అరక్త బంధం

0
14

[డా. చెంగల్వ రామలక్ష్మి గారు రచించిన ‘అరక్త బంధం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ఆం[/dropcap]టీ, ఆంటీ” గుమ్మం దగ్గర నిల్చుని పిలిచింది గౌరి.

వంటింట్లో ఉన్న సావిత్రి “బయలుదేరారా” అంటూ నవ్వుతూ వచ్చింది.

“అవునాంటీ, విజయదశమి మర్నాడు వస్తాం. మేం వచ్చే రోజున ఫోన్ చేస్తాను. కాస్త పాల పాకెట్లు తీసుకుని ఉంచండి. మధ్యలో చేస్తుంటాను లెండి” అంది గౌరి.

లోపలినుంచి విష్ణుమూర్తి వచ్చి “పేపర్ ఈ పదిరోజులు వద్దని చెప్పారామ్మా?” అన్నాడు.

“చెప్పలేదంకుల్, మీరు తీసుకోండి. చదువుతారుగా”, అంది గౌరి.

“ఎందుకమ్మా! అనవసరంగా ఖర్చు, మీరు లేనపుడు”, అన్నాడు విష్ణుమూర్తి.

“ఫర్వాలేదంకుల్, మీకెలా ఉందిప్పుడు?” కైలాష్ అడిగాడు.

“బాగానే ఉంది. కొంచెం తలనొప్పి, జలుబు”, అన్నాడు విష్ణుమూర్తి.

“జాగ్రత్త అంకుల్, టాబ్లెట్లు వేసుకోండి. ఫోన్ చేస్తూ ఉంటాం” అని చెప్పి వాళ్ళు వెళ్లిపోయారు.

దసరా సెలవలకి వాళ్ళ ఊరు వెళుతున్నారు. ఇద్దరూ టీచర్లే. వాళ్ళ పాప రెండేళ్ల శృతి. వాళ్ళు ఊరెళితే వీళ్లకు తోచదు.

సావిత్రి వాళ్ళు, గౌరి వాళ్ళు పక్క పక్కన పోర్షన్లలో ఉంటున్నారు.

శృతిని కేర్ సెంటర్‌లో దింపి వాళ్లిద్దరు రోజూ స్కూలుకి వెళతారు. ఒకరోజు, శృతికి జ్వరం వచ్చింది. వీళ్లిద్దరికి స్కూల్లో సెలవు దొరకలేదు. పరీక్షల టైం. శృతిని కేర్ సెంటర్‌కి పంపటం ఇష్టం లేదు. ఏం చేయాలా అని బాధ పడుతుంటే సావిత్రి నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళను స్కూల్‌కి వెళ్ళమంది. పాపని సావిత్రి, విష్ణుమూర్తి బాగా చూసుకున్నారు. అప్పటినుంచి పాపకి బాగా లేనపుడు, వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ వదిలి వెళ్ళటం అలవాటైంది. పాప కూడా అమ్మమ్మ తాతయ్య అంటూ వీళ్ళింట్లో బాగా ఉంటోంది. పెద్దవాళ్లెవరు లేని వీళ్లకు సావిత్రి వాళ్ళు పెద్దదిక్కు. ఒంట్లో బాగా లేనపుడు టాబ్లెట్లు లాంటివి బైట నుంచి కైలాష్ వీళ్లకి తెచ్చి ఇస్తువుంటాడు. అది ఇరుగు పొరుగు సహకారంలా కాకుండా త్వరలోనే ఆత్మీయ బంధంగా, అవినాభావ బంధంగా మారింది.

సావిత్రి వాళ్ళకి పిల్లల్లేరు. వృద్దాప్యపు బాధ ఇద్దరినీ వేధిస్తూ ఉంటుంది. ‘మంచాన పడితే ఎవరు చూస్తారు’ సావిత్రికి ఇదే ఆలోచన ఎప్పుడూ. విష్ణుమూర్తి పైకి తేలడు. ఇంతకు ముందు ఉండి వెళ్లిన వాళ్లెవరితో ఇంత అనుబంధం ఏర్పడలేదు. గౌరి వాళ్ళు వచ్చాక ధైర్యంగా ఉంటోంది. కాని వీళ్ళు ఎల్లకాలం ఉండబోరుగా. పిల్ల కాస్త పెద్దయితే వేరే ఇల్లు చూసుకుంటారు అనుకుంటూ వుంటుంది సావిత్రి.

విష్ణుమూర్తి చేసిన ప్రైవేట్ కాలేజీలో క్లర్క్ ఉద్యోగానికి వయోపరిమితి లేకపోయినా, వయసు సహకరించక 65 ఏళ్ళు దాటాక మానేసాడు. సావిత్రికి అన్న వరసయ్యే కామేశం, ఢిల్లీలో కొడుకు దగ్గర ఉంటున్నాడు. ఈయన పెన్షన్, కొడుకు రెండు చేతులా సంపాదన, వద్దంటే డబ్బే డబ్బు! విజయవాడలో ఉండే ఈ ఇంటిని వచ్చి చూసుకోవటానికి కాని అమ్ముకోవటానికి కాని శ్రద్ధ లేదు. కామేశం సావిత్రి వాళ్ళ పరిస్థితి తెలిసి, వాళ్ళు ఉన్నన్నాళ్ళు ఒక పోర్షన్‍లో అద్దె లేకుండా ఉండమని చెప్పాడు. పక్క పోర్షన్‌లో దిగిన గౌరి వాళ్ళు కామేశానికి అద్దె ఆన్‌లైన్‌లో పంపేస్తారు. సావిత్రి ప్రతిరోజూ కామేశాన్ని తలచుకుని దణ్ణం పెట్టుకుంటుంది. భర్త ఉద్యోగం మానటం, ఈ ఇల్లు రావటం రెండూ ఒకేసారి జరిగాయి.

సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవాలంటే మనసే కాదు డబ్బు కూడా కావాలి. శుభాలకి, అశుభాలకి సావిత్రి దంపతులకు పిలుపులొస్తాయి. కాని, టికెట్లకి వందలు, వేలు పోయలేక ఎక్కడికీ వెళ్ళరు. ఊళ్ళోవైతే మానరు. ఇంటికి దగ్గరలో ఉండే గుళ్ళకి, సంగీత కచేరీలకి వెళుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు.

ఇంటి దగ్గరుండే పార్కుకి సాయంత్రం వెళ్లి కాసేపు నడిచి అక్కడే పిల్లల ఆటపాటలు చూసి నెమ్మదిగా ఇంటికి వస్తారు. ఎదిరింట్లో వాళ్ళు, పక్కిళ్ల వాళ్ళు పలకరిస్తూనే ఉంటారు. ఇదంతా తమ ఆరోగ్యాలు బాగున్నంత వరకే అనే సత్యం సావిత్రిని భయపెడుతూ ఉంటుంది.

గౌరి వాళ్ళు లేకపోతే ఏం తోచట్లేదు. పసిపిల్ల ఎప్పుడూ ఇక్కడే ఉండేది. సందడే లేదు. ఇలా వారం రోజులు గడపాలి అనుకున్నారు సావిత్రి, విష్ణుమూర్తి.

చీకటి పడుతుంటే ఇంకా బిక్కు బిక్కుమన్నట్లుంటే టీ.వీ. కూడా చూడబుద్ధవక పడుకున్నారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు! ఎప్పటికో నిద్రాదేవి కరుణించింది.

గౌరి రోజూ ఫోన్ చేస్తోంది. ఒక్కో రోజూ గడుస్తుంటే ఇంక వచ్చేస్తారు అని నిశ్చింతగా అనిపిస్తోంది కాని ఇంత అనుబంధం పెంచుకుంటే ఎలా అనికూడా సావిత్రికి అనిపిస్తూవుంటుంది.

మహర్నవమి! పూజ చేసుకుని కొద్దిగా పులిహోర, రవ్వ కేసరి చేసి నైవేద్యం పెట్టింది సావిత్రి. ఎదురింటి మాస్టారి కోడలు సుగుణ మామిడి కొమ్మలు కావాలని వస్తే కూర్చోబెట్టి ప్రసాదం పెట్టి, నవరాత్రుల్లో వచ్చిందని జాకెట్టు ముక్క, పళ్ళు పెట్టి తాంబూలం ఇచ్చింది.

ఆ రాత్రి గౌరి వాళ్ళ గురించి, శృతి అల్లరి గురించి మాట్లాడుకుంటూ, నిద్ర పోయారు ఇద్దరూ. సావిత్రి రోజూ ఐదింటికే నిద్ర లేస్తుంది. వాకిట్లో ముగ్గు వేసి ఇల్లు ఊడ్చుకుని, కాఫీ తాగి స్నానం చేసేటప్పటికి ఆరవుతుంది. అప్పుడు విష్ణుమూర్తి లేస్తాడు. ఆయనకు కాఫీ ఇచ్చి పూజకి కూర్చుంటుంది.

ఆ రోజు విజయదశమి. విష్ణుమూర్తి యథాప్రకారం ఆరింటికి లేచాడు. ఎక్కడా అలికిడి లేదు. వీధి తలుపులు తీసి లేవు. అప్పుడు పక్క మంచం మీద చూసాడు. ఇదేంటీ సావిత్రి ఎప్పుడూ ఇంతసేపు పడుకోదు. ఇవాళ పండగ కూడా! అనుకుంటూ సావిత్రీ సావిత్రీ అంటూ పిలిచాడు. పలకలేదు. కదలలేదు. రాత్రి తొందరగానే పడుకుంది కదా అనుకుంటూ దగ్గరికీ వెళ్లి పిలుస్తూ కదిపాడు. చెయ్యి చల్లగా ఉంది.

విష్ణుమూర్తికి ఏడుపు వచ్చేస్తోంది. ఎదురింటి పరంధామయ్య గారబ్బాయి పాలకి వెళుతున్నాడు.

“భాస్కర్ ఇలా రా” అంటూ విష్ణుమూర్తి పిలిచాడు.

“అలా ఉన్నారేంటి?” అంటూ భాస్కర్ లోపలికి వచ్చాడు.

“నాకేంటో భయంగా వుంది. ఆవిడ లేవట్లేదు” అన్నాడు విష్ణుమూర్తి.

భాస్కర్‌కి చూస్తూనే అర్థమైంది. “అంకుల్, కంగారు పడకండి. డాక్టర్‌కి చూపిద్దాం. మీరు ఇక్కడ కూర్చోండి. నాన్నని పిలుస్తాను” అంటూ గబ గబా వెళ్ళిపోయాడు.

వెంటనే పరంధామయ్య, భార్య, కోడలు వచ్చారు. విష్ణుమూర్తి ఏడుస్తున్నాడు. “ఏమైంది? రాత్రి ఎలా ఉన్నారు?” అని వాళ్ళు అడుగుతున్నారు. కోడలు, “నిన్న నాకు తాంబూలం ఇచ్చి, చక్కగా మాట్లాడారు” అని గుర్తు చేసుకుంది.

ఆర్.ఎం.పి. డాక్టర్ వచ్చి నిద్ర లోనే ప్రాణం పోయిందని తేల్చాడు. పండగ పూట కూతుళ్లు, అల్లుళ్ళు వచ్చి ఉన్నారు. పరంధామయ్యకు, భార్యకు, విష్ణుమూర్తిని వదిలి వెళ్లటానికి మనసు రావట్లేదు.

భాస్కర్ “అంకుల్, మీ వాళ్లెవరైనా ఉంటే చెప్పండి ఫోన్ చేస్తా” అన్నాడు.

అప్పుడే గౌరి ఫోన్! విజయదశమి శుభాకాంక్షలు చెప్పి, రాత్రికి బయలుదేరుతున్నామని చెప్పటానికి చేసింది.

విష్ణుమూర్తి “అమ్మా గౌరి, అంతా అయిపోయింది” అంటూ ఏడ్చేస్తున్నాడు. గౌరి కంగారుగా “ఏమైంది?” అంటుంటే భాస్కర్ తీసుకుని విషయం చెప్పాడు. గౌరి, “అయ్యో! మేం బయలుదేరుతున్నాం. వచ్చేదాకా మీరెవరైనా ఉండి చూసుకోండి”, అని చెప్పింది.

చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరూ పోగవుతున్నారు. సావిత్రి మంచితనం గురించి పొగుడుతున్నారు. విజయదశమి నాడు ముత్తయిదువలా వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు. ఒక్కొక్కరే నెమ్మదిగా వెళుతున్నారు. పరంధామయ్య తోడుగా కూర్చున్నాడు. ఆయన భార్య, విష్ణుమూర్తిని, “కాఫీ తాగండి. మీకు జ్వరం, నీరసం తగ్గలేదు” అని బలవంతంగా తాగించింది. ఆయన ఏడుస్తూనే ఉన్నాడు.

ఎంత వెంటనే బయలుదేరారో, ఎలా వచ్చారో గాని గౌరి, కైలాష్‌లు ఒంటిగంట కంతా వచ్చేసారు. విష్ణుమూర్తి భోరుమన్నాడు. గౌరి ఏడుస్తూనే ఆయన్ని ఓదార్చింది. కైలాష్, ఆయన ఫోన్‌లో ఉన్న నంబర్లు చూసి, ఆయన అన్న కొడుకులకి ఇంకా దగ్గర బంధువులకు చెప్పాడు. కామేశం ఫోన్ లోనే విష్ణుమూర్తిని ధైర్యంగా ఉండమని ఓదార్చాడు.

పక్క ఊళ్ళో ఉండే అన్న కొడుకులు ఇద్దరు, ఊళ్ళో ఉండే బంధువులు ఇద్దరు ముగ్గురు వచ్చారు. పలకరించి ఓదార్చారు. కాని తలకొరివి పెట్టటానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ఆ కార్యక్రమాలు చెయ్యాలంటే సెలవలు దొరకటం కష్టం అని తలో రకంగా మాట్లాడుతున్నారు.

సావిత్రికి ఉన్న ఒకే ఒక్క చెల్లెలు హైదరాబాద్‌లో అనారోగ్యం తో ఐ.సి.యూ. లో ఉంది. వాళ్ళ పిల్లలు వచ్చే పరిస్థితి లేదు.

విష్ణుమూర్తికి జ్వరం పెరుగుతోంది. వణికిపోతున్నాడు. సూర్యాస్తమయం అయితే కష్టమని కైలాష్ తనే నిర్ణయం తీసుకుని, “అంకుల్, మీరు ధైర్యంగా ఉండండి అన్ని కార్యక్రమాలు నేను చేస్తాను”, అంటూ తన స్నేహితులను పిలిచి చక చకా ఏర్పాట్లన్నీ క్షణాలలో చేసి, సూర్యాస్తమయంలోపు సావిత్రిని కన్నకొడుకులా పరలోకానికి పంపాడు. సావిత్రి ని తీసుకెళుతుంటే వీధిలో వాళ్ళు కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. కైలాష్, గౌరి బాధ్యతంతా భుజాన వేసుకుని 10, 11, 12 రోజుల కార్యక్రమం చేసారు. విష్ణుమూర్తిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందులు జాగ్రత్తగా వేసి బాగా చూసుకున్నారు.

విష్ణుమూర్తి కాస్త కోలుకున్నాక, బ్యాంకుకి వెళ్లి తాము దాచుకున్న డబ్బు తీసి ఖర్చయిన మొత్తం ఇచ్చేసాడు.

కాలం ఎవరి కోసం ఆగదు. సావిత్రి పోయి నెల అయిపోతోంది. రోజూ గౌరే, విష్ణుమూర్తికి భోజనం ఆయనింట్లోనే టేబుల్ మీద పెట్టి స్కూల్‌కి వెళుతోంది. ఇంట్లో ఉన్నంతసేపు పలకరిస్తూనే వుంటారు కైలాష్, గౌరి ఇద్దరూ! శృతి విష్ణుమూర్తి దగ్గరే ఉంటుంది.

ఆ రోజు ఆదివారం! విష్ణుమూర్తి టీ.వి. చూస్తున్నాడు. గౌరి పూరీ చేసి తీసుకొచ్చింది. శృతి అక్కడే ఉంది. కైలాష్ కూడా ఆయనతో అక్కడే తింటానన్నాడు. విష్ణుమూర్తి, గౌరిని కూడా తెచ్చుకోమన్నాడు.

నలుగురూ తింటున్నారు.

విష్ణుమూర్తి, “సావిత్రి ఎప్పుడూ మనకు, చివరి దశలో చూడటానికి పిల్లలు లేరు కదా! తలకొరివి ఎవరు పెడతారు? ఎలా? అంటూ వుండేది. ఇది ఏనాటి బంధమో! రక్త సంబంధీకులే మొహం చాటేసి వెళ్లిపోయారు ఆ రోజు. ఎవరినీ అనటానికి లేదు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి. కన్న పిల్లల కన్నా ఎక్కువ చేసారు మీరు. సావిత్రి పై నుంచి ఎంతో సంతోషిస్తూ ఉంటుంది.

బాబూ కైలాష్, గౌరీ, నేను ఈ పది రోజులనుంచి తగిన దారి కోసం ప్రయత్నిస్తున్నాను. ఈ ఊళ్ళోనే నా స్నేహితుడు ఒక వృద్దాశ్రమంలో వున్నాడని తెలిసి నిన్న మాట్లాడాను. అక్కడ అంతా బాగుందిట. నాకు వచ్చే వృద్దాప్య పెన్షన్, దాచుకున్న డబ్బు పై వచ్చే వడ్డీ అక్కడ నెల నెలా కట్టటానికి సరిపోతుంది. సావిత్రిలా నిద్రలో పోతే అదృష్టవంతుణ్ణి. కాకపోతే, ఏదైనా జబ్బు చేస్తే, మీకే కబురు చేస్తారు వాళ్ళు. నేను అక్కడ చేరినపుడు నువ్వే సంతకం చేయాలి కైలాష్! చూసారా, చివరి దశలో తనకంటూ ఎవరో ఒకరు చూసుకునే వాళ్ళు ఉండాలి. మా అదృష్టం  మీరు దొరికారు. నా ఆరోగ్య శ్రీ కార్డు, ఫిక్సెడ్ డిపాజిట్ లు నీ దగ్గర ఉంచు. సావిత్రి ఎప్పుడూ, ‘ఈ పది లక్షలే మనకు ఆధారం. రాకూడని జబ్బులేవైనా వస్తే ఎలాగండీ’ అంటూ ఉండేది. ఆమె వెళ్ళిపోయింది. నన్ను కూడా సావిత్రి లాగానే పంపిస్తావు కదూ!” అన్నాడు కళ్ల నీళ్లతో.

“అంకుల్! మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎప్పటికి మాతోనే ఉండాలి. ఇలా మాట్లాడొద్దు”, అన్నాడు కైలాష్.

“నేను బాగా చూడటం లేదా అంకుల్?” అంది గౌరి ఏడుస్తూ.

“కానే కాదమ్మా! మీలా చూసేవాళ్లెవరూ లేరు నాకని మీకూ తెలుసు. కాని, మీకూ మీ తల్లితండ్రుల బాధ్యత ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి, పిల్ల బాధ్యత ఇన్నింటిలో నాకు చేయటం కష్టం. సావిత్రి హఠాత్తుగా పోవటంతో సరైన నిర్ణయం సకాలంలో తీసుకుని చేసారు. నేను ఇక్కడే ఉండిపోతే మీకూ కుదరక పోవచ్చు. విమర్శలను ఎదుర్కోవాలి. మీ ఈ అపురూప బంధాన్ని చివరి దాకా నిలుపుకోవాలంటే నేను వెళ్ళటమే మంచిది. ఉండమనటం మీ మంచితనం. అయినా సావిత్రి పోయాక నేను ఉండలేకపోతున్నాను. అక్కడైతే నలుగురు ఉంటారు.

దిక్కులేని చావు కాకుండా మీరున్నారని, సావిత్రి అంతిమయాత్ర చూసాక నాకు ధైర్యంగా ఉంది. నేను పండగలకి వస్తూ ఉంటాను. మీరూ అక్కడికి వస్తూ ఉండండి. చివరి రోజుల్లో ప్రేమగా చూసుకునే పిల్లలు ఉండటం అదృష్టం. భగవంతుడు ఆ భాగ్యాన్ని మీ వల్ల మాకు కలిగించాడు” అంటూ లోపలికి వెళ్లి, డిపాజిట్లు, ముఖ్యమైన కాయితాలు తెచ్చి కైలాష్‌కి ఇచ్చాడు. “సావిత్రిలా నేను కూడా పోతే ఖర్చవగా మిగిలిన డబ్బు నా మనవరాలు శృతికి.

కాకపోతే మాత్రం, ఇంతకుమించి నేను బతకటానికి ఖర్చు వద్దు. కామేశం బావకి కూడా విషయం చెపుతాను. ఇందులోకి ఎవరైనా మంచివాళ్ళు వస్తే మీకు తోడుగా ఉంటారు. నేను రెండు రోజుల్లో బయలుదేరుతాను”, అన్నాడు.

“మేం వారం వారం వచ్చి చూస్తూ ఉంటాం. మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తాం. మిమ్మల్ని వదిలిపెట్టం”, అన్నారు గౌరి, కైలాష్‌లు ఒకేసారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here