ఆర్మీ డే

0
7

[box type=’note’ fontsize=’16’] జనవరి 15 న ‘ఆర్మీ డే’ సందర్భంగా ప్రత్యేక వ్యాసం అందిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]

[dropcap]మ[/dropcap]న దేశములో జనవరి 15వ తేదీన ‘ఆర్మీ డే’గా జరుపుకుంటాము. ఆ సందర్భముగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మన మిలిటరీ గురించి కొన్నివిశేషాలను తెలుసుకుందాము. 1776లో భారత దేశము ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్నప్పుడు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము కలకత్తాలో మిలిటరీ డిపార్టుమెంట్‌ను ప్రారంభించారు. ఆ విధముగా మన దేశములో మిలిటరీ అనేది ఏర్పడింది. 1949, జనవరి 15న మొదటి భారతీయుడిగా ఫీల్డ్ మార్షల్ కరియప్ప కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయన గౌరవార్థము మరియు భారతీయ సైన్యములోని సైనికుల త్యాగాలకు ధైర్య సాహసాలకు దేశాన్ని కాపాడటంలో వారు నిర్వహించే పాత్రకు గుర్తింపుగా ఆ రోజును ‘ఆర్మీ డే’గా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము.

భారత దేశాధ్యక్షుడు మన సైన్యానికి అంటే పదాతి, నావిక, వైమానిక దళాలకు సుప్రీం కమాండర్‌గా వ్యవహరిస్తారు. భారతీయ సైన్యము కర్తవ్య నిర్వహణలో మూడు ‘N’ ఆచరిస్తూ డూ ఆర్ డై (చేయి లేదా చనిపో) అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు. మూడు N లలో మొదటి N అంటే నామ్ (పేరు) వారు పనిచేస్తున్న యూనిట్ లేదా మిలిటరీ లేదా దేశ గౌరవము పేరు నిలబెట్టటం, రెండవ N అంటే నమక్ (ఉప్పు తినటం అంటే దేశానికి విశ్వాసముగా ఉండటం), మూడవ N నిషాన్ (గురి మరియు వారి పనిచేస్తున్న యూనిట్ యొక్క జెండా గౌరవము) కాపాడటం వారి విధిగా భావిస్తారు. గ్లోబల్ ఫైర్ పవర్ నివేదిక ప్రకారము భారతీయ మిలిటరీ ప్రపంచములోని నాల్గవ పెద్దదిగా గుర్తింపు పొందింది. సైన్యములో వివిధ కేడర్లలోని సైనికుల సంఖ్య 1.3 మిలియన్లు. వీరి నినాదం, ‘సర్వీస్ బిఫోర్ సెల్ఫ్’. అంటే వ్యక్తి కన్నా సేవయే ముఖ్యము అని అర్ధము.

ప్రపంచములోని అతి ఎత్తైన (18,875 అడుగుల ఎత్తు) యుద్ధభూమి అయిన సియాచిన్ గ్లేసియర్ మన భారతీయ సైన్యము అధీనములో ఉంది. బంగ్లాదేశ్ అనే దేశము ఏర్పడటానికి కారణమైన 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధములో పాకిస్తాన్‌ను ఓడించి పాకిస్తాన్ తన భూభాగములో సగము కోల్పోయేటట్లు చేసింది భారతీయ సైన్యమే. అంతేకాకుండా అధికారికంగా పాక్ ఆ ప్రాంతపు సేనాని భారతీయ సేనలకు లొంగిపోయాడు. రెండవ ప్రపంచ యుద్ధము తరువాత జరిగిన అతి పెద్ద మిలిటరీ లొంగుబాటు ఇదే. జర్మన్ నియంత భారతీయ సైన్యములోని గుర్ఖా రెజిమెంట్ గనుక తనకు ఉంటే మొత్తము యూరోప్‌ను జయించేవాడిని అని అన్నాడుట. ఒక్క గుర్ఖా రెజిమెంట్ మాత్రమే ప్రపంచములో జర్మన్ సైన్యాన్ని ఎదుర్కొనగలడు అని హిట్లర్ నమ్మేవాడు.

ఇండియన్ ఆర్మీ ప్రపంచములోని ఇతర దేశాల అంటే అమెరికా, ఇంగ్లాండ్, రష్యా వంటి దేశాల సైనికాధికారులకు డెహ్రాడూన్ లోని మిలిటరీ అకాడమీలో తర్ఫీదు ఇస్తుంది. ఇండియన్ ఆర్మీలో ఆడవాళ్లను అధికారుల స్థాయిలో తీసుకోవటం 1992లో ప్రారంభము అయింది. వీరికి శిక్షణ చెన్నై లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఇస్తారు. వివిధ సర్వీసులలో ఇప్పటివరకు 1200 మంది లేడి ఆఫీసర్స్ కమీషన్డ్ ఆఫీసర్స్‌గా ఉన్నారు. రాయల్ ఇండియన్ ఆర్మీకి చెందిన కమల్ రామ్ అనే సిపాయి 19 ఏళ్ల వయస్సులో విక్టోరియా క్రాస్‌ను రెండవ ప్రపంచయుద్ధములో ధైర్య సాహాసాలు చూపినందుకు పొందాడు. పిన్న వయస్సులో ఈ సత్కారము పొందిన భారతీయుడిగా చరిత్రలో స్థానము పొందాడు. ఇండియన్ ఆర్మీలో ఉన్నత స్థాయి గౌరవము పరమవీరచక్ర బిరుదు. ఇప్పటివరకు 21 మంది ఈ సత్కారాన్ని పొందారు. వారిలో 14 మంది వారి మరణానంతరము పొందారు. ప్రముఖ క్రీడాకారులైన ఎమ్.ఎస్. ధోని, కపిల్ దేవ్, మిల్కా సింగ్, అభినవ్ బింద్రా వంటి వారికి ఇండియన్ ఆర్మీలో గౌరవ పదవులు ఇచ్చారు. అలాగే రాజకీయ వేత్తల కోటాలో అనురాగ్ శర్మ, సచిన్ పైలట్ లకు కూడా ఆర్మీలో గౌరవ పదవులు ఇచ్చారు.

ఇండియన్ ఆర్మీలో ఐదు నక్షత్రాల జనరల్ ఆఫీసర్ (ఇండియన్ మిలిటరులో అత్యున్నత పదవి) ఫీల్డ్ మార్షల్ హోదా పొందినవారు ఇప్పటివరకు ఇద్దరే ఇద్దరు. వారు కరియప్ప, శామ్ మానిక్ షా. ఇండియన్ ఆర్మీ అజేయముగా ఉండటానికి కారణము తెలుసుకోవాలంటే 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధములో పట్టుబడ్డ పాకిస్తానీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ మాటల్లోనే తెలుసుకోవాలి. “మాకు భారతీయ సైన్యములోని ఆఫీసర్ల లాంటి ఆఫీసర్లు గనుక ఉంటే మేము ప్రపంచములో ఏ దేశపు సైన్యాన్ని అయినా ఓడించగలిగే వాళ్ళము.” ఇది భారతదేశపు సైన్యానికి శత్రుదేశమైన పాకిస్తానీ సైన్యములోని అధికారి ఇచ్చిన ప్రశంస. ఈ ప్రశంస అర్థము తెలుసుకోవాలంటే భారతీయ సైనికుడి గురించి కొంత తెలుసుకోవాలి.

ఇండియన్ ఆర్మీ 1.3 మిలియన్ల సైన్యము గల బలగము. మిగతా దేశాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. మన జనాభా నిష్పత్తితో పోలిస్తే 1000 మంది జనాభాకు మన సైనికుల సంఖ్య 2.78. ఏ సందర్భములోను సైనికులను బలవంతముగా చేర్చుకోలేదు. భారతదేశములో సైనికుడిగా ఎంపిక కావటము చాలా కష్టమైన పని. ఎన్నో రకాల కఠినమైన పరీక్షలు పాస్ అవ్వాలి. ఆ తరువాత ట్రైనింగ్ ఇస్తారు. వివిధ రకాల వాతావరణ పరిస్థితులలో అంటే ఎండ ఎక్కువగా వుండే ఎడారి ప్రాంతములలో, అలాగే చలి ఎక్కువగా ఉండే కాశ్మీర్ ప్రాంతాలలో ట్రైనింగ్ ఉంటుంది. ఏ విధమైన విలాసవంతమైన జీవితమూ గడిపే అవకాశము ఉండదు. క్రమశిక్షణ, ధైర్యము వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. వీటివల్ల దేశము కోసము పోరాడుతున్నాము అన్న భావన వారిలో బలముగా ఉంటుంది. దేశము కోసము ప్రాణాలను అర్పించటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటారు.

కాశ్మీర్‌లోగాని నార్త్-ఈస్ట్‌లో గాని ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటప్పుడు ఇండియన్ ఆర్మీ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ జనానికి చాలా తక్కువ నష్టము కలిగించటం. అందుచేతనే వీరు అటువంటి దాడులలో హెలికాఫ్టర్ లేదా గన్ షిప్స్ ఉపయోగించరు. పాకిస్తాన్‌లో లాగా సొంత పౌరులను చంపరు. ఇండియన్ ఆర్మీకి అధికార దాహము లేదు. మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో సైనిక విప్లవాలు జరిపి అధికారాన్ని చేపట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆ దేశములో సైన్యానిదే ఆధిపత్యము. ప్రజా ప్రభుత్వము నామ్ కే వాస్తే. ప్రభుత్వాన్ని నడిపించేది అక్కడి సైన్యమే. ఇండియన్ ఆర్మీ చరిత్రలో ఇటువంటి సంఘటన అసలు జరగలేదు. ఇండియన్ ఆర్మీ భారత దేశము అవలంభించే సెక్యులరిజంకు ఒక రోల్ మోడల్ లాంటిది. ఇండియన్ ఆర్మీ ఒక సెక్యులర్ ఆర్గనైజేషన్. ఇండియన్ ఆర్మీలో కుల మతాలకే తావు లేదు. వీరికి జాతీయ భావాలు, జాతి శ్రేయస్సు ముఖ్యము. వీరు ఏ సందర్భములోనైనా ఏ టైములో నైనా దేశ రక్షణకు ప్రాణ త్యాగాలకు సిద్ధముగా ఉంటారు. ఇండియన్ ఆర్మీ యొక్క నాయకత్వపు లక్షణాలు చాలా ప్రత్యేకమైనవి, అరుదైనవి. ఆర్మీ లోని సైన్యాన్ని నడిపించే అధికారులు త్యాగాల విషయములో ముందు ఉంటారు. ప్రతి ఎనిమిది మంది జవానులకు ఒక అధికారి ప్రాణాలను త్యాగము చేస్తున్నాడు. ఇది సైనికాధికారుల ఉన్నత స్థాయి త్యాగనిరతి, ప్రొఫెషనలిజమ్‌కు తార్కాణము. ఇండియన్ ఆర్మీ ఒక టీమ్‌గా పనిచేస్తూ ఆయుధ వ్యవస్థను చేపడుతుంది. ఆ విధముగా దేశ గౌరవాన్ని ఐక్యతను అన్నికన్నా మిన్నగా వ్యవస్థ గౌరవ ప్రతిష్ఠలను కాపాడుతుంది. ఈ అంశాలన్నిటి వల్ల ఇండియన్ ఆర్మీ ఓడించటానికి సాధ్యము కానీ శక్తిగా ఎదిగింది. చాలా మంది సైన్యానికి ఉండే ఆయుధాలు ఇండియన్ ఆర్మీ ని మంచి దృఢమైన శక్తిగా ఏర్పరుస్తాయి ఆని అనుకుంటారు కానీ నిజానికి ఇండియన్ ఆర్మీ ని ఓడించటానికి వీలులేని శక్తిగా రూపొందించింది సైనికుల, సైనిక అధికారుల నాణ్యత మాత్రమే అని గట్టిగా నిస్సందేహముగా చెప్పవచ్చు. ఇండియన్ ఆర్మీ లోని పురాతనమైన రెజిమెంట్ ప్రెసిడెంట్స్ బాడీ గార్డ్స్. దీనిని 1773లో స్థాపించారు. ఈ సైనికులకు పేరా ట్రూపర్స్‌గా శిక్షణ ఇస్తారు. ఇండియన్ ఆర్మీలో అశ్విక దళాలు ఉన్నాయి ప్రపంచములో ఈ విధముగా అశ్విక దళాలు ఉన్న మూడు దేశాలలో ఇండియా ఒకటి. ఇండియన్ ఆర్మీ సాధించిన ఇంజనీరింగ్ ఘనత ఏమిటి అంటే ప్రపంచములోనే పొడవైన బెయిలీ బ్రిడ్జిని 1982లో లడఖ్ వ్యాలీ లోని ద్రాస్ సెక్టార్ లో నిర్మించడం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here