రంగుల హేల 44: అరాచకీయాలు

17
9

[box type=’note’ fontsize=’16’] “జీవితాన్నిమరీ బరువు చేసుకోకుండా లైట్‌గా తీసుకుంటూ, ఉల్లాసంగా గడపాలని అనుకునే మనలాంటి వారికి నిత్య రాజకీయాల్లో బోలెడంత కామెడీ దొరుకుతుంది” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల’ కాలమ్‌లో. [/box]

[dropcap]మ[/dropcap]నది ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క ప్రభుత్వమని సోషల్ పుస్తకాల్లోని సామాన్యమైన అర్థం. ప్రజలు ప్రేక్షకులుగా రాజకీయ నాయకులు, రాజకీయ రంగస్థలం మీద ఆడే పేద్ద నాటకమని అంతర్లీనమైన అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే చుట్టూ చూసే వారెవరికీ ఏమీ అర్థం కాకుండా ఆడే ఆట అని కూడా అర్థం. ‘ప్రిన్సిపుల్స్ లేని రాజకీయం మహా పాపం’ అన్నారు మన జాతిపిత. ‘అస్సలు, బొత్తిగా ప్రిన్సిపుల్స్ లేని వ్యాపారం ఒక్క రాజకీయమే’ అని మనకు తెలిసిన లేటెస్ట్ సత్యం.

మన చిన్నప్పటి రోజుల్లో, రాజకీయనాయకులంటే దేశం కోసం, రాష్ట్రం కోసం వ్యక్తిగత జీవితాల్ని పూర్తిగా వదులుకుని ప్రజల బాగు కోసం నిరంతరం తపించే వారనీ, వారు గొప్ప త్యాగధనులనీ మన మనస్సులో ఒక ఉన్నత స్థానం ఉండేది. వారి త్యాగాల గురించిన పాఠాలూ, ఆటపాటల్లో బహుమతులుగా పొందిన వారి జీవిత చరిత్రలూ చదివి అటువంటి వారిపై గొప్ప గౌరవ భావం ఏర్పరచుకునేవారం. ఇక గాంధీజీ అయితే మన దేశానికీ తండ్రి వంటివారనీ, జవహర్లాల్ నెహ్రూ నవభారత నిర్మాత అనీ వారంటే మనకెంతో ప్రేమ, గౌరవం, అభిమానం, ఇష్టం, ఆరాధనా, ఆపేక్షా ఉండేవి. ఏ పేపర్ లోనో పడ్డ వాళ్ళ ఫోటో ఒకటి సంపాదించి మన పుస్తకంలో అంటించుకుని అందరికీ గొప్పగా చూపించుకునేవాళ్ళం.

ఇప్పుడు రాజకీయం అంటే ఒకానొక ఉపాధి మార్గం. దాన్నీ ఒప్పుకోవచ్చు. ఒకప్పటి రాజకీయ నాయకుల్లా సొంత ఆస్తిపాస్తుల్ని దేశం కోసం ధారపోసి తినడానికి లేకా, వాళ్ళ కుటుంబాలు రోడ్ మీద పడాలనీ మనం కూడా కోరుకోము. స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే పెన్షన్ తీసుకోవడానికి ఇష్టపడని వారినీ, అసలు అలా ఇస్తున్నారని తెలీని అమాయకుల గురించీ మనం విని ఉన్నాము. అప్పటి స్థితినీ ఇప్పటి స్థితినీ పోల్చి చూసినప్పుడు నక్కా, నాగలోకం సామెత గుర్తొస్తుంది. నేటి నాయకుల ఉద్దేశంలో రాజకీయం అంటే చదరంగపుటెత్తులు వేసే ఒక క్రీడ. వేరే వ్యాపకం లేనివాళ్ళకి కాలక్షేపం. యువతరం వారినుండి గ్రహించేది ఏమీలేదు, రాజకీయమంటే ఏవగింపు పెంచుకోవడం తప్ప.

రాజకీయ శాస్త్రం అని ఒక పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది. దాన్నిండా అనేకమంది రాజనీతి తత్వవేత్తలు చెప్పిన థియరీలూ, వివరాలూ వాటిమధ్య భేదాలూ ఉంటాయి. ఇంకా పాలనా పద్ధతులూ, ప్రభుత్వ యంత్రాంగం, పాలనా వ్యవస్థల గురించిన చర్చలూ ఉంటాయి. ఒక నాడు ఆదర్శ రాజ్యం గురించి ఏం చెప్పారూ, నేటి సంక్షేమ రాజ్యం ఎలా ఉండాలీ అనేది కీలకమైన పాయింటుగా ఆ పీజీలో వివిధ సబ్జెక్టులుంటాయి. ఇవే కాక రాజ్యం మతం ఒకదానికొకటి బహుదూరంగా ఉండాలన్నది స్థిరమైన ఆదర్శంగా అందులో ఉంటుంది. ప్రజల కొరకు ప్రభుత్వాలు ఆదర్శవంతంగా ఏ విధంగా పనిచెయ్యాలీ, ఎలా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలీ అన్నదే ప్రధాన అంశంగా ఉంటుందక్కడ.

రాజకీయమంటే ఎప్పుడూ ఒకే అర్థంతో ఉండదు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు బహు రూపాల్లో కనబడుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయం రూపు మరీ మారింది. ఎవరి ప్రయోజనం కోసమో ఎవరో ఏదో చేస్తారు. అది మనకి అంటే ప్రజలకి అర్థం కాదు. ఒక్కటి మాత్రం చెప్పొచ్చుఅది ఖచ్చితంగా ప్రజల బాగోగుల గురించి మాత్రం కాదు. తప్పనిసరిగా నాయకుల పదవీవ్యామోహానికీ, అధికార కాంక్షకీ, తమ పార్టీ యొక్క సామ్రాజ్య విస్తరణకీ సంబంధించినధై ఉంటుంది.

నేటి రాజకీయం అంటే కుతంత్రాలూ, కుట్రలూ ప్రధాన ముడిసరుకుగా సాగే వ్యాపారం. రాజకీయపు ఎత్తులూ, జిత్తులూ మొదలైనవన్నీ అమాయక ప్రజల ఓట్లు దండుకోవడం కోసం పార్టీలు వేసే కోతి గంతులు. పాలనా సంబంధ వ్యవహారాలన్నీ ప్రజాసంక్షేమం కోసం ఉద్దేశించి చేసేవి అనుకోవడం మన ప్రజల అమాయకత్వం. ప్రధాన లక్ష్యం అధికారం పొందడం. పదవీ కుర్చీ ఎక్కాక వీలయినన్నాళ్లు దిగకుండా, ఆపై వీలయితే వారసులకు అధికారం అప్పజెప్పే క్రమంలో ఎన్ని టక్కుటమార విద్యలు ప్రదర్శించొచ్చో అన్నీ అధికార స్టేజి మీద అభినయించబడతాయి.

పదవి పొందిన వాళ్ళకి పదవీ, డబ్బూ, అధికారం ఎంత ఉంటుందో దానికి రెట్టింపు చచ్చే చావు ఉంటుంది అనుదినం. ఆ గరళాన్ని వాళ్ళు మింగక తప్పదు. పైకి తేనే తాగుతున్నట్టు ఫీలింగ్ పెట్టాలి. అదికదా ఆదినరకం! ఇక ప్రతిపక్షానికి అధికారం పోయిందన్న ఒక్క దురదృష్టం తప్పితే అన్నీ అదృష్టాలే. వరదలొస్తే పరిగెట్టక్కర్లేదు. ఆలోచించక్కర్లేదు. అధికార పార్టీ చేసిన ప్రతి పనినీ ఇంట్లో పడుకుని టీవీ చూస్తూ వెక్కిరించడం తప్ప ఇంకేం పనుండదు. పదవిలో ఉన్నవారు ముక్కు గోక్కున్నా ‘చూశారా చూశారా ఎంతన్యాయమో!’ అని చప్పట్లు కొట్టి అందరికీ చెప్పొచ్చు. ఎవరైనా వింటారో లేదో అనుమానమే అనుకోండి. ఏమైనా అందులో మజాయే వేరు లెండి.

ఎలెక్షన్లు వస్తున్నాయంటే పార్టీలు విడుదల చేసే కలర్ఫుల్ మేనిఫెస్టోలన్నీ గిమ్మిక్కులే. పైకి ‘ఆదర్శ రాజ్యం ఈ పార్టీయే తెచ్చేస్తుందేమో బాబోయ్’ అన్నట్టుంటుంది. లోపల ఉత్త ఊక. “గెలిపిస్తే మా నాయన రాజ్యం తెస్తానని ఒకాయన”, “స్వాతంత్ర్య సమరయోధుల గాథలున్న లక్ష పుస్తకాలు చదివేశా ఆదర్శ రాజ్యం తెచ్చేస్తా” అని ఒకాయన ఊరిస్తూ ఊళ్లు తిరుగుతూ ఉంటారు. ప్రజల సమస్యలన్నిటినీ ఒక బుక్‌లో రాసుకుని బట్టీ పట్టి వాటికి పరిష్కారాల్ని పాలిటిక్స్ ప్రొఫెసర్ల నడిగి తెల్సుకుని అవన్నీ మీటింగ్స్‌లో వల్లె వేసి, విద్యార్థులు పరీక్ష పాసుకాగానే ఆ పుస్తకాల్ని హాఫ్ రేట్‌కి అమ్మేసినట్టు గెలిచాక ఆ పుస్తకాల్ని ఎక్కడో పడేస్తారు నాయకులు. అధికారిక సీట్లో కూచున్నాక పాపం వాళ్ళకి కొత్త సినిమా, కొత్త లోకం కనబడి ప్రియారిటీలు మారిపోతాయి. ప్రజలకిచ్చిన వాగ్దానాలు గత జన్మ జ్ఞాపకాల్లా అయిపోతాయి. ప్రతిపక్షాలు గుర్తు చేస్తే కోపం వస్తుంది. ‘మీ హయాంలో మీరేం ఉద్ధరించారో?’ అంటూ ఎదురు దాడి చెయ్యడంలో రాష్ట్ర క్యాబినెట్ మొత్తం ప్రావీణ్యం చూపిస్తారు తప్ప ఆత్మావలోకనం లాంటి చాదస్తాలకి జోలికి పోరు. అలా నోరు పెట్టుకుని అధికార పార్టీ, కాళ్ళూచేతులూ పనిచేయక మంచంపై పడిన వృద్దునిలా ప్రతిపక్షపార్టీ బతుకుతుంటారు.

అసలే రాజకీయాలు అస్తవ్యస్తంగా సర్వభ్రష్టంగా అయోమయంగా ఉంటుంటే పత్రికారంగం, ఎలక్ట్రానిక్ మీడియారంగం జనాన్ని మరింత గందరగోళంలో పడేస్తుంటాయి. మన చిన్నప్పుడు వార్తాపత్రికలు, మాస్టారు రాజకీయాల గురించి పాఠం చెబుతూ ఉన్నట్టుగా ఉండేవి. చక్కని సహేతుక విమర్శలూ, సూచనలూ ఉండేవి. చదివిన ప్రజలు ఆలోచించేవారు. అవన్నీ చదివి అర్థం చేసుకోలేని వాళ్ళకి వివరించి చెప్పేవారు కొందరు యువకులు.

ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ ఒక వార్తాపత్రిక, ఒక ఛానల్ పెట్టుకుని తమ గొప్పలు నిరంతరం రాసుకుంటూ చెప్పుకుంటూ ఉంటున్నాయి. అలా కొన్ని అధికారపక్షం వారివి. మరికొన్ని ప్రతిపక్షం వారి అధీనంలో ఉంటూ, రోజంతా విమర్శ కోసమే విమర్శలు చేస్తున్నాయి. దాంతో విమర్శల మీద నమ్మకం పోతోంది ప్రజలకి. ఒక ప్రత్యేక సంఘటన జరిగినా, పాలసీ నిర్ణయం తీసుకున్నా ఒకో పత్రిక ఒకో రకంగా వాటికి రాజకీయ రంగు పులిమి రాసి, చదివిన వారు జుట్టు పీక్కునేలా చేసున్నాయి. ఇక చట్టసభల లైవ్ చూసినప్పుడు మన చట్టసభల ప్రతినిధుల వాదనలూ, ప్రతివాదనలూ కూడా నీళ్ల పంపు దగ్గర నిరక్షరాస్యులైన గయ్యాళి స్త్రీల స్థాయిలో ఉన్నాయని మనక్కూడా తెలిసి నెత్తికొట్టుకున్నాంగా!

ఇక పొలిటికల్ సైన్సూ, జర్నలిజం చదివిన యువత ఆదర్శ రాజ్యం కోసం తాము చదివిన థియరీనంతా అర్జెంట్‌గా మర్చిపోయి, ఏ ఛానల్ లేదా పేపర్‌లో పని చేస్తే ఆ యజమాని ఇచ్చిన తర్ఫీదు తీసుకుని, వారిచ్చిన కళ్ళజోడు పెట్టుకుని వారికి నచ్చే రాతలూ, రెవ్యూలూ రాసి జీతం తీసుకుని బ్రతుకు జీవుడా అనుకుంటున్నారు. వారి చదువు, పరిజ్ఞానం వారి యజమానికి అవసరమే లేదు, తాము చెప్పింది రాసే జీతగాళ్లు తప్ప. సొంత తెలివి చూపిస్తే సదరు ఉద్యోగి ఎన్నో పత్రికాఫీసుల మెట్లెక్కవలసి రావచ్చు. అదో బాడ్ రిమార్కు. ఇక ఫ్రీ ప్రెస్సూ, నిష్పక్షపాత జర్నలిస్టులూ అనే మాటలు నేతిబీరలో నెయ్యే. ‘మీరు జర్నలిస్టా? ఏ పార్టీ?’ అనే రోజులివి. స్వపక్ష పేపర్లు సొంత డప్పు కొట్టుకుంటూ యాడ్లు ఎడాపెడా వేసుకుంటూ రిచ్చుగా బతుకుతాయి. ప్రతిపక్ష పేపర్లు విమర్శలు గుప్పిస్తూ యాడ్‌లు ఇవ్వడం లేదని గుక్కపట్టి ఏడుస్తుంటాయి. ప్రభుత్వం మారాక పాత్రలు అటూ ఇటూ మారి అదే కథ పునరావృతం అవుతుంది,

ఓట్లకోసం కుప్పిగంతులు వేసి గెలిచేవారికి ప్రజల పట్ల ‘అక్కర’ లేదు. ‘ఈ పీఠంపై శాశ్వతంగా ఉండాలంటే ఏం చెయ్యాలీ’ అనే ఆశయం తప్ప. రాష్ట్ర లేదా దేశ భవిష్యత్తు పట్ల గౌరవం అసలే లేదు. ప్రజా పక్షం వహించి రాబోయే రోజుల్లో వనరులు, సంపదా ఎలా పెంచాలీ, యువతకు ఉపాధి ఎలా కల్పించాలీ అని నిరంతరం ఆలోచించే మేధావులకు ప్రజలు ఓట్లు వెయ్యరు. గొర్రె కసాయి వాడినే నమ్మినట్టు రౌడీలనూ, గూండాలనూ బంపర్ మెజారిటీతో గెలిపించి నిజాయితీ గల వారిని ఓడిస్తారు. ఓటుకు మద్దతు ధర ఇవ్వలేని మేధావులు చానెల్స్‌లో డిబేట్లకి పరిమితమవుతారు. వీలు దొరికితే పత్రికల్లో వ్యాసాలు రాస్తారు. వాటిని ఏ రిటైర్ అయిన ఉద్యోగుల్లో చదివి ఆనందిస్తారు. అంతే ఫలితం.

ఇక సక్సెస్ఫుల్ యువతకు తమ డిగ్రీలూ, సినిమాలూ, పబ్‌లూ మాత్రమే ముఖ్యం. వాళ్లెప్పుడూ వీకెండ్ రిలాక్సషన్ లలో, న్యూ ఇయర్ పార్టీల్లో, బాచిలర్ పార్టీల్లో లేదంటే ఔటింగ్స్‌లో బిజీ. వాళ్ళ సాఫ్ట్‌వేర్ జీతాలు వారికి ఆ సుఖాన్నిస్తున్నాయి. అటువంటి యువతకు దేశంలో రాష్త్రాలెన్నో, మన రాష్ట్రంలో జిల్లాలెన్నో తెలీదు. ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటూ తెలుసా అంటే డౌటే. ఎన్నికలొస్తే ఓటు వెయ్యడం ఎంత అవసరమో వాళ్ళకి తెలీదు గాక తెలీదు. నిరుద్యోగుల బాధలు ఎవరికీ పట్టవు. వాళ్ళు ఏ ఓటు బ్యాంకులోనూ ఉండరు. వాళ్ళ గోడు వినే తీరికెవరికీ లేదు.

షేపింగ్ అండ్ షేరింగ్ ఆఫ్ పవర్ ఈజ్ పాలిటిక్స్ అన్నది అందరికీ తెలిసిన సత్యమే. ఆ షేపింగ్, షేరింగే వికృత రూపం దాల్చాయి. టెన్త్ కూడా పాస్ కాని మంత్రులదీ, పీజీలు చేసిన మంత్రులదీ ఒకటే అసభ్య పదాల భాష. అధికార ప్రతిపక్షాల వారు ఒకరినొకరు ఒకే భాషా స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే సంప్రదాయం ఒకటొచ్చిపడింది. సభ్యత గలవారెవరూ వినలేని భాష అది. ఇప్పుడా నికృష్ట పదాలకు అర్థాలు, నిఘంటువులు వెతికి తెలుసుకునే దురవస్థ ఆ రాష్ట్ర ప్రజలది. ఆరోపణలు రాగానే పౌరుషపడి రాజీనామాలు చేసే సత్య కాలం కాదిది.

ఇప్పుడు దేశపాలకులకూ, రాష్ట్రపాలకులకూ మరో కొత్త జాడ్యం వస్తోంది. అది అహం దెబ్బతినే సమస్య. ప్రజానీకంలో కొందరు ఆందోళన మొదలు పెడితే వారితో మాట్లాడడం పాలకులకు నచ్చడంలేదు అది అవమానంగా భావిస్తున్నారు. కుల మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని చెప్పుకునే మనం వాటి పునాదులపైనే సామ్రాజ్య హర్మ్యాలను నిలబెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నించడం గొప్ప ఐరనీ. ఎన్నికలకి ముందు కొత్త పెళ్ళికూతురిలా కళలాడిన ఓటర్ ఎలక్షన్ తర్వాత పాత పెళ్ళికూతురిలా వెలవెలబోతాడు. ప్రజలిచ్చే తీర్పు అన్ని వేళలా బావుంటుందని చెప్పలేం. అప్పుడు ఓటర్లకు పడుతుంది వాత. తప్పదు మరి. వాళ్ళ వాటా వాళ్ళకిచ్చేయాలి కదా!

విపక్ష చానళ్ళు నిత్యం, అచ్చంగా తమ భావజాలమే ఉన్న ఓ నలుగురిని పోగేసి, మరో నలుగురిని ఫోన్లో పెట్టి గుండెలు బాదుకుంటూ రాష్ట్రంలో ప్రజలు నాశనం అయిపోతున్నారంటూ నోట్లో చెంగు పెట్టుకుని ఏడుపాపుకుంటూ, గొంతు చించుకుంటూ అరిచి అరిచి మనకు కాలక్షేపం కలిగిస్తారు. దాన్ని కూడా ఒక సీరియల్‌లా చూస్తారు ప్రజానీకం. స్వపక్ష పత్రికలు అధికారానికి అనుకూలంగానూ, ప్రతిపక్ష పత్రికలూ అధికారానికి వ్యతిరేకంగానూ కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ బిగించుకుంటాయి. నిజం మాత్రం దేవుడికి మాత్రమే తెలుసు. వాస్తవం తెలుసుకోవాలనుకునే సామాన్యుడు ఓ ఏడెనిమిది దిన పత్రికలు ముందేసుకుని వాటిని కషాయం చేసి వడకడితే నిజం ఆచూకీ తెలిసే ఛాన్సుంది. ఎందుకంటే అందరూ ప్రపంచ స్థాయి మహా నటులే. నటనలో జీవిస్తూ జీవితం మరిచిపోయిన మహానుభావులే. అలా కాదు వారు ఆదర్శవంతులు, అమాయకులు అనుకుంటే మనంత తెలివితక్కువ వాళ్ళు మరొకరుండరు.

గెలిచాక ముఖ్యమంత్రిగారి కష్టాలు వేరు. మంత్రులవి వేరు. ఎమ్మెల్ల్యేలవి వేరు. ఎవరికి దొరికిన దీపాల్లో వారు తమ తమ ఇళ్ళు చక్కబెట్టుకునే పనిలో క్షణం తీరిక లేకుండా ఉంటారు. ‘ప్రజాసేవా? పచ్చ గడ్డా?’అని నవ్వుకుంటారు. అయితే ముఖ్య పదవిలో ఉన్నవారి కష్టం పగవారికి కూడా వద్దు. స్త్రీలకి, ప్రజాసేవ చేసే పదవులిస్తే బాగా పనిచేస్తారని ఇస్తే, ఎప్పుడైనా ప్రజల దగ్గరికి వెళ్లాలంటే వాళ్ళకి విసుగు. కారణం మేకప్ అవ్వాలి, చుట్టూ మీడియా ఉండాలి లేకపోతే ఇంత కష్టం వృథా కదా అని వారి ఇబ్బంది వారిది. అందుకే వీళ్ళందరికీ కొండంత సానుభూతి చెప్పేద్దాం పట్టండి.

ఈ కుప్పిగంతుల నాయకుల రాజకీయ విన్యాసాలు చూసి చూసి మన బుర్రంతా పాడుచేసుకుని, మనం ఒక్కళ్ళమే దేశ భక్తులం అనేసుకుంటూ, ఈ దుఃఖ భారాన్నంతా బస్తాల కొద్దీ మోస్తూ మన వీపులు కృంగిపోకుండా మనం కొన్ని చిట్కాలు పాటించి పై రాజకీయ క్రీడల నుండి శక్తి మేరా కామెడీ పిండుకోగలగాలి. కొంత వైరాగ్యం అలవరచుకోవాలి. ఎన్నికలు మాయా, ఓట్లు మాయా, రాజకీయాలూ, నాయకులూ మాయా అనుకోవాలి. అప్పుడు మనం వొడ్డున పడినట్టు ఊపిరి పీల్చుకుంటాం. ఆ తర్వాత వెతుక్కుంటే బోలెడన్ని హాస్యపు గుళికలు దొరుకుతాయి.

పార్టీల్లో ఉండే చిన్నా,పెద్దా నాయకులు కప్పల్లా అటూఇటూ దూకుతుంటారు. అలా బేరాలాడుకుని పార్టీ మారేవాళ్ళు తాడిచెట్టు దూడగడ్డి కోసం ఎక్కాననన్నట్టు కధలు చెబుతుంటారు. ‘మెడన్నా కోసుకుంటా కానీ ఆ పార్టీతో మాత్రం జతకట్టను’ అంటూ చిందులేసిన చిన్నోడు ఏడాది తిరగ్గానే ఆ పార్టీతో ఎన్నికల ఒప్పందం చేసుకుంటాడు. వాట్సాప్ టిప్ టాప్ వీడియో సృష్టికర్తలు గతంలో వారు పలికిన బీరాలు చూపిస్తూ, అప్పుడు ఏ నాయకుని తిట్టారో నేడు అదే నాయకుడి కాళ్ళు మొక్కి కండువా తలవంచి వేయించుకుంటున్నఫోటోలతో కామెడీ వీడియోలు చేసి మనకి సరదా కాలక్షేపం కలిగిస్తుంటారు. ‘తల నరుక్కుంటా, ముక్కు నేలకి రాస్తా’ అని నాయకులు పలికిన ఉత్తర ప్రగల్భాలు ఈ వీడియోల్లో ఉంటాయి. ఈ రాజకీయ రద్దీ పెట్టే ఉక్కిరి బిక్కిరిలో అవే మనకి కొండంత ఊరట.

పాపం కొందరు వృద్ధ నాయకులు జీవితమంతా ఒక పార్టీలో ఉండి వారసుల కోసం అవసాన దశలో పార్టీ మారి మొహానికి కండువా అడ్డం పెట్టుకుని బ్రతుకీడుస్తుంటారు. “సంపాదించింది చాలదా, ఈ కష్టాలెందుకయ్యా?” అంటే “అది నిలబెట్టుకోవడానికే కదా బాబూ!” అని గీతోపదేశం మొదలెడతారు. తీరా గోడ దూకి అటు పార్టీలో చేరాక అక్కడ పోటీకి టికెట్ రాక, వెనక్కి రాలేక త్రిశంకు స్వర్గంలో వేళ్ళాడేవారు కొందరు. ఆశపడి వెళ్లిన కొత్త పార్టీ ఓడిపోయి పాత పార్టీ అధికారం చేజిక్కించుకుంటే అప్పుడు వారి చావు ఘోరాతిఘోరం. మరదే ‘న ఘర్ కా నా ఘాట్ కా’ అంటే.

గమనిస్తే ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ పార్టీ అయినా అధికారం చేజిక్కిన తర్వాత వారందరి ప్రవర్తనా ఒకటే. అందరూ ఒకే తానులో గుడ్డలే. ఈ సత్యం గమనిస్తే మనకు మనసు నిమ్మళిస్తుంది. బీ.పీ. పెరగదు. రోజూ పేపర్లలో వచ్చే కార్టూన్లు చూసి నవ్వుకుంటూ కాఫీ తాగొచ్చు. ఒక పార్టీ విధానాలతో విసుగెత్తిన మనం మరో పార్టీ పై ఆశలు పెట్టుకుని ఓటు వేసినందుకు పెనం లోంచి పొయ్యిలో పడ్డామని తెలిసి నెత్తీ నోరూ కొట్టుకుంటూ బయటపడకుండా ‘మౌనమె నీభాష ఓ మూగమనసా’ అని మనసులో ఏడుస్తూ పాడుకోక తప్పదు.

ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం కాస్తా కుటుంబస్వామ్యమవుతోంది. అలా కానట్టు కనబడినా ఆ విధానమే నడుస్తుంది. ఎక్కడైనా ఒకే వ్యక్తిపాలన తప్పదు. చుట్టూ ఉన్నవాళ్లు పరువు కాపాడుకోవడానికి ఇచ్చిన పని చేసుకుపోతారు తప్ప అక్కడేదో ప్రజాస్వామ్యం పరిఢవిల్లి పోతోందనుకుంటే మనంత వెర్రిమాలోకాలు మరొకరుండరు. ప్రభుత్వానికే కానీ ప్రజలకు కించిత్ లాభంలేని ‘అబ్రకదబ్ర’ బడ్జెట్ సర్కస్ చేసేసరికి పాపం ఆ శాఖామంత్రుల తల పండిపోతుంది. ఆ తర్వాత రంగు వేసినా పట్టదన్నమాట. మీ కర్థం అవుతోందా?

వివిధ రాజకీయపార్టీల ప్రతినిధుల్ని ఛానల్‌కి పిల్చి కూర్చోబెట్టి చర్చలో తాను అడిగే ప్రశ్నలకు వాళ్లంతా డొంకతిరుగుడు సమాధానాలు చెబుతుంటే, మోడరేటర్ కెమెరా ముందు జుట్టు పీక్కోలేక వెర్రి నవ్వులు నవ్వుతూ లోపల పళ్ళు పట పట కొరుక్కుంటూ చిత్రహింస పడుతుంటే మనకి కడుపులో రంగు రంగుల బటర్ ఫ్లైలు హాయిగా కిల కిలా ఎగురుతుంటాయి. ఓపిగ్గా వెతుక్కుంటే నిత్యం అలాంటి సీన్లు మనకి బోలెడు.

నాయకులెవరైనా సరే మైక్ పట్టుకోగానే వీరదేశ భక్తుల్లా ఆస్కార్ స్థాయిని మించి నటిస్తుంటారు. ఏం చేస్తే ప్రజలు మనకు మంచి మార్కులు వేస్తారో అన్న తపనతో అసందర్భంగా ఏవేవో మాట్లాడేస్తుంటారు. అన్నీ వింటూ, చూస్తూ అమాయకుల్లా కనబడుతూనే ప్రజలు ఆఖర్నగట్టి వాత పెడతారు. ఎవరో ఒకరిని అభిమానించి వారి తరఫున వాదించే దురభిమానులకి పనిలో పనిగా మొట్టికాయ పడుతుంది. వారి మొహం చూసి మనం రహస్యంగా నవ్వేసుకోవచ్చు.

జీవితాన్నిమరీ బరువు చేసుకోకుండా లైట్‌గా తీసుకుంటూ, ఉల్లాసంగా గడపాలని అనుకునే మనలాంటి వారికి నిత్య రాజకీయాల్లో బోలెడంత కామెడీ దొరుకుతుంది. రసం పిండుకుని తాగే ఆసక్తి ఉండాలంతే. అప్పుడు మనం రాజకీయంగా నిరాశలో కూరుకుపోకుండా కాస్త తేలిక పడతాం. మనం కూడా కాస్త హాయిగా బతకాలి కదా ఏమంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here