అప్‌ప్‌ప్‌ప్‌ప్పుడొచ్చి కనపడు!

58
11

[dropcap]ఆ[/dropcap] రోజు రఘుబాబు ఇంట్లో ఉదయం నుండే సందడి మొదలైంది. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహోద్యోగులతో ఇల్లంతా కిటకిటలాడుతుంది. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాలు, కుశల ప్రశ్నలతో హోరెత్తుతుంది. అందరి ముఖాల్లో ఆనందం తాండవిస్తుంది. నవ్వులు పండుతున్నాయి. పుష్పగుచ్ఛాలతో, పూలదండలతో, దుశ్శాలువలతో రఘుబాబును సత్కరించేందుకు పోటీ పడుతున్నారు వచ్చినవాళ్ళంతా. ఈ తతంగాని కంతటికి కారణం లేకపోలేదు.

అంతకు ముందు రోజు సాయంత్రం – ఐ.ఎ.ఎస్. ఫలితాలు వచ్చాయి. రఘుబాబు ఐ.ఎస్.ఎస్.గా ఎంపికయ్యాడు. పైగా జాతీయ స్థాయిలో మొదటిర్యాంకు సాధించాడు.

అప్పుడే టి.వి. ఆన్ చేసిన రఘుబాబు ‘సాధన’ టీ.వీ. వాళ్ళు తన ఇంటర్వ్యూని ప్రసారం చేయబోతున్నారని ప్రకటించాడు. అంతే! ఒక్కసారిగా అందరి కళ్ళు టీ.వీ. పైన కేంద్రీకృతమయ్యాయి.

***

రిపోర్టర్: ఒక కుగ్రామంలోని, మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రఘుబాబుగారు, కష్టపడి చదువుకుని, స్వశక్తితో ఈ రోజు జాతీయ స్థాయిలో ఐ.ఎ.ఎస్. మొదటిర్యాంకు సాధించడం మన తెలుగువారందరికీ గర్వకారణం. అదెలా సాధ్యమైందో వారి మాటల్లోనే విందాం. రఘుబాబు గారూ! ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి..

రఘుబాబు: అలాగేనండి! మా నాన్న పెద్దగా చదువుకోకపోవడం వల్ల ఓ చిన్న ఉద్యోగం చేసేవారు. టెంత్ వరకు చదువుకున్న అమ్మ, గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించేది. మేము ఇద్దరన్నదమ్ములం. నేను బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసరుగా జాబ్ చేస్తున్నాను. తమ్ముడు కూడా బ్యాంకు ఉద్యోగే. నాన్న తన ఉద్యోగ బాధ్యతలలో నిమగ్నమై వుండేవాడు. పిల్లల విషయం అంతా అమ్మే చూసుకునేది. చదివించడం, ఆడించడం, మంచీ చెడు చెప్పడం అంతా అమ్మే!

రిపోర్టర్: అయితే మీ అమ్మగారి ప్రభావం మీమీద చాలా వుంది.

రఘుబాబు: అవునండీ! ఇక్కడో విషయం చెప్పాలి. నాకు ఇద్దరు మేనమామలు. పెద మావయ్య బాగా చదువుకుని, బ్యాంకులో మేనేజరుగా పనిచేసేవారు. చిన మావయ్య అంతంత మాత్రం చదువుతో, ఊర్లోనే చిన్న వ్యాపారం చేసుకునేవారు. పెద మావయ్య పెద్ద ఉద్యోగం, మంచి ఇల్లు, కారు… చాలా ఉన్నత స్థాయిలో వుండగా; చిన్నమావయ్య చాలా తక్కువ స్థాయిలో వుండేవారు. పెద మావయ్య, చిన్న మావయ్యలకు ఉండే వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనబడేది. దాన్నే ఆసరాగా తీసుకుని, తన పిల్లల్ని శ్రద్ధగా చదువుకునేట్లు చేయగలిగింది మా అమ్మ. మాలో చదువు పట్ల శ్రద్ధ తగ్గుతున్నప్పుడల్లా… “మీరు పెద మావయ్యలా అవాలనుకుంటున్నారా? లేక చిన్న మావయ్యలాగా అవాలనుకుంటున్నారా? అని అడిగేది అమ్మ. “పెద మావయ్యలాగా అవాలనుకుంటున్నాము!” అని ఠక్కున చెప్పేవాళ్ళం. వెంటనే తను “అయితే ఆటలు ఆడడం తగ్గించి చదువులు మొదలుపెట్టండి!” అని మమ్మల్ని కట్టడి చేసేది. అలా ఒక విధంగా మా పెద మావయ్యే మాకు స్ఫూర్తి, ఆదర్శం.

రిపోర్టర్: అంటే… మీ ఉన్నతికి మీ అమ్మ ప్రత్యక్షంగా కారణమైతే, మీ పెద మావయ్య పరోక్షంగా కారకులన్న మాట!

రఘుబాబు: అవునండీ!

రిపోర్టర్: ఇక్కడో విషయం నాకర్థమవట్లేదు. ఒకే రక్తం పంచుకుని పుట్టి, ఒకే ఇంట్లో పెరిగినా, ఒకరు ఉన్నత స్థాయిలో వున్నారు… మరొకరు తక్కువ స్థాయిలో వున్నారు… మీ మావయ్యలు! ఇలా ఎందుకు జరిగింది?

రఘుబాబు: పెద మావయ్య చిన్నప్పటి నుండి చదువుపై చాలా శ్రద్ధ చూపించేవారట! కష్టపడి చదివేవారట! అలాగే, ఆటపాటల్లో కూడా తోటివారి కంటే ముందంజలో వుండేవారట! బడికి వెళ్లమని, చదువుకోమని, ఎవరూ చెప్పాల్సిన అవసరమే వుండేది కాదట! పెద మావయ్యకు చదువుపై అంతటి శ్రద్ధ, పట్టుదల వుండేవిట! అందుకే ఈ రోజు పెద మావయ్య బ్యాంకులో ప్రాంతీయాధికారి హోదాలో వున్నారు.

రిపోర్టర్: చాలా గొప్ప విషయం చెప్పారు మీ పెద మావయ్య గురించి. మరి మీ చిన మావయ్య ఎందుకు చదువుకోలేకపోయారు. వారిని కూడా చదివించాలనే ఉద్దేశం మీ అమ్మమ్మ, తాతయ్యకు ఉండేది కాదా?

రఘుబాబు: నో, నో, అలాంటిందేం లేదు! చిన మావయ్య చిన్నప్పటి నుంచి బడికెళ్ళనని మారాము చేసేవాడట! ఒకవేళ వెళ్ళినా, మధ్యలోనే ఎగ్గొట్టి, ఆటాపాటలతో కాలం గడిపేవారట! చదువుకోవడం లేదనే కోపాన్ని ఆపుకోలేక, మా తాతయ్య, చిన మావయ్యని గట్టిగా కొట్టారట! అప్పుడు మా చిన మావయ్య ఇంట్లోంచి పారిపోయాడట! ఇంట్లో వాళ్ళందరూ పిల్లాడు కనబడకపోయేసరికి, దిగులు పడుతూ, నిద్రాహారాలకు దూరమయ్యారట! ఎక్కడెక్కడో వెతికారట! ఎన్నెన్నో పూజలు చేశారట! ఫలితం మాత్రం శూన్యం!

ఉన్నట్టుండి ఒక రోజు చిన మావయ్య ఇంట్లో ప్రత్యక్షమయ్యాడట! అంతే, అందరూ చుట్టుముట్టి ఏడ్చారటా! ముద్దులతో ముంచెత్తారట! “నువ్ చదువుకోకపోయినా పరవాలేదు. మమ్మల్ని వదిలి మాత్రం వెళ్ళొద్దు” అని చెప్పారట! అలా చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టారట చిన మావయ్య!

రిపోర్టర్: అంటే… బాగా చదువుకుని మీ పెద మావయ్య ఉన్నత స్థాయికి ఎదిగితే, సరిగా చదువుకోని మీ చిన మావయ్య, దిగువ స్థాయికే పరిమితమయ్యారు… ఇకపోతే, బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసరుగా ఉద్యోగం చేసే మీకు, ఐ.ఎ.ఎస్. అవాలని ఎందుకనిపించింది?

రఘుబాబు: దానికీ మా పెద మావయ్యే కారణం. నేను, బ్యాంకు పి.ఓ.గా ఎంపికైనప్పుడు తనని కలిసి… “మావయ్యా! నేను కూడా మీ లాగే బ్యాంక్ ఆఫీసర్ అయ్యాను” అని చెప్పాను. అందుకాయన, “నాలాగే బ్యాంక్ ఆఫీసర్ అయితే గొప్పేంటి? నాకంటే గొప్పవాడివై కనబడు! అప్పుడు నిన్ను అభినందిస్తాను!” అంటూ నన్ను రెచ్చగొట్టారు! అంతే! నాలో పట్టుదల పెరిగింది. కసితో కష్టపడి చదివాను… సాధించాను… ఐ.ఎ.ఎస్.

రిపోర్టర్: ఏమైతేనేం… అనుకున్నది సాధించి, నేటి విద్యార్థులకు, యువతకు ఆదర్శంగా నిలిచారు! యు ఆర్ రియల్లీ గ్రేట్! అందుకోండి మా శుభాకాంక్షలు…!!

రఘుబాబు: చాలా థాంక్సండీ!!

రిపోర్టర్: చూశారుగా!!!

“జీవితంలో వెలుగులు నింపుకోవాలంటే… బాగా చదువుకోవాలి! ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే… బాగా చదువుకోవాలి!… కెమెరామెన్ సుదర్శన్‌తో… పరిమళ, చీఫ్ రిపోర్టర్, సాధన ట్.వీ.

***

టీ.వీ. ఆఫ్ చేసిన రఘుబాబు, తనకు చప్పట్లతో అభినందనలు తెలుపుతున్న అక్కడున్న వారందరితో కలిసిపోయాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here