ఆర్ట్ గ్యాలరీల నగరం – మైసూరు

0
11

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘ఆర్ట్ గ్యాలరీల నగరం – మైసూరు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]మై[/dropcap]సూరును కర్ణాటక సాంస్కృతిక రాజధానిగా వ్యవహరించడంతో పాటుగా మహా సౌధాల నగరంగా కూడా పేర్కొంటారు. ఇక్కడ మైసూరు ప్యాలెస్ మాత్రమే కాకుండా జగన్ మోహన్ ప్యాలెస్, జయలక్ష్మి విలాస్, లలితా మహల్, వంటి అనేక మహళ్ళు ఉoడటం వలన మైసూరుకు మహా సౌధాల నగరంగా పేరు వచ్చింది.

మామూలుగా చాముండేశ్వరి ఆలయం, మైసూరు ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్ చూసి వెళ్ళిపోతారు గానీ మైసూరులో చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. ఆర్ట్ గ్యాలరీలు, ‘జూ’, సరస్సులు, పక్షి కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. జయలక్ష్మి విలాస్ ప్రస్తుతం మైసూరు విశ్వవిద్యాలయంలో కలపబడింది. మైసూరు రాజు చామరాజ వడయార్ తన పెద్ద కూతురైన జయలక్ష్మి అమ్మణ్ణి కోసం ఈ సౌధాన్ని నిర్మించారట. రాజేంద్ర విలాస్ అనే భవనం చాముండీ హిల్స్‌పై భాగంలో ఉంటుంది, లలితా మహల్‌ను  హోటల్‌గా మార్చివేశారు. అలాగే జగన్మోహన్ ప్యాలెస్ ఆర్ట్ గ్యాలరీగా మారిపోయింది. జయలక్ష్మి వివాహ సమయంలో చెక్కలతో నిర్మించిన కారణంగా రాజభదనం లోని కొంత భాగం మంటల్లో కాలిపోయింది మరల అదే స్థలంలో ప్రస్తుత రాజ భవనాలను నిర్మించారు. జయలక్ష్మీ విలాస్‌ను జానపద కళారూపాల మ్యూజియంగా మార్చారు. వడయార్ రాజుల కళాఖండాల కొరకు కూడా ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఆర్ట్ గ్యాలరీ, ‘జూ’ లను నేను ముప్పయ్యేళ్ళ క్రిందట చూశాను. అప్పుడు వాటి వ్యాసాలు రాశాను, మరల చూడలేదు.

వడయార్ రాజులకు, కళలు, కళారూపాల పట్ల అభిరుచి ఎక్కువే ఉందని చెప్పడానికి ఇక్కడ ఉన్న మ్యూజియమ్‌లు, రాజ భవనాలు, ఆర్ట్ గ్యాలరీలను ఉదాహరణగా చెప్పవచ్చు. చాముండీ హిల్స్ మీద ఉన్న నందీశ్వరుడు ప్రాణంతో ఉన్నట్లే కనిపిస్తాడు. కాలి గిట్టలు, మెడలో ఉన్న మువ్వలతో సహా స్పష్టంగా చెక్కబడి ఉoటాయి. ఈ నందీశ్వరుడు తల పైకెత్తి చూస్తూ కాళ్ళు ముడుచుకుని ఉంటాడు. పార్వతీ అవతారమైన చాముండేశ్వరీ అమ్మ ఆజ్ఞ కోసం వేచి చూస్తూ అలర్ట్ ఉన్నట్లనిపిస్తుంది. ఈ నందీశ్వరుని చెక్కిన శిల్ప కళాకారులకు శత కోటి వందనాలు. చాముండేశ్వరి ఆలయం ద్రావిడ వాస్తు శిల్పంలో ఉoటుంది. చాముండీ చెట్టు పైకి వెళ్ళడానికి మెట్ల మార్గంలోనే ఈ నందీశ్వరుడు ఉంటాడు. కార్లు వెల్లే ర్యాంప్ మార్గంలో నంది విగ్రహం కనిపించదు. పూర్వపు రాజులు శిల్ప కళాకారుల్ని బాగా ప్రోత్సహించారు.

మైసూరు ఆర్ట్ గ్యాలరీలకు కూడా ప్రసిద్ధి. ప్రఖ్యాతమైన జగన్ మోహన్ ప్యాలెస్‌ను ఆర్ట్ గ్యాలరీ ఆడిటోరియమ్‌గా మార్చారు. ఇక్కడున్న పెయింటింగ్‌లు చరిత్రనూ, కళనూ, ఆనాటి సామాజిక పరిస్థితులనూ తెలుపుతాయి. ప్రసిద్ది చెందిన రాజా రవివర్మ, హాల్డేన్ కర్ వంటి చిత్రకారుల చిత్రాలున్నాయి. మైసూరు అంటేనే సృజనాత్మక ప్రపంచం అనవచ్చు.

ఇక్కడ మైసూరు ప్యాలస్ లోని కళాఖండాలకు కూడా లెక్కలేదు. గోడలు, స్థూపాలు, తలుపులు, కిటీకీలు, మెట్లు, సీలింగ్ ఒకటేమిటి ఏ వస్తువు కూడా కార్వింగ్ చేయించుకోకుండా అక్కడ నిలబడలేదు. లోహాలలో షాండ్లియర్లు, పూలకుండీలు సైతం అందంగా చెక్కబడి వయ్యారంగా నిలబడ్డాయి.

జయచామరాజేంద్ర చిత్రశాల

జయచామరాజేంద్ర చిత్రశాల అయితే రవివర్మ పెయింటింగులకే రాజులా నిలబడి ఉన్నది. ప్రఖ్యాత చిత్రకారుల చిత్రరాజాలన్నీ చక్కగా కొలువుదీరి ఉన్నాయి. ఇక్కడ, హాల్డేన్ కర్ వేసిన ‘గ్లో ఆఫ్ హోప్’ అనే బొమ్మ అద్భుతంగా ఉంటుంది. ఇదొక చీకటి గదిలో ఉంటుంది. చేతిలో దీపం పట్టుకున్న అమ్మాయి బొమ్మ వెలుగులీనుతూ ఉంటుంది. నేను ఇంతకు పూర్వం దీని గురించి ఒక వ్యాసమే రాశాను.

గ్లో ఆఫ్ హోప్

మా ఇంట్లో తల్లీ బిడ్డల చిత్రాలు ప్రేముఖ చిత్రకారులు వేసినవన్నీ ఉన్నాయి. రవివర్మతో సహా ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులు చిత్రించిన తల్లీ బిడ్డల చిత్రాలను మా ఆసుపత్రిలో పెట్టుకున్నాను.

జయలక్ష్మి విలాస్ మాన్షన్‌ను ‘మైసూరు’ జానపద కళల మ్యూజియంగా మార్చారు. జానపద కళల చిత్రాలను చాలా సేకరించి ఇక్కడుంచారు. రామ్ సింగ్ మ్యూజియం కూడా మైసూరులో ఉన్నది. భరణి ఆర్ట్ గ్యాలరీలో వివిధ రకాల కళలకు స్థానం కల్పించారు. నేను మాత్రం చూడలేకపోయాను. మోడరన్ ఆర్ట్‌కు పెయింటింగ్స్‌కూ శిల్పాలకూ చారు ఆర్ట్ గ్యాలరీ ప్రసిద్ధి చెందింది. సంప్రదాయబద్ధమైన కళలు, శిల్పాలు ఇక్కడ భద్రంగా పేర్చబడ్డాయి. మైసూరు ప్యాలెస్ నుండి బయట పడేవేసిన రాళ్ళను శిల్పాలుగా మలిచి ఇక్కడ ప్రతిష్ఠించారు.

జయలక్ష్మి విలాస్ మాన్షన్‌

స్వచ్ఛమైన మైసూరు సిల్క్ చీరలకు మైసూరు పేరు పొందింది. నాణ్యత గలిగిన పైసూరు సిల్క్ చీరలు లక్ష రూపాయల నుండి మొదలవుతాయి. మైసూరు క్రేప్ చీరలు అంటారు. ఇక్కడ మగ్గాలపై నేసే ఈ చీరలకు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్నది మహిళల కలెక్షన్‌లో మైసూరు క్రేప్ చీర లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదేమో!

దక్షిణ భారత చిత్రలేఖన శైలిని మైసూరు రాజులు ప్రోత్సహించి ఈనాటికీ మన కళ్ళకు కట్టినట్లు చూపెడుతున్నారు. విజయనగర సామ్రాజ్య కాలంలోని చిత్రాల శైలి నుండి కర్ణాటక రాష్ట్ర పెయింటింగులు ఉద్భవించాయి. ఇక్కడి చిత్రాల మూలాలు అజంతా గుహల కాలం నాటివని చరిత్రకారులు చెబుతున్నారు. తంజావూరు చిత్రాల శైలి కూడా ఇక్కడ వాడుకలో ఉన్నది. మైసూరు గోల్డ్ లీఫ్ పెయింటింగ్ కూడా తంజావూరు చిత్రశైలే. గెస్సో అనే తెల్లని సీసం పొడికి జిగురు మిశ్రమం కలిపి పేస్టులా చేస్తారు. గొంబోస్ అనే జిగురు ను కలుపుతారు. దేవతల రూపాలు, ఆభరణాలు, తోరణాలు, వస్త్రాలు అన్ని ఎంబోజింగ్ రూపంలో తంజావూరు చిత్రాలను మరిపిస్తాయి. బంగారు రేకు బాగా అతుక్కునేలా మృదువైన రాయితో రుద్దుతారు. అప్పుడు చిత్రం బంగారు రంగులో మెరుస్తూ శోభాయమానంగా ఉంటుంది.

హంపి లోని విరూపాక్ష ఆలయంలో సీలింగ్ అంతా చిత్రాలతో నింపబడి ఉంటుంది. పౌరాణిక దృశ్యాలను ఈ చిత్రకళలో ఎక్కువగా చిత్రిస్తారు. కుడ్య చిత్రాలు కళాకారుల పనితనానికి నిదర్శనం. మైసూరు లోని చిత్రాలను, కళలను దర్శించాలంటే ఓపిక చాలా అవసరం.

Images Credit: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here