అరుదైన జంతువు

0
10

[బాలబాలికల కోసం ‘అరుదైన జంతువు’ అనే కథ అందిస్తున్నారు కంచనపల్లి వెంకట కృష్ణారావు.]

[dropcap]వం[/dropcap]గీపురం రాజు గిరిధర వర్మకి వేటంటే మక్కువ. ఒక్కొక్కసారి ఆయన కొన్ని రకాల జంతువుల్ని చంపేవాడు కాదు. తన కోటలో పెద్ద జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేసి వేటలో తాను చంపని జంతువులను ప్రదర్శనకు ఉంచేవాడు.

ఒకరోజు గిరిధరవర్మకి ఓ వింత జంతువు తారస పడింది. ఆయన ఇంతకు ముందు ఎప్పుడూ అటువంటి జంతువుని చూసి ఎరగడు. అందుకనే దానిని ఆయన చంపలేదు! తన పరివారం సహాయంతో దానిని బంధిచాడు. అది ఏ జంతువో ఎవరూ చెప్పలేకపోయారు!

గిరిధర వర్మ దానిని తన ప్రదర్శనశాలలో ఉంచి తన ఆస్థాన ప్రసిద్ధ జంతుశాస్త్రజ్ఞడు ఆదిత్యను పిలిపించి ఆ జంతువుని పరిశీలించి దానిని గురించి చెప్పమన్నాడు. ఆదిత్య తన తోటి శాస్త్రజ్ఞుడైన హర్ష సహాయంతో ఆ జంతువుని పరిశీలించాడు. అయినా దానిని గురించి వారికి బోధ పడలేదు!

“మహారాజా ఈ జంతువుని మేము మొదటిసారి చూస్తున్నాము. బహుశా ఇది ఎలుగుబంటి జాతికి చెందినది అయిఉంటుంది. దీనిమీద పరిశోధన చెయ్యాలి. దీని జత ఆడ జంతువుని ఇదే జాతికి చెందిన మరికొన్ని జంతువులను వెతికి తీసుకవస్తే వీటి సంతతి వృద్ధి చెందుతుంది. అప్పుడు మరిన్ని పరిశోధనలు చెయ్యవచ్చు, అదిగాక అరుదైన జంతువులను కాపాడితే రాజ్యానికి సుభిక్షం; జంతుజాలం మధ్య సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది” అని చెప్పాడు.

“సరే ఇటువంటి జంతువుల కోసం ప్రయత్నించి ఈ అరుదైన జంతు జాతిని అభివృద్ధి చేస్తాను” అని రాజు గిరిధర వర్మ ఆదిత్యునికి అభయం ఇచ్చాడు.

రాజు గారి వద్ద సెలవు తీసుకుని ఆదిత్యుడు, హర్ష వెళ్ళిపోయారు.

అలా కొంతదూరం వెళ్ళాక ఆదిత్యుడ్ని హర్ష, “ఆదిత్యా, రాజుగారికి శాస్త్రపరంగా అన్ని విషయాలు చెప్పకుండా ఎందుకు జంతువు వలన రాజ్య సుభిక్షం జరుగుతుందని చెప్పావు?” అని అడిగాడు.

ఆదిత్యుడు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పాడు,”రాజులు చాలా విచిత్రమైనవారు. ఒక్కొక్క సారి మూర్ఖత్వంతో ఆ జంతువు పనికిరాదని జంతువును చంపివేయవచ్చు లేదా దానిని వండించి తినవచ్చు.అందుకే ముందు జాగ్రత్తగా ఆ జంతు సంతతిని పరిశోధనలకు ఉపయోగించాలని చెప్పాను. దానివలన రాజ్యం సుభిక్షంగా ఉండగలదని ఒక నమ్మకం కలిగించాను. ఇదంతా ఆ జంతువును కాపాడటానికే!” వివరించాడు ఆదిత్యుడు.

ఆదిత్యుని ముందు చూపుకు హర్ష ఆదిత్యుణ్ణి అభినందించాడు.

అందుకే ఇప్పుడు కూడా మన ప్రభుత్వాలు వేటను నిషేదించాయి, ప్రపంచ వ్యాప్తంగా అరుదైన జంతువులను కాపాడేందుకు అనేక చట్టాలు ప్రభుత్వాలు చేశాయి. పిల్లలూ మీరు కూడా కూడా కుక్కల్ని హింసిచడం, తూనీగలను పట్టుకోవడం వంటి పనులు చేయకూడదు. ప్రకృతిలో ప్రతి జీవి వలన ఏదో ఒక ఉపయోగం ఉంటుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here