అరుదైన నటవహ్ని- బలరాజ్ సహ్ని – 10 కఠ్‍ పుత్లీ

0
12

[బలరాజ్ సహ్ని నటనా వైదుష్యాన్ని విశ్లేషిస్తూ పి. జ్యోతి గారు అందిస్తున్న వ్యాస పరంపరలో భాగంగా ‘కఠ్‍పుత్లీ’ చిత్రం విశ్లేషణ.]

[dropcap]1[/dropcap]957లో వచ్చిన సినిమా ‘కఠ్‍ పుత్లీ’. తెలుగులో దీని అర్థం తోలుబొమ్మ. ఈ సినిమాకు అమియా చక్రవర్తి కథ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. దీన్ని నిర్మించి ఆయనే దర్శకత్వం వహించారు. కాని సినిమా మధ్యలో అనుకోకుండా అయన మరణించడంతో సినిమాను నితిన్ బోస్ పూర్తి చేసారు. దీనిలో ప్రధాన పాత్రలను బలరాజ్ సహ్ని, వైజయంతీమాల పోషించారు. ఇద్దరూ చక్కని ప్రతిభను ప్రదర్శించారు. వైజయంతీమాల సినీ కెరీయర్‌లో ఆమె నాట్యాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న సినిమా ఇది. తమిళనాడులోని సుభ్రహ్మణ్య స్వామి కోవెలలలో ప్రదర్శించే ‘మయిలాట్టం’ నృత్యం, అలాగే కథలను నృత్యం ద్వారా చెప్పే ‘కూథు’ అనే మరో నృత్యరూపకాన్ని ఆమె అతి గొప్పగా ఈ సినిమాలో ప్రదర్శించారు. ఇవే కాక, వీధి నాట్యం, జానపద నృత్యం, కథాకళి, భరతనాట్యం, లాంటి నృత్యరీతులను కూడా కలిపి ఆమె తెరపై ప్రదర్శించిన తీరు అద్భుతం. భారతీయ నృత్యరీతులను సినిమాలలో ఉపయోగించుకున్న విధానాన్ని స్టడీ చేయాలనుకుంటే ఎవరూ విస్మరించకూడని సినిమా ఇది.

వైజయంతిమాల గొప్ప నృత్య కళాకారిణి. ఇంతకు ముందు నృత్యాన్ని సినిమాలలో ప్రదర్శించిన నటిమణులు ఏదో ఒక నృత్యరీతిలోనే పూర్తి సినిమాలో నర్తించారు. కాని ఈ సినిమాలో వైజయంతిమాల ఒక అరడజను భిన్నమైన నృత్యరీతులని అంతే గొప్పగా నర్తించి చూపడం ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. ముఖ్యంగా నెమలి వేషధారణలో చేసే ‘మయిలాట్టం’ నృత్యాన్ని చూసినవారు జీవితంలో మర్చిపోలేదు. ఆమె నృత్య ప్రతిభను అంత అద్భుతంగానూ చూపిన చిత్రం ‘కఠ్‍పుతలీ’.

ఈ సినిమాకు కథా నేపథ్యం దర్శకులు అమియా చక్రవర్తి  అప్పటి నటి ఉషా కిరణ్‌ల మధ్య అనుబంధం అని అంటారు. తనకన్నా పదహారు సంవత్సరాలు వయసులో పెద్ద అయిన అమియా చక్రవర్తిని ఉషా కిరణ్ ప్రేమించారని, ఆ విషయం తెలిసి అమియ చక్రవర్తి భార్య ఉషా కిరణ్‌ను కలిసి వారిద్దరి మధ్య అనుబంధం ఉంటే తాను తప్పుకుని వెళ్ళిపోతానని చెప్పారని, ఆమె మాటలు విన్న ఉషా కిరణ్ ఇది తాను మరో స్త్రీ పట్ల చేస్తున్న అన్యాయమని భావించి అమియా చక్రవర్తి జీవితం నుండి తప్పుకుని మనోహర్ ఖేర్ అనే డాక్టర్‌ను వివాహం చేసుకున్నారు. ఈయన ఎమ్.బి.బిఎస్.లో గోల్డ్ మెడలిస్ట్. వీరి సంతానం తన్వీ అజ్మీ, అద్వైత్ ఖేర్. తన్వీ అజ్మీ కైఫీ అజ్మీ కుమారుడు బాబా అజ్మీ భార్య, ఆమె కూడా ప్రముఖ నటే. ఉషా కిరణ్ – దిలీప్ కుమార్, సునీల్ దత్‌ల తరువాత్ బొంబాయి నగరానికి షెరీప్‌గా కూడా తరువాతి కాలంలో పని చేశారు. ఉషా కిరణ్ కూ అమియ చక్రవర్తికీ నడుమ ఉన్న అనుబంధం గురించి తెలుసిమరీ మనోహర్ ఖేర్ ఉషా కిరణ్ ను వివాహమాడారు. ఉషా కూడా నిజానికీ  కలలకూ నడుమవున్న తేడాను గ్రహించింది. అమియ చక్రవర్తి మరణించిన తరువాత భర్త అనుమతితో ఆమె అతని శవ దర్శనానికి అమియ చక్రవర్తి ఇంట్లో అడుగుపెట్టింది. సినిమాల్లో నటించటం మానుకుంది. వివాహం తరువాత భర్త అనుమతితో అమియచక్రవర్తి సినిమా బద్నాం లో నటించింది. కానీ, ఆ సినిమా విడుదల కాలేదు.

తనకూ ఉషా కిరణ్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని తెరపై చూపే ప్రయత్నం ‘కఠ్‍పుతలీ’ చిత్రం ద్వారా చేయదల్చారు అమియా చక్రవర్తి. ఆయన మరణించడంతో సినిమాను నితిన్ బోస్ పూర్తి చేయడం వలన సినిమాలోని మూడు పాత్రలలో మధ్య కొంత సమన్వయం లోపించిందని నిశితంగా గమనిస్తే అనిపిస్తుంది. కాని వైజయంతిమాలకు బల్‌రాజ్ సహ్ని కెరియర్ లోను ఈ సినిమా ఓ మైలురాయిగా నిల్చిపోయింది.

బలరాజ్ సహ్ని పల్లెటూరి పాత్రలలో ఎంత మెప్పించారో, అంతే రాజసంతో ధనిక వర్గపు పాత్రలలోనూ కనిపిస్తారు. ఇది ఆ రోజులలోని స్టార్ యాక్టర్లలో ఒక్క దిలీప్ కుమార్ గారి వల్లే సాధ్యపడింది. తరువాత ఇరు వర్గాల పాత్రలను అంతే కన్విన్సింగ్‌గా పోషించిన వ్యక్తి ఒక్క బలరాజ్  సహ్ని మాత్రమే. దేవ్ ఆనంద్ పల్లెటూరి పాత్రలు ఎప్పుడు వేయలేదు. ఆయన్ని అభిమానులు అలాంటి పాత్రలలో చూడాలనుకోలేదు కూడా. ఇక రాజ్ కపూర్ రెండు రకాల పాత్రలు వేసినా ఆయనని ప్రజలు ఇష్టపడింది నాగరికపు అమాయక పాత్రలలోనే. పనివాడిగా, పల్లెటూరివాడిగా ఆయన చేసిన సినిమాలు ఎంత గొప్పవయినా కమర్షియల్‌గా అంత హిట్ కాలేదు. కాని దిలీప్ కుమార్ అప్పటి స్టార్ నటులలో రెండు రకాల పాత్రలను చేసి పూర్తిగా అభిమానుల ఆమోదాన్ని పొందగలిగారు. కాని వీరి సినిమాలలో ఒక్క ముస్లిం పాత్ర కనిపించదు (ముఘల్ ఏ ఆజం తప్పించి). బలరాజ్ సహ్ని మాత్రం ఒకే రకమైన గ్రేస్‌లో రెండు రకాల పాత్రలను చేయగలిగారు. పీడిత కార్మిక పాత్రల నుండి జమిందారు పాత్ర వరకు చేసి అదే స్థాయిలో మెప్పించగల అరుదైన భారతీయ నటుడు బలరాజ్ సహ్ని మాత్రమే. అయన రిక్షా కార్మికుడిగానూ చేసారు, ధనిక వ్యాపారి గానూ చేసారు. రైతు, డాక్టర్, లాయర్, కవి గానూ చేసారు. మధ్యతరగతి గుమస్తా, సాధారణ గృహస్థుడి నుండి అన్ని పాత్రలకు అనుగుణంగా తన శరీర భాషను మార్చుకున్నారు. హిందువుగా, ముస్లింగా, సిక్కు మతస్తుడిగా కాబూలిఈవాలాలా  ఆయన ఎంత కన్విన్సింగ్‌గా నటిస్తారంటే చాలా సార్లు మతాలకు, భాషా సాంప్రదయాలకు ఆయన అతీతుడేమో అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రకాల పాత్రలను పోషించిన నటులు హిందీ చిత్రపరిశ్రమలో తక్కువ.

‘కఠ్‍ పుత్లీ ’లో బలరాజ్ సహ్ని ఓ పెద్ద థియేటర్ కంపెనీ యజమాని. కళారంగాన్ని ప్రేమించే ఓ కళాకారుడు. కళను గుర్తించి కళాకారులను సానబెట్టడంలో నిపుణుడు. వ్యక్తిగత జీవితం లోని విషాదాన్ని పక్కకు నెట్టి మరీ కళారంగాన్ని అల్లుకుపోయి ఉన్న కళారాధకుడు. తన నాటకాలు, నృత్యరూపకాల ద్వారా ఎందరో కళాకారులను తయారు చేసాడు లోక్‌నాధ్‌. ఒక రోజు అతని కంపెనీకి ఓ పేదరాలు వస్తుంది. తన మిత్రుడు తోలుబొమ్మలను అద్భుతంగా ఆడిస్తాడని, అతనికి పని ఇప్పించమని అడుగుతుంది. ఈమె పేరు పుష్ప, చెత్త ఏరుకుంటూ చెల్లెలి బాగోగులు చూసుకుంటూ ఉండే అభిమానవతి. ఈమెకు శివరాజ్ అనే ఓ తోలుబొమ్మలాడించే అతను పరిచయం అవుతాడు. అతని పేద స్థితి చూసి అతనికి సహాయపడాలని ఆమె అనుకుంటుంది. లోక్‌నాధ్‌ థియేటర్ గ్రూప్‌లో అతన్ని చేర్పించాలని అనుకుంటుంది. కాని తోలుబొమ్మలాటలను చూసే వ్యక్తులు ఎవరూ ప్రస్తుతం లేరని లోక్‌నాధ్‌ మేనేజర్ ఆమెకు చెబుతాడు. దానికి పట్టు వదలని పుష్ప ఓ పక్క తోలుబొమ్మలు ఆడుతుంటే ఇటుపక్క నృత్యం చేస్తూ ఉంటే చూసేవారికి ఎంత బావుంటుందో స్వయంగా చేసి చూపిస్తుంది. లోక్‌నాధ్‌ ఇదంతా గమనిస్తూ ఉంటాడు. పుష్ప లోని ప్రతిభకు ఆకర్షితుడవుతాడు. ఆమెకు తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని ముందుకు వస్తాడు. కాని నాటకరంగం మంచిది కాదని తాను ఆ పని చేయనని బదులిస్తుంది పుష్ప. లోక్‌నాధ్‌కి ఇది బాధ కలిగిస్తుంది. ప్రతిభను గౌరవించే లోక్‌నాధ్‌ శివరాజ్‌తో పుష్ప ఒప్పుకుంటే ఇద్దరికీ తాను తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానని చెబుతాడు. శివరాజ్ పుష్పతో ఈ సంగతి చెప్పినా ఆమె ఒప్పుకోదు. పైగా థియేటర్‌లో పని చేసేవారు మంచివాళ్ళు కాదని తాను ఆ పని చేయలేనని చెబుతుంది. ఇద్దరం కలిసి వీధిలో తోలుబొమ్మలు ఆడిస్తూ పని చేద్దామని, శివరాజ్ తోలుబొమ్మలు ఆడిస్తుంటే తాను ఆడి పాడి కథలు చెపుతూ ప్రేక్షకులను అలరిస్తానని ఆమె అంటుంది. కాని అప్పుడే ఓ ప్రమాదంలో క్రింద పడిన తోలుబొమ్మలను ఏరుకునే సమయంలో శివరాజ్‌కు యాక్సిడెంట్ అవుతుంది. అతని కాలు, ఎడమ చేయి నలిగిపోతాయి. కొన్నాళ్ళు పని చేయకూడదని డాక్టర్లు చెబుతారు. పైగా హాస్పిటల్ బిల్‌కు డబ్బులు ఉండవు. తప్పని పరిస్థితుల్లో శివరాజ్‌ని రక్షించుకోవడానికి పుష్ప లోక్‌నాధ్‌ ఇంటికి వెళ్ళి తాను థియేటర్‌లో నటించడానికి ఒప్పుకుంటున్నాని చెబుతుంది.

అంతకు ముందు పుష్ప మాటలకు ఎంతో అవమానంగా భావించినా లోక్‌నాధ్‌ ఆమె వచ్చి పని చేస్తానని ఒప్పుకోవడంతో చాలా ఆనందిస్తాడు. పుష్పలోని ప్రతిభను అతను గమనిస్తాడు. దాన్ని వెలికి తీయడం తన కర్తవ్యం అనీ భావిస్తాడు. పుష్పకు థియేటర్‌లో నృత్యం చేయడానికి అవసరమైన తర్ఫీదు ఇవ్వడం మొదలెడతాడు. లోక్‌నాధ్‌ లోని గురువును పుష్ప అభిమానిస్తుంది. అతని దగ్గర పని నేర్చుకుంటున్న సమయంలోనే అతని భార్య మరణించిందని, ఉన్న కొడుకు కూడా అనారోగ్యంతో మంచంపై ఉన్నాడని, ఆ పరిస్థితులలో కూడా లోక్‌నాధ్‌ కళారంగానికి సేవ చేస్తూ తన లాంటి కళాకారులను తయారు చేస్తూ అది తన బాధ్యతగా అనుకుని జీవిస్తున్నాడని అర్థం చేసుకుంటుంది. లోక్‌నాధ్‌ కొడుకుతో ఆమె స్నేహం పెంచుకుంటుంది. అతనికి దగ్గరగా ఉంటు లోక్‌నాధ్‌లో ఒంటరితనాన్నిఆమె గమనిస్తుంది. అతని లోని కార్యదీక్షను చూసి అతన్ని గౌరవించడం మొదలెడుతుంది.

మొదటి సారి స్టేజ్ పై ప్రదర్శన ఇవ్వలేక పారిపోయే స్థితి నుంచి అద్భుతమైన కళాకారిణిగా పుష్ప పరిణితి చెందుతుంది. ఆమెకు ఎంతో పేరు ప్రతిష్ఠలతో పాటు డబ్బు రావడం మొదలవుతుంది. ఈ లోగా శివరాజ్ ఆరోగ్యం బాగుపడుతుంది. ప్లాస్టర్ తీసివేసిన తరువాత అతను జీవితాంతం అవిటివాడిగానే ఉండవలసి వస్తుందని అర్థం అవుతుంది. అలాగే ఎడమ చేయి పనికి రాకుండా పోతుంది. ఇక తాను ఎప్పటికీ బొమ్మలు ఆడించలేనని శివరాజ్ తెలుసుకుంటాడు. నిరాశపడిపోయిన అతన్ని ఒప్పించి పుష్ప అతన్ని వివాహం చేసుకుంటానని చెబుతుంది. వివాహం తరువాత ఇద్దరూ పెద్ద ఇంటికి మారతారు. పుష్ప పెద్ద స్టార్ అవుతుంది. పుష్ప మీద ఆధారపడి ఉండడం శివరాజ్‌కు ఇష్టం ఉండదు. అందుకని సొంతంగా బొమ్మలు తయారు చేసి అమ్మాలనుకుంటాడు. పాట్నాలో పని దొరకవచ్చని ఓ బొమ్మల దుకాణదారు అతనికి చెబుతాడు.

ఒక రోజు నృత్యం చేస్తున్న పుష్ప స్టేజిపై పడిపోతుంది. తన భార్యను డబ్బు సంపాదించడం కోసం లోక్‌నాధ్‌ కఠోరమైన శారీరిక శ్రమకు గురి చేస్తున్నాడని శివరాజ్ లోక్‌నాధ్‌ పై కోపాన్ని ప్రదర్శిస్తాడు. తన బిడ్డను చూపించి పుష్పను తన వశం చేసుకుంటున్నాడని ఆరోపిస్తాడు. లోక్‌నాధ్‌ మనసు గాయపడుతుంది. పుష్ప తల్లి కాబోతుందని డాక్టర్ చెబుతాడు. శివరాజ్ ఆనందంతో లోపలకు వెళతాడు. అతను చేసిన గాయం లోక్‌నాధ్‌ను తీవ్రంగా బాధిస్తుంది. థియేటర్ భాద్యతను తన మేనేజర్‌కు అప్పగించి తప్పుకుంటాడు లోక్‌నాధ్‌. ఆ పని తన వల్ల కాదని ఎవరో మూర్ఖుడు అన్న మాటలకు అలా ఇన్ని సంవత్సరాలు పోషించిన థియేటర్‌ను వదిలిపెట్టడం తప్పని అతని మిత్రుడు, మేనేజర్ చెప్పినా లోక్‌నాధ్‌కు పని చేయాలనిపించదు. ఈ లోగా అతని కొడుకు జబ్బు తిరగబెట్టడంతో మరణిస్తాడు. విషయం తెలిసి పుష్ప అతని ఇంటికి వస్తుంది. కొడుకు మరణంతో పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి వెళ్లిన లోక్‌నాధ్‌ను ఓదార్చడం ఎవరి వల్లా కాదు. అతన్ని మనుషులలోకి తీసుకురావడానికి పుష్ప చాలా ప్రయత్నిస్తుంది. మరో ఔత్సాహిక కళకారిణి నృత్యాన్ని ఏర్పాటు చేసి ఆమెను కంపెనీకి కొత్త నటిగా పరిచయం చేసే అవకాశం లోక్‌నాధ్‌కు కల్పిస్తుంది. అద్భుతమైన మరో కళాకారిణి ప్రతిభను చూసి ఆమె పట్ల తన కర్తవ్యం గుర్తించి లోక్‌నాధ్‌ మళ్ళీ మరో నృత్యరూపకాన్ని డైరెక్ట్ చేసే పనిలో పడిపోతాడు. కాని ఈ కొత్త నటి తండ్రి స్వార్థపరుడు, డబ్బుపిచ్చి ఉన్నవాడు. అతని వలన కంపెనీలో సమస్యలు మొదలవుతాయి.

బొమ్మలు చేసి వ్యాపారం ప్రారంభించాలని అనుకున్న శివరాజ్‌కు నిరాశ ఎదువుతుంది. ఈ లోగా పుష్పకు ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. తప్పని పరిస్థితులలో ఆమె మళ్ళీ థియేటర్‌లో పని మొదలెడుతుంది. తాను ఊరిలో లేనప్పుడు భార్య మళ్ళీ లోక్‌నాధ్‌తో కలిసి పని చేస్తుందని తెలిసి శివరాజ్ కోపంతో బిడ్డను తీసుకుని వెళ్లిపోతాడు. బిడ్డ కోసం అల్లాడిపోతున్న పుష్పను చూసి లోక్‌నాధ్‌ పోలీసుల సహాయంతో  శివరాజ్‌ని వెతికిస్తాడు. అతనికి బుద్ధి చెప్పి భార్యా పిల్లలను కలుపుతాడు.

కళాకారుడు ఎప్పుడూ ఒంటరివాడే. కళకు అంకితమయిన వ్యక్తులు సాధారణ వ్యక్తుల స్థాయిలో ఉండలేరు. వీరికి లోకంలోని బంధాలు, వాటి చుట్టు ఉన్న అవసరాలు, స్వార్థం లాంటివన్ని అనవసరమైన విషయాలుగా కనిపిస్తాయి. వీరు వ్యక్తులను కళ అనే దృష్టితోనే చూడడం వలన తమ చుట్టు ఉన్న వారితో నడిపే సంబంధ భాంధవ్యాలలో అతి తీవ్రత లేదా అతి దూరం ప్రదర్శిస్తూ ఉంటారు. తమ తోటివారిలోని కళను గుర్తిస్తే ఆ వ్యక్తితో ఎంత దూరమయినా ప్రయాణిస్తారు. వారితో సమాజానికి, సాధారణ వ్యక్తులకూ అర్థం కాని ఓ అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధానికి ఓ పేరు ఇవ్వడం కష్టం. అందువలనే లోకంలోని ఇతర మానవ సంబంధాల మధ్య వీళ్ళు ఎవరికీ అర్థం కాకుండా మిగిలిపోతుంటారు. ఈ కళాబంధాలే వీరికి జీవితంలో అతి ముఖ్యమైనవిగా మిగిలిపోతాయి. వీరి అస్థిత్వం కూడా ఈ బంధాల నడుమే ఉండిపోతుంది. అందుకే సామాన్యులకు వీరి అనుబంధాలన్నీ అశ్లీలంగానూ, లేదా అభ్యంతరంగానూ కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో తమ జీవితాలలో సంయమనాన్ని కాపాడుకోవడం వీరికి చాలా కష్టమవుతుంది. అందుకే వీరు తమ జీవితాలలో ఎప్పుడో ఒకప్పుడు ఒంటరివారిగానే మిగిలిపోతారు. లోక్‌నాధ్‌ పాత్రలో ఇదే ఒంటరితనాన్ని దర్శకులు చూపించే ప్రయత్నం చేసారు. తాము మలచిన నటులు కళాకారులు తమకు దూరం అయిపోవడాన్ని, లేదా వారిపై తమ అధిపత్యాన్ని, అనుబంధాన్ని వదిలించుకోవలసిన అవసరం తమ జీవితంలో రావడాన్ని వీరు జీర్ణించుకోలేరు. వీరు జీవితంలో ఎదుర్కునే భయంకరమైన శిక్ష ఇదే. కాని ఇది వారి జీవితంలో తప్పని వాస్తవం కూడా. ఈ విషాదానికి వారు ఎంతగా తమను తాము సన్నద్ధులుగా చేసుకున్నా అది వారిలోని ఓ భాగాన్ని చంపేస్తుంది.

లోక్ నాథ్ పాత్రద్వారా అమియ చక్రవర్తి తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. తనకూ, ఉషాకిరణ్  కూ నడుమ  గురి శిష్య అనుబంధం తప్ప మరో రకమైన సంబంధం లేదని ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఇది కళా ప్రపంచంలో సర్వసాధారణం. నర్గీస్ తో సహా తనమనస్సుకు దగ్గరగా వచ్చి దూరమైన వారిపట్ల తన భావనలను రాజ్ కపూర్ మేరానామ్ జోకర్‍లో ప్రదర్శించాడు. నర్గీస్ పరిచయమైన ప్రథమ క్షణాన్ని బాబీలో రిషీ కపూర్, డింపుల్ ల పరిచయ సన్నివేశంగా మలచి అమరం చేశాడు. తనకూ, గీతాదత్ కూ, వహీదా రహెమాన్ల నడుమ వున్న ఉద్వగ్నతలను కాగజ్ కే ఫూల్ లో ప్రదర్శించి, తనవైపు కథను ప్రదర్శించాడు గురుదత్. సాహిర్ లూధియాన్వీ అమృతా ప్రీతం ల ప్రేమగాథను పలుసినిమాలు ప్రదర్శించాయి. అమితాభ్, రేఖ, జయాభాదురిల ముక్కోణ గాథ  సిల్సిలా  సినిమాగా రూపొందింది. కాబట్టి అమియా చక్రవర్తి కఠ్ పుత్లి తమ సంబంధాన్ని సమర్ధిస్తూ సినిమా తీయటంలో ఆశ్చర్యంలేదు.

లోక్‌నాధ్‌ పాత్ర ద్వారా బలరాజ్ ఈ భావావేశాలన్నిటిని చూపిస్తారు. వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య నలిగిపోతూ ఉంటాడు లోక్‌నాధ్‌. పుష్పను ఓ గొప్ప కళాకారిణిగా చూసిన ప్రతి సందర్భంలో అతని కళ్ళల్లో ఒక గర్వం కనిపిస్తూ ఉంటుంది. ఇది పుష్ప పట్ల అతని పొజెసివ్‌నెస్‌గా ఇతరులకు అనిపిస్తూ ఉంటుంది. ఆమెను సాధారణ గృహిణిగా తల్లిగా అతను ఊహించుకోలేడు. కాని జీవితంలో అ స్థితి వచ్చినప్పుడు, నిస్సహయిడవుతాడు. ఒకో కళాకారిణిని తాను తీర్చిదిద్దుతూ తన సమయాన్ని, జీవితాన్ని వారి అభివృద్ధికి ఇస్తూ పోతే జీవితంలో వారందరూ ఒకొక్కరుగా వీడిపోవడం అతనికి బాధే అయినా తప్పించుకోలేని వాస్తవం. దీన్ని అర్థం చేసుకునే క్రమంలో అతనెంతో మనోవేదనకు గురి అవుతాడు. ఈ వేదనంతా బలరాజ్ సహ్ని నటనలో ప్రతి ప్రేం లోనూ కనిపిస్తుంది.

పుష్పను నాటకరంగంలో అగౌరవమయినదంటూ ఏదీ లేదని మందలించే సీన్‌లో ఆయన కళాకారుల ప్రతినిధిగా ఓ పదునైన గొంతుకగా కనిపిస్తారు. ఈ సీన్‌లో ఎందరో కళాకారులను ఆయన డిఫెండ్ చేసే పద్ధతి, అక్కడ ఆయన గొంతులో పలికే ఆత్మాభిమానం, ఆ పాత్రకు ఓ గొప్ప ఔన్నత్యాన్ని ఇస్తాయి. కళ్ళు మిరుమిట్లుగొలిపే నాట్యప్రదర్శనతో మెరిపించే వైజయంతిమాలపై ఈ సీన్‌తో పై చేయి తీసుకుంటారు బలరాజ్. బిడ్డ చనిపోయినప్పుడు షాక్‌లో అతని ముఖంలో పలికే అతి విషాదం ముందు వైజయంతిమాల నటన పేలవంగా అనిపిస్తుంది. అలాగే మరో కళాకారిణి నృత్యం చూసి మళ్ళీ తాను పనిలోకి వెళ్ళాలని గుర్తుకు తెచ్చుకునే సీన్‌లో ఆయన నటన చూసి తీరవలసిందే. సినిమా అంతా  పాశ్చాత్య వేషధారణలో అతి హుందాగా కనిపిస్తారు బలరాజ్. మొదటి సారి స్టేజిపైకి వచ్చి జనాన్ని చూసి భయపడి పారిపోతుంది పుష్ప. ఆమె బదులుగా స్టేజి పైకి వచ్చి బలరాజ్ జనంతో చేసే సంభాషణ ఒక్కటి చాలు అతని ప్రతిభ నిరూపించడానికి.

సాధారణంగా బలరాజ్ సహ్ని గొంతు పెంచకుండా మాట్లాడతారు. పూర్తి నియంత్రణతో అతి ఎమోషనల్ సీన్లను సైతం చేయడం అతని కలవాటు. కాని సహజంగా కళాకారులలో కొంత లౌడ్నెస్ తప్పకుండా ఉంటుంది. భావోద్వేగాల నియంత్రణ వారికి కొంత కష్టం. చిన్న విషయాలకే ఆవేశపడిపోవడం, చిన్న విషయాలకు అతిగా ఆనందపడడం కూడా వీరిలో సాధారణంగా కనిపించే లక్షణం. దాన్ని స్టడీ చేసిన బలరాజ్ ఈ సినిమాలో లోక్‌నాధ్‌ పాత్ర కోసం కొన్ని చోట్ల అతి ఆనందాన్ని, అతి ఆవేశాన్ని పలికిస్తారు. మేనేజర్‌తో సంభాషించేటప్పుడు అతనిలో ఓ చిన్నపిల్లవాడి మనస్తత్వం చూస్తాం. అప్పుడే ఆవేశం, అప్పుడే ఆనందం. స్టేజి పైకి పుష్పను లాక్కువస్తున్నప్పుడు అదే ఆవేశం కనిపిస్తుంది. ఆమె ఎదురు పడిన ప్రతి క్షణం అతని కళ్లల్లో ఓ పొజెసివ్‌నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇది నేను మలచిన బొమ్మ అనే విధంగా అతని శరీర భాష ఉంటుంది. పుష్ప ఇంటికి వెళ్ళి ఆమెను తనతో పని చేయమని చెప్తున్నప్పుడు తన వృత్తిలోని కష్టనష్టాలను వివరించే సీన్‌లో బలరాజ్ నటనను, డైలాగ్ డెలివరీని విన్న వారు ఆయనని ప్రేమించకుండా ఉండలేరు. ఆమెకు భాషను భావాన్ని సంగీతాన్ని వివరిస్తున్న సీన్ కూడా చాలా బావుంటుంది. ముఖ్యంగా ఈ సందర్భంలో వచ్చే ‘మంజిల్ వహీ హై ప్యార్ కీ రాహీ బదల్ గయే’ అన్న పాటని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

ఈ పాటను సుబీర్ సేన్ అనే గాయకుడు పాడారు. బెంగాలీలో మంచి పేరున్న వీరికి రబీంద్ర సంగీతంపై చాలా పట్టు ఉంది. దీనిని శైలేంద్ర రాస్తే శంకర్ జైకిషన్ సంగీతం అందించారు. సినిమా కథ తెలుసుకుంటేనే ఈ పాట పూర్తిగా అర్థం అవుతుంది.

మంజిల్ వహీ హై ప్యార్ కీ రాహీ బదల్ గయే, సప్నో కీ మెహఫిల్ మే హమ్ తుమ్ నయే

ఈ వాక్యం అర్థం చేసుకోవాలంటే సినిమా కథ తెలియాలి. లోక్‌నాధ్‌ పుష్పను నటిగా మార్చే క్రమంలో వచ్చే పాట ఇది. ‘ప్రేమ దారి ఒకటే అయినా ప్రయాణికులు మారిపోయారు. కలల పండుగలో నువ్వు నేను కొత్తవారిమి’ అనే అర్థం వస్తుంది. ఒకరి తరువాత మరొకరిని కళారంగనికి పరిచయం చేసే స్టేజీ దర్శకుడు లోక్‌నాధ్‌. అదే అతని జీవితం, అదే అతని మార్గం, కాని ఆ మర్గంలో ప్రయాణికులు మారిపోతూ ఉన్నారు. ఇప్పుడు మరో కొత్త సహచరి అతనికి ఆ మార్గంలో దొరికింది.

దునియాకీ నజరో సె దూర్ జాతే హై హమ్ తుం జహా, ఉస్ దేశ్ కీ చాందినీ గాయేగీ యే దాస్తాన్. మౌసం థా వో బహార్ కా దిల్ ఖిల్ మచల్ గయే, సపనో కీ మెహఫిల్ మే హం తుం నయే’.

‘ప్రపంచపు చూపులకు దూరంగా మనం ఏ వైపుకు ప్రయాణం చేస్తున్నామో ఆ దేశపు వెన్నెల మన కథలను గీతంగా ఆలాపిస్తుంది. వసంతం నిండిన మనసు పులకరించిపోతుంది. ఈ కలల పండుగకు మనం ఇద్దరం కొత్తవాళ్లమే’.

చుప్ నా సకే మెరె రాజ్ నగమో మే ఢల్నే లగే, రొకా థా దిల్ నే మగర్ పెహలూ బదల్నే లగే, వొ దిన్ హీ కుచ్ అజీబ్ థే జొ ఆజ్ కల్ గయే, సప్నోకీ మెహఫిల్ మే హం తుం నయే

‘నా రహస్యాలు దాగలేకపోయాయి పాట రూపంలో వచ్చేసాయి. మనసు ఆపినా మరో రూపంలో నా కోరిక బైటకి వస్తుంది. ఆ నిన్న రేపులు నా జీవితంలోని వింత రోజులు, ఈ కలల పండుగకు మనం కొత్తవాళ్లము’.

ఓ కళాకారుడు తన కళారూపాన్ని కళ్ళ ముందు చూసి తన మార్గంలో తనతో ప్రయాణించే మరో కళాప్రేమికురాలు తనతో ప్రయాణించడానికి సిద్ధంగా ఉందని సంతోషంతో పాడే పాట ఇది. కేవలం ఇరు శరీరాల మధ్య ప్రేమ కాదు. ఓ రంగంలో కలిసిన రెండు కళారూపల మధ్య జనియించే దగ్గరితనం ఈ పాటలో కనిపిస్తుంది. ఓ కళాకారుని మనసును ఇంత గొప్పగా ఆవిష్కరించే మరో పాట సినిమాలలో అరుదే. ఈ పాటలో బలరాజ్ సహ్ని అభినయం చాలా గొప్పగా ఉంటుంది. ప్రేమకు అభిమానానికి మధ్య నిలిచిన లోక్‌నాధ్‌ మనస్థితిని అతని కళ్లతో ఓ ప్రేమికురాలిపై ప్రేమగా కాకుండా తన కళా సహచరిపై ప్రేమగా ప్రకటించే విధానాన్ని నిశితంగా గమనిస్తే ఆ పాత్ర వైవిధ్యం అర్థం అవుతుంది. దీన్ని మామూలు ప్రేమ పాటలా కాక ఓ కళాకారుడి ఆత్మగీతంగా బలరాజ్  తన హావభావాలతో రూపం ఇస్తారు. ఆయన నటనా ప్రతిభకు ఈ గీతం ఓ కొలమానం. ఆ సంయమనం వైజయంతి మాలలో కనిపించదు. ఆమెను చూసిన ప్రేక్షకులు ఆమె లోక్‌నాధ్‌ని ప్రేమిస్తుందని అనుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఆమె మరొకరిని వివాహం చేసుకోవడం, మళ్ళీ లోక్‌నాధ్‌ ఇంటికి వస్తూ పోతూ ఉండడంతో ప్రేక్షకులకు ఓ కన్‌ఫ్యూజన్ అనిపిస్తూ ఉంటుంది. కళాభిమానాన్ని, ప్రేమను విడదీసి వైజయంతిమాల తన నటనలో ఎందువలనో చూపలేకపోయారు. కానీ సామాన్య ప్రేక్షకులను తప్పుదారి పట్టించి సినిమాలో మెలోడ్రామా తీవ్రతను పెంచాలంటే, ప్రేక్షకులు ఆమె బల్రాజ్ ను ప్రేమిస్తుందని భావించేట్టు  చేయాలి. అందుకేనేమో వైజయంతి నటన అపోహ కలిగించేరీతిలో వుంటుంది.  ఆమె అభినయం కన్నా నృత్యం ఈ సినిమాకు ఆమె ఇచ్చిన పెద్ద కాంట్రిబ్యూషన్. కాని బలరాజ్ సహ్ని నటన మాత్రం లోక్‌నాధ్‌ పాత్రకు జీవం పోసింది. ఈ తేడాను పరిశీలించినప్పుడు పాత్రను అర్థం చేసుకుని తెరపై ప్రెజెంట్ చేసే విధానంలో బలరాజ్ చాలా ముందున్నారని అనిపించక మానదు.

ఈ సినిమాలో ‘బోల్ రె కఠ్‌పుత్లీ’ అన్న పాట చాలా హిట్ అయింది. ఇది ఆనందంతో, విషాదంతోనూ రెండు సార్లు సినిమాలో కనిపిస్తుంది. తోలుబొమ్మలా ఇతరుల చేతిలో ఆడే బొమ్మలా పుష్ప జీవితం మారిపోవడం ఈ పాట సారాంశం. ఓ పురుషుడు గురువుగా ఆమెలోని నటిని బైటకు తీసుకువచ్చి ఆమెను కళాకారిణిగా చూడలనుకుంటే మరో పురుషుడు భర్త రూపంలో వచ్చి ఆమెను కేవలం భార్యగా, తల్లిగా మార్చాలనుకుంటాడు. వీరిద్దరి మధ్య నలిగిపోయిన స్త్రీగా ఈ గీతం ఆమెను చూపిస్త్గుంది. కాని ఆ అంతర్మథనాన్ని చూపెట్టడంలో వైజయంతిమాల కొంత వరకు ఫెయిల్ అయ్యారనిపిస్తుంది. ఇద్దరు దర్శకుల మధ్య నడిచిన సినిమా కాబట్టి ఆ పాత్రలు మలిచే తీరులో తడబాటు స్క్రీన్ ప్లే విషయంలోనూ కనిపిస్తుంది. ఏది ఏమైనా సినిమాలో పుష్ప పాత్రలో ఉండవలసిన లోతు తెరపై వైజయంతిమాల ప్రదర్శించలేకపోయారు.

కఠ్ పుత్లీ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం, సినిమా సంగీతం. అమియ చక్రవర్తి కి శంకర్ జైకిషన్ అంటే ఇష్టం. దాగ్, పతిత, సీమా వంటి అమియ చక్రవర్తి సినిమాల్లో శంకర్ జైకిషన్ అత్యద్భుతమైన సంగీతాన్ని అందించారు. శంకర్ జైకిషన్ లలో శంకర్ ఉదయ శంకర్ వద్ద నృత్యం నేర్చుకున్నాడు. అందుకే నృత్య ప్రధానమైన కఠ్‌పుత్లీ సినిమాలో అత్యంత ప్రామాణికమైన నృత్య సంగీతాన్ని అందించారు. హిందీ సినీ సంగీత రంగంలో నృత్య గీతాలకు వ్యాపార విలువను కలిగించినవారు శంకర్ జైక్శన్.  బోల్ రె కఠ్  పుత్లి పాటకు నృత్యంలో వైజయన్తీ మాల ఒక స్టెప్ సరిగా వేయలేకపోతే శంకర్ ఆమెకు నృత్యం చేసి చూపించాడు కూడా! ఈ సినిమాలో బాకడ్ బమ్ బమ్, తూహి గయా మొహె భూల్ రే వంటి పాటలు శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యాల మేలి కలయిక. బాకడ్ బమ్ బం పాట గుజరాత్ మహరాష్ట్రల్లో ప్రసిద్ధి పొందిన జానపద నృత్యశైలి పాట. ఈ సినిమాలో కమలా లక్ష్మణ్ కూడా చక్కటి నృత్య ప్రతిభను కనబరుస్తుంది.

ఈ సినిమాలో స్క్రిప్ట్ తప్పుదారి పట్టిన గందరగోళంలో కూడా ఏ ఒక్క రిమార్కు లేకుండా నడిచింది బలరాజ్ సహ్ని నటన మాత్రమే. వారి నటనను స్టడీ చేస్తూ ఈ విషయాన్ని సినీ ప్రేమికులు గమనిస్తే తప్ప ఆయన గొప్పతనం అర్థం కాదు. ఏమైనా బలరాజ్  సహ్ని నటన కోసం వైజయంతిమాల నాట్యం కోసం చూడవలసిన సినిమా ‘కఠ్‌పుతలీ’. ఈ సినిమాలో బల్‌రాజ్ నటన చూసిన పలువురు విదేశీయులు ఆయనను జేన్ ఆస్టిన్ నవలా నాయకుడని కొనియాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here