన్నింటికీ ఒప్పుకున్నాం…

వదిన – ఏవిటీ ఒప్పుకునేదీ… ఈ రోజుల్లో వెండిబిందెలివ్వడం ఎంత మామూలయిపోయిందీ! అలాగే మా వాళ్ళిమ్మంటే మూడురోజులాలోచించేరుట ఔననడానికి…

నేను – ఇంతోటి వెండిబిందెలూ ఇవ్వలేక కాదేం వొదినా… వెండిబిందె లివ్వడం మా ఇంట్లో ఆనవాయితీ లేదని అన్నాళ్ళాలోచించేమంతే…

వదిన (వేళాకోళంగా)-  మరి మూడురోజులయేటప్పటికి ఆనవాయితీ మారిపోయిందా!

నేను (కాస్త విసురుగా) – మావాళ్ళేం అలా చీటికీ మాటికీ మారిపోయేవాళ్ళేం కాదులే వొదినా. మీరు ఆనవాయితీ మానుకోడమెందుకూ, ఆ వెండిబిందెలు మేనకోడలికి పెళ్ళి బహుమతిగా నేనిస్తాలెండి అన్నాడు పెళ్ళికూతురు మేనమావ, అందుకని ఒప్పుకున్నారు.

వదిన – ఓహో, మేనమావ ఇస్తానన్నాడా! అందుకేనేంటీ పద్మం చెప్పిందిలే పేరుకి వెండిబిందెలే కానీ అవి సైజులో చెంబులంతే వుంటాయిలే అంది.

నేను (పౌరుషంగా) – ఒహో… అందుకేనేమో పెళ్ళికూతురికి పదిగ్రాముల్లో నాన్తాడు పామిస్తామన్నార్ట మగపెళ్ళిఉవారు. హూ! అయినా  లక్ష్మిలాంటికోడలు ఇంట్లో దీపం పెట్టడానికి వస్తోందే, కాస్త పచ్చగా కనిపించేలా కాసులపేరో, జిగినీ గొలుసో పెట్టొచ్చుగా… అలా నాన్తాడు పామించేబదులూ..

వదిన – అవును మరి, మీ వాణీకి ఒంటినిండా బాలతొడుగు వుందన్నారుగా మీ వాళ్ళు. ఇంకా ఎక్కువైతే అసలే సుకుమారి, మోయలేదని నాన్తాడు మాత్రం చేయిస్తున్నారు.

నేను – బాలతొడుగు గురించి నువ్వేం దెప్పనక్కర్లేదులే వదినా… ఆడపిల్లని మెడా, చేతులూ బోసిగా వుంచి పంపరు కదా! మెళ్ళోకీ, చేతులకీ ఒంటిపేట గొలుసూ, గాజులూ వున్నాయిలే.

వదిన – ఇహనేం… ఇంక నాన్తాడు మాత్రం యెందుకూ! ఆ ఒంటిపేట గొలుసులో సూత్రాలు కట్టేసుకుంటే అయిపోయే. ఈ మాటే చెప్తా మా వాళ్లకి.

నేను – అంటే అది కూడా ఎగ్గొట్టేద్దామనే!

వదిన – మరి లేకపోతే!  ఒక్కగానొక్క ఆడపడుచు కదా! ముచ్చటకైనా ఓ తులం బంగారం ఇస్తామన్నారా మీ వాళ్ళూ!

నేను – హయ్యో… నీకు తెలీందేవుందీ! ఈ ఊరి కా ఊరెంతో… ఆ ఊరికీ ఊరూ అంతే మరి. పెళ్ళికూతురికి పదిగ్రాముల నాన్తాడు పామించేవాళ్ళకి ఆడపడుచు లాంఛనాలు కూడానా… దండగ… అయినా ఆ ఆడపడుచు కూడా తుమ్మల్లో పొద్దూకినట్టు మొహం పెట్టుకుని, మూతి బిగించుకుని కూర్చుందిట. అయ్యో, తమ్ముడి పెళ్ళని అసలా మొహంలో సంతోషమే లేదుట…

వదిన – నాకిది కావాలీ అని అడుగుతుందేవిటీ ఆడపడుచూ! వాళ్ళైతే ఆ పిల్ల పెళ్ళికి వాళ్ళాడపడుచుకి మోయలేనన్ని ఇచ్చి పంపారు తెల్సా!

నేను – అయ్యో… ఎందుకు తెలీదూ! ఎందుకూ పనికిరానివి ఎన్నైనా ఇస్తారు.

వదిన – అవున్లే… ముద్దుముచ్చట్లు జరపాలని మీకుండాలి కానీ అడిగి చేయించుకుంటారా యేంటీ! వియ్యపురాల్ని కూడా ఓ గౌరవం,  వందనం లేకుండా ఓ మూలకి నెట్టేసేర్ట  మీవాళ్ళు.

నేను – మరింకేం చేస్తారూ! నేనే ఇంతోటి వియ్యపురాల్నమ్మా అంటూ గడెక్కి కూర్చుందిటావిడ.

వదిన – అయినా ఆమాత్రం కూడా తెలియొద్దూ.. వియ్యపురాలన్నాక ఆమాత్రం బెట్టుండకపోతే తర్వాత మీరే దెప్పుతారు..వియ్యపురాలు ఇంత మందంగా వుందేవిటీ… అంటూ…

ఇలా మాట మీద మాటలాడుకుంటూ, ఇంక ఆగలేక అట్నించి వదినా, ఇట్నించి నేనూ ఫక్కున నవ్వేసుకున్నాం.

అయిదు నిమిషాలపాటు ఆగకుండా నవ్వుకున్నాక కానీ మా ఇద్దరికీ మళ్ళీ నోటమ్మట మాట రాలేదు.

నేను – ఎన్నాళ్లయింది వదినా, ఇలా పెళ్ళిళ్ళలో పెట్టుపోతల గురించి మాట్లాడుకునీ…

వదిన – అవును… ఈ రోజుల్లో ఇలా ఎవరూ మాట్లాడుకోటంలేదు. ఒకరి కొకరు పెళ్ళివారిద్దరూ కలిసి సంతోషంగా పెళ్ళి చేసుకుంటున్నారు. అప్పటి ఆ మాటలు మళ్ళీ బలే గుర్తు చేసేవు.

నేను – అవును వదినా, ఇంతకీ ఓ ఆ మాట అడుగుదామని ఫోన్ చేసేను. ఇంతకీ ఏ మాటలూ లేకపోతే మా పినమావగారు ఎప్పుడనగానో చూసిన సంబంధాన్ని ఇప్పుడు ఓకే అనుకోవడమేంటీ!

నా ధర్మసందేహాన్ని వదిన ముందు పెట్టేను.

వదిన – పిల్లలిద్దరూ ఒకళ్ళ కొకళ్ళు అప్పుడే నచ్చేరు. కానీ ఆ పిల్లాడు థీసిస్ సబ్మిట్ చేసేడు కదా! డిగ్రీ వచ్చి, ఏదైనా జాబ్‌లో చేరేక కానీ పెళ్ళి చేసుకోనన్నాడుట. మొన్ననే ఉద్యోగం వచ్చింది. అందుకని ఇప్పుడు ఓకే చేసుకున్నారు.

నేను – అయితే మనం పెళ్ళికి రెడీ అయిపోవాలన్న మాట.

వదిన –(నవ్వుతూ) నేను మగపెళ్ళివారి సైడు… కాస్త జాగ్రత్తగా చూస్కోవాలమ్మోయ్

నేను – అయ్యో, నిన్నెంత బాగా చూసుకోవాలో ఆ మాత్రం నాకు తెలీదా. నా పట్టుచీరే కదా నీకు ఎరువిచ్చేదీ! ఆ పట్టుచీర కట్టుకుని నువ్వు మంచీచెడూ చూసుకోకుండా అన్నిచోట్లా కూర్చోకుండా నీ వెనకాల పీటుచ్చుకుని తిరుగుతాలే!

వదిన – (నవ్వుతూ) మొత్తానికి ఆడపడుచు ననిపించుకున్నావ్!

నేను – ట్రైనింగ్ నీదేగా వదినా… క్రెడిట్ అంతా నీకే…

వదిన – హ హ హ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here