అపురూపం

0
7

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ‘ప్రచురణార్హమైన కథల’ని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన అద్దేపల్లి జ్యోతి. [/box]

[dropcap]”అ[/dropcap]మ్మా ప్లీజ్ అమ్మా, నాన్నను ఒప్పించమ్మా” ప్రొద్దుట నుంచి అదే పాట పాడుతోంది అపూర్వ నా వెనకే తిరుగుతూ,

ఇక దాని పోరు భరించలేక కొంత, ప్రస్తుత పరిస్థితుల వల్ల కొంత ఒప్పుకోక తప్పలేదు.

“సరేలే, నాన్నతో మాట్లాడతాను. కానీ మనకి చెడ్డ పేరు రాకూడదు. ఫలానా వాళ్ళ అమ్మాయి ఇలా చేసిందట అన్న మాట రాకూడదు. అలా నువ్వు హామీ ఇస్తేనే నాన్నను ఒప్పిస్తా” అన్నాను ధృడంగా.

“అబ్బ ఎన్నిసార్లు చెబుతావ్ ఇవే మాటలు? నేను స్కూలుకు వెళుతున్నప్పటి నుండి వినీ వినీ బోరు కొట్టేసింది. ఎనీ వే థ్యాంక్స్ అమ్మా” అని నా బుగ్గ మీద ముద్దిచ్చి తూనీగలా పారిపోయింది వీధిలోకి, తన ఫ్రెండ్స్‌తో చెప్పటానికి అనుకుంటా. ‘పిచ్చిపిల్ల’ అని నవ్వుకుని ఇక నేను ఆయనను ఎలా ఒప్పించాలా అని రిహార్సల్స్ వేసుకోవడం మొదలుపెట్టాను.

మాది కోనసీమలో అందమైన పల్లెటూరు. పేరుకి పల్లెటూరే గాని ఇప్పుడు మాకు కూడా సెల్‌ఫోన్స్, ఇంటర్‌నెట్లు అందుబాటులోనికి వచ్చేసాయ్. ఇంకా ప్రేమ, అభిమానాలు మిగిలే వున్నాయి. ఊళ్ళోకి ఒక కొత్త కారు వస్తే ఎవరింటికి వచ్చారు? ఏ పనిమీద వచ్చారో ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది. మీకు ఫేస్‌బుక్ లాగా,  మాకు మౌత్ టు మౌత్ అన్నమాట. కొత్త ముఖం కనబడితే ఊరి బయటే ఎంక్వయిరీ చేసి పంపుతారు. అందుచేత మా ఊళ్ళో దొంగతనాలు లేవు. పాతవాళ్ళకి దొంగతనం చేసే అవసరం లేదు. ఈ మధ్యనే మద్యపాన నిషేధం సాధించి సన్మానం పొందిన గ్రామం మాది. ఊళ్ళో మంచి పేరున్న కుటుంబం మాది. ఎంత అంటే గుళ్ళో ఉత్సవాలకి ముందు మేమే తొలి దర్శనానికి వెళ్ళేంత.

మాకిద్దరు అమ్మాయిలు. అమూల్య, అపూర్వ. మా అత్తగారు, మామగారు మేము ఇద్దరం. మొత్తం మా ఇంట్లో ఉండేది ఆరుగురు. ఈ మధ్యనే అమూల్యకి పెళ్ళి చేసాం. భగవంతుని దయవల్ల అంతా సవ్యంగా జరిగి దాని కాపురానికి పంపించాం. సిటీలో జాబ్ అల్లుడికి. అది వెళ్ళిపోయి ఇల్లు చిన్నబోయింది అనుకుంటే, చిన్నది అమూల్య “అక్క ఉంది కదా! అక్కడ హాస్టల్లో చదువుకుంటాను” అని ఒకటే గొడవ. పెద్దది మేం చెప్పినట్లు ప్రైవేటుగా చదువుకుంది. మేం తెచ్చిన సంబంధం చేసుకుంది. అపూర్వ ప్రక్క ఊరుకి రోజు వెళ్ళి డిగ్రీ చదివింది. ఇప్పుడు పై చదువులు చదువుతాను అని సిటీకి పంపమంటోంది. రోజులు మారాయి. ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయి ఏం చదువుకుంది? ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి అని ఖచ్చితంగా చెబుతున్నారు. మా పెద్ద అల్లుడు ఉద్యోగం చెయ్యని అమ్మాయి కావాలని అనుకొన్నాడు. మా అమూల్య కూడా అలాగే కోరుకుంది. అది కోరుకున్నట్టే జరిగింది.

ఈ చిన్నదాని గురించే నాకు బెంగ. చురుకైనది, తోచినట్టు చేసేస్తుంది. అంతే తప్ప ఆలోచించి చేద్దాం అనుకోదు. అందరితో చనువుగా ఉంటుంది. అది ఆడ, మగ అని చూడదు. అలా ఉండకూడదు అంటే అర్ధం చేసుకోదు. ఈయన కూడా దాన్నే వెనకేసుకొస్తారు. “ఎప్పుడో నీలా ఉండాలంటావ్ ఇది స్పీడ్ యుగం” అంటారు. అది ఏ కాలమైనా ఆడపిల్ల ఆడపిల్లే. మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటాను. తండ్రి కూతురు వింటేగా.

ఆయన దాన్ని వదిలి ఉండలేరు. అందుకే హాస్టల్లో ఉండడానికి నాన్నను ఒప్పించమని నా ప్రాణం తీస్తోంది. “అది అలాగే అంటుందిగాని హాస్టల్, పై చదువు అంటే ఊ అనకు. రోజులు బాగాలేవు. ఇదా దుడుకు, కొంప మీదకి ఏం తెస్తుందో.. పెళ్ళి చేసి పంపేద్దాం” అని అత్తగారు వార్నింగ్. ‘దీని చదువుకాదు గాని నా ప్రాణం పోతోంది మధ్యన’ అంటూ నాలో నేనే విసుక్కున్నాను.

మొత్తానికి ప్రస్తుత అబ్బాయిల ఆలోచనా విధానం చెప్పి ఆయన్ను అపూర్వ చదువుకు ఒప్పించాను. ఆ రోజు యూనివర్సిటీ చూసి అపూర్వని హాస్టల్లో దించి కావలసినవి కొని పెద్ద దానికి చెప్పి బాధపడుతూ ఇంటికి వచ్చాము. పిల్లలు లేని ఇల్లు నా మనస్సులాగే బావురుమంటోంది. ఎంత ఫోన్లో మాట్లాడుకున్నా చూసినట్టు ఉండదు కదా! శనివారం రాత్రి అమూల్య దగ్గరకు వస్తుంది. అప్పుడు కంప్యూటర్లో వెబ్ క్యామ్‌లో చూసి మాట్లాడుతుంటే కొంచెం బెంగ తగ్గినట్లు అనిపిస్తుంది అని సరిపెట్టుకున్నాను. పూర్వం సమాచారానికి ఉత్తరం తప్ప ఇంకొకటి ఉండేది కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా గుప్పెట్లో ఉంటోంది. కాని ఈ సాధనాలు అన్నీ మంచి కోసం వాడితే చాలా బాగుంటుంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఏదన్నా పరిమితులలో ఉంటేనే బాగుంటుంది. కాని ఈ కాలం పిల్లలకు చెప్పగలమా! కలర్ సెల్ఫోన్, ఇప్పుడు ట్యాబ్లెట్, ఐ-ఫోన్ అంటున్నారు. వాళ్ళు తయారుచేయడానికి బాగుంది, వీళ్ళు కొంటానికి బాగుంది. వినిమయ సంస్కృతి బాగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్ పెరిగిపోయాయి. ఇది అవసరమా అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఎవరో కొనుకొన్నారు మనం కొనుక్కోవాలి అనే పిచ్చి తప్ప అమ్మా, నాన్న ఎలా కొంటారు అంత ఆర్ధిక పరిస్థితి మనకుందా! అని చాలా మంది పిల్లలు ఆలోచించడం లేదు. తల్లిదండ్రులు కూడా ఒకరో ఇద్దర్నో కంటున్నారు. వాళ్ళ కోరికలు తీర్చకపోతే ఎలా అని అప్పో, సొప్పో చేసి పిల్లల కోరికలు తీరుస్తున్నారు. ఆ కోరికలు తీర్చకపోతే పిల్లలు తప్పుదోవలో పడి సంపాదించి తిప్పలు తెచ్చుకొంటున్న సంఘటనలు చాలా ఉన్నాయి

“కల్పనా ఇలా రా” అత్తగారి పిలుపుతో ఆలోచనల్లోంచి బయటపడి హాల్లోకి వెళ్ళాను. పక్కింటి విమల మా అత్తగారి దగ్గర కూర్చుని ఏడుస్తోంది. అత్తగారు ఊరడిస్తున్నారు. “ఏం జరిగిందో చెప్పు” అంటూ నేను కాసేపు ఆమెను ఏడవనిచ్చి, మంచి నీళ్ళు ఇచ్చి త్రాగమన్నాను. మంచినీళ్ళు త్రాగి స్తిమిత పడింది. “ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో. ఎవ్వరికీ ప్రాణాల మీదకు రాలేదు కదా!” అన్నాను.

“ఈ అవమానం బదులు నా ప్రాణాలు పోయినా బాగుండేది’. అని మళ్ళీ ఏడుపు మొదలు పెట్టింది. “ఏంటి విమాలా చిన్న పిల్లలా ఏడుపు, చెబితే కదా మేం ఏదన్నా చేయగలిగేది, సలహా ఇచ్చేది. స్తిమితంగా చెప్పు, నీ ఏడుపును బట్టి ఏదో జరిగిందని తెలుస్తోంది. ఆ జరిగిందాన్ని ఎలాగూ మార్చలేం. కనీసం సవరించుకోవచ్చేమో కదా అలా ఆలోచించు. అంతేగాని ఏడిస్తే ఏ సమస్యకీ పరిష్కారం దొరకదు. ప్రపంచంలో అన్నిటి కన్నా ప్రాణాలే గొప్పవి. ఆ ప్రాణాలే పోయిననాడు ఇక అవమానం ఏమిటి అని సరిగా చెప్పు” అని అన్నాను.

“మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం. మీకూ తెలుసు కదా! ఎన్ని సంబంధాలు చూపించినా ఏదో వంక పెడుతున్నాడు. నిన్న “ఇంకో సంబంధం వచ్చింది రారా అంటే రాను అన్నాడు. రాకపోతే ఎలా? వచ్చే ఏడు పుష్కరాలు, అప్పుడు సంవత్సరం పాటు పెళ్ళిళ్ళు చేయకూడదు. అంచేత ఒక్కసారి వచ్చి అమ్మాయిని చూడు. నీకు నచ్చితే ముహూర్తాలు పెట్టుకుందాం” అన్నాం. “అమ్మాయి ఫోటో నాకు పంపావు కదా! నాకు నచ్చలేదు అన్నాను కదా! నాకు నచ్చే అమ్మాయిని మీరు చూపించలేరు” అని అన్నాడు. “అదేంట్రా అమ్మాయి అంత బాగుంటే” అని నిలదీస్తే అప్పుడు చెప్పాడు తనతో ఉద్యోగం చేసే అమ్మాయిని ప్రేమించాడట, పెళ్ళి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాడట” అంటూ కళ్ళు తుడుచుకుంది విమల.

“పిదప కాలం పిదప బుద్ధులు. ఈ మధ్య ఇవే పెళ్ళిళ్ళు ఎక్కువైపోయాయి. ప్రేమట, ప్రేమ ఈ దిక్కుమాలిన సినిమాలు చూసి, మరీ ప్రేమ పిచ్చి ఎక్కువైపోతోంది. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచితే, వీళ్ళు ఇచ్చే బహుమతి ఇది. తల్లిదండ్రులను తీసిపారేయడం.. కాకపోతే” అంది మా అత్తగారు నిట్టూరుస్తూ.

“సౌకర్యాలు అవసరాలు అయిపోయాయ్. ఇద్దరూ సంపాదిస్తేగాని గడవని రోజులు వచ్చేసాయ్. అందుకని ఆడపిల్లని చదివించి ఉద్యోగాలకు పంపడం వల్ల అందరికీ దూరంగా ఉండటం, అక్కడ పొద్దస్తమాను కలిసి ఉండడం, ఆడ, మగ కలిసి పనిచేయడం, ఆకర్షణ పెరిగి ప్రేమ అంటున్నారు. చాలా కొంతమంది మాత్రం పెళ్ళిదాకా వస్తున్నారు. ఇంకానయం మీ అబ్బాయి పెళ్ళికి ముందే చెప్పి మీ అనుమతి అడుగుతున్నాడు. కొంతమంది పెళ్ళి ఒకరితో, ప్రేమ ఒకరితో అన్నట్లు ఉంటున్నారు. ఇంకొంత మంది పెళ్ళి చేసేసుకొని చెబుతున్నారు. ఏంచేస్తాం? కాలంతో పాటు మనమూ మారాలి. మారకపోతే పిల్లలను వదిలేసుకోవాలి. కష్టపడి కనిపెంచిన పిల్లల్ని వదులుకోలేం కాబట్టి మీ అబ్బాయిని పిలిచి, ఆ అమ్మాయి పెద్దలతో మాట్లాడి, మూడు ముళ్ళు వేయిస్తే మన మర్యాద నిలుపుకున్నట్లు ఉంటుంది” అన్నాను,

విమల కొంచెం తెప్పరిల్లి వాస్తవాన్ని అంగీకరించి, “మా ఆయనకి నచ్చచెప్పాలి. నన్నే తిడతారు వాడిని గారం చేసి పాడుచేసానని. అననీ ఏం చేస్తాం పళ్ళ చెట్లకే కదా రాళ్ళ దెబ్బలు” అని నిట్టూరుస్తూ వెళ్ళింది.

“విమలకి బాగానే నచ్చచెప్పావ్ గాని, నీ కూతురు అలాంటి పని చేస్తే ఊరుకొనేది లేదు” అని అన్నారు అత్తగారు కోపంగా రుసరుసలాడుతూ.

“చాలా బాగుంది, వాళ్ళ అబ్బాయి ఏదో ప్రేమించాడని మన అమ్మాయిని అనుమానిస్తే ఎలా!! నా కూతురు అలాంటిది కాదు, నా పెంపకం అలాంటిది అంతకన్నా కాదు” అన్నాను నమ్మకంగా,

ఎంతో మంది కళ్ళముందే మరణిస్తున్నా, ఆ మరణం మనకి అప్పుడే రాదు. ఎవరో ఎవర్నో మోసం చేసారు. మనల్ని ఎవ్వరూ మోసం చెయ్యరు అనుకోవడం మానవ నైజం. అలాగే ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను మోసగించడం చూసినా, నా పిల్లలు అలా చెయ్యరు అనుకోవడం తల్లిదండ్రుల అమాయకత్వం. కల్పన కూడా అందుకు మినహాయింపు కాదు.

***

కాలం గడుస్తోంది. అపూర్వ ఫైనల్ ఇయర్‌కి వచ్చింది. ఇక సంబంధాలు చూస్తాం అనగానే “అబ్బే చదువయ్యాక ఏడాది ఉద్యోగం చేసాక చూద్దురుగాని” అంది. ఆయన సరే అన్నారు.

“చదువు మధ్యలో ఆపడం ఎందుకు? ఎలాగూ అబ్బాయిలు ఉద్యోగం చేసే అమ్మాయే కావాలంటున్నారు కదా” అని ఆయన నాకు నచ్చచెప్పారు. మనస్సులో ఏదో మూల భయం ఉన్నా, ఛ ఛా నా కూతురు అలాంటిది కాదు అని, నాకు నేను భరోసా ఇచ్చుకునేదాన్ని.

మా అత్తగారు మట్టుకు సొణుగుతూనే ఉన్నారు. ‘చదువు అంది, మళ్ళీ ఉద్యోగం అంటోంది, పాతికేళ్ళు వచ్చాక చేస్తావా అమ్మాయి పెళ్ళి’ అని. మా అమ్మాయికి చెప్పలేక, అత్తగారికి చెప్పలేక, నేను నలిగిపోతున్నానని బాధపడ్డాను.

ఒకరోజు అమూల్య ఫోను. “అమ్మా చెల్లి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఏదో దాస్తోంది అనిపిస్తోంది. పూర్వంలా ప్రతీ శనివారం రాత్రి రావట్లేదు. నేను ఫోన్ చేసి రమ్మన్నా ఏదో సాకు చెప్తోంది. ఒకసారి ఎవరో అబ్బాయితో కనబడిందట మీ అల్లుడు గారికి. అది ఆయన్ని చూడలేదట. నేను అడుగుతాను అన్నాను. ఆయన వద్దు, మీ అమ్మా వాళ్ళకి చెప్పు. ఇది నా అనుమానమే కావచ్చు. అతను నిజంగా ఫ్రెండే కావచ్చు. నువ్వు భయపడకు, కంగారుపడకు. నువ్వు నాన్న ఒకసారి వచ్చి దాంతో మాట్లాడండి” అంది. నాకు గుండెల్లో రాయి పడింది. ఎంతో అపురూపంగా చూసుకున్నాము. కాబట్టే అపూర్వ అని పేరు పెట్టాము. కష్టపడి విద్యాబుద్ధులు చెప్పించాం. వదిలి ఉండలేకపోయినా మన ప్రేమ వాళ్ళ అభివృద్ధికి అడ్డుపడకూడదని దూరంగా వెళ్ళి చదువుకుంటానంటే పంపించాము. ఇన్ని ఇచ్చిన వాళ్ళం మంచి అబ్బాయిని వెదికి పెళ్ళి చేయమా! ఈ పిల్లల ప్రేమలో నిజాయితీ ఉంటే దాపరికం ఎందుకు? ఫలానా అబ్బాయి నచ్చాడు అని చెబితే పెద్దల సమ్మతితో పెళ్ళి చేసుకోవచ్చు కదా! ఇలా అందిరిలో చులకన కావడం ఎందుకు?, తల్లిదండ్రులను బాధ పెట్టడం ఎందుకు? నా మనస్సులో వెయ్యి ప్రశ్నలు. నా నమ్మకం మీద, నా పెంపకం మీద చాలా పెద్ద దెబ్బే తగిలింది. అని చాలా బాధపడ్డాను. ఆయనతో విషయం చెప్పి, పైకి ఏమీ అనవొద్దని, మామూలుగా పిల్లల్ని చూడాలని చెప్పి పెద్దమ్మాయి దగ్గరకు వెళ్ళాము. అపూర్వ వచ్చింది మేం వచ్చామని తెలిసి. కాసేపు మామూలు కబుర్లు అయ్యాక… ‘మా అనుమానం నిజమా అని అడిగాం’. కాసేపు మౌనంగా ఉండిపోయింది. కానీ, దాని మొహంలో ప్రేమ తాలూకు ఆనందం కనపడలేదు. ఏదో బాధ దాచుకున్నట్లు ఉంది. పది రోజులు జ్వరం వస్తే ఉన్నట్లుగా మొహం పీక్కుపోయింది. దాన్ని అలా చూస్తే నా మనస్సు ద్రవించిపోయింది. ఆడుతూ, పాడుతూ సందడి చేసే నా చిట్టితల్లి ఏదో సమస్యతో ఉన్నట్లు ఉంది తప్ప, ప్రేమ వల్ల వచ్చిన ఉత్సాహం, ఆనందం ఏమీ లేదు.

“బంగారం ఏమ్మా అలా ఉన్నావ్, బెంగగా ఉంది నిన్ను ఇలా చూస్తే” అంటూ.. దగ్గరకి తీసుకొని “నీ సమస్య ఏంటో చెప్పరా. చదవలేకపోతున్నావా? మిగిలిన స్టూడెంట్స్‌తో సమస్యా? కాలేజ్ మారిపోతావా? అని బుజ్జగించేసరికి కరిగి నీరైపోయింది. నా బిడ్డ పుట్టాక ఎప్పుడూ దేనికీ ఏడవనివ్వలేదు. అదలా ఏడుస్తుంటే నాక్కూడా ఏడుపొచ్చేసింది. కాసేపు మా ఇద్దరినీ అలాగే వదిలేసారు. నేనే ముందుగా తేరుకుని “హాస్టల్ వద్దులే… అక్క దగ్గరే ఉందువు గాని. కొన్నాళ్ళు నేనూ ఉంటాను” అని ధైర్యం చెప్పి, “ఇప్పుడు నీ సమస్య ఏంటో చెప్పు. అది ఎలాంటిదైనా నేనూ, నాన్న, అక్క బావ ఎవరికి వీలైతే వాళ్ళం నీ సమస్యను పరిష్కరిస్తాం” అంటూ భరోసా ఇచ్చాక చెప్పింది.

“వాడి పేరు ప్రణయ్ అమ్మా. ముందు చనువుగా ఫ్రెండ్స్ అంటూ మాట్లాడేవాడు, తరువాత సరదాగా సినిమాకి, ఐస్క్రీమ్ పార్లర్‌కి వెళదాం అనేవాడు. ఒకోసారి ఇద్దరూ, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళే వాళ్ళం. ఒక్కోసారి మిగిలిన వారు తరువాత కలుస్తారని వెళ్ళే దాకా వదిలేవాడు కాదు. సరే సభ్యతగానే ఉన్నాడు కదా అని వెళ్ళాను. ఒక్కసారి హద్దు మీరడానికి ప్రయత్నించాడు, అప్పటి నుండి అతనితో మాట్లాడటం మానేసి, దూరంగా ఉంటున్నా. అతను కక్షకట్టి ‘నాతో వస్తావా లేదా? రాకపోతే సరదాగా మన ఫ్రెండ్స్ అంతా పార్కులో తీయించుకున్న ఫోటో మార్పిడి చేసి నువ్వు నాతో క్లోజ్‌గా ఉన్నట్లు సృష్టించి కాలేజ్లో నీ పరువు పోయేటట్టు చేస్తాను, అప్పుడు చచ్చినట్టు నువ్వే నన్ను పెళ్ళి చేసుకుంటావ్. నీ డబ్బుతో జల్సా చేస్తా, తరువాత నీ దారి నీది, నా దారి నాది. లేదా కామ్‌గా నా కోరిక తీర్చు. ఇలాంటివన్నీ సిటీలో కామన్’ అంటూ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో పిచ్చి, పిచ్చి కామెంట్లు నేను తన గురించి వ్రాసినట్లు, ఐ లవ్ యు నేను చెప్పినట్టు అన్నట్లు పెట్టాడు. ఫ్రెండ్స్ నిజమా! వాడు నీ గురించి ఇప్పటికే చెడుగా వాగుతున్నాడు జాగ్రత్త అంటున్నారు. నాకు వాడంటే జస్ట్ ఫ్రెండ్ అనే తప్ప ఎలాంటి భావం లేదు. ఇప్పుడు నన్ను ఇలా కార్నర్ చేసి నా చేత ఐ లవ్ యు చెప్పించుకొని మన డబ్బు కోసం నాటకాలు ఆడుతున్నాడు. నాకు ముందే చెప్పావ్ కదా! నువ్వు జాగ్రత్తగా ఉండమని. మన కుటుంబం మీద మచ్చ రాకూడదని కాని నా తప్పు లేకుండానే నాడితో టార్చర్ అనుభవిస్తున్నాను. ‘ఎవ్వరికి చెప్పకు, చెపితే ఫోటోలు బయటపడతాయి’ అని బెదిరిస్తున్నాడు. ఈ విషయాలు మీతో చెబితే మీరు ఎలా తీసుకుంటారో? అని భయం. అందుకే అక్క దగ్గరకు కూడా రావట్లేదు” అంటూ ఏడుస్తూ చెప్పింది.

“పిచ్చిపిల్ల ఇంత బాధను ఎలా ఓర్చుకున్నానే? మేమంతా నీకున్నాం. నాన్నకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. మన పేరు బయటకు రాకుండా వాడి పని పడతారు. నువ్వేం బెంగపడకు, ధైర్యంగా ఉండు” అంటూ ధైర్యం చెప్పాను. నా మనస్సు కుదుటపడింది. నేను అనుకున్నట్లు ఈ పిల్ల ప్రేమ వలలో పడనందుకు ఆనందపడ్డాను. మనం జాగ్రత్తగా ఉన్నా ఎదుటివాడు రాంగ్ సైడ్‌లో వచ్చి యాక్సిడెంట్ చేసినా దెబ్బలు మనకీ తగులుతాయి. అలాగ ప్రణయ్లాంటి వెధవల వల్ల నా కూతురులాంటి అమాయకపు అమ్మాయిలు బాధపడుతున్నారు అని కోపం వచ్చింది.

“మీ యూనివర్సిటీలో నాకు తెలిసిన ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళతో చెబుతాను” అంటూ అల్లుడుగారు దానికి ధైర్యం చెప్పారు. “మీరు, అల్లుడుగారు యూనివర్సిటీకి వెళ్ళి ప్రిన్సిపాల్‌తో మాట్లాడండి. వాళ్ళు చర్యలు తీసుకుంటారా? లేదా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి అతని మీద రిపోర్టు ఇమ్మంటారా అడగండి. వాడి ఇంటి అడ్రస్సు అడిగి ఇంటికి వెళ్ళి మనందరం వాడి అమ్మా నాన్నలతో మాట్లాడదాం. వాళ్ళు పిల్లాడికి బుద్ది చెప్పుకుంటారో, లేదా కొడుకును జైల్లో ఉంచమంటారో కనుక్కుందాం” అన్నాను ఆవేశంతో..

‘అత్తయ్యగారు వాడి మాటలని బట్టి వాడేదో డబ్బుకోసం అమ్మాయి కోసం ప్లాన్ వేసాడు. పల్లెటూరు పిల్ల కదా ప్రేమ పేరుతో పడేద్దాం అనుకున్నాడు. మన అపూర్వ తెలివైంది. కాబట్టి తన జాగ్రత్తలో తనుంది. వాడి నాటకాలకి పడలేదు. కానీ ముందే వాడి ప్రవర్తనలో తేడా కనిపెట్టినప్పుడే నాతో చెబితే నేను సాల్వ్ చేసేవాడిని. మీదాకా రానిచ్చేవాడ్ని కాదు. ఎనీవే నాకో పెద్ద పని పెట్టింది. అపూర్వకి తగ్గ అబ్బాయిని వెదకాలి కదా’ అన్నాడు. వాతావరణాన్ని తేలిక చేస్తూ అల్లుడుగారు.

పోలీసులు వాడికి చిన్న కోటింగ్ ఇచ్చి ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయవొద్దని ఇంట్లో వాళ్ళు కూడా వాడికి గడ్డి పెట్టి, బుద్ధి వచ్చేలా చేస్తారు. ఎందుకైనా మంచిదని మిలటరీలో ఉండే మావయ్య దగ్గరకి పంపేసారంట అక్కడ చదువుకోమని.

***

యూనివర్సిటీలో ఫేర్ వెల్ పార్టీ.

“జీవితం అపురూపమైనది. అలాంటి జీవితాన్ని పదిమందికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలి. పిచ్చిపిచ్చి ఆలోచనల్లో, ఆకర్షణల్లో పడి జీవితాన్ని పాడుచేసుకోవద్దు. పిల్లలూ ఆలోచించండి, ఆనందంగా జీవించండి” అంటూ యూనివర్సిటీ స్టూడెంట్స్‌కు చీఫ్ గెస్ట్ బోధిస్తూ, “భగవంతుడు మనకన్నీ ఇచ్చాడు. అన్నీ ఉన్నా ఏదో లేదు అని బాధపడుతూ ఉంటాం అది తప్పు. చేతులు, కాళ్ళు లేని ‘నిక్ ఉయిచిచ్’ని చూసి మీలాంటివారు ఎంతో నేర్చుకోవాలి. ఎంతో మందిని ఇన్‌స్పయిర్ చేస్తున్న అతని విల్ పవర్‌ని మీరంతా అలవరచుకోవాలి. సమాజానికి మన వంతుగా ఎంతో కొంత సేవ చేయాలి. అప్పుడే యువతరం మీదున్న చిన్న చూపు పోతుంది. సరదాలు, సంతోషాలే కాదు సమాజానికి సేవ కూడా చేస్తుంది యువత అని అందరూ మెచ్చుకొనేలా మన స్టూడెంట్స్ ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు బహుమతి ప్రధానం” అంటూ “మిస్ అపూర్వ వచ్చి గోల్డ్ మెడల్ అందుకోవాలి” అని పిలిచారు. ‘అపూర్వా, గోల్డ్ మెడల్ అందుకొన్నారు కదా మీ స్పందన చెప్పండి’ అని మైక్ ఇచ్చారు. “సభకు నమస్కారం. నా తల్లిదండ్రులకు, గురువులకు పాదాభివందనం. ఆడపిల్లలకి చదువు విలువ చెప్పి ఇంత చదువుకునేలా ఇందులో గోల్డ్ మెడల్ సాధించేలా ప్రోత్సహించిన యూనివర్సిటీ ప్రొఫెసర్స్‌కి కృతజ్ఞతలు.

మన స్టూడెంట్స్‌కి ఒక విషయం చెప్పదలచుకొన్నాను. మనల్ని ఎన్నో ఆశలతో కాలేజీలకి, యూనివర్సిటీలకి పంపుతారు మన పేరెంట్స్. మన అభివృద్ధి కోసం మనం చక్కగా చదువుకుని మన కాలేజీకి, మన యూనివర్సిటీకి, మన పేరెంట్స్‌కి మంచి పేరు తేవాలి. అంతేకానీ క్షణికమైన వ్యామోహంలో పడి నూరేళ్ళ జీవితాన్ని పాడుచేసుకోవద్దు. మన తల్లిదండ్రులకు తలవంపులు తేవొద్దు. ప్రేమ నేరం కాదు. కానీ మన ప్రేమ ఎదుటివారి స్వేచ్ఛని హరించకూడదు. మన ప్రేమ స్వచ్ఛమైందైతే తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పండి. మన ఎన్నిక మంచిదైతే మన పేరెంట్స్ మాత్రం ఎందుకు వద్దంటారు. నిజాయితీ, వ్యక్తిత్వం గొప్పగా ఉండాలి. మన భావితరాలకు మనం ఆదర్శంగా ఉండాలి. మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు” అంటూ స్టేజ్ దిగింది అపూర్వ. చప్పట్లు మారుమ్రోగాయ్.

“నిజంగా నా తల్లి అపురూపమైనదే” అన్నాను మా వారితో ఆనందంగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here