ఆర్ట్ ఆఫ్ లీవింగ్

0
14

[శ్రీమతి జి. వాత్సల్య రచించిన ‘ఆర్ట్ ఆఫ్ లీవింగ్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]న[/dropcap]గరంలోని ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇంటి ముందు నిలబడి ఎన్ని సార్లు బెల్లు కొట్టినా స్నేహితుడు తలుపు తీయకపోవడంతో రామారావుకి అసహనంగా ఉంది. ఫోను చేసినా స్నేహితుడి నుండి స్పందన లేదు. ఇంతలో అతడి స్నేహితుడు ప్రసాద్ బయటకి వచ్చి స్నేహితుడికి క్షమాపణలు చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు.

“సారీ రా! నువ్వు ఫోను చేసినప్పుడు స్నానం చేస్తున్నాను. ఫోను మ్రోగుతోందని మాధవి చూసినా గబుక్కున లేచి వెళ్ళలేని రోగం. తన మోకాళ్ళ నెప్పుల సంగతి తెలుసు కద! మా పరిస్థితి ఇలా ఉన్నా పిల్లలకి మా మీద కనీసం గౌరవం, జాలి కూడా ఉండవు. పెద్దవాళ్ళం ఈ వయసులో ఇంత కష్టపడుతున్నాము. అసలు ఈ కష్టం పగవాడికి కూడా వద్దురా బాబూ!” అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న స్నేహితుడి భుజమ్మీద చెయ్యి వేసి అనునయంగా నొక్కాడు రామారావు.

వెంటనే తేరుకున్న ప్రసాద్, “రామూ! నీ సంగతులేంటిరా? మనవాళ్ళందరూ గేటెడ్ కమ్యూనిటీల్లో ఉంటోంటే నువ్వొక్కడివే ఇంకా ఆ కాలనీని వదిలిరావు ఎందుకురా?” ఆసక్తిగా అడిగాడు ప్రసాద్.

“అన్ని కబుర్లూ తీరికగా చెప్పుకుందాము కానీ కాసిని కాఫీ నీళ్ళైనా ఇవ్వరా బాబూ! అంత దూరం నుండి ఈ ట్రాఫిక్కులో ఈది వచ్చేసరికి నీరసం వచ్చేసింది. చెల్లెమ్మ ఎక్కడుంది?” అని రామారావు అంటుండగానే మాధవి మెల్లిగా నడుస్తూ అక్కడికొచ్చింది.

“అన్నయ్యగారూ! కాఫీ త్రాగుతానన్నారు కద..”

“నీకు శ్రమెందుకమ్మా?వంటిల్లు ఎక్కడుందో చూపిస్తే నేనే పెట్టుకుంటాను లేదా మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ కాఫీ పెట్టి నీకు కూడా ఒక కప్పు తెచ్చిస్తాము”

“అదేంటన్నయ్యా? మీరిద్దరూ కాఫీ కలుపుకోవడమేమిటి?” అంటూ,

“కళ్యాణీ..” అంటూ కేకేసింది మాధవి.

లోపలినుండి ప్రసాద్ కోడలు కళ్యాణి బయటకి వచ్చి “ఏమి కావాలి అత్తయ్యా? మీ భోజనానికి ఇంకా సమయం ఉంది కద..” అని విసుగ్గా అనబోతూ వారితో మూడోమనిషి ఉండటంతో చూసి తడబడింది.

“బాబాయ్ గారూ బాగున్నారా? పిన్నిగారు బాగున్నారా?” అంటూ రామారావుని ముక్తసరిగా పలకరించి,

“అత్తయ్యగారూ! పిలిచారు, ఏమన్నా కావాలా?” అని అడిగింది.

“మా ముగ్గురికీ మూడు కాఫీలు తీసుకురామ్మా!” అని కోడలికి చెప్తున్న ప్రసాద్ గొంతులో ఆదేశం వినిపించింది.

ఆ అమ్మాయి మారుమాట్లాడకుండా లోపలికెళ్ళి మూడు కప్పుల్లో కాఫీ తీసుకుని వచ్చి అక్కడ పెట్టి గిరుక్కున తిరిగి తన గదిలోకెళ్ళిపోయింది.

“చూడరా! ఇదీ మా కోడలి వరుస” అని ప్రసాద్ చెప్తుండగానే మాధవి అందుకుని,

“మేము కన్నపిల్లలకే బరువయ్యాము, కోడలే కాదు కన్నకూతురు మానస కూడా ఇంతే అన్నయ్యాగారూ!” అంటూ బాధపడింది.

కాసేపటికి ప్రసాద్ కొడుకు శంకర్ గదిలోంచి బయటకొచ్చి రామారావుని పలకరించి మళ్ళీ లోపలికెళ్ళిపోయాడు.

తామేమి చెప్పినా వాళ్ళు తీసిపారెస్తారనీ, పూచికపుల్లంత గౌరవం కూడా తమకి లేదని ఇద్దరూ వాపోయారు.

అంతా సావధానంగా విన్న రామారావు, “మీ బాధ అర్థమయ్యిందమ్మా! అసలు ఈ పరిస్థితికి మూలకారణం అన్వేషిస్తే తప్ప సమస్య పరిష్కారం అవ్వదు” అన్నాడు.

జీవితం బాగుంటుందనే ఆశ తమకి లేదని ఆ దంపతులిద్దరూ కలిసికట్టుగా వాపోవడం రామారావుని కదిలించింది.

భోజనాలు అమర్చమని మాధవి కోడలిని అధికారంతో ఆజ్ఞాపించగానే ఆ అమ్మాయి మారుమాట్లాడకుండా ముగ్గురికీ వడ్డించింది.

భోజనం చేస్తున్నంతసేపూ ఏదైనా కావలసి వస్తే మాధవి, ప్రసాద్ దర్పంతో అడగడమే తప్ప అనునయం అన్నది వారి మాటల్లో రామరావుకి మచ్చుకైనా కనపడలేదు. భోజనాల దగ్గర పెద్దవారితో ఒక్కమాట కూడా మాట్లాడకుండా వారు భోజనం చెయ్యగానే కళ్యాణి తన గదిలోకి వెళ్ళిపోవడం కూడా అతడి దృష్టిపథంలోకి  వచ్చింది.

భోజనాలయ్యాకా స్నేహితులిద్దరూ గదిలోకి వెళ్ళి నడుం వాల్చారు.

“చూసావు కదరా! కోడలు నోరు తెరిచి అత్తయ్యా, మామయ్యా అంటూ మాతో ఆప్యాయంగా మాట్లాడదు. మేము ఏమి చెప్పినా కొడుకు వింటాడు కానీ, ఆ అమ్మాయినేమీ మందలించినట్టు కూడా ఉండదు. పూజ కొద్దీ పిల్లలు అంటారు కద. మేము పూజలవీ సరిగ్గా చేసినట్లు లేము. లేకపోతే ఈ వయసులో పిల్లల వల్ల ఇలా కష్టపడాలని వ్రాసిపెట్టి ఉందో!” అంటూ నిట్టూర్చాడు ప్రసాద్.

స్నేహితుడి మాటలు వింటున్న రామారావు నవ్వుతూ, “ఒరేయ్ ప్రసాదూ! కళ్యాణి అందరికీ తలలో నాలుకలా ఉంటుందని చాలాసార్లు మీరిద్దరూ నాతో చెప్పారు గుర్తుందా? ఇంతకుముందు మీ ఇంటికొచ్చినప్పుడు మీ కోడలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం, కొసరి కొసరి వడ్డించడం నాకింకా గుర్తుంది. అలాంటి పిల్ల ఈరోజు ఇలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. కానీ దాని వెనుక ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుందనిపిస్తోంది”

“ఆఁ.. అదేమీ పెద్ద చిదంబర రహస్యం కాదులేరా. అప్పట్లో కొడుకు, కోడలి దగ్గరకి మేము చుట్టపుచూపుగా వచ్చేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళమీద ఆధారపడ్డామని వీళ్ళకి చులకనయ్యామంతే” అంటూ ఠక్కున తీసిపారేసాడు ప్రసాద్.

ఇంతలో ప్రసాద్ మనవడు ధ్రువ్ స్కూలు నుండి వచ్చి బ్యాగ్ సోఫాలో విసిరేసి ట్యాబ్ చేతిలో పట్టుకుని కూర్చున్నాడు.

మాధవి వాడికి అన్నం తినిపించాలని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో, ‘ఏమి ఉద్యోగాలో ఏమిటో? పిల్లలని పెంచే తీరికలేని మనుషులు’ అని విసుక్కుంటూ వాడి చేతిలోని ట్యాబ్ లాక్కోవడంతో పిల్లాడు ఆరున్నొక రాగం ఎత్తుకున్నాడు.

వాడి ఏడుపు విన్న కళ్యాణి బయటకొచ్చి పిల్లాడికి గబగబా అన్నం తినిపించి వాడిని నిద్రపుచ్చుతూనే మీటింగ్ అటెండ్ అయ్యిందే కానీ అత్తగారిని ఒక్కమాట అనలేదు.

రామారావుకి స్నేహితుడి ఇంట్లో పరిస్థితి మీద ఒక అంచనాకి వచ్చాడు. సాయంత్రం వరకూ  ఇతర సంగతులు మాట్లాడి సెలవు తీసుకుంటూ వచ్చే శనివారం తన మనవరాలు అమేయ పుట్టినరోజుకి అందరూ కలిసి వచ్చి ఓ రెండు రోజులు తమతో గడిపి వెళ్లవలసిందిగా ఆహ్వానించి వెనుదిరిగాడు.

***

శనివారం మధ్యాహ్నం ప్రసాద్ దంపతులు, కొడుకు శంకర్, కోడలు కళ్యాణి, మనవడు ధ్రువ్‌తో కలిసి రామారావు వాళ్ళింటికి బయలుదేరారు. జీన్స్ ప్యాంట్ల మధ్యలో వెలవెలబోతున్న లంగాఓణీలా చుట్టూ వెలసిన అపార్ట్‌మెం‍ట్ల మధ్య ఉన్న ఆ ఇంటిని ప్రసాద్ సులభంగానే గుర్తుపట్టాడు.

కారు దిగి లోపల అడుగు పెట్టేసరికి హాలు నిండా దాదాపు పదిహేనుమంది పిల్లల మధ్యలో పిల్లాడిలా కలిసిపోయి ఆడుకుంటున్న స్నేహితుడిని చూసి  ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. పైగా ఆ పిల్లలు కూడా దిగువ మధ్యతరగతికి చెందినవారిలా ఉన్నారు. పుట్టినరోజు ఏర్పాట్ల ఆనవాళ్ళెక్కడా లేకపోవడం అతడికి మరింత ఆశ్చర్యం కలగజేసింది. ఇంతలో  రామారావు భార్య వైదేహి వచ్చి వారందరినీ ఆప్యాయంగా పలకరించింది.

పిల్లలని కాసేపున్నాకా రమ్మని బయటకి పంపి రామారావు తన స్నేహితుడి దగ్గరికొచ్చాడు.

“వీళ్ళు..” ప్రసాద్ ఏదో చెప్పబోయేంతలోనే రామారావు కలగజేసుకుని,

“వీళ్ళందరూ చుట్టు పక్కలున్న అపార్టుమెంట్ల వాచ్‌మెన్ల పిల్లలు. రోజూ సాయంత్రం నా దగ్గరకి ట్యూషనుకొస్తారు. సాయంత్రాలు వీళ్ళకి ఉచితంగా ట్యూషన్లు చెప్తూ వీళ్ళతో ఆడుతోంటే మనసు హాయిగా ఉంటుంది. అందుకే నేను ఈ ఇల్లు విడిచి రాను. పిల్లలే కద వీళ్ళకేమి తెలుసు అని తీసిపారేయక్కర్లేకుండా వీళ్ళనుండి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. స్మార్ట్ ఫోను వాడకం నాకు నేర్పింది ఈ బుల్లి గురువులే. ముప్పొద్దులా తిండి తింటూ అది చాలదన్నట్టు ఏమి చెయ్యాలో తోచక పిల్లల మెదళ్ళు తినే కంటే నాకో వ్యాపకం ఉంటే నయం కద!” అంటుండగా,

రామారావు కోడలు శరణ్య అందరికీ కాఫీలు, బిస్కెట్లు పట్టుకుని వచ్చి మర్యాదగా పలకరించింది. కొడుకు రవికాంత్ కూడా అప్పుడే చేతిలో కవర్లతో ఇంట్లోకి ప్రవేశిస్తూ అందరినీ పలకరించాడు. భోజనానికి కాస్త ఆలస్యమవుతుంది కాబట్టి రామారావుని కూడా రెండు బిస్కెట్లు తినమని ప్రేమగా చెప్తూ శరణ్య వంటింట్లోకెళ్ళింది.

“అత్తయ్యా! మీరు ఈ రోజు వాకింగ్ చెయ్యలేదు. వెళ్ళి మీ స్నేహితులతో కబుర్లు చెప్తూ అలా వీధి చివరివరకూ నడిచిరండి. పాయాసం నేను చేసేస్తాను” అంటూ శరణ్య తన అత్తగారు వైదేహిని బలవంతంగా బయటకి పంపించింది.

ఈ మాటలు విన్న మాధవి తన కోడలు కళ్యాణి వంక చూడటంతో కళ్యాణి విసురుగా మొహం తిప్పుకుంది.

కాసేపటికి పిల్లలు ఒక్కొక్కరే రావడం మొదలెట్టారు. రంగురంగుల పువ్వులున్న పూలతోట అక్కడ కొలువుదీరిందా అన్నట్టుగా పిల్లలు రకరకాల బట్టలేసుకుని మొహంలో ఒకరకమైన మెరుపుతో పార్టీకి వచ్చారు. ఈసారి ప్రొద్దున్న చూసిన పిల్లలతోపాటు కాస్త స్థాయి ఎక్కువ ఉన్న పిల్లలు కూడా రావడం చూసి బహూశా వాళ్ళు అమేయ స్నేహితులని మాధవి ఊహించింది.

పిల్లలు వచ్చేసారు కేక్ తీసుకురమ్మని రవికాంత్ చెప్పగానే ఇంట్లో చేసినదని స్పష్టంగా తెలుస్తున్న ఒక కేకుని శరణ్య పళ్ళెంలో పెట్టుకుని తీసుకొచ్చింది.

ఆ కేక్ చూసిన అమేయ మొహంలో ఏ మార్పూ లేకపోవడం, పైగా దాన్నే ఆనందంగా కోసి అందరికీ తలో ముక్కా ఇవ్వడం చూసి ఇదెలా సాధ్యమని అనుకోవడం కళ్యాణి, శంకర్‍ల వంతయ్యింది.

శరణ్య అత్తగారితో కలిసి పిల్లలకి  ఇంట్లో చేసిన స్వీటు, హాటుని, బయటనుండి తెచ్చిన ఐస్‍క్రీము, మంచూరియాలని గిన్నెల్లో వేసి ఇచ్చింది.

తరువాత ఆ ఇంట్లో ఉన్న నలుగు పెద్దలూ కలిసి పిల్లలందరినీ కాసేపు అష్టాచెమ్మా లాంటి పాతకాలం ఆటలు, లూడో, బిజినెస్ లాంటి అధునాతన ఆటలు అడించారు.

కొత్తవాళ్ళతో కలవడానికి సంకోచించే ధ్రువ్ ఈరోజు మాత్రం అందరితో కలిసి ఆడుకోవడం ప్రసాద్ కుటుంబానికి ఆనందం కలిగించింది.

ఓ రెండు గంటలు గడిచాకా శరణ్య చేతిలో పెద్ద సంచీతో హాల్లోకి వచ్చింది.

తాము ఊహించినదానికి భిన్నంగా జరుగుతున్న అ పుట్టినరోజు వేడుకలో ఆఖరి ఘట్టం రిటర్న్ గిఫ్ట్సే అనుకున్నారు ప్రసాద్ కుటుంబసభ్యులు.

వారి ఊహ నిజమే! కానీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్టో లేదా అంతస్తుని బట్టి ఒక్కొక్కరికీ విడివిడిగా ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్‌లా  కాకుండా ఇవి కొత్తగా ఉన్నాయి.

పిల్లల వయసుకి తగ్గ పుస్తకాలని రిటర్న్ గిఫ్టులుగా ఇచ్చారు. ఆ పుస్తకాలని తీసుకుని అలసిన మొహాలతో కొండంత ఆనందాన్ని మూటగట్టుకుని పిల్లలు ఇంటిదారి పట్టారు.

ఆరోజు రాత్రి భోజనాల దగ్గర కూడా అత్త, కోడళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండటం మాధవికి, ఆమె కోడలికీ ఆశ్చర్యాన్ని కలగజేసింది. తామొక కొత్త లోకంలోకి వచ్చినట్టు ఇంటికొచ్చిన నలుగురు అతిథులకీ అనిపించింది. ఆ అన్యోన్యతకీ, ఆనందానికీ కారణమేమిటో తెలుసుకోవాలనుకున్నారు.

మరునాడు మాధవి నిద్రలేచి వంటింట్లోకెళ్ళేసరికి వైదేహి ఒక్కతే ఉంది.

“మీరు ఈ వయసులో పొద్దున్నే లేచి పనిచేస్తోంటే శరణ్య ఇంకా లేవకపోవడమేమిటొదినా?..” మాధవి మాట పూర్తిచెయ్యక మునుపే వైదేహి అందుకుని,

“ఐదురోజులూ పొద్దున్నే లేస్తుంది కద అని నేనే ఈ రెండ్రోజులూ పడుకోమంటాను. అయినా లేచి చేసే రాచకార్యాలేముంటాయి కనుక?” అంటూ తేలిగ్గా నవ్వుతున్న  వైదేహిని ఆశ్చర్యంగా చూసింది మాధవి.

“వదినా! మన పెద్దరికం పెద్దరికం వయసులోనో, రంగు వెనక దాక్కున్న నెరిసిన జుట్టులోనో కాకుండా ప్రవర్తనలో పెద్దరికం ఉండాలని మా ఉద్దేశం. మనకి ఏవో చిన్న చిన్న అనారోగ్యాలున్నాయన్న సాకుతో అన్నీ పిల్లలే అమర్చిపెట్టాలనుకోవడం మాత్రం సరికాదు. మనల్ని వాళ్ళు చూసుకోవాలని ఎలా ఆశిస్తామో, మనకి చేతనైనంత సహాయం మనం చెయ్యాలని కూడా వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు కద? కయ్యాలమారి అయిన కోడలొస్తే మన ఖర్మ అని సరిపెట్టుకోవాలి కానీ అసలు మచ్చలేని వారెవరుంటారొదినా? మనకి నచ్చిన పండు మీద చిన్న డాగు ఉంటే దానిని వదిలేసి మిగతా పండుని తింటామా లేక మొత్తం పారెస్తామా? శరణ్య వచ్చిన కొత్తలో మా ఇంట్లో కూడా దాదాపు మీ ఇంటి పరిస్థితే. ఆలోచిస్తే నేను, మీ అన్నయ్య పిల్లలు మాకిచ్చిన పెద్దరికాన్ని దుర్వినియోగం చేస్తున్నామనిపించింది. ఇద్దరం మెల్లిగా శరణ్యకి ఇంటి పనుల్లో సాయపడటం మొదలెట్టాము. పిల్లల ఇష్టాలని గౌరవిస్తూనే వారడగినప్పుడు మంచి, చెడు సున్నితంగా తెలియజేయడం, వారి విషయాల్లో అనవసరంగా కల్పించుకోకపోవడం లాంటివి పాటించడం మొదలయ్యాకా ఇంట్లో శాంతి నెలకొంది. ఇంటికొచ్చిన కోడలితో సామరస్యంగా ఉండటానికి మనవైపు నుండి ప్రయత్నం లేకుండా కోడలు రాచి రంపాన పెడుతోందని బయటకెళ్ళి చెప్తే పోయేది మన పరువే”

చుట్టూ వెలసిన అపార్ట్‌మెంట్ల మధ్య ఉన్న ఆ ఇంటిలోని ఈ మాటలు వినగానే మాధవిని కొరడాతో కొట్టినట్టయ్యింది.

ప్రతీదానికీ కళ్యాణి మీద తాను చూపించే అధికారం, మొదట్లో సహించిన ఆ అమ్మాయి పట్టించుకోవడం మానేసాకా దెబ్బతిన్న తన అహం, కోడలు పట్టించుకోవట్లేదని ఇతరుల దగ్గర తాను వాపోవడం గుర్తొచ్చి సిగ్గనిపించింది.

***

ఇంటి పక్కన పార్కులో వాకింగ్ చేస్తున్న స్నేహితుల మధ్య కూడా ఇదే అంశం చర్చకొచ్చింది.

“ప్రసాదూ! నడక నేర్పే వరకే మనం వాళ్లచెయ్యి పట్టుకుని ఆ తరువాత వదిలేస్తాము. అలాగే పిల్లలకి ఒక కుటుంబం ఏర్పడ్డాకా వారికి స్వేచ్ఛ ఇచ్చి మనం మన ప్రయాణానికి సామాన్లు సర్దుకోవాలి”

“ప్రయాణం.. అంటే.. ఎప్పుడో వచ్చే మృత్యువు కోసం ఇప్పటినుండే సన్నద్ధమవ్వమంటావా?”

“అవునురా. ఇప్పటివరకూ మనం చేసిన ప్రయాణాలకీ, ఈ ప్రయాణానికీ మాత్రం ఒక తేడా ఉంది. దీనికోసం ఎంత లగేజీ తక్కువ ఉంచుకుంటే ప్రయాణ మార్గం అంత సుఖంగా ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ లీవింగ్ మనం ఇప్పుడు నేర్చుకోవాలి”

“ఆర్ట్ ఆఫ్ లివింగ్ విన్నాను కానీ ఈ లీవింగ్ ఏంట్రా? ఇదేమన్నా క్రొత్త కోర్సా?”

“క్రొత్తదేమీ కాదురా. ఒకప్పుడు వానప్రస్థం స్వీకరించి తామరాకు మీద నీటిబొట్టులా ఉండేవారు. ఇప్పుడున్న పరిస్థితులలో అలా కుదరదు కాబట్టి మనకున్న లగేజిని ఒక్కొక్కటిగా దించేసుకోవడమే. అనవసర విషయాల్లో తలదూర్చి మనసు పాడు చేసుకోవడం, అడగందే సలహాలివ్వకపోవడం, మనసులో ఎటువంటి కక్షలు, కార్పణ్యాలకీ చోటివ్వకపోవడం ఈ ఆర్ట్ ఆఫ్ లీవింగ్ ముఖ్యసూత్రాలు”

“పిల్లలతోనే ఉంటూ మంచిచెడ్డలు చెప్పకుండా ఎలా ఉండగలం రామూ?”

“అడిగితే చెప్పడం వేరు, ప్రతిదానికీ తగుదునమ్మా అంటూ దూరి మన అభిప్రాయాలు వెళ్ళడించడం, ఆ తరువాత వాళ్ళు మన మాట వినలేదని బాధపడటం ఎందుకురా?”

ఇది వినగానే ప్రసాద్‌కి పోయినవారం ఇంట్లో జరిగిన సంఘటన కళ్ళముందుకొచ్చింది.

మానస వాళ్ళమ్మాయికి ఆఫీసు తరపున విదేశానికెళ్ళే అవకాశం రావడంతో తల్లిదండ్రులకి సంతోషంగా ఫోను చేస్తే మనవరాలికి పెళ్ళి చెయ్యకుండా విదేశం పంపించడమేమిటని తామిద్దరం గయ్యిమనడం, మానస నొచ్చుకుని ఫోను పెట్టెయ్యడం గుర్తొచ్చాయి.

“అలా తామరాకు మీద నీటిబొట్టులా ఉంటే పిల్లలు తప్పకుండా మనల్ని చూస్తారంటావా?” అనుమానంగా అడిగాడు ప్రసాద్.

“పిల్లల మీద ఆ సందేహం వచ్చింది అంటే మన పెంపకం మీద మనకి నమ్మకం లేనట్లే. అయినా మనల్ని ప్రేమగా చూసుకోవాలనే సంకల్పం వారిలో స్వతహాగా కలగాలే తప్ప భయపెడితేనో, బ్రతిమాలితేనో జరిగే పని కాదు. అలా జరగాలంటే మనం మొదటినుండీ కూడా వారి మనసు విరిగిపోయేటట్టు ప్రవర్తించకూడదు. ఒకవేళ అలాంటి పొరపాటు మననుండి జరిగితే ఒప్పుకోవడానికి వెనకాడకుండా ఇకనుండైనా మంచిగా ఉందామని చెప్పడానికి భేషజమెందుకు? నా మాటే నెగ్గాలనుకునే మంకుపట్టు వల్ల నా అనేవాళ్ళని కోల్పోతాము”

ప్రసాదు కళ్ళకున్న మబ్బుతెరలు వీడుతున్నట్టే అనిపించాయి.

***

“అంటే.. నీకు, మీ అత్తయ్య మధ్యలో గొడవలే రావా?” ధ్రువ్‌కి బ్రష్ చేయిస్తూ శరణ్యని అడిగింది కళ్యాణి.

“మనుషులన్నాకా ఒకలా ఎలా ఉంటారు కళ్యాణీ?  గొడవలు రావా అని కదూ అడిగావు? ఇద్దరం ఒకరి మాటని ఒకరు మన్నించుకుంటాం, అలా అని ఎవరో ఒకళ్ళం ఇంకొకరికి లొంగి ఉంటామని కాదు. నిన్న పార్టీకి అత్తయ్య ఇంట్లో స్వీటు, హాటు చేద్దామంటే నేను ఒప్పుకుని ఇప్పటి పిల్లలు బయటి ఆహారాన్ని కూడా ఇష్టపడతారని చెప్పడంతో ఆవిడా ఒప్పుకున్నారు. పట్టు -విడుపు ఉండాలి” అని శరణ్య అనగానే అత్తగారి మీద కోపంతో తాను పట్టే మొండిపట్టు గుర్తొచ్చింది కళ్యాణికి.

ఆ ఆదివారం రామారావు కుటుంబంతో ఆనందంగా గడిపి శలవు తీసుకుని, తేలిక పడ్డ మనసులతో ప్రసాద్ కుటుంబసభ్యులు ఇల్లు చేరారు.

“వీలైనంతవరకూ రేపటి నుండీ అందరం కలిసి టిఫిన్ తిందామా?” అంటున్న కొడుకు, కోడలి వంక ఆశ్చర్యపోతూ చూసారు ప్రసాద్ దంపతులు.

***

“కళ్యాణీ! నువ్వు వచ్చే వారం స్నేహితులతో బయటకెళ్ళాలన్నావు కద? ధ్రువ్‌ని మేము చూసుకుంటాము. నువ్వెళ్ళేటప్పుడు మన పెరట్లో కాసిన సపోటాలని తీసుకెళ్ళడం మర్చిపోకు”

అత్తగారి మాటలు వినగానే కళ్యాణికి తాను వింటున్నది కలయో, నిజమో అర్థం కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here