అప్పుడొక నిరీక్షణ ఉంటుంది!

0
13

[రంజిత్ వర్మ రచించిన హిందీ కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Ranjeet Verma’s Hindi poem by Mrs. Geetanjali.]

~

[dropcap]స[/dropcap]ముద్ర గర్భంలోకి సాయంత్రం దిగిపోతూ ఉన్నప్పుడు..
మంద్రంగా ఎగురుతున్న పక్షి కూడా వేగాన్ని పుంజుకుని.,
తన గూటికి చేరుకొని ఉంటుంది.
వీధిలోని చివరి దీపం కూడా ఆరిపోయినప్పుడు..
లోకంలో అందరికంటే ఎక్కువ విషాదంలో మునిగిపోయిన మనిషి కూడా
అలిసిపోయి తన ఇంటికి చేరుకొని ఉంటాడు.
ఆకాశంలో దారి తెన్ను లేకుండా..
దూర దూరాలకు ఒంటరిగా తిరగడానికి చంద్రుడు బయలుదేరినప్పుడు..
అప్పుడు.. ఒక నిరీక్షణ ఉంటుంది.
అది.. ఎగిరి పోయిన పక్షులతో తిరిగి రాదు.
విషాదంలో మునిగిపోయిన మనిషితో రాదు.
వీధిలో వెలుగుతున్న అంతిమ దీపంతో కూడా నిరీక్షణ ఆరిపోదు.
ఆకాశాన దిక్కులేకుండ తిరిగే చంద్రుడితో కూడా ఆ నిరీక్షణ సాధ్యం కాదు.
ఎందుకంటే నేను నిరీక్షించేది ఎక్కడో లేదు!
ఆ నిరీక్షణలో ఉన్నదేదో ఇక్కడే ఉంది.
నా దగ్గరే.. నా లోపలే!
ఈ రాత్రి గాడమైన చిక్కని చీకట్లో కలిసిపోయి ఉంది నా నిరీక్షణ.
మంద్ర స్వరంతో నాతో మాట్లాడే సముద్రాన్ని
నాతో పాటు రాత్రంతా వింటూ ఉంది!
ఆ నిరీక్షణ.. నాలోనే ఉంది.

~

మూలం: రంజిత్ వర్మ

అనువాదం: గీతాంజలి


రంజిత్ వర్మ ప్రముఖ హిందీ కవి. ప్రగతిశీల కవిత్వం రాయడంలో అత్యంత పేరున్న కవి. ఆగస్టు 21 1956 న పాట్నాలో జన్మించారు. 1978 నుంచీ కవిత్వం రాయడం మొదలు పెట్టారు. 1985లో కవిత్వం ద్వారా ప్రజలతో కలవాలని, అలాగే ప్రజలని కవిత్వం చదివేలా చేయాలని మొదటి కవితా-యాత్ర చేశారు. మధ్య బీహార్‌లో ప్రతీ గ్రామంలో ప్రజల మధ్య తిరుగుతూ కవితా పఠనం చేశారు. 2014లో ‘కవిత్వం:16 మే తరువాత’ పేరుతో సాహిత్యంలో ఒక   యుద్ధమే మొదలుపెట్టారు. దేశ వ్యాప్తంగా తిరుగుతూ సాహిత్యంలో కవుల్లో.. రచయితల్లో చెల్లాచెదురైన రాజనైతిక చైతన్యాన్ని తిరిగి కలిపే ప్రయత్నం చేశారు. 2016లో ‘జుటన్’ సంస్థ స్థాపించి ప్రత్యక్ష్యంగా విభిన్న.. ప్రాంతాల్లో ఆయా ప్రాంతీయ భాషల్లో  ఉన్న కవులని కలిపే ప్రయత్నం చేశారు.

హిందీలో అన్ని ప్రసిద్ధమైన పత్రికలలో రంజిత్ వర్మ గారి కవితలు, లేఖలు ప్రచురించ బడ్డాయి.

రంజిత్ వర్మ సంపాదకత్వం వహించిన పత్రికలు–1978-పల్లవి, 1985-87 లో నయీ సంస్కృతి, 2012 -భోర్.

ప్రస్తుతం వికల్ప అనే పత్రిక సలహామండలి సభ్యులు.

2014 లో కవిత్వంలో బనారసి ప్రసాద్ ‘భోజపురి’ సమ్మానం.

అనువాదాలు – పంజాబీ, మరాఠీ, ఒరియా, నేపాలీ, బంగ్లా, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో కవిత్వం అనువాదం చేశారు./ఆయన కవిత్వం అనువాదం అయ్యింది.

రంజిత్ వర్మ రచనలు:

కవితా సంపుటిలు-పీఛె న చోడ్ నిశాన్,(2002), ఎక్ చుప్ కే సాత్(2010), లకీర్ కహీ ఎక్ ఖీన్చనీ హోగి ఆప్కో(2015), యహ్ రక్త్ శే భరా సమయ్ హై(2023)

ప్రతి రోధ్ కా పక్ష, ప్రతిరోధ్ మే కవితా, బలాత్కార ఔర్ కానూన్ అనే కవితా సంకలనాలకి సంపాదకత్వం వహించారు.

ప్రస్తుతం పాట్నాలో ఉంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here